పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Usharaani Kandalla లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Usharaani Kandalla లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, ఆగస్టు 2012, ఆదివారం

ఉషారాణి కందాళ ॥ కాలం ॥


విషాదం మనిషిని లొంగదీసుకుంటుంది!
దు:ఖం గుండెల్లో కొండలా నిలబడుతుంది!
కన్నీళ్ళు అరచేతులకు లొంగవు!
నిట్టూర్పులు ఆరని సెగలవుతాయి!
ఆకలి, నిద్ర, నవ్వు మరిచిన వేళ
అలవిమాలిన నిదానంతో సాగుతుంది కాలం!
అస్సలు నడవదు, గడవదు! ఒట్టి మొండిదనిపిస్తుంది!
ఎప్పుడూ ఎదలో గూడు కట్టుకున్న విచారమే!
జారినవన్నీ జ్ఞాపకాలుగా ముసురుతుంటాయ్!
చెదిరిన బాంధవ్యాలు స్మృతులై అల్లుకుంటాయ్!
ఆశలు నిరాశ ముసుగేసుకుంటాయ్!
కోరికలు పెదవివిరుపులో ఒదిగిపోతాయ్!
ఎప్పుడూ తడి కళ్ళే దిగులును మోసే కావళ్ళై!
ఎప్పుడూ ఎండిన బీడంటి ఒంటరి భావమే!
నాకెవరున్నారు? నాకేమి మిగిలింది? నేనెందుకింక?
వేదన, వేదన ఒకటే వేదన! వెంటపడుతోంటుంది!
అన్నీ చూస్తూ కాలం అంతకన్న భారంగా కదులుతూంటుంది!
కానీ ఎంత గడసరి దొంగ అంటే మనతో, మన ప్రక్కనే,
నిత్యం ఉంటూ మనం కనిపెట్టలేని, కనబడని వేగం తో పరుగు పెడుతుంది!
జత సంధ్యల కోలాటం తో మనలను నిశ్శబ్దంగా నడిపిస్తూ,
మన కష్టాన్ని కప్పెట్టేస్తుంది!దు:ఖాన్ని మరిపిస్తుంది!
అందుకే నేస్తం! మనోవ్యధలకు కాలాన్ని మించిన మందు లేదంటారు!

*18-08-2012

17, ఆగస్టు 2012, శుక్రవారం

కవిత్వపు పండుగ గురించి - ఉషారాణి కందాళ


నిన్నటి కవిత్వపు పండుగ గురించి.....
ఏ సగమూ సంపూర్ణం కాదు! నేను ఎక్కువసేపు ఉండలేకపోయాను. అందుకు కించిత్తు బాధ! అసలు రాగలనో లేదో అనుకున్నాను కానీ వచ్చాను, కొంత సమయం గడపగలిగాను, అందుకు చాలా సంతోషం అనిపించింది. ఎవరైన, ఎక్కడైన కష్ట పడి పనిచేస్తున్నపుడు గౌరవించలేకపోతే, అది కు సంస్కారం అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ కార్యక్రమం కోసం కవి యాకూబ్ గారు చాలా శ్రమించారు. నిన్న నాకు కనిపించింది వారి శ్రమ అంద
ుకున్న సత్ఫలితం. వారి తో పాటూ మరి కొందరు నిన్న కష్టపడ్డారు. నిన్నటి విజాయనికి కారకులైన ప్రతి ఒక్కరికీ అభినందనలు. ముఖ్యంగా వచ్చిన వారికి! ఒక సభకు, సమావేశానికి నిండుదనం ఆహుతులే కదా? ఆ నిండుదనం కార్యక్రమాన్ని మరింత విజయవంతం చెసింది. అందరూ అశించినట్టు
కవిత్వం కావాలి కవిత్వం!
అది అక్షరసంకలనం లా కాక భావ సంద్రం లా ఉరకాలి.
మరి ఒక్కసారి,
శుభాభినందనలతో!

14, ఆగస్టు 2012, మంగళవారం

ఉషారాణి కందాళ ॥ నిద్రలో నా నగరం ॥

నల్లటి, చల్లటి రాత్రి దుప్పటి కప్పుకున్న
నగరం నిద్రపోతుంది అనుకుంటే పొరపాటే!
అప్పుడే లేస్తాయి అనేకానేక గమ్మత్తులు!
పెద్ద పెద్ద కంపెనీ లో కంప్యూటర్ల ముందు
ఎందరో మేలుకుని చాకిరీ చేస్తుంటారు!
నైట్ షిఫ్ట్ డ్యూటీలలో ఫ్యాక్టరీలేబర్లు,
ఆన్ డ్యూటీ లో ఉండే డాక్టర్స్, నర్సులు,
కూలీ కోసం నిద్రను రూపాయలక్రింద తొక్కిపెట్టే గుంపు
కనబడే రోడ్ల పనులు, నిర్మాణాలు,తారు మిషన్లు.
కల్లు కాంపవుండ్ల లో వినబడే కూనిరాగాలు,
బార్లలో సందండించే డాన్సులు, కేరింతలు..
ఉన్నవాళ్ళ పార్టీలు, ఉడుకు వయసు కోలాటాలు,
నిద్రపట్టని వృద్ధ్హుల గదుల్లో టి వి రొదలు,
పగలంతా తీరిక దొరకని ఆలూమగల చర్చలు,
చదువు బరువు క్రింద నలుగుతూ పుస్తకాలు
నమిలేసే కెరీర్ వోరియెంటెడ్ స్టూడెంట్ల కుస్తీలు,
ప్రేమ దోమ కుట్టి మనసుకు డెంగ్యూ జబ్బొచ్చి
ములుగుతున్న పడుచు కబుర్లు మోసే సెల్లుల సెగలు,
బ్రతుకు తెరువుకు వేరే దారిలేక బురద
పన్నీరు చల్లుకుని నవ్వులద్దుకున్న మోహాలమొహాలు,
చాలా చాలా కలగలిసి కరిగే రాత్రులలో
నల్లటి, చల్లటి రాత్రి దుప్పటి కప్పుకున్న
నగరం నిద్రపోతుంది అనుకుంటే పొరపాటే!

*13-08-2012

4, ఆగస్టు 2012, శనివారం

ఉషారాణి కందాళ ॥నేనొస్తున్నా॥

నిత్యప్రభాతం నేనుగా! నీరవ నిశీధి చీల్చుకుని
నేనొస్తున్నా రేపు ను గా! నేనొస్తున్నా ఊపిరిగా!
ఆర్ద్ర్ర నయనాల నీలినీడలో హాసరేఖనే నేనుగా!
నేనొస్తున్న మృత్యువులో! నేనొస్తున్నా జన్మలలో!

హృదయకుహరాన ఊర్పులలో ఓదార్పు పలుకుల పల్లవితో
నేనొస్తున్నా వేదనలో! నేనొస్తున్నా రోదనలో!

ఒంటరి బ్రతుకుల పోరాటంలో సమస్తసైన్యం నేనుగా
నేనొస్తున్నా ఆయుధమై! నేనొస్తున్నా ఆలంబననై!
చిమ్మచీకటి నిండిన వేళల పున్నమి రేకుల వెన్నెలలో
నేనొస్తున్నా ప్రేమలలో! నేనొస్తున్నా నైరాశ్యంలో!
ఊహ ఊహకూ జీవం అద్దే భావసంద్రపు అలల కదలికై
నేనొస్తున్నా కవుల కలాలకు! నేనొస్తున్న కళల కలలకు!

చెమ్మగిల్లిన చింతల వంతల పొగిలే జీవన ఛిద్ర్రచిత్తాలకు
నేనొస్తున్నా అన్నీ వేళలా! నేనొస్తున్నా అమ్మ జోలనై!
మానవ హృదయాకాశం లో రవిశశి సాక్షిగ వెలిగే ఆశ గా
నేనొస్తున్నా! నేనే నేస్తం! మీలో వెలిగే అఖండదీపం!!

నారాకకు గుండెను పరచు! నే తోడుగ నువ్వే నడచు!
శ్వాస శ్వాసలో నన్నాశించు!ఆశే బాసట గా జీవించు!
*4.8.2012

31, జులై 2012, మంగళవారం

ఉషారాణి కందాళ కవిత

ప్రతి స్త్రీ జీవిత చిత్రం నిత్యనూతన చిత్రార్ణవమే!
ప్రతి స్త్ర్రీ హృదయం నిరంతర స్వప్నావశిష్టమే!
మనసు నిండా రంగవల్లులై అల్లుకునే కళకళల కలలు!
ఎప్పటికప్పుడు కళ్ళల్లో కొంగ్రొత్త ఇంద్ర ధనస్సులు!
ఏ దశకాదశ ఆకృతి మారుతూ సాకారించే ఊహలు!
పాపాయి కల్లల్లో పువ్వులు మాట్లాడతాయి, మబ్బులు గంతులేస్తాయి!
అమ్మాయి కళ్ళల్లో హరివిల్లులు విరబూస్తాయి, వెన్నెల పక్కలు పరచుకుంటాయి!
అమ్మ కలల్లో పిల్లలు ఎదిగెదిగి గొప్పవాళ్ళైతారు, గంపెడు గోల్డ్ మెడల్స్ వాళ్ళవే!
అమ్మమ్మ కళ్ళల్లో నిన్నలమొన్నల గతాన్ని గుర్తుచేస్తూ తడారని మెరుపులధారలు!
అసలింతంటి అంకిత భావం మగువకు ఎలా సమర్పించుకున్నడా దేవుడు?
స్వతహాగా తాను మగవాడై వుండీ తన జాతి కన్న మిన్నగా స్త్రీ నెలా మలచాడు?
ఎందుకంటే శక్తిస్వరూపం అమ్మేనని సర్వజగద్రక్షకుడు నమ్మాడు కాబట్టి!
జన్మనిచ్చే అమ్మ సాక్షత్తూ బ్రహ్మ, కంటిపాపలా కాచే అమ్మ శ్రీరామ రక్ష,
శిక్షణ వేళల్లో తానే గురుశక్తి ,తప్పులు దిద్దే తల్లి శివదండం!
లాలిపాటలు వినే బుజ్జాయి ఎదిగి జోలల తో ఉయ్యాల ఊపే మాతృమూర్తి ఐ,
ఊరికి దక్షిణాన నిశ్శబ్ద జ్ఞాపకంగా నిద్రించే ఆఖరి క్షణం వరకు..
ఒక ఆడజన్మ చెక్కు చెదరని బాధ్యతకు చిరునామా!
నేస్తం! స్త్ర్రీత్వాన్నే తప్ప స్త్రీ మహోన్నత్వాన్ని చూడలేని
గుడ్డికళ్ళకు మీజన్మ అమ్మ ఇచ్చిన భిక్ష అన్న వాస్తవం
ఎప్పుడూ గుండెల్లో గుర్తుండేలా ఏదైనా పచ్చబొట్టు కనిపెడదామా?
*29-07-2012

30, జులై 2012, సోమవారం

ఉషారాణి కందాళ కవిత


నేనొక పూలవనం కావాలనుకుంటాను కనీసం గుడ్డిపువ్వును కాలేను! 
నేనొక వెన్నెల జలపాతం కావాలనుకుంటాను కనీసం చిన్ని దీపం కాలేను!
నేనొక అనంతాకాశం కావాలనుకుంటాను కానీ పిల్లమబ్బును కాలేను!
నేనొక శతఘ్నినై ప్రజ్వరిల్లలనుకుంటాను కానీ అగ్గిపుల్లైనా కాలేను!
నేనొక మాహా సముద్రమై ఉప్పొంగాలనుకుంటాను కానీ చిన్ని చెలిమను సైతం కాలేను!
నేనొక శిలావిగ్రహంలా స్థిరమై పోవాలనుకుంటాను, కనీసం చిరునామాకు సైతం నోచుకోను!
నేనొక బృహత్కావ్యాన్ని ఆవిష్కరించాలనుకుంటాను, కనీసం ఒక్క పదం పలకలేను!
నేనొక జీవనదినై ప్రవహించాలనుకుంటాను, కనీసం వీధికొళాయి కాలేను!
నేనొక మాహామనీషినై వెలగాలనుకుంటాను కానీ కనీసం మాములు మనిషిలా మసలలేను!
నేస్తం! ఏన్నెన్నో అనుకుంటూ ఏమీ చేయలేనంటూ తెలుసుకోగలిగినప్పుడు..
అలోచనలన్నీ కన్నీళ్ళు అవుతాయని భయపడ్డాను చిత్రంగా అవి అనుభవాలయ్యాయి.
* 29-07-2012

26, జులై 2012, గురువారం

ఉషారాణి కందాళ కవిత

ఓడిపోవడం ఓటమి ఎప్పటికీ కాదు!అది గెలుపు కు గొప్ప పునాది!
గాలిపటం క్రిందికి వాలినప్పుడంతా సూత్రం సాయం పడుతుంది!
అలాగే అపజయం ఎదురైనప్పుడంతా ఆశ వెన్నుతట్టి వుండాలి!
గెలుపు కోరుకుంటే రాదు, పోరాడితే నే సాధ్యం!
ఆ నిత్య పోరాటాం లో ఎన్ని సార్లు విఫలమయ్యావో..
లెక్కలు వెయ్యకు! ఎన్నిసార్లు ప్రయత్నించావో గుర్తుపెట్టుకో!
ఎందుకంటే, ఓటమి పాఠం కావాలే తప్ప గతం కారాదు!
విజయం ఒక రోజు లో వస్తే దాని విలువ తెలియడం కష్టం!
అందుకే సాధించిన విజయాలు అద్భుతాలే కావాలి!
పట్టుదలే ఊపిరిగా మసలే వారికి గెలుపు ఇంద్రధనస్సు!
రంగురంగుల హరివిల్లును వారు కలల్లో, కళ్ళల్లో మోస్తూంటారు!
ఏనాటికైనా వారికి అది అందుతుందన్న ఆత్మవిశ్వాసం!
అపజయాలు అవకాశాలుగా, ఓటములు సమీక్షలుగా..
మారి ఉత్సాహంగా ముందుకురికితే, గెలుపెప్పుడూ అసాధ్యం కాదు నేస్తం!

అపజయానికి భయపడి ప్రయత్నం చెయ్యని వాడు మూర్ఖుడి కన్నా హీనుడు…..
ఈ మాట నేను కాదు...నేస్తం!. సోక్రటీసు చెప్పాడు!
26-07-2012

9, జులై 2012, సోమవారం

ఉషారాణి కందాళ ॥ప్రతి చూపుకి ఒక పదునుంది!॥

ఎగిరే గాలిపటానిది ఎప్పుడూ పై పై చూపే!
కట్ కొట్టే పతంగులను పట్టించుకోదు, కరెంటు తీగలను లెక్కచెయ్యదు!!


ఉరికే అలది ఎప్పుడూ మునుముందు చూపే!
అడ్డొచ్చే రాళ్ళను చూడదు,
 విరిగే కెరటాల్ని గమనించదు!
వేటాడే చిరుతది ఎప్పుడూ వాడిచూపే!
పొంచిన శతృవులకు భయపడదు, బంధించే వలలకు వెరువదు!
విలుకాడికి ఎప్పుడూ ఎదురు చూపే!
బాణం గురి తప్పనీడు

దృష్టి లక్ష్యంనుంచి మరల్చడు!
కత్తి పట్టిన వీరునికెప్పుడూ కరుకు చూపే!
రక్తానికి జడిసిపోడు, 

ఆయుధాలకి హడలిపోడు!

ఆశావాదిది ఎప్పుడూ రేపటి చూపే!
నిరాశలకు భయపడడు, నిరీక్షణలు మానుకోడు! 


కలం పట్టిన వాడిదీ  ఎప్పుడూ చుట్టూ చూపే!
విమర్శలకు భయపడరు, విసుర్లకు విరుచుకుపడరు!
కంటతడో, గుండె దడో..

ఆ చూపులని లొంగదియ్యలేవు!

ప్రతి చూపు కి ఒక పదునుంది!

ప్రతి చూపుకి ఒక పరుగుంది!


* 9.7.2012