కపిల రాంకుమార్ || 20.4.2014 ప్రతీనెల మూడవ ఆదివారం సాహితీ స్రవంతి అధ్యయన వేదిక నివేదిక || సాహితీ స్రవంతి నిర్వహించే ప్రతీనెల మూడవ ఆదివారంలో భాగంగా 20.4.2014 సాయంత్రం బి.వి.కె. గ్రంథాలయంలో రౌతురవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మొదటగా ఇటీవల మరణించిన సాహితీ వేత్త, నవలా రచయిత నోబెల్ బహుమతి గ్రహీత వామపక్ష కవి గాబ్రెయిల్ మృతికి సంతాపం తెలిపి వారిని గురించి కపిల రాంకుమార్ మాట్లాడారు. గొప్ప నవలాకారుడు గాబ్రియల్ గార్షియ మార్క్వెజ్.. ప్రముఖ వామపక్ష కవుల్లో 20 వ శతాబ్దపు సంచనాల నవలాకారుడు, లాటిన్ అమెరికా సామాజిక, రాజకీయ, చారిత్రక సంక్షోభాలను అద్భుత కథలుగా శిల్పీకరించి, ప్రపంచ ప్రజలను ఆలోచింప చేసిన కథా దిగ్గజం.. గాబ్రియల్ గార్షియా మార్క్వెజ్. థికెన్స్, టాల్ స్టాయ్, హెమింగ్వే లాంటి గొప్ప రచయితల సరసన నిలవదగ్గ రచనలు చేసి, ప్రపంచ సాహిత్యాన్ని అనూహ్యమైన రీతిలో ప్రభావితం చేసిన మేధావి, రచయిత గాబ్రియల్. 20 వ శతాబ్ధంలో సంచలనం సృష్టించి 'వన్ హండ్రెడ్ హియర్స్ ఆఫ్ సాలిట్యూడ్' రచనతో ప్రపంచంలోని అగ్రశ్రేణి రచయితల జాబితాలో స్థానం సంపాదించాడు.అమ్మమ్మ, తాతయ్య చెప్పిన అద్భుత కథలు... అంతేకాదు ఉత్కంఠ కధనాశిల్పంతో పాఠకులను కట్టిపడేసే కథనాశిల్పి , యుద్ధ వీరులు ప్రజల పక్షం నిలిచిన పోరాటయోధుల సాహస గాథలు చదివినంద్కు అవి పౌరుషాన్ని శిఖలను నరనరాల్లో రగిలించాయి. రాజకీయ ఆదర్శభావాలను అతరంగంలో పొంగులెత్తించాయి. కార్మిక, కర్షక పక్షం వహించే ఒక సోషలిస్టుగా, ఒక ఐడియలిస్టుగా మార్చేశాయి. చివరకు క్యూబా కార్మిక నాయకుడు, వామపక్ష పోరాట యోధుడు, ప్రపంచ సోషలిస్టు రాజ్యాలకు, పార్టీలకు ఆదర్శమూర్తిగా, రెడ్ స్టార్ గా నిలిచిన విప్లవ చైతన్యమూర్తి క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రోకు అత్యంత సన్నిహిత మిత్రుణిగా చేశాయి. ఒకరు కలం యోధుడు, మరొకరు పోరాటయోధుడు... వీరిద్దరి కలయిక పైకి సాహిత్యపరమైనదే కావచ్చు. కానీ అది అభ్యుదయ ప్రజాప్రవాహజ్వలిత చలిత చైతన్యమని, వారిద్దరి అంతరంగాలు, భావాలు, నియంతల దోపిడీ దారుల నెదిరించి..ఎగిసిపడే అరుణారుణకాంతి విస్పోట క్రాంతి తరంగాలని, ఎర్రబావుటా నిగనిగలని, ఆ తర్వాత ప్రజలు వేనోళ్ల కొనయాడారు. గాబ్రియల్ గార్షియ జీవిత విశేషాల్లోకి వెళితే...ఆయన 1928 మార్చి6న కొలంబియాలోని అరకటకాలో జన్మించారు. మనో ప్రపంచమంతా నాటి లాటిన్ అమెరికా..గత గాధలతో, ప్రజల బాధల జీవన చిత్రాలతో నిండిపోయింది. ఒక క్రిటిసిజం, ఒక మిస్టిసిజమ్...అతని మెదడులో నిక్షిప్తంగా దాగిపోయింది. ఇదే సమయంలో కాబ్రియల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కొలంబియాలో న్యాయశాస్త్రం చదవాలని ప్రయత్నించారు. తన స్వతంత్ర ఆలోచనలు ఎదలోయల్లో రగిలే భావాల నెగల్లు, సమాజం... మనుషులు కృత్రిమ బంధాలు, రాజకీయ ఘర్షణలు... లాటిన్ అమెరికాలోని ప్రాచీన కుటుంబ వ్యవస్థ, ఆధునిక మోడ్రనిజం మధ్య జరుగుతున్న పరిణామాలు...వీటన్నింటినీ నిశితంగా పరిశీలించిన గాబ్రియల్ మధ్యలోనే 'లా' చదువుకు స్వస్తి చెప్పి ఏదో సాధించాలన్న తపనతో, పట్టుదలతో జర్నలిజాన్ని వృత్తిగా చేపట్టారు. హెరాల్డ్ పత్రికలో పాత్రికేయునిగా, సెఫ్టిమస్ పేరుతో కాలమ్స్ రాశారు. ఎడిటోరియల్స్ కూడా రాస్తూ సంచలన పాత్రికేయునిగా పేరు గడించారు. అవినీతి, అధర్మం, రాజకీయ దౌర్జన్యాలు, నియంతల పోకడలు, అధికారుల నిర్లక్ష్యాలపై ఆయన ఎన్నో వ్యాసాలు, వార్తా కధనాలు రాశారు. ఎన్నో విమర్శలు, వత్తిళ్లు ఎదుర్కొన్నారు. మొమెంటో పత్రికలో నియంతృత్వానికి వ్యతిరేకంగా ఆయన రాసిన వ్యాసాలు అప్పట్లో పెను దుమారం లేపాయి. చివరకు యువ గాబ్రియల్ మొమెంటో పత్రికకు రాజీనామా చేశారు. తదుపరి వెనిజులా గ్రాఫికా పత్రికలో ఎడిటర్ గా 1958 లో చేరారు. ఆ పత్రికలో 'ఎస్పెక్టేటర్' పేరుతో గాబ్రియల్ రాసిన 14 వార్తా కథనాలు ప్రభుత్వాలను కదిలించాయి. అధికారులకు ముచ్చెమటలు పట్టించాయి. ఫైర్ బ్రాండ్ జర్నలిస్టుగా గుర్తింపు బడ్డారు. అయితే ఆయన కలం బలం భరించలేని ఆ పత్రికా యాజమాన్యం గాబ్రియల్ ను ఫారిన్ కరస్పాండెంట్ గా పంపించారు. అయితే జర్నలిజం నీడలో ఆయన వర్జీనీయా వుల్ఫ్ విలియం పాల్క్ నర్ లాంటి ఉద్దండ పండితులను, రచయితలను కలుసుకున్నారు. వారి ద్వారా విభిన్న కథన రీతులను చారిత్రక కథనాలను గ్రామీణ సన్నివేశాలను కథలుగా శిల్పీకరించే నైపుణ్యాలను నేర్చుకున్నారు. అదే సమయంలో రెగ్యులర్ ఫిల్మ్ క్రిటిక్ గా పని చేస్తూ బరాంక్విల్లాలోని ప్రపంచ సాహిత్యాన్ని అవసోసన పట్టారు. ఈ నేపథ్యంలో ఆయనలో అంతర్గతంగా దాగిన సృజనాత్మకత పురులు విప్పింది. నివురు గప్పిన నిప్పులా ఉన్న మార్మికత నిజాల నిప్పురవ్వలు ఎగజిమ్మింది. ఆయన ఆలోచననలన్నీ మ్యాజిక్ రియలిజంగా రూపుదిద్దుకున్నాయి. చారిత్రక వాస్తవికత, గతితార్కిక భౌతికత, అతని మనో ప్రపంచాన్ని దేదీప్యమానంగా వెలిగించాయి. ఆనాటి కుళ్లిన వ్యవస్థ పట్ల కుహనా వ్యక్తుల పట్ల తీవ్ర స్వరంతో స్పందించారు. నిజాల ఇజాల భాస్వరమై నినదించారు. కవులు, యాచకులు, సంగీత విద్యాంసులు, ప్రవక్తలు, యోధులు, స్కౌండ్రల్స్...అందరూ విశృంఖల వాస్తవికతకు ప్రతినిధులని విరుచుకుపడ్డారు. నవీన జీవితాన్ని నమ్మదగినదిగా చూపించే సంప్రదాయ పద్ధతులు మన దగ్గర లేకపోడమే ప్రధాన లోపమని ఆయన విమర్శించారు. ఆయన రచనల్లో అంతటా మ్యాజిక్ రియలియం, సోషలిజం, హ్యూమనిజం, మ్యాజికల్ ఈవెంట్స్, రియలిస్టిక్ సిచ్యుయేషన్స్ కనిపించడం...వెనకాల అతని జీవితానుభవం, పరిశీలన, పరిశోధన తాత్వికవేదన, సైద్ధాంతిక నిబద్దత గొప్ప దార్శనికత అంతకుమించిన మానవత కనిపిస్తాయి....అతని రచనా ఒరవడి అందరికీ ఆదర్శమని తెలిపారు. అనివార్యంగానే అతని సాహిత్యానికి నోబెల్ పురస్కారం వచ్చింది...వివిధ పత్రికలు, మీడియాలలో వచ్చిన అంశాలను చదివి వినిపించారు. తదుపరి సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి ఆనందాచారి మాట్లాడుతు క్రమం తప్పకుండా ప్రతీనెల మూడవ ఆదివారం జరుపుకోటం ఆనందంగావుందని. ఇపూడున్నా ఎన్నికల వాతావరణంలో కవులుగా, కళాకారులుగా, రచయితలుగా మనపై ప్రజలను మేలుకోరి చైతన్యపరచవలసిన కర్తవ్యం భుజస్కందాలపై వుందను తెలిపారు. ఆ పని చేసినందుకే గాబ్రియల్ ప్రముఖుడుగా నిలిచాడని అతని మార్గంలో నడవడమే మనము ఆయనకిచ్చ్చే సరియైన నివాళి అని పేర్కొన్నారు. రచనలద్వారా గడచిన దానిని బేరీజు వేస్తూ నేటి స్థితిగతులను తట్టుకుంటూ రేపటి మేటిబాటను సృజన చేయటమే కవుల లక్ష్యంగ, లక్షణంగా వుండాలన్నారు. మార్మిక వాస్తవికత నుసాహిత్యంలో ప్రవేశపెట్టి రచనలు సాగించిన వారి గ్రంథం బైబిలు తో సమానంగా ప్రతులు అమ్ముడవడం ఒక విశేషం. ప్రగతిశిల, వామపక్ష, అభ్యుదయగాములైన రచయితలకు అతడు మార్గదర్శి అని కొనియాడారు. ఆ విధంగా సన్నద్ధులమవుదామని ప్రతిన పూనాలన్నారు.కన్నెగంటి వెంకటయ్య మాట్లాడుతూ నా మార్గం అనితర సాధ్యం అని శ్రీశ్రీ అన్నట్టు మనంకూడా అలా కొత్త చైతన్య మార్గంలో పయనిద్దామని అన్నారు. శైలజ , తేజస్వనీ, కపిల రాంకుమార్ తమ కవితలను వినిపించారు. వాటిపై విశ్లేషణ శేషగిరి చేసారు.చర్చలో సంపటం దుర్గా ప్రసాద్, , ఎం.శేషగిరి, కంచర్ల శ్రీనివాస్, యడవల్లి శైలజ, వనం తేజస్వని పాల్గొన్నారు. బి.వి.కె. విద్యార్థి ఆశు ప్రసాద్ కంచర్ల శ్రీనివాస్ రాసిన పోలవరం కన్నీటి గేయాన్ని 8హృద్యంగా వినిపించాడు. ఎం. శేషగిరి వందన సమర్పణ చేసారు. 21.4.2014 ఉదయం 9.15
by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pl9Mfl
Posted by
Katta