పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, నవంబర్ 2013, సోమవారం

భూమధ్యరేఖ




"శ్లోకం శోకత్వమాగతః"అని ప్రాచీనులు.అసలు భారతీయ లౌకిక సాహిత్యాత్మే శోకంతో ప్రారంభమయింది."మానిషాద" శ్లోకం అందుకు ఉదాహరణ.జీవితానికి ఒక గతి ఉంటుంది.ఆ గతికి దగ్గరగా కొన్ని పరిసరాలుంటాయి.ఆ పరిసరాల భావజాలానికి అతని ఆలోచనకి ఏర్పడే పారస్పర్యం వల్ల అతని మానసిక సంస్కారం రూపొందుతుంది.ఈ సంస్కారమే అతని చుట్టూ ఉన్న పరిసరాలని,జీవితాన్ని పరిచయం చేస్తుంది.

కాశీరాజు కవితలో దుఃఖానికి సంబందించిన అవగాహన ఒకటి కొత్తగా ,నిలకడగా కనిపిస్తుంది.ఈ మధ్య తనురాసిన కవితలలో జీవితాలవెనుక ఉన్న అనిర్దిష్టసంఘర్షణకి,ఇదీ అని అంచనా వేయలేని గతికి రూపాన్నిచ్చాడు.సాధారణంగానే ఈమధ్యకాలపు కవిత్వం వస్తువులోకి తీసుకెళ్లేందుకు మానసిక పరివర్తనలని ఉపయోగిస్తుంది.



కాశీరాజుకూడా అందుకు కావలసిన నిర్మాణాన్నొకదాన్ని ఏర్పరచుకున్నాడు.వస్తువును పరిచయం చేయడానికి పరిమితి(Limit)ఒకటుంటుంది.తాను ఒక వర్గానికో ప్రాంతానికో (తప్పనిసరై )చేరడం ఒకటైతే,జీవితాన్ని పరిచయం చేయడానికి ఒక నిర్దిష్ట పాత్రని తీసుకోడం మరొకటి.ఇలా తీసుకున్న పాత్ర నాన్న.నాన్న స్వభావం చెప్పడానికి ఒక సన్నివేశాన్ని రూపొందించి అందులోకి తీసుకెల్తాడు.

"ఇళ్ళు కట్టేపనికే ఎందుకెల్తావ్" అని అడిగావ్ గుర్తుందా
కూలివ్వకపోతే కూడన్నా పెడతాడని
పనికెళ్ళి అక్కడే తినేసొత్తే, ఓ పూట బియ్యం ఎనకేద్దామని
మిమ్మల్ని కాత నవ్వుతూ సూదామని
ఒంట్లో జివలేకున్నా సులువైన పని కాదు, తెలివైన పనే ఎతుకున్నా!"

నిజానికి ఇక్కడపరిచయం చేస్తున్నది,పాత్రని మాత్రమేకాదు,జీవితాన్ని దాని వెనక ఉన్న సంఘర్షణని.స్థితిని,సంక్లిష్టతని.దీనికి మరో మెట్టు రెండవ యూనిట్.ఇక్కడనించే అసలువస్తువుకు సంబంధించిన అంశం ప్రారంభమయ్యేది.

"ఒరేయ్ బంగార్రాజు ! ఆ బగమంతుడు
ఆకలి అక్సాంసాల్నీ, అత్మాభిమాన రేఖాంసాల్నీ ఓ చోట కలిపి
అది మన చుట్టూ తిరిగేట్టు చేసిన భూమధ్యరేకేరా ఈ ఏడుపు
భాదపడకు
అది మన బ్రమనాన్ని బతుకుచట్రం లో నుండి తప్పిపోనియ్యదు"

ఇక్కడినుంచే బతుకులోని దుఃఖ తాత్వికతని కవిత్వంగా అందిస్తాడు.

"ఆకలి అక్సాంసాల్నీ, అత్మాభిమాన రేఖాంసాల్నీ ఓ చోట కలిపి
అది మన చుట్టూ తిరిగేట్టు చేసిన భూమధ్యరేకేరా ఈ ఏడుపు"

"మన గోదారి సూత్తే తెలీదా భాదంటే మేఘమని
ఏడుపంటే వానని, ఏడవడం అంటే ప్రవాహమని"

"దుక్కమొస్తే దాసకోరేయ్
ఎలాగైనా నువ్వూ, నేను నీరైపోవాలి
గుర్తెట్టుకో ఏడుపు ఇంకితే ఎక్కడా ఉండలేం."

"ఇయ్యాల నేను , రేపు నువ్వు
ఒకడు సెప్పినంత, ఇంకోడు ఇన్నంత
దుఃఖానికి కొత్త అభివ్యక్తి దొరకదొరేయ్ "

ఈ దుఃఖ గీతవెనుక ఒక అనుభవధార ఉంది.బలమైన తాత్వికాభినివేశముంది.సాధరణ సంభాషణామాధ్యమాన్ని ఎన్నుకున్నా పాత్రల మధ్య ఉండే సంభావ్యతా ధర్మమొకటి ఉపదేశ గుణాన్ని ఆపాదించింది.

"నీకైనా ,నాకైనా దుఃఖానికి మూలం దొరికిపోయాక
అడుగులు తిన్నగా పడ్తాయ్"-దుఃఖం జీవించడం నేర్పుతుందనే అంశాన్ని ప్రకటిస్తున్నట్టుగా కనిపించేవాక్యం ఇది.తరువాతి వాక్యం మళ్లీ గంభీరమైన వచనాన్నించి సాధారణతవైపు తీసుకెళ్తుంది.

అస్తిత్వ వాదులు జీవితంలో మృత్యువుతో పాటూ,దుఃఖాన్ని ప్రేమించారు.ఇందులోనూ ఆ భావన కనిపించినా ఈ కవిత వైయ్యక్తికమైనదికాదు.దీని చుట్టూ కుటుంబం,దాన్నించి ఒక సామాజిక ఏకాంతం(Social Isolation)ఉంది.

కాశీరాజు పట్టుకున్న జీవధార లాంటి భాషని గురించి కూడా మాట్లాడుకోవాలి.మాండలికాల్లోనే కవిత్వం రాస్తే చేరదనే మాటని తప్పుచేస్తూ అనేకమైన కవితలు,సాహిత్యం కనిపిస్తాయి.కాశీరాజులోను ఇందుకు ఉదాహరణలున్నాయి.యానం వాసనలతో మరోమంచిగొంతుకను కాశీరాజు రూపంలో పొందినందుకు సంతోషంగా ఉంది.                                                           

                                                                                             










                                                                                                        _________ఎం నారాయణ శర్మ