పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

30, ఆగస్టు 2012, గురువారం

బాలు|| పాడు వాన ||


ఆరుబయట బల్కాన్ని
కుర్చీలో నేను
జోరున వర్షం
ఎదురుగా వేప చెట్టు
ఇంద్రధనస్సు మద్య
ఒక్కొక చినుకు
చెట్టుపై పడుతుంది
చిర్రుజల్లు తుంపర్లు
నా మోము మీద పడుతున్నాయి

హఠాత్తుగా ఒక మెరుపు
ఆకాశంలో కాదు
మా ఎద్దురుగా ఉన్న డాబామీద
గులాబి రంగు పంజాబీ డ్రెస్లో
రెండు చెత్తులు గాలిలోకి తిప్పుతూ
మొహాన్ని ఆకాశం వైపు పెట్టి
ఒక్కొక చినుకును ఆస్వాదిస్తున్నది

నా కళ్ళు రెప్పవేయటం మరచి
ఒక వింత చూస్తున్నట్లు
చూస్తున్నాయి....
చరడంతా పెద్దవి చేసుకొని

ఆ లేత గులాబీ డ్రెస్
పసుపు పచ్చని
తన శరీరానికి
బిగుతుగా అతుకుపోయి
తెగ సంబరపడుతుంది

నువ్వే కాదు
మేము అస్వాదిస్తున్నాము
తన అందాన్ని అని
వాన చినికులు చెప్పుకుంటున్నాయి

ఆ ఆనందాల భామ
అందచందాలు
ఓ పది నిమషాలు
చుసానోలేదో

పాడు వాన
నా మీద కక్ష కట్టి
ఆగిపోయింది
తను వెళ్ళిపోయింది

నేను మాత్రం
మళ్ళి ఎప్పుడు!
వర్షం పడుతుందా
అని చూస్తున్న
తన రాక కోసం...

బాలు*28-082012*

నరేష్ కుమార్ // చేతబడి //

ఇపుడు
మేమేం చేయగలం..!?
ఆత్మగౌరవానికి
చితిని సిద్దం
చేయటం తప్ప

మేం మహా మాంత్రికులం
అన్న పచ్చబొట్టు
నుదుటిపై
దిద్దించుకున్నాక
మరిక మేమేం చేయగలం...!?

మంత్రగాళ్ళనీ....,
రాక్షసులనీ...
శరీరాలను వేలాడేసుకునే
శిలువలని
మోసుకుంటూ
పరిగెత్తుతూనే ఉన్నాం.....

ఐనా...!
క్షణంలో
ప్రాణం తీసె
మనిషిపేరు వింటే...
ఇపుడు
కాష్మోరా
వణికి పోతున్నాడు.....,
తననెక్కడ
డ్రైనేజి గుంటలో
పూడ్చేస్తారో నని
పాతాల కుట్టి
పారిపోయాడు....
తందూరి పొయ్యి ని
చూసిన
ఆరథ్యుంగ
ఒళ్ళు చల్లబడింది...

ఇప్పుడు
క్షుద్ర గణాలకు
ఇల్లేది...?
స్మశానాలన్నీ
కబ్జా చేసారుగా..!

మా వెంట్రుకలూ, గోళ్ళూ...
కత్తిరించుకొని
మా మీద
మేమే
చేతబడి
చేసుకోవాలిప్పుడు.
(mantragaadanea anumanam toa gramam nundi tarimi kotti bhumini laageasukunte paripoai vachi granit minelo kulee gaa maarina oka orissa girijanunni vinnaka) 29/08/12

నగరంలో పద్యం మరణిస్తుంది //కోడూరి విజయకుమార్ //


శిరసు చుట్టూ ప్రదక్షిణలు చేసే
రంగురంగుల సీతాకోకలు కొన్ని
సీతాకోకల చుట్టూ అల్లుకునే
కొన్ని అక్షరాలు...

పద్యం ప్రాణం పోసుకొంటోన్న అలికిడి
చెవుల్లోంచి గుండెలోకీ, శిరసులోకీ దూసుకొచ్చి
సీతాకోకల్ని చెదరగొట్టే
గడియారం అలారం మోత
ప్రాణం పోసుకొంటోన్న పద్యం కంపిస్త్తుంది

కాసేపు దినపత్రికలు మోసుకొచ్చిన లోకాల్లోకి....
పాలితుల దయనీయ వెతలనార్పే
చల్లని మాటలు ప్రవహించాల్సిన పవిత్ర ప్రాంగణం
ఒకరి బాగోతాల లెక్కల్ని మరొకరు విప్పుకున్న
రాబందుల రాకాసి శబ్దాల నిలయమైన విషాదం
గుక్కెడు నీళ్ళివ్వని మహానగరాన్ని శపించి
మృత్యుబిలంలోకి జారిన ఒక పేదలబస్తీ
నాగరిక జీవనశైలి మొహాన్ని వెక్కిరిస్తూ
పట్టపగలు పగలబడి నవ్విన యాసిడ్‌ బాటిల్‌
లేచి నిలబడి పద్యాన్ని అందుకోవాలని చూస్తాను
ఆఫీసుటైము కాలరు పట్టుకుని ఆపేస్తుంది

మహానగర రహదారుల మీద పరుగులు
నగర జీవితాన్ని కమ్మేసిన పరుగుకు ప్రతీకలు
పరుగుల మీద బ్రేక్‌ వేసే ట్రాఫిక్‌ రెడ్‌లైట్‌
కరెన్సీ కట్టల్ని మింగి పుట్టిన లగ్జరీకారు
రొట్టెముక్క కోసం చేయిసాచే పసిపాప
పద్యం కోపంతో వూగిపోతుంది
పరుగుల్ని గుర్తుచేస్తూ వెలిగే పచ్చలైటు
పద్యం మీద నీళ్ళు గుమ్మరిస్తుంది

దైనందిన నగరజీవిత పరుగుల నడుమ
పద్యం అప్పుడప్పుడూ నాకై చేతులు చాపుతుంది
అందుకోలేని అశక్తత యేదో వెనక్కి లాగుతుంది

రాత్రి పక్కమీద అలసటగా వాలే దేహం
ఉదయపు సీతాకోకల కోసం వెదుకుతుంది
లోపలెక్కడో యేదో కుళ్ళిన వాసన
పద్యం మరణించి వుంటుంది...
ఇక రాత్రంతా శవ జాగరణ....

నీ ||మావూరి బస్సొచ్చి నాతో కన్నీళ్ళు పెట్టుకుంది!! ||


మా ఊరంటే బస్సే గుర్తొస్తుంది..!

చదువుకోటానికి నానా అగచాట్లు పడేప్పుడు

ఫ్రీ-పాసులిచ్చి పదికిలోమీటర్లు పట్టుకెళ్ళి,
అక్షరాలు నేర్పిన "అదే"గుర్తొస్తుంది.

ఊటుకూరు పొలంలో కోటేరుని,
కొణిజర్లలో స్మసానం లో తగలబడుతున్న శవాన్ని..
ఒళ్ళోకూర్చోబెట్టుకుని కళ్ళారా చూపిచ్చిన బస్సు గుర్తొస్తుంది.!
కిటికీకి గడ్డం ఆనిచ్చిన చిన్నతనం,
సీటెనుక పదేళ్ళప్పుడు రాసిన కవిత్వం గుర్తొస్తుంది.!

బస్సంటే నన్ను చంకనెత్తుకున్న్న అవ్వ,
బస్సంటే నావరకు గోరుముద్దలు తినిపించిన అమ్మ!

మా ఊరి మోటుజనపు నేలవిమానం బస్సు

ఎవడో చుట్టంగాడి పెళ్ళికి అందరూ..
చిన్నకార్లలొ,మోటారుసైకిల్లలో వస్తే..
మా గరీబు నాన్న ఎక్కించిన ఎర్రబస్సు గొప్పగా గుర్తొస్తంది !

ఎదో పనిమీదెళ్తే..
దిల్-సుఖ్-నగర్ రోడ్డుమీద మా బస్సు కనిపిస్తే
ఎదురెళ్ళి ముఖం మీద ముద్దుపెట్టుకోబుద్దయ్యేది,
ఒక పాత స్నేహితుణ్ణి చూసినట్టో..
ఏదో విషాదం గుండె అడుగునుంచి కారుతున్నట్టొ వుండేది!

* * *
ఎవడో చదువుకున్నోడట బస్సుని రాళ్ళతో బద్దలు కొడుతున్నాడు!
కసాయిలా కిరసనాయులు పోసి కాల్చేస్తునాడు!
ఎవడొ.. దయామయి బస్సుని ధ్వంసం చేస్తున్నాడు!

ఇప్పుడెందుకో బస్సుకి గొంతుంటే బాగుండనిపిస్తుంది నాకు!

మావూరి మట్టిరోడ్డుమీద బస్సుపోతున్నట్లు
నా ముఖం మీద కన్నీళ్ళు పోతున్నాయి

తగలబడుతున్న బస్సుల మధ్య కూలబడి
విజ్ఞానులనే అజ్ఞానుల ఉన్మాదాన్ని వార్తలు చేసుకుంటున్నా..,

అయినా సరె..
కారుతున్న నా కన్నీళ్ళని సీసాలో పట్టుంచా..
తిలక్ ఓసారి ఇలావచ్చి తగలబడుతున్న బస్సుమీద పోసెళ్ళు..

ఇంతకుముండె..
మావూరి బస్సొచ్చి నాతో కన్నీళ్ళు పెట్టుకుంది!!

*29.8.2012 

    భమిడిపాటి // బికారి బ్రతుకు //


    వేకువ దుప్పటిని దులిపేస్తూ
    అప్పుడే రేగుతున్న దుమ్మును
    రోడ్డున పోయే జనాల తిట్లను
    గాలి పాటలా వింటూ మొదలైంది ....

    మా దారి తెన్నులు లేని
    యాచక దారి
    సొంత పేరున్నా చెప్పుకోలేని
    అందరికి తెలిసిన ఈ బికారి !

    ఎవరి కన్న బిడ్డలమో ?
    తెలియని అమ్మని
    తెలిసి ఎంతో మంది అమ్మలాంటి అమ్మలని
    ధర్మం చేయండంటూ ఛీ కొట్టినా వెంటపడుతూ ...

    ఒక్కోసారి సిగ్గేస్తుంది
    ఏ ఇంటి గడప తొక్కాలో తెలీని మా స్థితిని
    ఇలాంటి జీవితాన్నిచ్చిన ఆ దేవుణ్ణి
    దయలేని ఆ పైవోడి విదిరాతని !

    మాకు మేమే అయ్యేమా !
    ఎవరి ఆవేశపు ఆనందానికి రోడ్డున పడ్డామా
    మా ఆవేశాన్ని అణుచుకోలేక
    మా వారసులకి కూడా ఈ వారసత్వాన్ని కట్టబెడుతున్నామా !

    మాలో ఎవరిని తట్టినా
    గతంలేని తన జ్ఞాపకానికి మాలో మేమే సాక్షులమంటారు
    ఆకలి మంటల కేకల చల్లార్చటానికి
    చిల్లర డబ్బుల చప్పుళ్ళకి అలవాటుపడ్డం అని వెర్రిగా నవ్వుతారు ......

    రానే వచ్చిన రాత్రికి
    దొరికిన జాగాపై మాటేసి
    చీకటి దుప్పటి కప్పేసి
    రాత్రి చుక్కలకి రాజులం మేమే అంటూ ..మురిసిపోతూ ..కలలో మైమరచిపోతూ ..
    .29-08-12

    మామిడి హరికృష్ణ || గుప్పిట్లో ఆకాశం.. ||

    వేకువ వెలుగులు ముగ్గులల్లడానికి ముందే
    రాత్రి మేఘాలు విచ్చిన్నమవడానికి ముందే
    నిద్రానిద్ర, కల-మెలకువల ఊగిసలాట సమయాన
    ప్రేమైక వాణివై 'సెల్' లో ఆహ్వాన గీతాన్ని పాడుతావు

    తొలి ఉదయ వేళనే ఆహ్లాదంగా పలకరించి
    స్వర్గాన్ని నా ఎదుట పునర్ప్రతిష్ట చేస్తావు

    స్వప్నాస్వప్న జగత్తులోకి చేయిపట్టి తీసుకెళుతూ
    అనురాగ కౌగిలిలో వివశున్ని చేస్తావు..

    ఇక,
    స్వర్గాన్ని చేతితో, కళ్ళతో, నాలుకతో, పెదాలతో
    తడుముతూ,చూస్తూ,స్పృశిస్తూ, చుంబిస్తూ
    ఆకాశాన్ని గుప్పిట్లోకి ఒడిసి పట్టి
    సముద్రాన్ని పుక్కిట్లోకి బిగియ పట్టి
    వ్యోమ కాలాల వెంట యెగిరి వెళుతూ
    Time- Spaceల భౌతిక పరిమితులను అధిగమించి
    పారభౌతిక-పాంచ భౌతిక అవతారాన్ని ఎత్తుతాను..

    బింబ ప్రతిబింబాల దోబూచులాటలు
    దేహ కోణాల కంపన-ప్రకంపనల-ప్రచోదనాల శ్వాసలు
    శరీర మంతనాలు-మనో మధనాల అద్వైతంలో
    స్వర్గ ఫలాల తేనియలని
    చప్పరిస్తూ, జుర్రుకుంటూ, గ్రోలుకుంటూ ...
    అర మోడ్పు కన్నుల మాయాలోకంలో విహరిస్తూ..
    అర్దాతీత మూలుగుల స్వర ప్రపంచంలో తేలియాడుతూ..
    దాన్నే కొనసాగిస్తూ...
    29 August,2012

    క్రాంతి శ్రీనివాసరావు || చిదంబర రహశ్యం ||


    సంపదకు శాశ్వత చిరునామలేక సంచరిస్తున్నప్పుడు
    ప్రపంచమంతా ఒకే వూరవుతున్నప్పుడు
    దరిద్రమంతా మన పంచనే ఎందుకుంది ?
    ఈఆర్ధిక వంచన అర్దం అయ్యేదెప్పుడో ?

    వస్తువులను చేసేది మనం
    తరువాత కొని వాడేది మనం
    మద్యలో వాడాదుకొనేది ఏందో
    పప్పు మనది పొట్టు వాడిది
    వూదుకు తింటున్నాం చెరిసగం

    ఆదుకోవాల్సిన పాలకపక్షం
    కనిపించని బానిస సంకెళ్ళు రంకెలు వేస్తుంటే
    అంకెల గారడీలు చేసి చంకలు గుద్దుకొంటున్నారు
    ఫలితం లేని పంచవర్ష ప్రణాలికలతో
    పంక్ష్య భక్ష్యాలు వడ్డిస్తామని వగ్ధానాలను వర్షిస్తూనేవున్నాయు

    ఒకప్పుడు రైళ్ళలో తరిలేది సంపద
    ఇప్పుడెందుకో ఈమైళ్ళకే తరుగుతుంది
    అరవైఏళ్ళ స్వతంత్రభారతంలో
    ప్రపంచ ధనవంతుల లిస్టులోకి ఒకరిద్దరు వెళ్ళీతే
    పాతిక శాతం ఆదాయం డెబ్బైకుటుంబాల చెతుల్లో పెట్టి
    డెబ్బైశాతం జనాన్ని దారిద్యంలో చుట్టేశాం
    రోజుకు పాతికరూపాయలొస్తే చాలు
    పరమాన్నం తినొచ్చని పావర్టీ లైను పైకి నెట్టేశాం
    పేదరికం తగ్గిందని లెక్కలు కట్టేశాం

    ఎన్నికలొచ్చిన రోజు
    వందో వెయ్యో ఇందా అంటే
    మందో మాకో వుంది అంటే

    అందలం అందుబాటులోకొస్తుంటే
    అతిపెద్ద ప్రజస్వామ్యాదేశం లో
    ఎప్పుడూ వారసులే సారధులవుతున్నారు
    ఒహో ప్రజాస్వామ్యమా
    రాహు(ల్)కాలమొచ్చిందినీకు
    మరో స్వాతంత్ర్య పోరాటం జరగాలిప్పుడు

    శ్రీ || సామాన్యులమంటే మనం ||

    సామాన్యులమంటే మనం
    ప్రజలే ప్రభువులన్న
    ఒకే అబద్దాన్ని
    పదే పదే నమ్మించే
    అ/ప్రజాస్వామ్య రాజకీయ నాయకులు కాదు

    సామాన్యులమంటే మనం
    ఇంటి మీద హెలిపాడ్
    పెళ్ళానికి చార్టర్డ్ ఫ్లైట్
    ఒక్క మాట తో
    స్టాక్ మార్కెట్ హాం ఫట్.
    త్రీ పీస్ సూట్లేసుకుని
    సంపద పై స్వారీ చేస్తూ
    తమ ప్రగతే దేశ ప్రగతని
    నమ్మబలికే వ్యాపారవేత్తలు కాదు

    సామాన్యులమంటే మనం
    ప్రభువుల పాపాల్ని తమ విఙానం తో
    రాజ్యాంగ లొసుగుల్లో పాతిపెట్టి
    అవినీతి మూటల మేడల్లో
    హాయిగా వుండే బ్యూరొక్రాట్లు కాదు

    సామాన్యులమంటే మనం
    హీరొయిన్ల లిప్ స్టిక్ ధరల్ని
    హీరోల చీకటి రహస్యాల్ని
    ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారాల్తో
    అబద్దపు వార్తల్ని అందం గా
    అందించే వాళ్ళు కాదు

    సామాన్యులమంటే మనం
    30 సెకన్ల ప్రకటన తో
    తమ విలువైన కాలాన్ని
    సెకన్ల కి కోట్ల చొప్పున
    అమ్ముకునే సెలబ్రిటిలు కాదు

    సామాన్యులమంటే మనం
    పడవల్లాంటి కార్లేసుకొచ్చి
    సూపర్ మార్కెట్ తోపుడుబండి నిండా
    సరదా కోసం షాపింగ్ చేసె వాళ్ళు కాదు

    సామాన్యులమంటే మనం
    ఒకటో తారీఖొస్తుందంటే ఒణికిపోయే వాళ్ళం
    ఉల్లిపాయ,టమాటా, నిత్యావసరం ఏదైనా
    రేటు పెరిగిందంటే
    బడ్జెట్ సవరణల్తో కుస్తీ పట్టేవాళ్ళం.
    కందిపప్పు పండక్కే వండుకునే వాళ్ళం
    గుక్కెడు నీళ్ల కోసం
    కుళాయి దగ్గర కుస్తీ పట్టే వాళ్ళం
    రేషన్ షాప్ క్యూ లో సహనాన్ని పరీక్షించుకునే వాళ్ళం
    వాన కోసం ఎదురుచూసేవాళ్ళం
    మట్టి వాసన పీల్చే వాళ్ళం
    అనుక్షణం పోరాడే వాళ్ళం..ఆశాజీవులం
    --శ్రీ

    (పొట్టకూటి కోసం కవిత్వాన్ని ఫుట్పాత్ మీద అమ్ముకునే ఒక ఐరిష్ కవి కవిత ని ఫ్రీ గా చదివి అనుసరిస్తూ..,అనుకరిస్తూ..
    మన్నించాలి నాకు అతని కవితే కాదు కనీసం పేరు కుడా గుర్తు లేదు )

    శ్రీకాంత్ కాంటేకార్ || మానవత్వం ఖాయిల పడ్డ కార్ఖానా ||

    మానవత్వమే ఓ ఖాయిల పడ్డ కార్ఖానా
    ఇంకా మనిషికి విలువ ఏ పాటి?
    కల్లోల జీవన సాగరంలో అనునిత్యం
    ఆటుపోట్లను ఎదుర్కొంటున్న సామాన్యుడిని చూసి చలించదేవరు?
    నీతి బాట వీడక
    కత్తుల వంతెనపై పడుతూ లేస్తూ
    నెత్తురోడుతూ
    గాయాలను ఓర్చుకుంటూ
    బతుకు బండి లాగుతున్న ఒంటరిజీవి గుర్తున్నాడా?
    తడారిపోయిన నీ హృదయ చలిమెల్లో
    రెండు కన్నీటిబొట్లయినా అతడి కోసం మిగిలివున్నాయా?
    నయా అభివృద్ధి ముసుగులో
    రంగురంగుల విద్యుత్ వెలుగులో
    సంపన్నవర్గాలను, విజేతలను మాత్రమే
    కీర్తిస్తున్న నీలో ఇంకా అతడి గురించి భావాలు ఊరుతున్నయా?
    అతడి జీవితం సంఘర్షణభరితం
    తప్పు చేసే అవకాశం ఉన్నా
    గీత దాటే గుండె ధైర్యం లేదు
    బహుశా అమ్మ చెప్పిన నీతికథాసారం
    చెవుల్లో మారుమోగుతున్నదేమో
    పాపపు కూడుతో పైకి రాలేవన్న
    బడిపంతుల పాఠాలు గుర్తుకొచ్చెనేమో!
    పాపభీతి.. పైవాడు గమనిస్తున్నాడన్న భయం వెంటాడుతుందేమో!
    (అందుకోసమే సామాన్యుడిగా మిగిలాడనుకుంటే
    ఈ సమాజంలో మంచితనపు చివరిజ్యోతి కూడా ఆరినట్టే
    అంతటా అన్యాయం అంధకారమే)

    అటు చూడు చెడి బతికిన వాడి వైభవం
    వాడి చుట్టూ చేరిన భజనమేళా సందోహం
    వాడు ఎందరికి చెరుపు చేశాడో ఎవడికి పట్టింది
    ఎన్ని అడ్డదారులు తొక్కి పైకి వచ్చాడో
    ఎవడు అడుగుతాడు
    ఎవడికి మాత్రం అంత ధైర్యం తీరిక ఉన్నాయి కనుక

    వాడు విజయం సాధించాడా లేదా? అన్నదే కావాలి
    ఎంతమంది నోళ్లు కొట్టి
    ఎందరి జీవితాలను బలిపెట్టి
    ఎన్ని గుడిసెలకు అగ్గిపెట్టి
    తన మహాసౌధాలను నిర్మించుకున్నాడో
    ఎవడు మాత్రం శోధించి కనుక్కోగలడు

    ఎందరి వెన్నెముకలు విరిచి
    ఎంతమంది ఆశలను చిదిమేసి
    తన విజయానికి మెట్లుగా మార్చుకున్నాడో
    నువ్వేమైనా ఎరుగుదవా

    మృగరూపం దాచేసి
    సాధు తోలు కప్పుకొని
    చెబుతున్న నీతి మాటలకు
    మైమరచిపోతున్న మానవుడా
    రాజకీయమే రాచబాటగా
    అధికారమే ఆలంబనగా
    నిర్మించిన మహా సామ్రాజ్యాల కింద
    ఎన్ని జీవితాలు విధ్వంసమయ్యాయో
    ఎన్ని బతుకులు బలిపీఠం ఎక్కాయో

    నీకూ నాకూ మాత్రం ఎందుకు పట్టింపు
    నువ్వు నేను బాగానే ఉన్నాం
    తగలబడుతున్న సమాజం
    మన గుడిసెల దాకా రాలేదు కదా
    మన కాలి కింద నేల కదిలిపోవడం లేదు కదా
    అభివృద్ధి పేరిట జరుగుతున్న జీవన విధ్వంసం
    నువ్వూ నేనూ రుచి చూడలేదు కదా
    అందుకే స్పందించొద్దు
    నరనరాలలో ఉడుకు నెత్తురు మరగకూడదు
    పక్కవాడి అన్యాయంపై మన రోమాలు నిక్కబొడుచుకోవద్దు
    అయినా నాకెందుకొచ్చిన గొడవ
    పక్కవాడి గుడిసెగా తగలబడుతోంది
    రేపొద్దున నీ పక్కవాడు కూడా ఇలాగే అనుకుంటాడు
    కాంటేకార్ శ్రీకాంత్