పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
ShilaLolitha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ShilaLolitha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, ఆగస్టు 2012, మంగళవారం

శిలాలోలిత॥దుఃఖపు రజను॥

లోపలిమనసులోని
పెనుకేకలు - ఎంత పెనుగులాడినా వినిపించవు.
గుండెలు పగిలిపోతున్నా
దుఃఖపురజను నుసి కనిపించదు.

నిశ్శబ్దపు సొరంగంలో
ఎంతకీ తేలని శబ్దపుతట్టు
ఒక్క కన్నీటిబిందువునూ సృష్టించదు.

అంతా మామూలే-
గబుక్కున మబ్బుదుమికినట్టు ముఖం
ఉదాసీనపు ముకుళిత కుసుమంలా మారిపోతుంది.

విచ్హుకోబొయిన రేకులు
మాటల వాడికి విలవిల్లాడతాయి.
నవ్వబోతున్న పరిమళం
ఏ సువాసనని ఇవ్వదు.

అరచేతిలో నెత్తురోడుతున్న మనసు పుష్పం=
ఎన్నిసార్లు కడిగినా,తుడిచినా కన్నీళ్ళే!

ప్రేమమట్టిని తొలుచుకుని
బతుకుమొక్కపై మొలిచిన నెత్తుటిమొగ్గ- మనసు!
కొత్తజన్మతో కన్రెప్పలు తెరిచిన కుసుమానికి
క్షణక్షణం కంటకాల సయ్యాటలే!

అదేమిటోగాని

మంచుకన్నా స్వచ్హం.స్ఫటికమైన మోహం
అనంతమైన అనురాగం
లోలోపలి మనసులో నీకై, నీకొరకై...!

*28-08-2012

25, జులై 2012, బుధవారం

శిలా లోలిత || చూపులు ||

కన్ను తడిగుండెల మడతల్ని
విప్పుతూ వుంటుంది
ఆ రెప్పలకు
బతుకుమూత మూయడమూ తెలుసు

కన్రెప్పల దారాలతో
ఒక్కొక్క గాయాన్ని కుట్టుకోవడమూ తెలుసు
అంతరంగ యుద్దాల్లో
నెత్తురోడిన జీరల్ని దాచుకోవడమూ తెలుసు

నల్లటి అశాంతుల ఆవర్తనాల్ని
శ్వేత బిందువులతో సమర్ధించడమూ తెలుసు
1
చంక్రమనాలు చేసే బతుక్కి
చూపై, స్థిరమై, నిలిచే అభివ్యక్తి .
ఎదురు చూపుల్లోంచి ,బతుకు చూపుల్లోంచి
బతుకంతా ఎదురుచూడ్డం అంటే
ఒక జీవిత సాఫల్యం చేకూరినట్లు -

అలజడుల ఊపిరుల నడుమ
కాలాన్ని కొలవడం ఒక యుద్దమే!
అశాంతి మాత్రమే చూపుల్లోంచి కరుగుతుంది ,
కాలాన్ని కదుపుతుంది
2
ఎడారుల నిశ్శబ్దం
ఎండుటాకుల పైనుంచి లేచిన చిరుశబ్దం
ఊపిరినుంచి ఎగిసిన నిట్టూర్పు-
అన్నీ చూపులే!
అన్నట్టు, లోచూపు ఇప్పుడే వెలిగింది.
అన్నీ -చిత్రాలే ఇక !!!

*25.7.2012.

12, జులై 2012, గురువారం

శిలాలోలిత || గోరటెంకడి పాట ||

వాగ్గేయకారులెలా ఉంటారు !?
చింతాకంతే వుంటారు
చిరస్మరనీయులై నిలుస్తారు


ఒక క్షేత్రయ్య, ఒక అన్నమయ్య
ఒక త్యాగయ్య, ఒక మీరా
ఇదిగో ఇక్కడ
తెలంగాణా భూమిని తొలుచుకుని గోరటి వెంకన్న!


అతడి నోటినిండా పల్లెపదాలు
పాట ఎత్తుకుంటే పల్లె మన ముంగిట నిలుస్తుంది
పదబంధాలు,ప్రతీకలు బంతిపూలై నవ్వుతాయి.
కళ్ళు ఎగిసిన అలలై మెరుస్తాయి
ఊరుతల్లి ఇంటిముంగిట ముగ్గవుతుంది
చెట్టూ చేమా , కాయాకసరూ
ఉప్పూనిప్పూ కరువూ కష్టం
చేలెంబడి ,డొంకలెంబడి తిరుక్కుంటూ పాటల్లా నడుస్తాయి


ఊరోళ్ల ఊసులు సంతలకధలు వెతలు రాములయ్య బతుకుభాగోతాలు హరిశ్చంద్రుడి కాటికాపరి దుక్కం
కన్నీరొక చుక్కుండిన చాలునన్న వేదాంతాలు ఆలుమగల్ల రాద్దంతాలు సిరిమల్లె చెట్టుకింద లచ్చుమమ్మలు
డెంకదేడ్డెం 'అంటూ లేగాదూడలైన పిల్లకాయలు కనిపించని కుట్రల్లో పల్లెకన్నీరు పెడుతుందని దృశ్యమానం
చేసే పాటల మాటల ఊటల ఆవేదనార్తుల కలబోతల ఒక అనంత ప్రవాహం ఆతడి పాట.చదువుకున్నోళ్ళ
ఉన్నోళ్ళ ,ఉన్నున్నోళ్ళ నోటెంట పలికే గిలికే రాతలే నిజమంటున్న కాలంలో -బతుకుబండిలో పల్లెనేక్కించిన
జానపద సాహిత్య రారాజు అతడు.


అతడొక ఉద్యమం ,అతడొక ప్రవాహం ,పరీవాహకం
అతడి గుండె ఒలికిన పాట పోటెత్తిన అల
'వేమన'లా ప్రతీకలని చుట్టూ చూస్తూనే
ఒడిసిపట్టుకుని విత్తనాల్లా వెదజల్లుతాడు
చరణాల నాగటిచాల్లలో ఏం పోలిక రువ్వుతాడో తెలీదు
ఎవరి గుండె పిగులుతుందో తెలీదు
అతడినోట ప్రతి పాట ఓ బతుకుగుండం ,జీవన్మరణ పోరాటం
అంతర్గత సంక్షుభిత విలయనృత్యం


తెలంగాణ కన్నమట్టిబిడ్డ,మరో బిడ్డ
కన్నతల్లి కనుకొలకులలో మెరుపై నిలిచే నెత్తుటి గుండం!

*12-07-2012