పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Dhana Lakshmi Boorlagadda లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Dhana Lakshmi Boorlagadda లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, ఆగస్టు 2012, బుధవారం

ధనలక్ష్మి బూర్లగడ్డ॥కడసమయం॥

కాటికి కాళ్ళు చాపుకున్న కడసమయంలో
కాదంటూ కాలదన్నిన కన్నకొడుకులు
కష్టాలు కావలి కాస్తుంటే
కనబడలేదు కంటికి కరుణ

కర్మ అని అనుకోక
కాలానికి ఎదురొడ్డి
కడుపుకింత కూటి కోసం
కాయంలో బలం కూడగట్టుకొని
కష్టాన్ని కసిని కళ్ళల్లో నింపి
కర్మకాంఢలో వాడే కట్టెలమ్ముతూ
కాలాన్ని నెడుతున్నా

క్షణం మోస్తున్న కావిడిలోనివి కట్టెలే
కనుమూసిన క్షణంలో కౌగలించుకొనేవి కట్టెలే

కడకి "కూటి కోసం కోటి కట్టెలు" అయ్యింది నా ఈ జీవనం
 
*1.8.2012

30, జులై 2012, సోమవారం

ధనలక్ష్మి బూర్లగడ్డ కవిత

నేను నాకే ఒక్కోసారి కొత్తగా ఉంటా
నేను నాకే ఒక్కోసారి వింతగా ఉంటా
నేను నాకు ఒక్కోసారి చెలాకిగా ఉంటా
నేను నాకే ఒక్కోసారి కష్టంగా ఉంటా
ఏదేమైనా నాలో నేనే అన్నీ దాచుకుంటా మౌనంగా
నా ప్రపంచమే వేరే
నాకు నేనే ప్రత్యేకం
నాకు నేనే అన్నీ ఆ ఒక్క క్షణంలో
నేను ఒక్క దాన్నే ఉండటమే నాకు ఇష్టం
నిరాశ నన్ను అల్లుతుంది ఒక్కో నిమిషం
కన్నీటి బొట్టే నాకు నేస్తం
మాట రాక మనసు కలవర పడితే
అప్పుడే కాగితం తోడయ్యి కాదన్నా
కవితలా మారి కలం నుండి కాగితంపైకి వచ్చేస్తుంది
నా కవితను చదవడమే నా మనసుకి ఒక ఓదార్పు
ఆ ఓదార్పుతోనే నిదుర ఆదరించి నన్ను హక్కునచేర్చుకుంది
కొత్త ఆశల వెల్లువను కలలుగా అందిస్తూ
మౌనాన్ని మెల్లగా పక్కకు నెట్టేస్తూ
మరో కొత్త ఉదయాన్ని ముద్దుగా ముందుకు తెస్తూ.
*29-07-2012

26, జులై 2012, గురువారం

ధనలక్ష్మి బూర్లగడ్డ కవిత

తొలకరి చినుకులు అందం
అందులో తడిచే పాపాయి ముద్ద మందారం
ఆమె నవ్వులు మేలిమి బంగారం

పసిడి కాంతులు పాపాయి నవ్వులు గా విరబూసిన ఈవేళ
చిరు చినుకులు తనువును తాకిన ఈవేళ

అది చూసిన వారి మనసు అనే మన్ను పై
ఆహ్లాదం అనే మొలకలు వచ్చాయి
ఆనందం అనే సిరి పైరు గా ఎదిగి
ఆశ అనే ఆకలిని తృప్తి అనే ధాన్యంగా మారి తీర్చింది...
26-07-2012

ధనలక్ష్మి బూర్లగడ్డ కవిత

మా ఇల్లంతా గోల గోల నేనుంటే
నేనే లేకుంటే చాల చాల సైలెంటే

ఇంట్లో నేనుంటే ,
గొడవ గొడవ చేస్తుంటా
గజ్జలేసి తిరుగుతుంటా
పిచ్చి పిచ్చి పాటలతో లౌడు స్పీకరేస్తుంటా
అందుకే // మా ఇల్లంతా //

ఇంట్లో నేలేకుంటే ,
అల్లరుండదూ, అలజడుండదు ,
అరుపులుందవూ, అలికిడుండదూ
అందుకే //మా ఇల్లంతా //

అమ్మేమో,
నేను ఇంట్లో ఉంటే తిదుతూనే ఉంటుందెపుడూ
నేనింట్లో లేకుంటే పొగుడుతూనే ఉంటుందెపుడూ
ఏమిటో ఈ వింత గోల అర్ధమేకాదసలూ .......
ఐనా సరే //మా ఇల్లంతా //

కానీ ,
ఫ్రెండ్స్ అయినా, పేరెంట్స్ అయినా ,నైబర్స్ అయినా
నువ్వు నవ్వుతుంటే చాలునంటారే
నువ్వు ఎక్కడుంటే అక్కడే సందడి అని అంటారే
అందుకే //మా ఇల్లంతా //
*26-07-2012

23, జులై 2012, సోమవారం

ధనలక్ష్మి బూర్లగడ్ద॥చినుకు అంటే..॥

మబ్బు చాటు వాన చినుకు
మంచుతెరలోంచి తొంగి తొంగి
మరుమల్లియ లాంటి నన్ను చూసి
మైత్రి చేయ మనసై
స్నేహ వీచిక ఒకటి రాయభారమంపింది

నాకు స్నేహ వీచిక ఒకటి రాయభారమంపింది
స్నేహ వీచిక నా చక్కిలి తాకి
సిగ్గులు నును లేత సిగ్గులు ఏవో నాలో పెంచింది
సోయగాలు పోతూ విషయమంతా చెప్పింది
నాకు విషయమంతా చెప్పింది
సిలకమ్మలా ఆరుబయట వాన కోసం ఎదురు చూడమని అంది

చెలిమి చేసే చినుకు కోసం
చిన్న పిల్లను అయ్యాను
అందం ఆరబోసా
పైటల తెరలు తీసా
పరువపు వేడి పెంచి
వయసును మరచిపోయా
చెంతకు చేరే చిరుచినుకుని చెంగులో పట్టి ఆడించేసా
చెంగు చెంగున చిందేసా
నే చెంగు చెంగున చిందేసా

చినుకు చినుకుకూ నాలో
చిలిపితనం నచ్చింది
చందమామలాంటి చల్లదనం నచ్చింది
చంటిపాప మనసున్న మంచితనం నచ్చింది
చిరకాలం చెలిమి చేయాలనిపించింది
నాతో చిరకాలం చెలిమి చేయాలనిపించిందీ

ఒకే ఒక్క చిరుచినుకుగా మారి
తూరుపు సింధూరంలా నా పాపిట్లో చేరింది
అమృతమే తానై నా అధరాలపై తేలి ఆడింది
నా దాహార్తిని తీర్చేందుకు గొంతులోకి చేరింది
నాలో జీర్ణమై అణువణునా ఇంకిపోయింది
నాతో చిరకాలం కలిసుండాలనే
చిరు వాంఛను గెలిచింది

చినుకు అంటే చుక్కలాంటి నేనని
చుక్కలాంటి నేను అంటే చినుకని
వేరు వేరు కాము మేమని
నా కడ కట్టె కాలే వరుకూ కలసి ఉంటామని
చెలిమికి చక్కని భాష్యం చెప్పింది
చిత్రంగా విచిత్రంగా
చిన్న నాటి తీపి జ్ఞాపకాల సాక్షిగా...
*23.7.2012

8, జులై 2012, ఆదివారం

ధనలక్ష్మి బూర్లగడ్డ॥నేనే నేనే అది నేనే॥


వర్షించే వానజల్లుని
వికశించిన కుసుమాన్ని
పారే ఏరుని
ఎగసే అలని
పరిగెట్టే పైడి లేడిని
పరవళ్ళు తొక్కే జలపాతాన్ని

పదాహారణాల ఆడపిల్లని
తెలుగు ఇంటి లోగిలి ముగ్గుని నేనే
నేనే నేనే అది నేనే

ముద్దొచ్చే చిలక పలుకుని
మురిపించే కోయిల గానాన్ని
వంతపాడే తుమ్మెద ఝుంకారాన్ని
మనసు దోచే మయూర నాట్యాన్ని

పదాహారణాల ఆడపిల్లని
తెలుగు ఇంటి లోగిలి ముగ్గుని నేనే
నేనే నేనే అది నేనే

పల్లెటూరి పంట పొలాన్ని
చక్కని పచ్చిక పైరుని
పసిడి కాంతి శోభనిచ్చే పండిన ధాన్యాన్ని
పసిపాప బోసి నవ్వుని

పదాహారణాల ఆడపిల్లని
తెలుగు ఇంటి లోగిలి ముగ్గుని నేనే
నేనే నేనే అది నేనే

పరువాల పాలపిట్టని
పరతిలోని తులసి మొక్కని
తల ఊపే బుట్ట బొమ్మని
ఆ నింగిని
ఈ నేలని
వీటిని కలిపే ఇంద్రధనస్సుని
నండూరి ఎంకి పాటని

పదాహారణాల ఆడపిల్లని
తెలుగు ఇంటి లోగిలి ముగ్గుని నేనే
నేనే నేనే అది నేనే..!
*7.7.2012