పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, జులై 2012, ఆదివారం

డా. పులిపాటి గురుస్వామి || ఉప్పల గట్టు జాతర ||

ఎన్నేండ్లయిందో
నీ ముఖం నాకు చూపించకో 
నాది నీకో 

ఉడుకుతున్న బువ్వ
కలెబెట్ట్టినట్టు నిన్ను
తలుచుకుంటె...

నిన్ను నువ్వు ఇంకా
మార్చుకోక ముందే
నీవు చూసిన నన్ను
కుబుసం విడిచాను

కళ్ళల్లోని వొత్తులు
అమాస చీకట్లని
చిడతల మోతతో
శ్శివ శ్శివ శ్శివ శ్శివ శ్శివ
గొంతులు వెంటపడి
తరిమితే ఉరిమితే
ఆకాశం తెల్లబోయింది గుర్తుందో

గుండంలో వణికిన
బాల్యం
భుజమ్మీద
కూచొని గిల్లడం మానలేదు

గుండుకు రాయికి
వయసొచ్చి పౌడరద్దుకొని
జాగారాలు చెయ్యడం తెలిసి ,
జారుకుంటూ జార్చుకుంటూ చేరి
నీ ఎత్తైన కౌగిలి నుండి
ఈ లోకాల లోయల్ని చూసాక కదా
భూమి ప్రేమికత్వం తెలిసింది

మల్లొక్కసారి కొమ్మలు చాచు
దారులు చీల్చు

నీ లోపలి నీవు తడి పడతావో
నా లోపలి నేను పూతకొస్తానో.


*08-07-2012

కిరణ్. గాలి || U 2 BRUTUS ||

ఒంటరి తనపు మౌనాన్ని 
ఊపిరి తిత్తుల నిండా బలంగా పీల్చుకొని 
బాధల సుడులను బయటకు వదులుతుంటే 
వ్యర్ధంగా రాలిపోతుంది వర్తమానం
ఏష్ట్రేలో బూడిదల

నాలో ఈ అలవాటుకి
సమాజం చూపే కారణం
అనాలోచితమో, అవివేకమో,
అమాయకత్వామో, అహంకరమో
ఆత్మన్యూనత అభద్రతా భావాల డిఫెన్స్ మెకానిజమో
నాకనవసరం

నికోటిన్ నిషానీ తలకెక్కించి
నిస్తేజత స్థానంలో నిర్లక్షాన్ని నింపి
నరాలని స్టిములేట్ చేసి నాడులని వైబ్రేట్ చేసి
గతం గాయాలకు సెల్ఫ్ పిటీ బామ్ ని
అద్ది ఒదార్చెది వ్యసనమైనా
దానికి బానిస నవ్వడం
నాకు సమ్మతమే

పొగ.............
నల్లటి దట్టమైన పొగ
సుడులు తిరుగుతూ పైకి ఎగురు తుంది
...అచ్చం నా ప్రియురాలి కురుల ముంగురులలా

పెదవుల మధ్య మెత్తటి ఫిల్టర్ దూది
తన లేత నుగారు బుగ్గల్లా
(స్టుపిడ్ సిమిలారిటి అనుకుంట)

అటు చివర వెలిగే నిప్పు కణిక
తన ఆధరాలలా ఎర్రగా మెరుస్తుంటే
అందుకోవాలనే ఆతృతతో
బలంగా పీలుస్తున్నాను

వేడి పొగ గుండెల్లో చేరుతుంటే
వెచ్ఛటి తన కౌగిలి అనుభవానికి వస్తుంది
ఆఖరి ధమ్ము వరకు అదే అనుభూతి
తానిచ్చిన తొలి ముద్దు తాలూకు తిమ్మిరి
వళ్ళంతా పాకు తున్న్నట్టు
మత్తుగా గమ్మతుగా

హటాత్తుగ కళ్ళ ముందు
వెరిసిన వాస్తవికత

పొగ.........
నల్లటి దట్టమైన పొగ

కాన్సర్ కత్తిని కస్సున గుండెల్లో గుచ్చింది
ఆచ్చం వెన్ను పోటు పొడిచిన
నా ప్రియరాలిలా

--------------------------------------------------------------------- 





స్ట్యాచుటరీ వార్నింగ్: ప్రేమించడం మగవాడి మనసుకి ఎంతైనా హానికరం



* 07-07-2012

కె.కె -కవిత || పురోగమనం ||

మనిషి జీవితం అంటే 
సమస్యల సంపుటే అనుకుంటా!!!
ఎప్పుడూ ఏదో ఒక సమస్య
ఒకదానికి పరిష్కారం వెదికే లోగా
ఇంకొకటి.. రావణుడి తలకాయల్లా

ఊహించని మలుపులెన్నో
ప్రతీ మలుపులోని ప్రశ్నించుకుంటాను
నా జీవితం సూటిగా సాగదెందుకని???
ప్రశ్నించేవరకే... జవాబు ఏమిటో
వినే సమయం కూడా లేదు.

వాతావరణం బాగాలేదని ప్రయాణం మానూంటామా?
అది అనివార్యమైతే...
జారుడుమెట్లని ఎక్కడం మానుకుంటామా?
అది అవసరం అయితే...
అలా కాకపోతే అది పరాజయం అవుతుంది.

అప్పుడప్పుడు కొన్ని,కొన్ని సమస్యలు
రొద పెడతాయ్, సర్దుబాటు చేసుకోమని... తప్పదుగా
కానీ ప్రతీ సమస్యకి సర్దుబాటంటే అది
సర్దుబాటు కాదు, లొంగుబాటే అవుతుంది.
జాగృతి చెందాల్సినప్పుడు
జోలపాటలు వింటే
వచ్చేది మగతేకాని..ప్రగతి కాదు.

నీరు పరిగెత్తకపోతే ఊతమిచ్చే
రాతికి కూడా నాచుపడుతుంది.
అందుకే బతుకుబండి ఎప్పుడూ
ఏకదిశనే కలిగి ఉండాలి
అది పురోగమనమే అయివుండాలి.

* 08-07-2012

జిలుకర శ్రీనివాస్ ॥ లిపి ॥

కూలిన హరప్పా గోడల మీద మా పూర్వీకులు రాసిన రాతల సాక్షిగా 
ఈ దేశ మట్టి మా నెత్తుటి వారసత్వం
నేల పొరల్లో దొరికిన బొమికిల సాక్షిగా మీరు హంతకులన్నది నిజం
మీ గండ్ర గొడ్డళ్ళకు మా తాతల తాతమ్మల నల్లని బంగారు మెడలు ఎన్ని తెగాయో 
మా తాత ఫూలే లెక్కగట్టాడు వాటికి బదులు చెప్పక వొదులం లే!

కరుణను సమస్త జ్ఞానాన్ని బోధించి ఈ భూమిని మనిషిని సుందరంగా మార్చిన
మా తాత బోధిసత్వున్ని బువ్వలో విషం కలిపి కడతేర్చారు
మీ అబద్దపు తత్వాన్ని నిలదీసినందుకు మా చార్వాకుల సజీవంగా పునాదుల్లో పూడ్చేశారు
సత్యం వెలుగులో బుద్ధ రాజ్యం నిర్మించిన మా బ్రుహద్ర మౌర్య చక్రవర్తిని మీ కుట్రల ఖడ్గానికి ఉత్తరించి రాజ్యం దొంగిలించారు
చినా బుద్ధ రుషితో చర్చల సాగరంలో గెలవలేక మా తాత హర్షున్ని చాటుగా
చంపాలని చూశారు
తెగిన కంఠాల మీద ప్రమాణం చరిత్ర మీ నెత్తుటి దాహానికి సమాధానం చెప్తది

శివాజి మహారజ్ కు విషమిచ్చి చంపాము కదా వీళ్ళెం చేస్తారనుకుంటున్నరా
శంబాజిని చంపి రాజ్యం మీ కాళ్ళ కిందికి తీసుకున్నట్టు అనుకుంటున్నరా
సాహు మహరాజ్ ను చంపేందుకు బాంబులు పేర్చినట్టు అనుకుంటున్నారా
అంబేద్కర్ ను హతమారినట్టు అనుకుంటునారేమో ఆర్య పుత్రులారా!
నెత్తురోడిన మా తల్లి నేల సాక్షిగా ఇక్కడే మా రాజ్యం నిర్మించికుంటాం
హరప్పా గోడల మీది లిపిని ప్రతి గుండె శిఖరం మీద లిఖిస్తాం!



* 08-07-2012

మెర్సీ మార్గరెట్ ॥ఎవరికైనా మరణం కనిపిస్తే॥

ఎవరికైనా మరణం కనిపిస్తే 
కబురుపెడ్తారా 
ఊపిరి ఆవిరై కొండెక్కేలోపు బంధించి 
చెంప చెల్లు మనిపించాలని ఉంది 
ఒక్కొక్కరినిగా తన కాళ్ళతో
గద్దలా "నా " అనే బంధాలను తన్నుకు పోతూ
ఎక్కడ తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటుందో
అడిగి ,
దాని కళ్ళను పీక్కొని వెళ్లి "నా" వాళ్ళని
చూడాలని ఉంది

కడుపు కోతలోంచి పుట్టే కన్నీళ్ళ నదులు
గుండె బ్రద్దలయి ఉసురు తీస్తూ ఎగిసే లావా
వేడి శెగలు
ఎండిపోతున్న గొంతులు అవిసిపోయెంత
వినవస్తున్న ఆక్రందనలన్నీ
ఉప్పెనై ముంచి ఉతికేయాలని కసిగా చూస్తుంటే

శబ్దం నుంచి నిశబ్ధానికి అది ప్రయాణించే
జాడలు కనిపెట్టి ఉరితీయాలనుంది

తిరిగొస్తాయా ?
జ్ఞాపకాలుగా మిగిలిన జీవచ్చవాలు ఊపిరిపోసుకొని
చేతులు కలిపిన స్నేహాలు ,
పారాణి ఆరని పాదాలు
గోరుముద్ధలతో అమ్మ ముచ్చట్లు
నాన్నతో ఉప్పు బస్తాల ఆటలు
వర్షంతో నన్ను చుట్టుకు పోయే మట్టివాసనలు
నుదుటిపై వెచ్చగా నా వాళ్ళు పెట్టిన ఆత్మీయ ముద్దులు
కాలపు భూమిలో పాతిపెట్టిన ప్రతి జ్ఞాపకాన్ని
త్రవ్వుకుని ప్రాణం పోస్తూ వెళ్ళేదెలాగు

మరణపు గొంతు నులిమి ,ఊపిరి లాగి
నా జ్ఞాపకాల పాదాల క్రింద పాతేయాలనుంది

ఎవరికైనా మరణం కనిపిస్తే
కబురుపెడ్తారా ?
ఊపిరి ఆవిరై కొండెక్కేలోపు బంధించి
చెంప చెల్లు మనిపించాలని ఉంది 


*08-07-2012

జయశ్రీ నాయుడు॥అప్పటి నువ్వు...॥

అప్పటి నువ్వు...
ఇప్పుడు కనపడవు..
మార్పు మంచిదే
కానీ సూర్యుడే 
మబ్బైతే ఎలా

రోజంతా చందనం
మనసుకు అద్దుతూ
అక్షరాల మెరుపులు
కనురెప్పల అంచునే

ఎప్పటికీ అలానే వుంటుంది
మనసు మూగగా
అదే హామీ అనుకుంది..
రెక్కల్లేకుండానే
గగనం అణువణువూ
ముక్కుతో పోగేసిన
నక్షత్రాలూ..

ఖాళీ గా వున్న
అంబరం లో
ఎవీ నా ఆ తారలూ
నీ దారీ..నీ లోకమూ
బొమ్మా బొరుసై
కలల ఖజానా దోచేసాయి


* 08.07.2012

సి.వి.కృష్ణారావు|| వైతరణి ||


ఒక్కొక్క నగరం దేహం మీద
మానని రాచపుండులా
వేదన హృదయంలో ఒత్తిగిలక

వెలికి వచ్చిన ఒక చిహ్నంలా
మూలకొక్క మురికిపేట
వేలకొలది జనుల విషాద గాధ

బురదలో పురుగులు మసలినట్లు
ఎన్నడూ మోములెత్తి మిన్నువైపు చూడక
వేడికి ఎండి చలికి స్రుక్కి
గాలికి వాలి తుఫానులో తృళ్లిపడి
ఈబంధన సత్యమని
ఈ బ్రతుకు అనిత్యమని
బాధల మహాభారతంలో
మురికిపేటలో మసలే మూగజీవాలు

గుడిసెల చూరు భూమికి జాగిలపడి
తమ సంపాదన
వేదనతో రోదించే శిశువుల
పెదిమలు తడపజాలని సలిల బిందువులై
రోగాలు వేగంగా మోసుకొచ్చే
క్రిమి కీటకాలు సహగాములై
తమ స్వప్నావస్థలో
కంకాళాలు నింపుకొస్తుంటే
జీవన వ్యాపారం అక్కడా జరుగుతూనే వుంది

స్మశానాలకు చోటు విడమర్చి
భయపడి పక్కకు తొలిగిన హర్మ్యాలు
తమ నగరంలో
సజీవ మానవాస్థిపంజరాలు మసులుతుంటే
ఇంకా ఎటూ కదలటంలేదు

మానవుడు చూడని లోకంలో
ఈ భువినే నిర్మించాలని
చేసే ప్రోద్బలన
ఆకసమంటే హర్మ్యాలు
యమలోకం త్రోవలో వైతరణి
మురికి పేట మలుపులో
ఒదిగి ఒదిగి ప్రవహించే కాలువ

వైతరణి ఒడ్డున
బాధకు చిహ్నాలై
సుప్రసిద్ధ గాధలకు నాయకులై
ఒకడు గుహుడు
ఒకడు చెప్పులు కుట్టేవాడు
ఒకడు అంధుడు
ఒకడు బంధువు

నివాసం = కుటీరంలో - తుఫానులో
ఆశ = ఆరుతూ - వెలుగుతూ
విశ్వాసం = వికసిస్తూ - హ్రస్వమౌతూ
ఓర్పు = ఘనీభవిస్తూ - ఆవిరౌతూ
బ్రతుకు = దు:ఖంలో - నిర్వీర్యతలో.



(వైతరణి - కావ్యం 1968  ఫ్రీవర్స్  ఫ్రంట్‌ ప్రచురణ నుండి) 

* 7.7.2012

ధనలక్ష్మి బూర్లగడ్డ॥నేనే నేనే అది నేనే॥


వర్షించే వానజల్లుని
వికశించిన కుసుమాన్ని
పారే ఏరుని
ఎగసే అలని
పరిగెట్టే పైడి లేడిని
పరవళ్ళు తొక్కే జలపాతాన్ని

పదాహారణాల ఆడపిల్లని
తెలుగు ఇంటి లోగిలి ముగ్గుని నేనే
నేనే నేనే అది నేనే

ముద్దొచ్చే చిలక పలుకుని
మురిపించే కోయిల గానాన్ని
వంతపాడే తుమ్మెద ఝుంకారాన్ని
మనసు దోచే మయూర నాట్యాన్ని

పదాహారణాల ఆడపిల్లని
తెలుగు ఇంటి లోగిలి ముగ్గుని నేనే
నేనే నేనే అది నేనే

పల్లెటూరి పంట పొలాన్ని
చక్కని పచ్చిక పైరుని
పసిడి కాంతి శోభనిచ్చే పండిన ధాన్యాన్ని
పసిపాప బోసి నవ్వుని

పదాహారణాల ఆడపిల్లని
తెలుగు ఇంటి లోగిలి ముగ్గుని నేనే
నేనే నేనే అది నేనే

పరువాల పాలపిట్టని
పరతిలోని తులసి మొక్కని
తల ఊపే బుట్ట బొమ్మని
ఆ నింగిని
ఈ నేలని
వీటిని కలిపే ఇంద్రధనస్సుని
నండూరి ఎంకి పాటని

పదాహారణాల ఆడపిల్లని
తెలుగు ఇంటి లోగిలి ముగ్గుని నేనే
నేనే నేనే అది నేనే..!
*7.7.2012

స్వాతి శ్రీపాద॥కెరటపు రెక్క॥

ఉన్నట్టుండీ
ఎక్కడో ఏమూలో ఓ చిన్న మెలిక 

ఇంకా అసలు మనసు మాటల్లోకి అనువదించలేదన్న
చిరు దిగులు
ఎన్ని శిశిరాలు, ఎన్ని వసంతాలు,
ఎన్ని చూపుల హేమంతపుటనునయాలు
మరెన్ని నిట్టూర్పుల వేసవి వడగాల్పులు
ఎన్ని గ్రీష్మాల అలల ఆటుపోట్లు
ఇలా ఒకరి మనసుల్లో ఒకరు
ఎన్ని మాటల పుటలు మడతలు మడతలుగా
పొరలు పొరలుగా పేరుకు పోయిన
పెదవి కదలని సంభాషణలు.

ఎన్ని రాత్రులు పాలిపోయి అవాక్కయిన వెన్నెలా
చెక్కిన పెన్సిల్ ముక్కల్లా అరిగిపోయిన చుక్కలూ
తెల్లమొహలేసుకుని తొంగి తొంగి చూసే
కళ్ళనిండా అసహనం అసూయను
కుండపోతగా గుమ్మరించలేదూ?
అయినా ఎక్కడో ఏ మూలో ఒక చిన్న సందేహపు మసక
గుండె లోలోతుల్లో దాచుకున్న ఒక్క ముక్కకయినా
ఇంకా రెక్కలు మొలవలేదేమోనని..

బాల్యం గుమ్మంలో
చీకట్లు వీడని ఉదయ సంధ్య మసకవెలుతురులో
రాలిన పున్నాగల పరిమళాలు కలసి ఏరుకున్న క్షణాలు
ఎన్ని వ్యక్తీకరణలకు సరితూగుతాయి్?
మరక పడని కాన్వస్ మీద
ఎన్ని సాయం సంధ్యల రంగుల కలయిక
నిరంతరం సాగే రాగాల చిత్రీకరణ
ఎన్ని మనసు విప్పని ఊసులకు ప్రతిరూపం? 

అయినా నా దిగులే కాని
నీ లోలోపలి ప్రవాహాల కెరటపు రెక్కను నేనయాక
ఏం చెప్పను కొత్తగా.........
*7.7,2012