Thanks to Manasa garu for her commentary on presenting the concept కవితత్త్వాలు.. through her blog. http://ift.tt/1h9wJf4 కవితాసంకలనాలు / కవితత్వాలు "అసాధ్యమైన ఏకాంతం అంటూ ఏమీ లేదు. ప్రపంచ రహస్యాలను రూపకాలంకారాలతో తప్ప హేతువాదంతోనో, తర్కంతోనో విప్పి చూపలేము" - నోబుల్ స్వీకారోపన్యాసంలో నెరూడా చెప్పిన మాటలివి. కవిత్వం నా వరకూ చాలా ప్రశ్నలకు ఒప్పించగల సమాధానమైంది. దేవరహస్యాలను విప్పి చెప్పిన మహామంత్రమైంది. కనుక, ఆ రహస్తంత్రులు మీటే రసవిద్య నేర్చిన కవుల పట్ల కూడా సహజంగానే నాకు వల్లమాలిన ఆసక్తి, గౌరవం, ప్రేమ. ఓ ఐదారేళ్ళ క్రితం విజయవాడలో పుస్తక ప్రదర్శనకు వెళ్ళినప్పుడు, "కవితా దశాబ్ది" అనే పుస్తకం కంటబడింది. నూటయాభై కవితలు - సుమారు ఓ దశాబ్ద కాలంలో వచ్చిన వందల కవితలను వడబోసి ప్రచురించారు సంపాదకులు ఎస్వీ సత్యనారాయణ గారు, పెన్నా శివరామకృష్ణ గారు. ప్రతి కవితకూ చివర, మూణ్ణాలుగు వాక్యాల్లో ఆ కవి గురించి చిన్న పరిచయం కూడా జత చేశారు. ఆ చిరుపరిచయం ఆసక్తి రేకెత్తించిన మాట వాస్తవమే కానీ, సామాన్యంగా కవితా సంకలనాలు నన్నట్టే ఆకర్షించవు. ఒక్కో కవిదీ ఒక్కో కవిత - ఏం సరిపోతుంది? కవి తత్వం అర్థం కాదు, కవి గొంతు బలంగా వినపడ్డట్టు ఉండదు, కవి మనసుల్లో చొరబడి మాయ చేసినట్టుండదు. కేవలం పొగమంచులా కమ్ముకునే కొన్ని ఆలోచనలు మిగులుతాయంతే. అది నాకు నచ్చదు. కవిత్వాన్ని కాలక్షేపం బఠానీ అనుకోలేకపోవడమనే బలహీనతే కాదు, తారసపడ్డ ప్రతి కవీ షడ్రసోపేతమైన విందుభోజనం లాంటి అనుభవమే తన కవిత్వం ద్వారా మిగల్చాలన్న దురాశ కూడా కలదాన్ని. అయితే ఆ రోజు కథ వేరు - పుస్తకం ఆకర్షణీయంగా ఉంది, కవితలు దేనికవే నన్నట్టు ఉన్నాయి - తీసుకోవాలా వద్దా అని కొంత ఆలోచనలో పడ్డాను. సరే, నాణ్యమైన కవితలన్నీ మన కోసం ఎవరో ఎంపిక చేసి పెట్టారన్నసంతోషానిదే పై చేయి కావడం వల్ల, పుస్తకం నా చేతి సంచీలోకొచ్చి పడింది. అది మొదలుకుని ఎన్నో నెలల పాటు - విజయవాడ- హైదరాబాదు ప్రయాణాలన్నింటిలోనూ నాకదే తోడుగా ఉంది. చాలా సార్లు చదవడం వల్ల, కొన్ని కవితలు కంఠతా వచ్చేశాయి కూడా! ఇది జరిగిన చాలా నెలలకు, నేనా పుస్తకాన్ని దాదాపుగా మర్చిపోయిన రోజుల్లో, చాలా చిత్రంగా, ఓ సోషల్ మీడియాలో "ఆకాశం" కవి బి.వి.వి గారు నన్ను పలుకరించారు. ఆయన ఓ కవిగా, కేవలం అక్షరాల ద్వారా పరిచయం. బయట పెద్దగా ఎవ్వరితోనూ పరిచయాలు లేని రోజులవడం వల్లేమో, నేను హుషారు అణచుకోలేక, వెనువెంటనే బదులిచ్చాను - " 'నేనే ఈ క్షణం' అన్న కవితను వ్రాసింది మీరే కదూ..' గాలి బిగిసినట్టు లోపల ఏ కదలికా లేని క్షణం/ ఒక కోరిక చినుకులా రాలుతుంది /చినుకు లాగే కోరిక ఒంటరిగా రాదు/చినుకు చుట్టూ అనేక చినుకులు...' అంటూ సాగే ఆ కవితను ఒక సంకలనంలో చదివాను. అది మీరే కదూ?" అని ధృవపరుచుకోవడానికి అడగ్గానే, ఆయనిలా అన్నారు- " మన కవిత్వ మెవరు చదివారులే, అనుకొంటున్నపుడు అకస్మాత్తుగా ఎవరో మనం పాడిన పదాలను మన ముందుంచుతారు అపుడు అనిపిస్తుంది నిజంగా, నువ్వు ఈ లోకం లోకి రావటానికి అర్థం ఉందని.." అది మా మొదటి సంభాషణ. అటుపైన ఆకాశం గురించి తెలియడం, అది నా హృదయానికి ఎంతగానో దగ్గరగా అనిపించడం, చదివీ చదవగానే దానిపై నా స్పందన, గత ఏడు మరిది పెళ్ళి నిమిత్తం మా మావయ్యగారి ఇంటికి వెళ్ళినప్పుడు, వారిని కలవడం - - అన్నీ అనుకోకుండానే, పెద్ద ప్రణాళికలేవీ లేకుండానే జరిగిపోయాయి. ఇంత ప్రత్యేకమైన పరిచయానికి 'కొనాలా వద్దా' అని సందేహాడిన ఓ కవితా సంకలనం కారణమంటే అబ్బురంగా అనిపిస్తుంది. వర్తమానమే కాదు, భవిష్యత్తూ మన కోసం బంగరు కానుకలేవో దాచి ఉంచడమంటే ఇదే! కవిత్వంలో ఆధునికతకూ, సమకాలీనతకూ నావద్దన్నున్న నిర్వచనాలేవో చెదిరిపోతున్న రోజుల్లో, ఇజాలకు అతీతంగా, వర్గీకరణలకు లొంగకుండా కేవలం కవిత్వ కంఠ స్వరమే ప్రామాణికంగా వెలువడ్డ కవితా సంపుటుల పట్ల మళ్ళీ ఆసక్తి మొదలైంది. నలుగురు సాహిత్య మిత్రుల ద్వారా అటువంటి సంకలనాల్లో ముందు వరుసలో ఉండేది ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి సంపాదకత్వంలో 1999 లో వెలువడ్డ "యువ నుండి యువ దాకా" అని తెలుసుకుని దానిని సాధించాను. 1936 నుండీ 1996 వరకూ అరవయ్యేళ్ళ తెలుగు ప్రస్థానంలో 44 లబ్ధప్రతిష్టులైన కవుల రచనల్లో నుండి 73 మణిపూసలనెంచుకుని అల్లిన కవితాహారమిది. ఇందులో కవితలన్నీ ఒక ఎత్తు, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి వ్యాసమొక్కటీ ఒక ఎత్తు. కవిత్వాన్ని గురించి అలాంటి సుదీర్ఘమైన వ్యాసం చదవడం గొప్ప అనుభూతి. కేవలం ఈ వ్యాసాన్ని చదివేందుకు పుస్తకాన్ని కొనుక్కున్నా దోషం లేదనడం అతిశయోక్తి కాదు. గొప్ప కవిత్వమంటే ఏమిటీ అన్న ప్రశ్నకు - ఆయన చివరకిలా అంటారు - "తిలక్ చెప్పినట్టు అంతరాంతర జోతిస్సీమలని వెలిగించాలి. చలం చెప్పినట్టు- "వ్రాసేటప్పుడు మన శ్వాస ఇబ్బందిపడాలి. రక్తం పొంగాలి. బాధపడాలి, నలగాలి జీవిత రథచక్రాల క్రింద కలంలోంచి నెత్తురు ఒలకాలంటే అక్షరాలా? పాండిత్యమా? కాదు -- సంవత్సరాల మూగవేదన" బైరాగినీ- ఇస్మాయిల్‌నీ, మోహనప్రసాద్‌నీ- తిలక్ నీ, శ్రీశ్రీనీ శేషేంద్రనీ , సినారెనీ రేవతీదేవినీ వెంటవెంటనే చదువుతున్నప్పుడు కలిగే అనుభవాలను మాటల్లో పెట్టడం అంత తేలికేం కాదు. అవే భావాలు, మనకున్న అవే నాలుగు మాటలు. కానీ కవులు మారితే ఎంత తేడా! స్వీయ శైలి - సృజన జమిలిగా అల్లుకున్నకవుల కవితల్లో అనుభూతి వ్యక్తీకరణ ఎంత ప్రత్యేకంగా ఉంటుందో చదివి తీరాల్సిందే! ఇటీవలి కాలంలో కొత్త కోకిలలు గొంతు సవరించుకునేందుకు ఆసరాగా నిలబడే పచ్చని చెట్టుగా పేరొందిన " కవి సంగమం " బృంద సభ్యులు యశస్వి సతీష్ గారు కూడా ఇలాంటి ప్రయోగమొకటి చేశారు. ఇదే బృందంలో గొంతు విప్పి పల్లవులు పాడిన నూటయాభై మంది కవులను , వాళ్ళ కవిత్వాలనే ఉనికిగా మార్చి అంతర్జాలానికి ఆవల ఉన్న పుస్తక ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేశారు. "ఒక్క మాట" శీర్షికన వెలువడ్డ ఈ పుస్తకంలో కవిపరిచయంతో పాటు ,కవుల రచనల్లోని భాగాలను అర్థవంతంగా కలిపి కొత్త కవితనలల్లే ప్రయోగం కూడా చేశారు. ఇది ఆసక్తికరంగా ఉన్నా, కవి లోతులను మాత్రం తెలియజేయడం లేదు. సాధారణంగా ఇటువంటి సంకలనాల్లో పాఠకులకు దొరికేది మచ్చుకో మెతుకు. ఈ సంపుటిలో ఆ అవకాశం కూడా లేదు. కానైతే ఎన్నో కవితలను కలిపి, స్వతహాగా కవి అయిన 'యశస్వి ' గారు సృజనాత్మకంగా వ్రాసిన పంక్తులుంటాయి కనుక, ఆసక్తి కలిగించిన కవులను వెదికి పట్టుకుని మరిన్ని కవితలు చదువుకోవడమే పాఠకులకున్న అవకాశం. పైపెచ్చు ఇది కేవలం కవిత్వానికే పరిమితమైన పుస్తకం కాదు, వాళ్ళ కవిత్వం ద్వారా సంపాదకులకు పరిచయమైన కవి తత్వాన్ని కూడా ఆవిష్కరించే ప్రయత్నం. కవిత్వంలో కవి తత్వం అన్ని సందర్భాల్లోనూ బయటపడదు, మరీ ముఖ్యంగా, ఈ సంకలనంలో చోటు దక్కించుకున్న అనేకమంది కవులు కొత్తవాళ్ళు. ఇప్పుడిప్పుడే కవితావినీలాకాశంలోకి రెక్కలు విదుల్చుకుంటూ ఎగరజూస్తున్నవారు. వాసి సంగతి పక్కన పెడితే, రాసి తక్కువ. ఈ పరిమితుల దృష్ట్యా, సంకలనంలో అన్ని కవితలూ ఒకే రాగంలో సాగినట్టు అనిపించదు. ఇన్ని వైరుధ్యాలనీ, తేలికగా తోచే సంక్లిష్టమైన బాధ్యతనీ సంతోషంగా తలెకెత్తుకుని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు - ఈ కూర్పులోని నేర్పుకూ రచయితకు అభినందనలు. ఇది ఒక చక్కని కవుల డైరీగానూ, ఓ కాలానికి సంబంధించిన కవుల తత్వానికి ప్రతీకగానూ నిలబడి - మిత్రబృందంగా మారిన కవులందరికీ ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఓ జ్ఞాపకంగా నిలుస్తుంది. నేను వ్యాసం మొదట్లో చెప్పినట్టు, సమకాలీనులకంటే ఇలాంటి పుస్తకాలతో మున్ముందు ఇక్కడికి రాబోయే వారికే ఆసక్తి, అవసరమూ ఎక్కువగా ఉంటాయన్నది వ్యక్తిగత అభిప్రాయం. (ఆసక్తి కలవారి కోసం , యశస్వి సతీష్ గారి బ్లాగు http://ift.tt/1esoKVn ) శర్మ గారి మాటల్లోనే చెప్పాలంటే - కవిత్వమంటే- కాఫ్కా వాక్యం ఖలీల్ జిబ్రాన్ వచనం కృష్ణశాస్త్రి నిట్టూర్పు జాషువా ఆక్రోశం విశ్వనాథ గద్గద కంఠం శ్రీశ్రీ కేక ఇవే..ఇవే..ఇవే ప్రమాణాలుగా నిలబడ్డ మంచి కవితల సంకలనాలకు ఏనాడైనా తిరుగుండదుగా! అలాంటి కూర్పులను భద్రంగా రేపటి తరాల కోసం భద్రపరుచుకుందాం. on 20.2.2014
by Yasaswi Sateeshfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h9wJf4
Posted by
Katta