21, ఆగస్టు 2012, మంగళవారం
శ్రీనివాస్ ఎల్లాప్రగడ కవిత
తవ్వుతున్నా..ఏదంటే అదే
వస్తున్న అయాసాన్ని
ఓర్పు వెనక్కినెట్టుతూ
కారుతున్న అనుభవాలస్వేదాన్ని
సంకల్పహస్తంతో తుడుస్తూ
...ఙ్ఞాపకాల అంధకారంలో
పరమావధి లోచనావెలుగు తోడుగా
తవ్వుతున్నా..ఏదంటే అదే
ఎటుచూసినా కూలుతున్న
కుళ్ళు..కుతంత్రాల పెళ్ళలే
చిర్నవులపారతో పక్కకి తోస్తూ
నేనూనాదనే అహాల బండలే
లక్ష్యశోధన ఉలితో
కాలం సుత్తితో ముక్కలు చేస్తూ
తవ్వుతున్నా..ఏదంటే అదే
బొట్టుబొట్టుగా అప్పుడప్పుడూ
అంతర్చక్షువుకి కనిపిస్తుంటే
ముముక్షత్వ దాహాన్నవి తేర్చలేకుంటే
పిడచకడుతున్న మది నాలుకను
తత్త్వ నెమరువేతతో ఆపుకుంటూ
తవ్వుతున్నా..ఏదంటే అదే
ఙ్ఞానఊట ఎప్పటికైనా ఊరుతుందని.
*20-08-2012
డా.పులిపాటి గురుస్వామి || మోసపోకుండా నడిచే నేల కావాలి ||
ఎవరికీ చెప్పక పోయినా సరే
నీకు కొన్ని చెప్తాను
ఎవరినీ పూజించకు
దేవుడు కలవర పడతాడు
ఎవరినీ వెక్కిరించకు
కొన్ని బాణాలు
వెనక్కి తిరిగి తగుల్తాయి
మాటలతో శూలాలు తయారు చేయవచ్చు
కానీ
పూలు తయారు చేస్తే
నీకు ఇతరులకు కూడా
సౌరభమూ,నిర్మలత్వము
నువ్వు భూమి మీద చేసే విన్యాసాలను
ఎవరూ ప్రసారం చేయాలను కోకు
వాటికి జీవం ఉంటె నాల్కల మీద బతుకుతాయి
ఎవరికోసమో
సూర్యుడి సమయాన్ని వృధా చేయకు
రోజూ పండగ చేసుకోవచ్చు
గాలిని కూడా పూజించు కోవచ్చు
నీ హృదయం చుట్టూ
చువ్వల్ని తొలగించు కోవాలి
కాకపోతే
పూల మకరందం లో ముంచుకోవాలి
మరోసారి ఇంకొన్ని చెప్తాను
నీకు నచ్చితే
నీ కిటికీ దగ్గర నిలబడి గట్టిగా చదువు
మనుషుల వాతావరణం లో
పరిశుభ్ర పరిమళం చేరుకుంటుందేమో
చూద్దాం.
* 20-08-2012
రాకమ్ నరేందర్ // ఎదురు చూపులు //
గుడిసెకు మూలాన
నులక మంచాన
పాచికంపు బొంతల నడుమ
జోరీగలతో దోస్తీ కడుతూ.........
మొగుడు పోయి మూడార్ల పైనే......
కొడుకుకు అవసరం తీరిన తోలు సంచి
కోడలికి అక్కరకురాని అవశేషమొకటి
కూతురు దులిపేసిన చేతిలో దుమ్ము
మనువడి పెళ్లికి తగిలెడి రాయి
ముని మనవరాలు చూసేటి వింతైన చూపు
ఐదారు నిమిషాలకోసారి రెప్పల చప్పుడు
వినపడితెనేమి వచ్చేదెవ్వరు....?
గుండెలో రగిలేటి ఆక్రందనాలు
చేసేదేమిటి....చావుకెదురు చూపులు...!
*20-08-2012
బాలు || పుట్ పాత్ ||
అడుగు అడుగు నిగ్గ దీసి అడుగు
అడుగులు వేయటానికి పుట్ పాత్ ఏదని?
వాదాన్ని ఆయుధంగా తీసుకొని అడుగు
ఆ అడుగుల మాటునున్న ఆవేశంతో, ఆలోచనలతో అడుగు
చిరునవుతో నడవలిసిన పుట్ పాత్
చిరువ్యాపారులకు నివాసం అయింది
ఆ చిరువ్యాపారులకు ఆసరా కలిపించ్చి
మనకు ఆసారగా పుట్ పాత్ తీసుకుందాము
ప్రశాంతంగా ప్రయాణం సాగించాల్సిన పుట్ పాత్ మీద
భడా భడా షాపింగ్ మల్సేకి పార్కింగ్ ప్లేస్ అయింది
వాళ్ళ ఆటా కట్టిదాం
మన అట్టంకాన్ని తోలగ్గిదం
పుట్ పాత్ బిచ్చగాళ్ళ నివాసం కాదు
మన అందరి ఆవాసం పుట్ పాత్
మూత్ర విసర్జనకు కాదు పుట్ పాత్
మన గమ్యాన్ని సుగమం చేయటానికి పుట్ పాత్
పుట్ పాత్ మీద నడిచే స్వేచాలేనప్పుడు
ఎంత స్వతంత్రం వచ్చినా ఎందుకు?
వాహనాల క్రింద పడి చచ్చే దౌర్బాగ్యం మనకు వద్దు
ఆరోగ్యంగా నడిచేందుకు పుట్ పాత్ కావాలి
పుట్ పాత్ పాదాచారుల హక్కు
అందుకే.......
అడుగు అడుగు నిగ్గ దీసి అడుగు
అడుగులు వేయటానికి పుట్ పాత్ ఏదని?
వాదాన్ని ఆయుధంగా తీసుకొని అడుగు
ఆ అడుగుల మాటునున్న ఆవేశంతో, ఆలోచనలతో అడుగు
*20-08-2012
జయశ్రీ నాయుడు || నన్ను నేను వెతుకుతున్నా ||
నన్ను నేను వెతుకుతున్నా
ఎన్నో నువ్వులు దొరికాయి
నవ్వులు కొన్నీ
కన్నీళ్ళు కొన్ని..
కలతలకు కొన్నీ
కలలూ కొన్నీ
కరచాలనం తో కత్తిపోట్లు
ప్రేమగా బహుమతిచ్చిన గుండెగాట్లు
ముళ్ళనిపించీ ముద్ద మందారమైనట్టు
గులాబీ సొగసు ఆశకద్దినట్టు
ఇదో వలయం కలల నిలయం
ప్రశ్నకో రోజులేదు
ప్రేమకో క్షణమూ ప్రత్యేకం కాదు
ప్రేమగా ప్రశ్నని స్పృశిస్తే
సమాధానం మరో ప్రశ్నవైపు చూపి
తీయగా నవ్వుతుంది
కాలానికీ కొంటెతనమూ ఎక్కువే
నావాళ్ళనుకునేలోగా నిలువుటద్దంలా హృదయం భళ్ళుమంటుంది
చిరునవ్వులు అపరిచితమై దిగులు మేఘాలే అంతా
ఇంతలోనే చినుకులా రాలి దేవతల్లే హత్తుకుంటాయి
ఎన్నడూ చూడని చిరునవ్వులు కొత్త రూపాలుగా మారి...
ఇదో వలయం కలల నిలయం.
*20-08-2012
కరణం లుగేంద్ర పిళ్ళై // రంగుల రాజకీయం //
ప్రొద్దున్నే వార్తా పత్రిక చదవాలన్నా
ఏ పేపరు చదవాలో అర్థం కావడం లేదు
ప్రతి పేపరుకు ఓ రాజకీయ ముద్ర
నాలుగో సింహం కూడా నగుబాటవుతోంది..
ఏ పార్టీకో, పండుక్కో రంగు రంగుల
కొత్త బట్టలు వేసుకోవాలన్నా వీలుకావడం లేదు
ప్రతి రంగుకు రాజకీయ రంగు పులిమేశారు..
ప్రజాస్వామ్యం పరిహాస పూరితవుతోంది..
గెలిస్తే చాలంట. అవినీతి మురికి పోయిందంట
నైతికతను ఉరికొయ్యకు వేలాడదీసి
నగ్నత్వంతో ఊరేగే వారికి ఏమని చెప్పాలి
పరిపాలించడం అంటే దోచుకోవడం కాదని
కడివెడు ఆశలతో ఎన్నుకునే ఓటరును
సంక్షేమ పథకాల ఉచ్చులో బిగించేస్తున్నారు..
రౌడీయిజం, గూండాయిజం చేసే వారికి ఏమని చెప్పాలి
రాచరికం తమ జన్మహక్కు కాదని.
*20-08-2012
కె.కె. // నిర్ణయం మీదే //
సామెతలు, ఉపమానాలు పక్కనబెట్టు,
స్థిమితంగా కూర్చొని నీ మెదడుకు పదునుపెట్టు,
సత్యం ఏమిటో కనిపెట్టు,
పెద్దలు చెప్పేరు కదా అని,
ప్రతీది సత్యం అనుకుంటే పొరపాటు.
"చెప్పేవాడికి,వినేవాడు లోకువట"
పెద్దల మాట!!!వాడేలేకుంటే
ఎవడికివాడే మేధావనుకుంటాడు.
బావిలో కప్పలా బ్రతికేస్తాడు.
మేధకు పదునుబెట్టే మాటలే చాలనుకుంటే,
గంపెడు జీవితసత్యాలు,గుప్పెడు మల్లెలుగా
ఎప్పుడో మీముందుంచాను.
అందులో గుబాళించినవెన్నో మీరే చెప్పాలి.
అందిన ప్రతీది అర్హమైంది కాదు,
కొరికి చూస్తేనే కదా!
కాయో,పండో తెలిసేది.
తర్కిస్తేగాని సూత్రాల నాణ్యత తెలీదు,
గీటురాయితో గాని బంగారం నిగ్గు తేలదు
ఎంతటి ధర్మాసనమైనా, ఇచ్చేతీర్పు
సమకాలీన ధర్మాన్ని పాఠించాలి.
పెద్దల మాటలెప్పుడూ సూచనలు మాత్రమే
అవి ఆచరణలేనా అన్న నిర్ణయం మీదే.
*20-08-2012
ఈడూరి శ్రీనివాస్ || హైదరాబాదు ||
హైదరాబాదు రహదారులు
నరకానికి అవి అడ్డదారులు
వేశావంటే బయటకు అడుగు
చుక్కలు కనబడకుంటే నన్నడుగు
లెఫ్టూ రైటూ జనాలకి తెలియవు
ట్రాఫిక్ లైట్లు ఎన్నడూ వెలగవు
పొలీసులు నడిచే ఏటీయెమ్ములు
జేబులు నింపును అవినీతి సొమ్ములు
పామరులకు తప్పవు చలానులు
ధనవంతులకేమొ సలాములు
రాత్రంతా రోడ్లపై గొప్పోళ్ళ పిల్లల రేసులు
తెల్లారితే బస్సులకోసం రన్నింగ్ రేసులు
బండున్న ప్రతివాడూ ప్రతిభావంతుడు
రోడ్డెక్కితే అశోకవనంలో హనుమంతుడు
ఈ నగరానికి ముద్దుపేరు హైటెక్ సిటీ
దారంతా శవాల గుట్టలు వాట్ ఎ పిటీ
*20-08-2012
నరకానికి అవి అడ్డదారులు
వేశావంటే బయటకు అడుగు
చుక్కలు కనబడకుంటే నన్నడుగు
లెఫ్టూ రైటూ జనాలకి తెలియవు
ట్రాఫిక్ లైట్లు ఎన్నడూ వెలగవు
పొలీసులు నడిచే ఏటీయెమ్ములు
జేబులు నింపును అవినీతి సొమ్ములు
పామరులకు తప్పవు చలానులు
ధనవంతులకేమొ సలాములు
రాత్రంతా రోడ్లపై గొప్పోళ్ళ పిల్లల రేసులు
తెల్లారితే బస్సులకోసం రన్నింగ్ రేసులు
బండున్న ప్రతివాడూ ప్రతిభావంతుడు
రోడ్డెక్కితే అశోకవనంలో హనుమంతుడు
ఈ నగరానికి ముద్దుపేరు హైటెక్ సిటీ
దారంతా శవాల గుట్టలు వాట్ ఎ పిటీ
*20-08-2012
మెర్సి మార్గరెట్ ll తనతో ఉన్న కాసేపు ll
తనతో
ఉన్న కాసేపు
సమయాన్ని తీగలుగా చుట్టి
మూలకు పడేసి
కనబడకుండా
వర్తమానపు గోనెసంచుల్లో నింపి
కుట్టేస్తే చాలు
అనిపిస్తూ
మాటలన్ని
బంతి పూల రెక్కల కింద
దాక్కుని
ఆ రంగుల్లో స్నానమాడి
తన పెదాలపై
అంటుకున్నట్టు
కనిపిస్తూ
చీకటంతా
ప్రవహమై
వెలుగులో కలుస్తూ
కను రెప్పలని
ఆ వెలుగు తరగలతో నింపి
తన కళ్ళలో
ఆ ప్రకాశాన్ని
మెరుస్తుంటే చూస్తూ
గాలినంతా
ఎక్కడికక్కడ ఆపి
తన స్వేదాన్ని తాకకుండా
చేసి
ఆ చెమ్మనుంచి సుగంధాన్ని
తీసి
నా గుండెలనిండా
తనుగా నింపుకుంటూ
ఆ క్షణాల దగ్గరే
ఆగిపోయా
అడుగు ముందుకేసే ధైర్యం చాలక
తనకు
ఈ రోజుకు
వీడ్కోలు చెప్పలేక
నన్ను నేను
గతాన్ని జ్ఞాపకాల్ని కౌగలించుకొని
రేపటికి
తను వేసే
అడుగుల కింద
పచ్చగా పరుచుకొనే
గడ్డి తివాచి నవుతూ
ఆ పాదలని
సున్నితంగా
ముద్దాడటానికి ఎదురుచూస్తుంటా.
*20-08-2012
వర్ణలేఖ || ఒకే నాణెం ||
నాకేందే
నేను మస్తుగున్న
పెళ్ళాం ఇద్దరు పిల్లలు
బిందాసుంది లైపు
పొద్దంత పత్తర్ఘట్ల
పంజేస్త పొద్మూకి
ఇంత మందు బిర్యానీ
నెలకి మూడువేలు
నా పెళ్ళానికిస్తా
ఇల్లంత తనేజూస్కుంటది
మనకేం టెన్షన్లేవ్
పిల్లలు మంచిగజద్వుతుర్రు
ఇంకేంగావల్నే
*** *** *** *** ***
ఏంజెప్పనన్నా
మా కష్టాలు
నా మొగుడిచ్చే
మూడువేలు కిరాయికి
పిల్లల తిండికేసాల్తలేవు
ఆళ్ళ ఫీజులేమాయే
బట్టలు పుస్తకాలు
యెట్టెల్తాయో జెర్రజెప్పు
రోజు పూలల్తున్న
మిషినిగుడ్తున్న
నేను పంజేయంగ
నెలకింత యేన్నన్న
బదుల్దెస్త
మా బాడల జరాలు
పిలిస్తెవల్కుతయ్
దవ్కాన్లు మందులు
ఆయ్నకెన్నడు
ఎదురడ్గొద్దనే
నా కాడుపుగట్కొని
కట్టుకున్నోన్ని
ఎనకేసుకొస్తున్న
పాపం ఆడుమాత్రం
ఏంజేస్తడు
ఐనకాడికి కస్టవడ్తుండు
మల్ల మా ఆయనకు
జెప్పకుర్రి నేను
పంజేస్తున్నా అంటే
బాదవడ్తడు
వర్ణలేఖ - 20Aug12
శ్రీకాంత్ కె || ఎందుకో ప్రేమిస్తారు స్త్రీలు ||
ఎందుకో కానీ ప్రేమిస్తారు స్త్రీలు
ప్రేమ అనుకుని, ప్రేమను అందుకుందామని
ఎందుకో కానీ ప్రేమిస్తారు స్త్రీలు
పిల్లలు తిరిగే లోకాలలో, శిశువులు నవ్వే కాలాలలో
పూవులు తిరిగే, తిరిగి పూసే రంగుల క్షణాలలో
ఎందుకో కానీ ప్రేమిస్తారు స్త్రీలు
అద్దంలోంచి మన ముఖాల్ని లాగాడానికీ
ముఖాల్లోంచి అద్దాలని తీసివేయడానికీ, మన హృదయాలని భక్షించి
తమ హృదయాలని శిక్షించుకుని, చిందరవందర అయ్యేందుకు ఉక్కిరిబిక్కిరి అయ్యేందుకూ
ఎందుకో కానీ ప్రేమిస్తారు స్త్రీలు
అరచేతుల్లో వీడ్కోలు అయ్యి, కళ్ళల్లో ఎదురు చూపులయ్యీ
దినానంతాన గుమ్మానికి అనుకుని నిన్ను స్మరించుకుంటూ
నిన్ను శపించుకుంటూ ఎందుకో కానీ
ఎందుకో ప్రేమిస్తారు స్త్రీలు
వానలు కురిసే వేళ్ళల్లో, ఎండ చిట్లే కాలాల్లో
వొంటరిగా ఒక్కళ్ళే అనేకం అవుతూ, అనేకం అయ్యి వొక్కళ్ళుగా మిగులుతూ
దీపం వెలిగించిన చీకట్లో తమని తాము రాసుకుంటూ నిన్ను నీకు చెరిపివేస్తూ
ఎందుకో కానీ, ప్రేమిస్తారు స్త్రీలు
ఎందుకో కానీ మోహిస్తారు స్త్రీలు
ఎందుకో కానీ నీకు మృత్యువుని పరిచయం చేసి మృత్యుంజయులుగా
మిగిలిపోతారు స్త్రీలు, ఏమీ మిగుల్చుకోని స్త్రీలు
ఏమీ లేని ఏమీ కాని స్త్రీలు
ఎందుకో కానీ నిన్ను ప్రేమించే స్త్రీలు.
*20-01-2012
కె. కె. గజల్
ఏ నాటకమైనా ముగిసిందా ఏదో వాదన లేకుండా!!!
ఏ జీవితమైనా గడిచిందా ఏదో వేదన లేకుండా!!!
కలల్లోనే గడిపేస్తుంటే.. కీర్తిశిఖరం అందుతుందా
ఏ దేశమైన పురోగమించిందా ఏదో సాధన లేకుండా!!!
నీళ్ళైనా నిలకడగుంటే.. రాళ్ళల్లో నాచు మొలవదా
ఏ ధర్మమైన జన్మించిందా ఏదో శోధన లేకుండా!!!
యంత్రం ఎంత గొప్పదైనా... తానుగా నడవదులే
ఏ పాపడైనా పుడతాడా ఏదో దీవెన లేకుండా!!!
జాబిల్లి వెన్నెల చల్లితే...కలువ మురియదా "కోదండ"
ఏ మనసైనా ప్రేమిస్తుందా ఏదో స్పందన లేకుండా!!!
*19-08-2012
డా. సింహాచలం లక్ష్మణ్ స్వామి // ఉగ్ర' నేత్రం ! //
అగ్ర రాజ్యానికి ఆగ్రహమొస్తే
ఉగ్రవాద ముద్రతో
ఉరికంభమేక్కిస్తుంది...
సిరియాను బానిసను చేసి
సిరుల్ని దోచే దొంగ నాటకం !!
పన్నాగాల పథక రచనలో
'పెద్దన్నే' ప్పుడూ ముందే ఉంటాడు...!
నియంతల కుతంత్రాలకు
చిన్న దేశాలు
పాదా క్రాంతమే..!!
తెగ బలిసిన
తెల్ల మదానికి ,
కండ కావరానికి...
తలవంచుతున్న
చిన్న రాజ్యాలు ...
అఫ్ఘాన్ ...ఇరాన్,
ఇరాక్ ...లిబియా,
ఇప్పుడు సిరియా వంతు ...!
సిగ్గు శరాల్ని వదిలి ..
'శరా'లకు పడునుపెడుతోంది ..
దురహంకార దండయాత్రల పరంపర !
భయం లేని స్వేత శునకం
శవాలవేటకు సెలవివ్వదు .
'అణ్వస్త్ర' కొండపై కూర్చుండి..
'అణు'వంత అస్త్రం కూడా
ఎక్కడా ఉండొద్దట ...!?
పిచ్చి ముదిరిన
తెల్లకుక్కల స్వైర విహారానికి ...
బిక్కుమంటున్న
చమురు దేశాలు ...
9/11 తో
గర్వ భంగమై ..
గజగజ వణికినా..
బుద్ధిరాని
పడమటి రాజ్యమా ...
లెక్కలేనన్ని
' లిటిల్ బాయ్స్'
నీవైపు ఎక్కు పెట్టే ఉన్నాయి ...
'పడమర'లోనే నిన్ను
పాతి పెట్టటానికి ...
( సిరియాను చెర పట్టేందుకు అమెరికా చేసే దుష్ట పన్నాగానికి నిరసనగా ..)
*19-08-2012
అగ్ర రాజ్యానికి ఆగ్రహమొస్తే
ఉగ్రవాద ముద్రతో
ఉరికంభమేక్కిస్తుంది...
సిరియాను బానిసను చేసి
సిరుల్ని దోచే దొంగ నాటకం !!
పన్నాగాల పథక రచనలో
'పెద్దన్నే' ప్పుడూ ముందే ఉంటాడు...!
నియంతల కుతంత్రాలకు
చిన్న దేశాలు
పాదా క్రాంతమే..!!
తెగ బలిసిన
తెల్ల మదానికి ,
కండ కావరానికి...
తలవంచుతున్న
చిన్న రాజ్యాలు ...
అఫ్ఘాన్ ...ఇరాన్,
ఇరాక్ ...లిబియా,
ఇప్పుడు సిరియా వంతు ...!
సిగ్గు శరాల్ని వదిలి ..
'శరా'లకు పడునుపెడుతోంది ..
దురహంకార దండయాత్రల పరంపర !
భయం లేని స్వేత శునకం
శవాలవేటకు సెలవివ్వదు .
'అణ్వస్త్ర' కొండపై కూర్చుండి..
'అణు'వంత అస్త్రం కూడా
ఎక్కడా ఉండొద్దట ...!?
పిచ్చి ముదిరిన
తెల్లకుక్కల స్వైర విహారానికి ...
బిక్కుమంటున్న
చమురు దేశాలు ...
9/11 తో
గర్వ భంగమై ..
గజగజ వణికినా..
బుద్ధిరాని
పడమటి రాజ్యమా ...
లెక్కలేనన్ని
' లిటిల్ బాయ్స్'
నీవైపు ఎక్కు పెట్టే ఉన్నాయి ...
'పడమర'లోనే నిన్ను
పాతి పెట్టటానికి ...
( సిరియాను చెర పట్టేందుకు అమెరికా చేసే దుష్ట పన్నాగానికి నిరసనగా ..)
*19-08-2012
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)