చదివిన కవిత్వ సంపుటి :-22 (కవి సంగమం ) ---------------*--------------- చదివిన కవిత్వ సంపుటిని పరిచయం చేస్తున్నది :- రాజారామ్.టి చదివిన కవిత్వ సంపుటి పేరు :- "దర్దీ" (షాజహానా కవిత్వం) కవిత్వ సంపుటిని రాసినది :- షాజహనా " తెలుగు కవిత్వానికీ ఒక నజరానా -బాధా దుఃఖ కవిత్వాల ఖజానా షాజహానా " *****---********** ***********---***************** ప్రయాణాల్లో కవిత్వపు సమాధి అవస్థల్లోకీ వెళ్ళటం కొందరు కవులు, కవయిత్రులు చేస్తూవుంటారు. దేవీప్రియ గారు విమానపు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ అనుభవాన్ని కవిత్వపు ఊహల్లోకి అనువదించాడు."ఆకాశం చెట్టుకీ కట్టిన అద్భుతమైన ఊయలలా వుంది విమానం"-అని వొక గొప్ప భావకుని ఊహని మనకు పరిచయం చేస్తాడు దేవి ప్రియ గారు.కవయిత్రి షాజహాన తొలిసారి విమానమెక్కినప్పుడు తనకు కలిగిన ఊహావేశాన్ని ఎంతో గొప్ప ఊహతో చేసింది అని చెప్పడానికి నాకు ఎలాంటి సందేహం లేదు.విమానం లోంచి బయటకు చూస్తే ఈ ప్రపంచం ఎట్లా కనిపిస్తొందో అట్లా తనో మనో ప్రపంచంతో దర్శించి"కిటికీల్లొంచి చూస్తే వాటర్ ట్యాంక్ లన్ని పుట్టగొడుగులే/కుబుసం విడువని పాముల్లా /సూర్య కాంతిలో లోహం ప్రవహిస్తున్నట్లు సన్నని గీతలుగా నదులు"-అని "ప్రాణవాయువు" అనే కవితలో చెబుతుంది.ఒకసారి ఈ పంక్తుల్లోని ఊహని ఊహిస్తే కవయిత్రి ఊహా శాలిత్వం అర్థం చేసుకోలేమా? చిన్నప్పుడు తుమ్మిసల్ని పట్టి గాల్లోకి వదిలే కవయిత్రి తనను పట్టుకొన్న పెద్ద తుమ్మెద విమానం అని ఊహచేయడం చదువరులకు ఒక కొత్త వూహను కలిగిస్తుంది అని అనిపించకపోదు.తాను దర్శించిన వస్తువు రూపాన్ని,లేదా దాని తత్వాన్ని చదివేవారికీ ఎంతో నిపుణతతో స్పురింప చేసే శిల్పచాతుర్యం వున్న కవయిత్రి షాజహానా అని నేనంటాను.ఈ మాట అనడానికీ ఈవిడ రాసిన "దర్దీ" కవితా సంపుటి వొక్కటే చాలు. అపుడెప్పుడో 'ఆకు రాలే కాలం" రాసిన కవయిత్రి మహజబీన్ వొక దుఃఖపు తడిని,ఆర్ద్రతని కాల్పనిక భావ సంచయంతో అందిస్తే ఇప్పుడు షాజహానా తన వారి యొక్కముఖ్యంగా ముస్లిమ్ మైనారిటీ మహిళలయొక్క 'దర్దీ"నీ తన కవిత్వమంతా పొదిగీ ఒక సాంబ్రాణి ధూమం లా ప్రతి చదువరి ఎదలోకి వ్యాప్తమయ్యేలా సృజన చేసిన చేస్తున్న కవయిత్రి షాజహానే. విమానంలో ప్రయాణించే సమయంలో ఏ కవైనా చేసే ఊహలు సాధారణంగానే వుంటాయి.షాజహానా విమానంలో పోతూ"బయట అకాల వర్షం../గాలికి పగిలిన పత్తికాయలు కొట్టుకొచ్చినట్టు/కుప్పలుకుప్పలు దూదిలా/ మబ్బు పరుచుకొంది చుట్టూ..!/లోపల పంట కోల్పోయిన రైతులా నేను'-ఈ మాటలు చాలు షాజహానాను మిగిలిన కవులకు కన్నా భిన్నమైనది అని చెప్పడానికీ.విమానంలో పోతున్నప్పుడూ కూడా తన నేల తల్లి పరిమళపు శ్వాసను ,తన నోటికి ఇంత ముద్దనందిస్తున్న రైతన్న విషాదాన్ని మరచి పోని గుండె లక్షణం ఈ కవయిత్రిలో ఉండటమే ఇతర కవుల కన్నా భిన్నమైనది చెప్పడాని కారణం. అంతులేని మానసిక వేదన వల్ల కావొచ్చు,నిద్ర లేమివల్ల కావొచ్చు లేదా పోషకాహార లేమి వల్ల కావొచ్చు అసంఖ్యాక స్త్రీల కనులకింద గుంటల్లో నల్లని వలయాలు ఏర్పడి,ఆ నలుపు వలయాలు వాళ్ల ముఖ బింబాల్ని ప్రకాశ రహితంగా మారుస్తాయి.తన అమ్మీ కళ్ళ కింద కూడా నల్లని వలయాల చారికల్ని చూసిన కవయిత్రి "కనిపించని మాంత్రికుడెవరో కళ్ళక్రింద మసి పూసినట్లు"వున్న నల్లని మేఘాల్లాంటి వాటిని "బ్లాక్ హోల్స్" అని ఈ కవితలో అంటుంది."బ్లాక్ హోల్స్" అనే మాట శాస్త్ర అంశానికి చెందింది."black holes swallowed the missings" అని బ్లాక్ హోల్స్ గురించి స్థూలంగా చెబుతారు. మగువలమనసుల్లోనిరంతరంమెరవాల్సినఆశలు,ఆనందాలు,ఆహ్లాదాలు miss అయి బతుకు ఆకాశంలో ఈ కళ్ల కింద గల బ్లాక్ హోల్స్ చే అవి మింగబడ్డయేమో,అందుకే బ్లాక్ హోల్స్ అలా వున్నాయేమో అన్న భావనను కవయిత్రి తన కవితకు పెట్టిన ఈ బ్లాక్ హోల్స్ అనే ఈ శీర్షిక వల్ల స్ఫురణకు తీసుకొస్తుందికవయిత్రి. తన అమ్మీ కళ్ళకిందవున్న బ్లాక్ హోల్స్ నే కాదు తన అమ్మీలాంటి ఎందరో అమ్మీల కళ్ళ కింద వున్న నల్లటి చారికల్నీ "ఏ యుద్ధాల నల్లని నీడల్లో ఏ డేగల రాబందుల గోళ్ళు గీసిన గీతలు"-గా గుర్తించిందిషాజహానా.జీవన క్లిష్టతను వ్యక్తం చేస్తూ నిద్రను రాత్రికి అప్పగించి చీకటై మేలుకొనే తన అమ్మీని ఎంతో దుఃఖాత్మకంగా కవయిత్రి చిత్రిక పడుతుంది. మనసును వెన్న పూసగా మార్చి ఆ బ్లాక్ హోల్స్ కీ మందుగా పూసి ఆ కళ్ళు మిల మిలా మెరుస్తుంటే చూడాలనే ఆశను కలిగివుండటంమంచి కవిత్వ లక్షణం. చీర మొత్తానికి,లేదా చీర అంచులకు చెరుగులకు శొభను చేకూర్చడానికీ చమ్కీనీ,జరీని చేర్చడం , కట్ దానాలను కుట్టడం,కుందన్ లు కూర్చడం లాంటివి చేస్తుంటారు.అట్లాంటి చీరల్ని వివాహాది కార్యాల్లో వధువుల ముస్తాబు కొరకు వాడుతుంటారు.ఇవే వర్క్ శారీస్.హైద్రాబాద్ నగరంలో పాత బస్తీలో ఈ వర్క్ శారీస్ ని ముస్లిమ్ మహిళలు ధరిస్తుంటారు,తయారు చేస్తుంటారు.ఈ కవయిత్రి చమ్కీ,జరీ,కట్ దానా,కుందన్ లాంటి కవితా సామాగ్రిని సమకూర్చుకొని ఆ చీరని ముస్లిమ్ స్త్రీకి ప్రతీక చేసి "చమ్కీ'-అనే మంచి కవిత నిర్మించింది.జీవితం అనేక కుచ్చుముళ్ళ దారాల సమాహారం.వొక్కొక్క ముడినే విప్పుకొంటు పోవడం, నాలుగ్గోడలకు రోజులను బిగించడం అంటే విరామమెరుగక గదిలోనే మగ్గిపోవడం ఇలాంటి గుండెను పిండే భావాలతొ కవయిత్రి "చమ్కీ"-కవితను ప్రారంభిస్తుంది. సాదా జీవితాన్ని గడుపుతున్న స్త్రీలు "అరబ్ దీనార్ల రంగుల కలలు"కనడం"రాకుమారుడి రాక కోసం/ఆకాశం తానులో నేసిన నక్షత్రాల స్వాగతం"చెప్పడం చేస్తున్న వీళ్ళు అరబ్ షేక్ ల చేతుల్లో మోసపోతున్న వైనాన్ని "అన్ని చమ్కీలు చీర మీదకు చేరవు/దారి తప్పి కిందపడి-ఊడ్పులో మాసి-బజారులో ఎండకు మెరిశి/ఏ గాలి వేగానికో మురిక్కాలువల్లో ఆత్మహత్య చేసుకొంటాయి"-అన్న వాక్యాల్లో కవయిత్రి ధ్వనింప చేస్తుంది."బతుకు చీరకు వేసిన కట్ దానాలానో/బజారున పడ్డ చమ్కీలానో/ఏ ఎగుమతిలో ఎక్కడి దాకా వెళ్తుందో తెలియదు/ఏ బురద గుంటలో పడి మునుగుతుందో తెలియదు"'అంటూ ఆ స్త్రీల దీన హైన్య స్థితిని మనసు కన్నీళ్ళ పర్యంతమయ్యేలా చెబుతూ వొక ఆశను"మెరవడం దాని జీవ లక్షణం"-అని వాళ్ళ జీవితంలోని తీపిని కూడా గుర్తుకు తెస్తుంది. స్త్రీల వేదనను,బాధను స్త్రీలు వ్యక్తం చేసినంత పదునుగా ఇతరులు అభివ్యక్తీకరించడం సాధ్యం కాదు.కవయిత్రులకీ భాషాపుష్టి తక్కువ అనే భావనలో కొందరు వుండొచ్చు.కానీ కవయిత్రులు వారు చెప్పదలుచుకున్న భావానికీ ఔన్నత్యాన్నిచ్చే శైలినే ఎన్నుకొంటారు.షాజహానా తాను స్త్రీ కాబట్టి స్త్రీగా పురుషాహంకారపు సమాజంలో అనుభవించిన దుఃఖంలోంచి అద్భుత కవిత్వాన్ని సృజించింది.ఇతర స్త్రీవాద కవయిత్రులు స్పృశించని కోణాలని తన కవితలో ప్రదర్శించిహిత్రించిన స్త్రీకి స్త్రీగా కలిగే మనఃస్పందనలోని వైవిధ్యాన్ని స్పష్టంగా చెప్ప్పగలిగింది.మనసును పట్టి వేయగలిగే కవితా శక్తి షాజహానాలో వుంది.ఇందుకు ఉదాహరణ ఈ కవితా సంపుటిలోని "సిద్ధార్థి"అనే కవితా ఖండిక.ఒక స్త్రీగా తాను నమ్మి వచ్చిన పురుషుని వల్ల కోల్పోయిన సమస్తాన్ని కవయిత్రి సమర్థవంతంగా వివరించిన గొప్ప కవిత ఇది. "నువ్వు మంచి వాడివి/దేవుడివి/ఉత్తమపురుషుడివి/పాలకుడివి/అధికారివి/చాలా ఎక్కువగా భర్తవి/తండ్రివి...ప్రేమికుడివి.../నేను నీవు చెప్పినట్లు వినే రోబొట్ ని అంతే"-ఈ వొక్క చివరి మాటలోనే స్త్రీ పురుషుని చేతిలో ఎలా వుందో వ్యక్తిత్వం లేని మర మనిషిగా ఎలా నమ్మివచ్చి పురుషుని చేతిలో వంచనకు గురయ్యిందో కవయిత్రి బలంగా,సాంద్రంగా చెబుతుంది.ఆదిమ మానవ వ్యవస్థలోనే,ప్రేమ భావన తెలియని వ్యవస్థలోనే స్త్రీకి గౌరవం వుండేదని,ఇప్పుడు స్త్రీలకు జరుగుతున్న అన్యాయలకు అంతేలేదని అనేక దృష్టాంతాలను ఆయేషా,సమీరా విషాదాలను ఉదాహరిస్తూ చెప్పే కవిత ఇది."ఈ భూమి మీద నీ పాదమెంతో నా పాదం అంతే'-అని అనటంలోనే కవయిత్రి స్త్రీ,పురుష సమానత్వాన్ని ప్రతిపాదిస్తున్నదని ఎవరైనా అర్థం చేసుకోవచ్చును. కానీ ఈ సమానత్వం ఈ గోళం లో దొరకదేమో నన్న అపనమ్మకంతో "అలసిన నా మనసు ఆనుకోవడానికీ ఇక్కడ స్థలం లేదు మరో గ్రహం వుందేమో వెతుక్కోవాలి"-అని అనుమానం షాజహానా వ్యక్తం చేయడంలో ఆమెకు ఈ వ్యవస్థపై గల సత్యాగ్రహం అర్థం అవుతుంది.. ఒక అద్భుత స్త్రీ వాద కవిత ఇది.పురుషుల చేత గూడా ఈవిడ చెప్పింది నిజమే అని ఒప్పించ గలిగిన తర్కం ఇందులో నిక్షిప్తం అయి కవిత గొప్పదనం అవగతమవుతుంది. తన స్నేహితురాలు,తన సహేలీ,తనను ఎత్తుకొని లాలించిన రెండో అమ్మా,తన కవితలకు ఆత్మ,తన అపా తో అబ్ నార్మల్ పెయిన్ గురించి సంభాషించిన కవిత"అబ్ నార్మల్ పెయిన్". "చెప్ప కుండానొప్పి చేసే దాడిలో/ఒక్క శరీరమే ధ్వంసం అవుతుంది/మరి మనసుకు పడ్డ నెర్రెల్ని/ ఏ డాక్టరొచ్చి కుట్లేస్తాడు'-అని ప్రశ్నించే కవయిత్రి"రెండు ముక్కలైన ఆకాశాన్ని కలిపి కుట్టెసినట్లు మెరుపు"-అని ఎంతో గొప్ప పోలికతో స్త్రీలు పొందే అబ్ నార్మల్ పెయిన్ ను "లోపల గడ్డ కట్టినదేదో కరుగుతోంది'-అంటూ మనకీ 'ఈ మగ వాళ్ళు ఇంత కఠినులెందుకు"-అనిపించేటట్లుగా నోట మాట రాని స్థాణువుల్నీ చేస్తుంది ఈ కవయిత్రి తన శిల్పనైపుణ్యంతో. తెలుగు నేలలో జరిగిన ఘోర దురంతాలలో ఆయేషా సంఘటన ఒకటి."రాజకీయ దున్నపోతుల కొట్లాటలో"బలయిపోయిన చదులతల్లి ఆయేషా.చంపబడిన ఆయేషా కోసం ఆమే తల్లిదండ్రులు న్యాయం జరగాలని పడరాని పాట్లు పడ్డారు.ఈ సంఘటనను ఈ కవయిత్రి కవిత్వం చేసింది."మా ఇళ్ళలో చదివించడమే తక్కువ/చదవాలని వచ్చే ఒకరిద్దరినీ రాకుండా చేయకండిరా"-అని వేదనతో అభ్యర్థించడమే కాదు "ప్రతి అమ్మాయి ఉయ్యాల తొట్టెకి/ఒక తుపాకి మంజురు చెయ్యండి చాలు"-అని డిమాండ్ చేస్తుంది."సిగ్నల్ లైట్ల కాడ బురఖాలో/హైద్రాబాదీ నవాబీ తనం తనఖా../ఆ దారుల నుంచే ముఖ్యమైన మంత్రులు/రాజులు రాజ్యాధికారులు"-అంటూ చార్మినార్ పై నుంచి నెట్టివేయబడ్డ చదువు కోసం తపించే పేదరికపు సమీరా విషాద బాధని "బేవఫా దునియా కో మాఫ్ కరో.. సమీరా"అంటూ నిరసన తెలుపుతుంది షాజహాన. ఈ సంపుటికీ వొక అలంకారంగా భాసించే కవిత "మెహమాన్"(అథితి).కవయిత్రికీ గుజరాతీ బాధితుడికీ జరిగిన ఒక కవితత్మక సంభాషణ."ఒకానొక గుంపు వేట నుంచి తప్పించుకొన్న పావురాన్ని"-అని కవయిత్రి అతని చేత అనిపించటమే కవితకీ వొక కీలకమైన వాక్యం."లోపలేముందో తెలీనీ పూడుకపోయిన బావిలా వున్నాడు"-అని అనటంలో కవయిత్రి అతడిలోని భయాన్ని అపనమ్మకాన్ని స్ఫురింప చేసింది.అంతర్లీన సముద్రాల దుఃఖాన్ని తోడటం,సమస్త దేహంతో దుఃఖించడం లాంటి ప్రయోగాలు కవయిత్రి ప్రతిభను ప్రదర్శిస్తున్నాయి. ఇపుడు అమాంతం చిన్న పిల్లై "అలీఫ్ బే తే"లు(ఉర్దూ అక్షరమాల) నేర్చుకోవాలని మనసు మారాం చేస్తున్నదని అంటున్న కవయిత్రి తన మాతృభాష గుర్తింపుకునోచుకోక పోవడాన్ని,తన భాష మ్యూజియంలో ఒకపురాతన వస్తువై మిగిలి పోవాడాన్ని నిరసిస్తూ రాసిన అద్భుత భావుకత్వంతో రాసిన కవిత "అలీఫ్ బే తే"-అనేది.దేవ కన్యలు తమ సుకుమార వేళ్ళతో కాస్మీరీ అల్లిక చేసినట్లూ అక్షరాలు రాయబడుతున్నాయన్న అద్భుత ఊహను కవయిత్రి అంద చేస్తుంది.దేవ కన్యలు నెల వంకల్ని కుప్పేసి వెన్నెల సోనలతో ఉర్దూ అక్షరాలు అవ్యక్త పరిమళాలు వెదజల్లుతాయన్న వొక మధుర ఊహను కవయిత్రి వ్యక్తం చేస్తూ,"నాది కాని భాష ఇవాళ నన్ను ఏలుతున్నది"-అంటూ భాష పరాయీకరణ చెందిన విషయాన్ని స్పష్టం చేస్తుంది. "హునర్" (మిషన్ కుట్టె వృత్తి)అనే కవితలో ఆ వృత్తిని'అర్ధరాత్రి వరకూ సాగే జీవన వాయిద్య ఒంటరి కచేరి"-అని వ్యాఖ్యానిస్తున్న ఈ కవయిత్రి మిషన్ తాళ్ళకే ఉరివేయబడ్డ ఈ బతుకులు మా కొద్దు అని చెబుతూ "ఐ.ఏ ఎస్.లు,ఐ.పి.ఎస్.లు కావాలి కొత్త జీవనోపాధులుగా తన జాతి వారికి అని తన ఆకాంక్షను గాఢంగా కవిత్వం చేసింది."నాతో పాటు ప్రతి వూరి ఙ్ఞాపకాన్ని లాక్కొస్తున్న నత్త గుల్లని"అనే ఈ కవయిత్రి నాస్తల్జియాకు గురై గతించిన ఙ్ఞాపకాల పునఃస్మరణ చేసుకొంటొంది చాలా కవితల్లో ఈ సంపుటిలో. "ప్రకృతి రాసిన ప్రేమ కవిత్వం పూలు"-అని అనుకుండే షాజహాన పూల లాంటి సుకుమార భావనలెన్నో చెప్పటమే కాదు,"ఏ పిట్టలకు వలేశారో ఇన్ని నక్షత్రాలూ చల్లారు"లాంటి అసాదరణ ఊహల్నీ కవిత్వ వాక్యాలు చేశారు. షాజహానా పోలికలను కల్పించుకుండే శక్తి ఎంత గొప్పదో చెప్పడానికీ ఈ వొక్క ఉదాహరణ చాలు."దేశాంతర దుఃఖం"-అనే కవితలో "ఎంత అందం సలీమానీది!/దుఃఖం గడ్డ కట్టిన మంచు శిల్పంపై చిక్కని చీకటి వంకర్లు తిరిగిన గిరజాల జుట్టు/ప్రకృతంతా విరగ బూసి నవ్వినట్లు"-ఇలాంటి కవితా పంక్తులు అనేకం ఈ కవయిత్రి రచనలో కనిపించి బాధల వరదల నదిలో మునకలేయించడమే కాదు అమ్మలా చల్లని కొంగుతో జోలపాడి,సెలయేళ్ళ ఘోష ,వెదురు వనాల సవ్వడి,ఎండిన ఙ్ఞాపకాలను ఆకు పచ్చగా తిరగదోడటం చేస్తాయి. "దర్గా దారికీ అంటు లేదు"-"ఖఠ్ఠా-మిఠ్ఠా దోస్తానా" వంటి కవితలు హిందూ ముస్లిమ్ ల మధ్యగల ప్రేమాభిమానాలను తెలిపేవి అయితే "మాదిగ బుచ్చమ్మ',తెల్లారని బ్రతుకు"-మున్నగునవి కవయిత్రికి గల దళిత వాద స్పృహను తెలియచేస్తాయి."బూషాడా..గో బ్యాక్"-అనే కవిత అమెరికా సామ్రాజ్యవాద నిరసనను తీవ్రాతి తీవ్రంగా తెలిపే కవిత. "తన శ్వాసను వంటినిండా అత్తరులా పూసుకొని జీవిస్తున్నాను నా భూమి మీది ప్రేమలా నీ మీది ప్రేమను మర్చిపోలేక పోతున్నాను నా నేల మీది మట్టి గంధాన్ని రాసుకొన్న క్షణాన్నే ఉద్యమం ఊపిరి పోసుకొంటుంది నా దేహం నిండా ప్రవహిస్తున్నది రక్తం కాదు నా ప్రాంతపు ఊపిరులే" (నువ్విప్పుడు నా భూమివి) ఎంత కాల్పనిక భావ సంచయంతో విరిసిన పున్నాగ పూలలాంటి పదాలతో"ఎంతో దుఃఖాన్ని తీయగా వుందంటూనే తన ప్రాంతంలో ఉరకలెత్తిన ఉద్యమాన్ని గొప్ప కవిత్వంగా చేసింది షాజహానా "నువ్విప్పుడు నా భూమివి"అంటూ. "మేరా హైద్రాబాద్"-అనేది ఈ సంపుటిలో చివరి కవితే అయిన అభివ్యక్తిలో అగ్ర భాగంలో నిలువాల్సినదే. "నా ఆత్మ ఈ షహర్ చుట్టూ/పిట్టలా గిరికీలు కొడుతుంది/అనుభూతుల్నీ ఏరుతుంటుంది"-అని ఆరంభమయ్యే ఈ కవితలో నాలుగు శతాబ్దాల హైద్రాబాద్ నగర సంస్కృతినీ,విశిష్టతని,ఆ నగర ఆహారపు ఘుమ ఘుమల్నీ,తెలుపడమే కాదు "ఈ షహర్ ఒక షాహరీ/ఇక్కడి జిందగీయే ఒక షాయరీ/రాత్రిని పాన్ బీడా చేసి/తెల్ల వార్లు ఎర్రని ముషాయిరాల్నీ పండిస్తుంది"అని ఒక అపూర్వ అనుభూతి పరిమళపు ధూపాన్నీ కవయిత్రి ముక్కు నిండా నింపి మదిని అక్కడికి మళ్లింప చేస్తుంది.ప్రముఖ కవి శివారెడ్డి గారు ఇదే హైద్రాబాద్ ని అదే శీర్షికతో "ఓ హైద్రాబాద్...నువ్వొక నల్లని భయంకరమైన జంతువ్వి..........నువ్వొక అందమైన ఆడదానివైతే నీ మేని రమణీయ సౌందర్య పరీమళాలనావాహన చేయదల్చినా కాని..స్వర్గ నరకాల్నీ రెండు కళ్ళల్లో కీలించుకొన్న నువ్వొక బూటకపు లం..వి"-అని అన్నాడు.అందుకు నిరసనగానేమో ఈ కవయిత్రి "కడుపు చేతుల పట్టుకొస్తే.కన్నీరు పెట్టిన నగరం/మీ కింత చోటిచ్చింది/ఆకలి తీర్చి అమ్మయ్యింది/గిరి గీసుకొని లేదు పొమ్మని మీ ముఖాన తలుపెయ్యలేదు చూడూ./అలాంటి అమ్మను "లం" అని తిడతారా?-అని రాసినట్టు అనిపించింది నాకు. పాట పడవై ప్రయాణిస్తున్న కవయిత్రికీ,ఇంటి చుట్టూ పాతిన వెదురు చెట్లను మనసు చుట్టు పాతుకొన్న కవయిత్రికీ,నక్షత్రాలకీ చలేసిందేమో మబ్బులను కప్పుకొన్నాయి-అని భావుకత్వంతో పరవశించే కవయిత్రికీ,రాసేదంతా కవిత్వమైతే జైళ్ళన్నీ కవులతో నిండేవి-అనే జనం ఆవహించిన కవయిత్రికీ ఎన్నటి ఆరని అద్భుత దీపం మీ కవిత్వం అని చెబుతూ ,నీ కవిత్వానికీ "తుఝే సౌ బార్ సలామ్"-అని అంటున్నా. మరో మంగళ వారం ఇంకో కవిత్వ సంపుటితో కలుద్దాం.
by Rajaram Thumucharlafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dk33gf
Posted by
Katta