24, జులై 2012, మంగళవారం
పులిపాటి గురుస్వామి॥పాత పద్యమొకటి పలకరించాక॥
పాత పుస్తకాలు దులుపుకుంటున్నప్పుడు
నీ కోసం రాసిన పద్యం జారి
ఇంకా పరిమళించుకుంటో ...
అక్షరమక్షరము తడుముకున్నా
నిష్క్రమించని తలపుల
సమ్మోహ వాద్య తరంగాల దొంతరలు
నను మీటుకుంటో ...
ఒకసారి నాచేతులు
వణుకుని చుట్టుకొని
వొంటి నిండా ప్రాకి
ఎక్కడికి చేరుకోవాలో తెలియక
భోరుమంటో ...
రెక్కలు పొడుచుకు రాని ప్రేమ
రూపం కోల్పోయిన భయంతో
పుట్ట్టుకతో అవయవాలు ఏర్పడని ధైర్యంతో
ఉపయోగానికి ముందే శీకి పోయి
ముట్టుకుంటే ఊసిపడుతున్న కాలంలో
కుళ్ళుకుంటో ...
నిద్రని ,నిన్ను ,మధువును
రోడ్డు మీద జారుకుంటూ పోయిన రాత్రినీ
గడ గడా తాగి సొమ్మసిల్లిన
సగం మెలుకువలో
అక్కరకు రాని నీ సొగసును తిట్టుకుంటో ...
నక్కి నక్కి సాటుంగ సాటుంగ
వయసు రాని ఏడుపును
ఎంతో ఎంతో వేడుకుంటో...
అప్పటికి అక్షరాల్లోకి అనువదించలేకపోయిన
గడ్డకట్టిన ప్రేమ
ఇప్పుడు కరుగుకుంటో ...
*24.7.2012
అఫ్సర్||నిమిషాలు కొన్ని||
నిమిషాలు కొన్ని
1
నిశ్శబ్దంలోకి
నిరక్షరంలోకి
నిస్సత్తువలోకి
నిద్రారాహిత్యంలోకి.
2
నిట్టూర్పులోకి
నిస్పృహలోకి
నిశీధిలోకి
నిష్క్రమణలోకి.
3
నువ్వొచ్చి వెళ్లావు, అవునా?!
*24.7.2012
శాంతిశ్రీ॥ముందుకే..॥
ఒక అడుగు వెనక్కి
నాలుగడుగులు ముందుకేసేందుకే
అందుకే..
బిగిసిన పిడికిళ్లు తెరవొద్దు
ఆశయాలు సిద్ధించేదాకా
నినదించే గొంతులు మూగపోనివ్వొద్దు
మూసుకున్న వ్యవస్థ చెవులు తెరిచేదాకా
రగిలే ఉద్యమాలు చల్లారనివ్వొద్దు
గమ్యం చేరేదాకా
ప్ర్రజాపథం కొనసాగాల్సిందే
లక్ష్యం నెరవేరేదాకా
పట్టుదల సడలనివ్వొద్దు
విజయం సాధించేదాకా
*24.7.2012
కెక్యూబ్ వర్మ॥ఇప్పుడంతా రాలిపోవడమే॥
ఇప్పుడంతా రాలిపోవడమే
కాలమంతా...
కంటినీరింకిపోవడమే
కనులకింత ఓదార్పుకదా...
ఆకు నుండి జారిపడుతున్న
చివరి బొట్టు దోసిలిలో...
కళ్ళకద్దుకోనూ లేక
తడి ఇంకిపోతూ...
చివరిగా తిరిగిన ఆ మలుపు
వంతెన విడిపోయిన చోట...
కాసేపలా సంధ్య ఎరుపు
పూసుకుంటూ తెల్లబడ్డ వెన్నెల...
ఈ చల్లదనం
ఓ మృత్యు స్పర్శలా తాకుతూ....
వదలిన కాగిత్తప్పడవల్నిండా
ఇన్నిన్ని జ్నాపకాలు మునుగుతూ...
కాలమిక్కడ ఓ కాలమిస్టులా
పెన్సిల్తో ఆకాశంపై నలుపు చేస్తూ...
నేలపై ఇన్నిన్ని
బలి పీఠాలను నిర్మిస్తూ....
గోరీలన్నీ ఒకే పేరుతో చెక్కి
ఓ గడ్డి పూవుతో అలంకరిస్తూ...
*24.7.2012
వర్ణలేఖ
నేనక్కడే ఉన్నా
నీ నవ్వుల్లో ముత్యాలేరుతూ
నీవు రావని
నిదుర అలకపూనెను
ఊహల్లో జీవిస్తున్నా
జీవితంలో నటిస్తూ నేనే
నీవు అందకపోతే
అందని ద్రాక్ష అనుకోలేను
నీ జ్ఞాపకాల తోటలో
పూలున్నయి ముళ్ళున్నాయి
*24.7.2012
Nauduri Murthy||Thanksgiving||
We eulogize our parents, kneel before teachers,
Pay obeisance to idols, and praise every benefactor…
Write poetry on our love, lyrics to our heart-throb,
Elegies in the heartache, play Endymion for a Selene,
And make rainbows out of our pale inane existence.
But when it comes to thanksgiving, some never figure out on the list,
And of those, we are prudent, tongue-tied, or grossly inadequate.
***
Connate with this corpus from conception
Oh my senses and sensors! You have made me what I am.
But for you I would never have travelled the distances I had,
Nor perceived and indulged in this spectacular world, oh, me!
It grieves to leave, yet a new stint is equally tempting.
And before I am dragged out of this house reluctantly
And watch dumbly, you being impaled and consigned
Let me thank you with all my heart, dear senses and dear limbs!
And as a tribute to you dear frame, I shall leave behind the name!
*24.7.2012
దేశరాజు॥*కటీపతంగ్*॥
Rajesh ఈవజ్రోత్సవపు చలి దినాన
వస్త్రాలతో కప్పుకోలేకే,
మరో శరీరాన్ని కోరామంటావా?
దాహార్తి తీర్చేది కేవలం దేహమేనా?
ఏం కావాలో చెప్పారు కానీ...
ఎందుకు కావాలో ఎవరెైనా చెప్పారా?
కోరా కాగజ్ థా ఏ మన్ మేరా...
తొందరపడి ఎవరి పేరెైనా లిఖిస్తే ప్రమాదమేనా?
కావాలని కోరితే తల్లిదేం ఖర్మ
మన గుండెకాయనే ఒలిచి అరిటాకులో పెట్టి
మోసలి కన్నీళ్ళ ముందు మోకరిల్లేవాళ్ళం కాదా?
సప్నోంకీ రాణీ ఆయేగీ...నహీ, నీకొక్కడికే కాదు-
అందరికీ ఏదో ఒక రూపంలో...
ఎప్పుడో ఒకప్పుడు ఎదురవ్వక తప్పదు
జిందగీ ఏ సఫర్... అంటే ప్రయాణమా? సఫరింగా?
రూప్ తేరా మస్తానా... తప్పంతా మనదే...
దేహమే దేవాలయమని భ్రమసి, తేనెలో చీమలా..?
భూలు కొరుూ హమ్ సేనా హోజాయే...
జరుగుతుందని కాదు,
ఏదో జరిగిపోయిందనే మా బాధంతా!
గాలి పటం తెగినా, ఎగురుతున్నంత సేపూ అందమే
టైమ్ అప్ అని, మాకూ తెలుసు
కానీ, పేకప్ నాట్ నౌ!!
*24.7.2012
కట్టా శ్రీనివాస్॥మేనియా॥
జ్వరం రావడం.
పిచ్చిపట్టడం లాగా.
కవిత్వ అబ్బటం కూడా...
ఓ ప్రమాదమే
నీకో...
పాఠకుడికో...
*24-07-2012
ఒక మాట
=> కవితలపై అభిప్రాయాలు, సూచనలు రాయండి. కవిత్వాన్ని ఇంకా మెరుగుపరుచుకోవడానికి కావాల్సిన వనరుల గురించి రాయండి.ఎందుకు బాగుందో, ఎందుకు బాగోలేదో చర్చించండి.!
=> కవిత్వం గొప్పగా వస్తోంది. అపుడపుడూ ఒక్కో కవితను చదివాక, అబ్బురం కలుగుతోంది.కవికి ఆ ప్రశంసను తెలపండి.!
=> కవిత్వంతోపాటూ కవిత్వవిమర్శకు కూడా 'కవి సంగమాన్ని' వేదికగా మలుద్దాం. ఈ వేదికకు ఒక ఉన్నత సాహిత్యవిలువను అలదుదాం!
వొరప్రసాద్||భూమి మనుషులు||
సూర్యుడు ఉదయపు వెలుగై
రోజూలానే మేల్కోలుపుతాడనుకున్నారు
కులం కుట్రగా మారి
తెల్లవారు జామునే కాటేస్తుందని ఊహించలేదు
లక్ష్మింపేట దళితపేట ఒక్కసారిగా
దుఃఖ సముద్రం అయ్యింది
ఉత్తరాంధ్రంటే అమాయకపు యాసతో
మాట్లాడే వెనుకబాటు తనమే అనుకున్నాం
కులం బలమై బరితెగించి
దాడవుతుందనుకోలేదు
- - -
నేలను గుప్పిట బిగించి
పెత్తనమై వాడు కులహంకారమయ్యాడు
విచక్షణ కోల్పోయి
అమానుషత్వంగా మారి
దళితపేటను వేటాడాడు
గొంతు నులిమాడు
కాళ్ళు విరిచాడు
బల్లెం పోటయ్యాడు
గొడ్డలి వేటయ్యాడు
తల్లి ముందు కొడుకును
భార్య ముందు భర్తను
శరీరమంతా కులాయుధంగా మార్చుకుని
మరీ హతమార్చాడు
లక్షింపేట ఇప్పుడు లక్ష్మింపేట కాదు
భూమిని హత్తుకున్నందుకు
దళితులను బలిచ్చిన నేలయ్యింది
శ్రీకాకుళం నుదుటిన
ఆరని రక్తపు మరకయ్యంది
భయోత్పాతపు దృశ్యాలను చూసిన
లక్ష్మింపేట దళిత నేత్రాలు
రెప్పవేయడానికి భయపడుతున్నాయి
- - -
పంచనామాల లాంఛనాలు
పశ్చాత్తాపాలు కాదు ఇప్పుడు చేయాల్సింది
రక్తతర్పణానికి కారణమయిన ఆ నేల చెక్కతోనే
వాళ్ళను ప్రాథేయపడాలి
కనీసం వాళ్ళను భూమి మనుషులను చేస్తేనే
కొన్నాళ్ళకు వాళ్ళు మనుషులను నమ్ముతారు!
*23.7.2012
ఆర్. ఆర్. కే. మూర్తి॥" జీవితం "॥
సాగుతూనే ఉంది జీవితం
జవరాలి మోహం లా..
కంపలూ కంచెలూ..
వెనక్కి తరుముతూ..
మనొహర ద్రుశ్యాలు
మనోఫలకం పై చిత్రిస్తూ
సాగుతూనే ఉంది జీవితం
ఒక్కోసారి మెల్లిగా
ఇంకోసారి వేగంగా
ఒక్కోసారి ఆగే తీరిక లేక
ఇంకో సారి సాగ ఓపిక లేక
సాగుతూనే ఉంది జీవితం
గబ గబా దబ దబా
కుదిరీ కుదరని శ్రుతిలయల్లా
పొసిగీ పొసగని యతి ప్రాసల్లా
చర చరా బర బరా..
సాగుతూనే ఉంది జీవితం
అణగారుతున్న అంత:చేతనంలా
నవీన నాగరికతలా
అడుగంటుతున్న నీళ్ళలో చేప పిల్లలా
సాగిపోతూనే ఉంది జీవితం..
*23/07/2012
జిలుకర శ్రీనివాస్॥నువ్వు॥
తొలిసారి నిన్ను చూడాలంటే భయమేసింది
రోడ్డు దాటుతున్న నల్ల పావురాన్ని తెగబలిసిన నాలుగు గిర్రలు గుద్దేసి
నెత్తురు చిమ్మి విలవిల్లాడుతున్నప్పుడు
గుండె చెదిరిన తల్లి రెండు సముద్రాలను చేతుల్లో పట్టుకొని వణికిపోయినట్టు
నిన్ను చూడాలంటే నిజంగా తొలిసారి భయం పుట్టింది
మనసుకు నీడ లేదు
ఒంటికి సేద లేదు
గాలిలో చల్ల దనమే లేదు
నీ మాటల సవ్వడి లేక్ రాత్రికి కాళ్ళు చచ్చువడ్డాయి
మరోసారి నీ నీడ సోకని ఈ వెలుగు తెరలన్నీ నలుపెక్కాయి
తెల్లారిందో లేదో రైలు పట్టాల మీద నా ప్రాణం చితికిపోవాలని పరుగెత్తింది
చివరిసారి నీతో మాట్లాడాలనే ఆశ
ఊటలా పొంగే దుక్కం తప్ప నీ కేమీ చెప్పాలని లేదు
నిన్ను వీడిపోతున్నాననే దిగులు తప్ప చావంటే అసలు భయం లేదు
నీ ప్రేమ నది నాలో పారాలనే ఆశయం తప్ప వేదించాలనే రోగం లేదు
ఎంత ఒడుపుగా నన్ను మరణ మంచం దించావు
అంతులేని వలపుతో వేయి గిర్రలను తప్పించావు
మళ్ళీ ఒకసారి నిన్ను చేరాలంటే సత్తువ ఇంకిపోయింది
నువ్వు తప్ప మరో లోకం లేదని
నీ కదలికల చిత్రాలు తప్ప నా మనో తెరమీద వేరే ఏవీ కనిపించవని
నా సమస్త జీవనాడులు నీ నవ్వుతో తప్ప మరేదానితోనూ ఉద్దీపించవని
ఎన్నిసార్లు చెప్పాను ఎన్ని నదులను నీ కాలి మడిమల మీద ప్రవహించాను
అదే నవ్వుతో అదే మాట చెప్తే నా చుక్కల ముగ్గులేసుకున్న ఆకాశం చిద్రమైపోదు
నీ తర్క తంత్రులతో పాత పాటే మీటుతావేమోనని కొత్తగా భయమేసింది
అనంత కరుణా రసధునిలా
కడలి ఒడిలో శాంతంగా నిలబడి నవ్వే తెర చాపలా
నీ కనుల భాషతో కొత్త వ్యాకరణం రాసి
నా వేదననంతా ఒక్క శబ్దంతో తుడిచేశావు
ఇప్పుడు రోజూ రైలు పట్టాలు నన్ను చూసి నవ్వుతూ సాగిపోతున్నాయి
*23.7.2012
కిరణ్ గాలి॥పాంచాలి పంచభర్తౄక॥
లవ్ @ ఫస్ట్ సైట్
ఇల్లాజికల్,ఇమ్మేచూర్ అన్డ్
infatuation అంటారు
instant ప్రేమలు
కాంస్టాంట్ కావనీ అంటారు
లోకం సంగతి తెలియదు కాని
నా వరకు నేను
నిన్ను తొలి చూపులోనె ప్రేమించాను
అదీ నిజాయితీగా...
తొలి పరిచయమ్ లో
నీ పెదాలు కదల లేదు
నాకు మాట పెగల్లేదు
నిరుద్యోగం నాకు మరణ దండన
విధించినట్టనిపించింది
నా కాల్ల మీద నిలబడె వరకు
మళ్ళి నీ కంట బడలేదు నేను
.....
మొదటి సారి
మనం కలిసి బయటకి వెల్లిన రోజు
కొన్ని వందల దిష్టి కళ్ళు ...
నా తనువుకు
నీ స్పర్శ తెలిసినప్పుడు...
నరనరాల్లో ప్రవహించిన విజయగర్వం
అది మొదలు
నేను నిన్ను
ఎంత గాఢంగ ప్రేమించానంటే
నువ్వు లేని నిమిశాన
నన్ను నేను బహిశ్కరించెంతగా
నువు నాలొ ఎంత మమేకం అయ్యావంటే
నిద్దర్లొ కుడా నీ ఉనికిని తడుముకునేంతగ
మెలకువలో స్వప్నం లా
పిలవకున్నా పలకరించినట్టుగా
నీ మాటలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేవి
నీ మౌనం నా ఊపిరి తీసేది
నీ ప్రేమలొ పడ్డ నాకు
ఆకలిని అలసటనే కాదు
కాలాన్ని, దూరాన్ని
శొకాన్ని, శూన్యాన్ని చివరకు లొకాన్నే
జయించగలనన్న ధిమా వచ్చేది
కాని ఆ రోజు నాకింకా గుర్తు....
వంద మైల్ల వేగంతొ
నువ్వు, నేను, నా బైకు వెల్తున్నప్పుడు
నీ పెదాల చల్లదనం
నా చెంపలను గిలిగింతలు పెడుతున్నప్పుడు
మైమర్చి నేను ఒక్క క్షణం...
ఒకే ఒక్క క్షణం...
పట్టుతప్పినప్పుడు..
లోకం చీకటయ్యింది
జీవితం అవిటిదయ్యింది
........
నీ గాయాలు
మానకముందే
నా జ్ఞాపకాలు చెరిపేసుకున్నావు
నీ మనసు మార్చేసు కున్నావు
బహుశ ఇప్పుడంతా కొత్త పరిచయాలు
కొత్త కేరింతలు...
ఇప్పుడు నీలా ఎవరు నవ్వినా
నాకు సమ్మెట పోటులా వుంది
...
పాంచాలి పంచ భర్తౄక***
ఏమే ఏమేమే నీ ఉన్నత్త వికటాట్టహాసము
ఎంత మరువయత్నించినను మరపునకు రాక
హ్రుదయ శరిరాయ మానములైన
నీ రింగుటోనులే..
నా కర్ణపటములు వ్రయ్యలు చేయుచున్నవే
(మోబైల్ ఫొన్ మత్తులో వున్న యువతను చుసి...మోబైల్ని అమ్మయిగా ఊహించి రాసిన కవిత )
(***ప్రభుత్వమ్, టెలికామ్, సర్విస్ ప్రొవైడెర్, హార్డువేరు, సాఫ్టువేరు మానుఫాక్చురర్స్)
*23.7.2012
శాంతిశ్రీ॥యథార్థమే వాస్తవం!॥
తొండ ముదిరిన ఊసరివెల్లి
సామ్రాజ్యవాద ప్రపంచీకరణ రూపం
అవినీతిలో అనేక అభినయాలు నేర్చి
వినూత్న పోకడలు పోతుంది
చెట్టు తన కొమ్మలన్నింటినీ
విస్తారంగా విప్పార్చింది
అంతటా తానేనన్న అహకారం
అణువుణువునా అలుముకుంది
మెరుపులు మెరుస్తూ ఉరుములతో
గాలిదుమారం రానే వచ్చింది
పేకమేడలన్నీ కూలిపోతుంటే
కలలన్నీ చెదిరిపోతున్నాయి
సంక్షోభాల సుడిగాలి సుడుల్లో
వాల్‌స్ట్రీట్ అంతా బీభత్సం
'కాపిటల్! కాపిటల్!' అంటూ
కలవరింతలు.. పలవరింతలు
ఒకింత ఆలస్యమైనా యథార్థమే
వాస్తవమని నిరూపితమవుతోంది!
*23.7.2012
మెర్సీ మార్గరెట్॥ చెదిరిన కల॥
చెదిరిపోయిన కలట
కళ్ళలోంచి రంగులన్ని కలిసిపోయి
కన్నీళ్ళుగా కారుతుంటే
చెంపలపై నుంచి రంగుల వరద
నా కళ్ళ నుంచి కురుస్తున్న రంగుల వర్షం
ఒక్క సారి తను నాకు గుర్తురాగానే
హృదయం వేడిని కక్కి జ్ఞాపకాన్ని కరిగించి
ఎక్కడో గుండె అడుగున ఒక మూలన
నోరు చేతులు కట్టేసి బందీ చేస్తే
ఎవరు సహాయం చేసారో దానికి
త్సునామిలా నా గుండెలో
కల్లొలం రేపుతూ
ఇంకో గంటలో నిద్ర ఇక తన కౌగిలి
విడిచి వెల్లిపోయె సమయంలో
నన్ను నిద్రకి శత్రువుని చేయడానికి
ఎంత పన్నాగం పన్నిందో
నీ జ్ఞాపకం
నా ఒంటరి తప్పస్సు భంగం చేయడానికి
నా మనసుని బంధ విముక్తి చేయడానికి
కలలన్నీ కరిగిస్తూ
కోరికలన్నీ నరికేస్తూ
నన్ను నన్నుగా మిగల్చకుండా
జీవితంలోని రంగులన్ని ఏదెదో తెలుసుకొకుండా
నా శత్రువై
*23.7.2012
పెరుగు సుజనారామం||ఆకాశంలో సగం..||
పంచి ఇవ్వడమే
పరమావధిగా జీవించేది ఆమే..
ఎంగిలిచేసి ,రుచి చూసి
రాముడి ఆకలి తీర్చిన శబరి
భిక్షాటన చేసి
బిడ్డల ఆకలి తీర్చిన కుంతి
అప్పటికీ
ఇప్పటికీ
కాలమేదైనా
ప్రేమేనుపంచే అమృత ధార ఆమే
కడుపు తీపి కోసం
కన్నవారికోసం
బంధాల కోసం బందీ అయి
చివరి పంక్తిలో
ఆఖరి విస్తరిగా మిగిలే సహన రూపం ఆమే
మానాన్ని గాయాల చెట్టు చేసినా
దేహాన్ని తాకట్టు పెట్టినా
గర్భ సంచీ అద్దెకిచ్చినా
ఎక్కడో..
ఎవర్నో..
వుద్దరించేందుకు త్యాగ ఫలమయ్యేది ఆమే
పగలు నిప్పులు కక్కే సూర్యుణ్ణి
రాత్రి వెన్నెల చిందే చంద్రుణ్ణి
సమంగా భరించే ఆకాశంలో సగం ఆమే
సాధికారత వున్నా ,లేకున్నా
కొత్త చట్టా లిచ్చే శాతం ఎంతైనా
నూటికి నూరు శాతం
పంచి ఇవ్వడమే
పరమావధిగా జీవించేది మాత్రం ఆమే..!
*23.7.2012
జగతి జగద్ధాత్రి॥పయనం ...॥
ఆ సాయంత్రం
గుబులు నీడలు గుండెను కమ్మిన
ఆ సాయంత్రం
ఆశలన్నీ ఉడిగి నిస్త్రాణమైన ప్రాణంతో
పడని అడుగులను ఈడ్చుకుంటూ ...
ఆ వేసవి సాయంత్రం నీటి చుక్క కరువై
కన్నీరు కూడా చిందలేని ఆర్చుకుపోయిన కళ్ళతో
చెలిమి చెలమలింకిపోయిన ఆ సాయంత్రం
అసహాయంగా ఆకాశం వైపు చూస్తూన్న రైతులా
వర్షాధారిత పంటల కోసం వాన కోసం ఎదురు చూస్తూ
జీవితపు కోర్కేలన్నిటికీ తాళం పెట్టి ....
జీవికకోసం వెదికి వెదికి వేసారి
ఉసూరంటూ ఎడ్వలేని బ్రతుకిక ఈడ్వలేనని
రుజువైపోయిన ఆ సాయంత్రం
గమ్యం లేని నడకతో బతుకు మీది కసితో
అడవుల వైపు అడుగులేసిన ఆ సాయంత్రం
ఆ చీకట్లలో దారీ తెన్నూ లేక నడక సాగిస్తూనే
అర్ధం లేని అర్ధం కాని గుండె ధైర్యమేదో అవహించినట్టు
అవగతం కాని మొండి తనమేదో
కాలం పై కసి తీర్చుకోమన్నట్టు ఆ సాయంత్రం
అలా మొదలైంది నా నడక
గమ్యం అందక పోయినా కనీసం నడిచిన దారిని
ఆస్వాదించే వైపుగా నా పాదాలు ఆ సాయంత్రం
ఇన్నేళ్ళకి ఒక స్వతంత్ర నిర్ణయం
తీసుకున్న ఆ సాయంత్రం ....
నిర్భీతిగా , నిశ్చలంగా ,సంధ్య కెంజాయలో కలిసి
నీరవ నిశీధిలోనికి
ఒక వెలుగు రేఖ కోసం పయనించిన ఆ సాయంత్రం ...!!!
*23.7.2012
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)