పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

5, నవంబర్ 2013, మంగళవారం

బుక్ ఇంట్రో


 
శ్రేపి.విద్యాసాగర్:(గాలికట్ట)
 

ఆకలి గుహలో ప్రవేశించి లిపిలేని దుఃఖం అనుభవిస్తూ,రేలారే పాటను రెండుభయాలు మధ్యలో ఆలపిస్తూ వివక్షతను ఎదుర్కోడానికి లోలోన ప్రశ్న లు వేసుకొంటూ తెలంగాణా గోస ను వినిపిస్తూ కరువు లో చావుల్నినేస్తూన్న మగ్గాలు చేసే శబ్డాల్ని కన్నీళ్ళకీ హృదయాన్నిచ్హి వీరుల ఉరికంబం మీద నెలవంకను లోచూపుతో చూసి ఉత్తమ కవితా సంపుటి గాలికట్ట ను సృష్టించిన కవి విద్యాసాగర్.

"చితికిన తాటిముంజ కన్ను సుళ్ళు తిరిగే గిరిజనుడి ఆర్తనాదం అది లిపి లేని దుఃఖం "- అని విద్యాసాగర్ ఆదివాసులైన గిరిజనుల దుఃఖాన్ని పల్కిన్చడమే కాదు తనను గాయపర్చిన పలుసంఘటన పైన ఆ సంఘటనల కారణంగా తనలో మొదలైన తండ్లాటను "గాలికట్ట" గా సృజించాడు.సతీష్ చందర్ కంటి చెమ్మతో ఈ కవి కవిత్వాన్ని చదివి దీన్ని కన్నీట కరగిన కవిత్వమన్నాడు.

"గాలికట్ట" అనే ఈ పేరు వొకింత విస్మయాన్ని కలుగచేస్తుంది.అరణ్యప్రంత సాంప్రదాయాలు,బీడి కార్మికుల జీవితాలతో పరిచయం లేకపోతే గాలికట్ట అనే ఈ పదం అర్థం కాకపోవచ్చు.ఇది ఆదివాసులపై జరిగేదోపిడికీ వొక మచ్చు తునక.ఒక్కోగిరిజనుడి నుండి తునికా ఆకును కొనే వాళ్ళూ ఉచితంగా తీసుకోంటారు.ఈ విధంగా కాంట్రాక్టర్లు,దళారీలు,మైదానప్రాంత వ్యాపారులు ఆఖరుకీ అటవీ ఉడ్యోగులు కూడా ఆదీవాసీ ప్రజల అటవీ వనరుల ఆర్థిక మూలాల్ని ఏలా దోపిడి చేస్తున్నారో గాలికట్ట అనే ఈ కవిత ద్వారా కవి సమాజినికి తెలియచేస్తాడు.పైకి కనిపించని ఈ దోపిడిని వివరించాడానికి కవి చేసిన ప్రయత్నం చాల గొప్పదని ఆచార్య జనార్దనరావు గారు పేర్కోన్నారు.

'ఆమె అప్పుడెప్పుడో అడ్డదిడ్డంగా నరికిన మోడుకు ముడత రోగంతో పూసిన తునికాకు లా వుంటుంది"- అని ప్రారంభమైన ఈ కవిత ప్రతి పంక్తి కవిత్వమై సడియం లచ్చక్క లాంటి మహిళలు ఎందరో బుక్కెడు బువ్వ కోసం ఆకులు ఆకులుగా రాల్చుకున్న,కట్టలు కట్టలుగా పేర్చ్చుకున్న జీవితాన్ని మన ముందు వుంచుతుంది.విద్యాసాగర్ కవిత్వానికి వొక లక్షణం వుంది.మెల్లగా మొదలై వొక మహోధృతై సాగుతుంది. "ఆమె అప్పుడేప్పుడో.....అంటూ మెల్లగా మొదలైన ఈ కవిత "ఇసుక తుఫానుల ఆవహించిన దాహం /పులి పంజలా విస్తరించిన రాత్రుల్లో నడిచి నడిచి గుండె లోలకమై వూగివూగి చెమట సముద్రమై ఉప్పొంగి ఉప్పొంగి"- ఇలా సాగిపోయి మన కళ్ళ ముందు తునికా ఆకులేరుకొనే"ఆమె తప్ప సమస్తం శూన్యంలా"-కనిపింపచేసే శక్తి విద్యాసాగర్లో వుంది.
'వన్ ఆఫ్ సెవెంటి'-చట్టాన్ని అడ్డంపెట్టుకొని ఆదీవాసి స్త్రీ ని పెళ్ళి పేరుతో గిరిజన శకుంతల్నీ మోసం చేస్తున్న దుర్మార్గపు దుష్యంతుడిని జింకను మింగిన కొండచిలువలా /తీగ లేకుండా వీణను మీటినట్లూ/తాళి లేకుండా దేహాన్ని మీటి'-
మాయమై పోయాడని చిత్రించడమే కాక అతడు చేసే దోపిడిని ఎండగట్టాడు.జిన్నెలగూడెం గుండె నిమిరి కన్నీళ్ళను తుడవడానికీ కవి రాసిన కవిత్వం ఏవరికీ వారు చీకటిగుహలో బతికిన మూలాల్నీ వెతుక్కునేటట్టు చేస్తుంది.తెల్ల ఏనుగు ప్రపంచీకరణ సృష్టించిన మెర్క్యురీ మాయజాలంలో నదులు,నీళ్ళు,గుహలు,కొండలు ఎలా లుప్తమై పోతున్నాయో కన్నీటి లోని ఉప్పును సైతం ఎలా కొల్లగొడుతున్నరో ఆరిపోయినా కిరోసిన్ కాగడా వెలుగులో పాఠకులు దర్శించేటట్టు చేయగల శక్తి విద్యాసాగర్ కవిత్వానికుంది. తన నేల భాష తెలంగాణ యాసలో 'మీ సేతుల్లొ సావనీకే పుట్టినమా?'-అనే ప్రశ్న వేస్తూ తమ బ్రతుకుల్లో మన్ను పడ్డానికీ కారణమైనా అంశాలను దృష్టి లోకి తెస్తాడు.
అడవిపుత్రులు నిరంతరం రెండు భయాలు మధ్య లో జీవనయానం సాగిస్తున్నారన్న వాస్తవాన్ని ఆ సందర్భంలో వారు నిద్రలేని రాత్రులను ఎంతభయోద్విగ్నంగా గడుపుతున్నారో కవిత్వం చేసి వారి తరపున నిలిచి రాజ్యం,ఇన్ ఫార్మర్ల పేరుతో తీవ్ర వాదులు ఎలా వాళ్ళను హింసకు గురి చేస్తున్నారో చిత్రించిన వైనం కవి దృక్ఫదాన్ని వ్యక్తం చేస్తుంది.
'ఆకాశమంతా వస్త్రాన్నిఅగ్గిపేట్టెలో మడిచి /చేతుల్ని పోగొట్టుకొన్న నేతన్న ఈ వ్యవస్తలో మరోసారి
మోసపోయిన విషయం మన ముఖమ్మీద ఫెటీల్మని చరిచినట్లు కవి రాస్తాడు '.ఆకలికి మించిన విషం లేదు/హామికీ మించిన అబద్దం లేదు/డరిద్రానికి మించిన కుట్ర లేదు"-రంగుల ప్రపంచాన్ని సృష్టించిన నేతన్న చేతులు ఎలా మసిబారాయో కవి విషాదంగా నిర్మిస్తాడు ఈ అంశాన్ని కవిత్వంగా.అన్యాయపు పోకడల్ని నిలదీసే తెలంగాణ సాంప్రదాయాన్ని " గోస' -అనే కవితలో ఆ ప్రాంత యాసలో "ఎంత పని చేసావురా?ఈగలకు బెల్ల్లం సూపెట్టినట్టు పత్తి మిర్చీల
కొరికుడు పురుగుల్ని గూడెం మీద వదిలనవు/పత్తి నీకు మిగిలే/పురుగులు మాకు తగిలా/సుఖంనీకు దక్కే/సావులు మాకు మిగిలే"-అంటూ జీవవైవిద్యాన్ని మొదలంటా నాశనం చేస్తున్న అభివృద్ది నమూనాలు ఆదీవాశీల జేవితాన్ని ఎలా చిద్రం చేస్తున్నయో కవి తనగొంతులో ద్వనింపచేస్తాడు
చెమట పువ్వుల్ని కాసిన దేహం రైతుది.ఏ ప్రాంత రైతయినా కావోచ్చు
అది అరణ్యం ప్రాంతమైనా,మైదానప్రాంతమైనా రైతు జీవితం ఇసుర్రాయి మద్య నూకనూకైన జీవితం రైతుది.పంటతో, పాడితో అతని అనుబందం విడదీయలేనిది. పశ్చిమగాలి పెనుగాలై వీస్తున్న సందర్భంలో ఆగమైపొయిన జీవివతం రైతుదే.'కరువు ముల్లు గుచ్చుకొని రైతు జీవితపుబుడగ ఎలా వుపిరి కోల్పోయిందో కవి చిత్రించిన వైనం మన కళ్ళు మబ్బుతునకలై కన్నీళ్ళను వర్షిస్తాయి.
. "అర్ధరాత్రి నాగలిశిరస్సు మీద గుడ్లగూబవెర్రికేక/నావొంటి మీద జెర్రిలా పాకింది"-అంటున్న కవి అద్దంలా బీటలువారిన నేలను నమ్ముకున్న రైతు వ్యధను "నేను డప్పు శబ్డాన్నై గుండెలు బాదుకుంటాను"-అని విలపిస్తాడు.ఐ.టి పరిభాష లోనే మాట్లాడుకొంటూ..సాఫ్ట్ వేర్ దారి తప్పిన వాళ్ళకీ,కేవలం వీసాలు,పాస్ పోర్ట్లు,క్రెడిట్స్,డెబిట్స్ మాత్రమే జీవితమైన వాళ్ళకీ,బిడ్డ అమెరికా వెళుతుంటే వెయ్యిదేవుళ్ళకి మొక్కి పార్టీలిచ్చే తల్లితండ్రులకీ గుణపాఠంలాంటి కవిత డాలర్ డాట్ కామ్ .
ఇలా ఆదివాసీ వేదనలోని ఆకలికేకల్ని వాళ్ళ అస్తిత్వరోదనల్ని,విచ్చిన్నమైన జనజీవితాల్నీ,వనజీవితాల్నీ అశేష ఆదీవాసీ జనసాగరానికీ అనుబందంగా అడ్భుతంగా' గాలికట్ట'ను ఆవిష్కరించిన విద్యాసాగర్ ను వొక ఉత్తమ కవిగా సంభావిస్తాను.ఇదోక గిరిజన దుఃఖం..ఇదో రైతు విషాదం..ప్రపంచీకరణ భీభత్సం..కవి గాయాల అనుభవాల సలపరం..వెరసి మొత్తం ఈ కావ్యం కవిత్వం మెడలో సుమహారం.మరో మంగళ వారం మరో...కవితా సంపుటితో..
                                                                                                                                                               ( 05-11-2013)
   
 
                                                                                                                                                                      ---------------రాజారామ్.టి