పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

10, ఆగస్టు 2012, శుక్రవారం

కె. కె //లక్ష్యం//

దిద్దుబాటు లేకుండా రాసిన కవితంటూ ఉందా?
సర్దుబాటులేని జీవితముంటుందా??


ఓడినంతమాత్రాన నీ జాడ మరుగైనట్టుకాదు,
సానుభూతికోసం ప్రయత్నిస్తూ చతికిలపడకు.
ఓడిపోవడం చెడ్డపని కాదు,
అలాగని,ఆగిపోవడం దొడ్డపనికాదు.
ఓటమి కారణాలు చెప్పేందుకు ప్రయత్నించకు,
గెలుపు తోరణాలు సిద్ధించేందుకు యత్నించు.

ఓడినవాడి కారణాలు వినేదెవ్వడు,
గెలిచినవాడ్ని కారణాలు అడిగేదెవ్వడు.

అలసిపోతే ఆశించిన ఫలితం దక్కదు,
లక్ష్యం... మగ్గిన మావిడిపండు కాదు,
గాలికి రాలి నీ చేతిలో పడేందుకు.
నిట్టూర్పుని నిషేధించు,
బద్దకాన్ని బహిష్కరించు,
నిర్విరామ సాధన చెయ్,
గెలుపు నీ తలుపు తట్టకమానదు.

గురి ఉంటే విడిచిన శస్త్రం, లక్ష్యం చేదించక మానదు.
దృఢచిత్తం ఉంటే గమ్యం,ముంగిట్లో వాలక ఆగదు.

*09-08-2012

శ్రీకాంత్ ఆలూరు||''నేను నకిలీనెట్లైత''||

నేనెట్ల నకిలీనైత
నా అణువణువు లో
ప్రాణాన్ని ప్రవహింపజేసి

నా హృదయానికి తొలిసారిగా
స్పందనలు కలుగజేసి నాలో
జీవాన్ని జనింప జేసింది
ఇక్కడి గాలే ఐనప్పుడు,
నా మెదడు లో మెమొరీ గదులు
వృద్ది చెందక ముందు నుండీ
ఈ మట్టినే తిని పెరిగినప్పుడు,
పాఠ్య పుస్తకాల్లో వక్రీకరించబడ్డ
చరిత్రనే కాదు
మా ఇంటి గోడపై రాసున్న
విప్లవం వర్దిల్లాలన్న నినాదాన్నీ
నేర్పింది ఈ గడ్డే ఐనప్పుడు,
నేను నకిలీనెట్లైత..

జారిపోతున్న లాగుని పైకి లాక్కుంటూ
ఉరుకెత్తుతున్న కాలువలో వదిలిన
బతుకమ్మ వెంబడి
పూలన్నీ వేటికవే పూర్తిగా
విడిపోయి ప్రవాహం లో కలిసిపోయేదాకా
పరుగెత్తి ఆయాసం తో నిట్టూర్చినపుడు,
హోళీ కి మూడు రోజుల ముందునుంచి
మోదుగ పూల రసంతో
రంగులు తయారు చేసినపుడు
సవాసగాళ్ళంతా జాజిరి కర్రల
కోలాటమాడుతూ ఊరంతా తిరుగుతుంటే
వాళ్ళతో పాటు పాటలు పాడుకుంటూ
వెళ్ళినపుడెపుడూ నన్ను నకిలీ అన్లేదు
మరి ఇప్పుడు ఎట్ల నకిలీనైన??

ఊహ తెలిసిన నాటి నుంచి
గర్వం గా తలెత్తుకుని
మాది వరంగల్ అని
చెప్పుకోవడమే నాకు తెలుసు
అప్పుడెప్పుడూ నా గొంతులోని
శబ్దాల ఎత్తుపల్లాలని
ఎవరూ తరచి చూడలేదు
ఇప్పుడు అదే మాట చెప్పడానికి
మాటని మాడ్యులేట్ చెయ్యాల్సి వస్తోంది
గొంతులో ఏ మాటనైనా
ఈ ప్రాంత యాసలో పలికే
వాయిస్ ఫిల్టర్లు పెట్టుకోవాల్సి వస్తోంది
రెండు భాషలు మాట్లాడటం
అదనపు అర్హతయితే
రెండు యాసలు మాట్లాడితే మాత్రం
మనిషి నకిలీ ఐతండు..

అనివార్యం గా సంక్రమించిన
అనువంశిక చుట్టరికాలు తప్ప
ఆ ప్రాంతం తో
ఎటువంటి మానసికానుబంధం లేనందుకు
అక్కడి వాళ్ళకి నేను
''నైజామోణ్ణీ'
నా భాషలోనో, నా యాసలోనో
ఎక్కడో ఓ మూల
ఆ ప్రాంత అవశేషాలు
నాలో ఇంకా మిగిలి ఉన్నందుకు
ఇక్కడి వాళ్ళకేమో
''సెటిలర్నీ'
ఇప్పుడు నేను
ఇద్దరికీ నకిలీనే

ఇవన్నీ పక్కన పెడితే
నా కులం నన్ను నకిలీని చేసిందట
ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి,
ఇక్కడే చదువుకుని, ఇక్కడివాడిగానే
బతుకుతున్నా
నా ప్రమేయం లేకుండానే
ఆ కులం లో పుట్టినందుకు నేను నకిలీనైన

ఇంకా నేనెందుకు నకిలీనైన్నంటే
ఉద్యమాన్ని భుజానేసుకోక పోగా
కనీసం ఆ ముసుగైన తొడుక్కొని
మాటకి ముందొకసారి, వెనకొకసారి
నినాదాలు పలకనందుకు
రాజ్యాధికారం కోసం పోరాడాల్సింది
పెట్టుబడిదారీ వ్యవస్థ పైనా?
రాజకీయ వ్యవస్థ పైనా?
అని ప్రశ్నించినందుకు
ప్రత్యేక రాష్ట్రం ఎందుకు కావాల్నో
నాదైన అభిప్రయాన్ని చెప్పినందుకే
బహుషా నేను నకిలీనైంది

*10-08-2012