చలాన్ని ఎందుకు చదవాలి? Posted on: Sun 25 May 23:03:59.586358 2014 ప్రపంచంలోని ఏ రచయితనైనా ఆయన జన్మించిన వందేళ్ల తర్వాత కూడా ఎందుకు చదువుతాం? ఎంత పాతవైైనా ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తాయి కనుక. ఆయన చెప్పిన నిజాలను ఇప్పటికీ ఆచరించడానికి మనం ధైర్యం చేయలేం కనుక. ఎంతో ఆధునికులం అనుకునే మనం ఎంత సనాతనులమో ఆయన పుస్తకాలే చెప్తాయి కనుక. మనం నేటికీ చలం పుస్తకాలు చదవడానికీ, మరో వందేళ్ల వరకూ చదవుతూ ఉండడానికి ఓ కారణం ఉంది. జీవితానికీ, సాహిత్యానికీ మధ్య సరిహద్దును చెరిపేసిన సరికొత్త సాహిత్య సృష్టికర్త చలం. సాహిత్యపరంగా చూస్తే చలం రచనల్లో కచ్చితత్వం, నిర్ద్వంద్వత ధ్వనిస్తాయి. చలం స్త్రీల కోసం, స్త్రీ స్వేచ్ఛ కోసం, స్త్రీ క్షేమం కోసం రాశారనడంలో ఎవరికీ అభిప్రాయ భేదం ఉండదు. చలం రాసిన రోజుల్లో స్త్రీలు కూడా తమ గురించి తాము ఆలోచించుకునేవారు కారు. తమకు స్వేచ్ఛ కావాలని కోరుకునేవారూ కారు. తమది నికృష్టమైన జీవితమని భావించేవారు కూడా కారు. ఒకవేళ భావించినా, అది చాలా సహజమనే అనుకునేవారు. దానికి తోడు వీటన్నింటినీ బలపరిచే కర్మ సిద్ధాంతం ఉండనే ఉంది. తాము బాగుపడాలనీ, అది సాధ్యమేననీ స్త్రీలకు తెలియని రోజుల్లో చలం కలం చేతబట్టారు. ఆ కాలంలో చలం వంటి పురోగామి, ధైర్యశాలి, దార్శనికుడు ఈ సమాజానికీ అవసరమే. ఈనాటి స్త్రీలలో చాలామందికి తమ వాస్తవ స్థితి తెలుసు. వారి ఆలోచన పదునెక్కింది కూడా. అవకాశాలు రెట్టింపూ అయ్యాయి. సైద్ధాంతికంగానైనా, ప్రభుత్వ శాసనాల్లోనైనా, పురుషులతో 'సమానత్వం' కాకపోయినా స్థానం లభించింది. తమకు కావలసినది చెప్పగల ధైర్యం వచ్చింది. తమకూ ఏదో కావాలన్న తపనా పెరిగింది. మరి ఇప్పుడు ఏ ప్రయోజనం ఆశించి, చలాన్ని చదవాలి? ఇప్పుడు శత వసంతాలు దాటినందుకా? సదస్సులు జరుపుకుంటున్నందుకా? కానే కాదు. చలం నేటి సమాజానికీ ఎందుకు అవసరమో ఆలోచించాలి. అప్పటికీ, ఇప్పటికీ స్త్రీల బాహ్య జీవితంలో కొన్ని మంచి మార్పులే వచ్చాయి. అలాగే స్త్రీలకు 'విద్య, ఉద్యోగం, ప్రేమ వివాహం, కుల, మతాంతరం వివాహం, పునర్వివాహం, విడాకులు' మామూలైపోతున్న రోజులు. కానీ ఇవన్నీ పైపైన కనిపించే పరిహారాలే. మౌలికంగా స్త్రీ పట్ల సామాజిక దృక్పథం, పురుషుడి దృష్టి అంతగా మారలేదు. ఉదాహరణకు నేటికీ 'శీలం' అంటే లైంగికపరమైనదిగానే, అదీ ఒక్క స్త్రీకే వర్తింపజేస్తున్నారు. శీలం అంటే పరిపూర్ణ వ్యక్తిత్వమని అనుకోవడం లేదు. అందుకే ఆమె మాత్రమే దాన్ని కోల్పోతుందని అనుకుంటున్నారు. తద్వారా స్త్రీ పతనమైపోతుంది. తనకు లేనిదాన్ని ఎవరూ కోల్పోరు. కనుక పురుషుడికి 'శీలం' పోయే బాధే లేదు. అందుకని అతను ఎప్పుడూ పవిత్రుడే. చలం పవిత్రతకి ఇచ్చిన వివరణ వేరు. 'నిర్మలత్వం అంటే ఎటువంటిదో, దాన్ని కాపాడుకోవడమెట్లానో స్త్రీ తనకు తానే నిర్ణయించుకోవాలి. అటువంటి సర్వోన్నతమైన తన పవిత్రతని, మృధు మధురమైన తన శరీరాన్ని, యోగ్యతని, గూఢత్వాన్ని, అర్హుడు కాని భర్తకైనా సరే ఇవ్వని ధైర్యాన్నీ, అభిమానాన్నీ అభ్యసించడం స్త్రీ విధి (స్త్రీ-పే:38)'. ఈనాడు దేశాలేలుతున్న స్త్రీలు కూడా చేయలేకపోతున్న పని ఇది. 'స్త్రీకి అందరి పట్ల తాను జరుపుకోవలసిన విధులు ఉన్నాయి. తన పట్ల తాను జరుపుకోవలసిన విధులు మాత్రం లేవు' అన్న చలం మాటలు మరో వందేళ్ల వరకూ మన దేశంలో సగం పైగా స్త్రీ జనాభాకు వర్తిస్తూనే ఉంటాయి. తన శరీరాన్నీ, తన మనసునీ పట్టించుకోవడం స్త్రీ నేర్చుకోనంత కాలం చలం అవసరం ఉంటూనే ఉంటుంది. ఆనాటికీ నేటికీ మార్పు వచ్చినా ఏమాత్రం మారని వ్యవస్థ వివాహం. అయితే అసలు మార్పు లేదని కాదు. ఐదురోజుల పెళ్లిళ్ల స్థానే గంట పెళ్లిళ్లు, రిజిష్టర్, స్టేజి పెళ్లిళ్లు వచ్చి ఉండొచ్చు. వజ్రాల కమ్మల లాంఛనాలు పోయి, ఫ్రిజ్‌లూ, టీవీలూ, స్కూటర్లు, కార్లు వచ్చి ఉండొచ్చు. రూపాల్లో, పద్ధతుల్లో మాత్రమే తేడా. వ్యవస్థాగతమైన ద్వంద్వ ప్రమాణాలూ, హిపోక్రసీలు యథాతదంగా ఉన్నాయి. చలం అన్నట్టు 'మతమూ, మూర్ఖమూ, నీతి, అనుమానమూ, నిర్బంధమూ వీటివల్ల ఏర్పడ్డది ఈ వివాహం బంధం (స్త్రీ-పేజీ 92)' వివాహబంధం శాశ్వతం కావటానికి అవసరమైన మూడుముళ్లు, సప్తపది, పసుపు కుంకుమలు, మల్లెపూలు, తెల్లచీరా కావు. ప్రేమ, విశ్వాసం, నిజాయితీ, లోకజ్ఞానం, సత్యం అని ఏనాడో చెప్పాడు చలం. ఈనాటికీ మన పుస్తకాలలో, సినిమాలలో 'నేను ప్రేమించే నా భర్తను నాకు దూరం చేయకు' అన్న డైలాగ్ ఉండదు. 'నా పసుపు కుంకుమలు కాపాడు' అనే ఉంటుంది. అంటే భర్తపోయాక అవి ఉంటే అతను ఉన్నా, పోయినా ఒకటేనన్న భావన అందులో ధ్వనిస్తుంది. అయితే ఇవి సాంస్కృతిక చిహ్నాలు మాత్రమే, అవి సూచించే వ్యక్తి పాత్రుడా, కాదా అన్న వివేచన లేనప్పుడు వాటిక్కూడా విలువ ఉండదనేది నేటి విద్యాధికురాలైన స్త్రీ కూడా తెలుసుకోలేనప్పుడు, చలం అవసరం ఉన్నట్లేగా? చలం సమకాలీనులైన భావకవులంతా తమ ఊహా ప్రియుల్ని ఆరాధిస్తే, ఒక్క చలం మాత్రం యావత్తు స్త్రీ లోకాన్నే ఆరాధించాడు, గౌరవించాడు. చలం స్త్రీ వ్యక్తిత్వాన్ని అర్థంచేసుకున్నవాడు. అదే సందర్భంలో చలం మీదున్న అభియోగాల్లో ఒకటి అతను స్త్రీ లైంగిక స్వేచ్ఛను ప్రచారం చేశాడని, ఆ రకమైన జీవితం గడిపిన ఆయన స్త్రీ పాత్రలేవీ సుఖపడలేదు గనుక, ఆయన సిద్ధాంతమూ విఫలమైందన్నారు. అయితే చలం స్త్రీ లైంగిక స్వేచ్ఛ గురించి నొక్కి చెప్పటానికి ఒక కారణం ఉంది. సమాజంలోని ద్వంద్వ ప్రవృత్తినీ, దుర్నీతినీ ఆ సామాజిక నియమాలతోనే తిప్పికొట్టాలనుకోవడమే. అంతేకాని విశృంఖల శృంగారం స్త్రీలకు ఆనందాన్ని ఇస్తుందని కాదు. ఒక సమాజం స్త్రీని భోగ వస్తువుగా చూస్తున్నప్పుడు, స్త్రీని శీలం పేరిట కట్టడి చేస్తున్నప్పుడు, వారిపై లైంగిక అత్యాచారాన్ని చట్టబద్ధం చేస్తున్నప్పుడు, ఆ సామాజిక పరిభాషలోనే సమాధానం చెప్పాలని చలంకు అనిపించి ఉంటుంది. అందుకే, అన్ని స్వేచ్ఛలకంటే ముందు 'లైంగిక స్వేచ్ఛ'నే ఆయన ప్రచారం చేశారు. పతనమౌతుందో, ప్రతిష్ట పెంచుకుంటుందో నిర్ణయించుకునే స్వేచ్ఛ స్త్రీకి ఉండాలన్నదే ఆయన చెప్పేది. స్త్రీని ఆమెకు ఇష్టం వచ్చినట్లు బతకనివ్వాలి. అంతేగానీ సామాజిక కట్టుబాట్లతో పవిత్రంగా ఉండటం నిజమైన పవిత్రత కాదు. 'వ్యభిచారం చేయటానికి కానీ, మానటానికి గానీ స్వేచ్ఛ ఉన్నప్పుడు పతివ్రతో, దుర్మార్గురాలో కావటానికి వీలుంది. కానీ, అసలు దుర్మార్గం చేయడానికి వీలు లేనపుడు పవిత్రులేమిటి? (స్త్రీ-పేజీ 50)''. ఇందులో తిరుగులేని తర్కం ఉంది. ఆనాటి సమాజంలో స్త్రీ బలహీనురాలే, కాబట్టే పురుషుడికి ఆమె అంటే చులకన భావం సహజంగా ఉండేది. తను యజమానినీ, ఆమె బానిస అనీ అతను, ఆమె కూడా నమ్మేవారు. నేటి స్త్రీ సామాజికంగా ఉన్నత హోదాలో, ఆర్థికస్థితిలో ఉండటం పురుషుడికి ఓ సవాలే. అయితే తరతరాలుగా జీర్ణించుకుపోయిన ఈ చులకన భావనతోనే ఆమెపై పెత్తనం చెలాయించడానికి పురుషుడు కొత్త రీతుల్ని అన్వేషిస్తున్నాడు. నేటి స్త్రీ స్వేచ్ఛా, సమానత్వాల కోసం పోరాడడమేమోకానీ, తిండికీ, బట్టకి, కనీస సౌకర్యాలకీ స్వశక్తిపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇది అభ్యంతరకరమేమీ కాదు కానీ, అలా జీవిస్తూనే పురుషుడి అధాకారానికి లోబడి ఉండాల్సి రావడం నేటి స్త్రీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. చలం అన్నట్లు 'స్త్రీకి కావాల్సింది సంపూర్ణాధికారం'. దీనికోసం తిరగబడ్డమే ప్రధానమైన మార్గం' అంటాడు చలం. ఈ శక్తినీ, స్ఫూర్తినీ నేటికీ అందిస్తున్నాడు చలం. వ్యక్తిని సమాజం కంటే ఉన్నతుడిగా భావించే చలం తాత్విక దృక్పథంలో కొన్ని లోపాలుంటే ఉండొచ్చు. కానీ స్త్రీ ఆనందం కోసం ఆయన పడ్డ ఆరాటం, ఎన్నో ఆటుపోట్లను అద్భుతమైన సెన్సాఫ్ హ్యూమర్‌తో అతను తట్టుకున్న వైనం, ఏనాటికైనా స్త్రీలకూ, పురుషులకూ కూడా ఆదర్శప్రాయమైనవే. 'తెల్లారి లేస్తే పిడకలు, మళ్లు, అలుకలు, ఇవన్నీ ఒదిలి సూర్యోదయాన్ని చూసి నవ్వే మనోవ్యవధి, సంతోషం, ఉత్సాహం స్త్రీకి ఎప్పుడు కలుగుతుంది?' అని 1952లో ప్రశ్నించిన చలం నేటి స్త్రీ-పురుషులను చూసి, ఈ అర్థంలేని హైరానాను, అంతులేని వైషమ్యాలను చూసి మరో 'స్త్రీ' రాసేవాడేమో! మరో చలం పుట్టే వరకూ ఈ చలాన్ని చదువుతూ, అతని రచనల గురించి ఎప్పటికప్పుడు పుట్టుకొచ్చే కొత్త ఆలోచనలను జీవితంలో సమన్వయించుకుంటూ ముందుకు సాగాల్సిందే! - శాంతి శ్రీ 98663 71283 http://ift.tt/1mcAxN9
by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mcAxN9
Posted by
Katta