పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
vamshidhar Reddy లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
vamshidhar Reddy లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, జూన్ 2014, శుక్రవారం

Vamshidhar Reddy కవిత

వంశీ // Ante Poem // అలారం మోగ్గానే మంచాలు నిద్రిస్తాయ్ మాన్సూన్ ముసుగేసుకుని చొక్కామీద కాస్త వొలికిన రాత్రిమందు నీళ్ళల్లో నానదు ఇంటిముందెవరో నిలబడ్తారు చెట్లను పలకరిస్తూ నీకేం వినపడదెలాగూ చెవుల్లో వేడి ఛాయ్ కరుగుతుంటుంది.. ఆవిడ్ని తప్పించుకునో నువ్వే తప్పిపోయో ఆకాశాన్ని చూస్తావ్ సరదాగా ఏదోటి రాసిపారేద్దామని రెండుకొంగలు నిన్నుచూసి నవ్వుకుంటాయ్ "జీవించడం మరణానికి ఎదురుచూపు" అని పైత్యపురాత ఒకటిరాసి గుండెల్నిండా నీ పాత మరణాల్ని తిరిగి గెలుక్కుని గంభీరాగ్రేసరుడివై ఏకశూన్యవిలోమత్వంలోకి జారిపడి ఈతరాక బ్రతికి ,మెదడుకు ఖాళీపుస్తకమోటి అంటించుకుని స్నానానికెళ్తావ్.. సెకన్లు నిమిషాలు గంటలు రోజులు నిన్ను మర్చిపోతాయ్ అనుకోకుండా ఓరోజు ఎవరో అరూపులై లాగిపెట్టి కొడతారు ఆగిపోయిన్నిన్ను కదిలించడానికన్నట్టు.. కాయితాలు కొన్ని చిరిగి కొట్టివేతల్నడుమ ఓ కల కంటుంది నక్షత్రపు కన్ను.. కడు విచిత్రముగనీసారి అలారం మోగ్గానే కంచాలు నిద్రలేస్తాయ్ నువ్వు ఎక్కడికీ పారిపోకుండా... 13-06-14

by Vamshidhar Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mRSKi6

Posted by Katta

17, ఫిబ్రవరి 2014, సోమవారం

Vamshidhar Reddy కవిత

వంశీ // interlude // ఉదయం ఏదోగాయానికి చర్మం గీరుకుపోయి కళ్ళెర్రబడ్డప్పుడు ఎందుకో తెలీదు నువ్ గుర్తొచ్చావ్ ఎప్పట్లాగే నీ నవ్వూ గుర్తొచ్చింది నువ్ ఉండుంటే గాయానికి ఉమ్మురాసి ముద్దుగా మొట్టేదానివని అనిపించగానే ఎందుకో కళ్ళమీంచి ముసినవ్వోటి వేళ్ళదాకా పాకి గాలికెగుర్తున్న వెంట్రుకల్ని వెనక్కి లాగింది.. భోంచేస్తూ టీ.వీ ఆన్ చేయగానే నువ్ నమ్మవ్ గానీ అచ్చూ నీలాగే , ఏం తిన్నావని అడగకిక "రన్-వే 9" లో బకార్డీ బ్రీజర్ తాగి చికెన్ వింగ్స్ తిన్నప్పట్లాగా నువ్ ఇంకా అలాగే సుతారంగా ఒక్కోమెతుకూ తింటూనే ఉండుంటావా, ఇక ఈ రోజంతా నన్నొదిలేలా లేవుగా కలలసంగీతంలోంచి, ఏడుపుగొట్టు మేఘాలు గొంతులోంచి సూదుల్ని వర్షిస్తున్నప్పుడు "విలియం కార్లోస్ విలియమ్స్" "లవ్ సాంగ్" చదివి బద్దలైపోవడం అనివార్య వరం... పిచ్చిగా లేదూ?? తెలిసిన జవాబులకు ప్రశ్నల్ని వెతుక్కోలేకపోవడం, we are not alone, even in our classified loneliness పరమానందాన్ని పరిచయించినవారే అపరదుఃఖంలోకీ దారిచూపగల్రు, అర్దభాగ నగ్నదేహపు కండరకోశాల్లోని క్షోభ్యతకు ఏదీ భాష?? ఏదా ఘోష.. మోహార్తిదీపాల్లో వెంట్రుకలంటించుకున్న బట్టతలగాళ్ళమేగా మగాళ్లమంతా.. ఎంతబావుణ్ణు తల్చుకోగానే అవతలివాళ్లకి తెలిసిపోతే బేషరతుగా ఇష్టపడ్డం బలహీనత కాదు ఎప్పుడూ కొంపలు మునగవ్, నువ్ ఎవర్తో ఉంటే నాకేం మన రంగులగతంలో మునిగి తేలడం పాటకీ పాటకీ నడుమ విరామం మాత్రమే, నువ్ ఇప్పుడు ఎదురైనా మనస్ఫూర్తిగా వెలుగుల్ని దాచుకోడం తెలిసాకా నువ్ ఎవర్తోఉంటే నాకేం నిన్ను ప్రేమిoచడానికి నీ ఆత్మ శకలమొకటి నా రక్తంలో కలిసాక.. ఎప్పుడూ కొంపలు మునగవ్ 17-02-14

by Vamshidhar Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cQ5qS7

Posted by Katta

1, నవంబర్ 2012, గురువారం

వంశీ // సీక్రెట్ విండో //


గర్భం మోస్తూ అలిసిన
మాతృస్వామ్యపు శిథిలాల్లోంచి నిర్మితమౌతూ
పితృరాజ్యపు విశృంఖలత్వం,


మంచికో చెడుకో
అక్షౌహిణుల ప్రాణాల పలుకాపి
అర్ధాకళ్ళ హననాల పరుగాపి,
జాతుల పోరు నిర్విరామంగా..

శతాబ్దాలుగా దాహం తీరని ఖడ్గం, ఒరలో..
ప్రశాంతంగా ప్రాయశ్చిత్తం చేసుకుంటూనో
రక్తస్పర్శలకు ఆరాటపడుతూనో,
వీరులు నేలపొరల్లో నిద్రిస్తూ
చరిత్ర చిత్తరువుల్ని రేపుకి తర్జుమా చేయలేక
ఓడి క్షయమై..

అధికారం తోడిచ్చిన భయంతో
దేవుణ్ణి పుట్టించి,భయమింకా పెంచుకుని
నిజరూప దైవాంశలను శిలువేస్తూ
వీరుల వారసులు,

సహజాతపు విధేయతతో
దేవుణ్ణి పారాకాస్తూ ఖడ్గాల పునర్జననం,
వీరుల అస్థిత్వమ్మీద చీల్చలేని పొరల్నికప్పి
రహస్యకవాటాల్లో కళ్ళు నిలిపి సకలం పరికిస్తూ
నాటకీయంగా నడుస్తూ కాలం..

నరకమెవరికి
ఖడ్గానికా, వీరులకా, సంకల్పానికా. సందేశానికా

స్వర్గమెవరిది
దేవుడిదా,వారసులదా , రహస్య కవాటపు కాలానిదా..

29.10.12

16, అక్టోబర్ 2012, మంగళవారం

వంశీ | క్షుద్రం


రమించు.. రమించు,
శవాల్నీ, గాయాల్నీ, అశుభాల్ని, అస్ఖలితాల్నీ,
పగలుచూడని రాత్రులతో, పదాలు చెప్పలేని విన్యాసాలతో..
ఇంకా.. ఇంకా..
రక్తమంతా చెమటలు కక్కేవరకూ
రిక్తమంతా గావుకేకలు పెట్టేవరకు,
ఎవరది..చంపెయ్.. చంపెయ్ వాడిని,
నీతిభోదలుచేస్తూ నిన్నాపుతున్నాడెవడో,
మనస్సాక్షా...
ముక్కలు ముక్కలుగా నరికెయ్, వీలైతే తినెయ్,
ఏ మీమాంసలెందుకు
నీ మాంసపు రుచి అలవాటేగా..

శరీరం బుధ్దినోడించి
రోజురోజుకూ అతిక్షూద్రుడివైపోయి
నీకు నువ్వే శత్రువై
దారితెలీని లోయల్లో గమిస్తూ
నోరుతిరగని మంత్రాలేవో జపిస్తూ
సున్నితత్వాన్నీ మనిషిమూలాల్నీ సమాధిన తోసి..

పువ్వులన్నీ ఫలాలవకమునుపే చిదిమేసి కార్చిన తేనెలో
విషాలోచనలని ముంచుకు తిని కాలకూటభాష్పాల్ని త్రేన్చు,
రజస్వలించలేక ద్రవించిన స్రావాల తావితో
నాసికను తాటించి వికృతాకారిడివై భ్రమించు..

తొందరగా.. తొందరగా...
ఔషధాల్లేని జాడ్యాన్ని వెంటేసుకుని ధర్మాల్ని వినిర్మించు,
ఉపాసించని దైవత్వాన్ని పురాణాల్లోకి విసిరి
నిర్వేదాలకు భాష్యం రాయి,

నీదైన రసాతలానికి
నీదవని భూతలాన్ని ప్రక్షేపించి ఆఙ్నాపించు..
నువ్వే రాజువి

రమించు.. రమించు..
భూతగణాలతో, దైత్య కణాలతో,
నీలాంటి మరో అష్టావక్రుడు భవించేట్టు
అంధయుగపు రేతస్సు జ్వాజ్వలించేట్టు...

13.10.12

29, సెప్టెంబర్ 2012, శనివారం

వంశీ // కన్ఫెష్షన్స్

లోపల్లోపల్లోపల్లోపలి
కేంద్రక జన్యుపటపు అతిబలహీన
హైడ్రోజన్ బంధాలసాక్షిగా,

ఖాలీ సీసాలమ్మి కొనుక్కుతాగిన
విదేశీ దారు ధారల కామపు కళ్ళు హరాయించుకోలేని
సౌందర్యంపారే ఫ్రౌడల బజారు
నడుమ్మడతల్లో గొంతుపిసుక్కుని
లిప్ స్టిక్ వాసనల్లో ఆయువు దహించుకున్న దాహంలో,

రహస్య మైదానపు మైధునాల్లో
చుంబనాల చేదుని, రాపాడించిన చర్మాల తడికి
నిశ్శబ్దంగా అన్వయిస్తూ
నిషిధ్దాక్షరాన్నై నిశీధిన నిశ్చలంగా
సుప్త నిష్ఫలాల ఆవల
లిప్త లిప్సల లాలస..

భాఆఆఆఆఆఆఆణ్ ణ్ ణ్ ణ్ ణ్ ణ్ ..
సృష్ట్యాదిన మహావిస్ఫోటనం చిత్రించిన శిథిల
స్ఫోటకప్మచ్చల వదనం కార్చే రసిలో పేరుకుపోయిన
అతిరాత్రపు యఙ్నం విదిల్చిన సంప్రోక్షణపు మసికి
మిధ్యా మానస మానవుణ్ణై,
వధ్యపు మానుకు నిర్జీవపు కానుకనై..

సౌందర్యరాహిత్యంతో
వికృతాసనపు వైకుంఠపాళికి
పాము మింగిన సోపానాల అవరోహణాన,
విరుధ్దవినోదాల విపరీతచర్యల మహానందాన
పరుగాపని కాలం విలోమమై,
అవనిలోనే అంతమైన అంకురంలా
అవధిదాటి అల్లుకుపోయిన అవకరంలా...

28.9.12

24, సెప్టెంబర్ 2012, సోమవారం

వంశీ || ఇన్సోమ్నియా


నడిఝాము దాటిన చీకటిని
నిశ్శబ్దం విరహించే ప్రతిరాత్రి
నిద్రించాయనుకున్న కలలు మేలుకుని
సమస్తాన్ని అచేతనం చేసే
అద్భుతాన్ని అక్షరీకరించాలని గింజుకునే
ప్రయత్నం ఆపుతూ, దూరంగా
కపాలమోక్షానికి ఉలిక్కిపడ్డ పాపాలభైరవుడి
భూపాలపు మేలుకొలుపు..

గాలివాటుకు ఫెటీల్మని శబ్దించి
సర్దుకుంటున్న కిటికీ విన్యాసానికి వెన్ను
ప్రచోదించిన భయమూ బిడియమూ కాని
ఒక ఆనందావస్థపు మహామౌనంముందు మోకరిల్లి
అస్పష్టంగా అల్లుకుపోతున్న ఆలోచనల్ని
తర్జుమా చేయలేని ఓటమిని అంగీకరిస్తూ..

గతమెపుడో పలుమార్లు పరిచయించిందనిపించే
ఈ అనుభవాల లోతుల్లో ప్రాయోపవేశించి
ఊపిరాడని చెమ్మల తడిని
ప్రత్యూషపు తొలి తెలికిరణపు ఎండపొడ
సడిచేయక తుడిపేస్తున్నట్టనిపించే
పొడుగైన రాత్రిని, పడదోసి పడకేసిన ఊహలు
మంచమ్మీద నాతోపాటుగా,

సుషుప్తిని మింగిన నీ గదిలో నేను,
నిజాయితీగా నిశీధిన కరగలేని అశక్తతకు
నీ ఓదార్పునడిగి ఓ దారి వెతుక్కోవడానికి,

మరో ప్రవాసపు ప్రదోషపు పునాదులో
సుదూరపు అసహజ గవాక్షాలో
ఉదయించకముందే
నాలోనూ నిదురించు..

23.9.12

22, సెప్టెంబర్ 2012, శనివారం

వంశీ // ది లాస్ట్ సప్పర్ //


వాసన్ ఫోన్,
సరుకొచ్చిందట, పదివేలు,
జేబులో పదివేళ్ళుంచి వొళ్ళువిరుస్తూ,
అనాఘ్రాణ పుష్పలావికా కేసర సంపర్క సంవర్తుడనై,
సంసృతం బూతుకి బట్టలేస్తూ,

"ఏంరా, అడ్వాన్స్ జనమ్ దిన్ ముబారక్.
మరేంలేదా రాత్రికి"
చేత్తో అత్యద్భుతంగా ఛండాలపు సంఙ్న సృష్టిస్తూ,
ఇరవైఏళ్ళుగా నా స్నేహితుడైన సన్నీ..

వాడి అర్ధవంతమైన అమాయకపు
ఆవేశపు ఆక్రోశం నన్నుకదిల్చి,
పైసలకు ఎవడిగొలుసమ్మాలో అని లెక్కలేస్తూ మేము,

వ్యర్ధాల్లోంచి వందలుపుట్టించే
వీర్యనిధులుండాల్సింది ప్రతూర్లో,
ఎంతదృష్టమో మగవ్యభిచారులది
సంపాదనా సంతోషమూ సమ్మిళితమై,
గొప్పోళ్ళ సమాజంలో వివాహేతరబంధాలూ ఖరీదే ,
లక్షాదికారినైదునీపాటికే,
దరిద్రుడా. దేవనాగరి మళ్ళీ వాడాల్సొస్తూ,
"పాణీ దా" విక్కీడోనర్ పాట ఫోన్ రింగ్ టోనై..
వాసన్గాడే, ధూల్ పేటకి రమ్మని,

అత్యంత అసహజపు నవ్వొకటి నా మీద విదిల్చి
మెళ్ళో గొలుసు తెంచుకుని
యమహా ని కిరాతకంగా హింసించి
ధూలి లేపి పేటకెళుతూ, మై బిలవ్డ్ ఫ్రెండ్
సన్నీ ఉరఫ్ సంధ్యావందనం సూర్యనారాయణ

చీకటితో పాటే చేరిన నా అసురసంధ్య,
మై వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్,
ఒక చేత్తో చిరపరిచితమైన గాజుసీసాడు రంగుద్రావకమూ
పపావరమ్ సోమ్నిఫెరమ్ వృక్షపు ఎండిన ఆకులు
ఏదో పక్షిజాతికి చెందిన వేయించిన కండరాలు,
మరో చేత్తో మేలిముసుగు ధరించిన పదివేలని
ఆబగా లెక్కిస్తూ అపరిచిత పరిచితుడు, అప్పటికే తూగుతూ,
ద్రావకపుసీసా శూన్యానిక్కారణం అర్ధమై..

అటకమీది శ్రీ శ్రీ కి మత్తుని పరిషేచించి స్వీకరించి
చాపకింది ఫ్రాయిడ్కి పత్రహరితపు దిష్టితీసి ధూపమేసి
ట్రాన్స్ సంగీతం కర్ణభేరి భేధించేట్టు పుట్టిన క్షణాన
తొలిగిన మేలిముసుగుకి విస్ఫోటించిన భూనభోంతరాళాలు..

జా..న..కి,
రెండేళ్లక్రితం నేనుప్రేమించిన ఓ అందం
అపుడు నన్ను దౌర్భాగ్యుణ్ణి చేసి,
ఇపుడు సంధ్యావందనానికి అర్ఘ్యమౌతూ,

సన్నగా కంపిస్తూ కాళ్ళు, వేళ్ళు నేలనాసరా అడుగుతూ,
సర్వనాడులూ ఒక్కసారిగా పన్జేయడం మాని కళ్ళు మసకలై,
ఎపుడో పారేసుకున్న నాతో, వాడు రమిస్తున్నట్టు..
ఆపరా, ర్, ర్ర్, ర్రేయ్, స్టాప్ దట్,
యూ సన్ ఆఫ్ ఎ %# ...
అయోమయంగా వాడు,
ఆశ్చర్యంగా జా..న..కి..
అనాఛ్చాదిత మూలాల్ని సహస్రబాహువుల్తో కప్పేసి
నన్ను గుర్తించే ప్రయత్నం చేస్తూ..

"రేయ్, ఎందుకాపమన్నవ్ బే,
పన్నెండు కానీకింకా పావుగంటుంది,
నువ్వింకా పుట్టలేరా నా కొడకా, పో, పో,"
తిరిగి తనకి నగ్నత్వాన్నాపాదిస్తూ
తీరని దాహం తీర్చుకోడానికి ద్రావకాన్నొంపుకుంటూ.. సూరిగాడు,

దిండుకింద నిద్రిస్తున్న భగవద్గీత
అకస్మాత్తుగా మేలుకుని నా చేతులతో వాడి మెడ విరిచి
పారవశ్యోద్రేకాల నడుమ సందిగ్ధావస్థలో అచేతనంగా తెగిన జంఝం
కళ్ళు తెరిచి నన్నలాగే చూస్తూ,
ఎవరికోసం ఏం చేసావో తెలుస్తుందా అనడుగుతూ

కాలాన్నిచుట్టిన నిశ్శబ్దంలోంచి
జానకి నన్నొదిలి పోయిందా,
నా ఉన్మాదానికి పారి పోయిందా,
రేయ్, సూరిగా, లేరా, పన్నెండైంద్రా..
నటించింది చాలు,
రేయ్, సంధ్యావందనం, నేన్రా, నీ..

కళ్ళు పగిలి రక్తం గడ్డం మీదుగా గొంతులో దిగుతూ,
గదిగోడలు కూలి శబ్ధించి అతిభయంకరమౌనాన్ని కూల్చి
నా పుట్టుక నాకే వినిపిస్తూ,
పైకప్పుకంటించిన డావిన్సీ లాస్ట్ సప్పర్
ఇవే నా ఆఖరి నూకలని సంకేతమందిస్తూ..

18.9.12

వంశీ // సగం మిగిలిన సంభాషణ //


ఆపావేం
అనుభవాల అసంపూర్ణ పార్శ్వాల ఖాళీల్ని
మర్చిపోయిన ఙ్నాపకాలతోనో
మరలిరాని కాలంతోనో పూరించు,
ఓపికకీ కోపమొచ్చి ఇన్నాళ్ళ నిరీక్షణకి...
వినిపిస్తుందా
కన్ను జారనీని నీలం కనిపిస్తుందా.

పెరుగుతున్న వయసుని వీపున మోస్తూ
పారుతున్న వేదనల్ని ఒంటరై దాస్తూ
నిన్నింకా అన్వేషిస్తూ
చిన్నప్పటి దొంగా పోలీస్ ఆటలాగా,

నీతో మాట్లాడుతుంటే
అమ్మ కడుపులో ఊయలూగినట్టనిపిస్తూ
నమ్మవా
పోల్చడానికి అమ్మ తప్ప వేరే దేవత తెలీదే,
నవ్వావా
ఎక్కడో తెగిన నిమిషాలు అతుక్కుంటున్నాయ్,
అర్ధంకాలేదా
నన్ను కవిత్వీకరించుకోవడం తప్ప సంభాషించడం రాదే,
మెదడ్లో ఊరే మాటల్తో మాలేయాలనుకుంటే
నీకు నచ్చని మౌనాన్ని తర్జుమా చేయలేని
నిస్సహాయతలో నేనే మునుగుతూ,
నొచ్చుకోకు నొప్పి నాకు తెలుస్తుంది
తట్టుకో నా అఙ్నానాన్ని కాసేపు..

నిన్ను వర్షాన తడపాలని
నేనేడ్చి కురిపించిన నా కన్నీటి కోసమో,
వందేళ్ళకోసారి నేలరాలే ఉల్కని పట్టి
నీ గదికి వేలాడదీసిన పిచ్చితనంకోసమో
నీ మాటలు వినాలనుకోవడం లేదు,
అంతా నువ్వే కనిపించే నా గతానికోసారి
ప్రయాణించి నన్ను నాతో పోల్చుకుని
కొన్ని అపరిపక్వ ఫలాల్నీ, అనాఛ్చాదిత మూలాల్నీ
నాలోకి పిలుచుకుని
ఓడిన ఆటల్ని, తోడవని బాటల్ని
వీడిన చోటుల్ని నీడైన శూన్యాన్ని
ఒక్కసారి పలకరించి కలవరించడానికి
ఒక్క మారైనా ఒక్క మాటైనా
పలవరించవూ..

సంశయమా
తెంచుకోలేని బంధాల్లో చిక్కుకున్నామని
తెరుచుకోని ద్వారాల ఆవల చీకటుందేమో అని,
సాధ్యమా
తనువు ఆత్మ వేరై బ్రతకడం
స్థాణువై ఆలోచనల పరుగాపి నడవడం..

ఎవరూ లేని ఏకాంతంలో
సూక్ష్మ ప్రపంచాన గమించి హృదిభ్రమించి పరిభ్రమిస్తుంటా,
నేనే పరీక్షలు దాటేదాకా,
నీతో సగం మిగిలిన సంభాషణ కొనసాగేదాకా..

20.9.12

12, సెప్టెంబర్ 2012, బుధవారం

వంశీ // మోడస్ ఒపెరాండి //

నాకు ఏ బాదా, నొప్పి ఉండదెందుకో
తెల్లటి పావురాల తలలు తెంచి రక్తం పారిస్తుంటే,
నాకు ఏ దుఃఖం, వేదనా అనిపించవేమిటో
ఓ మనిషో మనసో నలిగినా విరిగినా
ఓ తరువో గిరులో కాలినా కూలినా,
నాకేం కానంతవరకు,
నాదేమీ పోనంతవరకూ,

నాకే కోపమూ అసహ్యమూ రాదేమిటో
వ్యభిచారులూ అరాజకీయులన్నా
తాగుబోతులూ మోసగాళ్ళూ ఐనా,
ఎంతకష్టమో నిజంగా
సమాజం ఒప్పని పనులు చేస్తూ
జనాలు మెచ్చని కలల్ని చూస్తూ

విలువలూ ఆచారాలూ
ఒడ్డునుండి కడుపునిండినోడికే,
తెప్ప దొరకక కొట్టుకుపోయేవాడి
ఆకలి ఆశలు ఆరాటం పోరాటం
వాడిదైన ప్రపంచాన్ని బ్రతికించుకుని
వాడివవని ప్రమాణాలతోనిత్యం ప్రయాణించడానికేగా..

నాకే ఆవేశమూ ఆలోచనా కలగవెందుకో
కవులు జీవితాన్ని రాయక ఊహల్లో తేలితే,
రాసినట్టు జీవించక వైరాగ్యంలో మునిగితే,
అవునూ, కవీ నాలాంటి మనిషేగా

నాకే అపరాధభావనా, ప్రాయశ్చిత్తపు
పరిహారాలమీదా నమ్మకం రాదెందుకో
రజస్వలించిన చీకట్లో ఇంద్రియాల్ని సంతృప్తీకరించి,
కామరూపుడినై కలుషితాలోచనలతో స్థలకాలాలనోడించి
ఐదో పరిమాణపు నీడల చిరుగుల్లోంచి
ఆత్మనొదిలిన శరీరాల చెమటతో తడిసిన
అంగాలు స్పృశించి అమరుణ్ణవుతుంటే,

నాకే భయమూ బంధాల బడలికా ఉన్నట్టనిపించవు
రేపే మరణిస్తానన్నా,
లోకపు చూపే మారిపోతుందన్నా,

నేను నిర్దేశించుకున్న, నాకు మాత్రమే తెలిసిన
గమ్యం చేరే వడిలో
నేను ఉద్దేశించుకున్న, ఎప్పటికైనా అధిరోహించే
శూన్యం కనిపించేవరకు
నేనిలాగే ఉంటాను
నన్నలాగే అనుకోమంటాను

9.11.12 ( తాలిబన్లు కూల్చిన W.T.C లో, చనిపోతామని తెలిసాక ఆ మనుషుల మానసిక స్థితి గుర్తొచ్చి)

7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

వంశీ // మెటమార్ఫసిస్ //

ఎపుడైనా,
ఎన్ని యుగాలింకా నేలలోనే మొలకెత్తాలని
లేని రెక్కలు అతికించుకుని ఎగరాలనుకున్నావా,
చీమనో దోమనో ఆవహించి
సగంమిగిలిన రంధ్రాన్వేషణ సాగించాలనుకున్నావా,
అతీంద్రీయాల్ని ఆవేశించుకుని మనుషుల్ని
మృగాలు చేసే అమృతత్వం సాధించాలనుకున్నావా,

ఎపుడైనా

విరుస్తున్న గులాబీతో
మురుస్తున్న తుమ్మెద తొలిమాటలు వినాలనుకున్నావా,
కురుస్తున్న చినుకు తాకి
కరుస్తున్న చలిని విడదీయాలనుకున్నావా,

పరారుణకిరణాలెక్కి

అరుణగ్రహంమీద గడ్డకట్టిన సమయాన్ని
భాష్పీకరించి ప్రవాసుడివవ్వాలనుకున్నావా ,
స్రవించే శోకాలు
సమీపించని సుదూర వ్యోమతీరాన
గమించి క్షయించే నక్షత్రాన్ని ఓదార్చాలనుకున్నవా,

నీ ఉద్వేగాలకు మూలమైన రసాయనచర్యలో

ఉత్ప్రేరకమేదో తెలుసుకుని
ఉద్దేశాలు మార్చుకోవాలనుకున్నావా,
పరస్పర విరుధ్దాలైన నీ
అంతర్ముఖాల పూర్వవృత్తాంతాల
నిజనిర్ధారణకు భ్రూణంలోకి ప్రయానించావా..

ఒకరినొకరు తోసుకుని దాటుకుని

చేరే చివరిమజిలీ చీకట్లోంచి శూన్యంలోకే అనిపించిందా,
కోట్ల అనుభవాల్తో నిర్మించుకున్న నీ ప్రపంచం
నిన్నెపుడైనా ఒంటరిని చేసి ఏడిపించిందా..

చీకటి నాకేసిన వెలుగుల్లో

నిశ్శబ్ధంగా పారుతున్న వీధులగుండా
రాతియుగపు సంగీతం పీలుస్తూ, ఒడ్డుచేరక
నడిసముద్రపు శక్తిస్థలిలో మునగాలనిపించిందా,

బలహీనతల సర్దుబాట్లతో

చిర్నవ్వు తారసపడ్డా అందుకోలేని దురదృష్టాల్ని
కలిపి కుట్టుకున్న చర్మపు పొరల్ని
ఒక్కొక్కటే వొలుచుకుంటూ నీకు నువ్
నగ్నంగా నిజంగా పరావర్తనం అవ్వాలనిపించిందా..

నన్ను ఙ్నప్తించుకో మిత్రమా

నీకలా అనిపిస్తే,
కనీసం నన్నో ఆలోచనలాగా ఐనా గాల్లో కలిపెయ్,

నేను,

అస్థిత్వపోరులో
నాగరికతలు మారుతూ పునరుద్భవిస్తున్న నడిచే శవాన్ని..

5.9.12

5, సెప్టెంబర్ 2012, బుధవారం

వంశీ || నిరంతరం నీ ఊహల్లో ||


ఏవో కొన్ని అత్యద్భుత అమలిన క్షణాలు తప్ప
నేనెప్పుడూ నిన్ను ప్రేమించలేదు
చాలాసార్లు మోహించాను
ప్రతీసారీ కామించాను,
నిన్ను తాకినపుడు నేనెలాంటి
అభౌతికాలౌకికానందానికీ లోనవ్వలేదు,
బహుశా నీకనిపించిందేమో..

నువ్ నాలా కాదని నమ్మి,
నేన్నిన్నెపుడూ ప్రేమించలేదేమో..
నీ దూరమే నేర్పింది
ప్రాధాన్యతలూ, వస్తు విశేషాలూ
నిరంతరం రూపుమార్చుకుంటాయని,
కాసేపు నీ సమయాన్ని బుజ్జగించో బెదిరించో
నా స్థలానికి రా
నా కాలమాగి చాలా కాలమైంది,
నా చెంపనో గుండెనో గాయాల్తో సంగీతీకరించు కోపం తగ్గేదాకా,
ఇన్నాళ్ళ నా కన్నీటికి కారణం దొరుకుతుంది అపుడైనా..

వీలైతే
నేననుభూతించని అనుభవాల్ని దోసిళ్ళలో నింపుకురా,
తలంటుపోసుకుని ప్రాయశ్చిత్తుడనౌతా,
మరలిపోకు, నేన్నిన్ను గుర్తించలేకపోతే
అందని ఆకాశం అందుకున్నానన్న తృప్తి
మిగుల్చుకోడానికి నాకిదే చివరి అవకాశం,

గుర్తుందా, నువ్వనేదానివి,
"నేను మరణిస్తే ఏం చేస్తావ్" అని,
నవ్వొస్తోందిపుడు
సగం చచ్చిన నాకోసం నిన్ను రమ్మని అరుస్తుంటే,
శరీరమూ కంపిస్తుంది,నువ్ నిజంగా వొస్తే
నాలో నాకు తెలీని మార్పుల్ని నీ నవ్వులో వెతుక్కుంటూ
మళ్ళీ జన్మించేట్టు నిన్నోసారి కౌగిలించుకోకుండా ఉండగలనా,
అప్పటికీ నేన్నిన్ను ప్రేమించలేక కామిస్తూనే ఉంటే
నన్ను నేను చంపుకోక ఆగగలనా..

నిన్నటంత పవిత్రంగా నేడు చూడగలనా
వేరొకరు తలదాచుకుంటున్న
వేడిశ్వాసలొదిలే నీ ఊపిరుల్ని,
వొద్దొద్దు,
నేనెప్పటికీ నాలా చూడలేనిక,
నీలా ప్రేమించనూలేను..
వంతెనలేని శూన్యానికి అటు నువ్వు, ఇటు నేనై..

నీకూ నాలా అనిపించట్లేదూ,
ఎన్నడూ కనపడని పొరల్ని దాటి
నా అసలు నేను నీముందుకొస్తుంటే
కించిదనుమానమైనా కలగడంలేదూ..

మనమెన్నటికీ సమాంతర రేఖలమే
పరస్పరాలోచన్ల తిర్యగ్రేఖ దిగంతం దగ్గర
మనల్ని కలిపే సాహసం చేయనుందా,
బ్రతుకు బరువుకు పాతాళంలో పాతుకుపోయిన చూపుల్తో
రేపటి నిన్ను ఊహించుకుంటూ
విశృంఖల శృంఖలాల్లో పోగొట్టుకున్న రక్తస్పర్శల్ని
తిరిగి నావైపు మళ్ళించుకుంటూ,
అదిగో కనిపిస్తుందా అనంతం,
కలుద్దాం అక్కడే,
అప్పుడైనా నేన్నిన్ను కామించకుండా ప్రేమించగలనా..

4.9.12

వంశీ || పొక్కిలి ||


వాకిలంత దుబ్బ
పొద్మీకి సాన్పు సల్లి ఇల్లలికెగద
ఏం రోగం దీన్కి, కనవడ్తలే,
"ఓ ఈరముష్టోల్ల ఎంకటీ
మా లచ్చి కనవడ్డాదిర"
ఈన్కేమైంది శెప్పకుంట మర్లవట్టె
శేతులెందుకో వొన్కుతాన్నై,
సర్పంచెలక్షన్ల తక్లీఫ్ ఐతాని
ఎమ్మెల్యే గాడేమన్న ఇంట్ల సొచ్చెనా..

"నాయినా, అమ్మ మర్రిబాయి పొంటి ఉరుకుతాంది
బట్టలన్ని శినిగున్నై కంపలవడ్డట్టు"
బీడీల్చుట్టవోయిన మా బిడ్డె
గుడ్డేలుగు కండ్లవడ్డట్టు హైబతై,

ఉప్పరి పన్జేశిన కండలొక్కపారే ఉబ్బి
గడ్డపార దొర్కవట్టి,

-"లమ్డీకే,
దైర్నమేంద్రా ఎమ్మెల్యే ఇంటికి రానీకి,
ఇడువుర్రా కుక్కల,
మన్తోనే జగడం పెట్కుంటాడు, వీని జాతిన్.. "

సచ్చిన మా అవ్వ బొందను తవ్వినట్టైంది
సావుకున్న నా పెండ్లాం కడుప్మీద తన్నినట్టైంది,
దిమాగ్ తిరిగి, కోపం పెరిగి, గడ్డపార కుచ్చితె
మోరిల వడ్డ పందిలెక్క రక్తంవాగుల వాడు,
కుక్కలు పరార్, బైటికచ్చిన పేగుల్జూశి,

పెండ్లాం యాదికచ్చి బిరానింటికి పోంగ,
అలికినట్టు కొట్టె వాకిలంత
లచ్చి కండ్లు తెరవంగనె,

జెర్శేపటికె పోలీస్ బూట్లు
ఆకిలంత మల్ల పొక్కిలి జేస్కుంట,
శేత్ల గడ్డపార
పోలీసోల్లను అందాజ చూస్కుంట
ఎమ్మెల్యేగాని రక్తంతోని నడింట్ల ముగ్గుబొట్లు జారేస్కుంట...

3.9.12

28, ఆగస్టు 2012, మంగళవారం

వంశీ // మదర్ లాండ్ //

మన డబ్బుతో
మన్తో పన్జేయిస్తూ
మనకే జీతాలిచ్చే ప్రజాస్వామ్యంలో,

సుబ్రహ్మణ్యస్వాములూ
తెహల్కా డాట్ కాములూ గడ్డి తినుంటే,
"రాజా"వారీపాటికి సాంబారిడ్లీ తిని, మెరీనాలో
భావకవితల్రాద్దురు కనిమొళిని కని,
దేశభద్రత మట్టికొట్టుకుపోయేది..

జర్నలిజం మొఫసిల్ వార్తలూ
బొడ్డుసుందర్ల ఉవాఛలేరాస్తే,
న్యాయం గనుల"గాల్లో" కలిసి
సచివులు కాక్ టెయిల్
ఉతార్ పెగ్గులేద్దురు బెల్ట్ షాపుల్లో..

హయ్యర్ హైరార్కీ కి మేళ్ళు,
జనాలకి రాళ్ళు మిగిలి,
పళ్ళెప్పుడో ఊడి,నిజాల్నమిలీ నమిలీ,
తలొకటే ఖాలీ, పగిలేందుకు..

యువరాజేడి కనపడ్డూ
కోచింగా సార్వత్రికెన్నకల్లో ప్రధానిగా,
ఉద్యమాలేవి వినపడవూ
మళ్ళీ వ్యూహాత్మక మౌనమా,

B.P.L కింద
కాందిశీకుల ద్విధావిఛ్చిత్తి,
I.P.L మీద పెద్దతలల
కరెన్సీ చెయిన్ రియాక్షన్..
ఛ, దరిద్రగొట్టు దేశం,

-"పట్టుకోండ్రా వాణ్ణి,
ఇన్సల్టింగ్ ది నేషన్ ఇన్ పబ్లిక్,
కాగ్నైజబుల్ అఫెన్స్,
వారంట్ భీ అవసరం లేదు,
నూకండి బొక్కలో"

నా జన్మభూమి ఎంత అందమైన దేశమూ,
నా ఇల్లు అందులో ఒక కమ్మని ప్రదేశమూ....

date 27.08.12

26, ఆగస్టు 2012, ఆదివారం

వంశీదర్ రెడ్డి || విశ్వ సంగీతం ||


తన్యతకు తెగిన
ఆకాశపు ఫిడేల్ తీగల్ని

ఎడతెగని ఆలోచన్లతో అనస్టమోస్ చేసి,
సెరెబ్రల్ కపాలం తెరిచి
శుధ్ద గాంధారాల్నీ, సుప్త సంగీతాన్నీ
ఆవహిస్తూ,

మురళికంటిన బ్లాక్ హోల్స్ లో
హీలియం గాలులూది
నిషాదపు విషాదం రవళిస్తూ,
ముహుర్ముహుర్లుఠతభంగతరంగ మృదంగ ధ్వానాన్ని
చేతి వేళ్ళలోకి గుండెని లాగి సృష్టిస్తూ,

విశ్వ సంగీతపు ఒపెరాలో
మిల్కీ వేలు దాటుతున్న
అయస్కాంత తరంగాల షడ్జమ స్వర యాత్రలో
ఔడవ ఆరోహణ తుది మెట్టు
దేవ రహస్యాల్ని గుప్పిట చూపిస్తూ

ఉఛ్వాస నిఛ్వాసల జుగల్బందీ ఓంకారమై
నాకే వింతగా విన్పిస్తూ,
సకలం కొత్తగా కన్పిస్తూ...

25 aug 2012

వంశీ // విశ్వ సంగీతం //


తన్యతకు తెగిన
ఆకాశపు ఫిడేల్ తీగల్ని
ఎడతెగని ఆలోచన్లతో అనస్టమోస్ చేసి,
సెరెబ్రల్ కపాలం తెరిచి
శుధ్ద గాంధారాల్నీ, సుప్త సంగీతాన్నీ
ఆవహిస్తూ,

మురళికంటిన బ్లాక్ హోల్స్ లో
హీలియం గాలులూది
నిషాదపు విషాదం రవళిస్తూ,
ముహుర్ముహుర్లుఠతభంగతరంగ మృదంగ ధ్వానాన్ని
చేతి వేళ్ళలోకి గుండెని లాగి సృష్టిస్తూ,

విశ్వ సంగీతపు ఒపెరాలో
మిల్కీ వేలు దాటుతున్న
అయస్కాంత తరంగాల షడ్జమ స్వర యాత్రలో
ఔడవ ఆరోహణ తుది మెట్టు
దేవ రహస్యాల్ని గుప్పిట చూపిస్తూ

ఉఛ్వాస నిఛ్వాసల జుగల్బందీ ఓంకారమై
నాకే వింతగా విన్పిస్తూ,
సకలం కొత్తగా కన్పిస్తూ...
25 -8- 2012

23, ఆగస్టు 2012, గురువారం

వంశీ || బెస్ట్ సెల్లర్ ||


నిద్రగన్నేరు నీడన
తలబాది తవ్వితే మొలిచిన తాజా కలలు,
స్వప్న భేదనానికి ఫ్రాయిడ్నీ
తత్వ రహస్యాలకు సార్త్ర్ నీ, సాంకృత్యాయన్నీ రమ్మని,
అపరిష్కృత కాలమమ్మి కొనుక్కున్న కలల్ని,
ఎదురెదురుగా కూర్చుని
మెదడు మూలాల్లో నిక్షిప్తీకరిద్దాం,
నువ్వే నాయకుడివి,
అసంభవాల్నీ,అద్భుతాల్నీ దర్శించి
ఆనందంతో చరిద్దాం,

తొలిప్రేయసి జడ రాల్చిన గులాబీ రెమ్మలు,
తుదిశ్వాసకి సంతకమిస్తున్న మితృడి రెప్పలు,
విశ్వయాత్రకి నభస్సుకెగురుతున్న పక్షి రెక్కలు,
నీ రుధిరఙ్నాపకాల్తో గర్భోద్భవమైతున్న శైశవ రూపాలు,
ఒక్కసారి స్పర్శించి,
మనోవల్మీకమంజూషాల్లో కుడ్యచిత్రాల్లా
పదిలపరిచి తేజోన్మత్తులమవుదాం..

నీ నీడకీ కలలుంటాయేమో
పురానాగరికతలోకి జారిపోవాలని,
నీ ఆత్మకీ కలలు కావాలేమో
పొరల శరీరాన్నొదిలి పారిపోవాలని,
ఒక్కసారి అడిగి చూడు,

నిజంకాని తలరాతలు
తోడిచ్చిన నిద్రలేని రాత్రుల్నీ,
కాలిబూడిదైన అనుభవాలు
విదిల్చిన అసంతృప్త స్మృతుల్నీ,
అనస్థిత్వపు దృక్కోణాలు
మిగిల్చిన అసంబధ్దపు ఊహల్నీ,
విషాదపు క్షణాలు
శిథిలీకరించిన అశృబిందువుల్నీ బహిష్కరించి,
కావాలనుకున్న కలలు భుజాన మోసుకెళదాం
ఆలోచనల వెన్ను నొప్పి పుట్టేంతవరకు,
రావాల్సిన రేపటి రోజుని ముందే ఆవిష్కరిద్దాం
కోరికల కళ్ళు వెలుగులతో నిండేవరకు,

నిద్రగన్నేరు నీడలో
కలిసి నవ్వితే కనిపించే తాజా కలలు,
నువ్వే నాయకుడివి,
అసంభవాల్నీ,అద్భుతాల్నీ దర్శించి
ఆనందంతో చరిద్దాం...

22, ఆగస్టు 2012, బుధవారం

వంశీ || లెట్ ద వరల్డ్ గో టు హెల్ ||


లోకానికి నేన్నచ్చట్లేదెందుకో,
ఏం కనిపించిందో కొత్తగా
ఇన్నాళ్ళు లేనిది,
ఏం అన్పించిందో అంతగా
ఇప్పుడే బైటికొచ్చింది,
ఎవరికెవరున్నారు, నాకు నేన్తప్ప,
లెట్ ద వరల్డ్ గో టు హెల్,
కోయీ ఫరక్ నై పడ్తా,
నా ఆలోచన్ల ఆకలి,
భ్రమల బ్రతుకు నాకుంది..

దరిద్రాన్నీ దర్జాగా అనుభవిస్తూ,
లేని అందాన్ని దొంగచాటుగా గమనిస్తూ,
రాని మాటల్నీ మూటకట్టి విసిరి గమిస్తూ,
కపిత్వం తలకెక్కించుకుని నిగర్వినని గర్విస్తూ,
-"స్టాప్ దట్ గ్రాండియస్ థాట్ ప్రాసెసింగ్,
ఏం పొడిచావనందరూ మెచ్చాలి,
ఏదో చేస్తావని ఎవరెందుకు చూడాలి"

మనిషత్యంత తెలివైన తెలివితక్కువోడొరేయ్,
మెంటల్ రిటార్డెడ్నెస్
నీ గుర్తింపు పెంచుతూ,
ఇంటల్లెక్చువల్ బ్లాస్ట్స్
నీలోపలి గాలికి వెంటిలేషనిస్తూ,
నీ ఉనికి నీ వరకే,
నీ నిష్క్రమణ నీ కొరకే,

ఎవరేమనుకుంటే నాకేం,
నేనెలాపోతే ఎవరికేం..
లెట్ మి గో టు హెవెన్స్, అసలు,
స్వర్గానికెవడు పోగలడు ఒక్క తప్పూ చేయక,
స్వప్నాలనెవడు చూపగలడు ఒక్కటైనా దాచక,
సత్యాలనెవడు మెచ్చగలడు, ఓటమన్నదే ఎరగక,

పరిగెడ్తున్న రహదార్లెనక అలిసిపోతూ,
పరుగాపనన్న రేపుని చేరలేక ఆరిపోతూ,
నా చిర్నవ్వుల చింతలూ
మాడుపగిలే వింతలూ నాకున్నాయ్..

లెట్ ద హిప్పోక్రాటికల్ హైపోథెటికల్
కాన్స్పిరేటరీ ఇల్లాజికల్ మూవింగ్ వరల్డ్ గో టు హెల్,
కోయీ ఫరక్ నై పడ్తా,
నా విఙ్నానపు అఙ్నానం,
వేదనాభరిత నివేదనలూ నాకున్నాయ్...
*21.8.2012

వంశీ || యూథనేషియా ||


H.I.V పాసిటివ్,
వెస్టర్న్ బ్లాట్ అబధ్దాల్చెప్పదు,
ఏడవాలనుందోసారి, చస్తానని
తెల్సినా కన్ను తడవనీని గుండెదే ధైర్యమో,
నన్నెవరైనా చంపరూ
రేపుని చూడనీక, ఈ రాత్రిలోనే ఉండేట్టు..

"గ్రీఫ్ రియాక్షన్"
డినైల్, యాంగర్, బార్గెయిన్,డెత్ ఫియర్,యాక్సెప్టాన్స్..
ఆ దశలేవీ చూడకనే అంగీకరిస్తూ,
పుణ్యకార్యమేం కాదుగా చేసింది,
ఆర్నెల్ల కింద గోవాలో పాపం,
పెరిగి పండై పగిలి ఇలా..

సంతాపసభలో
నా చావుక్కారణం ఏమంటారో,
ఉప్పునీళ్ళు నరాల్లోకెక్కించుకునా,
ఆక్సిడెంట్లో శరీరం ఛిద్రించుకునా,
ఉరేస్కుని మృత్యువు ముద్రించుకునా,
విండో పీరియడే, ఇంకా రెండేళ్ళకు
ఇమ్యునిటీ తగ్గి రోగాలు, బరువు తగ్గి భయాలూ..
అందుకే చంపడ్నన్నిప్పుడే,
ఐ కాంట్ కిల్ మైసెల్ఫ్..
ఆలోచన్ల అలజడి కంట్లో మేఘాలు కదుపుతూ..

"పాపానికి ప్రాయశ్చిత్తం లేదు
నివారణొకటే మార్గం"
మొన్న కొన్న స్కోడానీ,
మందులో కలిపిన సోడానీ,
కావాల్సిన భవితనీ,
రావాల్సిన అనుభవాల్నీ,
చేయాల్సిన పనుల్నీ,
చూడాల్సిన కలల్నీ, వొదిలి
మహాప్రస్థానానికి కదుల్తూ,
సినిమాలో చివరి రీల్ మొదలైనట్టు..

రక్తంలో వైరస్ వీరవిహారం తెలుస్తూ,
నిజానికదీ నేనూ ఒకటే,
విశృంఖలతే, స్రావాల్లో సుఖిస్తూ,

లోకం చిలకరించే చిల్లర జాలినీ,
సంఘం దయతల్చిచ్చే ప్రత్యేక గుర్తింపునీ చేరకముందే,
నానుండి మరొకరికి వ్యాధిసంక్రమణం చేయకముందే,
చంపడ్నన్ను, ప్లీజ్,
యూథనేషియా,
యూథనేషియా..
*21.8.2012

19, ఆగస్టు 2012, ఆదివారం

వంశీ // ఫేస్ లెస్ ఫేస్ //


ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్??
నాలాంటోడు
ఏడుపుకీ నవ్వుతూ,
గౌరవాన ముంచిన మాటల్తో,
భయం పూతేసిన చేష్టల్తో,
కుట్రకి కొత్తరంగులేస్తూ చరిస్తూ..
దెన్, దేర్ ఈజ్ నో ఇండెక్స్ ఫర్ మైండ్..

మరి మనిషాలోచన్ల
మూల క్రమ విన్యాసాల విపరీతాల గుట్టెలా..
నిజాలకు నాలుకలు మొలిచి
రహస్యాలు రీసైకిల్ బిన్లోంచి రీస్టోర్ అయేట్టు,
మనిషిని ప్రేమించినట్టు నమ్మించాలిక..

అసత్యమాడందెవరిక్కడ,
దేవుడున్నాడనీ,
ధర్మం పరిగెడుతుందనీ,
ప్లటోనిక్ ప్రణయాలనీ,
ముద్దు తీపనీ,
చావంటే భయం లేదనీ,
ఇంద్రియ నిగ్రహముందనీ..

కావాలని అమ్మాయిని తాకుతూ అమాయకపు మొహం,
తప్పు చేసి దొరికితే అయోమయపు మొహం,
చౌరస్తాలో అగమ్యపు మొహం,
చీకట్లో అరాచకపు మొహం,
తల కలిస్తే, కల స్ఖలిస్తే ఆనందపు మొహం,
నన్ను మించినోడ్ని చూసి అనుమానపు మొహం,

"హోమోసెపియన్ ఎంటర్ ప్రైజెస్,
ఎక్స్ చేంజ్ యువర్ ఓల్డ్ ఫేసెస్ విత్ న్యూ వన్స్..
కండీషన్స్ అప్ప్లై "
దేవుడికీ ఇన్ని రూపాలుండవటగా,
"అహం బ్రహ్మస్మి"

స్వ వచో విఘాతినై, స్వ ముఖ వినాశినై,
నాకు నేనెన్నోసార్లేస్కున్న I.P.C 302 Cr.P.C సాక్షిగా,
అసల్నా అసలు ముఖమేదో ?
ఫేస్ ఫౌండర్ ఉండాల్సింది
అంగారకుడి మీది పాత్ ఫౌండర్లా..

రవిగాడ్లేచాడే,
మోహాల్ని మొహాల మడతల్లో కప్పెట్టి,
కోరికల్ని కార్నియా కన్నాల్లో కుదించి,
మరో రోజులోకీదుతూ..

ఉపసంహారం :
ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ నీడ్,
మైండ్ ఈజ్ ది కాండక్ట్ ఆఫ్ ఫేస్,
పదండి తోసుకు
ముఖాలు మార్చుకు
విషాలు చిమ్ముకు
నిజాలు దాచుకు
పోదాం పోదాం రేపటికి....



*18-08-2012

9, ఆగస్టు 2012, గురువారం

వంశీ // ది క్రానికల్స్ ఆఫ్ లవ్ //

"వెన్నీ వేర్ ఆర్ యూ,
వెన్నీ, ప్లీజ్ కం బాక్"


అప్పటి నా అరుపుల్నాకింకా విన్పిస్తూ,
ఇప్పటి నేనెప్పటికీ నిన్ను క్షమించలేనేమో అన్పిస్తూ,

లవ్
ఈజ్ ఎ కాలిక్యులేటెడ్ సెల్ఫిష్ బాస్టర్డ్

నా ఇష్టాల్నీకు నచ్చలేదనో,
నీ కారణాలు నాకు చెప్పాల్సొస్తుందనో,
నేన్నిన్ను మరవడానికి నువ్ సృష్టించిన
నీ "మరణమనే" అబద్దంలో సహగమించి

ఆర్నెల్లు
నా ఆత్మ కడుపు మాడ్పించి,
నీ ఙ్నాపకాల ముసుక్కప్పిన నా గదిగోడలకు
ఆలోచన్లు పోగేస్కున్న తల బాదుకుంటూ, బదులడుగుతూ,
వొంటరిగా ఫోమ్ బెడ్ మీద, నీ నగ్నత్వం
వొదిలెళ్ళిన నాటి మరకల కమురువాసన్లు పీలుస్తూ,
నీ నవ్వుల్నిండిన నా కలల్నిబహిష్కరిస్తూ
నిద్రని మింగి,
మన ఫోటోలు కాల్చిన మసి వొంటికిపూసి
నిన్నావహించిన క్షణాన
సమయమాగేట్టు గడియారం బద్దల్చేసి...

"యూ ఫూల్,
డోంట్ బి మాసోకిస్టిక్, జస్ట్ కిల్ హర్,
ఎవడి పక్కలోనో, వాడి ఊహలకు ప్రాణం పోస్తూ,
షిట్, కిల్ దట్ బిచ్
కత్తదుగో, లూసర్, హ హ హ"

లేదు, లేదు,
వినొద్దు వినొద్దు, మెదడ్లో మరోమనిషిని,

కుడిచేతి మీద తన పేరును
కసిగా, ఆనందంగా, సంతృప్తిగా పొడుస్తూ
చెరిపిన బాధలో కనపడ్తూ నాటి
నా "వెన్నెల",
"ఐ హేట్ యూ" అంటూ,

నా దుఃఖం లోకానికి
తర్జుమా ఔతున్నట్టు వాన, బైట..
అట్టలు కట్టిన రక్తప్రవాహప్పొరల్లో
నన్ను నేను వెతుక్కుంటూ,
యుగాల్తర్వాత సుషుప్తినాహ్వానిస్తూ,

కల
మేఘాల్లో మూలుగుతున్న తన రొమ్ములకు
కాలపు దారాల్తో ఉరేస్కుంటూ,
కాస్మిక్ ఆర్గసమ్ అనుభవిస్తున్నట్టు ..

స్టిల్,
ఐ లవ్ యూ వెన్నీ..

*09-08-2012