గత వారం గాలిబ్ 16వ గజల్ మత్లా చదివాము. తర్వాతి షేర్లను ఇప్పుడు చూద్దాం గాలిబ్ 16వ గజల్ రెండవ షేర్ ముఖద్దమె సైలాబ్ సే దిల్ క్యా నిషాత్ ఆహంగ్ హై ఖానాయె ఆషిక్ మగర్ సాజె సదాయె ఆబ్ థా వరద ధాటికి గుండెల్లో సంతోషవీణ మోగింది ప్రేమనిలయం జలతరంగ గానం పాడింది. ఉర్దూ పదాల అర్ధాలు చూద్దాం. ముఖద్దమ అంటే ఆగమనం లేదా ప్రారంభం అని కూడా అర్ధం. పుస్తక పీఠికను కూడా ముఖద్దమ అంటారు. ఇక్కడ ఆగమనం అన్న అర్ధం వర్తిస్తుంది. సైలాబ్ అంటే వరద. నిషాత్ అంటే సంతోషం. ఆహంగ్ అంటే ట్యూన్ లేదా బాణీ అని ఇక్కడ అర్ధం. రైమింగ్ (Rhyming) అని కూడా అర్ధం చెప్పవచ్చు. ఖానా అంటే నిలయం, ఇల్లు. సాజ్ అంటే వాద్య పరికరం, సదా అంటే స్వరం లేదా పాట, ఆబ్ అంటే నీరు. పారశీక, ఉర్దూ భాషల్లో రెండు పదాలతో సమాసం చేయడం చాలా తేలిక. ’’యే‘‘ అన్న అక్షరం చేర్చి సమాసంగా మార్చవచ్చు. అలా చేసిన సమాసమే సదా యె ఆబ్, ఇది జలతరంగ్ వాయిద్యం. నీరు నింపిన కప్పులతో సంగీతాన్ని సృష్టించే వాయిద్యమిది. సాజె సదా యే ఆబ్ అంటే జలతరంగ్ గానం అని అర్ధం. ఇప్పడు ఈ కవితకు వివరణ చూద్దాం. ఈ కవితలో గాలిబ్ ఒక దృశ్యాన్ని వర్ణించాడు. దీన్ని రెండు రకాలుగా చెప్పుకోవచ్చును. ఒకటి : ప్రేమలో మునిగిన తర్వాత ఇక ప్రపంచంలో ఏది కోల్పోయే చింత ఉండదు. ఒక్క ప్రేయసి గురించిన ఆలోచన తప్ప మరేదీ ఉండదు. తన ఇల్లు వరదల్లో మునిగిపోతున్నా కూడా ఆందోళన ఉండదు. ఎందుకంటే, నాశనమైపోతే పోనీ, ఇంటి గురించి ఆలోచించే సమయం కూడా ప్రేయసి గురించి ఆలోచనల్లో గడపవచ్చనుకుంటాడు. వరద నీటి ధాటికి ఇంటి తలుపులు వణుకుతుంటే, సంగీతధ్వనులు విన్న సంతోషం కలుగుతుంది. ఇంటిని వరద ముంచెత్తుతుంటే ఆ శబ్ధం చెవికి జల్ తరంగ్ సంగీతంలా ఆనందడోలికలూగిస్తుంది. ఈ కవిత సూచించే మరో దృశ్యమేమంటే.. రెండు : ప్రేమ విఫలమైన తర్వాత ప్రపంచంలో ఏదీ పట్టదు. ప్రేమ వైఫల్యం కూడా ప్రియుడిలో ప్రేయసి ఆలోచనలనే పెంచుతుంది. కన్నీళ్ళ వరద కూడా సంతోషాన్నే ఇస్తుంది. ప్రేమనిలయమైన అతడి హృదయాన్ని కన్నీరు ముంచెత్తడం జల్ తరంగ్ సంగీతంలా అనిపిస్తుంది. ఈ కవితలో సూఫీతత్వం అంతర్లీనంగా ఉంది. ప్రేయసి అన్న పదాన్ని తొలగించి దేవుడు అన్న పదంతో కవితకు అర్ధం చెప్పుకుంటే, దేవుని ప్రేమలో మునిగిన వ్యక్తికి ప్రాపంచిక కష్టనష్టాలు పట్టవు. వరదల్లో మునుగుతున్నా దేవుడా ఇంత కష్టం ఎందుకు తెచ్చావని ఫిర్యాదు చేయడు. దేవుడిపై ప్రేమతో ఏ కష్టాన్నయినా సంతోషంగా ఎదుర్కుంటాడు, వరద బీభత్సాన్ని కూడా జల్ తరంగ్ సంగీతంలా భావిస్తాడు. తర్వాతి కవిత గాలిబ్ సంకలనం 16వ గజల్ 3వ షేర్ నాజిషె అయ్యామె ఖాకిస్తర్ నషీనీ క్యా కహూం పహ్లుయె అందేషా, వక్ఫె బిస్తరె సంజాబ్ థా దారిధ్ర్యపు ఆ రోజుల సంతోషం ఏమని చెప్పేది మట్టి పడక మేనుకు పట్టుపాన్పులా తాకేది ఉర్దూ పదాల అర్ధాలు చూద్దాం. నాజిష్ అంటే గర్వించడం. అయ్యామ్ అంటే రోజులు, ఖాక్ అంటే మట్టి, ఖాకిస్తర్ అంటే మట్టితో కూడిన, ఖాకిస్తర్ నషీనీ అంటే మట్టిలో బతకడం, దారిద్ర్యం. నషీనీ అంటే ఉండడం, బతకడం, పహ్లూ అంటే ఒకవైపు, అందేషా అంటే ఆలోచన, అంచనా, వక్ప్ అంటే ఇవ్వడం, సంజాబ్ అంటే చాలా విలువైన ఫర్ (fur). ఒకప్పుడు ఈ ఫర్ తో చేసిన పాన్పు చాలా సంపన్నులు మాత్రమే ఉపయోగించేవారు. ఈ కవితకు వివరణ చూద్దాం. తన పాత రోజులను గాలిబ్ ఇందులో వర్ణించాడు. అత్యంత పేదరికంలో బతికిన ఆ కాలం జ్ఙాపకాలు గర్వించే రోజులుగా పేర్కొంటున్నాడు. అప్పట్లో కేవలం మట్టినేలపై పడుకునే వాడు, కాని మనసుకు ఆ మట్టి నేల పట్టుపాన్పులా అనిపించేది. ఈ కవిత జీవితంలో లభించిన వాటితో సంతృప్తి పడాలని సూచిస్తుంది. కఠినమైన జీవితానికి భయపడవలసి అవసరం లేదని. చెబుతుంది. మనిషి అత్యంత దారిద్ర్యంలో ఉన్నా గర్వించే స్థాయిని కోల్పోడన్న బలమైన సందేశం ఇందులో ఉంది. ఇక్కడ గమనించదగ్గ అంశమేమంటే, గాలిబ్ మట్టినేలను, సంజాబ్ అనే ఫర్ తో చేసిన పాన్పుతో వర్ణించాడు. ఆ ఫర్ కూడా మట్టి రంగులోనే ఉంటుంది. అత్యంత విలువైన అలాంటి పరుపైనా, మట్టినేలైనా ఒక్కటే మేను వాల్చడానికి అంటున్నాడు. ఇంతకు ముందు కవితలో సర్వస్వం నాశనమైనా తనకు సంతోషంగానే ఉంటుందని చెప్పిన మాటలను ఈ కవితతో కలిపి చూస్తే కఠిన పరిస్థితులకు ఏమాత్రం తలవంచరాదని, మనిషి ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నా, స్వతహాగా మనిషి కావడమే గర్వించదగ్గ విషయమని చెప్పాడు. ఇది ఈ వారం గాలిబానా.. మళ్ళీ శుక్రవారం మరి కొన్ని కవితలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు .. అస్సలాము అలైకుమ్.
by Abd Wahedfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uGWlXh
Posted by
Katta