ఈనాటికవిత-74 __________________________ పనసకర్ల ప్రకాశ్-వేశ్యావాటిక కవిత్వం కొత్త అంశాలను ఆవిష్కరించాలి,కొత్త చూపుని జీవితాలపై ప్రసరింపజేసి లోకానికో కొత్త చూపునివ్వాలి.జీవితమైనా ,ప్రకృతి అయినా కొత్తదనం లేకపోతే కవి ఎక్కడో ఒకచోట గడ్డకట్టుకుపోతాడు.పనసకర్ల ప్రకాశ్ అలాంటి అంశాన్నొకదాన్ని కవిత్వీకరించారు.వేశ్యల జీవితాల్లోని చీకటీని,ఆ అంతరంగం నుంచే ఆవిష్కరించారు. సాధారణంగా వ్యక్తంచేస్తున్నప్పుడు మూడుకారకాలు ఉంటాయి.భావాన్ని వ్యక్తం చేస్తున్న పద్ధతి,వస్తువును వ్యక్తం చేస్తున్న పద్ధతి,రూపాన్ని అందిస్తున్న పద్ధతి ఈ మూడిటి సమగ్రతే కవిత్వంగా కనిపిస్తుంది.వస్తువుని వ్యక్తంచేస్తున్న పద్ధతి దర్శనం వల్ల,భావనని వ్యక్తం చేస్తున్న పద్ధతి ఙ్ఞానం వల్ల,రూపాన్ని వ్యక్తం చేస్తున్న పద్ధతి పఠనం వల్ల రూపొందుతుంది. ప్రకాశ్ లో భౌతిక మైన స్పృహనించి వ్యక్తం చేస్తున్న బలమైన వాక్యాలున్నాయి.ఇవి కవి తానుగమనించిన దైన్య స్థితిని అందిస్తాయి. "ఈ శరీర౦ గర్భగుడికాదు.. దేవుడొక్కడికే తలవ౦చడానికి" "మే౦ పెట్టుకునే పూలకి నలిగిపోవడమే తప్ప వాడిపోవడ౦ తెలీదు" "మే౦ నలుగురూ నడిచే దారిలో కాసిన చెట్ల౦ ఆకలితో ఎవరు రాళ్ళేసి మమ్మల్ని గాయపరచినా తలవ౦చి ఫలాలనివ్వాల్సి౦దే..." వ్యథాభరితమైన జీవితాన్ని చిత్రించేందుకు బరువైన ప్రతీకలతో,తాత్వికంగా కవిత్వాన్ని దిద్దారు ప్రకాశ్.భావన,వస్తువు బలమైనవే.వ్యక్తీకరణ కూడా బలైమైందే.ఇందులో త్యాగభావన అనే అంశాన్ని ఒకదాన్ని ప్రక్షిప్తం చేసారు.యూంగ్ ఉమ్మడి అచేతనాన్ని(Colective unconcious ness) గురించి చెప్పాడు.అందులో కొన్ని మూలరూపాలగురించి(Archetypes)ప్రస్తావించాడు.అందులో త్యాగభావన మొదటిది.చాలావరకు కవులు చెట్టుని,దధిచిని త్యాగానికి చూపడం ఇలాంటిదే.ఈ వర్ణన నుంచి ప్రకాశ్- ఇలాంటి ప్రస్తావనని ఒకటి చేసారు. "మేమ౦టూ లేకపోతే ఈ కామ౦ధుల చూపుల రాళ్ళు తగిలి ఎన్ని పెరట్లో చెట్లు గాయపడేవో........... మా బతుకులు చిద్రమైనా ఫరవాలేదు మావలన కొ౦దరి బతుకులైనా భద్ర౦గా ఉన్నాయి ఈ ఒక్క ఆత్మ స౦తృప్తి చాలుమాకు కళ్ళు తెరవని ఈ సమాజ౦ము౦దు ప్రశా౦త౦గా... కన్ను మూయడానికి.." ప్రకాశ్ గారు వస్తువుని ఇంకా అనేక కోణలలో చిక్కించుకోవడానికి దర్శనాన్ని,పాఠకుడికి మరింత బలంగా చేరడానికి రూపాన్ని సాధనచేయాలి.ఇతరుల కవిత్వాన్నిగమనించడంవల్ల ఈ అవకాశం కలుగుతుంది.ఒకింత సామాజిక స్పృహతో మంచి కవితను ఆవిష్కరించినందుకు అభునందనలు.
by Narayana Sharma Mallavajjala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lLCCmb
Posted by Katta
by Narayana Sharma Mallavajjala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lLCCmb
Posted by Katta