పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Prakash Mallavolu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Prakash Mallavolu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, ఏప్రిల్ 2014, ఆదివారం

Prakash Mallavolu కవిత

ఏది శాశ్వతం....?? || సుష@4U4ever@ ---------------------------------------------------- వేకువ ఝామున వికసించి వాసన్లు వెదజల్లే సుమం..... వాడకపోదు... నేటి కన్నీటి కొలనులో రేపటి ఆనంద పు(భా)ష్పం ... పూయకపోదు.... చీకటి మింగిన చూపులో వెలుతురు చుక్క .... ఉదయించకపోదు... వెలుతురున్న చోటు వెలితి రాదన్న ... ఢోకా లేదు... నిశ్చలమైన అండం.... చలనాన్నిస్తుందన్న నమ్మకం లేదు ... చలనమున్న నేడు... రేపు విగతమవదన్న భరోసా లేదు ... నేను ... నా ... అ(నుకు)న్న మదిలో ... ఏది శాశ్వతం ...?? అనుకునే రోజు రాకపోదు.... శోధించే మెదడుకు ..... తుది లక్ష్యమై అచ్యుతుడు కన్పడక పోడు....06APR14

by Prakash Mallavolu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mOfvFo

Posted by Katta

26, ఆగస్టు 2012, ఆదివారం

ప్రకాశ్ మల్లవోలు || రాలిపోయే తోకచుక్క.. ||


1)
నీలాకాశపు నింగి నగరులో
క్రోధావేశము పొంగి పొగరులో


రివ్వున దూసుకుపోతూ, అగ్గిని మోసుకుపోతూ
శరమై, అగ్నిదేవుని వరమై ముందుకు సాగిపోతూన్న

విశాల విశ్వంలో గమ్యమెరుగని ఓ బాటసారీ !!
అసలు దిక్కేది నీకు ??? చివరికి దక్కేది నీకు ???

కనుచూపుమేర గగనాన లిప్త పాటు విహారీ !!
హక్కేది నీకు ??? ఎందుకు మొక్కేది నీకు ??

తీరని ఆ విన్నపాలు ... తీర్చమని విన్నపాలు ...
కారణం వారి వారి లోపాలు ... కడిగేయాలని పాపాలు ...

పట్టించుకోని ఓ చుక్కా!!! పయనిస్తున్నావు ఎంచక్కా!!!
రాలిపోయేటి ఓ చుక్కా !!! ప్రియుని మదిన వాలిపో ఎంచక్కా !!!

2)

తారాజువ్వలా తోస్తావు... విను వీధి లో విహరిస్తావు...
ఇలా వచ్చి అలా వెళ్తావు.... మధుర జ్ఞాపకాన్నిస్తావు ....

ఉన్న క్షణంలో ఆనందానివి .... కనుమరుగైయున్న క్షణం లో భవ భంధానివి...
విహరిస్తున్న క్షణం లో అందానివి..... మది దోచే చిరు భంధానివి..

చూచుటకు రెప్ప పాటు వ్యవహారం...
చేస్తావు సువిశాల విను వీధిలో స్వైర విహారం...

నేల అంతనూ దాటి , పాల పు౦తలు దాటి
చుక్కల చుట్టాల్ని పలకరిస్తావు………….. గ్రహాల గృహాల్ని సందర్శిస్తావు
సకల శకల స్నేహాల్ని దారిలో కలుస్తావు….సోదర సౌర కుటుంబాల్ని పరామర్శిస్తావు ...

చనిపోయేముందర చివరిసారిగా విశ్వాంతరాళం లో విహరిస్తావు
కనుల కట్టినట్టు, పూస గుచ్చినట్టు నీ భాధనంతా వివరిస్తావు

మము కన్నీళ్ళ చూడలేక కనుమరుగైపోతావు..
నిను కన్నోళ్ళ జాడ లేక కన్నీరైపోతావు ....

కలవరమే చుక్కా ..... నీ పయనము కంటికి
కనికరమే లేదక్కా .... నీ పయిన ముక్కంటికి

మరుజన్మలో మరలోస్తావని ...నువ్ తీరు మానక తరలోస్తావని....
వేచి చూస్తున్నాం నీ రాకకై...

04/01/2012

8, ఆగస్టు 2012, బుధవారం

ప్రకాశ్ మల్లవోలు || అర్ధ' శాస్త్రం లో ఇమిడిపోయిన ఆర్తనాదం... ||

'అర్ధ' శాస్త్రం లో ఇమిడిపోయిన ఆర్తనాదం...
అర్ధం కాక మిగిలిపోయిన యదార్ధ వాదం...

ఎందుకో ఈ అంతస్తుల తేడా???
అసలెందుకో ఈ అసమానతల జాడ ....

ఒక్కోసారి అర్ధం అయినట్టే ఉంటాయి...
అందుకునే లోపే జారిపోతాయ్ సమాధానాలు ..

ఈ తేడాలకు కారణం ఒకోసారి మూర్ఖత్వం అయితే
ఇంకోసారి అమాయకత్వం అవుతుంది.
ఒకోసారి చేతకానితనం అయితే
ఇంకోసారి చేవ చచ్చిన తనం అవుతుంది..
ఒకోసారి తెలివై అంతస్తును పెంచితే
ఇంకోసారి 'అతి' తోడై అది'ము'౦చుతుంది ..

కానీ ఇవేం పట్టవు కలలకి
అవి మాత్రం మేడలు కడుతూనే ఉంటాయి
పునాదుల్లేకుండానే ....

ఊహలకి రెక్కలు తొడుగుతూనే ఉంటాయి..
అడుగులని నేలపై ఉంచుతూనే...

కొన్నైతే వాస్తవం ముసుగేసుకుని మరీ
కళ్ళెదుర కనపడతాయి , (వి)భ్రమలో ముంచేస్తాయి...

కనడానికి ఎన్ని సంగతులున్నా , ఈ
మాయదారి కలలన్నీ డబ్బు చుట్టూనే ఎందుకో???
బహుశా ప్రసవ వేదన శ్రమ లేదనేమో...???

అర్ధం కాని ఆర్తనాదం ఈ 'అర్ధ' వాదం...
అర్ధం కాపోయినా చేసే వితండవాదం ఈ 'అర్ధ' వాదం..

-సుష@4u4ever@

30, జులై 2012, సోమవారం

ప్రకాష్ మల్లవోలు కవిత

సమాజపు కుళ్ళును ,
అసమానతలను అరికట్టేందుకు

అజ్ఞాన అంధకారానికి
అలవాటుపడ్డ కళ్ళకు జ్ఞానాన్నిచ్చేది
నేనున్నా అంటూ మెదిలేది

మేధలోంచి కలం ద్వారా పురుడోసుకుని
భావాలకు అక్షర రూపమిస్తూ

కళ్ళు తెరుచుకుని నిద్ర పోతున్న మెదళ్ళకు
విద్యుద్ఘాతం లా తాకి ,

బద్దకంలో వేళ్ళూనుకున్న మొదళ్ళను
కూకటి వేళ్ళతో పెకలిస్తూ,

ముందుకు నడిపించేది కవిత్వం
కదిలించేది కవిత్వం.

మేల్కొలిపేది , ఆలోచింపచేసేది కవిత్వం .

విజ్ఞతతో , విచక్షణతో
అలరారుతూ, భావంతో ప్రాభవాన్ని గడిస్తూ,
వైభవంగా వెలిగేది
కలకాలం మనసులో నిలిచేది కవిత్వం ....

ప్రాస ఉంటే చాలదు
పస ఉంటేనే అది కవిత్వం.

ప్రాసతో నిండి పస లేకు౦టే
అది కవిత్వమనిపిచ్చుకోదు

భావనలతో నిండి ఉంటే
చాలు అది భావుకత్వం...

(కాదిది ఎవరి నిర్వచనం
నా మనసులో మెదిలిన వచనం
తప్పైతే సరిదిద్దండి )
*29-07-2012

27, జులై 2012, శుక్రవారం

ప్రకాష్ మల్లవోలు || నేను ఇంటికెళ్తున్నానోచ్ ... ||

మదిపొరల గురుతులని గబగబా తవ్వేస్తూ ,
గుండె లోతుల భావనల్ని తపనతో తడిమేస్తూ,

కంటి పాపల ముంగిళ్ళను దబదబా తడిపేస్తూ
కన్నోళ్ళు కానరాక ఉబికెడి కన్నీళ్ళని గలగలా పారిస్తూ

ఇలా ఇలా ఇంటితో దూరం మదినే కలచివేస్తోంది ...

కలతలను కాలరాయడానికి అవకాశం దొరికింది
కన్నీళ్లను అమ్మ చేత్తో తుడిపించుకొనే సమయం వచ్చింది

పట్టరాని బరువైయున్న గోడు తీరే వేళయింది
తేలికైన నా హృదయం చిరువసంత వేళయింది

నిశ్శబ్దానికి నెలవైయున్న గుండెలో మేళా మొదలై౦ది
నిస్సత్తువ కొలువైయున్న మనసులో కళకళయే మొదలై౦ది

ఘడియ ఘడియకీ గూడు రారమ్మని అంటోంది
గుసగుసగా వినిపిస్తూ గురుతులనే కదిలిస్తూ

అమ్మ చేతి గోరు ముద్దని ,
నాన్న చేతి చిరు స్పర్శని
తమ్ముని మోమున నవ్వుని
చేరువవుతున్నానన్న తలపుని

మరలమరల కలిగిస్తూ ,
మదినే ఉక్కిరిబిక్కిరి చేస్తూ

నడిరాతిరి మెలుకువలో నాన్న పిలుపు
చిరుగువ్వల కువకువలో అమ్మ తలపు

ఇలా ప్రతి తలపు తెలుపుతున్నది ఇంటి తలపునే
ఇలా ప్రతి ఉదయం తలపుతెస్తున్నది ఇంటి వలపునే

ఇలా ప్రతి వేకువ తలుపు తీస్తున్నది ఇంటి కొరకనే
ఇలా ప్రతి క్షణమూ పరిగెడుతున్నది ఇంటి వైపుకే .
*26-07-2012