పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

24, సెప్టెంబర్ 2012, సోమవారం

కట్టా శ్రీనివాస్ || మరో మెట్టు


ఎదిగిన మనసుల అనుభవాల
అక్షరాలనుండీ ఇవ్వటంలోని
ఆనందాన్ని మదిలో ఇంకించుకున్న
వెలుతురు దారిలో నడిచే ప్రయత్నం చేస్తునపుడు.

అదే మీటతో మరో దీసం మిణుకుమంది.
అదే తాళం చెవితో మరో కవాటం విప్పారింది.
దొరికిన దానికల్లా దేబిరించే మడుగుపైన
పుచ్చుకోవటంలో ఆనందపు పెట్టుబడి కనిపించింది.
నిరంతర నడకలో అది పైమెట్టే అనిపించింది.

కుచేలుడి అటుకులకు కొంచెం
స్నేహపు అనురాగాన్ని అద్దుకుని అందుకుంటే
శబరి ఎంగిలి పళ్ళకు
పిసరంత ప్రేమను జోడించి ఆరగిస్తే
తీసుకోవటంలోని సంతోషమేమిటో తెలిసొస్తుంది.

రెండు చివర్లను మెరిపించే వెలుతురు
రెండు హ్రుదయాలను మురిపించే గురుతులు.
దాగివున్న నిజంలా బయటపడతాయి.

గుడిసెలోని గుడ్డిదీపం వెలుగులో
పల్లెతల్లి ప్రేమను వడ్డించేటప్పుడు
పేదరికం వసారాలో స్నేహపు సమయం
తాంబూలమై పండుతున్నపుడు
మనసుతో అందుకునే అద్రుష్టం వుండాలి.
పైచేతి దర్పాన్ని వదలగల నిబ్బరం వుండాలి.

శుబ్రమైన దానితో తుడిస్తేనే అద్దానికి మరకంటదు.
మనసెరిగిన తనంతో చరిస్తేనే ప్రేమకు ధనమెక్కదు.

తైలమందక దీపం కొడిగట్టటం లేదు.
వత్తిని పిండి పైకెక్కించే దిక్కులేకే రెపరెప లాడుతోంది.

*23-09-2012
http://antharlochana.blogspot.in/2012/09/blog-post_23.html

నరేష్ కుమార్ || కొన్ని ప్రయోగాలు


మెదడుకి
కొన్ని ఆలోచనలను
తినిపిస్తూ....
కూర్చున్నా
ఒక సాయంత్రం
నన్ను నువ్వు గా
మార్చుకునే
ఒక ప్రయోగ శాలగా
నేను మారిపోయి
నిన్ను నాలోకి
బొట్టు బొట్టుగా వొంపేసుకుంటూ
క్షణాలని
పరీక్ష నాళిక లో
పోసెసి
వర్తమానం నుండి
గతం గా
మార్చే ఈqఏషన్లని
మొహం పై
రాసుకుంటూ....
నాలోని
ఒక్కొక్క జీవ కణానికీ
నీ రంగు.,రుచీ.,వాసనలద్దుతున్నా
* * * * * * * * * ** * * * *

2) మనకళ్ళు
కలుసుకున్నప్పుడు జరిగిన
జీవరసాయన
చర్యతో
చర్మాల రాపిడివరకూ
అన్నిట్నీ
H2SO4 లో
ముంచి
శుద్ది చేయాలిప్పుడు
* * * * * * * * * ** * * * *

3)రెండు
తోలుముక్కల
సంగర్షణలో వెలువడ్డ
అధరగరళం
నా ప్రాణాన్ని కొరికేస్తోంది
* * * * * * * * * ** * * * *
4) అబ్బా...!
ఈ కంపేంటి....!?
ఒహ్...!
నాగుండె
కాలిపోతోంది
నీనవ్వుల ఆసిడ్ని
అంతగా కుమ్మరించెసావెం...
* * * * * * * * * ** * * * *
5) కామాగ్నిలో ప్రేమని ఆహుతిచెసేసాంకద
మరి...! మరి....!
ఇప్పుడెల
ముక్యమైన
మూలకం లేకుండా
నేను.... నువ్వెలా
ఔతాను....? 23/09/12

కాసుల లింగారెడ్డి || నేను- నా తోట - ఒక కోయిల


ఒంటరితనం
సర్రున దూరి
మెదడు సందుల్లోంచి బుసకోడ్తది

ఒక తోడులేని తనాన్ని ఈడుస్తున్నప్పుడు
ఒక జామ కొమ్మ
వంగి భుజాన్ని తడుతది
రాత్రి ఒడిసిపట్టుకున్న మంచు ముత్యాల్ని
తలంబ్రాలు పోస్తది

నిండుగా పూసిన
పెరుతేలవని పువ్వొకటి
తనను తకమని
యవ్వన మాకుటాల్ని చాస్తది

జీవన ప్రభాత వాకిట
రూపు దిద్దుకున్న పిండే
వయ్యర్నగా ఊగుతూ
ఆహ్వానం పలుకుతది
పంకిలమంతిన్న
పంకజమన్న, పరిజతమన్న
పరవశ్వమే

నిద్ర గన్నేరు
అనేక
నిదుర రాని రాత్రుల్ని
బహూకరిస్తది

కాగితపు పువ్వు
చేసిన తప్పులకు
చేతులు జోడిస్తది

ఆకాశానికి
నిచ్చేనలేస్తున్న కొబ్బరి చెట్టు
వంగి
పాదాలు ముద్ధాడుతది

కాలం పొడుగూతా కలగన్న
బొడ్డుమల్లె
ఒడిల వెన్నెల పూలు పరిచి
పిలుస్తది
నా రక్తం కళ్ళజూసిన
ముళ్ళమీద అలిగి
ఎర్రగులాబి
అంతర్ధ్హానమైతది

నీరెత్తినట్టు వుందని నిమ్మ
కాయల చప్పట్లతో
ఉచ్చాహ పరుస్తది

నారింజ
పండ్లు
ఇకిలించి
నవ్వించ చూస్తది

తీగ మల్లె,జాజి మల్లె
బంతి,చామంతి
జీవితానికి వసంలద్దుతవి

అన్నిటినీ మించి
అప్పుడప్పుడు
హఠాత్తుగా
ఒక కోయిల ప్రత్యక్షమైతది
పలుకుల ప్రావహంలో నను ముంచుతది
నాకు ఒంటేరితనంలాగే
తనకు రంగు మీద బెంగ
నేను అంతః సౌఅన్దేర్యాన్ని మించి నది లేదంటాను
తను నేనున్నానంటూ చేతులు కలుపుతుంది

బుసకొట్టి బుసకొట్టి
అలిసిన ఒంటరితనం
ఊపిరాడక తోక ముడుస్తది

౨౨-౯-౧౨

భమిడిపాటి || నీ కలాన్నై పుడితే


మరు జన్మంటూ వుంటే
నీ కలాన్నై పుడతాను ,కవితగా జీవిస్తాను

నీ మనసులో భావాన్ని
లోకం చూడక ముందు

ప్రతి పదంలో అందాన్ని
నేనై లిఖిస్తుంటే మురిసిపోతూ

పదాలు చిక్కక పెదాల్ని కసిరి
మునుపంటితో నన్ను చేసే గాయానికి నొచ్చుకుంటూ

రూపం దాల్చిన నీ కవిత
లోకం చూస్తూ వుంటే ఆ పొగడ్తల సగపాలు నాకని మైమరచిపోతూ

ఇట్లు
ఈ జన్మలో నీ అభిమాని
మరుజన్మలో కవితై వచ్చే కలాన్ని ...09/22/12

భవాని ఫణి || ఎదగనిదెవరు??


అందరిలాగా ఉండను నేను
కానీ అందరూ కావాలనుకుంటాను

నేను కనిపించగానే
తదేకంగా చూస్తారు అందరూ
ఎంతో సంబరపడి పోతాను

కానీ వాళ్ళు నన్ను
సాటి మనిషిగా చూడటం లేదని
నా మస్తిష్కపు అరల్లోంచి వచ్చే సంకేతాలని
నేనసలు పట్టించుకోను

నన్ను చూసి కొందరు నవ్వుతారు కూడా
వాళ్ళ స్పందనకి నేను పులకించి పోతాను
ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై పోతాను

కానీ వారి నవ్వు స్నేహపూర్వక మైనది కాదని
నా మెదడులోని
కొన్ని మెతక మేధో కణాలు మొత్తుకుంటున్నా
నేను కొంచమైనా కలవరపడను

ఈ అద్భుతమైన లోకంలో
నాలాగే సృష్టింపబడిన
ఈ మనుషుల్ని చూసి
నాలోని ప్రేమతంత్రులు ప్రేరేపింపబడి
వారి చెంతకి చేరాలనుకుంటాను
అనురాగం పెల్లుబికి
వారిని స్పృశించాలనుకుంటాను

కొందరు వెంటనే దూరంగా జరిగిపోతారు
సభ్యత ముసుగు తొలగించలేని
కొందరి శరీరాల ఉలికిపాటుని
నాలోని సునిశితమైన పరిశోధక నాడులు
పసికట్టి నాకు చేరవేస్తాయి
నేను లక్ష్యపెట్టను

ప్రతి ప్రాణి లోను నిండిఉన్న
జీవశక్తి ని గుర్తించలేని
వారి అజ్ఞానాన్ని చూసి,
పరిగెత్తలేక పడిపోయే పసిపాపని చూసి
ముచ్చట పడే తల్లిలా నవ్వుకుంటాను

ఎప్పుడో అమ్మ కడుపులో ఉన్నప్పుడు
ప్రాణవాయువు అందక
నా మెదడులోని కొన్ని కణాలు
నిర్జీవమైపోయి ఉండవచ్చు

కానీ అన్నీ సవ్యంగా అమరి
సజీవంగా ఎదిగినా,
ప్రేమమయమైన జీవితాన్ని
అనుభవించలేని వారి ఆశక్తతకి జాలిపడతాను

వారిలా మది పొరల్లోంచి
పదాల ఇటుకలు తెచ్చి
నేను మాటల కోటలు
కట్టలేకపోవచ్చు

కానీ జాలి, దయ,ప్రేమ,కరుణ నిండిఉన్న
నా హృదయాన్ని చూసి సంతృప్తమవుతాను

నా మనసు వృక్షాన్ని
వాళ్ళు రాళ్ళతో కొట్టినా
తియ్యని స్నేహ ఫలాల్నే అందిస్తాను

నా ఆత్మీయపు కొమ్మల్ని
వాళ్ళు నిర్దాక్షిణ్యంగా విరిచేసినా
ప్రేమ పుష్పాలనే పంచుతాను

నన్ను అందరిలాగా పుట్టించనందుకు,
అమానుషత్వానికి బదులు
అమాయకత్వాన్ని నాలో నింపినందుకు,
ఆ భగవంతుడికి జీవితమంతా రుణపడి ఉంటాను

వచ్చే జన్మలో ఏమో .. ఏ మేధావిగానో పుట్టి,
ఎంత అనాగరికమైన జీవితాన్ని గడపాలోనన్న
దిగులు మాత్రం వదలదు నన్ను !!!
23.09.2012

బంగారు రామాచారి || ఎదను కోస్తున్న మంచుకత్తి జ్ఞాపకం

సుగుణవతి మైత్రి అనుమతిలేని వూహలు
రెక్కలను పట్టుగా కట్టుకుని ఎగురుతున్న
సాహితి వినీలనవభావనాకాశంలో వాలితే
సొగసుల హరివిల్లుగా విరుస్తుందన్న నాకవిత

హంస సారాంశం బాగుంది, భావకవి నన్నావు,
నేను లేమినున్నా మన చెలిమి మాత్రం
ఉన్నత శిఖర గంధ పరిమళభరిత ప్రేమని
సుమ భాసిత భావిజీవితం నాదేనన్నావు.

వెల్లువెత్తిన వరద గోదావరి వంపుసొంపులతో
వయ్యారి వరూధినిలా నిలువెల్లా వూరించావు .
మధువురుచి తగలని ఆమడ దూరంలోనున్నాను.

కోమలిచెలిగా నీవు చెంతనున్న తరుణప్రాయంలో
కుమారునిగా నన్ను కన్నవారికలలు జాలువారగా
నీచిలిపి కళ్ళు సిగ్గుతో వొలకబోసిన మధువులతో
మునిగితేలిన నాబంగారుకలలకవితను, భవితను
కలువలకుజతకట్టి వలపుబందీగా వేసాయి సంకెళ్ళు.

కోరనిదే వరాలిచ్చిన కొండంత తేనెమనసు నీదని
కోవెలలో నీపేరిట అర్చనలు చేయించి తరించాను.
నా ఉన్నతి కోరిన నీవు ఉన్నతహృదయ విద్యకై
పరదేశమేగి మనసును పరుసవేదిగా మార్చావు
నెచ్చెలి నీపలుకే బంగారమని పాడుకున్నా గానీ
నీతలపోతలతోనే నెమ్మదించని నామదికేది మందు.
తోడిచూపుల గాయాలకు కార(ణం)ఈవర్తమానం.

చీకటికళ్ళ నాగుండెకు ఎరతోవేసిన గాలం కనికట్టుకు
గతించినతొలివలపు ప్రేమ జ్ఞాపకంతో కళ్ళువర్షిస్తున్నాయి
ప్రతికూలభావనల వందనంలోను ఉదజనిగా నీవున్నా
మనసు గడియారంలో విభజన క్రమాన్నిజాలిమాలిన
నిముషాల ముల్లు గునపంతో గుచ్చుతునే ఉన్నావు
మరుపున్నవారి మది తీరానికి తూఫాను రాదు కదా,?

పనిగట్టుకుని మర్చిపోవాలనుకోవడమే అసలు భాధ
నీవు నన్ను పిచ్చివాడన్నా
నిజంగా నాకు భాధలేదు
నాకు నిజంగా పిచ్చిగానీ మనస్సుకు నిజం తెలియదా?

అర్ధంకాని ఎదేమో పదేపదే నిను కల(త)గా పలవరిస్తాది.
దారితప్పిన వృతాంతమంతా తనతోవలోనే విరుస్తుందనే
కోయిలగాతరలిపోయిన వసంతమేనీవని వెతుకుతుంది.

వృత్త పరిధి దాటిన నీవు తన ప్రాంతంలోనే ఉన్నావన్న
భ్రమతో చేరువకాని సూర్యునికోసం చలన భూమి(క)గా
మారి చక్రభ్రమణమనే గోడుతో గిరికీలు కొడుతుందీ.
జ్ఞాపకమొప్పుడు
సుగుణాల విస్తారభాండాగారమే కానీ
కలసిరాని కాలంలో మాత్రమది కోస్తున్న మంచుకత్తే?.

( నిర్వాహక సోదరుని కోదండం చేత హితంపొందినదై పరిశుద్దపరచబడినది.)

ప్రసాద్ తుమ్మా || శాసనం


ఏ లంచ్ అవర్లోనో
చెట్టుకింద పుట్టిన దేవుడు
కాలంతో పాటు తానూ మారుతూ
అవతారాలు మారుస్తూ తనూ మారుతూ
మనుషుల్లోని మానవతను చంపుతూ
మత ఘర్షణలకు సాక్షిగా
మౌనంగా
తరాల క్రిందటి తొలి నాగరికతకు
మనల్ని మారుస్తూ
ఇంతై అంతై వటుడంతై
మతరక్కసియై
నెత్తురు ఏరులై పారిస్తున్నాడు
తనను సృష్టించిన మనిషిని
తనే సృష్టి కర్తగా శాసిస్తున్నాడు
dt. 23-09-12

యల్లాప్రగడ రాజా రవి శ్రీనివాస్ || మతమా మార్గమా


వారెవ్వరూ లేరు
వారు వివరించిన ధర్మ మార్గాలు మిగిలున్నాయి
అదొక మార్గమేనని చెప్పిన వ్యాఖ్యలున్నాయి

అతడు లేడు
అతడు చెప్పిన ప్రేమ, పరిశుద్ధత దార్లున్నాయి
అవి దార్లేనని రాసుకున్న మాటలున్నాయి

అతడు లేడు
అతడు బోధించిన జ్ఞానం, బుద్ధం మిగిలున్నాయి
అవి కూడా అటే చేరుస్తాయని చెప్పిన మాటలున్నాయి

అతడు లేడు
అతడు నిరూపించిన కరుణ, శాంతి కూడా ఉన్నాయి
వాటితో నువ్వు చేరేదక్కడికేనని రాతలున్నాయి

అతడు లేడు
అతడు పాటించిన సత్యం, వైరాగ్యం త్రోవలున్నాయి
ఆ త్రోవల్లో నీ గమ్యం అదేనని బోధనలున్నాయి

మనిషి దేవుడి సృష్టి
మార్గాలు, త్రోవలు, దారులు వారి దృష్టి
మతం మాత్రం మన సృష్టి
మన మతమేదంటే మానవమతమని బల్లగుద్ది చెప్దాం
ప్రాంత దేశ పరిమితులు కూడా దాటి
ఏదైనా చేరేది ఒక్కటేనని నిరూపిద్దాం!

23 SEP 12

రాఖీ ||”ఒ’క’’వి’జ్ఞాన” సర్వస్వం


1.
కవిత్వం ఒక భావోద్వేగం..
కవిత్వం ఒక రాగ ప్రవాహం ..
కవిత్వం..ఒక అనుభవం..
కవిత్వం అనుభూతుల సమాహారం..
2.
ఒక భౌతిక సంయోగానికి...
ఒక రసాయనిక..చర్య జరిగి...
తగిన గణాంకాలన్నీ కుదిరి..

ఎలా ఒక జీవం రూపు దిద్దుకొంటుందో..
ఎలా ఒక కణం ప్రాణం పోసుకుంటుందో..

ఏ పరిధి వరకు..
ఏ అవధి వరకు..
ఏ సరిహద్దుకు...

అచరం..చరమౌతుందో..
మూలకం..స్వయం చలితమౌతుందో..
జడపదార్ధం ...చైతన్యవంత మౌతుందో...

ఎవరు చెప్పగలరు..?
ఎవరు సృష్టి గుట్టు విప్పగలరు..??
3.
దేహ మిథున మథనం లో ..జీవం ఆవిర్భవించినట్టు..
హృదయ మేధో మథనం లో ...కవనం ఆవిష్కృత మౌతుంది..

కన్ను తెరచిన నాటి నుండే...
తనను తాను నిర్మించుకొంటూ...
పాఠాలు..గుణపాఠాలు..నేర్చుకొంటూ..

ధర్మాన్ని ..అనుసరిస్తూ...
కర్తవ్యాన్ని..నిర్వర్తిస్తూ...
ప్రతిఫలాపేక్ష ఉపేక్షిస్తూ..
మానవుడు..మహనీయుడు..
4.
ప్రకృతి చక్కని గురువు..
పరిశీలిస్తే చెప్పలేనంత..చదువు..
పరిశోధిస్తే..అగాధ విజ్ఞాన సింధువు..
5.
ప్రతిఫలమేమి కోరుతుంది.. పూచిన గులాబి
బహుమతులేవి అడుగుతుంది ..పరిమళించిన సిరిమల్లి..
కానుకలేవి ఆశిస్తుంది...వెన్నెల విరజిమ్మే..జాబిల్లి..

నెమలి నాట్యం లో...ఎనలేని పరవశముంది
కోయిల గానంలో...కొలవలేని తన్మయముంది..

దూకే జలపాతంలో..తోక ముడవని తత్వముంది..
సాగే కొండవాగులో...వెనుదిరగని..ధైర్యముంది..
దాహం తీర్చే నదిలో..తొణకని..నిండు దనముంది..

విరిసిన ఇంద్ర ధనువులో...రంగులు చిమ్మిన ఆనందముంది..
పలు వర్ణాల సీతాకోక చిలుకలో..అందం చిందించే నైజముంది..
నీడ నిచ్చే చెట్టులో..ప్రాణ వాయువు అంది౦చే .దాతృత్వము౦ది..
పంట చేలలో..తమ ఉనికి కోల్పోయీ.. ఆకలి తీర్చే త్యాగ నిరతి ఉంది..

6.
ప్రకృతికి ఇవ్వడమే తప్ప..ధర కట్టడం తెలీదు..
మనిషి మినహా జీవులు-
అనుభూతి చెందడమే తప్ప ..అడగడం ఎరుగవు..
ప్రశంసలకు..పొంగవు...విమర్శలకు కృంగవు
సత్కారాలు ..సన్మానాలు..ఆశి౦చవు
బిరుదులూ...పతకాలు ..అర్థించవు
7.
గొర్లుకాసే పిల్లవాడి పిల్లనగ్రోవి పాటకు..కొట్టేదెవరు చప్పట్లు
దుక్కిదున్నేరైతు ఆశుకవితకు..కప్పేదెవరు దుప్పట్లు..
8.
ఒకటికి రెండింతలు..
గోరంతకు..కొండంతలు ..
ఆశిస్తూ అపేక్షిస్తూ..
వక్రమార్గాలన్వేషిస్తూ...
అక్రమ విజయాల..సాధిస్తూ..ఆస్వాదిస్తూ..
వందిమాగదులతో జేజే ధ్వానాలు....
భజంత్రీలతో...భుజం చరుపులూ...
9.
మది పెల్లుబిన భావాన్ని ..అక్షరీకరించడం..
పదాల నాదాన్ని పదుగురి ఎదుట నినదించడం..

ఇవ్వడం నీ సమస్య ..
గ్రహించడం ..ఆగ్రహించడం..సంగ్రహించడం...
అవతలి వారి సమస్య...

నిన్ను నువ్వు ..పరిష్కరించుకో...
నిన్ను నువ్వు సంస్కరించుకో..
నిన్ను నువ్వు సమర్పించుకో..

అంతా సవ్యమే
..అంతా..నవ్యమే
.అంతా..ఆమోద యోగ్యమే..

గిరి గీసుకొంటే..అది బంధనం..
కోర్కెతో రాస్తే..అది శృంఖలం..
మొక్కుబడిగా రాస్తే..అది వ్యాపారం..

స్వేచ్చా విహంగమే కవిత్వం...
స్వతంత్ర హృది జన్యమే...కవిత్వం ..
కవిత్వం చేత ,కవిత్వం కొరకు ,కవిత్వం..
కవి తత్వమే కవిత్వం..
కవిత్వం కావాలి కవిత్వం...!!!

23-09-2012

భాస్కర్ II గానమా స్వర్గమా


సప్త సముద్రాలన్నీ
ఏకమైనట్టు..
సహస్ర బాహువుల్లో
నగ్నంగా సంచారం చేసినట్టు
రంగులన్నీ హరివిల్లులై
వాలిపోయినట్టు ..
ప్రాణ ప్రదంగా ..గుండెల్లో భద్రంగా
దాచుకున్న ప్రియురాలు మోహమై
వెంటాడుతున్నట్టు
ఆ ఆనందకరమైన
మన్మోహన రాగం
వెంటాడుతోంది ..
రా రమ్మంటూ వేధిస్తోంది
దివి నుంచి భువికి
దిగివచ్చిన ..ఆ గాత్రం ..
రోజు రోజుకు కొంగొత్త రాగాలతో
పరుగులు తీస్తోంది
చప్పుడు చేయకుండా
హృదయంలో ఒదిగి పోతోంది
కోయిలలు ..కొమ్మలై
మనసు ముంగిట ..
ప్రేమతనపు సింధూరాన్నిఅద్దుతోంది
వసంత రుతువును ఆవిష్కరిస్తోంది
చిల్లు పడిన గుండెకు ..
అమృతపు గానంతో చికిత్స చేస్తోంది
(ఉస్తాద్ సుల్తాన్ ఖాన్ కోసం )

కొండారెడ్డి భాస్కర్ కవిత

అవినీతి వటవృక్షపు ఊడలు,
నరనరాల్లో చొచ్చుకుపోతూ,
ఆకాశంలా విస్తరిస్తున్నప్పుడు.....
అసత్యపు పలుకులు
ప్రియమైన సత్యాలై,
అనుక్షణం హృదయాన్ని,
అగ్నిలా లోభరుచుకుంటున్నప్పుడు......
ఎదుటివాడిని ద్వేషించడమే,
దేశభక్తిగా కీర్తించబడుతున్నప్పుడు...
ఎవరెవరి కారణాలకో,,
లక్ష్యమే తెలియని అమాయకులు బలవుతున్నప్పుడు...
దేశం ముసుగులో,
సమాధులు మాత్రమే
నిర్మించబడుతున్నప్పుడు.........
దేశాన్ని ప్రేమించడమంటే,
తోటి మనిషిని ప్రేమించడం అని తెలిసికూడా,
గుండెలోతుల్లో దాన్ని,
గుప్తనిధిలా దాచేస్తున్నప్పుడు......
ఎందుకని నేను దేశాన్ని ప్రేమించాలి ??
ఒకే ఒరలో వేల విరుద్ధతల ఖడ్గాలను,
ఇముడ్చుకున్న ఈ దేహం,
సాఫల్యతావైఫల్యాలను,
ఎలా విశ్లేషించగలదు, నా పిచ్చిగాని,.
దేశాన్ని ప్రేమించాలనే వుంది,
ఎందుకనే ప్రశ్న,తొలుస్తూనే వుంది.
సంఘర్షణల్లో పడి కొట్టుకుంటున్నందుకో,
సంఘర్షణే లేక బతుకుతున్నందుకో.....
అయినా, ఇదంతా నాకెందుకు...
దేశమనే సంకుచితత్వం,
మెదడుని ఉన్మాదంతో ఊపనంతవరకు,
నా దేశాన్ని ప్రేమిస్తూనేవుంటాను, నేను......

ఆర్.దమయంతి ॥ స్పర్శించనీ...


యెద లయలో కదలిక
ఎవరిదో ఆ గీతిక.
మనసు అరలో దాచిన
మొగలి రేకు జ్ఞాపిక..
గుమ్మెత్తించే గుభాళింపుల వీచిక.

***

రెండు తీరాల మధ్య
నది పెదవి విప్పని దుఖం - ఒక ప్రవాహం!
రెండు హృదయాల కలి, వీడిన
మది సంద్రం - ఒక విషాదం

***
మనం
ఎప్పటికీ, ఒకరికొకరం
అర్థం కానివారం.
మనమిద్దరం ఒకటే అనుకుని, రెండుగా చీలిన తీరాలం.
కానీ, నిన్నూ నన్నూ తాకుతూ
వలపు నది ప్రవహిస్తునే వుంది.
ఒంటరి ఒడ్డుని స్పృ సి స్తూ..
కంటి రేవుల్ని దాటిపోతూ..అప్పుడప్పుడు..
గుండె తడుస్తూనే వుంది.

**
ప్రేమంటే-
ఓ నవ యవ్వని.
దానికి ఆకర్షణ ఎక్కువ.
హత్తుకునే గుణమూ ఎక్కువే.
ఐతే, శరీరాన్ని కాదు.
ఆత్మని.

***

గుండె ఫిడేల్ మీద లయ వాయిద్యం
ఏలమంటోంది విషాద సామ్రాజ్యం
ఆహా! బరువుగా వీస్తూ గాలి.
తేలికవుతూ నేనిక జాలీజాలీ

***
Date: 23.09.2012.

***

వంశీ || ఇన్సోమ్నియా


నడిఝాము దాటిన చీకటిని
నిశ్శబ్దం విరహించే ప్రతిరాత్రి
నిద్రించాయనుకున్న కలలు మేలుకుని
సమస్తాన్ని అచేతనం చేసే
అద్భుతాన్ని అక్షరీకరించాలని గింజుకునే
ప్రయత్నం ఆపుతూ, దూరంగా
కపాలమోక్షానికి ఉలిక్కిపడ్డ పాపాలభైరవుడి
భూపాలపు మేలుకొలుపు..

గాలివాటుకు ఫెటీల్మని శబ్దించి
సర్దుకుంటున్న కిటికీ విన్యాసానికి వెన్ను
ప్రచోదించిన భయమూ బిడియమూ కాని
ఒక ఆనందావస్థపు మహామౌనంముందు మోకరిల్లి
అస్పష్టంగా అల్లుకుపోతున్న ఆలోచనల్ని
తర్జుమా చేయలేని ఓటమిని అంగీకరిస్తూ..

గతమెపుడో పలుమార్లు పరిచయించిందనిపించే
ఈ అనుభవాల లోతుల్లో ప్రాయోపవేశించి
ఊపిరాడని చెమ్మల తడిని
ప్రత్యూషపు తొలి తెలికిరణపు ఎండపొడ
సడిచేయక తుడిపేస్తున్నట్టనిపించే
పొడుగైన రాత్రిని, పడదోసి పడకేసిన ఊహలు
మంచమ్మీద నాతోపాటుగా,

సుషుప్తిని మింగిన నీ గదిలో నేను,
నిజాయితీగా నిశీధిన కరగలేని అశక్తతకు
నీ ఓదార్పునడిగి ఓ దారి వెతుక్కోవడానికి,

మరో ప్రవాసపు ప్రదోషపు పునాదులో
సుదూరపు అసహజ గవాక్షాలో
ఉదయించకముందే
నాలోనూ నిదురించు..

23.9.12

కిరణ్ గాలి || రాసుకో సాంబా (1)


1. ఓటమి అంటే
గెలవలేక పోవటం కాదు
ఇక గెలవలేను అనుకోవడం

2. ఓటమి మెట్లు ఎక్కకుండా
గెలుపు శిఖరాన్ని చేరలేము

3. కాలం పురుడు పోస్తె
ఓటమి తల్లి ఓర్పుతో కన్న బిడ్డే గెలుపు

4. గెలుపు చెట్టు, ఓటమి విత్తనం

5. గెలుపు పల్లకి మొయ్యడానికి
నలుగురూ వస్తారు
ఓటమి పాడె ఎక్కినప్పుడు
ఒక్కడూ తోడు నడవడు

6. ప్రతి గొప్ప గెలుపు వెనుక,
ఒక మర్చిపోలేని ఓటమి వుంటుంది

7. వెలుగులో గమ్యాన్ని మాత్రమే చూడగలము
దాన్ని చేరుకునే దారి చీకటిలోనే కనిపిస్తుంది

8. గమ్యాన్ని చేరాలంటే
వేగం, దారి, సత్తువ కన్నా ముఖ్యమైనది
అలిసినా ఆగకుండా అడుగులెయ్యగలగడం
కోరిక బలమైనదైతే అది కొండనైన పిండిచెయ్యగలదు

9. గురి తప్పడం తప్పు కాదు
గురే లేకుంటే ఎప్పటీకి గెలవలేము

10. పగటి కలలు కనడం తప్పు కాదు
ముఖ్యంగా వాటి కోసం
అహొరాత్రులు నిద్ర లేకుండా కష్టపడితే

11. ఈ రోజుల్లో చెడ్డవాళ్ళే గెలుస్తారు
మంచి వాళ్ళు ఓడిపోతారు ... అనేది అపోహ
ఏ కాలంలో నైన బద్దకస్తుడు గెలవలేడు
పని చేయడం వ్యసనమైన వాడు ఓడిపోడు

12. గెలిచే వాడికి ఓడిపొయెవాడికి తేడా...

సామర్ధ్యంలో లేదు సాధనలో వుంది
తెలివిలో లేదు తెగువలో వుంది
అలొచనలొ లేదు అచరణలో వుంది
లక్ష్యంలొ లేదు గురిలో వుంది

Date: 22.09.2012

ప్రసాద్ తుమ్మా || తెలంగాణ


భగ భగ మండుతున్న
నిప్పు కణాలు
ఓయు విద్యార్ధులు

**

రాజకీయ లాబ్ లో రిసేర్చులు
ఫలితం తెలంగాణా

**

గుండె వింత శబ్దాలు
స్టేత్ లేకుండానే
తెలంగాణా..తెలంగాణా...

**

ఫుకిశియా అనువిస్పోటానం కాదది
ఓయు ఆర్ట్స్ కళాశాల విస్పోటనం

**

ఇజాలు కాదు, నైజాలు కాదు
నిజాలు కావాలి
తెలంగాణ రావాలి

**

జీవితం కాలంతో పోటీ పడ్తుంది
మరణం త్యాగాలతో తిరుగుతుంది

**

చంద్రుడు భూమికి దగ్గరయ్యాడు
తేరిపార చూస్తే
శ్రీకాంత్ రూపం
dt,23-09-12

శాంతిశ్రీ || బూచోడు

పశ్చిమకనుమల నుంచి బూచోడు వస్తున్నాడు
వాడు-పిచ్చోడి చేతిలో రాయి
ముందు మన అంగట్లో అడుగుపెట్టి
నట్టింట్లోకే వచ్చేస్తున్నాడు..

చిల్లర కొట్టుకు తాళం వేసేసి
ఇక అంగడ్లన్నీ డాలర్లతో నింపేస్తాడు
చివరికి, మన చింతచెట్టు మీద చిగురుకి కూడా
వాడే రేటు నిర్ణయిస్తాడు
'చిన్న'బోయిన వ్యాపారుల్ని
తన అంగడ్లలో కొలువు కుదురుస్తాడు

'సహకారం' పేరు పెట్టుకుని
కంపెనీ సేద్యం చేసేస్తాడు
మనం ఏం తినాలో ఎంత తినాలో
వాడే నిర్ణయించేస్తాడు
'బిక్క'చచ్చిన రైతన్నల్ని
వ్యవసాయ కూలీల్ని చేసేస్తాడు

'చదువుతల్లి' కన్నా 'లిబర్టీ' ముద్దంటాడు
మన ఉపాధ్యాయులకీ సీమకోర్సు నేర్పేస్తాడు
మనం ఏం చదవాలో ఏ ఉద్యోగం చేయాలో
వాడే నిర్ధారించేస్తాడు
'శోష' వచ్చిన తల్లిదండ్రులికి
డాలర్లకే విద్య నేర్పేదంటాడు

విదేశీ మీడియానే సరైనదంటాడు
మన వాటిని పక్కనబెట్టిస్తాడు
మనం ఏం చూడాలో ఏం వినాలో
వాడే ఉపదేశిస్తాడు
'తెల్ల'బోయిన ప్రజలకి
ఛానెల్‌ కనెక్షన్‌తోనే గ్యాసంటాడు

వీడితో యుగళగీతంలో ఏలికలు
వీరిద్దరిని కాదని మనదైన 'ప్రత్యామ్నాయం' రావాలి
అప్పటివరకూ వీరి వికటాట్టహాసం వినాల్సిందే
వీడి 'మోత' భరించాల్సిందే..!

తేది: 22.9.2012

శ్రీ || పిచ్చి కుక్క

అవును అతను కుక్కే...
తన దేశ సంపద పై తోడేళ్ళు కన్నేస్తే
దశాబ్దాల పాటు కాపు గాసిన కుక్కే
అవును అతను ఖచ్చితం గా పిచ్చి కుక్కే
అగ్ర రాజ్యపు అడుగులకి మడుగులొత్తకుండా
అమెరికా అధికారాన్నే ప్రశ్నిస్తే
పిచ్చి కుక్క కాక మరేమవుతాడు.

అతను ఖచ్చితం గా పిచ్చికుక్కే
తన దేశపు చమురు నిల్వలు
తన ప్రజలకి మాత్రమే చెందాలనుకోవడం,
చుక్క నెత్తురు చిందకుండా
రాజరికాన్ని అంతం చేసినా,
అధికారం చెలాయించడానికి
అమెరికా ముందు తోక ఆడించాలి గానీ
జాడించకూడదని తెలియని పిచ్చి కుక్క.

అవును అతను నియంతే
మానవ హక్కులని హరించిన దుర్మార్గుడే
కానీ హక్కులని హరించాలంటే
ప్రజాస్వామ్యపు ముసుగు తొడుక్కోవాలని
తెలియని పిచ్చోడు...
ప్రజాస్వామిక హక్కులని భక్షించినా
దాన్లో నాటో తోడేళ్ళకి కూడా
భాగం పంచితే సరిపోతుందన్న
కనీస లోక ఙ్ఞానం లేని వాడు
అదే వుంటే...
గ్వాంటనమో బే లాంటి జైలు కట్టుకుని,
ఆమ్నెస్టీ ఇంటెర్నేషనల్ కి
విరివి గా విరాళమిచ్చి
చేతులు దులుపుకునేవాడు కాని
పిచ్చోడి లా మానవ హక్కుల కోర్టులో
దోషి గా ఎందుకు నిలబడతాడు

అతను ఖచ్చితం గా పిచ్చి కుక్కే
కాకపొతే..
అధికారం లొకి వచ్చిన
నాలుగు దశాబ్దాల్లోనే
అక్షరాస్యతని వంద శాతానికిపెంచి
నిరుద్యొగితని పూర్తిగా నిర్మూలిస్తాడా
పిచ్చికుక్కే కాకుంటే
వ్యభిచారాన్ని,మద్యపానాన్ని నిషేదిస్తాడా

ఒకనాడు రక్తం చింద కుండా
లిబియన్ రెవల్యూషన్ ని విజయవంతం చేసి
లిబియా ని ఆర్థికం గా పరిపుష్టం చేసి
ప్రజల చేత జేజేలు కొట్టించుకున్న గడాఫీ
పిచ్చోడు కాబట్టే అదే ప్రజల చేతిలో
హత్య కావించబడ్డాడు..చరిత్ర హీనుడయ్యాడు.

(అంత్యక్రియలు కుడా ముగియక ముందే చరిత్రకారుల చేతిలో
హీన చరిత్ర లిఖించుకున్న గడాఫీ కి అంతిమ నివాళి)
--శ్రీ 28.10.2011

శ్రీనివాస్ ఎల్లాప్రగడ ॥ నువ్వెక్కడ ?


కుక్కపిల్లకి ముద్ద విసిరి చూడు
ఎప్పటికైనా అది నీపై చూపించే
విశ్వాస ప్రేమను చూడు

గుడిలో ఏనుగుకు అరటిపండిచ్చి చూడు
అది తొండమెత్తి నిన్ను దీవించే
వాత్సల్య ప్రేమను చూడు

పిల్లిపిల్లకి పాలు పోసి చూడు
అది జీవితాంతం నిన్ను రాసుకు పూసుకు తిరిగే
ఆప్యాయత ప్రేమను చూడు

పావురానికి గింజలు విసిరి చూడు
రోజూ క్రమం తప్పక నీ దగ్గరకొచ్చే
దాని అనుబంధ ప్రేమను చూడు

గోవుకు గడ్డి పెట్టి పాలు పితికి చూడు
నువ్వు తనని పిండుతున్నా
ఆ తల్లి కళ్ళలో నిర్మ ప్రేమను చూడు

తోటి ప్రాణివైన నీపై
కనీసం వాటి జాతైనా కాని నీపై
వాటి రకరకాల ప్రేమల్ని చూడు

మరి నువ్వు పేజీల కొద్దీ రాస్తుంటావు
గంటల తరబడి ప్రసంగిస్తుంటావు
ఇందులో ఏ ప్రేమో వెతికి చూడు!! 22SEP12

ఆదూరి ఇన్నారెడ్డి || ఎక్కడున్నవ్ బుజ్జీ


ఎక్కడున్నవ్ బుజ్జీ
మనసు తలుపులు తట్టి
తలపుల తలుపులు తీయింది
ఎక్కడికెళ్ళావు బుజ్జీ
మది నాదన్నావు
మరువను ఎప్పటికీ అన్నావు
మరి నన్ను వీడి ఎక్కడికీ పోయావు బుజ్జీ
చీకట్లో ఉన్నది చూసి నామనస్సు చీకటి అనుకున్నావా
వెలుతురులో వెన్నేల కురిపించలేననా
పైపై మెరుగులు చూస్తున్నావ్
నాలో నిండి ఉన్న ప్రేమను చూడు
నీకోసం రాసుకున్న Blog డైరీ పేజీలు చూడు
బుజ్జీ ప్రతి అక్షరంలో నీవే
పరుగులు తీసే ప్రతి పదంలో నీవే
నేను మారలేదు బుజ్జీ
నీవెందుకు మారావు
"కలల ప్రపంచంలో " పడి మర్ఫిపోయావా బుజ్జీ
"వెన్నెల వెలుగులు "నిజమని నన్ను మర్చావా బుజ్జీ
బరించలేని భాదను నాకొదిలి
ఎలా నవ్వుతున్నావు బుజ్జీ
నీకు ఏదైనా సాద్యిమే బుజ్జీ
నవ్వించగలవు, కవ్వించగలచు,ఏడ్పించనూ గలవు
ఇన్నీ చేసి ఏం ఎరుగనట్టూ ఉండగలవు బుజ్జీ
కాని నీమీద నమ్మకం వస్తావని
నన్నోదారుస్తావని...ఊరడిస్తావని బుజ్జీ
ఇది నమ్మకమా గుడ్డి నమ్మకమా నీవే తేల్చాలి

మెర్సి మార్గరెట్ ll పరస్పర సంభాషణ


రాయి హృదయంలో తడి
పగులగొడుతూ మాట్లాడే
సుత్తెకే ఎరుక...

సుత్తె మాట్లాడే ఆ దెబ్బల
భాష
పగిలిపొతున్న రాయి చెసే
శబ్ధానికే ఎరుక..

బ్రద్దలు కొడుతూ జరిపే
రాయి సుత్తెల
పరస్పర సంభాషణ
చెదిరని గురికి ..
తప్పని లక్ష్యానికి
ప్రతీక

దెబ్బ దెబ్బకి
చూపు భాష అర్ధం చేసుకునే
చేయి గురి
విజయం ఎంటో తెలిపే
పరీక్షల సూచిక

--BY-Mercy Margaret (22sep2012)

క్రాంతి శ్రీనివాసరావు || గ్లోబల్ గ్రామం

నగర బతుకు పుస్తకానికి
పల్లెను ముఖ చిత్రంగా
వెయ్యాలనివుంది
ఇగిరిన సంతోషాలు
మళ్ళీ చిగురించేలా
పల్లెగంధం పుయ్యాలనివుంది

బూదెమ్మవ్వ కన్నుల్లా
అమ్మ చెవి కమ్మల్లా
పూసిన మిరప కొమ్మల్లో
చల్లన్నం నంజుకు
సరిపడా కాయలు కోస్తుంటే
భూమిలోకి దిగుతూ
ఎడ్లూ నాన్నా
కనపడకుండా పోతుంటే
మోట బొక్కెన తొండం
నోరెళ్ళబెట్టినప్పుడు
తాటి బోదెలో నీటి సరదా
గుర్తొచ్చి

తెలియని బరువులేవొ తలెత్తుకొని
పరుగెత్తలేని మనసులకు
మా బీటిగడ్డి పరకల మొనలనేలుతున్న
నేలతల్లి మంచు ముక్కెరలు
కిరణాలను చీల్చి రంగుల కళ్ళాపి చల్లుతున్న
చప్పుళ్ళు వినిపించాలని వుంది

యంత్రించిన బ్రతుకులను
మనుషుల్లా మంత్రించాలని
ఆవుదూడ ఆటను
అమ్మ వేసిన ముగ్గును
నాన్నేసిన కోండ్రను చూపెట్టాలని వుంది

గుడి ముందు నిలబడి
గంటల గంటల సమయాన్ని
జీవితం నుండి కత్తిరించుకొంటున్న భక్తులకు
వేల దారులు పరచి
వెలుగు రేఖలు కప్పుకొన్న
మావూరి చెరువుగట్టు పైనున్న
ముత్తాలమ్మ దగ్గరకు తీసుకెళ్ళాలనుంది

వాహనాల వరదల్లో సుడిగుండాలను దాటుకొంటూ
ఆక్సీజను అందక అవస్తలు పడుతున్న వాళ్ళను
తంగేడి చెట్ల మద్య మెలికలు తిరిగి మెరుస్తున్న
వెన్నెల దారులెంట కాసేపు తిప్పాలని వుంది

పిజ్జాలు బర్గర్లూ చిరుతిళ్ళుగా తింటూ
బరువళ్ళేసుకు తిరుగుతున్న వాళ్ళకు
జొన్న చేలో ఊసబియ్యం రుచి చూపెట్టాలనివుంది

నాయకత్వం వచ్చినా
వాళ్ళాయన చోదకత్వత్వం లో మసలే వాళ్ళకు
మావూరి ముఠామేస్తీ చిట్టెమ్మను
పరిచయం చెయ్యాలనివుంది


తీరా తేరిపార చూస్తే
మావూరిప్పుడు మా వూరిలాలేదు
వూరంతా పరుగుల పందిళ్ళేసుకొని
అరుగుల సంగతే మరచిపోయాయు

పచ్చనిపొలాలు
ఎకరాలు గజాలుగా చీలి
బూడిదగుమ్మడి కాయలు కాస్తున్నాయు

వయసుడిగిన వాళ్ళు అక్కడక్కడా
ఇళ్ళకు అతికించబడ్డ గుర్తులుతప్ప
పల్లె తనానికెప్పుడో రోజులు చెల్లిపోయాయు
వూరికే మరమ్మత్తులు అవసరమవుతున్నాయు
అవీ గ్లోబల్ గ్రామం చూరుకే వ్రేలాడుతున్నాయు.

చంద్రశేఖర్ వేములపల్లి || కలలు ||

పచ్చని పైర్లు, ఎగిరే పక్షుల కిలకిల రావాల ... కలలు
భయం, బాధ, శ్రమ ... ఆదమరిపించే కలలు
నీకు ఊపిరి తిప్పుకోనియ్యకుండా చేసే అందమైన కళ్ళ, కనురెప్పల ... అనురాగం కలలు
ఒక్కసారి ...
నాలో పసితనాన్ని,
కలలు కనే స్వేచ్చని ఇచ్చి చూడు!
రోజూ చూస్తున్న ... ఆ పిచ్చికూతలు, భయంకర స్వప్నాల్ని ... మరిచిపోవాలనుంది!

2012 సెప్టెంబర్ 23

కెక్యూబ్ వర్మ ॥ చిల్లర మాయం॥

అలికిడి వినపడకుండా
పిల్లి కాళ్ళ పంజాతో
నడి బజార్లోకి సరకు సరఫరా...

నీ జేబు చీల్చుకుంటూ
వాడి చెయ్యెప్పుడో చొరబడింది
ఖాళీ తనం నిన్నింక వెక్కిరిస్తుంది
కుక్క నోట్లో బొమికలా....

నీ బెటరాఫ్ పుస్తెలమ్మినా
తీరని బాకీతో నడి వీధిలో
నీ నెత్తిపై రూపాయి బిళ్ళ పెట్టి
అర్థ రూపాయికి పాట....

పొయి మీద పాలు పొంగక ముందే
ఆరి పోయిన గ్యాస్ బండ
కోటా పూర్తయి వెక్కిరించింది...

చిల్లర కొట్టు చిట్టెమ్మ
వాకిట్లో నుదుటిపై పాలిపోయిన
పసుపు బొట్టుతో నోట్లో తులసాకు....

ఒక్కోటీ అదృశ్యమవుతూ
ఏదీ మిగలనితనంతో
నీకు నీవే ఓ హాలోమెన్ లా
చివరాఖరకు ఆత్మను కోల్పోయి....

నువ్వింక మేల్కొనక పోతే
నీ కంటి రెప్పలను కత్తిరించి
కలలను కూడా LED తెరకు అతికిస్తారు...

సొంతమంటూ ఏదీ లేనితనం
నిన్ను ఓ బ్రాండ్ అంబాసిడర్
చేతిలో ఖాళీ కోక్ డబ్బాలా మిగిల్చి విసిరేస్తుంది....

దేహమంతా తొడగబడ్డ
విదేశీ కండోమ్ ను చీల్చుకు రారా
కాలం నిన్ను అనకొండలా మింగి ఉమ్మివేయక ముందే....

(తే22-09-2012 )

కపిల రాం కుమార్ // పలుగుతో పాటు ఎలుగెత్తు //

ఊడల మర్రికి ఊయల కట్టి ఉఫుతున్న ఊర్మిళా
జోల పటపాడే ఊర్మిళా నిదురోయేటి బిడ్డనుచూసి
మురిసిపోతోందమ్మ ఊర్మిళా ఆద్మరచివుండకంటూ
ఆన యిచ్చెనమ్మ ఊర్మిళా..పనికు పైనమాయె ఊర్మిళా!

కాయకట్టపు బతుకిలోన కాయా పండా తేడాలుండవు
కాలంచెల్లిన గతుకులు వినా గాయం మానే రోజులుకావు!
కటిక చీకటి రాతిరేల నుదుటి కుంకుమ చెరిగిపోయె
బరమ పేలి బతుకునావ బెరుకులేక లాగవమ్మా!

మగడులేని బతుకు బారం మేయునపుడు దిగులుపడకు
కట్టకాలపు మోత బరువు తలచుకుంటూ కలత వలదు!
కొమ్మకు వూగే అన్నంమూట కాకులు ఎత్తూకెళ్ళవులే
కాకులు కావు పలుకాకుల లోకపు పాపపుకళ్ళకు తూలకులే

ఒక్కరోజే ఓదార్పు - ప్రతిరోజూ నిట్టూర్పు
వేన వేల కట్టాలు పనులముందు దిగతుడుపు
కుక్కలు చించిన విస్తరికాకు - రెక్కలు తెగిన ప్క్షివి కాకు
రాతిని తవ్వే పలుగును యెత్తి నారీ హక్కులకు యెలుగెత్తు!

23-09-2012

ప్రవీణ || ఓ నలిగిన జ్ఞాపకం

జ్ఞాపకాల దొంతరలో నుంచి
అప్రయత్నంగా జారి పడింది
ఓ నలిగిన కాగితం….

వీలైనంత చదును చేసి చదవబోతే
కన్నీళ్ళ కొలనులైన కళ్ళు
మసగబారిపోయాయి…..

ఒక చేత్తో కళ్ళు నలుపుకుంటూ
మరో చేతి చూపుడు వేలుతో
అలుక్కుపోయిన అక్షరాలు విడదీస్తుంటే
చెమ్మగిల్లిన కాగితం
మరి కాస్త చిరిగి
మనసుని చిత్తడి చేసింది…

22 -Sep -12

వాసుదేవ్ II గుడిమెట్లు--ఓ శిధిల కథల సంచిక II

గుడికన్నా ముందే పలకరించే
ఆ డైభ్భై ఏడు మెట్లూ డైభ్భై ఏడు కథలు
కష్టం వెనుకే సుఖమన్నది చెప్పడంకోసమన్నట్టు 

*

ఒంపులుతిరిగుతూ ఊరించే ఆ మెట్లమీదే
బాల్యం చిన్నపాదాలతో....
ఒక్కోమెట్టుని వెనక్కి నెడుతున్నాననే ఆనందంలోనూ
అమ్మ చెయ్యి ఆసరాలోనూ కథలు అవసరం అన్పించవు
గతాన్ని ఎక్కడో కలిపేసె ఆలోచనలో అమ్మ
వర్తమానాన్నివొదిలేసె ఖంగారులో నేను
కొన్న జ్ఞాపకాలు......

* * 

ఓ మెట్టు చివర్న అప్పుడె మొలకెత్తుతున్న ఓ గడ్డిమొక్కా
మరోమెట్టుఅంచున కాలానికి లొంగిపోయిన శంఖంపువ్వు
దేన్నుంచి విడివడిందో మరో సంపెంగ రెమ్మా
అవన్నీ పలకరిస్తూ..
ఒక్కోక్కటీ ఒక్కోకథ
జీవితానికి సరిపడా !

* * *

అంత 'దూరం' వచ్చిన తర్వాతకానీ మెట్లాగవు
ఓ సారి వెనక్కి తిరిగిచూస్తే
దాటొచ్చిన జీవితంలా, రెపరెపలాడుతున్న పేజీల్లా
ప్రతీ మెట్టులో ఓ కథ విన్పడుతూనె ఉంది
ఆ కథలన్నీ
ఓ జ్ఞాపకం కూడా!

* * *

అక్కడే
ఓ పిలుపు మళ్ళీ...ప్రతీ మెట్టూ ఓ కథతో
ఎన్ని నగ్నపాదాలని మోసాయో
మరెన్ని కథల్ని విన్నాయో కన్నీటి నేపథ్యంలో
అవన్నీ ఇప్పుడు వెలలేని సంచికలు

* * 

అమ్మ అంటూనే ఉండేది
'నీతో గుడికిరావటం ఓ అనుభూతిరా' అని
అదేంటో అర్ధం కాని వయసు!
ఎన్ని అనుభవాల్ని అక్కడ కథలుగా వదిలిందో అమ్మ
మెట్లంతా రాళ్ళే...జ్ఞాపకాల శిలాజాల్లా

* * * 

ఏం జరిగిందో ఎందుకెళ్ళానో తెలీకుండానే
మెట్లు దిగుతూండగా--
చీరకొంగుతో నాచెయ్యి తుడుస్తూన్న ఆమెలో
తెల్ల రంగు అద్దుకున్న ఆ నవ్వు
అప్పుడేం తెలీదు, అమాయకంగా
ఇదిగో ఇప్పుడే అవగతం
గతాన్నీ ఇలానే చూడమని చెప్పిందేమో..
గుడిని పరిచయంచేసి, ఈ ప్రపంచాన్నిచ్చింది అమ్మ

* * * 

ఆ తెల్ల నవ్వు,ఇంకా గుండెల్లో పదిలం
గుడి...అమ్మ..ఓ జ్ఞాపకం
నిన్న వర్షంలో పట్టుకున్న
ఓ బిందువులా
కథలన్నీ చెప్పి జారిపోతూ!
జీవితపుటల్లో అందమైన బుక్‌‌మార్క్
ఈ గుడి..మెట్లు 

* * *

ఆ గుడింకా ఉంది, మెట్లూ ఉన్నాయి
ఆ జ్ఞాపకమూ ఉంది
అమ్మే లేదు
చేతుల్లోంచి జారిపోయిన తీర్ధంలా
వెళ్ళిపోయింది......
నన్ను ఆ మెట్లమీదొదిలి
ఆ శిధిల కథలన్నీ
బతుకు బాటలో సహచరులు....

22.September.2012
(అమ్మతో గుడికెళ్ళటం--ఆ ఇసుకకొండ గుడికెళ్ళటం జీవితంలొ మధురానుభూతి...జీవితంలో నన్ను వెంటాడే జ్ఞాపకాల్లో ఇదొకటి)

కర్లపాలెం హనుమంత రావు ॥ చురకలు ॥


1
పాండవులు కనిపించరు
పాత 'మాయాబజారు'
కౌరవులూ కనిపించరు
కొత్త మాయ'బజారు'
తస్మాత్ జాగ్రత్త!

2
నరికితే చావడానికి
చెట్టు
మనిషి కాదు
-చివురు

3
ఆలూ మగలు
పాలూ నీరు
ఎవరి పాలు ఏదో
తేలకే పోరు

4
గెస్ట్ రోల్సే
బిగ్ హీరోస్
విచిత్రం
-యూపీయే-2 చిత్రం

5
గడియారం ఎందుకంట
దండగ
కరెంటు ఠంచనుగా
కోస్తుండగా

6
వయసుకు
మనసు
సమకాలీనం కాదు
కదా ఎన్డీ తివారీ!

7
తెలుగుగంగ సరే
తెలుగూ గంగలో
కలుస్తున్నదనే బెంగ

8
అగ్ని సాక్షిగా అయింది పెళ్ళి
అగ్గే బుగ్గి చేసింది మళ్ళీ
అగ్గీ
నువ్వ్వూ అత్తారికి అంత దగ్గరి చుట్టమా!

9
అశోకవనంలో అందరి మధ్యున్నా
సీతకు అగ్నిపరీక్ష
అడవిలో ఒంటరిగా ఉన్నా
రాముడికేదీ శిక్ష!
ఏం కలికాలం... త్రేతాయుగం!

10
మన చట్టసభల మెడలో
వేలాడేయాలనుంది
'ఇంగిలిపింగీసు ఐ నెవ్వర్ పలక'
పలక