పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, జులై 2012, గురువారం

పులిపాటి గురుస్వామి || తర్జుమా...||

నీ దుఃఖపు చుక్కలు
నాలోకి ఇంకితే
మౌనం మొలకెత్తినా
మనసు తడి ఆరదు

గిరి గీసుకొని
కవచం లోపలికి జారుకుంటాను

గవ్వగా
ఆడుకోవచ్చు

అది నా ఎండిన ఉనికి
*19-07-2012

రఘు మందాటి || అపురూపం ||

అపుడే జన్మించిన శిశువు అరుపు అపురూపం
పుట్టిన శిశువుకి మెత్తని అమ్మఒడి అపురూపం
ఉదయించిన సూర్యోదయంలో విరిసే గాలి అపురూపం

అపుడే రెక్కలు తెరుచుకొని గర్వంగా విరబూసిన మందారం అపురూపం
అందంగా ప్రకాశవంతమై నగ్నంగా కన్పించే ఆ గులాబీ పువ్వు అపురూపం
చల్లగా సేద తీరిన మేఘం నుండి వచ్చిన మొట్టమొదటి ముత్యపు చినుకు అపురూపం

గొంగళి పురుగు నుండి అందమైన సీతాకోక చిలుకల మారే తీరు అపురూపం
అందని అందమైన హరివిల్లులో ప్రకాశవంతమై కవ్వించే ఆ రంగుల సంద్రం అపురూపం
మనసు బాధని చల్లార్చి ధైర్యం చెప్పి ప్రోత్సహించే స్నేహం అపురూపం

ప్రతిక్షణం రంగులు మార్చే ఆ సూర్యాస్తమయం అపురూపం
సుధూర దూర తీరాలలో నుండి కమ్మగా వీచే చల్లని గాలులు అపురూపం
తెలియని మనస్సులో దాగిన ఊహలు అపురూపం

కదలాడే ఆ కళ్ళలో కనిపించకుండా కదిలే మౌన భావాలు అపురూపం
భువిలోని సప్త సముద్రాలలో పొంగే నీరు అపురూపం
నీటిలో ఒకదాని వెనుక ఒకటి నెమ్మదిగా సాగే అలలే అపురూపం

ఈ లోకంలోని ప్రతి అందం అపురూపం
అన్నిటికి మించిన మనవ జన్మ అపురూపం
అందాలన్నీటినీ ఆస్వాదించే అందమైన మనసు అపురూపం

ఈ క్షణలన్నిటిని ఒకటి కూడా వదలకుండా చూసే కనులు అపురూపం
నవరసాల సమ్మేళనంతో కూడిన జీవితం అపురూపం
జీవితాన్ని సృష్టించిన ఆ దైవం అపురూపం

ఆ దైవాన్ని మించి ప్రేమను పంచే అమ్మ అపురూపం..
*19-07-2012

జయశ్రీ నాయుడు || నిజం - నైజం ||

రోజంతా ఎక్కడ నక్కి వుంటాయో..
బస్సు హారన్ల లోనో..
ఆలోచనల అంగళ్ళలోనో..
ముందూ వెనుకలు లెక్కించని
అడుగుల ఆతృతల ధూళిలోనో..

ముక్తసరి పలకరింపుల్లోనో..
మొఖమాటపు మౌనాల్లోనో..
కాగితపు పూల వంటి కరచాలనాల్లోనో..
ప్రవాహమై సాగే లౌక్యపు ఘడియల్లోనో..

ఎక్కడో..
లోలోనే వుంటూ..
అన్నీ చూస్తూ..
అన్నిటా విస్తరిస్తూ..

ఒక నవ్వుగా..
ఒక పిలుపుగా..
ఒక హెచ్చరింపుగా
ఒక వెన్ను చరుపుగా

నా వెంట నాతోనే
ఆలోపలే నాలోనే..
ప్రపంచాన్ని ఈది..
సందెవేళై ఒడ్డు చేరిన వేళ

తనను తానే మీటుకునే సితారులా
మాటలన్నీ చేరిన మౌనంలో
అద్దం తుడిచి ముఖం చూసుకుని..
స్పష్టంగా కనిపించే
నేనుని చూసి..

ఇదా నా నిజం
ఇదా నా నైజం
ఎన్నిసార్లు విస్తుపోయాను..

నేనో కరుకు హృదయాన్ని
నేనో కసాయిని
నేనో విస్తరిస్తున్న మలినాన్ని
నేనో అసహనాన్ని

యేదైనా యేమైనా
ఈ నేను నాదే
నైజంలోని నిజం
గడ్డకట్టిన బాధల ఖనిజం

ఇరుకు సందుల్లోంచి
విశాలత్వం వైపు చూపు
అడుగుల్లో ఆర్ద్రతల మళ్ళింపు
ప్రతి సాయం సంజెల్లో ఇస్తుంటా
మానవత్వపు సలైన్

రాత్రి నిద్రలో
కలలాంటి బుద్ధత్వం
నరాల్లో ఇంకి
కొంతైనా ఒలకక పోతుందా
ప్రతి ఉదయం.
*19-07-2012

అనిల్ డాని || అట్టా కసరకు సారూ...... ||

మీరిచ్చే రూపాయిలు రెండు కడుపులు నింపుతాయి
ఒక్క పూట కూడా బువ్వ లేక నా బిడ్డ తల్లడిల్లుతుంది
గుక్కెడు నీళ్ళు తాగాలంటే రూకలివ్వాల్సిన రోజులివి
ఒక్క రొట్టె ముక్క తినాలంటే ఒక్క పూట పని చేయల
నట్టేట్లో ముంచేసి పోనాడు నా ఇంటోడు, ఏం చేయను
నడి రోడ్డే ఇల్లైంది నాటి నుంచి,నాకు తోడూ ఓ పిలగాడు
నారు పోసిన దేముడు నీరు పోయడం లేదు
అందుకే బాబయ్య తమరిచ్చే రూపాయే దిక్కు
అట్టా కసరకు సారూ....తమకి పుణ్యం వుంటది

నిసత్తువ ఆవహిస్తుంది నీరసం తో
మనుషులే అనుకున్న ఆ సూరీడు
చూపుతున్నాడు తన పెతాపం మా మీద
నిలువ నీడ లేదు కదా మాకు ఈ భూమిమీద
మీరు కసిరితే యాడకు బోతాం సారూ
మరో అయ్యకాడికి పోవాల యాచించాల

పిలగాడి మొహం చూడు సామి
సదువు సంద్యలోద్దు ఈడికి
పెపంచ గేనమూ వద్దు
బువ్వ గావలె ఈయాల ఆడు తింటే
రేపు నాకు బువ్వ బెడతాడు సామి

అట్టా కసరకు సారూ......
*19-07-2012

జ్యోతిర్మయి మళ్ళ || క్రానిక్ డిసీజ్ ||

అదేపనిగా ఒకేపేరు ఉచ్ఛరించడం
పదేపదే అదేరూపు నిదుర చెడగొట్టడం
మళ్ళీ మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడాలనుకోవడం
ఒక్క సారైనా ఎలాగోలా కలవాలనుకోవడం
ఇలాంటివే ఇంకా ఎన్నో...ఇండికేషన్స్

అపుడపుడూ శరీరం స్వాధీనం తప్పడం
ఉండుండీ మెదడేమో మొద్దుబారడం
రాను రానూ మనసేమో వశం తప్పడం
ఇంచుమించు ఇహపరాలు మర్చిపోవడం
ఇవికాక మరెన్నో... సింప్టమ్స్

ఇదేదో జబ్బేమోనని ఎవరో చెబితే
మంచి డాక్టరని నమ్మివెళితే
పల్సు చూడలేదు పిల్సూ ఇవ్వలేదు
కళ్ళజోడొకసారి పైకెత్తి నావైపు
తెల్లబోయి చూసిందా తెల్లకోటు
కళ్ళు మూసుకొనుండిపోయి కాసేపు
తెల్లకాగితం చూపాడు ప్రిస్క్రిప్షనంటు

అటుఇటు తిప్పిచూసా ఏమీలేదు
తెల్లబోవడం ఇపుడు నావంతు
ఆనక ఒక చీటీ ఇచ్చాడు
అక్కడ రాసుందిలా..

"ఆఒక్కటీ అడక్కు ప్లీజ్
తెలిస్తే నేనే నయం చేసుకోనూ
ఇరవయ్యేళ్ళ నా ఈ

క్రానిక్ డిసీజ్ ?"
(మొన్నొకరోజు ఎక్కడో చదివా లవ్ చెయ్యడం అనేది ఒక సివియర్ డిసీజ్ అని..దాని ప్రేరణ ఈ కవిత)

సత్య శ్రీనివాస్ || పొద్దు పోని కాలం ||

నా
ఉఛ్వాశ నిఛ్వాశ
నడుమ
రాత్రింబవళ్ళ
నిట్టూర్పు

*19-07-2012

వంశీధర్ రెడ్డి || ‎ప్రెజెన్స్ ఆఫ్ ఆబ్సెన్స్ ||

రాయడానికి పదాల్లేక,
పలకడానికి మాటల్రాక,
ఏదో చెప్పాలనున్నా
చెప్పలేనిదేదో ఆపుతుంటే,
ఎన్నో అడగాలనున్నా
అడగరానిదేమో అనిపిస్తుంటే,
ఇక చాలాపని, చాలా పనున్నట్టు మనసరుస్తుంటే,
ఏమిటో తెలిసేలోపే,
కొంటె నవ్వుతో కంటనిలుస్తూ

పోల్చలేని పోలికలతో,
పట్టుపడని పీలికలుగా,
పాలుపోని పిచ్చితనాన్ని,
చూసీ చూడనట్టొదిలేసి,
చూడకున్నా, చూసారెవరే అని తలపించే,
వెన్నెల నీడలో, జాడవెతికేలొపే జారిపోయి,
కానలబాటలో తోడుకుదిరేలోపే దూరమౌతూ....

ఇంకా ఆపలేదా
అని తెలివి ఉరుముతుంటే,
ఎలా ఓపగలవని
నాటి చెలిమి తరుముతుంటే,
ఏదో చూపాలనున్నా
చూపు వెనక్కి లాగుతుంటే,
ఎన్నొ అడగాలనున్నా
అడుగేయలేనేమో అనిపిస్తుంటే,

అలవాటు లేని "అల"
అలా వాటేసినట్టవ్వగా,
కలకాలపు కలకలం "కల"
కాలమే అనుకుంటూ,
రాయడానికి పదాల్లేక,
పలకడానికి మాటల్రాక....
*19-07-2012

జగతి జగద్దాత్రి || టాటా!! కాకా!!! ||

 ఎందరి మదినో
దోచిన రసరాజువి
జీవన పోరాటం లో
గెలిచావో ఓడావో...మరి
కొన్నేళ్ళు మగువల మదినేలిన
కన్నెల కలలేలిన యువరాజువి
వెండి తెర మిస మిసలలో
నీ భావనా తరంగాలను
చూసిన వారము
నిన్ను ఆరాధించిన
ప్రేక్షకులం ....
ఈరోజు ఇక నీవు లేవు
నీ భౌతిక దేహం
రేపటితో సమాప్తం
అయినా అందరి హృదయాలలో
ఓ ఆరని జ్ఞాపకం
నీ తాత్విక చిరునగవు
"సాఫల్యం గమ్యం కాదు
సుదీర్ఘ పయనం "
అన్న నీ మాట
భావి తరాలకు
నీవిచ్చిన స్ఫూర్తిదాయక
ఆశీర్వాదం ...
బాబు మోషాయ్!! కాకా!!
టాటా!! చీరియో ! ఈ జన్మకు మరి !!!
( నేడు భౌతిక దేహాన్ని చాలించిన ప్రసిద్ధ నటుడు రాజేష్ ఖన్నాకు స్మృత్యంజలి )
*18-07-2012

వర్ణలేఖ కవిత

వానొస్తే
నువ్వొచ్చినట్టే
కారు మబ్బులు
కమ్ముతుంటనే
నీ జ్ఞాపకాలు
నా మదిలో
కారుతుంటవి

నేనేఇంట్లవున్నా
గండిగూట్ల నుండి
చినుకువై నను తాకుతవ్
నిను ముట్టుకోని
నా చేతిని అపురూపంగ
నేజూస్తుంటే

ఇంటెనకనుండి
అమ్మ అరుపు
నీవు నన్ను చేరకుండా
వాటిని కప్పిరమ్మని
విసుక్కుంటూనే
నీవు నన్ను చేరే
మార్గాలు మూద్దామని

గుమ్మమ్ముందో
నిచ్చెనేసుకుని
పైకెక్కుతున్నా
నీవలా నన్ను
నిలువరిస్తుంటే
నేనీలో చేరడానికి
ఎగబాకుతున్నా
నిచ్చెన మీద

నా కాళ్ళల్లజేరిన
మట్టిని నీవు
సుతారంగ కదిగేస్తావు
మిద్దెమీద.
మినుకు మినుకున
నడుస్తా నిన్ను
ఒదలబుద్దిగాక
అమ్మకుదెల్వదు
నేనొచ్చేది నీలో
తడవడానికని

నా గదిలోకి రాకుండ
మూతవెట్టినగాని
నా మదిలోకి రాకుండ
ఏంజేయాలని ఆలోచిస్తా
తలదూడుస్కుంట

చూరుకుజేరిన
నీళ్ళసుక్కల్ని
లెక్కజేస్తున్నా
నువ్వొచ్చినంక
ముట్టజెప్పొద్దు
ముచ్చట్లన్నీ

వర్ణలేఖ
*17-07-2012

జాన్ హైడ్ కనుమూరి || రాజేశ్ ఖన్నా ||




ఒక దేహం కనుమరుగౌతుంది
కాలంలో తీపి జ్ఞాపకాలే తెరపైకొస్తాయి

జిందగీ ఎక్ సఫర్ హై సుహానా
నాటి నాల్కలపై నడయాడిన గీతలహరి

జ్ఞాపకం రైల్లో ప్రయాణిస్తుంటుంది
తలపు రోడ్డువెంట రైలును వెంబడిస్తుంది

సన్నని మౌతార్గాన్ సంగీతం
పెదాల్లోంచి చెవుల్లోకి ప్రవహిస్తుంది


షర్మిలా, హేమ, ఆశా, ముంతాజ్
ముచ్చటైన అభినయ జంటలై అలరిస్తుంటారు

లోకులు ఏదొకటి అంటుంటే
ఎవరి మాటలు వారికే వదిలేసిన జీవితం

అచ్చా తో హమ్ చల్తే అంటూ
మళ్ళీరాని చోటు వెదక్కుంటూ ఊపిరి

ఆరాధించిన కళ్ళూ, మనస్సు
అలరించిన చిత్తరువెంట పరుగులు తీస్తుంది

పల్ పల్ దిల్‌కే పాస్
కుచ్ బాతే .. ఉన్ మే సె కుచ్ యాద్ రహజాతేహై!
*18-07-2012

కట్టా శ్రీనివాస్ || ఛా... బిస్కట్లబ్బాయి.||

ఓ గుర్తింపుల
సభా తటాకంలో
కొన్ని కప్పలూ, మరికొన్ని చేపలూ..
లొడ లొడ లాడుతూ,
ఈదు లాడుతున్న వేళ
మెత్తటి కాగితప్పడవలా
అలజడేం లేకుండా చోచ్చుకువచ్చాడతడు.
అభిమన్యుడై

తన మొహంలో ఏ తహ తహా లేదు.
తన తాహతుకు తగ్గ విధి నిర్వహణ తప్ప.

అస్తిత్వాన్ని సమస్టిలోనే స్థాపించి,
అలసిన మెదళ్ళకు సాంత్వన చేకుర్చేందుకు,
తానే ఒక
తామరాకు పై కన్నీటి బొట్టైకదులుతున్నాడు.

పేరేమిటో, ఊరేమిటో, మరేం చదివాడో
తిన్నాడో,లేదో మదివున్నవాడో కాదో.
అనవసరాంశం సభాంశీభూతాలకు,

సభనుంచి చెదురుతూ ఓరగా అతనికై
వెతుకులాడే చూపులకు ఆ మొహం మాత్రం దొరకదు.

ఇతడు
తన కదలిక అలజడి కాకుండా
వంగి వంగి అలలేవీ రాకుండా ఈదులాడుతున్నాడు.
జితేంద్రియత్వం సాధించిన మునిలా
మౌన ముద్రను వీడకుండానే విధినిర్వహిస్తూ

ఇంతకీ నీకంటే సభాసదులే మేదావులా ?
ఇంత గాంభీర్యాన్ని తేన్చుతున్నందుకు..
17-07-2012