పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Kavitha Prasad Rallabandi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Kavitha Prasad Rallabandi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, మార్చి 2014, శనివారం

Kavitha Prasad Rallabandi కవిత

Dear Friends! I am sending to u link of "laksha padyarchana" Pl click it. You will get a pro-forma. Pl fill it and submit. That will reach my mail. I will write a poem of your choice and send to ur mail,apart from posting on FB wall. Pl repost if have already requested in any other medium . I am waiting for your poetic requisition.... Yours poetically Dr.Rallabandi Kavithaprasad http://ift.tt/1iLHswr

by Kavitha Prasad Rallabandi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iLHswr

Posted by Katta

1, మార్చి 2014, శనివారం

Kavitha Prasad Rallabandi కవిత

లక్ష పద్యార్చనం ......................... డా. రాళ్ళబండి కవితాప్రసాద్ ......................... ప్రియమైన స్నేహితులారా ! ధన్యవాదాలు !! లక్ష పద్యర్చనం కు అద్భుత స్పందన ! అభినందించినవారు ఇప్పటిదాకా అన్ని గ్రూపు లలో కలసి 500 కు పైన! కేవలం24 గంటలలో ...... ప్రశ్నల సంఖ్య 48 . పూరణలు ప్రారంభిస్తున్నాను! ప్రతి రోజు ఉదయం నా గ్రంధ ముఖి స్నేహితులకు సమర్పించుకుంటాను ....! ప్రశ్నల సంఖ్యా పెరగాలి ! రోజుకు కనీసం 100 ప్రశ్నలు రాక పొతే 1000 రోజులలో 1,00,000 పద్యాలు పూర్తి కావేమో !? రేపటినుంచి పూరణలు.!! మీ రాళ్ళబండి కవితా ప్రసాద్ kavithaprasadrv@yahoo.com

by Kavitha Prasad Rallabandi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://yahoo.com/

Posted by Katta

28, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Kavitha Prasad Rallabandi కవిత

అవధాన విద్యా ప్రపంచం లో 'గ్రంథ ముఖి '( ఫేస్ బుక్ ) మాధ్యమం లో డా . రాళ్ళబండి కవితాప్రసాద్ అపూర్వ, వినూత్న ,చారిత్రాత్మక ,తెలుగు కవిత్వ ,ప్రయోగం ! " లక్ష పద్యార్చనం " ...................... ............... ............. ............... ................... ప్రియమైన స్నేహితులారా ! నమస్కారం !! మన మంతా కలసి ఒక దివ్యమైన పద్య కవిత్వ యజ్ఞం చేద్దాం. దాని పేరు " లక్ష పద్యార్చనం" మీరు పృచ్ఛకులుగా, ప్రశ్నల పుష్పాల సౌజన్యం ప్రకటిస్తే ఈ " లక్ష పద్యార్చన " ప్రారంభమౌతుంది , "లక్ష పద్యార్చన" స్వరూపం ---------------------------- సాధారణంగా అష్టావధానం లో 8 మంది పృచ్చకులు ,ఒక కొన్ని వందల మంది ప్రేక్షకులు , ఓ రెండు లేక మూడు గంటల సమయం 10-15 కొత్త పద్యాలు రచించబడతాయి . అదే శతావధానం లో 100 మంది పృచ్చకులు ,వెయ్యికి పైగా ప్రేక్షకులు ,2-3 రోజుల సమయం , 100 కు పైగా కొత్త పద్యాల సృష్టి . సహస్ర , పంచ సహస్రావధానాల లో సుమారు 1000 మంది పృచ్చకులు. నాలుగు వారాల సమయం , 1000-5000 పద్యాల సృష్టి. వీటికి ₹10,000/ నుండి ₹25,00,0000/ వరకు ఖర్చు ! ఇంకా ఎన్నో శ్రమలు ! ప్రస్తుతం మనం ఫేస్ బుక్ ద్వారా చేసే ఈ "లక్ష పద్యార్చన" లో వేలాది పృచ్చకులు ప్రపంచం నలు మూలల నుండి ఖర్చు శ్రమ లేకుండా పాల్గొనవచ్చు ! లక్ష కొత్త పద్యాలు సృష్టించ బడతాయి! విషయ వైవిధ్యం ఉంటుంది ! ప్రశ్నల విభాగాలు : 1)సమస్యలు 2)దత్తపదులు 3)వర్ణనలు 4) అనువాదాలు 5)అప్రస్తుత ప్రశంసలు ఒక్కొక్కరు ఏ అంశం పైన అయినా ,ఎన్ని ప్రశ్న లైనా అడగ వచ్చు , సమస్య : ఛందో బద్ద్ధమైన పద్యపాదమై ఉండాలి .అసంబద్ధమైన అర్ధం ఉండాలి . దత్తపది :శబ్ద లయ గాని, భావలయ గాని, అర్ధ లయ గాని గల , నాలుగు పదాలు ఇవ్వాలి . కోరిన ఛందస్సు లో కోరిన అంశంపై పద్ద్యం చెప్పమని అడగాలి వర్ణన :ఏదైనా ఉదాత్తమైన అంశం పై కోరినఛందస్సులో వర్ణనాత్మకమైన పద్యం అడగ వచ్చు. అనువాదం :ఇంగ్లీషు లేదా సంస్కృతం లోఏదైనా పద్యాన్ని లేక శ్లోకాన్ని ఇచ్చి పద్య రూపం అనువదించమని అడగ వచ్చు అప్రస్తుత ప్రశంస :చమత్కారమైన ప్రశ్నలు అడిగితే చురుకైన సమాధానాలు పద్య రూపం లో ఇవ్వబడతాయి . ఇవన్ని మీ లక్ష ప్రశ్నలు ! నావి లక్ష పూరణలు !!!! ఇది మనం కలసి వాగ్దేవికి చేసే లక్ష పద్యార్చన !!!! ప్రశ్నలు మానవ జాతికి ఉపయోగ పడేలా ఉండాలి . సమకాలీన సమాజాన్నిప్రతిబింబించేవిగా ఉండాలి. ఉత్తమ సంస్కృతినిర్మాణానికి దారి వేసేవి గా ఉండాలి. విజ్ఞానం కలిగించేవి గా ఉండాలి. మీ ప్రశ్నలు మీ ప్రతిభని ,సంస్కారాన్ని ,జిజ్ఞాసని తెలియజేసేవిగా ఉండాలి. మీ ప్రశ్న కింద మీ పేరు .చిరునామా. ఫోను నెంబరు .ఈ మెయిలు . తప్పనిసరిగా ఉండాలి. ఈ లక్ష పద్యార్చన గురించి మీ స్నేహితులకుచెప్పండి. ఫేస్ బుక్ లో. షేర్ చెయ్యండి. లక్ష ప్రశ్నలువచ్చేలా సహకరిచండి ! ఈ క్షణం నుంచే పూరణలు ప్రారంభిస్తున్నాను !! ప్రశ్నలు సంధించండి !! వాగ్దేవీ కటాక్షం తో 1000 రోజులలో పూర్తిచేయాలని సంకల్పం . "ఆకాశ వీణ పై అక్షర రాగాలు సృష్టించు వాణి ఆశీస్సులిడగ ! వాయువీచికలన్ని భావ వీచిక లౌచు శ్వాస కవిత్వయశస్సు లిడగ! పద్యాగ్ని శిఖలతో ప్రజ్ఞామహాయజ్ఞ వేదిక దివ్యహవిస్సు లిడగ! రసవదమృత పద్య రాజీవ బృందమ్ము బ్రాహ్మికి కావ్య సరస్సులిడగ! భూమాత హృదయమ్ము పూర్ణ కుం భమ్ము నై శ్రీం కార శబ్ద రోచిస్సు లిడగ! రమ్య సంకల్ప మీ శివరాత్రి వేళ లక్ష పద్యార్చనము సేయ లక్ష్య మొకటి వెట్టితిని ముఖ పుస్తక వేది పైన వేగ ప్రశ్నింప రారండి విజ్ఞులార ! పంచ భూతాలు సాక్షి ! గీర్వాణి సాక్షి ! ...... ..... ...అవధాన విద్యా ప్రపంచం లో 'గ్రంథ ముఖి '( ఫేస్ బుక్ ) మాధ్యమం లో డా . రాళ్ళబండి కవితాప్రసాద్ అపూర్వ, వినూత్న ,చారిత్రాత్మక ,తెలుగు కవిత్వ ,ప్రయోగం ! " లక్ష పద్యార్చనం "

by Kavitha Prasad Rallabandi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pAqVzj

Posted by Katta

18, ఫిబ్రవరి 2014, మంగళవారం

Kavitha Prasad Rallabandi కవిత

మూలం: 'ఎర్లీ' by మార్క్ నెపో ( reduced to joy ) స్వేచ్చానువాదం : డా .రాళ్ళబండి కవితాప్రసాద్ ........ ....... ........ ....... ఎందుకో తెలీదు గాని ఇవ్వాళ దిగులు తో నిద్రలేచాను . బహుశా పోగొట్టుకున్నదేదో గుండె మీద అటు ఇటు తారాడుతోంది , తొలిపొద్దు మీద కాకి ఎగిరిన నీడ లా .... ఇప్పుడు ఆకలేస్తుంది ! ఒక్కోసారి విషాదాన్ని తప్పించుకోడానికి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కళ్ళతో పుస్తకాలని , జ్ఞాపకాలతో గతాన్ని , ఏవో అంచనాలతో అనిశ్చితిని , తినాలనిపిస్తుంది! ఒక్కోసారి దేశాల పటాలని గీసుకుని తినాలని పిస్తుంది! నిజానికి ఇదంతా వొట్టి కాలక్షేపానికే ! నేను ప్రేమించిన మనుషులెవరూ కనపడడం లేదు. కొందరు తప్పుకుని పొయ్యారు . ఇంకొందరు వాళ్ళ దిగుళ్ళ తో నన్ను తినడం మొదలెట్టారు ! ఐనా , మనం ఎవరిని వదిలేసినా , మనల్ని ఎవరు వొదిలేసినా, మన హృదయం మాత్రం మనల్ని వదలదుగా ! అందుకే, దాని నీడ లోనే దిగులుపడదాం ........!!! (18th feb 2014 at 4 am)

by Kavitha Prasad Rallabandi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bGs2ty

Posted by Katta

13, ఫిబ్రవరి 2014, గురువారం

Kavitha Prasad Rallabandi కవిత

మూలం : 'ఆన్ ద వే టు విండ్ సార్ ' by మార్క్ నెపో (అమెరికన్ కవి ) స్వేచ్చానువాదం : డా. రాళ్ళబండి కవితాప్రసాద్ ...... ...... ...... ...... నువ్వు నడిచొచ్చిన దారి నీ కళ్ళల్లో కనపడుతుంది .... దార్లో ఎవరినైనా గాయపరచావా ? లేక., గాయపడ్డావా? లేక , రెండూనా ? వచ్చేప్పుడు ఏమైనా కావాలని పారేసుకున్నావా ? నాకు తెలుసు, నేనూ అలాగే పారేసుకున్నాను! నా గుండె ఇప్పుడొక చిల్లులు పడ్డ మేకుల సంచి , లోపల గుచ్చు కొంటోంది ... నాకు తెలుసు, మనమిలా కలుసుకుంటామని ! కొందరుంటార్లే ! వాళ్ళలో వాళ్ళు దాక్కుంటారు . ఎప్పుడైనా గాలివాటుగా ప్రేమ ధ్వనిస్తే జడుసుకుని బయటకొచ్చి కళ్ళు చిట్లించు కుంటారు ... కాని ఒకటి చెప్పు! ఒకమహా విషాదం ముంగిట కూర్చుని సుందర స్వప్నాలు కనడం లోఅర్ధముందా !? అదిగో! చిన్నిచిన్నిపిట్టలు తమ కలకలారావాల ముక్కులతో చీకటి ముడి విప్పి తూరుపు సంధ్యని విడుదల చేస్తున్నాయ్ ఇప్పుడంతా హాయిగా ఉంది చెప్పుకోడానికి ఏమీ లేనప్పుడు, చివరిగా మాట్లాడుకోవడం ఎంత అందంగా ఉంటుందో కదా!

by Kavitha Prasad Rallabandi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jbzQmg

Posted by Katta

15, సెప్టెంబర్ 2012, శనివారం

రాళ్ళబండి కవితా ప్రసాద్ || నేను నాకు తెలుసా!


ఎక్కడో ఒకడు కవిత్వం రాసి
నోబెల్ ప్రైజు తెచ్చుకుంటాడు,
అది చదివి ఇంకొకడు
గుండె పగిలి చచ్చి పోతాడు,
అక్షరాలకి
ఈ రెండు సంఘటనలు తెలియవు!

ఒకతెను చూసి
ఇంకొకడు ప్రేమిస్తాడు.
ఆమె ఇంకొకడితో లేచి పోతుంది,
ప్రేమకు
ఈ రెండు విషయాలు తెలియవు!

నువ్వు నన్ను తిడుతూ ఉంటావు,
నేనునిన్ను పొగుడుతూ ఉంటాను,
తిట్లకు,పొగడ్తలకు ,
మనమెవరో తెలియదు !

సూరీడు ఉదయిస్తున్నట్లు తూర్పుకు తెలియదు
అస్తమిస్తున్నట్లు పడమరకు తెలియదు
ఇంద్రధనుస్సు పుడుతుందని చినుకుకు తెలియదు
మేఘం గా మారినట్లు అలకు తెలియదు
తుపానొస్తుందని సముద్రానికి ,
భూకంపమొస్తుందని నేలకు,
అందంగా ఉన్నానని వెన్నెలకు ,
అలాలేనని చీకటికి ,
తెలియదు.
మరి , నేను నాకు ఎలా తెలుస్తాను !?!?!?

రాళ్ళబండి కవితా ప్రసాద్ || ఆకాశం లో దేవుడి జోలెకు ||

చిల్లి పడింది.
చెల్లాచెదరు గా
నక్షత్రాలు!
....
భక్తుల కోరికల ధూళి తో
గర్భాలయం
నిండిపోయింది.
దేవుడు
బయటికెళ్ళి పోయాడు!
....

ఉల్క

నక్షత్రపు
కన్నీటి చుక్క?!
....
చెరువునిండా
కలువపూల సమూహం
ప్రతి పూవుది
ఒక ఏకాంతం!
.....
.....
చిటారు కొమ్మకు
చేరేదాకా
చెట్టంతా
చేదని తెలియదు
దిగిపోయే ఓపిక లేదు
పైకి దారీ లేదు

5, సెప్టెంబర్ 2012, బుధవారం

డా. రాళ్లబండి కవితాప్రసాద్ ||కొన్ని కవిత్వ క్షణాలు ||


పదాల మొగ్గలు
పూలు గా వికసిస్తే కవిత్వం.
వాక్యాల తీగలు
కొమ్మల కెగబాకితే కవిత్వం.
ఇప్పుడు కొన్నికవిత్వక్షణాలు!
... ... ...
ఆమె లో ఆడ తనం ధ్వనించినపుడు
ఒక పద్యానికి వళ్ళుజలదరిస్తుంది.
భావం రూపమైన సృష్టి తొలిక్షణాల లోని లాలిత్యం
రూపం భావంగా మారిపోయి కవిత్వమౌతుంది .
... ... ....
సౌందర్యం ఒక మెరుపు తీగ
దాన్ని అక్షరాలు గా మెలికలు తిప్పు
విషాదం గడ్డ కట్టిన కన్నీటి చుక్క !
దాన్నివాక్య ప్రవాహం చెయ్
నిరాశ ఒక అనంత మైన లోయ...
దాన్నికవిత్వశిఖరాలతో నింపెయ్
ఆశ జీవితపు జాతీయ పతాక
దాన్నికాలం కొండ మీద ఎగరెయ్..
..... ...... .......
అక్షరానికి ధ్వని ఉంది,
ధ్వనికి ప్రాణం ఉంది,
ప్రాణానికి జీవితముంది,
ఆ జీవితం నిండా
ఆశా సౌందర్యాలు,
నిరాశా విషాదాలు
వాటికి సమాంతరంగా
నిరంతరం కవిత్వక్షణాలు ...

31, ఆగస్టు 2012, శుక్రవారం

రాళ్ళబండి కవితా ప్రసాద్ కవిత


ఆ అమావాస్య రాత్రి ఇద్దరమే చీకట్లో ఎడం ఎడం గా నడుస్తున్నాం.
అప్పుడప్పుడు నీ నవ్వు చంద్రుడి లా వెలుగుతోంది.
ఇద్దరం మెత్తటి చీకటి తివాచీల మీద నడుస్తున్నాం.
మన మధ్య మౌనం లో బోలెడు సంభాషణలు.
ఇద్దరి మధ్య కిక్కిరిసి పోతున్న ఊహల సమూహాలు.
ఒక మహా జ్ఞాపకం మన లోకి ప్రవేశిస్తున్న నిశ్శబ్దం.

వెలుతురు లోకి శరీరాలు వొచ్చేశాయి .చెరో దారి .
ఇప్పుడు నీనవ్వు ఆకాశం లో సూర్యుడు..

మనిద్దరం ఒకే జ్ఞాపకానికి వేలాడే రెండు శరీరాలం.

ఐనా విడదీసే వెలుతురు కన్నా ,
కలిపి ఉంచే చీకటి మిన్న కదూ!

28, ఆగస్టు 2012, మంగళవారం

రాళ్లబండి కవితా ప్రసాద్ || నేలకు చేరని నీడలు !|

వీధి లో నడిచే ప్రతిమనిషి వెనకా రెండు నీడలు
ఒకే దారిలో వేర్వేరు అడుగులు
వెలుతురును బట్టి నీడలు,
అడుగులను బట్టి నడకలు ,
మారుతూ ఉంటాయ్.

దారి ఒకటే,
గమ్యాలు వేరు!
నడక ఒకటే,
ముందుకూ , వెనకకూ, ఒకేసారి!

చీకటి లో
నడిచేటప్పుడు కూడా,
తమ నీడల్ని ఈడ్చుకు పోతున్నారు!
కదల కుండా కూర్చుని కూడా
పరుగేడుతుంటారు
ఒకరికొకరు దీకోట్టుకోకుండా
తేనెటీగల్లా తుట్టె కేసి
ఎగురుతుంటారు!
ఏపువ్వును ఎవరు దోచుకున్నారో!
ఏమనిషిని ఎవరుకుట్టి వచ్చారో!
మర్చి పోతుంటారు!

వీధి లో ఎగిరే ప్రతిమనిషి వెనకా
నేల మీద పడని వేల నీడలు!

27-08-2012

24, ఆగస్టు 2012, శుక్రవారం

రాళ్లబండి కవితా ప్రసాద్ || ఒక విస్మృతి||

ఇసుక లో నడిచే పాదాలకు
చిగుళ్ళు మొలిచినట్లు
మిట్ట మధ్యాహ్న వేళ
నీ జ్ఞాపకాలు..

మసక చీకటిని ముద్దాడు తున్నట్లు
వర్తమానం తో కాపురం.
వెలుతురును స్వప్నిస్తున్నట్లు
భవిష్యత్తు లోకి నిద్ర.

ప్రతి సూర్యాస్తమయమూ
ఒక గతమే!
ప్రతి వెన్నెలరాత్రి
సుఖ దుహ్ఖాల ద్వంద్వ సందేహమే!

కాలాన్ని ప్రాణ మెప్పుడూ ప్రేమిస్తూనే ఉంటుంది,
అందుకే,
కాలం లో ప్రాణం కలసి పోతుంది...?

23-08-2012

23, ఆగస్టు 2012, గురువారం

రాళ్ళబండి కవితాప్రసాద్॥కొత్త కొత్త కొత్త గా ......॥



ఈ పదాలు
ఇంతటి అర్ధాన్ని దాచు కున్న సంగతి
నేను
కవినైనదాకా తెలియదు!
మట్టి ఇప్పుడు నాకో
కొత్త అర్ధాన్నిస్ఫురింపజేస్తుంది.

మనిషి ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నాడు.

నిఘంటువుల పరిమాణం
ఆకాశాన్ని మించి
పెరిగిపోయింది.

ఒక్క కన్నీటి చుక్క
వేయి పదకోశాల సారాంశమౌతుంది.

అక్షరం
సరికొత్త కాంతి కణమై వెలుగుతోంది !

19, ఆగస్టు 2012, ఆదివారం

రాళ్ళబండి కవితా ప్రసాద్ || తెల్లకాగితం ||


విశాల మైన తెల్ల కాగితాన్ని చూస్తే
ప్రియురాలి చిరునవ్వు గుర్తొస్తుంది.
చిన్నప్పుడు ఈత కొట్టిన చెరువు గుర్తొస్తుంది.
సందెవేళ బామ్మ చెప్పిన కథ గుర్తొస్తుంది.
ఆ రాత్రి కన్న కల గుర్తొస్తుంది.
పెళ్ళాం తో పడ్డ తగాదా గుర్తొస్తుంది.
ఎవరి తోని పంచుకోలేని ఒంటరి తనం గుర్తొస్తుంది.
మోసగించిన మనిషితనం గుర్తొస్తుంది.
నిద్రిస్తున్న ఆకాశం లో
మేలుకొని ఉన్న నక్షత్రాల కాంతి గుర్తొస్తుంది,

తెల్లకాగితం
నన్ను తనపైకి అనువదించుకునే
అందమైన కవయిత్రి.

అది నా ఆటల నేల
దాని పై నా గెలుపోటముల ప్రతిబింబాలు
మెరుస్తుంటాయి.

అది నామనస్సు .
దాని నేను పద్యమై శయనిస్తాను.
అక్షర సరస్సు నై వికసిస్తాను!

*18-08-2012

రాళ్ళబండి కవితా ప్రసాద్ || భగ్న దర్పణం ||

నేనొక ప్రతిబింబం గా మారినపుడు
వాస్తవాలు అదృశ్య మౌతుంటాయి తుంటాయి.
అందరి ఆశలు
మిధ్యా ప్రతిబింబాన్ని
ఆరాధిస్తుంటాయి
హృదయం కన్నా
మెదడు ముఖ్య మౌతుంటుంది.
కృతక సహజాల మధ్య
గీత చెరిగి పోతుంది.

సాక్షి గా ఉన్న అద్దం
న్యాయాధికారి గామారుతుంది.
గతం మూగదౌతుంది.
వర్తమానం వికటాట్టహాసం చేస్తుంది.

భవిష్యత్తు అద్దం ముందు హాజరు కాని ముద్దాయి!
ఎదురు గా ఉన్నదే గెలుస్తుంది.

కాలానికి సంకెళ్ళు పడతాయి.

మృత్యువు విజేత గా ఎంపిక అవుతుంది.

అద్దం పగిలి ముక్కలవుతుంది!
వాస్తవం వేయి ప్రతిబింబాలై విస్తరిస్తుంది!

*18-08-2012