చదివిన కవిత్వ సంపుటి :-23 (కవి సంగమం) ----------------------------- కవిత్వ సంపుటి పేరు :- "తెల్ల కాగితం" ( _-కవిత్వం_-) ########## ******************** సంపుటిని రాసింది :- "సతీష్ కుమార్ యశస్వీ"- ---------------------------- పరిచయం చేస్తున్నది :- "రాజారామ్.టి" ------------------------ "తెల్ల కాగితం పై యశస్వీ కవిత్వ ఇంద్రధనువు వొంపుల చిత్రం" ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ " నా తలపుల్లో నిలిచి ఉన్నది నీవైనప్పుడు.. ఎడబాటుకు అర్థమేముంది- పగలైనా రేయైనా నీ ఊహే నన్ను నాకు వివరించేది" అని ఆవిర్లు విరజిమ్మే గుండె చప్పుడు ఆగే లోగా తన ప్రేయసిని జీవితంలా శ్వాసించాలని భావిస్తున్నవాడు ఎవరంటే యశస్వీ సతీష్. "ప్రవాహం కవితావేశంలా లాగేస్తుంది ఎటోకటు ఉద్వేగం ముంచేస్తుంది అది కలలపై రోకటి పోటు నైరాశ్యం నమిలేస్తుంది పంటికింది పెదవిని" ఇలా ఓటమి అంచుల్లోంచో జారిపోతున్న మనల్ని మనమే ఎలా నిలబెట్టుకోవాలో చెబుతున్న కవి ఎవరంటే సతీష్. "పసి పిల్లల పిప్పరమెంట్ నౌతా తీయ తీయగ కరిగిపోతా స్కూలు పిల్లల బ్యాగ్ నౌతా పుస్తకాలను మోసి పెడతా ముసలి అవ్వకు చేయూత నౌతా అవసరమైతే కొడుకు నౌతా నాకే గనక చేతనయితే పైనవన్నీ తానే ఔతానంటున్న కవి ఎవరంటే యశస్వే. ఒక వైచిత్రితో కొత్తగా కవిత్వ సంపుటిని నిర్మించి,తెలుగు వర్ణమాలలో ఎన్ని అక్షరాలు వుంటే అన్ని కవితా కుసుమాలు కూర్చి తెలుగు పాఠకుల మెడలో వేసిన కవి యశస్వీ. యశస్వీ సతీష్ కవిత్వం సంపుటి పుస్తకం తెరువగానే నాకు తెల్ల కాగితం....క్రింద ఆయన సంతకం మాత్రమే కనిపించింది.చిత్రంగా అన్పించలేదు నేను ఇట్లా అంటుంటే.అయితే కవిత్వం కళ్లజోడు ధరిస్తే మాత్రం ఆ"తెల్ల కాగితం " మీద కవిత్వ ఇంద్ర ధనువు వొంపులోని సప్త వర్ణాల సమ్మేళనం మెరుపై నిగ నిగ లాడుతు కనిపించింది.యశస్వీ సతీష్ కీ తన కవిత్వ గురువు కొప్పర్తి లాగే తనదైన అనుభవాల్నీ కవిత్వీకరించే నేర్పుంది.ఏదీ సూటి చెప్పనితనముంది.ఆయన చుట్టువున్న సమాజాన్నీ భావించిన పద్దతి అందర్ని ఆకర్షిస్తుంది.ఒక్కోసారి సరికొత్త పోలికలతో,ఇంకోసారి వస్తువును దృశ్యీకరించే చిత్రణతో వొక కొత్త హాయిని తన కవిత్వంతో అందజేస్తాడు. అందుకేనేమో చాల మంది యిష్టపడతారు. "నీ ప్రపంచంలోకి కవిత్వమై వస్తున్నా నీ సాక్షిగా నన్ను నేను పోగొట్టుకోవాలి నా పేరూ ఊరు చెరిపేసుకోవాలి అక్షారాలను ఆవహించుకొన్న నన్ను చదివించుకొని మనసును తెల్ల కాగితంచేసుకోవాలి నేనే నీ సొంతమైనప్పుడు మన మధ్య అక్షరాలు అనుభూతుల్నీ మాత్రమే మిగిల్చాలి అక్షరాలు మనలోకి కరగి స్వచ్ఛమైన తెల్ల కాగితం మిగలాలి కవిత్వం మన అంతరాంతరాల్లొకి వెళ్ళి ఇంకి లోకమంతా తెల్లకాగితమవ్వాలి" ఈ కవి కవిత్వాన్ని సర్వమానవ హృదయాంతరాంతరాళ్లోకీ ప్రవహింపచేసి,ఆ కవిత్వం అక్కడే ఇంకి పోయేటట్లు చేసి ఈ ప్రపంచం వొక "తెల్ల కాగితం "అయ్యెటట్లు చేయాలనే వొక సుందర స్వప్నం వాస్తవం కావాలని తపిస్తున్నాడు.తెలుపు స్వఛ్చతకీ,నైర్మల్యానికీ సంకేతం. కుటిల,కుత్సిత,దుర్మార్గ,దురంత భరిత మానవ మనస్సుల క్షాళనకు కవిత్వం కారణం కావాలనే గాఢ ఇఛ్చను యశస్విసతీష్ తన కవిత్వంలో ప్రకటిస్తాడు."నాది నీదైనప్పుడే నిజంగా నేను మనిషి నౌతాను"-అని అంటున్నా ఈ కవి "అలవాటైన కొద్ది నాతో చేరిపోతుంది నాకు ప్రతీకగా మారిపోతుంది"-అని చెబుతూ,అక్షరాల పలకరింపుల్ని,పులకరింపుల్ని,పగలబడే నవ్వుల్ని నచ్చనప్పుడు తనతో వాటిని పుచ్చుకొని నడువలేనని నిష్కకర్షగా చెబుతాడు.ఇలా తెల్లకాగితం పై కవిత్వ ఇంద్రధనుస్సును కలకంటాడు తన మాస్టర్ బాటన నడుస్తూ.. "నువ్వే నా గురువంటే కోసి ఇమ్మన్నాడంటా వేలు ఈ కాలంలో ఎవడైనా వింటాడా!! నా వేలు నీ కిస్తాను...చేయి పట్టు అంటాడా!! వినడం ఎందుకు!!..జివిత కాలపు వేదనకా!! గురువంటే చెప్పొచ్చు మంచి ఎన్నైనా... మరి అడుగొచ్చా ఎదురేదయినా..అడిగారా ఎవరైనా!! ఏకలవ్యుడి నుండి కాస బియాంక వరకూ విని చెడి పోయినవారే తడవ తడవకు!!" గురువుకు గౌరవం ఇస్తూనే గురువు ఎలా వుండాలో.. నిజమైన గురువు ఎవరో నిర్వచిస్తూ "నువ్వే నా గురువంటే"-అనే కవితలో పై మాటలు అంటాడు.గొప్ప శిష్యునికీ ప్రతీక అయిన ఏకలవ్యుడు వంచలేక విరిచిన ద్రోణుని వంచనకు గురయ్యాడు.నైలు నదీ యుధ్దంలో తండ్రి అస్పష్ట మాటల కారణంగా దేశం కోసం ఓడ డెక్ మీద నిలువెత్తు మంటలమధ్యనిలువునాకాలిపోయినవాడుకాసాబియాంక.ఏకలవ్యుడు, కాసా బియాంక ఈ ఇరువురు "classical examples of devotion and sevice"కు ప్రతీకలు.ఈ పాత్రలకీ జరిగిన అన్యాయాన్ని "లోక మర్యాదకు తల వంచేవాడు ఇంతకన్నాఏంచేస్తాడు!!"త్యాగధనులజాబితాలపేరుకోసంపాకులాటతప్ప"అనేమాటతోవ్యంగ్యంగావ్యాఖ్యానిస్తాడు. శిష్యలక్షణం అనన్య సాధ్యత్వమే కాని బొటనవేలు నరికినివ్వటం కాదు,త్యాగధనుల జాబితలో చేరటానికీ పాకులాట వుండకూడదని,గట్టి పూనిక ఉన్నవానికి ధ్యాస,శ్వాస.. విద్యమీదే వుండాలని,విద్య నేర్పేదెవరైనా ఆదరంగా అందుకోవాలని,పుస్తకాల్ని కాదు మనుషుల్ని చదవాలని ఈ కవి శిష్యుని లక్షణం కూడా చెబుతాడు. కవి అన్ని వేళల ఆశావాదిగా మనలేడు.జీవితంలో కొన్ని క్షణాల్లో నిరాశతో కవి తన చుట్టూ వున్న మనుషుల మీద విసుగును పొంది నమ్మకం కోల్పోయి కొన్ని సందర్భాల మీద అసహ్యంతోనో,అపనమ్మకంతోనో కవిత్వపు కళ్ళజోడుతో దర్శించి వాటిని తమకు నచ్చినట్లుగా చిత్రించుకొంటారు.కవిత్వం నా కళ్లజోడు-అనే కవితలో వొకానొక భావ తీవ్రతతో సౌందర్యం వెల్లివిరియాల్సిన అదే నింగి నీరు నీలాలు కలిసేచోట సంధ్యా భీభత్సంలా నెత్తుటి చారికల విషాదాన్ని కవిత్వపు కళ్ళజోడు లేకుండా దర్శించలేనని ఈ కవి భావిస్తాడు. 'అది నా చెంత లేకపోతే అంతా మసక మసక నింగి నీరు నీలాలు కలసే చోటున సౌందర్యం బదులు నెత్తుటి చుక్కల చారల... భీభత్సం నా ముందున్న మనిషి వెంటాడే నీడై నను అభద్రతా భావనలోకి నెట్టుతాడు అలికిన అక్షరాలు రెటినా నంటినట్టు నా కంటికీ నలకలై నకలై ఎంత నలిపినా అడ్డంగానే కనిపిస్తాడు ఎదుటి వారంతా సాటివారు-తోటివారులా కాక బోటి ముద్దల్లా కనిపిస్తారు" ఇలా అంటూ కవి "అప్పుడప్పుడు కవిత్వ కళ్ళజోడుతో లోకాన్ని చూస్తాను/ఇప్పుడంతా..నాకు తెల్ల కాగితం..కింద తన సంతకం వుందంటాడు.ఇలా అనటంలో మారిన మార్పుని ఆకలించుకోలేని మనిషి స్థితిని కవిత్వం మారుస్తుందన్న భావనను అందిస్తాడు. "తెల్ల కాగితం" కవితా సంపుటిలో "ఆమె నా..." అనే పద్యం అంది.ఇందులో ఇది వొక అందమైన పద్యం. "నే పుట్టినప్పుడే... ఆమెకు పాతికేళ్ళు వచ్చాయి/మేము మేమే కానీ మేమిరువురం ఒక్కరమే/నా ఏడుపు ఘోష వేరు/ఆమె లాలించే భాష వేరు"-అని ప్రారంభమయ్యే కవిత మాములు పదాలతోనే ఎంతో హృద్యంగా నడుస్తుంది.బిడ్డ ఎదిగే క్రమంలోతల్లిబిడ్డమధ్యగలబంధాన్ని,అనుబంధాన్నీ చెప్పడమే కాదు,ఆ బిడ్డ పెద్దయింతరువాత "ఊరు నాది మారింది నేను తనతో ఉండరాక"అని అనుకొనే స్థితిని ముసలిదైన తల్లి మీద అణుమాత్రం జాలి లేని తనాన్ని యశస్వీ వాస్తవికంగా కవిత్వం చేశాడు.ప్రారంభంలో "నే పుట్టినప్పుడే.. ఆమెకు పాతికేళ్లు వచ్చాయి"-అని వొక ఉత్కంఠను కలిగించి "నేనేమో కొడుకుని ..ఆమె నా కన్న తల్లి"-అని వొక దిగ్భ్రాంత ముగింపును ఇస్తాడు.ఇలా ముగింపు నివ్వటం మంచి కవిత్వ శిల్పం. "ఙ్ఞానమైనా,ధనమైనా అర్థానికున్న సమస్థ నానార్థాలకు పర్యాయ పదం నాన్నే"-అని భావించే ఈ కవి తన తండ్రిని గుర్తుకు తెచ్చుకొంటూ "పేపర్ తో నాన్న"-అనే కవిత రాశాడు.కన్న బిడ్డ ఆశల మెరుపులను కురిపించాలనే తండ్రి తపనను కవి ఘనీభవించిన మేఘంలా చిత్రించాడు."ఉద్యోగ సమాచారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసే పావు రాయై/ఆ నాలుగు రాళ్ళ మనిషి మీదే వాలుతుంది తెల్లారగానే"-ఈ పంక్తుల్లో కవి ప్రాణం లేని వార్త పత్రికకు ప్రాణం పోసి పావురాయిని చేశాడు.ఇట్లాంటి అద్భుత వాక్యాలకు ఈ సంపుటిలో కొదవే లేదు."వాన కారు కోయిలై ఫలితాల కోసం/రాశి -ఫలాల వేటలో../మళ్ళి పేపర్ తో నాన్న/నా కాలం కలిసోచ్చేదాక కదలని చిత్తరువులా/పేపర్ తో/తన మా నాన తానే"-అనే ఈ మాటల్లో కవి తనకు తన తండ్రికీ,తన తండ్రికీ వార్తపత్రికకు కల బంధాన్ని ఆవిష్కరించాడు. కవులకు చాల వరకు కొన్ని నిశ్చితాభిప్రాయాలు జీవితం పట్ల వుంటాయి.వాటిని ఏదో ఒక సందర్భంలో తమ కవిత్వంలో పొదుగుతుంటారు.ఈ జీవితం ఇలాగే సాగిపోవాలని కూడ మనుషులు భావిస్తువుంటారు."బతుకంటే గుదిగుచ్చిన పనులూ,చిట్టా పద్దులూ కాదు"అని అంటున్న యశస్వి "సాగిపో"అనే కవితలో "ప్రభాతపు తొలి వీక్షణం లోంచే కలలు వెలుగు రేఖల్ని ముద్దాడాలి/రాత్రైనా,పగలైనా కలల్ని వెలిగించుకోవడం..నింగికీ,నేలకు నడుమ మేఘంలా/గాలిలో తేలి నిప్పునీ.. నీరునీ కౌగలించుకోవడం/కాలంతో కరిగి పోయేవరకు కదిలిపోవడం"-ఇలా జీవితం సాగిపోవాలనే ఆలోచనను చేస్తాడు."ఎదురీతకు సిధ్దపడితే విస్తరించిన సాగరాన్ని చీల్చుకొంటూ వడి వడిగా సాగే ఓడను తలపిస్తుంది"- అని వో విజయం తరువాత జీవితం అలా వుంటుందని కవి ఊహిస్తాడు.ఒక వ్యక్తిత్వ పాఠం కవిత్వమైంది ఈ కవితలో. "ఏదో కారణం"-అనే కవితలో "రైలు మంటల్లో ఎందుకు కాలాలి!!/ఆయిల్ రిగ్గో,కారో ఎందుకు పేలాలి!/బాధ,హింస,అతివాదం,ప్రమాదం,/పశుత్వం,విధ్వంసం,పక్క వాడి నిర్లక్ష్యం"-మున్నగు కారణాలు బయటవైనప్పుడు అంటే సంబంధితం కానప్పుడు సహజ న్యాయం కోసం ప్రశ్నిస్తాడు.ఏదో ఒక కారణం లేకుండా ఏవీ జరుగవు అనే కార్యకారణ సంబందాన్ని కవి ఇక్కడ ప్రస్ఫుటం చేస్తాడు. కవిని చూడ్డమంటే కవిత్వాభిమానులకీ వొక యిష్టం.తన వ్యక్తిత్వానికీ ఇష్టమైన బి.వి.వి ని చూడ్డమంటే యశస్వీ కి ఎంతో యిష్టంలాగుంది.అందుకే "ప్రశాంతమైన్ నిద్ర లేని రాత్రుల్ని వరంగా అందించిన వాడు/అలంకారాలు లేని అక్షరాలకు వ్యాపక శక్తి ప్రసాదించినవాడు/అతడెలా ఉన్నా..అ కళ్ళల్లో వెలుగును చూద్దామని వెళ్ళాను"-అని ఈ కవి అనటంలో కవి వ్యక్తిత్వాన్ని చిత్రిక పట్టే నేర్పు వుందని చెప్పోచ్చు."మతం మత్తుకు మధురసాల కైపు"ను పొందే హైద్రాబాద్ పాత బస్తీ నీ గూర్చి రాసిన కవితే "చార్మీనార్ ...చెంపన".పాపం, పుణ్యం ఏమి ఎరుగని చిన్నారులు సాన్వీ లాంటి పసిమొగ్గల్ని కిడ్నాప్ చేసి తుంచేస్తున్న అంశాన్నిఎంతో వేదనతో ఆ భగవంతున్ని "ఇదేం న్యాయం దేవుడా?"-అని తీవ్రంగా ప్రశ్నించిన కవిత "ఇదేం న్యాయం దేవుడా?" అనేది.ఉప్పుని ధనంగా చేస్తూ "సమన్వయం లేకపోతే జీవితం ఉప్పు లేని చప్పిడి మెతుకులు" అని చెప్పే కవిత"ఉప్ప ధనం". "భయ్యా! Diversity ఎక్కడ!!"-అనేది జీవ వైవిధ్య సదస్సులోని డొల్ల దనాన్ని వెల్లడించే కవిత.తాలిబాన్ల పిరికితనానికి బదులిచ్చిన అసలుసిసలైన జవాబు "మలాలా".మలాల ను "గుల్ మకాయ్" చేస్తూరాసిన కవిత ఇది.ఇలా ఎన్నో కవితలు( ఉన్న56లో) పాఠకుల తెల్లని మనసు మీద కవిత్వ రంగుల చిత్రాన్ని గీస్తాయి. ఈ సంపుటిలో ఎన్నో కవితలు నన్ను కదిలించినా,నన్ను బాగా వెంటాడి వేటాడిన కవిత,నచ్చిన కవిత "ఓ రైలు ప్రయాణం ".ఇష్టం లేని ప్రయాణాన్ని అయిష్టంగా కష్టంగా చేయించాడానికి రైలు రావాడాన్ని వొక అంతర్లీన దుఃఖంతో కంటిని చెలమగా చేసి రాశాడు యశస్వి సతీష్.ఈ కవిత చదివినప్పుడు కొప్పర్తి గారి "విషాద మోహనం"లోని "ఎంతెంత దూరం "అనే కవిత స్ఫురణకొచ్చింది.తన కిష్టమైన వాళ్ళని వదిలి వెళ్ళి పోతున్నప్పుడు పోవడానికి ఎంత అయిష్టపడతాడో,బయలు దేరాల్సిన క్షణం దగ్గరయ్యే కొద్ది సర్దుకున్నవే మళ్లి సర్దుకొంటూ,దువ్వుకున్న తలనే మళ్లీ దువ్వుతూ వుండే మానసిక స్థితిని,ప్రయాణాన్ని ఖరారు చేస్తూ రైలు వొచ్చి ఆగి నప్పుడు...కలిగే వేదనను కొప్పర్తి అద్భుతంగా చిత్రించాడు.ఇట్లాగే యశస్వీ కూడా "ఓ రైలు ప్రయాణం" వొక మంచి కవితగా నిర్మించాడు.యశస్వి కవితని కొప్పర్తి కవితతో పోల్చటం ఆయన్ని అనుకరించాడని కాదు."గుండెలు రెండూ లాగి వదిలిన స్ప్రింగ్ ల్లా గిలగిల లాడే" కవిత్వం యశస్వీ రాయగలడని చెప్పడానికే. "రాయడాన్ని ఎవరూ కాలరాయలేరు"-ఇట్లా పదాలతో ఆడుకోవటం యశస్వీ కూడా చేస్తాడు."పేపర్ తో తన మా నాన తానే"-ఇలాంటి వైచిత్రులు ఈ సంపుటిలో అనేకం."మనస్సాక్షి చెప్పినట్టు పేజీ చివర సంతకం చేసే క్షణమొకటి వేచి వుంది కాబట్టి ఈ పరిచయాన్ని ఇంతటితో ముగిస్తూ..యశ్వస్వి మంచి యశస్సుతో వొక మంచి కవి కాగలడని విశ్వసిస్తు....వచ్చే మంగళ వారం నన్ను బాగా కలవరపెట్టి కదిలించే "జీరో డిగ్రీ","నీ లాగే ఒకడుండేవాడు" ఏదో ఒక సంపుటితో కలుద్దాం.
by Rajaram Thumucharlafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1msK5nJ
Posted by
Katta