పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, జులై 2012, గురువారం

రమేష్ హజారీ కవిత

నీ ప్రతీ జాడ వేకువ గాలయి నాలో ఆశల వుపిరిలూదెది
నీ మంచు కడ్గపు చూపు పదునుకు నా ప్రేమ చెలిమ తొవ్వ కుండానే వుటలూరేది
నీ అలౌకిక స్పర్శ నా పంచేంద్రియాలను కబ్జా చేసి నాకు పంచామ్రుతాన్ని పంచేది
నీ ఎడబాటుకు బెదిరి నీ అరచేయి రేఖనయి నీలో నే ముడుచుకు పోయేది
నీ ప్రేమామృతాన్ని పొందేందుకు నా హృదయ సముద్రాన్ని మదించాను
అమృతము నాకొదిలి హాలాహలాన్ని స్వీకరించావు
హిందూ మహాసముద్రపు సునామీలో కొట్టుక పోతున్న విలువలను వడిసిపట్టేలోపే
నా మీద ప్రేమతో నీవు విధించిన జీవిత కాలపు శిక్షను శిలారూపమయి భరిస్తాను
ప్రాణమా..గతం జ్ఞాపకమయి వర్తమానాన్ని కొరుక్కు తింటుంటే
మరణమే లేని నీ రూపాన్ని.నా మదిలో రేపటి కొరకు దాచిపెడుతా..
*26-07-2012

రెడ్డి రామకృష్ణ || నిన్ను తగలెట్ట ||

మనువా నిను తగలబెట్ట
మళ్ళీ మళ్ళీ పుడతవేర "మనువా"
మానవ జాతికి నీవో మచ్చలాగ నిలచినావు "మనువా"

వేల వేల యేళ్ళుగ నువు మానవులను చీల్చినావు
మనుషుల మధ్య నింత అగ్గి బోసి రేపినావు
కూచొని కూడు తింటె కులమో అని గునిసినావు
పంటకాడలేనిమైల వంటకాడ ఎలగొచ్చెర "మనువా"

ఇద్దరు మాటాడుతుంటె మధ్యలోకి వస్తుంటవు
మనసుల్లో ఏవేవో మాయతెరలు కప్పేస్తావ్
శుభకార్యం అయిన గాని చెడగొట్టిపోతుంటావ్
ప్రేమికులను బతకనీక పురుగు మందులందిస్తవ్ "మనువా"

ఊరికి వాడకి మధ్యన గోడలాగ నిలబడతావ్
మంచినీళ్ళ బావికాడ పొంచి పొంచి దాగుంటావ్
బండికాడ బస్సుకాడ సినిమాపెండేలుకాడ
అదునుకొరకు చూస్తుంటవ్ తగువులు పెట్టేస్తుంటావ్ "మనువా"

కారంచేడుల నువ్వు కమ్మవారి పంచజేరి
దళితులమైన మమ్ము దారుణంగా చంపినావు
చుండూరు లోనేమో రెడ్లనెత్తికెక్కినీవు
కత్తులు దూసి మా నెత్తురు వెదజల్లినావు "మనువా"

లక్షింపేటల నీవు చిచ్చర పిడుగయ్యావు
బాంబులు పేల్చినావు ప్రజలను భయపేట్టావు
ఆడవారి చీర చివర కారపు మూటయ్యావు
భూమిని సాకుజూపి బుర్రలు పగలేసావు "మనువా"

కత్తులు గొడ్డళ్ళతోటి కాళ్ళుచేతులిరగగొట్టి
బాకులు బల్లేలు బట్టి బండరాళ్ళు ఎత్తిపట్టి
గుండెలపై గుద్ది నావు ఐదుగురిని చంపినావు
మాలల రక్తంతో నేలనంత తడిపినావు "మనువా"

కమ్మలు రెడ్లయితెనేమి తూర్పుకాపులయితెనేమి
వెలమలు కాళింగులయిన ఎవ్వరయిన ఏమిగాని
నువ్వు దరిని జేరినాక దానవుడవుతాడు మనిషి
దళితుల రక్తం తోనే దాహం గైకొంటాడు "మనువా"

జ్యోతిరావు ఫూలె నిన్ను తరిమితరిమి కొట్టినా
పెరియరు రామస్వామి గొయ్యతీసి పాతినా
అంబేద్కర్ మహాశయుడు అడుసులోకి తొక్కినా
ముళ్ళకంపలాగనువ్వు మళ్ళీ మళ్ళీ లేస్తవేరా "మనువా"

ఏళ్ళకేల్లు గడిచినగానేమి మారింది లేదు
దళితుల వాడలపై దాడులు పెరిగాయి తప్ప
ఆర్ధికంగ బలం లేక అన్యాయం అవుతున్నాం
అధికారం చిక్కినాక .. నీకంత్యక్రియలు చేస్తమురా "మనువా"

మనువా నిను తగలబెట్ట
మళ్ళీ మళ్ళీ పుట్టకురా "2"

(లక్షిం పేట దుర్ఘటనకు స్పందించి రాసినపాట)
*26-07-2012

ధనలక్ష్మి బూర్లగడ్డ కవిత

తొలకరి చినుకులు అందం
అందులో తడిచే పాపాయి ముద్ద మందారం
ఆమె నవ్వులు మేలిమి బంగారం

పసిడి కాంతులు పాపాయి నవ్వులు గా విరబూసిన ఈవేళ
చిరు చినుకులు తనువును తాకిన ఈవేళ

అది చూసిన వారి మనసు అనే మన్ను పై
ఆహ్లాదం అనే మొలకలు వచ్చాయి
ఆనందం అనే సిరి పైరు గా ఎదిగి
ఆశ అనే ఆకలిని తృప్తి అనే ధాన్యంగా మారి తీర్చింది...
26-07-2012

రామాచారి బంగారు || చిత్ర శోభన భావనలు ||

సుమనయనమ్ములమ్మ
శోధించి సాధించి ప్రసాదించిన
శోభిత అనురాగాల వర్ణమాలిక
రాగరంజిత కుంజితాల
మేళవింపులోమేలిమి
బంగరు వన్నెచిన్నెల అభిసారిక
ప్రక్రుతిమాత శుభాశీస్సులతో
వనదేవతగా మారిన తారక
స్రుష్టికర్త మరులుగొన్న మదిలో
పూచిన మధురభావనల ప్రియపుత్రిక
కణ్వాశ్రమంలోని శకుంతలను గని
తీరని కోరికతో తనువు చాలించిన
చిత్రకారుడు వీడని గతజన్మ
జ్ఞాపకాల పరిమళముల పరవశము
తాలూకు వాడని తలంపులు
తలపుకురాగా సౌందర్యానంద
నందనాలు విరియపూయించినాడు
అందరి ఎదను దోచినాడు
తాను శిలసౌందర్యం పొందిన
ఈ జగతిలోని వారందరి
గుండెల్లో ప్రేమభావనల
జ్యొతులు వెలిగించినాడు
చిత్రంలోని చిత్రాణి
సమ్మొహన నర్తనమై
విస్వసుందరిమణులందరూ
విస్తుపోయేలా జగన్మోహనంగా నర్తిస్తుంది
అమ్రుతభాండంకోసం పాలకడలి
మధనంలో తాను జగన్మోహినిగా మారి
నర్తించిన శ్రీమహవిష్ణు సైతం
మూర్చనలు పొందుతాడు
సరికొత్త వేడుకగా ఈకన్యక
స్వయంవరంకోసం సిరిని
శ్రీచక్రాన్ని వదలి దివిని వీడి
శ్రీమహవిష్ణు భువిపై తిష్ట
వేయదం మాత్రం ఖాయం
దేవ మానవుల నడుమ పోటితో
ఇకపై తప్పక జరుగనున్నది
మూడవ ప్రపంచయుద్దం
పులకింతమదులకు
ఈచిత్రమొక అపూర్వ కానుక
రంజిల్లెడు మనసులతో
రసరమ్యంగా ప్రసన్న
వదన చిత్తులుగా
ఈవేదికపై వేడుక
పూల తోరణాలు కడుతుంది.
*26-07-2012

ఉషారాణి కందాళ కవిత

ఓడిపోవడం ఓటమి ఎప్పటికీ కాదు!అది గెలుపు కు గొప్ప పునాది!
గాలిపటం క్రిందికి వాలినప్పుడంతా సూత్రం సాయం పడుతుంది!
అలాగే అపజయం ఎదురైనప్పుడంతా ఆశ వెన్నుతట్టి వుండాలి!
గెలుపు కోరుకుంటే రాదు, పోరాడితే నే సాధ్యం!
ఆ నిత్య పోరాటాం లో ఎన్ని సార్లు విఫలమయ్యావో..
లెక్కలు వెయ్యకు! ఎన్నిసార్లు ప్రయత్నించావో గుర్తుపెట్టుకో!
ఎందుకంటే, ఓటమి పాఠం కావాలే తప్ప గతం కారాదు!
విజయం ఒక రోజు లో వస్తే దాని విలువ తెలియడం కష్టం!
అందుకే సాధించిన విజయాలు అద్భుతాలే కావాలి!
పట్టుదలే ఊపిరిగా మసలే వారికి గెలుపు ఇంద్రధనస్సు!
రంగురంగుల హరివిల్లును వారు కలల్లో, కళ్ళల్లో మోస్తూంటారు!
ఏనాటికైనా వారికి అది అందుతుందన్న ఆత్మవిశ్వాసం!
అపజయాలు అవకాశాలుగా, ఓటములు సమీక్షలుగా..
మారి ఉత్సాహంగా ముందుకురికితే, గెలుపెప్పుడూ అసాధ్యం కాదు నేస్తం!

అపజయానికి భయపడి ప్రయత్నం చెయ్యని వాడు మూర్ఖుడి కన్నా హీనుడు…..
ఈ మాట నేను కాదు...నేస్తం!. సోక్రటీసు చెప్పాడు!
26-07-2012

యజ్ఞపాల్ రాజు కవిత

పసుపు నారింజ రంగులు కలిసిన చీర కట్టుకుని....
ఎర్రటి పెద్ద బొట్టు పెట్టుకుని....
ఇంతింత కళ్లేసుకుని....
నెత్తిమీద అందరికీ కావలసిన ఆనందాల బుట్టనెత్తుకుని....
కాళ్ళ గజ్జెలు ఘల్లు ఘల్లుమంటుంటే....
వడివడిగా మెత్తటి అడుగులేసుకుంటూ....
వయ్యారంగా వచ్చేస్తోంది....
ఎవరనుకున్నారు....
మీకు తెలీదా..... ????
ఆమెను ప్రభాత సుందరి అంటారు....
ఒక్క చిరునవ్వు ఇచ్చేస్తే చాలు....
నెత్తిమీది బుట్ట దించి మీక్కావలసిన సంతోషం, ఉత్సాహం, ప్రశాంతత....
ఇంకా ఏం కావాలన్నా ఇచ్చేస్తుంది....
ఇచ్చేసి ఒక్క క్షణం కూడా నిలవదు....
చక్కా వెళ్లిపోతుంది..... అదేంటో మరి....
*26-07-2012

ధనలక్ష్మి బూర్లగడ్డ కవిత

మా ఇల్లంతా గోల గోల నేనుంటే
నేనే లేకుంటే చాల చాల సైలెంటే

ఇంట్లో నేనుంటే ,
గొడవ గొడవ చేస్తుంటా
గజ్జలేసి తిరుగుతుంటా
పిచ్చి పిచ్చి పాటలతో లౌడు స్పీకరేస్తుంటా
అందుకే // మా ఇల్లంతా //

ఇంట్లో నేలేకుంటే ,
అల్లరుండదూ, అలజడుండదు ,
అరుపులుందవూ, అలికిడుండదూ
అందుకే //మా ఇల్లంతా //

అమ్మేమో,
నేను ఇంట్లో ఉంటే తిదుతూనే ఉంటుందెపుడూ
నేనింట్లో లేకుంటే పొగుడుతూనే ఉంటుందెపుడూ
ఏమిటో ఈ వింత గోల అర్ధమేకాదసలూ .......
ఐనా సరే //మా ఇల్లంతా //

కానీ ,
ఫ్రెండ్స్ అయినా, పేరెంట్స్ అయినా ,నైబర్స్ అయినా
నువ్వు నవ్వుతుంటే చాలునంటారే
నువ్వు ఎక్కడుంటే అక్కడే సందడి అని అంటారే
అందుకే //మా ఇల్లంతా //
*26-07-2012

బివివి ప్రసాద్ || కవి అంటే మనిషి సారాంశం ||


ఆలోచన, ఊహ, అనుభూతి, ఉద్వేగం ఇవి మానవులలో సజీవమైన శక్తులు. పదాలు ఈ శక్తుల్ని ఆవాహన చేసుకొని వ్యక్తపరిచేవి. వీటిని తనలో స్పష్టంగా దర్శించి, ఆ శక్తులనీ, పదాలనీ వృధ్ధి చేసుకొనేవారూ, వాటిపై అధికారం సంపాదించే వారూ పరిణతి పొందుతారు. కవి అంటే మనిషి సారాంశం, కనుక, అటువంటి శ్రధ్ధ గల కవులూ, వారి కవిత్వమూ ప్రేమించ బడతాయి.

స్కైబాబా || వింగ్స్ ||

లోపల- ఏ అలారం మోగుతుందో
టంచనుగా లోపలి కన్ను విచ్చుకుంటుంది
నా కుంచెకు అందిన బొమ్మ చకచకా రూపుదిద్దుకుంటూ..
పక్కింటి పచ్చపచ్చని లంగావోనీ
మనసు వాకిలి ఊడుస్తూ..
ఎంతకూ అడగక
అసలెంతకూ నాలో మంచివాడు తగలబడిపోక..
గింజుకొనీ గిల్లుకొనీ
అటు తిరిగి పడుకుంటాను
పక్కలో ప్రత్యక్షమై
గుండీలో గుండెలో విప్పుతూంటే
అల్లకల్లోలమై సుడితిరుగుతుంటాను
నన్నెక్కడికో నడిపించుకుపోయి
నా చేయి పట్టుకుని
అవతలికి దూకేస్తుంది
ఎక్కడికో ఇంకెక్కడికో పడిపోతూ..
లేదు లేదు
రివ్వున దూసుకెళ్తూ..
బట్టలూ ఆచ్ఛాదనలన్నీ
లోకం అరుపులూ గుసగుసలన్నీ
ఎగిరిపోతున్నాయి గాల్లోకి..
దూసుకుపోతూన్నాం..
నేనూ, తప్పిపోయిన మేక పిల్లా
లేదు, నా చిన్న నాటి స్నేహితుడూ నేనూ
అహ–, నేనూ నన్ను వెంటాడే దెయ్యమూ
కిళుక్కున నవ్వుతూ మాజీ ప్రేయసి
దూసుకెళ్తూ ఎళ్తూ ఉన్నాం
ఇంకా అడుగు అందనే లేదు..

అంతలోనే రెక్కలు మొలుచుకు వచ్చాయ్!
తడిమి చూసుకున్నాను, ఆశ్చర్యంగా
అవి నేను
ఎక్కడో పోగొట్టుకున్నవే..!
*26-07-2012

వంశీదర్ రెడ్డి || ‎* కించిద్విషాదం *.||

చెయ్యి తడిపితే, చేతిలోకొద్దామని
కాచుక్కూర్చున్న ఉద్యోగం, తలరాతలో

చచ్చిన కోడి, బావర్చిలో,
కడుపులో దూరడానికెదురుచూస్తూ

కంటినిండా రమ్మని పిలుస్తున్న
సినిమా పోస్టర్ సంగీత్ లో

మధుశాలలో "వాట్ 69",
వంద వాట్ల కాంతితో మెరుస్తూ,

ఫుట్పాత్ మీద షాప్ లో,
నిశ్శబ్దంగా నవ్వుతున్న "అసమర్ధుడి జీవయాత్ర"

బద్దకంగా కదులుతూ క్లాక్ టవర్ ముల్లు
నగరం నడిబొడ్డున

ప్రతి అమ్మాయిని గుచ్చే చూపుల
బడాయికి పాంట్ జేబులో పెట్టాల్సొచ్చిన చేతులకి
తగలని పర్సు,
సిటీ బస్సెక్కినట్టు గుర్తు

ఆటోవాడుమ్మిన కిళ్ళీ
నా తెల్ల చొక్కా మీద రంగవల్లిగా మెటమార్ఫసై..

కోపం పెంచిన ఆకలిని నాలుగోసారి చంపుకుని
ఆశలు రేపిన ఊహల్ని తప్పించుకు తిరుగుతూ
నాలోంచి నేను బైటకొచ్చి చూస్తే,
ఎటుచూసినా నాలాగే కన్పించే జనాలు..

ఏదో సాధించాలన్న
తపననీ, తొందరనీ వొదిలించుకుని,
కన్పించని "రేపు"ని
గొప్పగా కలలు కంటూ, గడుపుతూ..

ధైర్యం వచ్చింది, నేనొక్కడినే కాదని,
వాళ్ళకెపుడు తెలుస్తుందో,
అందరం ఒకటే అని..
*26-07-2012

ఆర్.దమయంతి. || గుండె కరగిన రాత్రి ||

రంగైన స్వప్నాలెందుకు నిదుర రాని కనులకు
రేయి లేని పవలెందుకు?
నా కనుల ముందుకు నువ్ రానపుడు!

యవ్వనాల పూలవాంఛ లెందుకు
విరులెత్తని నీ నవ్వులు కురవనప్పుడు?

పున్నమి వెన్నెల వీచికలెందుకు
నా గుట్టుపట్టు న చీకట్లు చుట్టిముట్టినపుడు

గొంతెత్తి పాడే కోయిల లెందుకు
గుండె దారులు ఎడారులై పోయినపుడు

అయినా,
'నువ్ లేని నేనెందుకు'?' - అని మాత్రం అను కోనులే..
నీ జ్ఞాపాకాలే నా ఊపిర్లయి నందుకు!

చెలీ!
నీ తలపుల నిట్టూర్పులలో నన్ను నిలువునా విలపించనీ ..
నీ కొరకు ఉలుకు కన్నీటిని నిరతమూ పానించనీ..

సఖీ!
విఫలమైన ప్రేమ కన్నా విందేముందనీ - వగపు హృదికి!?
మరపు రాని ప్రేయసి కన్నా భాగ్యమేదనీ- భగ్న ప్రేమికునికి?!
- నీకై నినదించనీ... .
ఈ తీపి గరళాన్నిక సేవించనీ!
నన్నిలా సదా నిషా విషాదాల మునిగి తేలనీ..

*26-07-2012

జగతి జగద్దాత్రి || ఆ ఒక్కటీ .... ||

ఆమె విరహం లో , నిరీక్షణ లో, ఆనందం లో , ఆవేదన లో
అతని గురించి కవిత రాస్తుంది
ఆమెలో కరిగి కలిసి పోయిన ప్రతిసారీ
నీకోసం ఒక మంచి కవిత రాస్తాను అంటాడు అతను
ఆమె కళ్ళలో కోటి నక్షత్రాలు మెరుస్తాయి
ఎప్పటికప్పుడు కలలు చివురు లేస్తాయి
ఆశతో అడుగుతుంది"నిజంగా?"
నమ్మకంగా చెప్తాడతను "నిజమే రా! ఈసారి తప్పకుండా !"
కధ మళ్ళీ మొదలౌతుంది
ఆమె ఆశతో అతని వాంఛ తో
ముగుస్తూనే ఉంటుంది ఎన్నో మార్లు
ఆమె నిరాశతో...అతని ప్రమాణంతో
అతని ప్రేమను అక్షరంగా చూడాలని ఆమె ఆకాంక్ష
రాద్దామనే అనుకుంటాడు ప్రతిసారీ అతను కూడా
ఒక్క వాక్యం తో ఆమె మనసు మురిపించగలనని
తెలుసు అతనికి
ఆ ఒక్క వాక్యం మాత్రం ఏమిటో తట్టడం లేదు మరి
అంటాడు నేను ఎప్పుడడిగినా ....
*26-07-2012

లక్షణ స్వామి || మాయ చేసే నీ నవ్వు ! ||

నీ మందహాస చద్రహాసాలు ....నా మదిని
హాయిగా కోసేస్తుంటాయి........
యదలో నిండిన చీకటి తెరలకి
నీ నవ్వుల నిప్పంటుకుంటుంది....
నా యాంత్రిక దేహ యాతనకి......
నీ మాంత్రిక మందహాసం మాత్రవుతుంది..
నీ నవ్వుతో నన్ను మాయచేసి...
సరికొత్త స్వర్గాన్ని చూపిస్తావు..
నీ ప్రేమామృతాన్ని ...నవ్వుల కుసుమాలతో
నాపై కుమ్మరించి....
నాలో చైతన్య జాగృతాంకురాల్నినాటేస్తావు...
ఎన్నిజన్మల పుణ్యఫలమో..నీ సంగమం..!!!
యుగాల వేదనని నీ దరహాసం తరిమేస్తూ ఉంటుంది .....
జగత్తంతా ప్రేమయం కావాలని స్వప్నిచే....ఆ హాస విలాసం
శాశ్వతంగా పరిమళి౦చాలి !
*26-07-2012

జ్యోతిర్మయి మళ్ళ || తపోయోగం ||

పంజరమే..
లోపల చిక్కుకుని
గిలగిలా కొట్టుకోవడం నచ్చిన
అందమైన బందిఖానా ఇది.

శిరసావహమే..
లోపలికి నెట్టి గడియ పెట్టిన
నీ ఆజ్ఞ !
అమూల్యమైన నజరానా ఇది.

నయనసదృసమే..
చూట్టూ నిలబెట్టిన
నీవేలిముద్రలు పొదిగిన ఇనుపచువ్వలు !
అపురూప ఖజానా నాకిది.

పరవశమే..
ఇక్కడ వదిలెళ్ళిన
నీఊపిరి తరంగ రవళి !
అదురుగుండె కదిలించు సహానా ఇది.

ఆనందాతిరేకమే..
నీసడి కోసం సవ్వడి కోసం
నీ వేలికొస కోసం
మోమంతా కనులుగా
మేనంతా చెవులుగా మారినది !
దీక్షగా నిరీక్షించు తపోయోగమిది.
*26-07-2012

అనిల్ డాని || ఎదురుచూపు వానకై ప్రకృతి ||

చల్లగా తడుముతోంది ఒక వాన చినుకు
మెత్తటి మట్టిని ఆత్మీయం గా
ఎక్కడో వాన చినుకు ఇక్కడికి వస్తోంది అతిధిగా
ప్రకృతి ఆహ్వానిస్తోంది తనలో కలుపుకోవడానికి చినుకుని
ఎన్నాళ్ళో వేచి చూసిన అనుభవం ప్రకృతి ది
ఏడిపించి మురిపించే దరి జేరే ఉద్దేశం చినుకుది
ఎంత ఏడిపించినా, వూరించినా చినుకు వస్తే మాత్రం
తనలో కలిపేసుకుని ఆహ్వానిస్తుంది ప్రకృతి
అపురూప ఆత్మీయ సంగమం అది

తనొస్తే పులకరింత , అదేదో గిలిగింత
రంగు మార్చుకుంటుంది ప్రకృతి
అప్పటి వరకు మొహం మాడ్చుకున్నా సరే
గట్టి నేల చినుకు పడితే చిత్తడి గా మారుతుంది
ప్రేమికుని ఒదార్పులో కరిగే ప్రేయసి మనసులా

ఎదురుచూపులోని ఆత్రం ప్రకృతిలో
కలవాలనే తొందర వాన చినుకులో
అనుబంధాల కలయిక ఈనాటిది కాదు
ఆబంధం అజరామరం మట్టి వాసనంత
ఆహ్లాదం,నెమలి నాట్యమంత అందం.
*26-07-2012

కె. కె. || నిరాశ నుంచి ఆశ ||

నిర్విరామంగా చలిస్తూ
చరా,చర సృష్టిని మోస్తూ
క్షమ,సహనాలకి మారురూపుగా
లోకాన్ని లాలించే ధరిత్రి
అప్పుడప్పుడు ఆగ్రహిస్తుంది.
ఆ ప్రకంపనాలు సమగ్ర జీవకోటిని
కలవర పరుస్తుంది,నిలువెల్లా కూల్చేస్తుంది.

లోకమంతా,తన శాఖలతో నింపివేసి
చల్లగాలి,పిల్లగాలిగా తాకే నేస్తం గాలి
ఆశ్రయించిన ప్రాణికోటిని
కౌగిలించుకుని ఆదరిస్తుంది.
హఠాత్తుగా కోపగిస్తుంది,
ప్రాణవాయువే విషపూరితమై
విజృంబిస్తుంది, జీవం పీల్చేస్తుంది.

హరిత వర్ణం,నేలపై కళ్ళాపి చల్లే,
దప్పిక తీర్చి,అక్కున జేర్చుకునే
చిరుజల్లుల వర్షం చిరునవ్వులతో పలకరిస్తుంది.
జగమంతా నిండిన ఆనందం తో పులకిస్తుంది.
ఎప్పుడైనా ఆవేశం కల్గితే ఉప్పెనై ముంచేస్తుంది.

ఆకస్మికంగా ఎదురుపడే ఆప్తుల కోపాలెన్నో
ఖంగున మోగుతూ,నిశ్శబ్దం గా నిష్క్రమిస్తాయి.
విపత్తులు సంభవించాయని విచారం వ్యక్తం చేస్తే
కర్తవ్య విముఖునివైతే మనుగడ ఎలా???
తుళ్ళే కెరటం పై దూకితేనే తీరం చేరేది.
నైరాశ్యం నుంచి ఆశను చేదుకున్నప్పుడే విజయం సిద్ధించేది.
*26-07-2012

కె.కె || తప్పదుగా నాకు ||

నేనెదురు పడగానే
పక్కకు జరిగే మీ కళ్ళు
తప్పుకు తిరిగే మీ కాళ్ళు
చిరాకు విసిరే మీ నొసలు
ఇవన్నీ తెలుస్తున్నా
నా మనసుని పొడుస్తున్నా
వెర్రినవ్వు నొకదాన్ని ముఖాన
పులుముకొని పలకరిస్తుంటాను
తప్పదుగా నాకు...

కొత్త పాలసీ,కొత్త స్కీం అని చెప్పడానికి
భయం తో,బాధతో,మొహమాటం తో
ఎన్నిసార్లు కుస్తీ పట్టానో నా మనసుతో
ప్రతీసారీ నేనే నెగ్గి, మనసుని తొక్కి
కొత్త భీమాపథకాన్ని,అందమైన శతకంలా
వివరిద్దామని పిచ్చి ప్రయత్నం చేస్తూ ఉంటాను
తప్పదుగా నాకు...

నాలుగు ఇంగ్లీషు ముక్కలు జోడించైనా
ఆకట్టుకోవాలని నేను ప్రయత్నిస్తుంటే
నా పీకట్టు కోవాలన్నుట్టు మీ చూపులు
అవి నేను గమనించినా
ఆ దాడి తట్టుకోక
తప్పదుగా నాకు...

"నేను పోయాక వచ్చే సుఖం గురించి
నాకే చెబుతావేంటిరా సన్నాసి" అంటూ
మీరు విసిరే చతుర్లకి చిర్రెత్తుకొచ్చినా
నోరెత్తకుండా పాలసీ మెచ్యూర్ అయ్యాకొచ్చే
డబ్బుకోసం నే చెబుతుంటాను
తప్పదుగా నాకు...

దేశం లో ఆర్దికమాంద్యం,
జరుగుతున్న రాజకీయ 'స్కాం'
బోర్డు తిప్పిన ప్రైవేట్ బాంక్.కాం
వీటన్నిటికి నేనే కారణమంటూ
నన్నో దొంగని చేసి మాట్లాడుతుంటే
చెవికింద ఒక్కటిచ్చి చుక్కలు
చూపించాలనిపిస్తుంది
అయినా చిరునవ్వుని కాపాడేస్తుంట
తప్పదుగా నాకు...

బతకడానికి బతిమాలుకుంటున్నానని,
నిరుద్యోగ సంఘం నుంచి
బలవంతంగా బహిష్కరించబడ్డ
చిరుద్యోగి నేనని.. నేనేనని
నీకు తెలిసేదెప్పుడు???
*26-07-2012

బివివి ప్రసాద్ || సహజ కవులు, సాధన కవులు ||


*26-07-2012 నుండి
సహజ కవులు, సాధన కవులు అని కవులు రెండు రకాలు. సహజ కవులు తమ ఆలోచనలను నేలకి దించగలిగితే, సాధన కవులు తమ ఊహలను ఎగరనివ్వగలిగితే మరింత పక్వమౌతారు.


  • Katta Srinivas
     మరి ఎవరు ఏ రకమో తెలుసుకునే మర్గమేదైనా వుందంటారా సార్.
    సహజ కవులు ఆలోచనలను నేలకి దించాలంటే చేసే ప్రయత్నం సాధనే కదా అపుడు మళ్లీ సాధన కవుల వర్గంలోకి వచ్చేస్తారు కదా.




  • Bvv Prasad చాలా సూక్ష్మంగా గమనించాలి ఎవరికి వారు తనలో. ఒక వస్తువుని చూడగానే ముందు స్పందన (identificatiom) కలిగి, దానిని పదాలుగా ( thought) అనుసరిస్తే వాళ్ళు సహజ కవులు. ముందు ఆలోచన పుట్టి, దానిని స్పందన అనుసరిస్తే సాధన కవులు. ఈ విభాగాలు అనగాహనా సౌలభ్యం కోసమే. thought and feeling కలిస్తేనే కవిత్వం కదా..



  • Katta Srinivas లోన ఏదో వెలిగింది... ఎంతో లోతుగా చూసి స్పష్టంగా విభజించారు.
    ఇప్పుడు నన్నునేను కూడా సులభంగా చూసుకునే కొలత తెలిసింది సార్.
    మరి సహజ కవుల ఆలోచనలు ఆకాశంలోనూ
    సాదన కవుల ఊహలు క్రింద ఎందుకుంటాయి.
    వాళ్లు దించటం
    వీళ్లు ఎగరనివ్వటం అంటే ఏమిటి ? ఎలా చేయాలి?
    (క్షంతవ్యుడిని... మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టటం లేదు కదా)




  • Bvv Prasad ప్రశ్న జ్ఞానానికి దారిచూపే దీపం కదా.. సహజకవుల ఊహలు ఆకాశంలో ఉంటాయి, వాటితోనే ఆలోచనలు కూడా. సాధకుల ఊహలు నేల విడిచిపెట్టవు, వారి అలోచనాశక్తి ఊహల్ని ఎగరనివ్వదు.



  • Lugendra Pillai సాధన చేస్తున్న కవికి మంచి స్పందన వస్తే కవిత అంత సహజంగా వస్తుంది. సహజత్వం కవితలో ఉండాలి..


  • Bvv Prasad ఊహించటం ఒక సాహస చర్య. కాసేపు ఆలోచననీ, తర్కాన్నీ విడిచి ఊహల్ని ఎగరటానికి అనుమతించాలి, పిల్లలవలే. ఆలోచన ఒక దార్శనిక ప్రక్రియ. కాసేపు ఊహలు విడిచి, ఓర్పుగా ఆలోచనను లోతుల్లోకి ప్రయాణించనివ్వాలి.



  • Katta Srinivas ఆలోచననీ, తర్కాన్నీ విడిచిపెడితేనే ఊహలు ఎగరుతాయంటారా. ఊహకు ఇవిరెండూ ప్రతిభందకాలుగానో, శ్రుంఖలాలుగానో వుంటున్నాయా?
    మరి సహజ కవులు ఎలాగూ ఊహలను ఆకాశంలో నిలుపుకునే వున్నారు. వారిని క్రిందకు దింపేందుకు మళ్లీ ఇవి రెంటినీ పట్టుకోవాలంటారా ?



    •  'ఒక మనిషి మబ్బుల్లోకి ఎగిరాడు, మబ్బుల్లో మాయమై మరొక లోకంలోకి వెళ్ళాడు, అక్కడ తన పూర్వులతోనూ, తన తరువాత తరాలవారితోనూ మాట్లాడాను. అక్కడ మాటలంటే మన శబ్దాలు కాదు, ఒకరిలో స్పందన కలగగానే మరొకరికి అర్థమైపోతుంది. ' ఇది ఊహ. ఇది తర్కానికి నిలబడదు. అయినా ఈ ఊహ అంతా కొద్దిపాటి తర్కాన్ని ఆశ్రయించి ఉండటం గమనించవచ్చు.
      అలాగే 'నేను ఇప్పుడు కంప్యూటర్ ముందు కూర్చున్నాను. ఇంతలో కరెంట్ పోయింది. కరెంట్ లేకపోతే నా కంప్యుటర్ పనిచేయదు. దీనికి బాటరీ సపోర్ట్ లేదు కనుక. ' ఇది కేవలం ఒక వాస్తవాన్ని చూపిస్తున్న ఆలోచన. దీనిలో ఊహ లేదు. అయినా ఈ ఆలోచన కూడా, మనకి కనిపించని విద్యుత్తుని ఊహిస్తుంది.
      కేవల ఊహ ఆశ్చర్యం కలిగిస్తుంది, ఒక రస స్ఫూర్తిని ఇస్తుంది. కానీ అది తర్కానికి నిలబడనప్పుడు, మనలో ఎలాంటి వికాసమూ కలిగించదు. మనలోపలి, వెలుపలి సంక్లిష్టతల్ని ఇది పరిష్కరించదు. ఆలాగే కేవల ఆలోచన, రసహీనంగా ఉంటుంది, అది ఎలాంటి ఉత్తేజాన్నీ ఇవ్వదు.
      కవి ఈ రెండిటి సమ్మేళనం ద్వారా మనిషి బహిరంతర ప్రపంచాలకి మేలుచేసేది (మేలు చెయ్యాలన్న నిష్ట లేనప్పుడు, హాని చేసేది) ఏదో సృష్టిస్తాడు. అది పాఠకులని దాని ఊహాశక్తిని అనుసరించి, ఆలోచనాశక్తిని అనుసరించి ప్రభావితం చేస్తుంది.
      అందువలన కవికి రెండు శక్తులూ అవసరమే. ఏది లోపించినా సమగ్ర రచన జరగదు.
      మనుషులలో అన్ని శక్తులూ సమగ్రంగా 'మేలుకొని ' ఉండవు, వివిధ నేపధ్యాలను అనుసరించి వివిధ పాళ్ళలో ఉంటాయి. ఊహా శక్తి ఎక్కువగా ఉండి, ఆలోచనా తక్కువ ఉంటే, వారు ఆలోచించటం సాధన చెయ్యాలి. అలాగే ఆలొచన బాగా ఉండి, ఊహ తక్కువ ఉంటే వారు ఊహించటం సాధన చెయాలి. అయితే కవిత్వమంటే ఊహించటం, స్వప్నించటం అని సామాన్య వాడుక కనుక, ఊహా బాగా ఉన్నవారిని సహజ కవులని, ఆలోచన బాగా ఉన్నవారిని సాధన కవులని అన్నాను. అంతకు మించి, వీరిలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని కాదు. మనలో పసిదనం ఉంటుంది, sense of wonder ఉంటుంది. అందువలన మనం ఊహని ఎక్కువ ప్రేమిస్తాం. కాని ఊహా, వాస్తవమూ ఒకదానిని ఒకటి అనుసరిస్తూ ఎదిగినప్పుడు మానవుడు మహా మానవుడవుతాడు. కవి మహాకవి అవుతాడు. ఒకదానికొకటి ప్రతిబంధకమైనపుడు అతను దు:ఖంలో చిక్కుకుంటాడు.
      తనలోపలి శక్తుల పట్ల సరైన అవగాన ఉన్నవారు తనకీ, ఇతరులకీ మంచి జీవితం గడపటానికి సహాయకారులవుతారు. ఎదగని ఊహల్నీ, ఎదగని ఆలోచనలనీ పట్టుకొని, ఉద్వేగాలు ఎటు నడిపిస్తే అటు నడిచేవారు, తనకీ, ఇతరులకీ దు:ఖం కలిగిస్తారు. అందుకే జీవితంపట్ల శ్రద్ధ, అధ్యయనం అవసరం.
      అన్నీ స్పష్టంగా అర్ధమయ్యాయా శ్రీనివాస్..


    • Katta Srinivas ఇంతకు ముందు కేవలం మీరు ఇచ్చిన ప్రతిపాదన చదివినపుడు
      ఏదో చిక్కుముడుల దారపు వుండలా వుండి, ఎక్కడో పోంతనలేని తనం తడుతున్నట్లు అనిపించింది.
      ఇప్పుడు
      అవే దారాలు అందంగా అల్లిన గూడులా వున్నాయి.క్రమత్వం బొమ్మ కడుతోంది.
      ఇప్పటికి రెండు,మూడు సార్లు చదువుతూ అర్దంచేసుకుంటూ చదువుతున్నాను.
      ఊహా ఆలోచన మీద మీరు చెప్పన వివరణ చాలా బావుంది.
      ఊహని మనం ప్రేమించటానికి గల కారణం తార్కకంగా వివరించారు.
      ఇంకా చదివింది సరిపోల్చుకుంటున్నాను.
      ఇంకా సందేహాలేమీ మిగిలినట్లు లేదు.


    • Bvv Prasad లోపలి ప్రపంచాన్ని ఒకరు మరొకరికి చెప్పటం చాలా కష్టం. అది అంతా నైరూప్యవిషయం కదా. ఉదాహరణలు కొంత సహాయం చేస్తాయి. కానీ, లోపలి ప్రపంచాన్ని తెలుసుకోకుండా, వెలుపల ఎన్ని తెలుసుకున్నా మనిషికి మరింత గందరగోళం, దు:ఖం మాత్రమే మిగులుతాయి.


    • Katta Srinivas ఒక ప్రతిపాదన అర్దం చేసుకొనేందుకు చేస్తున్న ప్రయత్నంలో
      లభించిన మరికొన్ని ప్రతిపాదనలు.

      => మనుషులలో అన్ని శక్తులూ సమగ్రంగా 'మేలుకొని ' ఉండవు, వివిధ నేపధ్యాలను అనుసరించి వివిధ పాళ్ళలో ఉంటాయి.

      => ఊహా శక్తి ఎక్కువగా ఉండి, ఆలోచనా తక్కువ ఉంటే, వారు ఆలోచించటం సాధన చెయ్యాలి.

      => అలాగే ఆలొచన బాగా ఉండి, ఊహ తక్కువ ఉంటే వారు ఊహించటం సాధన చెయాలి.

      => కవిత్వమంటే ఊహించటం, స్వప్నించటం కనుక, ఊహా బాగా ఉన్నవారు సహజ కవులు, ఆలోచన బాగా ఉన్నవారు సాధన కవులు

      => వీరిలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు.

      => ఊహా, వాస్తవమూ ఒకదానిని ఒకటి అనుసరిస్తూ ఎదిగినప్పుడు మానవుడు మహా మానవుడవుతాడు. కవి మహాకవి అవుతాడు. ఒకదానికొకటి ప్రతిబంధకమైనపుడు అతను దు:ఖంలో చిక్కుకుంటాడు.

      => తనలోపలి శక్తుల పట్ల సరైన అవగాన ఉన్నవారు తనకీ, ఇతరులకీ మంచి జీవితం గడపటానికి సహాయకారులవుతారు.

      => ఎదగని ఊహల్నీ, ఎదగని ఆలోచనలనీ పట్టుకొని, ఉద్వేగాలు ఎటు నడిపిస్తే అటు నడిచేవారు, తనకీ, ఇతరులకీ దు:ఖం కలిగిస్తారు.



కర్లపాలెం హనుమంత రావు || హైకూ-ఒక ధ్యాన మార్గం ||


దేశమంటే మట్టి కాదోయ్…కవిత్వమే.కొండలలో నెలకొన్న రాయడు వాడు…కవిత్వమే.వందే వందారు మందారమిందిరానంద కందలమ్…కవిత్వమే. చచ్చిన రాజుల పుచ్చిన గాథల మెచ్చే చచ్చు చరిత్రకారులను ముక్కు చెవులు కోసి అడగాలనుంది… ఇదీ కవిత్వమే.


కవిత్వానికి లిట్మస్ టెస్టులు, రంగు రుచి వాసనాదులు నిర్ద్రారించె పని వ్యర్థం. అలాగని పుటలను నలుపు చేసిన ప్రతి రాతను కవిత్వమే అనాలా!


కవి నిరంకుశుడే…కదా అని చంపకమాల రాసి కందమని దబాయిస్తే సహించాలా! పద్యం రాయాలనుకున్నప్పుదు పద్య నియమాలకి బద్ధుడయ్ ఉండాలి కదా!




హైకూల పేరుతో ఇప్పుడొస్తున్నసర్కస్ ఫీట్స్…ను గురించే ఈ ఘోషంతా!


సంప్రదాయక కవిత్వానికి ఉన్నది నియమబద్ధ వ్యాకరణ సూత్రాలే…హైకూల వెనుకున్నది ఒక కచ్చితమైన ఫిలాసఫీ!


హైకూ అంటే 5,7,5 అక్షరాలను ఉపయోగించి రాసే కవితా రూపం మాత్రమే అనేది ఒక అపోహ.


Haiku-Expression of a single impression of natural object or a scene without intellectual interuption...


భాషాప్రావీణ్యతకు,పాండిత్య ప్రకర్ష్ వ్యక్తీకరణలకు హైకూ వేదిక కాదు.హైకూ వెనుక ఒక మతం కాని మతం ఉంది. జైన్ మతం.నియమ శృంఖలాల బంధన లేకుండా మనిషికి నైసర్గిక స్వేచ్చను కోరుకునేది ఆ మతం. ప్రకృతితో మమేకం అవడమే ముక్తికి సాధనం అని దాని ప్రతిపాదన. కళ్ళు మూసుకుని కాదు…తెరిచి ధ్యానించు. ప్రకృతి ఉన్నది దర్శించడానికే. నిర్యాణానికి ఇంద్రియానుభూతి ఎంత మాత్రం అవరోధం కాదు.సామాన్య మానవుని కన్నా అసామాన్య అస్తిత్వం మరొకటి లేదు.-ఇదీ ఆ మత సిద్ధాంతం.


హైకూ వరకు వస్తే-ప్రకృతిలో మమేకమయే క్రమంలో దృశ్యానుభవాన్ని తృటి కాలంలో మెరుపులా కవి వ్యక్తీకరించాలి.ఇంద్రియగ్రహణ ద్వారా చైతన్యవాహినిఏర్పడేందుకు మనిషికి కావలసింది కేవలం 17 చిత్తక్షణాలే (thought instants)అంటారు. తొలి దశలో మూడు పాదాల్ని, 17 మాత్రల్ని(syllables) హైకూ లక్షణంగా నిర్ణయించడానికి ఇదే కారణం.





జపనీస్, ఇంగ్లీష్, హిందీ భాషలలో ఉన్న మాత్రాసౌలభ్యం తెలుగుకి లేదు.ఈ మాత్రానియమం వల్ల హైకూ సౌదర్యం కోల్పోయే ఇబ్బంది ఉంది.





ముఖంపై ప్లస్సు


వీపు మీద మైనస్సు


చెయ్యిపై ఇంటూ… దీన్ని హైకూ అంటే భరించగలమా!





దోసిట్లో నీళ్ళు


ముఖచిత్రం కరిగి


కారిపొతుంది… ఇదీ హైకూ.





ఆకాశానికి రోడ్డుకీ మధ్య/చక్రాలు తిరుగుతాయి/అధిక భాగం ఆకాశంలోనే/అంగుళం మేర మాత్రం/అంటిపెట్టుకునుంటుంది నేలని/నా కవిత్వం లాగే…అంటూ తన కవిత్వాన్ని స్థూలంగా నిర్వచించుకున్న మహాకవి ఇస్మాయిల్ తెలుగుకి ఒదగని మాత్రల జోలికి పోకుండా కూడా అద్భుతమైన హైకూలని ప్రకటించారు.





కాళ్ళకి కాళ్ళు తొడుక్కుని


నీళ్ళల్లో నిలుచున్నాడు కుర్రాడు


పై కింది మొహాల్లో ఆశ్చర్యం ఆశ్చర్యం...





తలకి మబ్బూ


కాళ్ళకీ సరస్సూ తొడుక్కోకపోతే


కొండ కొండే కాదు...





పటిక బెల్లమ్ తింటుంటే


పాప చూసి ఆగింది.


దానికి పెట్టాక ఇంకా తీపెక్కెంది బెల్లం...





కవికి స్ఫురించిన మెరుపును మూడు పాదాల్లో ఇలా హృద్యంగా అందించడమే హైకూ లక్ష్యం. మేథో ప్రమేయం లేని జ్ఞాన జ్యోతే హైకూ కవిత ఆంతర్యం.


మామూలుగా కవి అంతగా స్పృహలో లేని ధ్యాన దశలోనె గదా హైకూ వెలువడేది! మితిమీరిన మేథో ప్రదర్శన హైకూ సౌందర్యాన్ని చెరుస్తుంది. వేరే కవిత్వం రాసే వేళ అలవాటుగా చేసే హంగామా హైకూ కవిత్వం రాసే సమయంలో ప్రదర్శించడమే చాలా మంది కవులు చేసే పొరపాటు.





భిన్నత్వం విశ్వజనీన గుణం.ఓ భావ జాలంతో ఏకీభవించ వచ్చు.విభేదించవచ్చు. కానీ ఒక స్థిర భావం నుంచి మొలకెత్తిన రూపాన్ని అదే పేరుతో రసాభాస చేయడం అన్యాయం.అది పేరడీ మాత్రమే అవుతుంది.


హైకూను మరొ విధమైన మినీ కవితా ప్రక్రియగా భావించడం కూడా దుర్ వ్యాఖ్యే.





అందరం గుర్తుంచుకోవలసింది…హైకూ కవిత ఆత్మకు ప్రధాన రూపం(Form) కాదు. విషయం(content) మాత్రమే.





"The flame of life lies in the heart of each passing second"


జెన్ బౌద్ధపు ఈ చైతన్య దీప్తే ... హైకూ


(నరేష్ నున్నా-"కొట్టివేతలు…దిద్దుబాట్లు" వ్యాస సంకలనంలోని 'హైకూ-ఒక ధ్యాన మార్గం'-స్ఫూర్తితో)

రియాజ్||‎**** ‎**** There 'is'||


There is no critical thoughts
no quest .. no cofliction
no rush design of sounds
no logic .. no analasys
Because there is 'Ilayaraja's music'

There is no romance
no dilemma absurdity no fancy impression
no weak corrupted emotion
Because that is Sri Sri's poem

There is no inferiority complex
no fear of stage
Every particle showed his super consciousness
There is Jackson Dancing

There is no will no Humanism
Only..
Filled with racism fasism factionism tribalism sadism......ism?! ...Riya

                  .....
*25.7.2012

రమేష్ హజారి కవిత


చాయి..చాయమ్మా చాయి ..
నిన్ను తాగినంకనే మనసు హాయి
ఇరాను కేఫులెంట బోయి
ఎలిగిత్తివి సిగిరెట్టు బాయి
యిగ చెప్పుతాంటే ముచ్చేటంత నోయి
గంటకింత పెర్గునంట సోయి
సుట్టమొత్తే వుల్లెనయితే భాయి
తాల్లల్లకు తోలుకేల్తి మొయి
పట్నంల దోస్తులోత్తే నోయి
పది రూపాలతో పనిఎల్లును చాయి
బగర్ ఉమ్లి పాని తాగి నంకా
ఏక్ మే దో చాయి దాగుతింక
సోర్గమే కండ్లముందు దునుకా
యెవ్వడు కనిపెట్టే నిన్ను గాని
చెయ్యకుంటే రోజేల్లదు నిను బోని
కడుపునిండా లేనప్పడు బువ్వ
నిన్డుతావే మాకడుపునిండా అవ్వా
విప్లవాలు పూసెనే నీ సుట్టు
నక్సలైట్ పుట్టెనే నిను తాగి
గరీబోల్ల గాజు గలాసులంట
నీ అద్దాల రాణివాసమంటా
ఎంతసేపు జెప్పినా చాయి
తీరదు నీ ముచ్చటంతా హాయి ......
---పోటో పెట్టి టెంప్ట్ చేసిన ..భరత్ భూషణ్ గారికి ధన్యవాదాలతో
     .....
*25.7.2012

రఘు మందాటి కవిత


జీవితమా.. నువ్వు భాహు చిత్రం సుమీ...

చూస్తుండగానే ఎన్నో చిత్రాలని చూపిస్తూ, అనుదినం పాయలుగా చీల్చుకుంటూ,

అనుక్షణం అనుభూతులు లోయలను తవ్వుతూ, ఆలోచనల తీరాన్ని ఉవ్వెత్తున ముంచేస్తూ,

అనుబంధాల కెరటాలని గమ్మత్తుగా మాయం చేస్తూ,

మనసు గాయాల కన్నుగప్పి మత్తుగా ముసుగు చీకట్ల వాకిట్లోనుండి మరో కొత్త ఉదయాన్ని కోరుతూ ఆగని నీ పయనానికి గమ్యాన్ని నిర్దేశించానని అనుకోవడం నా భ్రమే...

నువ్వు నా సొంతమో లేక నేనే నీ భానిసనో ఏమో..

ఎటు తేల్చుకోలేని సందిగ్ధంలో ఈ కీలుబొమ్మ..
*25.7.2012

కుమార వర్మ కవిత


అలా విసురుగా ఓ గాలి కెరటం
ముఖంపై చరిచి
కాసింత సేదదీరమంది...

వేల అడుగుల ప్రయాణంలో
ఈ మజిలీ మరల
ఊపిరి తీసుకోనిస్తుంది...

పొద్దంతా తిరిగిన సూరీడు అలసి
పడమటింట యింత ఎరుపు
రంగు పులమగా ఆకాశం సిగ్గుపడ్డది...

పారే సెలయేటి ఒరిపిడి
రాతి పాలభాగంపై
యింత నునుపుదనం అద్దింది...

రాలిన పూలతో రహదారంతా
రక్తమోడుతూ కన్నపేగు
ఆర్తనాదమౌతోంది...

ఒకదానికొకటి అతకని అక్షరాలతో
అసంపూర్ణంగా విరిగిపోతూ
భావం దుఃఖ రాగమయింది...

రాయలేనితనంతో కవి గుండె
ఎండి పోయిన
కట్టెల వంతెనయ్యింది......

కాసింత ఆ గాయానికి
నీ వేదో మంత్రమేసి
నెమలీకతో పలాస్త్రీ పూయవా?
    .....
*25.7.2012

పులిపాటి పరమేశ్వరి || ప్రేమలో.. ||

చినుకై రాలిన ప్రతిక్షణం
మనసు దోసిట ముత్యమై...

తన తలపులతో తనువు
తహతహల తామరై...

నే రాసిన లేఖలు నింగికెగసి
మెరిసెను ఇంద్రధనసై...

*25-07-2012

అనిల్ డాని కవిత



హే డూడ్ విల్ యు హెల్ప్ మీ ఫర్ థిస్
ఓహ్ ష్యూర్ బ్రో, బట్ వాట్ ఇస్ థిస్
యు డోంట్ నో ఇది మన కంట్రీ ఫ్లాగ్
హో సారీ బ్రో చూడలేదు అవును కదూ

ఏంటి ఇలా నలిగి పోయింది పాతదా ఇది
అవును ఎప్పుడో అరవయ్యేళ్ళు నిండాయి
అరె కలర్ కూడా మారింది బ్రో
మారదా మరి ఒకరా ఇద్దరా
ఎవరికీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తోక్కేస్తే, ఎవరు?
ఎవరా ? మనోళ్ళే మన నాయకులే

అప్పుడెప్పుడో భోఫోర్సు ,యూరియా
గడ్డి కూడా తినేశారు ,టెక్నాలజీ
పెరిగింది గా ఇప్పుడు టూ జి అంటా
బెయిలు కి వంద కోట్లు డీల్
భారత దేశం ఎదిగిపోయింది
జాతీయ జెండా నలిగి పోయింది

వారసుల రాజకీయం
మంత్రుల తంత్రాలు
తెల్లోడే నయం తోలేతీసాడు కొరడాతో
ఈ నల్లోళ్ళు ప్రాణాలే తీసేస్తున్నారు

నియంతే నయం స్వేచ్చకంటే
తుపాకీయే నయం హితబోధకంటే
ప్రజలకి కాదు, మన నాయకులకి

నిజమా బ్రో ......................?
అమెరికా డాలర్ల మత్తులో
చదువుకున్న యువత
ఇక్కడున్న వాళ్ళేమి దేశ భక్తులు కారు
ఐతే రేవ్ పార్టీ లేదా పబ్బు మందు
మిగిలిన వాళ్ళు మామూలే దేశాన్ని
నాయకులని తిట్టుకుంటూ

మనం ఏమి చేయలేమా బ్రో
లేదు, మార్పు రావాలనే వల్లే అందరు
అందుకు సహకరించే వారు ఎందరు
దేశాన్ని మింగేస్తుంటే ఏమి చేయలేకున్నాం
కనీసం పడిపోతున్న ఈ జండా అయినా
భుజనికేత్తుకుందాం

నాయకుల మాయలో పడకుండా
నూతన దేశాన్ని నిర్మించుకుందాం
చేయి చేయి కలుపుదాం
దేశాన్ని కాపాడుకుందాం
.....

*25.7.2012

పులిపాటి పరమేశ్వరి హైకూలు

పూజించాయి
నాగేటి చాళ్ళను
వర్షపు నీళ్ళు...


చుక్కల్లో
చిక్కిన కళ్ళు
ఎప్పుడు నిద్రించాయో...

అవని ఆకాశాలనేగాని
నక్షత్రాలను మూయలేని
చీకటి...

ఇళ్ళంత వర్షమయం
చూరు అంతసేపని
దోసిలి పడుతుంది...

జారిపోతూనే
ఆకాశపు వంపులో
రోజూ సూరీడు...

_పరమేశ్వరి పులిపాటి.

జయశ్రీ నాయుడు || *క్షణకాలం* ||


వెన్నెలంతా.. వాన జల్లవుతున్నట్టు

నన్ను నేను ఓ దూరంలో మెరుపవుతున్నట్టు

కనిపించని కాలంలో కనిపించేదేమిటి

క్షణకాలం మూసిన కళ్ళ చీకటి..

అలవాటు చేసుకోవాలి..

మెరుపల్లే మెరిసే ఆనందాలు

చీకటితోటి చిత్తరువులు...
*25-07-2012

పెరుగు .రామకృష్ణ || దిన చర్య..! ||

ఒక సాయంత్రం
నల్ల సముద్రమైపోయాక
తన ఉద్యగం లోంచి ఆమె
నా ఉద్యోగంలోంచి నేను
బైటికొచ్చి వొడ్డున పడ్డాక తీరిగ్గా కలుసుకుంటూ
చీకటి సముద్ర తీరం మీద జంట
పక్షులమై రెక్కలార్చి కూర్చుంటాం ....

వాళ్ళ ఆఫీసు కబుర్లతో ఆమె
నా దిన చర్య గూర్చి నేను
బతుకు ఫైళ్ళు తెరుచుకుంటాం

అవసరాల గురించి కొంచెం
ఆనందాల గురించి కొంచెం
కొన్ని దిగుల్లై పోతాం
కాసిన్ని చిరునువ్వ్లవుతాం
జారుతున్న చీకటి యవనికలా
ఆలోచనల కెరటాల మై పోతాం

కబుర్ల కలనేత ముగిసాక
ఒక చానల్లో సీరియల్....
మరో సిడి లోంచి హరిప్రసాద్ చౌరాసియా
అలా గాలిలో ప్రవహించాక
ఆమె కునుకులోంచి మత్తులోకి జారుకుంటూ ..
ఆమె శ్వాస నా చాతి పై పాములా పాకుతూ ....
నన్ను గుండెలకు హత్తుకుని గాడంగా నిద్రిస్తుంది ..!

ఉదయం నుంచి నా లోపల...లోలోపల
అల్లరి చేస్తూ ఆలోచిస్తూ ,ఆక్రోసిస్తూ ఆవేసిస్తున్న
ఓ పద్యం అప్పుడే మేల్కొని
యిక రాత్రంతా నిద్ర పోనీకుండా చేస్తుంది ..!!
నన్ను ప్రసవ వేదనకు గురిచేస్తుంది...
*25-07-2012

కె. కె. ||గజల్||

పెళ్ళీనాటి జ్ఞాపకాల మల్లెలు, దాచుకో ఒక్కొక్కటే!
అందమైన అనుభవాల మువ్వలు, కూర్చుకో ఒక్కొక్కటే!!

ఊగే జుంకాలతో, విసిరే అరనవ్వుతో.. కళ్ళుచేసే బాసలెన్నో
పెళ్ళిచూపుల నాటి మాటలు, పంచుకో ఒక్కొక్కటే!!

ఆశీర్వచనాలతో, ఆనందపు నీళ్ళతో, కన్నవారి కళ్ళ కాంతులెన్నో
మార్చుకున్న తాంబూల గంధాలు, ఎద రాసుకో ఒక్కొక్కటే!!

తెరచాటు మాటున అరచేతులు ఉంచిన, అక్షింతల జల్లులెన్నో
మంత్రాలు ముడివేసిన ఘడియలు, తలుచుకో ఒక్కొక్కటే!!

అరమోడ్పు కన్నుల బిడియాల మాటలు, పూల మాటు గుస,గుసలెన్నో
పంచుకున్న తమలపాకు చిలకలు, నెమరేసుకో ఒక్కొక్కటే!!

ఆరుపదులు దాటినా కోదండ, ఆరని సుగంధమేలే ఈ ప్రేమ
మనసులు శృతిచేసుకున్న గీతాలు, పాడుకో ఒక్కొక్కటే!!

( ఒక పెద్దాయన షష్టిపూర్తి సంధర్బంగా రాసిన గజల్ ఇక్కడ మీ కోసం... )

జాన్ హైడ్ కనుమూరి || అంబులెన్సు అనుభవం ||

రయ్... రయ్... రయ్... రయ్...
వోయ్... వోయ్... వోయ్... వోయ్...
తప్పుకో ....తప్పుకో ....తప్పుకో ....తప్పుకో ...అన్నట్టు ఒకటే రొద

పొంగి పరవళ్ళుతొక్కే గోదారిని ఈదుతున్నట్టు
ప్రవాహపు ట్రాఫిక్ రహదారుల్లో తోసుకుంటూ
గమ్యానికి అతివేగంగా రోగిని చేర్చాలని
ఓ డ్రైవర్ తాప్రత్రయం

ఇరుకు ఇరుకు నగర ట్రాఫిక్ మధ్య ఎవరికి వారు దారిస్తూ
ఎవరున్నారో
ఏమిజరిగిందో అనుకుంటూ
ఆత్రంగా తోంగిచూసే కళ్ళు
ఏమీ కనబడలేదనే నిరుత్సాహం
దారిన పోతున్న వాళ్ళకు
వారి వారి అనుభవాలను తవ్వితీస్తుంటాయి

* * *

ఎమి జరగనుందో
ఏమీ చెబుతారో ఒకటే ఉత్కంఠ

అంబులెన్స్ అంటే
ఎగిరిపోతున్న ఆయువును హస్తాల్లో పట్టుకొని
రిలే పరుగు పందెం కోసం పరుగెడుతున్నట్టే

ఏది సుఖాంతమో
ఏది దుఖాఃంతమో
ఎవ్వరికీ తెలియని ఓ వింత పరుగు


( నలతగా వుందని ఆసుపత్రికి వెళితే అంబులెసు ఇచ్చి వేరే ఆసుపత్రికి పంపారు..... ఆ అనుభవంనుండి)
*25-07-2012