పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

13, నవంబర్ 2013, బుధవారం

మహేష్ కుమార్ కత్తి కవిత్వ విశ్లేషణ

కవిత యొక్క టైటిల్ చూస్తేనే తెలుస్తుంది ...లోతైన భావాన్ని ...కవిత లోని మొత్తం అర్థాన్ని ఒకే పదంలో నూతనంగా మూతబెట్టి చిత్రించిన తీరు కవి తాత్విక ధోరణికి అద్దం పడుతుంది.

తనకు తానుగా కావలని చేరుకున్న ఓ తీరం...అందులోని రసాయనంలా కవి ఎంచుకున్న వస్తువు అది మత్తు పదార్థం కావచ్చు లేదా ప్రేమకూడా కావచ్చు ఇంకేదైనా వ్యసనం కావచ్చు! తనకు తానుగా ద్రవంలా కరిగిపోయి మనసు వొలకబోసుకోవడం (మనసు పడటం)...ఆ కవితా వస్తువులో సంతృప్తి చెంది అక్కడే ఆగిపోయి తనకు తానుగా బంధీ అవడం... ఇదంతా ఒకే వాక్యంలో వర్ణించారు!

"నన్ను నేను సీసాలోకి ఒంపుకుని
బిరడా బిగించి, టైం కాప్స్యూల్ లో పడేసుకున్నాను.
అనుభవం ఉంది. జ్ఞానం ఉంది.
కానీ నేను మాత్రం ఆ సీసాలోనే మిగిలిపోయాను."

అనుభవమూ,జ్ఞానమూ అన్నీ తెలిసి కూడ కావాలని కోరుకున్న బంధంలోనే ఉండిపోయానంటారు! ఇది కవి మనస్తత్వాన్ని స్పష్టపరుస్తుంది.

తనను తాను సీసాలో వలకబోసుకునే ద్రవణంతో మరియు కవితా వస్తువును భూతంతో పోల్చడం... పీడించబడిన మనసును కవి యొక్క కళాత్మక దృష్టిని తెలియజేస్తుంది

"నన్ను నేను వృధా చేసుకున్నానా!
రాబోయేకాలానికి నమూనాగా మలుచుకున్నానా
లేక ఒక మ్యూజియం పీస్ గా మిగిలిపోతానా
అసలు గుర్తింపేలేకుండా ఇంకిపోతానో తెలీదు"

ఆ బంధం మత్తులో కాలం తెలియక గడిపాకగాని గుర్తొచ్చే విషయం...!గతించిన కాలాన్ని తలచి వృధాగ వగచి ప్రశ్నించుకోవడం....భవిష్యత్తుకు తానొక నష్టపోయిన జీవితపు నమూనాగా మిగిలిపోతానేమోనని...,అసలు గుర్తింపుకూడా లేకుండా పోతాననుకోవడం కవి పశ్చాత్తాప ధోరణితో కలవరపడుతూ ఆలోచించడం... కవి మనసు ఊగిసలాడే స్పందనను తెలియజేస్తుంది...!

"కొన్ని బిరడాలు తీస్తే భూతాలు వస్తాయి
కానీ ఈ సీసాలోంచీ భూతకాలపు అనవాళ్ళు
వర్తమానపు జ్ఞాపకాలు వస్తాయి
అవిభవిష్యత్తుకు పనికొస్తాయోలేదో తెలీదు
కానీ నన్ను కోల్పోయిన నేను కాలంగా మిగిలాను"

మనసు తలుపు తెరిచినప్పుడు కొన్ని జ్ఞాపకాలు గుర్తొస్తాయి కానీ కవి ఎంచుకున్న విషయం గుర్తొస్తే మాత్రం తను నస్టపోయిన కాలం గుర్తొస్తుంది అని అది వర్తమానాన్ని కూడా స్పృషిస్తుందని ....భవిష్యత్తులో అది ఒక గుణపాఠంగా పనికొస్తుందో లేదో అని.....ప్రస్తుతం ఎలా ఉన్నా గతించిన కాలం బ్యాడ్ టైం గా తనను నిలబెట్టిందని వ్యసనానికి బానిస అయి బయట పడడాన్ని చిత్రంగా చిత్రించారు!!!
సూక్ష్మంలో మోక్షం చూపించినట్టు వ్యసనానికి బానిస కావడం వల్ల అమూల్యమైన కాలాన్ని, విలువైన జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని నిగూఢంగా తెలియజేసారు!

విషయం ఎలాంటిదైనా ఏర్పడకుండా చెప్పగలగడం కళాత్మకమే!
అమూల్యమైన సందేశాన్ని కవితగా చెప్పిన "మహేష్ కత్తి" గారికి ధన్యవాదాలు!

________ అరుణ నారదబొట్ల(13-11-2013)

కవిత్వ విష్లేశణ



లక్ష్మణ్ స్వామి కవిత

విలయానికి, విద్వంసానికి సంబందించిన విషయాన్ని వస్తువు గా తీసుకోవడం అన్నది కొత్త ప్రక్రియగా చెప్పవచ్చు. బీబత్సానికి అక్షర రూపమిచ్చే ప్రయత్నం చేసారు లక్ష్మణ స్వామి గారు తన కవిత లో , మొత్తం కవిత ని సంబాషణ రూపం లో వ్యక్తీకరించారు.

విద్వంసం ఎంత భయాన్ని సృష్టిస్తుందో, క్షణాల్లో ఎన్ని నగరాలని నేలమట్టం చెయ్యగలదో అంటాయి మొదటి పాదాలు

//కొన్ని నిమిషాలు చాలు నీకు //ఒక్కోనగరాన్ని ఉఫ్ మని ఊది //పారెయ్యటానికి...!

వాయు తీవ్రతకి ఎంతటి బలం వున్న వస్తువైనా కూలిపోవాల్సిందే, పెను గాలి కి వృక్షాలు సైతం చిత్తు కాగితం మే అంటూ పోలికలతో వర్ణిస్తారు .....

//విమానాల్ని వెనక్కినేట్టే //నీ విలయ గాలికి //వృక్షాలు మేడలు చిత్తుకాగితాలు ...!!!

విద్వంసపు తాలూకు స్పందనల్ని బీబత్స నృత్యానికి ముడివేస్తూ , ఆ క్రమం లో ప్రపంచం లో ని కొన్ని నగరాలు మటుమాయం అయి, ఆనవాళ్ళు ను కూడా మిగల్చని ఈ తుఫాను ..పెను విషాదభరితం అంటూ చెప్తూనే.... జరిగిపొయిన గతాన్ని మననం చేసి నిజాన్ని వెలికి తెచ్చే ప్రయత్నం కన్పిస్తుంది ...

//నీ అల్లకల్లోల//కంకాళ తాండవానికి //ప్రపంచ పటం నుంచి //పెకలించబడిన కొన్ని నగరాలు ..!!
//బహుశః కొన్ని రోజులకింద//ఇక్కడో మానవ ఆవాసముండేదేమో అన్న౦తగా ..!!

నీటి ప్రవాహపు శక్తి అణుబాంబు కన్నా వెయ్యి రెట్లు బలముంటుంది , ఆ ధాటికి చెల్లా చెదురైన బక్క ప్రాణాలు అవి జంతు జాలం అయిన, లేదు మనిషి అయిన సముద్రపు అడుగున వెళ్తాయి నిర్దయగా ........!!!
"అణు బాంబుల్ని వెక్కిరించే //నీ అసిధారకు ముక్కలైన ‘బక్క ప్రాణులు’//సముద్రం అడుక్కి !!

అంతరిక్షాన అబివృద్ధి కి చిహ్నాలు గ చెప్పుకుంటున్నవి కూడా నీ ఉనికి ని పసిగట్టలేక చతికిల బడి చూడలేకపోతున్నాయి, కేవలం గంటల వ్యవధి లో మానవుడు పేర్చుకున్న నాగరికత ను కొన్ని వందల వత్సరం ల వరకు తుడిచి పెట్టగలదు అంటూ అందులో ని తీవ్రత ను పట్టి ఇస్తాయి ఇలా..

"మార్స్ చూసే ‘మానవ కళ్ళు’ నీ మారణాయుధాన్ని //చూళ్ళేక పోతున్నాయి !
గంటల్లో యుగాల కావల //నా‘గరిక’తను తోసి పడేస్తావు !!

భవిష్యత్తు నిర్మాణాన్ని ఊహించేముందు, నేటి పరిస్థితి ని అవగాహన చేసుకోమంటూ, నేల మీద నిలిచేందుకు కనీసపు సాక్షాలన్న వుండాలి అన్న స్పృహ ను కల్పిస్తాయి కొన్ని పాదాలు

//చంద్రుని పైనా , అరుణిని పైనా , మేడలు కడతాడట !!??, మరి నేలమీద నీడలు నిలిచేందుకు
జాడలు౦డాలిగా ముందు !//

మనిషి తన ఆనందం కోసం, విలాసాల కోసం ప్రకృతి ని మట్టుబెట్టినపుడు, ప్రతీకారం తీర్చుకోడానికి ప్రతిజ్ఞ చేసి ..., .విషం తో అంతం చేస్తావా అంటూ ప్రకృతి ని నిలదీస్తారు ..

//అంత పగెందుకే ప్రకృతి ??//విశృంఖల విలాసాలకు //నిన్ను విచ్ఛిన్నం చేస్తే మట్టుకు //‘కాల’ కూటంతో కాటేయ్యాలా..!!??//

ప్రకృతి భీబత్సాలకు ప్రతిక గా కొన్ని ఉదాహరణలను చూపుతూ .....అవి మారణాయుధాలు, ఎంతో శక్తివంతం అయినవి ప్రకృతి విలయాలు అంటూ ముగిస్తారు ..ఇందులో "‘బెర్ముడా ట్రయాంగిల్’ అమ్ములపొదిలో !! అనేది ఓ చక్కని పదబంధం ...సముద్రానికి సంబదించిన ఓ రహస్యం ...., ఈ వృత్తం నుంచి వెళ్ళినన ఏ వస్తువు అయిన కూడా ఆ ట్రయాంగిల్ పడి అంతం అవుతుంటాయి ...దానికి సంబదించిన రహస్యాన్ని చేదించారు ...అది వేరే విషయం, ప్రకృతి ప్రకోపిస్తే అన్ని రూపాల్లో వినాశనం తప్పదు ఇది సత్యం అంటూ ముగిస్తారు ...

//హరికేన్లు ... టోర్నడోలు , తుఫాన్లు ..భూకంపాలు., ఉల్కలు ... లావాలు
గ్రహశకలాలు, ఒక్కటా, రెండా .లెక్ఖ లేనన్ని మాయావి విశ్వంలో //
మారణ హోమాయుధాలు ...!! //‘బెర్ముడా ట్రయాంగిల్’ అమ్ములపొదిలో !!

లక్ష్మణ్ స్వామి గారి లో వ్యక్తీకరించే భావేవాశం వున్నది ....అయితే కేవలం సమస్య తీవ్రత ని చెప్పారు తప్ప, పరిష్కార మార్గాన్ని సూచించలేదు ఆ ఒక్కటి తప్ప మిగితా మొత్తం కవిత చదివించేలా ఆకట్టుకొన్నది. ఓ కొత్త వస్తువు తో ముందుకు వచ్చిన స్వామి గారు అభినందనీయులు ..సామాజిక స్పృహ ని రంగరించి అక్షరానికి మెరుగులు దిద్దుకుంటే ఇంకా మరిన్ని మంచి కవితలని అందిచగలరు ...

వారు ఈ విషయము లో విజయం సాదించాలని మనస్పూర్తి గా కోరుకుంటూ ...

సెలవు ...
 
                                                                                                                             
 
 
 
 
                                                                                                                             _______పుష్యమి సాగర్
 

తొవ్వ




పండు వెన్నెల -పసందయిన జ్ఞాపకాలు

తెల్లని ఎన్నీల ఎలుగుల చల్లదనం
వాకిట్ల గడించేల ఎల్లెలుకల పండి
తాత చెప్పిన శాత్రాలు ఇన్నందుకేమో
కొంతయినా కవిత్వాల అల్లకం అబ్బింది

పండు వెన్నెల రోజు ఆరు బయట నడుస్తుంటే వచ్చే ఉల్లాసం ఎట్లుంటదో టైపు చేయరాదు రాయరాదు .పున్నం రాత్రి అన్నం తిని కట్టె పట్టుకొని పొలం కాడికి కావలి పోతే ,ఆ చెల్కలు చేన్లన్నీ తెల్లగ అగుపిస్తాయి .కొట్టంల కట్టేసిన ఎడ్లు అయితే మరింత తెల్లగ మెరిసిపోతాయి .
ఎన్నిల రాత్రి ఎవలకు వాళ్ళే మెరిసి పోతారు .చేను చెలక గొడ్డు గోదా మ్యాక వాటి మొకం సూస్తే అవ్వి సుత ఎన్నిల ఎంజాయ్ చేస్తున్నట్టే కనిపిస్తయి .అమాస పున్నంకు ఎంత తేడా ఒకటి కటిక చీకటి ఒకటి ఎలుగుల పందిరి .
మేము చిన్నప్పుడు వాకిట్ల నులుక మంచం ఏసుకొని ముచ్చట్లు పెట్టుకుంట పండుకునేది .నడుమ మా తాత మాకు కచెప్పేది.ఇనుకుంట ఇనుకుంట మేము నిద్రల జారేది .ఆ కథలల్ల తప్పక చందమామ వచ్చేది .మా తాత కథలను శాత్రాలు అంటదు .
కాముని పున్నం నాడు అయితే పోరగాండ్లకు మస్తు సంబురం .కోలలు పట్టుకొని ఊరంతా జాజిరి ఆడపోయేది
జాజిరి జాజిరి జాజిరి జాజ
జాజిరి ఆడపోతే ఏమేం దొరికె
రింగుడు బిళ్ళ రూపుడు దండ
దండ కాదురో దామెర మొగ్గ
మొగ్గ కాదురో మోదుగు నీడ
నీడ కాదురో నిమ్మల బాయి
బాయి కాదురో బసంత తీగ

ఇట్లాంటి పాటలు పాడుకుంట ఇంటింటికి ఎన్నిల రాత్రిళ్ళు పాడుకుంట తిరిగిందీ కవిత్వమే ...కవిత్వం కావాలి కవిత్వం అని మన కవి సంగమం పిలిపిస్తే అక్కన్నుంచే వస్తుందిఏ కవనపు జాలు .కవిత్వానికి ఎన్నేలకు ఎంత సంబంధమో ఈ చందమామ లు కవిసమయాలే ...చల్లని పల్లె ఎన్నెల తాగిన వాళ్ళు ,చిక్కని బర్రె పాలు జుయ్యిన పిండిన వూరోల్ల కవిత్వం ఇప్పుడు పరిశోధన జరగాలె .
అందుకే వెన్నెల ను ప్రేమించిన మా కరీంనగర్ కవులం ప్రతి పున్నం రాత్రి 'ఎన్నీల ముచ్చట్లు 'పేర కలుసుకొని కవిత్వం చెప్పుకుంటన్నం .ఒక్కో పున్నంకు ఒక కవి ఇంటి డాబా మీద కలయిక .ఇప్పటికి మూడు సార్ల అయ్యింది .'సాహితీ సోపతి 'వాటిని పుస్తకాలు తెచ్చింది .రేపు 17.11.2013న కార్తీక పున్నం రోజు మిత్రుడు బూర్ల వెంకటేశ్వర్లు ఇంటి మీద ..కవుల కలయిక ...

నిండు పున్నమి నాడు పండు వెన్నెల
భూమికి సున్నం ఎసినట్లు
ఎన్నీల ఎలుగు పల్లెటురంత స్వచ్చం
ఎన్నీల ఎలుగె మనుసుకు నిమ్మళం ......


                                                                                                                          
 
 
 
 
                                                                                                                 ________అన్నవరం దేవేందర్