పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, ఆగస్టు 2012, ఆదివారం

అనిల్ డాని // నీ రాకకై //

ఇప్పుడే తెరిచాను
చిలిపి ఊహల గది తాళం
చల్లగాలేదో వచ్చి నీ ఊసు చెప్పి వెళ్ళింది
మేఘం తో నువ్వు పంపిన కబురు
చినుకుగా ఇచ్చి ఇప్పుడే వెళ్ళింది

ఇందాకే అనుకున్నా
నీ మది లో నేను వున్నానా లేనా అని
వెంటనే చల్లగాలి పెనుగాలై వచ్చి
హెచ్చరించి వెళ్ళింది
సన్నజాజులన్ని తెల్లబోయాయి నా ఊహకి
జడలోనుంచి మెడపై మెత్తగా గుచ్చాయి
అమ్మో నువ్వు మయగాడివే
నన్నే కాదు ప్రకృతిని మాయ చేసావ్

విరహం ఓ వైపు వేదన ఓ వైపు
నీ చేతి స్పర్శల గురుతులు ఓ వైపు
నీ మాటల మహత్తు ఓ వైపు
ఇలా నాలుగు దిక్కులనుండి నన్ను
ఆవహించేస్తున్నావ్ రోజూ

నీ మనసు కాగితం పై నాకై రాసిన
అక్షరాలను చదువుకుంటూ
తడుముకుంటూ
వెన్నెలలో ,వానలో మన జ్ఞాపకాలను
మాల కడుతూ సిగ్గుల మొగ్గను అవుతున్నా

పరధ్యానమే ఎప్పుడూ అమ్మ అరిచినా
నాన్న పిలిచినా ఫోన్ మోగినా
నీ ధ్యాసలో నిండామునిగి వున్నా
నిశ్చల సంద్రంలో దూరంగా
సాగిపోతున్న నావలా

చివురులన్ని పండుటాకులై రాలుతున్నాయి
మామిడి కాయ మాగాయై జాడీలో బద్రం గా వుంది
మంచం వెక్కిరిస్తుంది మల్లెలు గోలచేస్తున్నాయి
కోయిల పిలిచి పిలిచి అలిసి అలిగింది నీపై
ఇంత జరిగినా నువ్వు రాలేదు రాకూడదు అంటగా

ఏంటో ఈ ఆషాఢ అధిక మాసం నన్ను నిన్ను దూరం చేస్తూ
ఆశగా, బేలగా కళ్ళలో నిన్ను నింపుకుని
నీ శ్రీమతి నీకై రాస్తున్న ప్రేమలేఖ
అందుకుని స్పందించి వస్తావుకదూ

*18-08-2012

కర్లపాలెం హనుమంత రావు॥అలోచనల శకలాలు॥


1
మనిషి
రెండు లోకాల
అతుకు

2
జారడం తేలిక
ఎక్కడం ఓపిక
లోయలే కావాలి నాకు.


మౌనమూ
ఒక వినిపించని
కావ్యమే!

4
కాలి కింద ఆకాశం
తల మీద భూగోళం
పగలూ చూసే పక్షి-కవి

5
దూరాలను కుదిస్తుంది
సరే
దగ్గర్లనూ సాగతీస్తుందే-సెల్ రాక్షసి!

6
అమ్మ మీది నాన్న ప్రేమ
నాన్న పైన అమ్మ క్షమ
మనం

7
వెనక్కి వెళ్లే లోకాన్ని
ముందుకు దూకే మనస్సునూ
ఒక తాటికి కట్టేసే ముడి-ప్రయాణం

8
పర్యావరణం ఆకలి
పిచ్చుకని
మింగెసింది

9
మనిషి
అ-
సాంఘిక జంతువు

10
ఏడ్చుట
ఏడ్పించుట
మధ్య ఆటట-బతుకు

11
పసితనం పడుచుతనం
ముసలితనమూ
కోరుకోనిది- ముసలితనం

12
చేప కన్నుల చిన్నది
చూపు
ఎటో తెలియకున్నది

13
ఆమె భయం
వంటరిగా ఉన్నందుకు కాదు
వంటరిగా అతనితో ఉన్నందుకు.

*18-08-2012

రాఖీ || కవితలు మనవెంటే మన వెన్నంటే !!


ఆశలుంటే ఆశయాలుంటే
అవి సాధించే కృషి యే ఉంటే
కవితలు మనవెంటే మన వెన్నంటే!

వెతలుంటే వ్యధలుంటే
ఎదలోతుల గాధలుంటే
కవితలు మనవెంటే మన వెన్నంటే!

హితులుంటే స్నేహితులుంటే
మనల ప్రేరేపిస్తుంటే
కవితలు మనవెంటే మన వెన్నంటే!

మనసుంటే అది స్పందిస్తే
అనుభూతులు అందిస్తే
కవితలు మనవెంటే మన వెన్నంటే!!

*18-08-2012

బాలు || B.స్కూల్ లైఫ్ ||


లక్షల లక్షల పీజులు తీసుకోని
లక్షణంగా ఉండే మమల్ని
అలక్షణంగా తాయారు చేసారు

జ్ఞానాన్ని పెంచుతాము అనిచేపి
మాకుఉన్న జ్ఞానాన్ని పోగొట్టి
అజ్ఞానం లోకి తోసేసారు

మా B.స్కూల్ లో చేరండి
బిజినెస్ నేర్పిస్తామని
బిచ్చగాళ్ళను చేసి పంపిస్తునారు

మా దగ్గరున్నవి అన్ని పోయాయి
డబ్బు, సమజంలో గౌరవం
తెలివితేటలు, ఆత్మీయత.

ఇంకా మిగిలింది
ఒక్కటే
మా ప్రాణాలు

అవికూడా పోయేలా వున్నాయి
మనసు అదుపు తప్పిన రాత్రి
ఆత్మహత్య రూపం లో......


*18-08-2012

‎"నీ" ||"మౌనం గదిని ఖాళీ చేయటం అంత తేలికేం కాదు"||


-మా ఇంట్లో...అద్దంలో..నా ముఖం నవ్వి
చాన్నాళ్ళయ్యింది!

చూపుల చీకట్లు
ఊహల గడపలు దాటి ఎన్నాళ్ళయ్యింది!

అంతరాంతరాల్లో
ఓటమి ఒదిగి ఒదిగి చూస్తుంది

పెదాలమీంచి విసిరిన మాట
గుండె మూలనెక్కడో పడుంది

ఆలొచన పగిలి ముక్కలై
లొపల్లోపలే గుచ్చుకుంటుంది

అప్పుడప్పుడు పెదాల్ని
క్లొమోర్ మైన్లతొ పేల్చుకుని
మాటల్ని బయటకు తీయాలి

బలవంతపు బతుకులో
కొన్ని సంగతుల సంకెళ్ళు తగిలించుకొవాలి

నన్ను నేనే మడుచుకుని నాలోపల లోలోపల దాచుకోవాలి !

నిశ్శబ్దపు గోడల్ని శబ్ధం బద్దలు చెయ్యాలి

అయినా..

"మౌనం గది ఖాళీ చేయటం అంత తేలికేం కాదు!"

*18-08-2012

ఆర్. ఆర్. కే. మూర్తి ll అబద్దాల మధుశాల ll


దారి నిను వదిలేసింది
భావాల మోజులో పడి

చుట్టూ ఉన్న గడ్డిని చూసి
చెట్టు తన వేళ్ళని వదిలేసినట్టు

ఆకలికీ షోకులకూ
విడాకులు ఈ జన్మవిగావు

నిజాలు చేదన్నదెవరో
నేనవి లేని చొట హాయంటాను

అందమైన ఊహల మధుశాల గదా !
ఈ అబద్దాల చెరసాల

గాలివాటపు ప్రపంచానికి
మనసు చూపులెక్కడివి?

కాన్సరొచ్చింది బాబూ అంటే
లడ్డూ కావాలా నాయనా అంటుంది.

*18-08-2012

Ro Hith || చెంచాడంత ఆవలింతలు ||

Original- Ra Sh/ Translation- Ro Hith

ఆవలింత ఒక చచ్చిన కల
చిన్నప్పుడే ఉరెయ్యబడ్డ కల

నావైపు తిరిగి, నా పెదవులను చూస్తు ఆమె~
"కాని నువ్వు మూలుగుతావె, పాలను చూసిన పిల్లి లా
పీత వెంట'డిన కొంగ లా, పిల్ల ఎంట పడిన పిల్లానిలా "

నా వైపు విసురుతూ
అవలించటం మొదలెట్టింది తేలికగా ఆమె

మేమిద్దరం హతమార్చిన కలల గురించి ఆలోచిస్తూ నేను...

చేమ్చాడుతో తినిపించు కొన్ని ఆవలింతల్ని- అడిగిందామె
అప్పటికే నిద్రలోకి జారుకున్నాను
కలకన్నాను - వేలకానివేల లో వేటాడిన తిమింగలం మెత్తటి పొట్ట ని
సముద్రంలాగా ఎగిసే సుకుమర్యం ఉన్న జలకన్యని

ఆమె నా చేతుల్లో కన్నుమూసే సరికి, ఆవలింతలు నేమ్మదించాయి
గాలి చల్లగయ్యి వోనికింది
రెండు చంద్రుల్లలా ఇద్దరం ముడ్చుకున్నాము

తన ప్రాణంలేని ఛాతి పై తల వాల్చాను
మెత్తగా తినిపించిన
ఆమె హృదయపు మెల్లని ఆవలింత వినిపించింది.

*18-08-2012

రాళ్ళబండి కవితా ప్రసాద్ || తెల్లకాగితం ||


విశాల మైన తెల్ల కాగితాన్ని చూస్తే
ప్రియురాలి చిరునవ్వు గుర్తొస్తుంది.
చిన్నప్పుడు ఈత కొట్టిన చెరువు గుర్తొస్తుంది.
సందెవేళ బామ్మ చెప్పిన కథ గుర్తొస్తుంది.
ఆ రాత్రి కన్న కల గుర్తొస్తుంది.
పెళ్ళాం తో పడ్డ తగాదా గుర్తొస్తుంది.
ఎవరి తోని పంచుకోలేని ఒంటరి తనం గుర్తొస్తుంది.
మోసగించిన మనిషితనం గుర్తొస్తుంది.
నిద్రిస్తున్న ఆకాశం లో
మేలుకొని ఉన్న నక్షత్రాల కాంతి గుర్తొస్తుంది,

తెల్లకాగితం
నన్ను తనపైకి అనువదించుకునే
అందమైన కవయిత్రి.

అది నా ఆటల నేల
దాని పై నా గెలుపోటముల ప్రతిబింబాలు
మెరుస్తుంటాయి.

అది నామనస్సు .
దాని నేను పద్యమై శయనిస్తాను.
అక్షర సరస్సు నై వికసిస్తాను!

*18-08-2012

రాళ్ళబండి కవితా ప్రసాద్ || భగ్న దర్పణం ||

నేనొక ప్రతిబింబం గా మారినపుడు
వాస్తవాలు అదృశ్య మౌతుంటాయి తుంటాయి.
అందరి ఆశలు
మిధ్యా ప్రతిబింబాన్ని
ఆరాధిస్తుంటాయి
హృదయం కన్నా
మెదడు ముఖ్య మౌతుంటుంది.
కృతక సహజాల మధ్య
గీత చెరిగి పోతుంది.

సాక్షి గా ఉన్న అద్దం
న్యాయాధికారి గామారుతుంది.
గతం మూగదౌతుంది.
వర్తమానం వికటాట్టహాసం చేస్తుంది.

భవిష్యత్తు అద్దం ముందు హాజరు కాని ముద్దాయి!
ఎదురు గా ఉన్నదే గెలుస్తుంది.

కాలానికి సంకెళ్ళు పడతాయి.

మృత్యువు విజేత గా ఎంపిక అవుతుంది.

అద్దం పగిలి ముక్కలవుతుంది!
వాస్తవం వేయి ప్రతిబింబాలై విస్తరిస్తుంది!

*18-08-2012

Khanna Rajesh ‎!" బానిసకొక బానిస "!


బానిసకు స్వేచ్చ వుంటుందా
ఆకాశమంతా విహరిస్తున్నానని
గర్విస్తున్న గాలిపటం స్వేచ్చనీది .
బానిసకు స్వతంత్ర్యముంటుందా
రెక్కల్ని విడిచి పెట్టి కాల్లను కట్టేసిన స్వతంత్ర్యం నీది
వాడి ఆదేశాలు మాత్రమె పాటించె రక్త మాంసాల రోబో
గర్జించిన వసంత మేఘం పంచిన భూమెంత పారించిన నెత్తురెంత
జనతా జాతీయ విప్లవాలకోసం చచ్చిందెవరు చంపిందెవరు.
చచ్చి చరిత్రకెక్కిన వాల్లలొ నావాల్లు ఎందరు.
పంజరంలొ బందించిన వేటగాడు చెప్తున్న
స్వేచ్చా పాటం వింటు ధన్యించిపోతున్నావ్
మిత్రమా
నీవనుకుంటున్నావ్ వాడునీకు అక్షరాలు నేర్పాడని
మాటనేర్పాడని బతుకు నేర్పాడని
నేననుకుంటున్నాను
వాడికి నువ్వు తెలివైన బానిసవని
మైడియర్ కాస్ట్లి ఇంటలెక్చువల్ స్లేవ్
ఏ రాయైతేనేం తలపగలగొట్టుకోడానికి అన్నట్టు
ఏ పార్టి అయితేనేం భావదాస్యంలొ ముంచడానికి
యింకా...
అంబేత్కర్ అడ్డుతగిలి గట్టిగా అరిచాడు
వొరేయ్.. మనుషులు మనవాల్లేరా
మెదల్లు మాత్రం శత్రువులది అని.

*18-08-2012

కవితాచక్ర // సప్తవర్ణ సంగమం //



ఒక స్వచ్చత మనసుని
అల్లుకుంటే..
మరో సందిగ్ధత
ఉక్కిరిబిక్కిరి
చేస్తుంది...
అచ్చు యెండలో వానలా!!

ఒక స్పష్టత హ్రుదయం
పై పరచుకుంటే...
ఇంకో క్లిష్టత
పట్టి కుదిపేస్తుంది...
అచ్చు పచ్చని పచ్చికలోనే
దాగున్న ముల్లులా!!

ఆత్మీయంగా తాకే
పిల్లగాలి ఒకవైపు,
తాపం పెంచే వడగాలి
మరో వైపు...
అచ్చు నవ్వులో దాగున్న
విషాదంలా!!

ఒక వసంతం, ఒక గ్రీష్మం
బాధ, సంతోషం..
యెన్నో అనుభవాల
మిళితమైన అద్బుతమే
జీవితం...
అచ్చు సప్తవర్ణ
ఇంధ్రధనస్సులా!!

*18-08-2012

క్రాంతి శ్రీనివాసరావు || స్లీపింగ్ విత్ ఎనిమీ ||


బయటెక్కడో ఫంక్షన్ లో కలిసి నప్పుడు
పరిచయమై ఇద్దరం అడ్రసులు మార్చుకొన్నాక
ఒకటే అడ్రసయ్యు ఆశ్చర్యపోతుంటాం

ఎటాచ్ మెంట్స్ లేని జీవితాలు మావి
అపార్ట్స్ మెంట్స్ లో గబ్బిళాల్లా బ్రతుకుతున్నాం

ఎప్పుడూ మా ఇంటి తలుపులనే కాదు
తోటివాళ్ళ గూర్చిన తలపుల తలుపులనూ మూసే వుంచుతాం

అప్పుడప్పుడూ మెట్ల పైనో లిఫ్టు లోనో
ఎదురై సూర్యుణ్ణి నుదిటిపై ధరించి
పవిత్రతా పరిమళాలు వెదజల్లే ఆమె

పొద్దున్నే పేపర్లో పోలీసుల మద్యచూసినప్పుడు
మా ఇంటి గోడవతల రహస్యం తెలిసి గుండెలు బాదుకొంటాం

ఇళ్ళసమూహంలో ఇనుప మనుషులమై మనుగడ సాగిస్తున్నాం
అందుకే మా కవసరమొచ్చినప్పుడు
ఎక్కడో వున్న మిత్రుడు రెక్కలు కట్టుకు రావల్సిందే

పక్కింట్లొ లూఠీ జరుగుతున్నా వాళ్ళే ఖాళీ చెస్తున్నారనుకొంటాం
దొంగలు దర్జాగా వెళుతున్నా పై ఫ్లొరోడని పొరపాటుపడుతుంటాం

వొళ్ళంతా టచ్ వుడ్ పూసుకొన్న మాఇంటి డోర్లు
మనుషులు టచ్ చెయ్యడయ్యడం ఎప్పుడో మర్చి పొయ్యాయు


పక్కింట్లో నిశ్శబ్దం పగిలిపోయునా నాకెందుకులే అనుకొంటాం
మాదాకా వచ్చినప్పుడే వేడి వేడి నిట్టూర్పులు విడుస్తూవుంటాం


గాలికి వీలయునప్పుడు వచ్చి ముక్కుపుఠాలను మందలించినప్పుడు
పొరుగింట్లో జరిగిన ఘోరం విని పరుగెత్తుతూ వుంటాం

గేటు మూయండీ అని గద్దించే లిఫ్ట్ మాటలు
కార్ల పార్కింగ్ మద్యలో పసిపిల్లల ఆటలు మము పలకరించే నేస్తాలు

హొటల్ గదుల్లో అథిధుల్లా విడి విడి గా వ్యవహరిస్తుంటాం
ఒకే ఇంట్లొ వున్నా పాయలుగా చీలి ప్రవహిస్తుంటాం.

*18-08-2012

ఎవరైనా అడిగితే - srikanth


ఎవరు అని ఎవరైనా అడిగితే ముమ్మాటికీ ఇద్దరమనే చెప్పు

నిప్పు పూలతో జలదరించే శరీరాలమనే చెప్పు
ప్రేమతో నిండిన మహా పాపాత్ములమనే చెప్పు
కరుణ నిండిన మహా కటినాత్ములమనే చెప్పు

ఎరుకతో తూలుతున్న మహామధుపాన
మృత్యు ప్రియులమనే చెప్పు - ఈ విగ్రహ
లోకాలనూ నిగ్రహ జనాలనూ వెక్కిరించే
పిచ్చివాళ్ళమనే చెప్పు. నేరం చేయని నేరస్థులమనీ

అకారణంగా నవ్వే పిల్లలమనీ నీ స్మృతలమనీ
దేహాల ద్రిమ్మరులమనీ, దేశం లేని వాళ్ళమనీ
దేహాలు లేని వాళ్ళమనీ
సౌందర్య బిక్షుకులమనీ
బాహువులు చాచి తిరిగే నేల బాటసారులమనీ

ఆదిమ జంతువులమనీ యిద్దరుగా కనిపించే
ఆ ఒక్కరమనే చెప్పు: మరేం లేదు ఇంతకంటే

వీచే నీడలో వాలే ఆ గడ్డిరెమ్మ కంటే
పూచే పూవు కంటే రాలే వాన కంటే
నిండైన రాత్రి కంటే ఆ కళ్ళలో నిలిచిన మెత్తటి నీళ్ళ కంటే
కొమ్మల్లోని గూళ్ళ కంటే ప్రమిదె వెలుతురు చుట్టూ తిరిగే

క్షణకాలంలో ధగ్ధమయ్యే ఆ పురుగు కంటే
ఈ నీ నా జీవితం గొప్పదేమీ కాదు.సరే సరే

నువ్వంటే నాకిష్టం అని చెప్పడానికి
ఇంతకంటే మరేం కావాలి? నాకూ నీకూ?

*18-08-2012

శ్రీకాంతో ఆలూరు ‎'' అమరత్వం పొందిన కాలం ''


మన సాంగత్యం వల్ల
నాలో అమరత్వం పొందిన
పిడికెడు కాలం
నా అంతరాంతరాలలో
ఇంకా కదలాడుతూనే ఉంది
నీ నిష్క్రమణం
చేసిన గాయాలు
బండ రాళ్ళ కొండంటి
నా మనుసులో
మోదుగ పూలల్లే
వికసిస్తూనే ఉన్నాయ్

ఇప్పుడు..
నాలో మిగిలిందేమీ లేదు
ఎప్పుడైనా
ఆ పార్క్ కి వెళ్తే
మనం చివరిసారి కలిసినప్పుడు కూర్చున్న
ఆ బెంచ్ ని ఒక సారి చూడు
ఉరేసుకున్న నా హ్రుదయం
వేలాడుతూ కనిపిస్తుంది.

ఇప్పుడు నేను నేను కాదు
కేవలం నా నిర్జివ అవశేషాన్ని
వర్తమానపు వర్ణాలేవీ
గతం గురుతులని చెరపలేకపోతున్నయ్
నాలో జీవం నింపలేక పోతున్నయ్
అనుభూతించిన క్షణాలు మాత్రం
నాలో నిత్యం రగులుతూనే ఉన్నయ్
వాటిని పూర్తిగా ఆర్పలేక
నివురు దుప్పట్లు కప్పి
నిద్ర పుచ్చుతున్నా.

*18-08-2012

Mercy Margaret ll నాకెప్పుడూ తొందరే ll


నాకెప్పుడూ
తొందరే
సంతోషాన్ని పొందాలని చేసే
కష్టంలో
రాల్చాల్సిన
చివరి చెమట చుక్క
రాల్చాకుండా
ఎదురుచూపుల వెచ్చదనంలో
ఉత్సాహపు తడిని
ఆవిరి చేస్తూ

నాకెప్పుడూ
తొందరే
కలల్ని ఫొటో తీసి
నాకోసం
ఆల్బం చేసుకునే క్రమంలో
కనురెప్పల
పరదాన్ని
తలుపు తడుతున్న సూర్యుని
నిరుత్సాహ పరచొద్దని
త్వరపడి ఘడియ తీస్తూ
కలల్ని చెదరగొట్టేస్తూ

నాకెప్పుడూ
తొందరే
రేపటి అబద్దాన్ని
ఈరోజు నిజంతో పోలుస్తూ
నిన్నటి పద్దుల్లో
నన్ను నేను తీసేసుకుని
గతాన్ని జ్ఞాపకాల గుంజకి
కట్టి
భవిష్యత్తు దారుల్ని
ఇప్పట్నుంచి వెతుకుతూ
నన్ను నేను
నేటికి దూరం చేసుకుంటూ

నాకెప్పుడూ
తొందరే
బాల్యం నుంచి యవ్వనానికి
యవ్వనం నుంచి ముసలితనాన్ని
ఇప్పుడు బ్రతకాల్సిన
క్షణాలు చూడకుండా
జీవితం నుంచి కొనాల్సిన
వస్తువులు కాకుండా
నన్ను నేను వెచ్చించుకుని
నాకు కాని వాటినేవో కొంటూ
బ్రతుకు సంచి నింపుకుంటూ
అందులో
నన్ను నేను కొల్పోతున్నా .....

*18-08-2012

శ్రీకాంత్ // ఫిరోజ్ సీత //


చారలుగా చీకటిని వేళ్ళతో ముఖంపై రాసి వెళ్లావు నువ్వు-

అవి, ఆ చారలే నిప్పు గీతలై, దహించుకుపోయాయి కళ్ళూ
కమిలిపోయాయి పెదాలు, నుదురొక కాలిన కాగితమై
యిక కొట్టుకేపోయింది నింగికి మాడిన గాలి వాసనతో-

ఆ తరువాత ఈ దారిన వెడుతూ అంటారు జనాలు యిక

చక్కగా శింగారించుకుని నింపాదిగా కూర్చుని దిన
దిన విష పాత్రల వినోదాత్మక తంత్రీ
తంత్ర మంత్ర ప్రసారాలు చూసే నీతో-

'సాహిబా, వింతే చూసాము మేము దారిలో
మీరు తిరిగి వచ్చిన ఆ ఉద్యానవన కాంతిలో
సాహిబా, కనుబొమ్మలు లేని కబోధి ఒకడు
మట్టిని తవ్వుకుంటూ జాబిలికై ప్రార్ధించడం
విన్నాము మేము నిలువెత్తు ఆశ్చర్యంతో-'

చారలుగా మట్టిని తవ్వుకుని, వెన్నెల నీళ్లకై
ముఖాన్ని భూమిలో పాతుకుని, పాదాలతో
ఆకాశాన్ని ఒక అధ్భుతానికై, నీ కటాక్షానికై
ప్రార్ధించి వేచి చూసీ చూసీ ధరిత్రిలోకి నిరాశతో వెళ్ళేపోయిన

నా ఫిరోజ్ సీతను చూసారా మీరు ఎన్నడైనా
మీరు నిర్లక్ష్యంగా తిరిగి వచ్చే
ఈ నగరపు లోహపు దారిలో?

రాఖీ ||అభిమానము అస్వాదనమే||


తాజ్ మహల్ రాసిస్తే
బ్రతుకంతా కాపురముంటామా

రాకెట్ మన పరంచేస్తే
హాయిగా ప్రేయసితో షికార్లు కొడతామా

అందాల ఐశ్వర్యని వండుకొని తింటామా
యేసుదాసు గాత్రాన్ని నంజుకొంటామా

అభిమానం ఆస్వాదనమే
ఆస్వాదన అనుభూతి మయమే

ఇలయరాజా సంగీత రీతులు అభిమానం
యండమూరి రాత రీతులు అభిమానం
సచిన్ క్రికెటాట తీరు అభిమానం
సానియా బంతుల షాట్ తీరు అభిమానం

సినిమాల్లో నటిస్తున్నప్పుడే కమల్ హసన్ గొప్పదనం
పొరుగింటివాడైపోతే ఏమున్నది వినూత్నం

అభిమానం అంటే అంతే
మర్మమైన ప్రతిదీ వింతే

కలవనంత వరకు కలవరింతే
కలిసినంతనె చెప్పలేని గుబులంతే-చింతే

ఆకసాన ఉంటేనే చందమామ సొగసుదనం
అల్లంతలొ ఉన్నపుడే కొండలకా నునుపుదనం

పొరలు కప్పి ఉన్నప్పుడె ఉల్లి
విప్పుకొంటుపోతే అంతా ఖాళీ

కొన్ని అందకుంటేనే హాయి
కొన్ని దాచుకుంటేనే పదిలమోయి

*18-08-2012

మోహన్ రుషి // లేకపోతే ఏముందీ?! //


తల నెరిసిన మనిషి
తల్లి ప్రేమపై పద్యం చెప్పడం బావుంటుంది!

మోసపోయిన జీవితమే
నమ్మకాన్ని ఎజెండాగా ప్రకటించడం బావుంటుంది!

ముక్కలైన హృదయం
ప్రేమ వాకిట్లోనే ఆశగా మెరుస్తూండిపోవడం బావుంటుంది!

సుదీర్ఘ ప్రయాణమే కావచ్చు
సున్నా దగ్గర మెళ్ళీ మొదలుపెట్టాల్సివస్తే
"ఓస్...అంతేనా?" అనే ఆత్మవిశ్వసం బావుంటుంది!

అసంతృప్తి ఎంతున్నా, అపజయాలు ఎదురైనా...
కరుణ నిండిన కన్నుల్నీ,
చెమ్మగిల్లే మనసునీ
కాపాడుకుంటూ సాగడం
నిజంగా బావుంటుంది!

*18-08-2012

వంశీ // ఫేస్ లెస్ ఫేస్ //


ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్??
నాలాంటోడు
ఏడుపుకీ నవ్వుతూ,
గౌరవాన ముంచిన మాటల్తో,
భయం పూతేసిన చేష్టల్తో,
కుట్రకి కొత్తరంగులేస్తూ చరిస్తూ..
దెన్, దేర్ ఈజ్ నో ఇండెక్స్ ఫర్ మైండ్..

మరి మనిషాలోచన్ల
మూల క్రమ విన్యాసాల విపరీతాల గుట్టెలా..
నిజాలకు నాలుకలు మొలిచి
రహస్యాలు రీసైకిల్ బిన్లోంచి రీస్టోర్ అయేట్టు,
మనిషిని ప్రేమించినట్టు నమ్మించాలిక..

అసత్యమాడందెవరిక్కడ,
దేవుడున్నాడనీ,
ధర్మం పరిగెడుతుందనీ,
ప్లటోనిక్ ప్రణయాలనీ,
ముద్దు తీపనీ,
చావంటే భయం లేదనీ,
ఇంద్రియ నిగ్రహముందనీ..

కావాలని అమ్మాయిని తాకుతూ అమాయకపు మొహం,
తప్పు చేసి దొరికితే అయోమయపు మొహం,
చౌరస్తాలో అగమ్యపు మొహం,
చీకట్లో అరాచకపు మొహం,
తల కలిస్తే, కల స్ఖలిస్తే ఆనందపు మొహం,
నన్ను మించినోడ్ని చూసి అనుమానపు మొహం,

"హోమోసెపియన్ ఎంటర్ ప్రైజెస్,
ఎక్స్ చేంజ్ యువర్ ఓల్డ్ ఫేసెస్ విత్ న్యూ వన్స్..
కండీషన్స్ అప్ప్లై "
దేవుడికీ ఇన్ని రూపాలుండవటగా,
"అహం బ్రహ్మస్మి"

స్వ వచో విఘాతినై, స్వ ముఖ వినాశినై,
నాకు నేనెన్నోసార్లేస్కున్న I.P.C 302 Cr.P.C సాక్షిగా,
అసల్నా అసలు ముఖమేదో ?
ఫేస్ ఫౌండర్ ఉండాల్సింది
అంగారకుడి మీది పాత్ ఫౌండర్లా..

రవిగాడ్లేచాడే,
మోహాల్ని మొహాల మడతల్లో కప్పెట్టి,
కోరికల్ని కార్నియా కన్నాల్లో కుదించి,
మరో రోజులోకీదుతూ..

ఉపసంహారం :
ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ నీడ్,
మైండ్ ఈజ్ ది కాండక్ట్ ఆఫ్ ఫేస్,
పదండి తోసుకు
ముఖాలు మార్చుకు
విషాలు చిమ్ముకు
నిజాలు దాచుకు
పోదాం పోదాం రేపటికి....



*18-08-2012

శ్రీ || మనం జీవించే ఉంటాం.. ||


మనమెప్పుడూ సంఘర్షిస్తుంటాం...
కనపడని బానిస సంకెళ్లని
బద్దలు కొట్టడానికి,
తిరుగుబాటు కొలిమిలని రాజేసేందుకు
ఆలోచనలకి అగ్గి రాస్తుంటాం.

మనమెప్పుడూ నినదిస్తుంటాం.
మట్టి వాసన పీల్చే హక్కు కోసం.
శ్రమకి తగ్గ ఫలితం కోసం.
అసమానతలు లేని సమాజం కోసం.

అందుకే
మనం దోషులమవుతాం

దోపిడీని ప్రశ్నించినందుకూ..
ప్రజాస్వామ్యం ముసుగన్నందుకూ...
ప్రత్యామ్నాయం ఉందన్నందుకే,
మనం అంతర్గత భద్రతకి
పెనుముప్పుగా పరిణమించి
నిషేదానికి గురౌతుంటాం.
పదే పదే నేరగాళ్లమవుతుంటాం.
హత్యా నేరం మోపబడి
శిరస్సుపై రాజ్యం నజరానాలని మోసుకుంటూ,
నీడని కూడా నమ్మలేని నిస్సహాయతలోకి
మన ప్రమేయం లేకుండానే నెట్టివేయబడుతుంటాం.

కాబట్టే

మనం మరణిస్తుంటాం
స్వార్థం ఆకలితో సంభోగించి
నమ్మక ద్రోహాన్ని ప్రసవించినపుడూ,
ఆశ ఆశయాన్ని మానభంగం చేస్తే
కోవర్టులు పుట్టినపుడు
అబద్దపు ఎన్్కౌంటర్లలో మనం
అకస్మాత్తుగా నేల రాలుతుంటాం

కానీ అంతలోనే

మనం మళ్లీ పుట్టుకొస్తాం
నేల రాలిన విత్తనం
మొలకెత్తినంత స్వచ్చంగా
రాత్రిని హత్య చేసిన
అరుణమంత సహజంగా
మళ్లీ మళ్లీ పుట్టుకొస్తాం.
దేర్ ఫోర్
మనమెప్పుడూ జీవించే ఉంటాం
విప్లవం వర్దిల్లాలన్న నినాదంలో,
గోడపైనే కాదు.., గుండెల్లో సైతం
వెలుగుతున్న కాగడాలో,
మార్పుకై ఎదురు చూసే కళ్లల్లో
ఎగిరే ఎర్ర జెండాలమై
మనమెప్పుడూ బతికే ఉంటాం..

*18-08-2012

Translation~ Ro Hith / / When you come //



Afsar/ నువ్వొచ్చేటప్పుడు....!

ఎటు నించి ఎప్పుడొస్తావో
తెలీదు గాని
నువ్వొచ్చేటప్పుడు
కాసింత నిశ్శబ్దాన్ని పట్రా...

వొక నిరామయ నిరాలోచననీ పట్రా...

1

సతమతమయి వున్న గదిలో గాలినీ వెలుతురినీ నులిమేసిన ఇరుకు గోడల్లో లోపలంతా ఇంకిపోయిన ఎడారిలో

2

రాలినపూల వొంటి మీద వూరేగుతున్న శబ్దాల రెపరెపల్లో నిప్పు పూలు పూసిన కన్రెప్పల్లో కాయలై కాసిన చూపుల్లో

3

కలల్ని నిద్రపోనివ్వని కళ్ళల్లో నీడల్ని నెమరేసే నీళ్ళల్లో

4

ఎటు నించి ఎప్పుడొస్తావో కానీ,

నువ్వొచ్చేటప్పుడు

చింతాకంత నిశ్శబ్దం
ఎంతో కొంత మౌనం!

_________________________________________________

Translation~ Ro Hith/ When you come

Bring some silence
wherever you come from
and forget not
that perpetual thoughtlessness.

1

...from that desert
where everything had sunk
pulverizing air and light
between those congested walls
of a worrying room

2

...from the procession
of fluttering melody
over the body of tumbled petal,

from the fire-buds of longing in eye

3

...from eyes that never let
dreams to sleep

...from streams that ponder shadows

4

Wherever you come from
whenever...

forget not to bring
a tamarind leaf sized silence
and some quietness.

పెరుగు రామకృష్ణ // పసిడి విందు..//



నాకేమో
ఆకు పచ్చ ఆకాశంలో
వేలాడే బంగారు చంద్రుడి మల్లె వుంది
బంగినపల్లి మామిడి ..

పడమటి తోటల్లోంచి
రహస్యంగా కోసుకొచ్చి రుచి చూసిన
పుల్లటి జ్ఞాపకం..
తలుస్తూనే నోరూరిస్తూ
ఇప్పటికీ వెంటాడుతూనే వుంది..

జ్ఞాపకాల గడ్డిని పేర్చి
బంగారు నిధిని దాచి పెట్టినట్టు
నాన్న మాకందరికీ పంచిన మామిడి రుచి
నాన్న తోనే చడి లేకుండా సెలవు తీసుకుంది ..

ఎండాకాలం
మా ధాన్యపు గది
మామిడి అత్తరు పూసుకున్నట్లు
రసాలు,బేనీషా,మల్గూబా,దిల్ పసంద్
సువాసనలుగా
మా మీద వల విసిరేది..

వేసవి సెలవుల్లో
దిస మొలలతో
దిగుడు బావుల్లో ఈతతో అలిసాక
ప్రాణం నింపుకోడానికి
చెట్టునుంచి తాజా మామిడి పండ్లు
కోసుకు తిన్నప్పుడు
కొత్త రూపును తోడుక్కున్నట్లుండేది..

పిడికెడు సద్దెన్నం తో పాటు
మా తోట మాలి కుటుంబానికి
రాలిపడిన పండ్లు పంచి
అమ్మ చేసే పసిడి విందు
మాకు కను విందు చేసేది..

మరేమో ఇప్పుడీ
కార్బైడ్ రాక్షసి రాకతో
విస్తరించాల్సిన హృదయలన్నీ
ముడుచుకు పోయినట్లు
మమతలన్నీ ఒక్కసారి చెరసాల చేరినట్లు
మూగపోయిన మామిడి దరహాసం
మండీల్లోనే మగ్గిపోతుంది ..

నగరపు వీధుల్లో కార్బైడ్ పల్లకీలో
మెరుస్తున్న మామిడి బుట్టలు
ఇవాళ ఒక గతించిన జ్ఞాపకమే
చెదరిన ఒక తియ్యని స్వప్నమే..!!

*18-08-2012

వర్ణలేఖ || నీరింకిన బావి ||


పాడుబడ్డ బాయిల
దిగుతున్నట్టే ఉంది
అత్తగారింటికివోతుంటే
అండ్లకుదోలేదాక
మేమున్నమన్నరు
అన్నలందరు
దిగినంక ఇంగ
నీ బతుకునీదనిరి

ఎట్లీదాలోదెల్వక
కొట్టుకుంటుంటే
కప్పలర్వవట్టె
అవి నా సుట్టాలంట
సంసారం సంద్రమన్నరు
అదైతే ఈదుకుంటనన్నా
ఇంకోదిక్కుకువోదు
ఈడ ఊపిరాడక సస్తున్న

బాయన్న పేరేగానీ
నీరింకె ఇంకేముంది
నా ఆశలన్నీ
వలలవడ్డ
చేపలాయె

*18-08-2012

బాలు || మా మెదటి కలియిక ||


తను ఆ చివర
నేను ఈ చివర
తన మనసు ఇక్కడ
నా మనసు అక్కడ

గొంతులోనుంచి మాటలు బయటకు రావటం లేదు
గుండె తలుపుల మద్య ఇరుక్కు పోయినట్లుంది
చేతులు కొద్దిగా దైర్యం చేసాయి
తనను స్పర్సంచాలి అని ప్రయత్నిస్తునాయి

ఫిజిక్స్ లో చర్యకు ప్రతిచర్య అన్నట్లు
తన చేతులుకుడా వచ్చి కలిసాయి
ఒంట్లో కెమిస్ట్రీ మొదలుయింది
నరనరలో ఏవో రసాయనాలు రిలీజ్ అయిన్నాయి

బడి బోర్డ్ లాటి విశాలమైన తన వేపు మీద
నా వేళ్లు పీస్ అఫ్ చాక్ లాగా ఏవో కనపడని గీతలు గీస్తున్నాయి
రికార్డ్స్లాంటి విశాలమైన నా నుదుటి మీద
తన ఎర్రటి పెదవులు సంతకం చేసాయి

నాలుగు పెదవుల మద్య కెమిస్ట్రీ
వీడదీయరానీ బందాలు ఏర్పడాయి
అతి కష్టం మీద ఆబంధాలను విడిపించుకుంటే
గాడమైన అయస్కాంత కౌగిలి బందం ముడిపడింది

రెండు శరీరాల ఘర్షణ మద్య
ఉష్ణశక్తి వెలువడింది
శక్తినిత్యత్వ నియమం లాగా
శక్తి మార్పిడి జరుగుతుంది కాని
శక్తిన్ని కోల్పోవటం లేదు

ఈ ఫిజిక్స్ సిద్దాంతాలు, కెమిస్ట్రీ బందాలు
ప్రక్కన పెడితే, మా తనువులు
ఎన్ని సార్లు కలిసినా, మరొకసారి కలిసేలా
చేసింది మా మొదటి కలయిక.

*18-08-2012

పీచు శ్రీనివాస్ రెడ్డి - నిర్జీవమైన జననం


ఎన్ని కలలో
నన్ను నా హృదయంలా మలిచే మనిషి కోసం
ఫలించని కలలతో యుగాలనుండి
ఇంకా ప్రాప్తించని ఆ రోజు కోసం , నీ కోసం.
రోజూ పుడుతున్న కొత్త రోజు
కనీసం ఒక్క రోజు నా కోసం వస్తే చాలు
ఈ వికృత రూపానికి
అమృత ఘడియలను
వరంగా ఇచ్చే వారెవరో
యేవో కొన్ని కన్నులు చూసి పోతుంటాయి
యేవో కొన్ని అడుగులు తాకి పోతుంటాయి
నేను మాత్రం నన్ను నన్నుగా చూసే మనిషి కోసం.
ఫలించని కలలతో యుగాలనుండి. అంతేలే
శిల్పానికి తగని శిలా సౌందర్యం నాదైనపుడు
ఎవరు మాత్రం ఏం చేస్తారు
మరు జన్మకైనా
అదృష్టం చూడలేని స్థితిలో నేను
నిర్జీవమైన జననం నాది
శిలను కదా
నాది మరణం లేని జననం కదా!

*18-08-2012

క్రాంతి శ్రీనివాసరావు || గెలుపంతా ఆమెదే....! ||


నేను నేను గానే వున్నప్పుడు
ఆమె నాగా మారి

ఆమె ఆమె గానే వుండాలనుకొన్నప్పుడు
నన్నామెగా మార్చుతుంది

చీకటి వాకిలి దాటక ముందే
సూర్యుని రాకడ రాత్రికి రెడ్ సిగ్నల్ ద్వారా తెలపకముందే
నేనింకా నిద్రని కప్పుకొనే వున్నప్పుడు
యోగా చెయ్యమని రోజూ యాగీ చేస్తుంది

పెళ్ళయున కొత్తల్లో అమె కురుల్లో నే తురిమిన మల్లె లింకా మరచిపోనట్లుంది
తెల్ల పూల కుంపటిలా విచ్చుకున్న నులివెచ్చని శ్వాసల ఇడ్లీలను కొసరి కొసరి తినిపిస్తుంది
టీ కి ముందే మింగాల్సిన బీపీ బిళ్ళను గ్లాసెడునీళ్ళను పట్టుకు నిలబడుతుంది

మకుటం
క్షేత్రం
సైన్యం
ఎమీ లేకున్నా
మహా రాణీ నా కుందని
రోజూ దర్బారు నిర్వహిస్తూనే వుంటాను

వచ్చే పోయే వాళ్ళకు ఆఫీసు ఫైళ్ళకు పంచాయుతీ కొచ్చే పిర్యాదీ దారులకు
పూటకు పదిసార్లన్నా పొయ్యెలిగించి కప్పూ సాసర్ల సగీత కచేరీ చేస్తూనేవుంటుంది

ఎప్పుడు చేస్తుందో ఎమో వంటకాలతో నన్ను రోజు వండర్ చేస్తూనే వుంటుంది
మధ్యాహ్నం నిద్రకు చిటుక్కున నా గదిలో చీకటి వెలిగించి
ఇల్లంతా నిశ్సబ్దాన్ని పరిచి తప్పుకుంటుంది

నాలుగయ్యేసరికి నవ్వుతూ టీ కప్పుతో నడచి వస్తుంది
మొగాణ్ణి కదా నలుగురిలో తిరగాలని కాంక్రీట్ జంగిల్లో కాసేపు విహరించి

మనుషుల్ని మనసుల్ని వెతుక్కొని
రాజకీయాలు కాసేపు రుచి చూసి
అప్పుడప్పుడు మైకుల్లో నాలుగు మాటలు పోసి ఇంటికొచ్చేసరికి

ప్రేమాన్నం పళ్ళెంలో పెట్టి ,పక్కన కుర్చొని ,
మాపిల్లల సుద్దులు నుండి ఇస్త్రి పద్దుల దాకా
పెళ్ళిళ్ళు పెరంటాలు బంధువులు బాంధవ్యాలు
నంజుకు పెట్టి నన్ను అప్ డేట్ చేస్తూనేవుంటుంది
నిద్రించేసమయానికి నా దండ చెయ్యుపై తలాంచ్చి
మొహం గుండెల్లో దాచుకొని
నడుమ్మీద చెయ్యేసి
అణువణువుకు నీకొసం నే వున్నానని సందేశాన్ని పంచుతూనేవుంది

నా కోసం నా ఇంటికిపెట్టుకొన్న అయస్కాంతమై
గుండెల్లో ప్రేమ దీపం ముట్టించి
చెవులకు ధైర్యవచనాన్ని దట్టించి
తన జీవితాన్నంతా రంగరించి లేపనంగా నా శరీరామంతా అల్లుకొని
చల్లని దీవెనలిస్తూనే వుంది


.నే లక్ష్యాన్ని ఎప్పుడూ గెలుస్తూనే వున్నా
నా లక్ష్మి అనుక్షణం నన్ను గెలుస్తూనే వుంది.

*18-08-2012

కె క్యూబ్ వర్మ || ఆటోగ్రాఫ్... ||


వడిగా విడిపోతున్న వలయాల మధ్య
ఓ కిరణంలా దూసుకుపోతూ నువ్వు....

ఒక్కో సంకెలా తెగిపడుతున్న వేళ
ఓ గజ్జెల మోతలా తాండవిస్తూ నువ్వు....

రెప రెపలాడుతున్న జెండా గుడ్డలా
ఒకే రంగులో అలరిస్తూ నువ్వు....

రహస్యాలన్నీ ఉల్లిపొరలా వీడిపోతున్నప్పుడు
డప్పుల మోతలా మోగుతూ నువ్వు....

అచ్చెరభ శరభా అంటూ ఊరేగింపు సాగుతున్న వేళ
చంద్రప్రభలా ప్రభవిస్తూ నువ్వు....

యిన్ని దీపకాంతుల వరుసల మధ్యగా
ఓ తారాజువ్వలా మండుతూ వెలుగుజిమ్ముతూ నువ్వు.....

ఆశయాల అరచేతుల కలయికలో
గట్టిగా బిగించిన పిడికిలిలా నువ్వూ నేను.....

చివరి చిరునవ్వు సంతకంతో
నీవందించిన ఆటోగ్రాఫ్ చెరగని ముద్రతో నేనిలా....

*18-08-2012

పీచు శ్రీనివాస రెడ్డి || కరిగే అక్షరాల కావ్యం ||


కలలో కలగా
లీలగా కదలాడే సుందర దృశ్యాన్ని
ఏ చేతులతో నేను స్పృశించగలను
ఏ కన్నులతో నేను బంధించగలను

ఆవిష్కృతమైన దృశ్యాలు అదృశ్యం అవుతాయని
కను రెప్పలు కదలకుండా పడుకున్నాయి
విరిగి పోయే ఇటుకలతో పేర్చిన తరగని సంగతులెన్నో

అక్కడ గుస గుసలాడుతున్నాయి

మనోహర దృశ్యంలా
మధురమైన స్వరంలా
నిజాన్ని కవ్వించే అబద్దం , నిజంలాగే ఉంది
కన్నుల్లో దాగివున్న ఈ కావ్యాన్ని
ఆ స్వప్నం హిమాక్షరాలతో సంతకం చేసింది
చెదిరిపోయేది కాకున్నా , ఈ కల కరిగిపోయేదే కదా

*18-08-2012

వాసుదేవ్ ॥ మరిగంతే గామోసు! ॥

సూరీడు సచ్చిపోనాడో, ఇయ్యాల మరి
దాక్కుండీ పోనాడో మేగాలెనకాతల
ఏం సెప్పాడు కాదు వొర్సం గురించి
"వొత్తాదిలేవే, రాకెక్కడికి పోతాది
ఈ మడుసులకి బువ్విచ్చేది మనమే కదే
మరి ఈ వొర్సానికి మనం కావాలి
దానికీ మనం కావాలి యాడికి పోతాదిలే!"
ఆడు సిన్నప్పట్నుంచి అట్టాగే
ఆటికేసి సూత్తూనే ఉంటాడు

పొలానికీ నీళ్ళు కావాలే
ఆడికి మందులోకి కావాలే, ఊరుకుంటా
"అవునూ మావా మనకది కావాలే
కానీ దానికీ మనం కావాలంటావా, అదెలాగా?"
"అంటే ఎర్రిమొగమా, దాన్ని మెచ్చుకునేది మనం కదే?
సినుకు పెతీ గోళాన్నీ కౌగలించుకుంటానా
పెతీ సినుకునీ మగ్గెడతానా
గోలాల్లో దాస్తానా, పేమగా
అందులో నన్ను నేను సూసుకుంటాను గదే?
మది దానికి మాత్రం ఎవరున్నారే మనం తప్ప?"

"అవును, మావా! నిజమే
మనకే కాదు, దానికీ మనం కావాలె
నిన్నంతా అలా ఆకసంకేసి సూత్తనే ఉన్నా
ఒక్క సినుకైనా మీ మీద పడిపడితే
నన్ను లాక్కుంటావనుకున్నా..
ఉహూ.. సినుకూ రాలేదు, నువ్వూ ఊ లెయ్యలా!"

"వత్తాదే! రాకెక్కడికి పోతాదే
మనం నమ్ముకున్నాం కదే"
మరి మన సిన్నోడీనీ కూడా నమ్మే కదా మామా
పంపాం పట్నానికి..
పతీ సైకిలూ బెల్లుగంటా కేసి వొత్తాడేమోననీ సూత్తున్నా"
"వాడు, మనకొడుకైనా మనిసేనే,
వొర్సం, మన కడుపుసించకపోయినా
మడిసికాదే, అదో వరం
అది మోసం సెయ్యదు, మడుసుల్లాగా"

"ఏంటో ఈడూ మడిసే, ఈణ్ణే నమ్ముకున్నా
నాకేటన్యాయం సేసాడు?
నన్నొగ్గలేదే, మరి నా కొడుకేంటో
అమ్మన్నాడు కడుపారా, ఆడికెల్లినప్పటికాడనుంచి!"
"ఏమే వొత్తావా, మన కొడుకు రాడే
కానీ వొర్సం వొత్తాదే!"
"మరిగంతే గామోసు, ఏటి నమ్మాలో
ఏటి నమ్మకూడదో, ఈ జన్మకి ఆడొస్తేనే కానీ
తెనీదు, మరి గంతే గామోసు!"
18. ఆగస్ట్.12
(ఎప్పుడో ఇరవైఏళ్ళకిందటిమాట--మా లక్ష్మయ్య తన కొడుకుగురించి చెప్పి వాపోయేవాడు...ఇప్పుడు ఆ లక్ష్మయ్య లేడని తెలిసి ఇలా...అతని భాషలోనే. ఆవేదనలోనే)

*18-08-2012

ఉషారాణి కందాళ ॥ కాలం ॥


విషాదం మనిషిని లొంగదీసుకుంటుంది!
దు:ఖం గుండెల్లో కొండలా నిలబడుతుంది!
కన్నీళ్ళు అరచేతులకు లొంగవు!
నిట్టూర్పులు ఆరని సెగలవుతాయి!
ఆకలి, నిద్ర, నవ్వు మరిచిన వేళ
అలవిమాలిన నిదానంతో సాగుతుంది కాలం!
అస్సలు నడవదు, గడవదు! ఒట్టి మొండిదనిపిస్తుంది!
ఎప్పుడూ ఎదలో గూడు కట్టుకున్న విచారమే!
జారినవన్నీ జ్ఞాపకాలుగా ముసురుతుంటాయ్!
చెదిరిన బాంధవ్యాలు స్మృతులై అల్లుకుంటాయ్!
ఆశలు నిరాశ ముసుగేసుకుంటాయ్!
కోరికలు పెదవివిరుపులో ఒదిగిపోతాయ్!
ఎప్పుడూ తడి కళ్ళే దిగులును మోసే కావళ్ళై!
ఎప్పుడూ ఎండిన బీడంటి ఒంటరి భావమే!
నాకెవరున్నారు? నాకేమి మిగిలింది? నేనెందుకింక?
వేదన, వేదన ఒకటే వేదన! వెంటపడుతోంటుంది!
అన్నీ చూస్తూ కాలం అంతకన్న భారంగా కదులుతూంటుంది!
కానీ ఎంత గడసరి దొంగ అంటే మనతో, మన ప్రక్కనే,
నిత్యం ఉంటూ మనం కనిపెట్టలేని, కనబడని వేగం తో పరుగు పెడుతుంది!
జత సంధ్యల కోలాటం తో మనలను నిశ్శబ్దంగా నడిపిస్తూ,
మన కష్టాన్ని కప్పెట్టేస్తుంది!దు:ఖాన్ని మరిపిస్తుంది!
అందుకే నేస్తం! మనోవ్యధలకు కాలాన్ని మించిన మందు లేదంటారు!

*18-08-2012

రేణుక అయోల //My name Is kahan : //


రేణుక అయోల //My name Is kahan : // ___సినిమా కూడా ఒక ఆలొచన
\\ఒక ప్రశంస,ఒక అకాంక్ష\\

ఆ మనిషి మనిషి కోసం వేతుకుతుంటాడు
మనిషిలో పసితనం కోసం అన్వేషిస్తుంటాడు

ముఖమే మనిషికి ఋజువు
పసితనం సహజాతం
అది సహజాతంగా లేని మనిషి పనిముట్టుగా అవతరిస్తాడు
గొడ్డలిగా,తుపాకీగా,కొడవలిగా.
సర్పంలా సంచరిస్తూ ఉంటాడు.
”రిజ్వాన్ ఖాన్” కి ఇవేమి అవసరంలేదు
అతను పసితనంలో ఇమిడిపోయిన మనిషి
హాయిగ నవ్వుతాడు ,ఏడుస్తాడు ప్రేమిస్తాడు
సమాజాన్ని స్వేచ్చగా ప్రశ్నించగలుగుతాడు.

దేశంకాని దేశం,పుట్టిన ఊరు ఎక్కడైన మనుగడ కోసం
జీవించడానికి ప్రయత్నించిన ప్రతీసారీ
ఒక ప్రశ్న బులెట్లా వెన్నంటి వస్తూనే వుంది
విధ్వంసానికి ఒకే ఒక్క పేరు బలిఅవుతూ
అందరిని అడుగుతోంది?
నాపేరుని ఆయుధంగా ఎందుకు మార్చారని.

పేరు జన్మనిచ్చిన తల్లి పెట్టినది
మతంకూడా జన్మనిచ్చి గుర్తింపు ఇస్తుంది
మతం నాపేరుకాదు
మతం ఒక నియమం
మతం ఒక స్వాంతన.

మామూలు జీవీతం, అందరిలాంటి పేదరికం.
జీవితం గోడలు బద్దలు కొట్టీ
శిధిలాల మధ్యలోంచి పేరు చూసి శవమని వదిలేస్తేనే కదా
అడుగు అడుగునా ఘనీభవీంచిన మానవత్వంలోంచి
తడిని వెతుక్కుంటూ ప్రశ్నిస్తూ కనిపిస్తాడు ”రిజ్వాన్ ఖాన్"
నాపేరు ”రిజ్వాన్ ఖాన్”
విధ్వంస కారుడినికాదు అంటూ-
( మై నేమ్ ఇస్ ఖాన్) సినిమా చూసాకా.


*18-08-2012

నరేష్ కుమార్ //శుశ్క మస్తిష్కం//


ఎవరుంటారిపుడిక్కడ
ఎండిపోయిన
మస్తిష్కపు
పిచుక గూటిలో

ఓయ్...!
విప్లవకారుడా
ఓ ఉధ్యమాన్ని
వండు
అనుభూతులకొక
కాలనీ కట్టేందుకు
ఆకులకి కాస్త
పత్రహరితం
తినిపించేందుకు

రాలిపోయిన
మెదళ్ళని
మళ్ళీ
మొదళ్ళ కు
అంటుకట్టాలిప్పుడు...

నాకిప్పుడు
కొంచం
నిశ్శబ్దాన్ని తాగాలనుంది
బొట్టు బొట్టుగా
కారిపోయె
మౌనాన్ని
పెదాల్లోకి
వంపండెవరైనా.....

పగుళ్ళిచ్చిన ఆలోచనల పై
నడిచే
పాదాలిప్పుడు
గతపు
చెప్పులేస్కుంటున్నాయ్.....

దారినిండా
నన్ను నేను
పరుచుకొన్నా
వచ్చేయండి
వొంటి మీది కాంక్రీట్
ని చిరు నవ్వు
పెదాలతో
తుడిచేద్దాం....

*18-08-2012

అఫ్సర్ // వొక కొట్టివేత //

1

తీరం
సముద్రం కట్టుకునే గూడు
ఇసక రేణువులన్నీ ఏరీ ఏరుకుని.

2

వొక
సమయం రానే వస్తుంది,

నీ
తీరాన్నే కాదు
నీ సముద్రాన్ని కూడా
చెరిపేసుకోవాలి నువ్వు.

3
తప్పదు.

*18-08-2012

అవ్వారి నాగరాజు ‎|| పరిచయం ||


నీటి మీద కదలాడే అలలా
నుదిటిపై ఎప్పటిదో
ఇదిగో ఎవరో ఎవరో ఎవరో నడచి వచ్చిన జాడ

కను రెప్పల మీదకి
గాఢమైన భారంతో కలలా లిఖిస్తూ
వాళ్ళు వస్తారు
నువ్వు మరెవరికీ విప్పి చెప్పజాలని మాటలా

ఒకరిని ఇంకొకరికి పరిచయం చేయజాలని
పక్షుల బిలబిల శబ్ధం

నిద్రాంకితమైన కన్నుల
జేవురించిన నీ కూతురు నిన్ను హత్తుకొని పడుకోబోయే తుది నిముషం

నిన్ను అడుగుతుంది
మనుషులను
నీ ముందర నడచి పోయిన వాళ్ళను

సరళమైన వాళ్లను
గరుకువారిన అరచేతులలో ఘాటైన పుగాకు వాసనతో
విచ్చుకునే మోటు మాటలగాళ్ళను

చెప్పడానికి
కొన్ని పదాలు చేయి చాచి యాచిస్తున్నాను

ఎవరన్నా దయతో -

*18-08-2012

అనిల్ డాని // వీధి చివర //

వూరి చివర ఉత్తరం దిక్కున
వీధి దీపం కింద నిస్తేజంగా
గంటల్ని ,నిముషాలని ఆలోచనలతో
లెక్కిస్తూ ఉసూరంటూ నిల్చున్నా
నా నీడే నన్ను ప్రశ్నిస్తుంది ఈ పూట
నీ సంపాదన ఎంత అని
అంతరంగం ఆక్రోసిస్తుంది ఈ మత్తు జగత్తిలో
నీ స్థానం ఏమిటి అని

సమాజం చెక్కిన శిల్పం నేను
అవసరం వెతుక్కుంటూ వచ్చేవాళ్ల
అదృష్టం నేను
వేడి నిట్టుర్పుల మద్య కాలం
వెళ్ళదీస్తుంటాను

నాకంటూ లేని జీవితం
నావంటూ కాని కన్నీళ్ళు
నేనంటూ పెంచుకొని బంధాలు
మొండిగోడల్లా మిగిలే ప్రశ్నలు

ఊరి కళ్ళు మూతలుపడే వేళ మేల్కొంటా
అంగట్లో బొమ్మనై
పచ్చనోట్ల రెపరెపలు ,కనుసైగలు
కౌగిలింతలు ,పంటి గాట్లు ,చెంపదెబ్బలు
రోజుకో అనుభవం నా పనికి ఆహార పధకం లో

ఒక కోరిక రాక్షసత్వం
ఒకకోరిక తాగిన మైకం
ఒక కోరిక మద దాహం
ఒక కోరిక అన్నికోల్పోయిన నిస్తేజం
ఒక కోరిక అనుభవం కోసం ఆరాటం
ఆ క్షణం లో నేనో బొమ్మ
నేనే ప్రేయసి ,నేనే తల్లి ,నేనే తండ్రి
నేనే భూదేవి నేనే శ్రీదేవి

నేను పుండై మరొకరికి పండై
తనువుని తమలపాకుని చేసి
విటులకోరిక పండిస్తున్నాను
ఎందఱో మహా ఇల్లాళ్ళ శాపం
నాకు తగులుతుందని తెలుసు
ఆ శాపం నన్ను తాయారు చేసిన
సమాజం మీదకి బదలాయిస్తున్నా
రోగాలను మాత్రం మౌనంగా భరిస్తున్నా
భూమాతలాగా.


*18-08-2012

ఈడూరి శ్రీనివాస్ || వలపు - ఘజల్ ||


నీ వలపు మది తాకిన సమీరం లాగుంది
ఆ తలపు నను వీడని భ్రమరం లాగుంది

నీ చూపు తాకగానె శిలనైన నాకు
కన్ను కన్ను కలపడమే సమరం లాగుంది

ప్రేమ అనే పదానికి ఇంత పటిమ ఎక్కడిదో
ఆ ఊహే వేసవిలో శిశిరం లాగుంది

ఎంత కాదన్నా నీ వెంటే నడుస్తున్నా
నీ తీరే అసమ్మతి శిబిరం లాగుంది

ఇన్ని నెలల నిరీక్షణ ముగిసేనా తొందరలో
నీ వాలుచూపు ప్రేమాలయ శిఖరం లాగుంది

చెరిగిపోని ప్రణయాలు చరిత్రలో ఎన్నున్నా
ఈడూరీ, నీ కధ అమరం లాగుంది.

*18-08-2012

శ్రీకాంత్ కె || యిలా. ||

ఆకాశం నుంచి ఈ నేల దాకా
ఒక లేత వాన పరదా జారితే
యిక ఎందుకో నాకు ఎప్పుడో
నా తల్లి కట్టుకున్న చుక్కల చీరా నేను తల దాచుకున్న తన మల్లెపూల
నీటి యెదా గుర్తుకు వచ్చింది.

పమిట చాటున దాగి తాగిన పాలు
తన బొజ్జని హత్తుకుని పడుకున్న
ఆ ఇంద్రజాలపు దినాలు

రాత్రి కాంతితో మెరిసే
దవనం వాసన వేసే
చెమ్మగిల్లిన సూర్య నయనాల కాంతి కాలాలూ

గుర్తుకువచ్చాయి ఎందుకో, ఇప్పటికీ చీకట్లో
అమ్మా అంటూ తడుముకునే, ఎప్పటికీ
ఎదగలేని ఈ నా నలబై ఏళ్ల గరకు చేతులకు-

ఉండే ఉంటుంది తను ఇప్పటికీ - ఎక్కడో -
నన్ను తలుచుకుంటో ఏ
చింతచెట్ల నీడల కిందో ఓ
ఒంటరి గుమ్మం ముందో

కాన్సరొచ్చి కోసేసిన వక్షోజపు నుసి గాటుపై
ఓ చేయించుకుని నిమురుకుంటూ
తనలోనే తాను ఏదో గొణుక్కుంటూ

ఇన్ని మెతుకులు కాలేని ఆకాశాన్నీ
కాస్త దగ్గరగా రాలేని దూరాన్నీ ఎలా
అ/గర్భంలోకి అదిమి పట్టుకోవాలని
ఒక్కతే కన్నీళ్ళతో అనేకమై యోచిస్తో
వాన కానీ భూమీ కానీ మొక్క కానీ పూవు కానీ గూడు కానీ దీపం కానీ

అన్నీ అయ్యి ఏమీ కాక, ఒట్టి ప్రతీకలలోనే
మిగిలిపోయి రాలిపోయే లేగ దూడ లాంటి
మన అమ్మ

యిలా ఉందని
ఎలా చెప్పడం?

*18-08-2012

క్రాంతి శ్రీనివాసరావు || కరప్టెడ్ సాప్ట్ వేర్ ||

ఎన్ని జ్ఞాపకాలను డుస్ట్ బిన్ లోకి నెట్టేసినా
మనసు డెస్క్ టాప్ పై ప్రత్యక్షమవుతూనేవున్నాయు
జ్ఞాపకం కలిగించిన సంఘటనలు
కొత్త వైరస్ ఎదో మోసుకొచ్చినట్లున్నాయు
:మరపు: సాఫ్ట్ వేర్ పనిచెయ్యడం మానేసి నట్లుంది

కొన్ని జ్ఞాపకాలు
మనసు పొరల్లో గడ్డకట్టి
ట్యూమర్లుగా మారి
ఆలోచనా తరంగాలకు జామర్లు బిగిస్తున్నాయు

జ్ఞాపకాలు సుడిగుండాలలో
మళ్ళీ మళ్ళీ మునిగి లేస్తున్నాయు

చేస్తున్న ఉద్యొగం ఎప్పుడు చెయ్యు జారిపోతుందో
తెలియకుండా వున్నప్పుడు

షేర్ మార్కెట్ సైన్ కర్వు
ప్రతి రోజు కాటేస్తున్నప్పుడు

సైకో సాంబాలు తాటి పర్తి రామారావులు
మనుషులుగా మొలుస్తున్నప్పుడు

నీరారాడియాలు తారాచౌదరీలు
నాయకుల డైరీల్లో వెలుస్తున్నప్పుడు

పెట్రోలు ధర పెట్రోలై మండుతున్నప్పుడు
కన్నుల్లోని నీరంతా నిండుకొంటున్నప్పుడు

ట్రాఫిక్ పద్మవ్యుహంలో పడి
క్షణాల్ని చంపుకుతింటునప్పుడు

న్యాయం ధర నడిబజార్లొ నిర్ణయమవుతున్నప్పుడు
నాయకుల త్యాగం విలువను జెండాలు వొంపుకొని తాగుతున్నప్పుడు

రాజ్యాన్నేలే మంత్రుల్లో సగం మంది
జైలు వూచలు లెక్కించాల్సి వస్తున్నప్పుడు

తన ఆకాంక్ష రాజకీయ క్రీడగా మారి
నవ యువకులు బలి దానాలు చేస్తున్నపుడు

పసిబిడ్డలు చదువొదిలి పబ్బుల కెగబడుతున్నప్పుడు
విలువల వలువ లూడ్చి తెగబడుతున్నప్పుడు

కుటుంబాలు చీలి చీలి చివరికి కుటుంబమంటే
మొగుడూ పెళ్ళాలుగానే మిగులు తున్నప్పుదు

వయసుడిగి బ్రతికున్న కళేబరాలయ్యాక
మానవ కబేళాలు లేక వృద్దాశ్రమంలో చేర్చబడుతున్నప్పుడు

భవిశ్యత్ ఆశల సౌధం కళ్ళముందే తగలడుతున్నప్పుడు
జీవితం పట్ల వైరాగ్యం మొదలవుతున్నప్పుడు

నలిగిన హ్రుదయం తెగని జ్ఞాపకాల మద్య బిగుసుకు పోతున్నప్పుడు
వొరిసిన గాయం మెరిసిందిలా
సమతా కాంతులు విరిసేదెన్నడో
జ్ఞానఖడ్గాలు సిద్దంచెయ్యండిక
అనాగరికపు సమాజంపై యుద్దం మొదలెడదాం.


*18-08-2012