శుక్రవారం కాస్త ఆలస్యంగా రాకూడదు. మరీ కొంపలంటుకున్నట్లు ఇలా పరుగెత్తుకు రావాలా? కవిసంగమంలో గాలిబ్ గురించి ఈ సారి ఏం రాయాలన్నది తేల్చుకోకముందే వచ్చేసింది. ఇక తప్పదు కాబట్టి గత వారం మొదలుపెట్టిన గజల్ లోని మిగిలిన షేర్లు ఇప్పుడు చూద్దాం.. గతవారం గాలిబ్ సంకలనంలోని 18వ గజల్ షేర్లు కొన్ని చూశాం. ఈ వారం ఇదే గజల్ లోని ప్రారంభ షేర్లు చూద్దాం. నేను గజల్ షేర్లను గాలిబ్ ఇచ్చిన క్రమంలో కాకుండా నాకు వివరణ రాయడానికి అనువుగా ఉండే క్రమంలో రాస్తున్నాను. గజల్ లో షేర్లను ఇలా క్రమం మార్చడం వల్ల పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. ఎందుకంటే ప్రతి షేర్ దేనికదే స్వతంత్రంగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు గాలిబ్ సంకలనం 18వ గజల్ మత్లా చూద్దాం. మత్లా అంటే మొదటి షేర్, రెండు పాదాల్లోను రదీఫ్, ఖాఫియాలుంటాయి. షబ్, ఖుమారె షౌఖే సాకీ రస్తఖీజ్ అందాజ్ థా తా ముహీతె బాదా సూరతె ఖాన యే ఖమియాజా థా రాత్రి నిషా కొరకు నిరీక్షణ ప్రళయంలా గడిచింది మద్యపాత్ర అంచు ఒళ్ళువిరుచుకుంటున్న పానశాలయ్యింది తెలుగు అనువాదం అసలు కవితకు ఆమడదూరంలో ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. వివరణ ఇచ్చే ముందు ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. షబ్ అంటే రాత్రి. ఖుమార్ అంటే మత్తు లేదా హాంగోవర్. సాకీ అంటే మద్యం పోసే వ్యక్తి. షౌకె సాకీ అంటే సాకీ కోసం నిరీక్షణ. సాకీ మద్యం పోయకుండా ఎవరికి వారు పాత్రల్లో మద్యం పోసుకోవడం మర్యాద కాదు. అలా ఎవరూ మద్యం తమ పాత్రల్లో పోసుకోవడం జరగదు. కాబట్టి సాకీ రాకపోతే నిరీక్షణ తప్పదు. రస్తఖీజ్ అంటే ప్రళయం. అందాజ్ అంటే పోలిక, అలా ఉందని చెప్పడం. రస్తఖీజ్ అందాజ్ అంటే ప్రళయాన్ని పోలి ఉండడం. ముహీత్ అంటే పరిధి. మద్యపాత్రలో మద్యం నింపే గరిష్ట పరిధి సూచించే గీత అనవచ్చు. బాదా అంటే మద్యం. ముహీతె బాదా అంటే మద్యపాత్రపై మద్యం నింపడానికి సూచనగా ఉన్న గీత. సూరత్ అంటే పోలిక, అలా ఉందని చెప్పడం. ఖానా అంటే గృహం. ఖమియాజా అంటే ఒళ్ళువిరుచుకోవడం. బద్దకంగా మసలడం. ఇప్పుడు ఈ కవిత భావం చూద్దాం. మద్యశాలలో మద్యప్రియులు గత రాత్రి సాకీ కోసం ఎదురుచూస్తున్నారు. సాకీ వచ్చి మద్యం పాత్రల్లో నింపాలి. వారిలో హాంగోవర్ పోవాలంటే కొత్తమద్యం కావాలి. కాని సాకీ రావడం ఆలస్యమవుతోంది. సాకీ కోసం తీవ్రమైన నిరీక్షణ ప్రళయాన్ని గుర్తుకు తెస్తోంది. సాకీ రాకపోవడం వల్ల ఎంతగా నిరుత్సాహం, నిస్తేజం అలుముకున్నాయంటే బద్దకంగా మద్యశాలలోని మద్యం కూడా ఒళ్ళు విరుచుకుంటుంది. మద్యపాత్రలో మద్యం నింపే గరిష్ఠ పరిధిని సూచించే గీతలను దాటుకుంటూ ఒళ్ళు విరుచుకుంటుంది. మొత్తం మద్యశాల బద్దకంగా ఆవులిస్తూ ఒళ్ళు విరుచుకుంటున్నట్లే ఉంది. ఈ మద్యశాలల నియమం కాస్త గమనించాలి. ఇక్కడ సాకీ వచ్చి మద్యం పోయకపోతే ఎవరు తాగడానికి వీలు లేదు. అలా ఎవరికి వారు మద్యం పోసుకుని తాగడం మర్యాద కాదు. సాకీ రాకపోతే వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. మద్యశాలలో మద్యం సీసాల్లోను, డ్రమ్ముల్లోను కావలసినంత ఉన్నప్పటికీ తాగడానికి లేదు. ఇంతకు ముందు తాగిన మద్యం మత్తు (హాంగోవర్, ఖుమార్) దిగని వారికి కొత్త మద్యం తాగడమే విరుగుడు. కాని సాకీ రాకపోతే వారు మద్యపాత్రను ముట్టుకోలేరు. ఇదేదో మద్యప్రియుల వ్యవహారంలా కనబడుతుంది. కాని నిజానికి ఈ కవితలో కొన్ని లోతయిన భావాలున్నాయి. మన చుట్టు మనల్ని ఆకట్టుకునే, ఆకర్షించే, చేతికి దొరికితే బాగుండుననిపించే అనేక విషయాలుండవచ్చు. కాని మద్యశాలలో సాకీ మద్యం పోయకుండా తాగడం ఎలా సాధ్యం కాదో, అదేవిధంగా లోకంలో దేవుడు కరుణించి ఇవ్వకుండా ఏదీ మనకు లభించదు. అన్నీ అందుబాటులో ఉన్నట్లే కనబడతాయి, కాని చేతికి దక్కవు. మద్యశాలలో సాకీ వచ్చేవరకు నిరీక్షించడం ఎలా తప్పదో, అదేవిధంగా దేవుడు కరుణించేవరకు నిరీక్షించడం కూడా తప్పదు. ఈ లోగా ఈ నిరీక్షణ మనకు కష్టం కావచ్చు. బోరుగా మారవచ్చు. పై కవితలో మద్యశాల బద్దకంగా ఒళ్ళువిరుచుకుంటూ ఆవులిస్తుందన్నాడు గాలిబ్. నిజానికి ఆయన దృష్టిలో యావత్తు ప్రపంచం బద్దకంగా ఆవులిస్తూ దేవుడెప్పుడు కరుణిస్తాడా అని ఎదురుచూస్తోంది. ప్రతి మనిషి తనపై దేవుడి కరుణ ఎప్పుడు ప్రసరిస్తుందా అని చూస్తున్నాడు. ఫక్తు తాగుబోతు కవితలా కనిపించే షేర్ ద్వారా లోతయిన సూఫీ భావాన్ని పలికించడం గాలిబ్ కి మాత్రమే సాధ్యం. తర్వాతి కవిత గాలిబ్ సంకలనంలోని 18వ గజల్ 2వ షేర్ ఏక్ ఖదమ్ వహషత్ సే, దర్సె దఫ్తరె ఇమ్ కాం ఖులా జాదా, అజ్ జాయె దో ఆలమ్ దష్త్ కా, షీరాజా థా ఒక్కడుగు పిచ్చిగా వేస్తే, అవకాశాల తలుపులు తెరుచుకున్నాయి రెండు ఎడారిలోకాల పుస్తకపుటలను కలిపి కుట్టిన దారం దారులు తెరుచుకున్నాయి ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. ఏక్ ఖదమ్ అంటే ఒక్క అడుగు. ఒక చిన్న అడుగు అని కూడా చెప్పుకోవచ్చు. వహషత్ అంటే పిచ్చి, ఉన్మాదం. దర్స్ అంటే పాఠం. దఫ్తర్ అంటే కార్యాలయం. ఇమ్కాం అంటే possibility. దఫ్తరె ఇమ్కాం అంటే అవకాశాల నిలయం అని చెప్పుకోవచ్చు. జాదా అంటే దారి. అజ్ జా అంటే విడిభాగాలు, ముక్కలు, అవయవాలు వగైరా అర్ధాలున్నాయి. దో ఆలమ్ అంటే రెండు ప్రపంచాలు. మనం నివసిస్తుంది ఇహలోకం. ఇది ఒక ప్రపంచం. ఇక్కడి దేవుడు మనిషిని పరీక్షించడానికి పంపించాడు. ఈ పరీక్షా కాలం ముగియగానే మనిషి మరణిస్తాడు. మరణించిన తర్వాత మనిషి పరలోకంలో ప్రవేశిస్తాడు. అది రెండవ ప్రపంచం. మనిషి మంచి పనులు చేస్తే పరలోకంలో స్వర్గం, చెడు పనులు చేస్తే నరకం లభిస్తాయి. ఈ రెండు ప్రపంచాలనే దో ఆలమ్ అంటూ గాలిబ్ సూచించాడు. దష్త్ అంటే ఎడారి. దో ఆలమె దష్త్ అంటే రెండు ఎడారి ప్రపంచాలు. రెండు ప్రపంచాలలోను బీడుబడిన ఎండిపోయిన ఎడారులు తప్ప మరేమీ లేవట. షీరాజా అంటే విడిభాగాలను లేదా పుస్తకంలోని పుటలను కలిపి కుట్టే దారం. ఈ కవితలో భావం చూద్దాం. ప్రపంచాన్ని మార్చిన చాలా మంది మేధావులను ప్రపంచం పిచ్చివారిలా చూసింది. సాధారణ ప్రజల మాదిరిగా కాకుండా డిఫరెంట్గా ఆలోచించేవారిని పిచ్చివారిగానే చూస్తారు. అలా పిచ్చిగా వేసిన అడుగులే కొత్త మార్గాలను తెరుస్తాయి. గాలిబ్ అలాగే ఒక పిచ్చి పని చేసాడు. ఆ వెంటనే ఆయన ముందు అనేక విషయాలు, అవకాశాల తలుపులు తెరుచుకున్నాయి. కొత్త పాఠాలు నేర్చుకున్నాడు. ఆయన అడుగుపెట్టిన మార్గం ఎలా ఉందంటే, రెండు ప్రపంచాల పుస్తకం పుటలను కలిపి కుట్టిన దారంలా ఉంది. ఆ రెండు ప్రపంచాలు ఎడారి ప్రపంచాలే. అసాధారణమైన నిర్ణయాలు, ప్రజలకు పిచ్చిగా కనిపించే పనులు చేయగలిగితేనే వాస్తవాలు, నిజాలు తెలుస్తాయంటున్నాడు. గాలిబ్ ఉపయోగించిన ఎడారి అన్న పదం కూడా గమనించదగ్గది. పిచ్చిగా చేసే పనుల వల్ల ఎడారి లాంటి కష్టాలు కూడా తప్పవన్న సూచన ఈ పదం వాడడం వెనుక ఉంది. కాని రెండు లోకాల వాస్తవాలు తెలుసుకోవాలంటే కొన్ని పిచ్చి పనులు చేయాల్సిందే. తర్వాతి కవిత గాలిబ్ సంకలనం 18వ గజల్ 3వ షేర్ మానా, వహషతె ఖరామిహాయే లైలా, కౌన్ హై ఖానాయే మజ్నూనె సహ్రాగర్ద్ బే దర్వాజా థా లైలా పిచ్చి అడుగుల మందగమనాన్ని ఆపిందెవరు? ఎడారిసంచారి మజ్నూ ఇంటికి తలుపులు లేవుగా ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. మానా అంటే ఇక్కడ అర్ధం నివారించేవాడు, అడ్డుకునేవాడు, వారించేవాడు అని చెప్పాలి. వహషత్ అంటే పిచ్చి. ఖరామీ అంటే మందగమనం, ఉబుసుపోక చేసే పచార్లు, వహషతె ఖరామీ అంటే ఏదీ తోచక తిరగడం. ఇక్కడ ఖరామీహాయే అని బహువచనంలో ఉపయోగించాడు ఇదే పదాన్ని. ఖానా అంటే ఇల్లు. మజ్నూ అంటే లైలా మజ్నూ ప్రేమ కథలో నాయకుడు. లైలా అంటే అదే ప్రేమకథలో నాయిక. నిజానికి మజ్నూ అసలు పేరు ఖైస్. కాని ప్రేమలో పిచ్చివాడైన అతడిని ప్రజలు మజ్నూ అనేవారు. మజ్నూ అంటే పిచ్చివాడని అర్ధం. లైలా కూడా అసలు పేరు కాదు. లైలా అంటే రాత్రి అని అర్ధం. నల్లని అని కూడా భావం. లైలా కళ్ళు, కురులు చిమ్మచీకటిలా నల్లగా ఉండేవట అందుకే ఆమెను లైలా అనేవారు. అమె అసలు పేరు అమీరియా. సహ్రాన్ గర్ద్ అంటే ఎడారిలో సంచరించేవాడు. ఖానా అంటే ఇల్లు. దర్వాజా అంటే తలుపు కవిత భావాన్ని చూద్దాం. మజ్నూ ఇంటికి తలుపులే లేవు. ఎడారిలో నివసించేవాడు. ఎడారిలోనే తిరగడం అక్కడే పడి ఉండడం కాబట్టి ఎడారే ఇల్లు. ఆ ఇంటికి తలుపులెక్కడ? అలాంటప్పుడు, మజ్నూను గాఢంగా ప్రేమించిన లైలా, మజ్నూను కలవాలని పరితపించిన లైలా అక్కడికి వెళ్ళకుండా ఆపిందెవరు? తలుపుల్లేని ఇంటిలోకి ప్రవేశించకుండా ఆమెను అడ్డుకున్నదెవరని ప్రశ్నిస్తున్నాడు. గాలిబ్ ఈ కవితలో సహ్రాన్ గర్ద్ అని మజ్నూను పిలవడం ద్వారా మజ్నూ నివాసం ఎడారి అని సూచించాడు. లైలా చాలా సార్లు ఒంటెపై మజ్నూను కలవడానికి బయలుదేరింది. కాని ఆమె ఒంటెను నడిపిన వ్యక్తి ఈ విషయాన్ని ముందే ఆమె తండ్రికి చెప్పడం వల్ల ఆమె ప్రియుడిని కలవలేకపోయింది. ఈ నమ్మకద్రోహాన్ని గాలిబ్ కవితలో పేర్కొన్నాడు. ఈ కథను సూచించడం ద్వరా గాలిబ్ కేవలం లైలా మజ్నూ ప్రేమకథను మనకు చెప్పడం లేదు. నమ్మిన వారే మోసాలకు పాల్పడతారని హెచ్చరిస్తూన్నాడు. లైలా తాను మజ్నూను కలవడానికి బయలుదేరినప్పటికీ ఆ విషయం బయటకు పొక్కుతుందని అప్రతిష్ఠకు భయపడి వెనక్కి మళ్ళింది. నిజానికి ఆమెను ఆపినవారెవ్వరు? ఆమె స్వయంగా వెనక్కి మళ్ళేలా చేసింది ఆమెలోని ఆలోచనలే. ఇది ఈ వారం గాలిబానా. వచ్చేవారం మరిన్ని కవితలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుమ్.
by Abd Wahedfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TP3qH9
Posted by
Katta