22, జులై 2012, ఆదివారం
రామకృష్ణ పెరుగు॥వజ్రకిరీటం॥
వణికిపోతున్ననా ఆనందాన్ని
వడిసి పట్టుకోవటానికి
తడిసి తడవని ఈ దేహంలో ప్రవహించే రక్తాన్ని
పునర్జీవం పొందటానికి
ఇప్పుడు నాకొక నవీన వర్షం కావాలి
నేనూ చిలిపి తనాల నావమీద ఎక్కడానికో
నా పసి తనాన్ని పది కాలాలపాటు భద్రపరుచుకోవడానీకో
దేనికోసమయితేనేం ..?
నాకొక వర్షం కావాలి
నాలో పూరించలేని అగాధాలు పెరిగిపోతున్నప్పుడు
నా జ్ఞాపకాల కింద చిరునామా అయింది వర్షం
బహిష్కరించలేని బలహీనతల మధ్య
వర్షం ఓ గొప్ప ఓదార్పు
వర్షం ఎప్పుడూ వర్షమే
వర్షాన్ని బండ రాళ్ళతో బంధించలేము
దాన్ని గుండె చాళ్ళలో పదిల పరుచుకోవాలి తప్ప
బతుకు కోయిల నిద్ర పోతూ ఉంది
వర్షం కూత సరికొత్త సంగీతమై దాన్ని నిద్ర లేపుతుంది
వర్షం ఒకానొక జీవ తాత్వికరాగం పాడుతుంది
సమాధిలో నిద్రించాక కూడా అది నన్ను నిద్రలేపుతుంది
నా అతిధి,నా ప్రేమిక,నా సమస్తనేస్తమూ వర్షమే
వర్షంలో తడిసిన ప్రతిసారీ నేనూ తలెత్తుకు నిలబడతాను
ఏ వేటకాడు ఒడుపుగా విసిరిన వలలో బందీ కాలేదు
నేను రాసిన నాలుగు అక్షరాలకే
నా ముందు వినమ్రంగా బందీ అయింది
ఆనందంగా నిలువునా తడిపేస్తూ నన్ను ఆశీర్వదించింది
నాలోని ఒక్కో పార్వ్శాన్ని పూల చినుకులతో అభిషేకిస్తూ
నన్ను నవ్య మానవుడిగా ఆవిష్కరించింది..
*22.7.2012
Jayashree Naidu||one is born...||
one is born... to die
the journey in between
a fathomless one
the journey starts
to reach the end
the path is me
i met me
somewhere
and carrying the burden
of hopes and despairs
at places its dark
bright at some
some are clear
some dusty
the pace faster..
slower.. rather
to catch up with friends
loner is the soul
it sees the distant
with eye invisible
speaks in silence
always the truth
the hand extended
is from the skies
caring for all the troubles
the conscious gets in!
travel travel loner!
gather the stars dust
the fate has it all
time - knock knock
the final call
lets u take nothing...
*22.7.2012
మెర్సీ మార్గరెట్॥నిలబడు నిలబడు॥
భూమిని ఊహల దారంతో చుట్టి
ఉత్తరం నుండి దక్షిణానికి
తూరుపు పడమరలను చేతుల్లో
బంధించి
విరుస్తున్న ఒల్లునుంచి సొమరితన్నాన్ని తరిమి
నిలబడు నిలబడు
ఈ రోజు నీదే అని
సముద్రాల అడుగుకెళ్ళి
నునుపు రాళ్ళు ఏరుకొని
రకరకాల చేపలతో
దొంగా పోలిసు ఆటలడి
అలసినప్పుడు హిమాలయాల్లో
మంచుని కరిగించి నీళ్ళు తాగి
ఎగురుతుండు ఎగురుతుండు
ఈ రోజు నీదెనని
ఆకాశపు అంచులు తాకి
అటుఇటు కొంచెం కోసుకుని
మేఘాలన్ని కుప్పనూర్చి
పిచ్చుక గూళ్ళు కట్టుకొని
నక్షత్రాల్ని ఏరుకోని ఒళ్ళోనింపుకొని
చేతిగాజులకు కాలిపట్టీలకు
వాటి తళుకుళు తగిలించుకుని
నడుస్తూఉండు నడుస్తూఉండు
ఇంకేదో చేసేదుంది ఈ రోజని
నీటిని ఆవిరి చేసి తనలో ఏకం
చేసుకొనే ఆ సూర్యతాపంలో దూరి
చినుకు చినుకులో హరివిల్లును
ఆవిష్కరిస్తూ
నెమలి పించంలో అంటుకొని
సీతాకొకకు రంగులద్ది
మట్టికి వాసన పూసి
పచ్చని రంగుల ముద్దలు
అడవులకిచ్చి
వర్షపు చినుకుల్లో కలిసి
ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఉండు
ఈ రోజు జీవితం నిన్ను ప్రేమిస్తుందని
ఓటమిని ముక్కలు చేసి ఔషదాన్ని పిండి
చతికిలపడ్డ పట్టుదలకి
వైద్యం చేసుకొని
పాదలకు ఉత్సాహపు పారని పూసుకొని
అపజయాన్ని కాలి జోళ్ళు చేసుకొని
గమ్యం వైపు
పరుగెడుతూ పరుగెడుతునే ఉండు
జీవితంలో ఈ రోజు తప్ప
బ్రతకును గెలవడానికి ఇంకో రోజు లేదని
*22.7.2012
ఫణికమార్ శర్మ భమిడిపాటి॥నీ నీడనై॥
రమ్మంటూనే వద్దంటావ్
వద్దంటూనే రారమ్మంటావ్
రమ్మని పొమ్మన్నా
పొమ్మని రమ్మన్నా
నీ హృదయంలో నేను లేనన్నా
గతించిన జ్ఞాపకానివి నువ్వన్నా
వస్తూనే ఉంటా నీ నీడనై
పోతూనే వుంటా నీ జ్ఞాపకాల్లో గూడునై ...
*22.7.2012
కట్టా సుదర్శన్ రెడ్డి॥జీవితమంతా దెబ్బలమయమే॥
ఈ రోజు నా పుట్టినరోజు
ధాత్రి ధరిత్రి నను ముట్టినరోజు
.. .. ..
పుట్టిన క్షణాన్నె నర్సు దెబ్బలు-
కొట్టినదెబ్బకు నేనేడిచానట.
ఏడుపు విని కన్నవాళ్ళు
కడుపునిండుగ నవ్వినారట !
దెబ్బల-జారి మొదలు ఇక్కడే
జీవితమంతా దెబ్బల తాకిడే
అమ్మపాలు కుత్కెల ఆగితె
లేతగుండుపై అమ్మచరుపులు
చిట్టిచేతుల్లో నేనుజారితె
బండలమీద మోటుదెబ్బలు
బులిబులి అడుగులు కాలుజారితె
గోడలు బాదిన నాటుదెబ్బలు
ముద్ద సహించక నేనేడిస్తే
చెంపను తాకిన అమ్మదెబ్బలు
స్కూలు వెళ్ళనని మొరాయిస్తె
నాన్నవేసిన బెల్ట్ దెబ్బలు
పక్క పోరడు గోలచేసినా
పంతులుమోదిన వీపుదెబ్బలు
క్లాసులోన లెక్కతప్పితే
తోటిపిల్లల చెంప దెబ్బలు
కొత్తసైకిలు తొక్కుమోజులో
మీద కూలిన బండిదెబ్బలు
స్నేహం పేరున ప్రేమవేటలో
గర్ల్స్ చేతిలొ చెప్పుదెబ్బలు
పొట్టకూటికి కొలువులచేరితె
ఉద్యోగంలో విధుల దెబ్బలు
సుఖంకోసమని పెండ్లాడితె
సంసారంలో ఈతి దెబ్బలు
పిల్లలపెంచి సంబరపడితే
కాన్వెంటుల్లో ఫీజు దెబ్బలు
పెళ్ళిచేసి బిడ్డనుపంపితే
అత్తింటోళ్ళ చాటు దెబ్బలు
సదువునేర్చిన జాబుల్రాక
పిల్లలకన్నీ ఎదురుదెబ్బలు
ప్రేమపెండ్లితో కొడుకెల్లిపోతే
తీపిగుండెకు "సన్ స్ట్రోక్"లు
రెక్కలాడని డొక్క ఆగని
వార్ధక్యంలొ వ్యాధి దెబ్బలు
ఊపిరాడక మందుకుపోతే
ఆగినగుండెకు దాక్టర్ దెబ్బలు
పురుటిలొ పుట్టిన పునాది దెబ్బకు
ముగింపు బాదుడె సమాధి దిమ్మే
దేహధారణం దెబ్బలమయము
బతుకుబాటలు బాధలవలయం
జీవితమంతా దెబ్బల పోటులె !
జీవనమంతా బాధల ఓటులే !!
*22.7.2012
జాన్ హైడ్ కనుమూరి॥22nd July॥
అమ్మ
తన అస్థిత్వాలను ఇక్కడే వదిలి వెళ్ళిన రోజు
***
ఇప్పుడు
అమ్మొక వాస్తవ అనుభవాల జ్ఞాపకం
అనుభవమైన జ్ఞాపకం అక్షరాల్లో ఇముడుతుందా!!
నన్ను శిశువుగా మోస్తూ మోస్తూ
పొందిన అనుభూతిని ఎలా రికార్డు చెయ్యాలి!
గోరుముద్దల తప్పటడుగుల బాల్యం
ఏ మురిపాలను మూటగట్టిందో ఎలా విప్పాలి!
నా దేహానికి పొంగు కమ్మి
వారాలు గడుస్తున్నా తగ్గని కురుపులతో విలవిలలాడుతున్నప్పుడు
మందులిచ్చిన ఆచారి మాష్టారు
పిల్లాడికి ఇష్టమైనదేదైనా చేసిపెట్టమనిచెబితే
నా ఇష్టాన్ని తెలుసుకొని
రాత్రంతా నిదురకాచి వండిన కజ్జికాయల్లో
ఏ పాళ్ళలో ఏమి కలిపివండిందో ఇప్పుడు ఎలా తెలిసేది
* * *
ఏడుగుర్ని కన్నందుకు
గర్భం ధన్యమా!
పురిటినొప్పులు సహించిన శరీరం ధన్యమా!!
సుఖదుఖాఃలను తుంగచాపలుగా అల్లి
మోకరించిన వేకువ జాములు ధన్యమా!!
అమ్మా!!
నా జ్ఞాపకాలపొదిలో నీరూపం
చెదరకుండా
ఇప్పుడు నన్ను నడిపిస్తున్నాయి
నీవు కోరుకున్న ఆశీర్వాదాలేవో
నాపై కుమ్మరింప బడుతూనేవున్నాయి
***
(ఈ మధ్య ప్రవీణ రాసిన "వలయం " కవిత చదివాను
నా దేహం ఓ ఏబైఒక్క సంవత్సరాల్ని పూర్తి చేసుకొని 52లో ప్రయాణం చేస్తుంది.
ఇన్ని వసంతాలు వెనక్కువెళ్ళి గర్భస్థ దశను జ్ఞాపకం చేసుకోవలనే కోరిక తీరేది కాదు కదా!!)
*22.7.2012
పులిపాటి గురుస్వామి॥సంచి సర్దుకో॥
గాలి పంఖాలతో పగలుని
మత్తు గమనాలతో రాత్రిని
సాగనంపుకుంటూ
శ్వాసను మెల్లగా మెల్లగా
మెట్లెక్కించుకుంటూ
అటూ ఇటూ చెవులని
చెంపదెబ్బలేసుకుంటూ
వస్తూ వస్తూ నీ సంచీలో వేసుకొచ్చిన
ఇటుక కండరాల పేర్చుకుంటూ
రంగు రంగు సబ్బు జిగటలతో రుద్దుకొని
కొన్ని వాసనలతో కొన్ని మలినాలను దాచుకుంటూ
త్వరలో కూలిపోయే మహాసౌధానికి
భ్రుంగరాజ తైలం రుద్ది
మెహందీ ముద్దలు దిద్ది
త్తల త్తల ల షాంపూ నురగలతో
ఇంకొకడిది కాదు ,నీ వాసనే నీకు చేరకుండా
కల్మషం కడుక్కుంటూ
ఎప్పుడూ ఉపవాసం చేయని వాడు
వజ్ర కిరీటాలతో సంపన్నుల దర్శనానికి పోయి
దుష్ట శిక్షణకి శ్రీకారం చుట్టే విధానం తెలియక
తిక మక పడుతున్న వాడి మీద
రంగుల కుంకుమ చల్లుకుంటూ
తమ బీరువాలు ,ఖాతాలు ఎలా నిమ్పుకోవాలో
వ్యాపారాలకు సంతానవృద్ధిచేసే
సంబరాల్లో మునిగే
అద్దంలో ప్రతిబింబం కూడా
వారినే నమ్మని వారిని
నిజాయితీ నవ్వు నవ్వలేని వారిని
చప్పట్లతో ఊరేగించుకుంటూ
సుఖంతో నిద్రిస్తున్న కుట్రలతో,కుతంత్రాలతో
అనేక నేరాల దోపిడీల దొంగతనపు
భవంతుల మెట్ల మీద
పూల కుండీల వెలిగించుకుంటూ
రాలిపడే బిస్కట్లకు
పోటీ పరీక్షలు రాసుకుంటూ
టీవీ ఘుమఘుమల సీరియల్ వంటకాల్ని
నోరుతెరిచి తలపులు మూసి
చప్పరించుకుంటూ
మాటలు సరిగారాని సినీ మహా మహా కురచనటుల
కవచకుండలాల దుమ్ము భజనకు
చప్పట్లు కొట్టుకుంటూ
పట్టు వస్త్రాలు చుట్టుకున్న
ఫంగస్ చర్మంతో
దురద మీది ధ్యాసతో
పిడచకట్టుక పోయిన గొంతుకు
ఖరీదు మద్య్హం వాగ్దానంతో
యజ్ఞం లో నీతిని కాల్చుకుంటూ
కడుపులో మండిపోతున్న అల్సర్ల మీద
ఆంటాసిడ్స్ తో ప్రదక్షిణ చేసుకుంటూ
కొవ్వు తో పేరుకుపోయిన గుండెను
మందు బిల్లలతో,టానిక్ బిటమిన్లతో
అల్లించుకుంటూ...
ఫో...
పోరా ఫో...
ఛీ...
ఇంతే నువ్వింతే
పది జన్మలెత్తినా పువ్వులా బతకలేవు
*22.7.2012
వంశీధర్ రెడ్డి॥* చైతన్య స్రవంతి (stream of consciousness) *॥
డికడెన్స్, షీర్ పర్వర్షన్,
డింగ్ డాంగ్ బెల్, పుస్సీ ఇన్ ద వెల్,
బావిలో కప్ప, కుప్ప,
కప్పల కుప్ప, బెక బెక బెక బెక బేకు బేకు సాకు,
సాకుల్చెప్తావా సాకులు,
మేకులు దిగ్గొడితే, బాకులు దిగదుడుపే,
దిగాలి దిగాలి దుడుకుగా,
థక్ థీన థీన్ త,
తార, ఆకాశంలో,
పట్నంలో, తారా చౌ..
చొ రామస్వామి "తుగ్లక్" ఏనా,
ఎడిటరా, కాలమిస్టా ,
కాలం ఓ "మిస్ట్", కలమిక "మస్ట్", మస్త్,
మస్తిష్కంలో ఇష్క్, ఇష్క్, కిస్ కేలియే,
హ హ, "కిస్" కేలియే రా ఫాల్తూ,
తూఫాన్, అప్రమత్తమవండి, వండి,
ఆకలినొండిన ఆశ,
చిన్ని చిన్ని ఆఆఆఆఆఆఆఆమ్మ్ మ్ మ్ మ్ మ్ మ్ ,
ఓ జననం, మరో మరణం,
అరుపారని రక్తం, సిక్తం, వ్యక్తం, రిక్తం,
రికీ మార్టిన్ రిచ్చంటగా,
రిచ్చెవడు, పూరెవడూ,
ఎవడో ఒకడు, ఎపుడో అపుడు,
నరకరా ముందుగా, అటో ఇటో, ఎటో, ఎటెటో.
ఏటేస్తివా, వా,
వా"నరులారా' రారండోయ్, రారండీ,
రంఢీ, మెహందీ చౌక్ రంఢీ... ,
ఢిల్లీ బెల్లీ, బెల్లీ డాన్స్ కడుపుకోసమా, కళకోసమా,
కోపం, క్లేశం....
శంభో శంకరా, హరా, సురా, సుర
బై వన్, గెట్ వన్, బాలాజీ వైన్స్,
త్వరపడండి,
పదండి తోసుకు, పదండి దోచుకు,
పోదాం, పోదాం, మనలోకి,
హలో, ఎవరక్కడ,
ఇక్కడెవడో, ఉన్నట్టున్నాడు,
అబ్సొల్యూట్ ప్రెసెన్స్ ఆఫ్, ఆబ్జెక్టివ్ ఆబ్సెన్స్,
ఆబ్ సెన్స్,
క్లెన్స్, క్లెన్స్...
*21.7.2012
హెచ్హార్కె॥పేర్లూ నువ్వూ॥
పేరు పెట్టి పిలవకపోయినా వస్తువులు పలుకుతాయి
పేర్లు వస్తువులు పెట్టుకున్నవి కాదు
నువ్వు వాటిలోనికి వెళ్లిపో, అరవకు
తలుపులు బాదకు, విరిగిపోతాయి
తమకు తాము తెరుచుకునే దాకా
కళ్లు మూసుకుని గడప ముందు కూర్చో
ప్రయాణం ఎప్పుడు ఎక్కడి నుంచైనా మొదలెట్టొచ్చు
ఒంటరిగా వెళ్లాలి,
కోట్లిచ్చినా తనకు తెలియనిది చెప్పని గైడు దొరకడు
పది మంది తారసపడినప్పుడు కూడా
ఒంటరితనం వదులుకున్నావా, అంతే ఇక,
మంది ఉంటారు, నువ్వుండవు
మంది పెట్టిన పేర్లుంటాయి, నీకూ వస్తువులకు
కావాలంటే నీదే మరో పేజీలోంచి ఒక పదం తీసుకో
ఓహ్, అలా కూడా కాదు,
అడుగు ఎక్కడుందో అక్కడి నుంచే ఒక పాదం పైకెత్తి కదలాలి
నడుస్తూ పోతే ఊరొస్తుంది, ఏదో ఒక ఊరు, అన్ని ఊళ్లూ ఒకటే
పేరు భలే మోసకారి,
అదొక పదం అనుకుంటావు నువ్వు, దానికి అంటుకుని
చాల చీము, చాల నెత్తురు; అదంతా
ఊరు ఒక పేరు తెచ్చుకోడానికీ, నిలబెట్టుకోడానికే ...
ఇక్కడ, ఈ కొండ వారన ఒప్పుడు ఒక ఊరుండేది,
దానికొక పేరుండేది
అందరూ వెళి పోయారు, వాగు ఒక్కటే ఉండిపోయింది, ఉండీ ఉండక
ఏ కొండల్లోంచి రహస్యంగా పారిపోయి వచ్చిందో
ఈ ఇసుకలో కూరుకుపోయింది
క్షణం క్రితం మరణించిన యోధుడి గాయం నుంచి రక్తంలా
ఇసుక నుంచి వాగు స్రవిస్తుంటుంది, అది భూమి గాయం,
బహుశా, భూమి ఉన్నంత వరకు ఉండే గాయం
అమ్మమ్మ వాళ్లూరికి వెళ్తూ నువ్వు కూడా చూసి ఉంటావు
ఎండాకాలం మట్టి వెనుక మాటు వేసిన చిరుత చారను,
వానాకాలం గగన ధారను, ఊట వాగును
పేరా?
ఊరిదా? వాగుదా??
నామకరణం చేస్తే గాని, నువ్వు నీళ్లు తాగవా!!*21.7.2012
కసి రాజు॥మళ్ళెప్పుడొస్తావ్?॥
మబ్బుపట్టిన మొహమేసుకుని
మసక సూపులు సూత్తావ్
వానలా వత్తానని
వరదై ముంచెత్తుతావ్
కరిగించేత్తావ్
కదిలించేత్తావ్
కొట్టుకుపొయేట్టు చేత్తావ్
ఒక్కోసారి మొలకెత్తిస్తావ్, పులకెత్తిస్తావ్
పూయనిస్తావ్,కాయనిస్తావ్
అన్నీ ఇచ్చి అస్తమిస్తావ్
ఏడాదికోసారి ఉన్నానంటూ ఉదయిస్తావ్.
మళ్ళెప్పుడొసావ్?
*******
వాతావరణ కేద్రం హెచ్చరికలు జారీ
ఈ రాత్రికి ఋతు పవనాలు ఎటో దారి మళ్ళాయి
*21.7.2012
కిరణ్ గాలి॥గీతొపదేశం॥
ఎన్ని గీతలు గీస్తావు
గిరి గీసుకొని వుంటావు
గీతకు అటుపక్క వారంతా అస్మదీయులు అంటరాని వాళ్ళు...
ఇటుపక్క వారంతా త.స.మ.దీయులు తప్పులేని వారు కారు
నీ కులము, మతము, జాతి, వర్గము, ప్రాంతము
నిశ్చయంగా నీ మూలాలకి ఆనవాల్లె
నిస్సందేహంగ నీ అస్తిత్వ నిర్మాణంలో పునాది రాళ్ళే
కానీ అవే నీ వ్యక్తిత్వానికి గీటురాళ్లు కావు
నీ సామర్ధ్యానికి కొలమానాలు కాలేవు
కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు వ్రుషనాలు పేర్చితే
కళేబరవమవుతుంది కానీ శరీరం కాదు
అండంలొ పిండంగా వున్నప్పుడే
ఆపాదించబడ్డ ఆకస్మిత కాకతాళీయ
సామాజిక తొలు ముద్రలివి
వీటిలో నీ గొప్పేమి లేదు
వీటికంటు స్వతహాగ తప్పొప్పులు లేవు
స్వజాతిపై ప్రేమ సమంజసమే
స్వధర్మే నిధనం శ్రేయః శాస్త్రమే
"స్వ" అర్దం సమ్మతమే
కాని దాన్నె సాగ దీసి
పర దూశనగా ద్వేశనగా మారిస్తే
సంస్కారం అనిపించుకోదు
స్వాభిమానం అంతకన్నా కాదు
పచ్చిగా చెప్పాలంటే
స్వలింగ సంపర్కం అవుతుంది
నీదని పట్టు బట్టావా
నిజమని కట్టు బడ్డావా
నిజయితీగ నిన్ను నువ్వు ప్రశ్నించుకో
తొడ గొట్టి , మీసం మెలెసి
జబ్బ చరిచి, రొమ్ము విరిచి
రంకేలేసే ముందు
"నిస్వార్దం"గానా "నీదనె స్వార్దం"తొనా
నువ్వు వాటికొసం నిలబడెది కలబడెది
అన్నది ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకో
సరిహద్దులు కుంచించుకు పొయినా
హ్రుదయ మైదనాలు విస్తరించాలి
సిద్దంతాలు సంఘర్శించినప్పుడే
స్థితప్రఙ్నత ప్రదర్శించు
లేదంటె గీత.. గీత లోపల గీత
ఇలా గీసుకుంటు పోతు
గోరిలో అఘొరిలా అవుతావు
*21.7.2012
రియాజ్॥ఒట్టు వేయను..!॥
మాట ఇచ్చి తప్పడం
మళ్ళీ కప్పిపుచ్చడం
తప్పించుకు తిరగడం
తప్పుచేశానన్న ఆత్మ వంచనా
సంఘర్షణ ఇవన్నీ ఎందుకు చెప్పు?
అనుకున్నది అనుకున్నట్లు జరగక పోవడం
చెప్పినట్లుగానే చేయగలేకపోవడం
అనే వాస్తవికత ఒకటుంది?
ఎంత విశ్లేషించుకున్నా
తర్కించుకున్నా లెక్కలు వేసుకున్నా
మాట ద్వార నీకు నే చూపిన దృశ్యం
అలాగే చూపిస్తాననే భ్రమపై నమ్మకంలేదు
అందుకే ఒట్టువేయను!!
******** *******
పద శబ్దాల గారడీ నీకిష్టమైనా
శబ్దారాధనలేని చేతలలోని సౌందర్యం గుర్తించకున్నా పర్లేదు !
రుచికరమైన సమాధానం నీకిచ్చి నే గరళం మింగలేను
నీకన్నా నాకన్నా వాస్తవాన్ని నమ్మించే ప్రయత్నంలో
నా మనసుపై నేను ఒట్టువేసుకుని ఒకటిమాత్రం చెప్పగలను
చేసి చూపిస్తా!! సాద్యమైనంత!
*21.7.2012
వేంపల్లి గంగాధర్॥ఎర్ర తురాయి వర్ణం॥
మనిషి
చస్తూనే ఉంటాడు
పుడుతూనే ఉంటాడు
...ఇదొక జనన మరణ చక్రం !
భూమి బల్ల పరుపు గా ఉందా ,
గోళా కృతి గా ఉందా ...అని
వాదించి ప్రాణాలు పోగొట్టుకున్న వారికి
సత్యాన్ని తెల్ల గులాబీ గా ప్రకటించిన వారికి
మరణ కొయ్యకు ముళ్ళ శయ్య కూడా
నెత్తుటి జ్ఞానం దిద్దిన మహర్షులకు
జనం ఆకలి కేకల మధ్య
వరి కంకుల్లా మొల్చుకొచ్చిన వారికి
హక్కుల కోసం
నీ దిక్కుల కోసం
గుక్కడు నీటి చుక్కల కోసం
గుప్పెడు నోటి మెతుకుల కోసం
ఆయుధమై నిలిచి అమరు లైన అరణ్య యోధులకు
ప్రజల కళ్ళ ల్లో , ఇళ్ళ ల్లో , గుండె గుళ్ళల్లో
పాఠం నేర్పే బళ్ళల్లో, పంట మళ్ళల్లో
నాలుగు బజార్ల కూడళ్ళలో
పిడికిలి నినాదమైన యోధాను యోధులకు
పాల రాతి సమాధులు అవసరం లేదు !
ఉదయం పుష్పించే వెలుగు లో
ఎర్ర తురాయి వర్ణం వారి ప్రాచీన పతాకం...!
రాజ్యం ఉక్కు పాదం...
ఒక ఇనుప ఖడ్గం ...
మనిషి
చస్తూనే ఉంటాడు
పుడుతూనే ఉంటాడు
అదొక నీటి బుడగ
నువ్వొక పాము పడగ
అసలు నిజమైనా
మనిషి ఎలా ఉంటాడో
నువ్వు ఎప్పటికి తెలుసుకుంటావు ?
*21.7.2012
శ్రీ వెంకటేష్॥పేగుబంధం॥
నాలో ఒక విద్యుదావేశ కణం రేగుతుంది
ఊహజనిత స్థలంలో నేనున్నా అప్పటివరకు,
కాని ఉన్న పళాన,
ఏదో ఆలోచిస్తూ దేనికోసమో చింతిస్తూ,
ఎరుగని ఒక కొత్త లోకానికి నేనేగుతున్నట్టు,
అప్పటి వరకు నాకు పేగుతో ఉన్న బంధం విడిపోతున్నట్టు,
ఉన్న కొన్ని రోమాలు నిక్కబొడుచుకుంటూ,
కొన్ని అరుపులు ఆక్రోశంగా వేదనననుభవిస్తున్నట్టు,
కొన్ని అరుపులు ఓర్చుకోమంటూ ఓదారుస్తున్నట్టు,
మొదటగా నా చుట్టూ ఉదాసీన వాతావరణం-
తదుపరి నా చిట్టి చేతులు, చిన్న మొహంతో,
నేను ఒక చల్లని ఒడిలోకి జారాను,
పేగుతో నాకు అమ్మ కడుపులో తెగిన స్నేహం-
పేగుబంధంగా అమ్మ రూపంలో మళ్ళీ...!
*21.7.2012
పులిపాటి గురుస్వామి॥వాన మెతుకుల జీవ సారం॥
ఆగని వర్షపు గుభాళింపు
కొండల మీదుగా సొగసుగా
పరుగెత్తు కొచ్చిన ఆకుపచ్చ వాసన
కళ్ళనిండా పూసిన తెల్ల మల్లె
వేడి వేడి మంత్రం వేసే
ద్రవ రూప కౌగిలి
ఎక్కడో మూలన రాతినరాల మధ్య
చుట్ట చుట్టుకొని పడుకున్న
పాము బుసల నడక
జఠరాగ్నియజ్ఞంలో వేగుతున్న
చిటపటల ఆకలి
తడిసిన గాలిని విదిలిన్చుకుంటున్న
పిల్లలకోడి
కాన్వాస్ పై రంగులతో అలికింది
పచ్చి పచ్చి కాలం
చుక్కలతో మొరపెట్టుకున్న
ముఖం కోల్పోయిన దిక్కులు
అన్నిటినీ కుట్టిన
నీటిమౌనం
నిన్ను పరవశింప చేయగలనా?
పదేసి జన్మలెత్తినా...
వచ్చిందానివి వచ్చావు
చూడు ...ఈ భూమ్మీది ప్రాణం కంట నిండిన
నమ్మకపు జల
రాక రాక వచ్చావు .
అప్పుడప్పుడిలా నాలుగు రోజులుండి పో
నీ కడుపున పుడతా మళ్లీ
నా శతకోటి అందాల అద్దుకున్న
సోర సోర అక్షరాలతో.
*21.7.2012
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)