పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

18, జులై 2012, బుధవారం

మెర్సీ మార్గరెట్ కవిత


పచ్చ పచ్చగా
ఆ గడ్డి పిలుస్తోంది నన్ను
ఇంత మంచి స్థలం వదిలి
ఈయనేంటి అటేటో వెల్తాడు ?

దాక్కుని దాక్కునే వెళ్తున్నా హమ్మయా
నా" స్నే"హితులందరూ కన్నాముందుకెల్లాయి
యాహూ ...
ఇంకే ఇష్టమున్నంత సేపు ఆడుకొని వెళ్తా
ఏయ్ కొండ కోన
వాగు వంక
చెట్టు చేమ
నాతో పాటు కలిసి పాడేయండి
చిన్న గొర్రె పిల్లనేను ఏసయ్యా అని

ఏంటి
గుండెలు దద్దరిల్లేలా గర్జిస్తున్న శబ్దం
సింహమే ..
అవును సింహమే

చక్కగా ఆయన ప్రక్కనే నడుస్తూ
దుడ్డు కర్రతో అందించిన ఆకులు అలములు
తింటూ ..
పచ్చిక జలాలదగ్గర తీస్కెళ్ళి సేద తీరుస్తుంటే
ఊరుకోక
నాకు నేనే తెచ్చుకున్న ఉరి ..
పరుగెత్తి పరుగెత్తి వచ్చి పడ్డ ఇదే
అపవాది నాకై త్రవ్విన ఊబి

ఆ శబ్దం నా దగ్గరకొస్తుంది .. అదో వచ్చేస్తుంది
నా పాట గాలిలో కలిసినట్టు
నేనూ కలవాబోతున్నాని తెలుసు
ఒక్కసారి నా కాపరి స్వరం విన వస్తేబాగు
అరిస్తే -"నేను " దొరికిపోనా ఆ సింహానికి
దేవా ఎలాగు ?

మూసుకున్న కళ్ళలో ఆగని కన్నీరు
వీడి వచ్చిన జీవాన్ని గుర్తు చేసుకునే తీరు
తిట్టుకుంటే ఏంటి ఇప్పుడు బుద్ది లేదు లేదు
ఇంకెక్కడి ఆశ పోతుంది ప్రాణం ఎలాగు
క్షమించు నా కాపరి దారి తప్పిన పిల్లను

దగ్గరవ్తున్న సింహపు శబ్దం..

నా మెడ నొక్కు తున్నదెవరు ఊపిరాడడం లేదు
కాపరి దుడ్డు కర్ర మెడచుట్టు చేసిన గాయం చూడు
అయినా పర్లేదు నేను బ్రతికి పోయా
తను కొట్టినా నన్ను... నాకు బ్రతుకు నేర్పటానికే నేడు

ఎంత ప్రేమ చూడు ఆయనకి
నాకోసం గాయాలు తగిలించుకొని రక్తాలు కారినా
నా గాయాలు కట్టి నన్ను ఎత్తుకున్నాడు
ఆ కళ్ళలో నుంచి నాకోసం
ఆరాటంతో కారుతున్న కన్నీరు
అలా నా మొహాన్ని తడుపుతుంటే
ఇంకెప్పుడూ ఆ ప్రేమని నా కాపరిని
చచ్చిపోతున్నా వదలనని
కారుతున్న నా కన్నీరు
గాయపడి స్రవిస్తున్న
తన పాదాలపై ప్రమాణ పూర్వకంగా ..

*18-07-2012

వేంపల్లి గంగాధర్ కవిత

మనిషి
చస్తూనే ఉంటాడు
పుడుతూనే ఉంటాడు ..
ఇదొక జనన మరణ చక్రం !

భూమి బల్ల పరుపు గా ఉందా ...
గోళా కృతి గా ఉందా ...అని
వాదించి ప్రాణాలు పోగొట్టుకున్న వారికి ...
సత్యాన్ని తెల్ల గులాబీ గా ప్రకటించిన వారికి ...
మరణ కొయ్యకు ముళ్ళ శయ్య కూడా
నెత్తుటి జ్ఞానం దిద్దిన మహర్షులకు ....
జనం ఆకలి కేకల మధ్య
వరి కంకుల్లా మొల్చుకొచ్చిన వారికి ...
హక్కుల కోసం ...
నీ దిక్కుల కోసం..
గుక్కడు నీటి చుక్కల కోసం ...
గుప్పెడు నోటి మెతుకుల కోసం ...
ఆయుధమై నిలిచి అమరు లైన
అరణ్య యోధులకు ...
ప్రజల కళ్ళ ల్లో .. ఇళ్ళ ల్లో ... గుండె గుళ్ళల్లో..
పాఠం నేర్పే బళ్ళల్లో... పంట మళ్ళల్లో ...
నాలుగు బజార్ల కూడళ్ళలో ...
పిడికిలి నినాదమైన యోధాను యోధులకు ...
పాల రాతి సమాధులు అవసరం లేదు ...!
ఉదయం పుష్పించే వెలుగు లో
ఎర్ర తురాయి వర్ణం వారి ప్రాచీన పతాకం...!

రాజ్యం ఉక్కు పాదం...
ఒక ఇనుప ఖడ్గం ...

మనిషి
చస్తూనే ఉంటాడు
పుడుతూనే ఉంటాడు ..
అదొక నీటి బుడగ
నువ్వొక పాము పడగ

అసలు నిజమైనా
మనిషి ఎలా ఉంటాడో
నువ్వు ఎప్పటికి తెలుసుకుంటావు ?

www.vempalligangadhar.com
*18-07-2012

స్వాతి శ్రీపాద || కాస్సేపాగు ||

రణగొణ ధ్వనులతో తుళ్ళిపడే
వాస్తవం అల్లరి పాపాయిని
మగత మునివేళ్ళ లాలితో నిద్రపుచ్చి
నిశ్శబ్దం పరదాలను సరిచేసి
మన ఏకాంత బృందావనం లోకి
ఆగమేఘాలపై వచ్చేస్తాను
కాస్సేపాగు

ఉదయం నుండి వెలుగు శూలాలు
నీకూ నాకూ మధ్యన గోడ కట్టినా
తెరవెనుక కదిలే నీడల ప్రదర్శనలా
ప్రతిపదం నీ తలపుల్లో దొర్లి పెదవిపైకి పాకిన
మధురానుభూతినడుగు
చూపు ఏమూలలను వెతికినా
ప్రతి లిప్తల్లోనూ నెమరేసుకున్న
మన సు కదలికల నడుగు
ఒత్తిగిలిన మౌనం పొత్తిళ్ళలో ఒదిగి
నాచుట్టూ కవచమై నిలిచే నీ ఉనికిని అడుగు
అనుక్షణం పీల్చే నాఊపిరి గాలివి నీవని
మళ్ళీ చెప్పాలా
కాస్సేపాగు
మన ప్రపంచం ఉద్యమించేందుకు.

18-07-2012

పులిపాటి గురుస్వామి || ఎప్పటికప్పుడు గుండె తడుపుకోవాలి||

అంతా వెళ్ళిపోయాక
అడుగులచప్పుడు గాల్లో లీనమయ్యాక
ముసురు తుఫాను మనసు
ఎటూ పోలేక

ఓ మూల ఒంటరిగా
పిల్లి ముడుచుకున్న అవయవాలతో
దేహం...
నేల మీద నడవని కనురెప్పల
కాసేపు మూసి

ఇక్కడినుంచి ఎటెల్లాలో
పొట్టకూటికోసమో ,మరెవరి కోసమో
ఈలోపునెవడో కట్టెతోనో
తుపాకీతోనో
ఓ చురకత్తి వాక్యం తోనో
సమాప్తం చేయవచ్చు

ఎలాగైనా ఈలోపు
ఆలోచనల్ని ,దాన్ని చుట్టిన
పువ్వుల గుభాళింపు బంధాల్ని
పెనవేసుకున్న పచ్చదనాన్ని మాత్రం
బతికించుకోవాలి.
18-07-2012

జిలుకర శ్రీనివాస్ కవిత

ఒంటి నిండా జ్వరం
మనసు నిండా మౌనం
రాత్రి గదిలోని మేకుకు నన్ను వేలాడేసుకున్నాక
వానకు తడిసిన అంగ్గి ఒకటే వణుకు
భుజం మీది కన్నీటి మరకలు ఎంతకూ ఆరవు ఏం చేయను

నీ పెదవి విరుపులైనా పర్లేదు
అవి విసిరే తుపాకీ తూటాలు తాకినా పర్లేదు
నీ కంటి కింది ఎర్రని చారలు నా ఎద మీద భగ్గున మంట పెట్టినా పర్లేదు
చేసిన నేరానికి ఎలాంటి విచారణ లేకుండానే
నీ పాదాల కింద పాతిపెట్టినా పర్లేదు
నీ మాటలు విని నిన్ను అతి దగ్గరగా చూడాలనే వచ్చాను

తాగే నీళ్ళ కుండను పలగ్గొట్టిన పిల్లోన్ని
అయ్యో ఏందిరా ఇది అని ప్రేమగా విసుక్కునే తల్లిలా నువ్వు
మట్టిలో ఆడుకుంటూ దుబ్బంతా మీద పోసుకున్న తమ్మున్ని గద్దించే అన్నలా నువ్వు
తప్పుడు గీతల న్నింటిని చెరిపి కామిక్ బొమ్మలు వేసే చిత్ర లేఖివిలా నువ్వు
నేరాల వెనక మానసిక చిత్తరువును చూసే మనో దర్శినిలా నువ్వు
కొంచెం నవ్వి చాలా మెత్తగా కోపం చేసి క్షమించేశావు నువ్వు

కొండంత కోపాన్ని భరించొచ్చు గాని
గుప్పెడు కరుణను చిటికెడు ప్రేమను భరించ లేను
ఒక్క నిమిషం కూడా నీ ముందు నిలబడ లేక
ఏడుస్తూ ఒకటే పరుగెత్తింది రోడ్డు
బోరున విలపిస్తూ కూలిపోయింది నల్లని మబ్బుల గూడు

గదిలో చద్దరు నిండా సెగలు కక్కుతున్న జ్వరం
కూర్చి కాళ్ళు చచ్చువడ్డాయి
రెక్కలు ముడుచుకు పోయి గాలిపంక జారిపోయింది
మెత్త నిండా దుక్కం గడ్డగట్టి కదలడం లేదు
పుస్తకాలన్నీ మూలక్కూర్చొని వెక్కిళ్ళు పెడుతున్నాయి
తనను తానే పూర్తి చేసుకునే కవితలా
నిన్ను పరిపూర్ణం చేసుకుని
నన్ను అసంపూర్ణ వాక్యాన్ని చేశావు నువ్వు
తల లేని చొక్క ఇంకా ఆత్మ కోసం దేవులాడుతూనే ఉంది.
*18-07-2012

జ్యోతిర్మయి మళ్ళ || పెర్ ఫెక్ట్ ట్రీట్ మెంట్.||

ముదిరే దాకా మేం గుర్తుకురామా?
మందలిస్తూ మందులిచ్చాడు
మా కుటుంబ వైద్యుడు..

ఏం భయం లేదు పిచ్చీ, నేనున్నాగా!
వెచ్చగా భరోసా ఇచ్చాడు
నన్ను కట్టుకున్నోడు..

రెండో ట్రీట్ మెంటే
ముందుగా పనిచేసింది !
*18-07-2012

వంశీదర్ రెడ్డి || ‎* అల్విదా *.||

ఎందుకు రా, వొదెలెళ్ళావ్,
దిగంతాన, నా ప్రతిధ్వనే,
నీ పిలుపై,
అనంతాన నా ఆలోచన్ల అంతమే
నీ మరుపై,

ఎక్కడున్నావో,
ఒక్కడికీ భయం లేదూ,
నా గదిలోపల చీకటికే
జడుసుకు చచ్చావప్పుడు,
ఇప్పటి నా వెలుగుల్లో
నవ్వడానికోసారి రావూ,
ఒంటరిగా ఏడవగల్ను, కానీ
నవ్వే నవ్విపోతూ,

నిజంచెప్పు,
కోపం నీ మీదా, నీ ప్రపంచం మీదా,
మరి
నువ్వే లోకమనుకున్నోళ్ళకిక శోకమేనా,

ఎంతో నేర్చావ్, ఎంతో చూసావ్,
నరాల్లో నైపుణ్యం, మెదళ్ళో అవలోకనం,
ఒక్కసారిగా
ఎలా తుంచేయాలన్పించింది రా,

నీ దూరం కంటే,
నా ఆనందం పోయిందన్న బాధెక్కువగా,
నీ మరణం కంటే
రేపు నేనూ పోతాననే భయమెక్కువగా,
నాదీ స్వార్ధమే,
నా ప్రతి అనుభవంలో నువ్వుండాలని,
నీదీ స్వార్ధమే.
ఏ అనుభూతైనా ముందు నీకే చెందాలని,

చాటుగా నక్కి
నవ్వకలా, నా ఏడుపుచూసి,
ఇదిగో నీ గ్లాస్,
వాసన్జూడకలా. గొంతు దిగదు నీకసలే,
నీకిష్టమైందే,
నీ సమాధిలోనూ తోడిచ్చాగా ఒకటి,

ఎందుకురా వొదిలేసెళ్ళావ్,
నన్నూ, నిన్నూ, ఇంటినీ, అందర్నీ,
మద్యాన్నీ, పద్యాన్నీ, అందాల్నీ, అనుబంధాల్నీ,

పోతున్నావేంటపుడే,
కూర్చో చెంప పగలకముందే,
నేనేం, తప్పన్నానా,
సర్లే,
ఐస్ లేదింకో రౌండ్ కి,
నువ్ మళ్ళీ చస్తావపుడు,
రేయ్,
ఓ సారి, నవ్వవూ, చాలా రోజులైంది
మనసుతో నవ్వి, మనిషిగా నవ్వి,

విష్ మి హాప్పీ బర్త్ డే,
నువ్ పోయిన్రోజూ ఇదేగా,
ఖర్చు కలిసొస్తుందిలే రెంటికీ,
హ హ హ ,
ఛీర్స్......
*18-07-2012

జ్యోతి వల్లబోజు కవిత


( తొలకరి వానలో చిందులేస్తున్న ఒక చిన్నారి ఫోటో చూడగానే నాలో కలిగిన భావాలు.. )

మృగశిర దాటగానే తలుపు తట్టే వాన
ఎందుకోమరి అలిగి ,రానని మారాం చేస్తోంది..
ఐనా మనసుండబట్టలేక
అప్పడప్పుడు కళ్లాపి జల్లిపోతోంది..

సూరయ్య ఆగ్రహానికి వేడెక్కిన నేలతల్లిపై
జాగ్రత్తగా తప్పటడుగులు వేస్తోంది
మట్టిజాడ కానరాక సిమెంట్ రోడ్లు, డాబాలపై
తధిగినతోం అంటూ తబలావాయిస్తోంది.

అమ్మ వద్దంటున్నా, నాన్న వారిస్తున్నా
చిన్నది మాత్రం ఆ జల్లులోకి ఉరికింది
ఆ చిన్నదాన్ని చూసిన వాన కూడా
నేనేం తక్కువా అంటూ అల్లరి చేసింది...

ఒక చినుకు తలపై పూలజడ కాగా
ఒక చినుకు పాపిటబిళ్లగా అమరింది
ఒక చినుకు ముక్కెరై మెరుపులీనగా
ఒక చినుకు కంటి కాటుకై కూర్చుంది..
ఒక చినుకు చెవులకు లోలాకుగా వ్రేలాడగా
ఒక చినుకు పెదవిని ముద్దాడింది
ఒక చినుకు మెడలో కాసులపేరు కాగా
ఒక చినుకు నడుముకు వడ్డాణమై కూర్చుంది
ఒక చినుకు చేతులకు కంకణమైపోగా
ఒక చినుకు కాలికి పట్టీలా జారిపోయింది..

ఎంత అల్లరిదమ్మ ఈ వాన?
చేయి చేయి కలిపి ఆటలాడింది
మాటలాడనీక ఒళ్లంతా తడిపేసింది..
చిన్నదాన్ని చూడగానే ప్రేమగా కావలించుకుంది.
*18-07-2012

అనిల్ డానీ || అమ్మ ప్రేమ .||

వేయి గునపాలు గుచ్చిన బాద
నిన్ని కన్న సమయంలో
లక్ష గొంతుకల మోత నా ఆర్తనాదం లో
సూదంటు రాయిని గుండెలో గుచ్చిన బాధ
ఒక్కసారిగా నీ ఏడుపు వినపడింది
నా మనసులో కోటి వీణలు మోగాయి
నొప్పి,బాధ మటుమాయం

నీ ముద్దు మోము,నీ నవ్వు నాకు హాయినిచ్చాయి
నీ ఎదుగుదల నా ఎదుగుదలగా భావించా
నీ గెలుపు నా గెలుపే అని మురిసి పోయా
నీ ఆకలి కోసం నా వంటలో అమృతం కలిపి వండాను
నీ చిన్ని చిన్ని నేరాలు ఎన్నో నా మీద వేసుకున్నాను
నీ భాగస్వామి కోసం నా భాగస్వామి తో ఎన్నో మాటలు పడ్డాను
నీకోసమే కేవలం నీకోసమే ఎందుకంటే నువ్వు నా ప్రాణం

నీకు మాత్రం నేనో చిరాకు..................
వయసుమళ్ళిన చాదస్తం
నోరుమూసుకోమనే హక్కు నీకొచ్చేసింది
ఒక్క పూట తిన్నావా అమ్మ అని అడగడానికి
నీకు అహం అడ్డొస్తోంది

నీ ఇంట్లో పనిచేయాలి నీకు ఖర్చులేకుండా పనిమనిషిలా
నీకు బాధ కలగకుండా చూసుకోవాలి బానిసలా
అన్ని సమయానికి సమకూర్చాలి సమిధను అవుతూ
నేను ఆసుపత్రి అంటే నీకు ఆఫీసులో పని పెరుగుతుంది
నాకు జబ్బు చేస్తే నీకు స్టోర్ రూం గుర్తొస్తుంది

నీ పిల్లలకు నేనొక ఆయా,నీకు లేదు నా మీద దయ
నాకు ఓర్చుకునే ఓపిక ఇచ్చాడు ఆ దేముడు
కాని నువ్వు జాగ్రత బిడ్డ,భవిష్యత్ మనదికాదేమో
నిన్ను శపించే మనసుకాదు నాది
కాని తస్మాత్ జాగర్త బిడ్డ.
*18-07-2012

కిరణ్ గాలి || ఎన్న చాట ||

(బ్యాక్ డ్రాప్)

Hi ASL...
(పోతే వెంట్రుక వస్తె కొండ)

I don't talk to strangers...
(ఆడవారి మాటలకి అర్ధాలె వేరులే )

Even our best friends are once strangers to us...
(సామాన్యంగా ఈ స్ట్రాటజి ఫేల్ కాదు)

hmmm...
(మౌనం అర్దాంగీకారం)

I am "m 27 Hyd" here...
(మధ్యలో డేటా కరప్ట్ అయ్యింది)

What do you do....
(క్యు ఏ టెస్టింగ్ ఫర్ "బేవార్స్" వైరస్)

I am a software engineer
(అరెరె వీడి కాన్ఫిడెన్స కూల ....శతకోటి లింగాల్లో ఒక బొడి లింగం గాడు)

సంభాశన మోదలయ్యింది...

career...family...hobbies... మీదుగ
అసలు topic అయిన relationships వైపు మారింది...

r u single....?
(అన్డ్ రేడి టు మిన్గిల్)

Chill...I don't believe in dating yaar... Its a big headache
(బాయ్ ఫ్రెండు కాల్ మోబైల్ లొ రింగ్ అయ్యింది)

Excuse me.. can you hold on for a min..my cousin is calling from US. don't mind...

No worries take your time...

Hi, Hello, Hey there, Knock Knock...

(అస్సలు టైమ్ వేస్ట్ చెయ్యడు, గాపులో మరో 4 కిటికీలు ఓపేన్ చేసాడు)

Thanks for waiting
(వాడిని వదిలించుకునే లొపల వీడు వెల్లిపొతాడేమో అని టెన్శన్)

మళ్ళి సంభాశన మొదలు...

ఆరగంట లొనె అప్యాయతలు
గన్ట కల్లా గొప్ప అనుభందం...

Do you have a pic of urs ...
(క్యు ఏ టెస్టింగ్ ఫర్ అవరేజ్ లుక్స్)

Wait I will invite u 2 my webcam
( పిక్చర్ కన్న ఇదే సేఫ్...)

అమ్మాయి అదిరింది ... వీడి రొట్టె విరిగి నేతిలొ పడింది
అవసరం లేక పొయినా కురులు సర్దుకుంటుంది

చహ్రే పే జుల్ఫే హటానా.. చాంద్ కొ బాదల్ సే నహీ చుపానా..
(ఒరి వీడి శాయరి తగల్లెయ్య )

hey are you a poet...

సామ్నె ఘజల్ హొతో హర్ కోయి
ఫన్కార్ బనెగా మాడమ్

OMG ur sooo good with words...

అందాన్ని పొగిడితె అమ్మాయి
తెలివిని పొగిడితె అబ్బాయి
ప్రేమలో పడకుండా వుండగలరా?

---------------------------

(కవిత)
ఇక అక్కడి నించి మొదలయ్యింది

మాటలు మాటలు మాటలు
మత్తెకించె మాటలు
మైమరిపించె మాటలు
మతి పొగొట్టె మాటలు
గతి తప్పించె మాటలు
మాటలు మాటలు మాటలు

గంటలు గడచిన తీరని మాటలు
నెలలు గడచినా తీరని మాటలు
మాటల మూటలు మాటల ఊటలు

తుంటరి తనమో ఒంటరితనమో
ఒదార్పునకో ఆప్యాయతకో
స్నేహం కొసమో సరదా కొసమో
కిక్స్ కోసమో మరి సెక్స్ కొసమో
మాటలు మాటలు మాటలు

sharing...caring...liking...loving...
meeting...dating...mating..parting...

*18-07-2012

కవుల గురించే మరోమాట - బివివి ప్రసాద్

కవులు మరలా రెండు రకాలు.

పదాలకు జీవితాన్నీ, రంగుల్నీ, కాంతినీ అద్దటం తెలిసిన వారు..
పదాలకున్న జీవాన్నీ, రంగుల్నీ, కాంతినీ పీల్చేవారు..

కవీ జాగ్రత్త, నీ వల్ల పదం ఉదయిస్తుందో, అస్తమిస్తుందో గమనించు..

అనిల్ డాని || ప్రేమలేఖ ||

ఆ మాధుర్యమే వేరు
నా చెలి చేతులతో రాసిన ప్రేమలేఖ
నా చేతి కందిన క్షణం ..............
తను రాసిన అక్షరాల్ని తడిమితే
తననే తాకిన అనుభూతి వర్ణనాతీతం
తను నా పై కురిపించే ప్రేమావేశం అద్బుతం

తను రాసిన లేఖ అందుకోవాలనే తాపత్రయం
నన్ను నిలవ నిచ్చేదే కాదు
తను తిట్టినా, తన బాధలు పంచుకున్న ఆ తియ్యన్దనమే వేరు
నేను తను మళ్లి మా లేఖల కోసం ఎదురుచూపులు
ఆ చిత్రమైన జీవితం ఇక రాదు

ఎసెమెస్,చాట్ ,లైక్ లు ప్రేమలేఖలను ఆర్పేసాయి
ఇప్పుడు ప్రేమలేఖ రాస్తే నేరం నా చెలి దృష్టిలో
ఎక్కడో ఎవరో రాసిన డాక్ ని కాపి చేస్తే గొప్ప
పేస్ బుక్ లో తన పిక్ పెడితే అదో అద్బుతం
తను రాసిన మెసేజ్ కి కామెంట్ పెడితే ప్రేమ వున్నట్టు
ఒక సారి ట్యాగ్ పెడితే ఒక హాగ్ ఉచితమే

ఇంకా ఇంకా చెప్పు అని సాగతీతలు
నా మెసేజ్ బాలన్సు నిల్ రా అని గోముగా గోకటం
ఇన్ని ఎలాక్ట్రానిక్ పరికరాలు,కృత్రిమ బంధాల మధ్య
మనసు నలిగి పోతుంది,ఉండచుట్టి విసిరేసిన
ప్రేమలేఖలా.......................
*18-07-2012

లుగేంద్ర పిళ్ళై || సెర్చింగ్ మై సెల్ప్ ||

ఎక్కడో నన్ను కోల్పోయిన ఫీలింగ్
గడ్డివామును దహిస్తున్న నిప్పులా
ఒత్తిడి వళ్ళంతా ఆక్రమించి బిపి భూతమై పోయింది
హాయిగా నవ్వడమే మరచి
పెదాల బిగువున పలకరింపును అదిమి
సూటుబూట్లలో కుక్కుకున్న సహజత్వం వాడిపోయింది.
మా పల్లెతో కరచాలనం చేసి ఎన్నాళ్లయిందో
అరటి ఆకులో బంతి భోజనం తిని ఎన్ని ఏళ్ళయిందో
ఎంత వెతుకున్నా దొరకని అస్థిత్వపు నీడలు
కదలిన పునాదులను కుదురుగా పెట్టుకోలేని
బతుకంటే విరబూసిన మల్లే కాదని
విచ్చుకత్తి నడినెత్తినవేలాడుతోంది..
గుండెలనిండా ఆత్మవిశ్వాసపు ఊపిరి తీసుకోలేని అశక్తత
మానవత, ఆత్మీయత రంగరించి మాట్లాడలేని యాంత్రికత
ఆవాహన చేసుకున్న కరెన్సీ నోట్ల బెడ్ పై
కట్లపాములా పోర్లాడుతూ
కనురెప్పలు వేయలేని నిస్సహాయత
ఇది కఠోర నిజం అయినా ఒప్పుకోలేని అహంకారం
ఇంకా ఎక్కడని వెతకను ఏమని చెప్పను
కోల్పోయిన నన్ను వెతికి పట్టాలంటే
వెనక్కు నడవాలసిందే
మా పల్లెటూరి బస్సు ఎక్కవలసిందే.
17-07-2012

ఆర్. ఆర్. కే. మూర్తి || " జ్ఞాపకాల వర్షం " ||


చినుకులు
ఒకదానివెంట ఒకటి బియ్యపు గింజల్లా
పెళ్ళినాడు తలపై నుచి రాలుతున్న తలంబ్రాలలా
అప్పుడప్పుడూ మొఖానికి గుచ్చుకుంటో
అచ్చం నీ జ్ఞాపకాలలా

ఉండుండీ గుండెను తాకుతున్న
ఉరుముల చప్పుడు
పదిమందిలో కూర్చున్నపుడు
దూరంగా వినవస్తున్న నీ నవ్వులా

ఈ వర్షంలా నువ్వూ
శాశ్వతం కాదని ఆనాడే తెలిస్తే
ఏదో ఓ గొడుకు వేసుకు
నీనుంచి తప్పించుకునే వాణ్ణేమో

లోకులు కాకుల్లా పొడుస్తున్నా
నే నీలో తడిశాను చూడు
ఈ తడి ఎన్ని జన్మలకి ఆరేనో గదా
నే మండినా బాగుణ్ణు ఆరేందు కొరకు

ఈ వాన రాత్రి మెరుపులా
నీ ముఖం వెలుగు పడ్డాకే
నేనీ లొకానికి కనిపించానేమో
ఇహ ఈ ఆలోచనయితే
నన్నెప్పటికైనా ఆరనిచ్చేనా?

ఈ బ్రతుకిక తడిగా
చిత్తడిగా ఇలా ఈడ్చేయవల్సిందే
జీవం కాక శవమూ కాక
ముసురులా మూసుకుపోవలిసిందే
మరుజన్మలో నీ జ్ఞాపకాలుండపోతే
అది ఈ క్షణమే ఎందుకు రాదో !

*17-07-2012

నవుడూరి మూర్తి కవిత

వయసు కండె విచ్చుకుని బాల్యపు గాలిపటం
నీలాంబరిని నర్తిస్తుంటే,
కాలం తకిలీ వడికిన వర్షధారలకు
తుఫానుగా పరిణమించిన వార్థక్యం
అలలతలమీంచి ఆకసానికెగసిన
"అల"నాటి అనుభూతికై ప్రాకులాడుతోంది..

ఏడుపెంకులాట బ్రతుకులో
మధురస్మృతులు ఒకదానిపై ఒకటి పేర్చేలోగా
"చేదు అనుభవపు" బంతి
వీపుమీద ఒకటి చరుస్తుంది.

ఇసుకతిన్నెలు చూసినప్పుడల్లా
గూడుకట్టుకోవాలని పడిన ఆరాటంలా,
చుట్టుపక్కల లేస్తున్న ఇళ్ళను చూసి
"నేనూ ఇల్లుకట్టుకోవా"లనిపించినా,

బ్రతుకు పుస్తకంలో భద్రంగా దాచుకున్న
నెమలి ఈకలూ - కాకిముచ్చిల్లా
"మచ్చకొండ"ను చూసినప్పుడల్లా
రఘూ, రత్నం, రథయాత్రలూ గుర్తొచ్చినా

సినిమాహాలు దగ్గర లాగు ఎగలాగుకుంటూ
టిక్కెట్టుకి చాలని పావలాకోసం
"తాడాట"లో తిన్న "చెంకీ"కి పొడిగింపులా
బొంబాయిలో పెన్నులమ్మేవాడిచేతిలో మస్కాతిన్నా,

ఎంత జాగ్రత్తగా ఆడినా "దొంగ" కాకుండా
తప్పించుకోలేని చాతకానితనంలా
ఎన్ని పరీక్షలు రాసినా, పరంపరగా వచ్చే
"Regret Letters" ఆపలేకపోయినా,

ఏడో ఎక్కం ఎప్పుడూ తప్పే చెప్పినందుకు
SS మేష్టారు తలపై బెత్తంతో చేసిన బొడిపిల్లా
చేసిన తప్పే చేస్తున్నానని
బాసు మెమోల మొట్టికాయలు వేసినా,

ఉదయాస్తమయాలమధ్య
జీవనపర్యంతం పరుగెత్తే సూరీడులా
ఏ ఊరికీ వెళ్ళకుండా ఊళ్ళోనే ఉండిపోయిన
వేసవి శలవుల్లా జీవితం గడిచినా,

బోర్లా పడిన ప్రతిసారీ ఏడుపులంకించుకున్నప్పటికీ
మళ్ళీలేచి అందుకోవాలని పడిన చిన్నప్పటి తపనే
అరిగిపోయిన మనకాళ్లకి విసుగెత్తిన ప్రతిసారీ
కొత్త ఆశల "Re-soling" చేస్తుంది.

నాన్నజేబులోంచి దొంగతనంగా తీసిన సిగరెట్టుతో
పెరట్లో జామచెట్టు గుబుర్లో సృష్టించిన మేఘాలూ,
అల్లావుద్దీన్ కథ చదివి
ప్రతి పాత లాంతర్నీ గోకిన తెలివితక్కువదనమూ,
తాతగారి ఊర్లో చలిరాత్రులపుడు
వేరుశనగకుప్ప మంటవేసుకుంటూ
సీనుగాడితో పంతాలేసుకుని
శనక్కాయలు ఫలహారం చేసిన తర్వాత
బెల్లంకోసం కుండలో చెయ్యిపెట్టినపుడు
తేలుకుడితే వేసిన కుప్పిగంతులూ,

ఎండాకాలం వర్షంలో తడుస్తూ వదుల్తున్న కాగితం పడవల్లా
గ్రీన్ కార్డ్ సీతారామయ్యతో రెండుమూడేళ్ళకొకసారి
గడిపే మధుర క్షణాలూ
కాలం ఊదుతున్న ఈ బెలూన్ లో
ఆడుగడునా దర్శనం ఇస్తుంటాయి.

కానీ, బెలూనుకి సహజ సిధ్ధమైన
అమాయకత్వం, అసూయ ఉక్రోషం,
ఉడుకుమోత్తనం, అభిమానం, అపేక్షల
వస్తుతత్త్వం ఎన్నటికి మారేను?
*17-07-2012

వంశీధర్ రెడ్డి || ‎* వేప చెట్టు * ||

అప్పుడదో ఆనందం,
ఇంటిపెరట్లో వేపచెట్టు కింద,
ఆరామ్ కుర్చీలో,
కాకుల ప్రశ్నలకు,కోకిలల జవాబులు
తర్జుమా చేస్కుంటూ,

నాతోపాటే పెరిగి పూతేసి
పాతుకుపోయిన వేపచెట్టు,
తుఫాన్ గాలికీ సడలక,
హోరు వర్షానికీ బెదరక,
ధైర్యానికి లివింగ్ ఎక్జాంపులై,

అమ్మోరు పోస్తే వేపాకుల
ఆంటిబయాటిక్ నన్ను పొదిమి,
ఉగాదికి కొంత చేదుని గుర్తుచేస్తూ,
ఇంటి తలుపుకి సగం శరీరం దానమిచ్చి,
పెరట్లో గంభీరంగా, వేపచెట్టు,
థింకర్ స్టాట్యూలా కనిపిస్తూ,

పాతిల్లు కూల్చి కొత్తగా కడుతుంటే,
ఏమైందో, ఎండిపోతూ చెట్టు, ,
ఇల్లు పూర్తై, చెట్టుని చంపేసి,
నాకు శూన్యం మిగిల్చి,
అదో ఆనందం,
లేని వేపచెట్టు కింద,
రాని కాకుల్నీ కోకిలల్నీ ఊహిస్తూ...

పోయినేడాది మొలకేసి మళ్ళీ
మా పాప పుట్టినప్పుడే,
చెట్టుకి ప్రాణాలుంటాయ్,
మనసుతో చూస్తేనే, మనిషిగా చూస్తేనేనేమో..

ఇప్పటికీ అదే ఆనందం,
ఇంటిపెరట్లో వేపచెట్టుకు నీరు పోస్తూ,
కావ్ కావ్ అంటూ కాకుల్ని పిలుస్తుంటే...
*17-07-2012

స్వాతి శ్రీపాద || ఇంకా ఎందుకు? ||

ఊహలు తాగి తాగి మత్తెక్కిన
మనసుకు ఈ రాత్రికి స్వప్నాలెందుకు?
ఎదురుగా గాలి రెక్కలపై వాలి వచ్చిన
సమయం సాగు చేసే లేత గులాబీల
నునులేత చెక్కు టద్దాల్లో
కనుసైగల కావ్యాల దృశ్యీకరణ
రేయింబవళ్ళు కొనసాగే వేళ..

తీపి తలపుల చిరు వాన
ఒక్కో అనుభూతిని తేనె చుక్కల్లా
ఉండీ ఉండీ పారిజాతాల చెట్టు దులిపినట్టు
మనసు మనసంతా
పరిమళాలు రాల్చుతున్నవేళ ..

పాలపుంతల మేలి మరకతాల మెట్లు దిగి
సుతిమెత్తని ప్రవాహపు కెంపులయినట్టు
తడబడే అరికాలి ముద్రల్లా
పెదవులాన్చిన కనురెప్పల తడి
జోల పాడే పూలపల్లకి అయినప్పుడు

వెచ్చని మగత బాహువుల్లో వాలి
రాత్రి లాలనలో ఒరిగి, కరిగి కదిలి
అనంతంగా సాగిపోయే అగరు పొగనై
ఆలాపననై
నా రూపాన్ని నేను పోగొట్టుకున్న ఈ రాత్రికి
ఇహ మళ్ళీ ఉషోదయం ఎందుకు ?
ఇక్కడ ఇలా పాలరాతి ముక్కనై పోరాదా?
*17-07-2012

కవులు రెండు రకాలు - బివివి. ప్రసాద్

ఒకరు:
నేను కొంత చెబుతాను, మిగతాది నేను రాసిన పదాలు చెప్పకపోతాయా
మరొకరు:
నేను కొంత చెబుతాను, మిగతాది నేను రాయని పదాలు చెబుతాయి

మొదటి కవులది కవిత్వమా, కాదా అని సందేహం..

ఒక మాట

ఈ మూడు రోజులు ఆది,సోమ,మంగళవారాలు-మిత్రుడు కట్టా శ్రీనివాస్ 'కవి సంగమం'లో ఎంపిక చేసిన కవితలను బ్లాగులో పోస్ట్ చేసే పనిని శ్రమకోర్చి, సమర్ధవంతంగా పూర్తిచేశారు. బ్లాగును ఇంకా మెరుగుపరిచే పనిని ఒకటితర్వాత ఒకటిగా చేస్తూ పోతున్నారు. కవుల ఫోటోలు బ్లాగులో కనిపించేట్లు పెట్టడం ఆయన కృషే..!
*ఇంకా మెరుగులు దిద్దాల్సిఉంది.చేద్దాం!
ఇంకొంతమంది మిత్రులతో ఒక టీమ్ ను ఏర్పాటుచేయాలనే ఆలోచన చేస్తున్నాం.
బ్లాగులో ఇంకొన్ని సదుపాయాలు ఉన్నాయంటున్నారు. చూద్దాం..కట్టా శ్రీనివాస్,ఇంకా కొందరు మిత్రులతో మాట్లాడాలి.
--------------------------------------------------------------------
*త్వరలో 'కవి సంగమం' గ్రూపు సభ్యుల -గెట్ టు గెదర్-ని ప్లాన్ చేద్దాం.!!