కవిత్వంతో కరచాలనం-4 “వజీర్ రహ్మాన్ గారిని ఇవాళ ఎవరూ ఎక్కువ తలచుకుంటున్నట్లు లేరు, మళ్ళీ ఆ కవిత్వం చర్చల్లోకి వస్తే బావుండును!” అని ఈ మధ్య మైథిలి అబ్బరాజు గారు అన్న మాటలు వజీర్ రహమాన్ గురించి మళ్ళీ ఆలోచించేట్టు చేశాయి. వేరే సందర్భంలో రాసిన వ్యాసంలోంచి కొంత భాగం ఇక్కడి కవిమిత్రులతో పంచుకుంటున్నాను, కవిసంగమం మిత్రులకి చాలా మందికి వజీర్ కవిత్వం కొత్త అనే ఉద్దేశంతో, ఆయనతో ‘కరచాలనం’ చేయించాలన్న కోరికతో..... * * * పుస్తకాలుంటాయి. అందులో అక్షరాలూ వుంటాయి. ఉత్తరాలుంటాయి, అందులో పలకరింతలూ వుంటాయి. కానీ, వొక వ్యక్తి పరిచయం అంతటితోనే ఆగిపోదు. అప్పటి దాకా ఆ అక్షరాల్లోంచీ, ఆ పలకరింతల్లోంచీ చూసిన వ్యక్తిని కలవాలని కూడా అనిపిస్తుంది. అప్పటిదాకా కలిసి పంచుకున్న పరోక్ష అనుభవాల సందోహంలోంచి వొక ప్రత్యక్ష బంధం భిన్నమయిన అనుభవంగా మారుతుంది. దాన్ని స్నేహమో, ఆత్మీయతో, ఆత్మ బంధుత్వమో అనుకోవచ్చు. కానీ, అంతగా కలవాలని కోరుకున్న ఆ వ్యక్తిని మనం ఎప్పుడూ చూడనే లేదనుకోండి, అప్పుడెలా వుంటుంది? వజీర్ రహమాన్ గారిని తలచుకున్నప్పుడల్లా నన్ను ఈ దిగులు ఆవరిస్తుంది. ఆయన కన్ను మూసే సమయానికి (1983) నేనింకా కవిగా సరిగా కన్ను తెరవలేదు. కానీ, కవిత్వం చదవడం, దాన్నే మననం చేసుకుంటూ గడపడం అప్పటికే చాలా ఇష్టమయిన వ్యాపకంగా మారింది. వజీర్ కి కవిత్వం అంటే ప్రాణమే కానీ, అంత కంటే ఎక్కువగా స్నేహితులంటే ప్రాణం. వాళ్ళతో గడపడం, వాళ్ళకి ఉత్తరాలు రాయడం ఆయనకి ఇష్టమయిన వ్యాపకంగా వుండేదట. ఫోటోగ్రఫీ ఇష్టం. అన్నిటికంటే ఎక్కువగా ఆయనకి కాలేజీలో లెక్చరర్ గా పని చేయాలన్న కోరిక వుండేదట. కానీ, జీవితం వొక్కో సారి ఎంత అన్యాయంగా వుంటుందంటే, ఆ వొక్క పని తప్పా, ఉపాధి కోసం ఆయన ఇతర అన్ని టెక్నికల్ పనులూ చేయాల్సి వచ్చింది. “ఎచటికి పోతావీ రాత్రి?” 1963లో అచ్చయ్యే నాటికి ఆయనకి 29 యేళ్ళు. అప్పటికింకా ఆయన ఉద్యోగన్వేషణ కూడా పూర్తి కాలేదు. జీవితాన్ని వొక అందమయిన కళగా పూజించాలనుకున్న ఈ స్వాప్నికుడు వొక స్థిరత్వం లేక, వొక కుదురు చిక్కక సతమతమయిపోతూనే బతికాడు. ఆయనకి దక్కిన వొకే వొక్క అపురూపమయిన స్వప్నసంపద చంపక- చలం గారి కూతురు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. వజీర్ గానీ, చంపక గారు గానీ, చాలా అరుదుగా ఇల్లు వదిలి ఇంకో చోటికి వెళ్ళే వారు. ఇస్మాయిల్ గారింటికి కూడా పెద్దగా రాకపోకలు వుండేవి కావు. చలం అనే మహాచెట్టు కింద వొదిగిపోయిన తరవాత వజీర్ కి ఇంకే లోకమూ అక్కరలేకపోయింది. వజీర్ ఇలా చెప్పుకున్నాడు 1963లోనే: అవును, నా కవిత్వ సాధనలో చరణ చరణమూ అతని ప్రభావం, పర్యవేక్షణా. నా జీవితంలో నిమిష నిమిషమూ అతని రక్షణ హస్తం, ప్రోత్సాహం నాకు. అతనిచ్చిన బలంతోనే చూపిన అతని తోవ వెంటనే ఈ నడక నాకీ నాడు – మధురానంద కవితాకాశంలోనూ దుర్గమ జీవన కీకారణ్యంలోనూ. చలం చాలా మందిని ప్రభావితం చేసిన గొప్ప శక్తి. అనుమానమే లేదు. కానీ, వజీర్ దగ్గిరకి వచ్చేసరికి చలమే ఈశ్వరుడు. ఇలా ఆలోచించడం సరికాదని నాకూ తెలుసు కానీ, వొక దశలో చలం నీడ వదులుకొని వుంటే, వజీర్ ఇంకో దారి పక్కన ఇంకో పూల చెట్టుగా అందంగా నిలబడి వుండే వాడేమో! చలం వొడిలో అతనొక మొక్కగా మాత్రమే మిగిలిపోయాడేమో! కానీ, ఇది జీవితం కదా! అలా అనుకోనిస్తుందా జీవితం?! ఎవరి దిగుళ్లు, ఎవరి సంతోషాలు ఎలా వుండాలో వాళ్ళకే తెలిసినంతగా మనకి తెలియదుగా! అంత మహావృక్షం నీడలో కూడా వజీర్ 1963 కవిత్వం నించి 1983 నాటి “సాహసి”దాకా వొక అందమయిన continuity ని సాధించాడు. వజీర్ కవిత్వం మీద పరిశోధన చేసిన నా తమ్ముడు ఇక్బాల్ చంద్ మొన్న అంటున్నాడు: “నా దృష్టిలో జీవితాన్ని కవిత్వంలోకి కుదించడం కంటే కవిత్వంగా జీవించడం బాగుంటుంది. వజీర్ అలా కవిత్వంగా జీవించారు. అలా జీవించడం ద్వారా కవులు షరా మామూలుగా బతికే మోసపూరిత జీవనాన్ని ఆయన తిరస్కరించాడు. అందుకే, చివరి వాక్యం దాకా వజీర్ లో ఆ తీవ్రత, ఆ జీవన లాలస!” కవిత్వం విలువ ఎప్పుడు అర్థమవుతుందంటే, ఆ కవిత్వ పంక్తులు కొన్ని సీదా మన జీవితాల్లోకి దారి వెతుక్కున్నప్పుడు – అంటే – ఆ వాక్యాలు మననం చేసుకునే సందర్భాలు మన జీవితాల్లో దొరికి, వాటిని మనం తిరిగి చదువుకున్నప్పుడు! అంటే, అనుభవమే కవిత్వానికి ‘కోటబిలిటీ’ ఇచ్చినప్పుడు! వొక గాఢమయిన అనుభవం తట్టి పలకరించినప్పుడల్లా ఆ వాక్యాలు మనల్ని ముసురుకుంటాయి. వజీర్ కవిత్వంలో అలాంటి కోటబిలిటీకి కరువు లేదు. ఆయన్ని తలచుకున్నప్పుడల్లా అతనే రాసుకున్న వొక పంక్తి నాకు భలే గుర్తొస్తుంది: ఇదేం లేదనుకో మర్చిపో నేనేం కాదనుకో రాలేదనుకో – అని వారిస్తావు కాని, నువ్వు లేని నన్ను వూహించడమే భరింపరాని బాధయి నేనెట్లా మరవగలను? నీ ఆలోచనే చాలు, నా నరాలు తిరగబడి బాధతో పదునెక్కి ప్రేమతో, మోహంతో మధుర జ్నాపకాలతో రౌద్ర సముద్రుడి వలె విలవిలలాడిపోతాను. వొక్కో సారి మనకి బాగా ఇష్టమయిన కవి హటాత్ నిష్క్రమణ అనిపించేది అదే కదా! వొక్కటే వూరడింపు ఏమిటంటే ఆ అక్షరాలు మిగిలి వుంటాయి వెచ్చగా!
by Afsar Afsarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tbsYvq
Posted by
Katta