పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
R Damayanthi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
R Damayanthi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, సెప్టెంబర్ 2012, సోమవారం

ఆర్.దమయంతి ॥ స్పర్శించనీ...


యెద లయలో కదలిక
ఎవరిదో ఆ గీతిక.
మనసు అరలో దాచిన
మొగలి రేకు జ్ఞాపిక..
గుమ్మెత్తించే గుభాళింపుల వీచిక.

***

రెండు తీరాల మధ్య
నది పెదవి విప్పని దుఖం - ఒక ప్రవాహం!
రెండు హృదయాల కలి, వీడిన
మది సంద్రం - ఒక విషాదం

***
మనం
ఎప్పటికీ, ఒకరికొకరం
అర్థం కానివారం.
మనమిద్దరం ఒకటే అనుకుని, రెండుగా చీలిన తీరాలం.
కానీ, నిన్నూ నన్నూ తాకుతూ
వలపు నది ప్రవహిస్తునే వుంది.
ఒంటరి ఒడ్డుని స్పృ సి స్తూ..
కంటి రేవుల్ని దాటిపోతూ..అప్పుడప్పుడు..
గుండె తడుస్తూనే వుంది.

**
ప్రేమంటే-
ఓ నవ యవ్వని.
దానికి ఆకర్షణ ఎక్కువ.
హత్తుకునే గుణమూ ఎక్కువే.
ఐతే, శరీరాన్ని కాదు.
ఆత్మని.

***

గుండె ఫిడేల్ మీద లయ వాయిద్యం
ఏలమంటోంది విషాద సామ్రాజ్యం
ఆహా! బరువుగా వీస్తూ గాలి.
తేలికవుతూ నేనిక జాలీజాలీ

***
Date: 23.09.2012.

***

8, సెప్టెంబర్ 2012, శనివారం

ఆర్.దమయంతి // మల్లె పూవంత సంతకం! //


కవిత్వమంటే - కాదు..
చందోబధ్ధ రూపకం.
వ్యాకరణా సంబంధం
నిఘంటు పదాల సమీకరణం.

కవిత్వమంటే కాదు -
భాషా పరిజ్ఞాన కేం ద్రం.
భావ గాంభీర్యతా నిదర్శనం.
కలం బలనిరూపణం.

కవిత్వమంటే కాదు -
పరిజ్ఞాన పరిపుష్టం
శాస్త్ర విజ్ఞాన ప్రదర్శితం
డాంభిక ఘన ఉపన్యాసం.

నిజమైన కవిత్వం -
జనిస్తుంది.
జ్వలింప చేస్తుంది.

కవిత్వమంటే -
ఆవేదనా బడబాగ్నులు పగిలి ప్రవహించు
పొగల గక్కు నిప్పు సెగల నదులు.
పర్వతాల మీంచి దూకు
ఉధృత జలపాతాలు

కవిత్వమంటే -
రగిలిన యెదల పై చిలుకు
తొలి తొలకరి చినుకులు.
సిరి చందనాల పరిమళాలు.

కవిత్వమంటే -
కను కొలకుల వొలుకు మధురాశ్రువులు
మనసంతా జల్లుకు పోయే పన్నీటి జల్లులు.

కవిత్వమంటే -
ఒక మదిని చూపడం.
ఒక హృది ని కదిలించడం.
ఒక కరుణ చిలికించడం.
ఒక జడాన్ని చైతన్య పరచడం.
ఒక సరి కొత్త జగాన్ని సృష్టించడం.

కవిత్వం -
ఓ సముద్రం. నిశ్శబ్ద ఏకాంతం.
సమ భావనా స్వీకారం
సుజల హృదయ భాష్పం
సకల జనుల సమైక్యా రావం.

ఇక పై కావాలి కవిత్వం
ప్రతి గుండె మీద -
ఓ మల్లె పూవంత సంతకం.
**
date: 07.09.2012.

2, సెప్టెంబర్ 2012, ఆదివారం

ఆర్.దమయంతి || తెలుసుకున్న నిజాలు. ||


1. తేడా!
*
తప్పటడుగుల నడకే
పసితనాన అందం.
తప్పుటడుగులే ఐతే
జీవితానికే అంతం.
***

2. తెల్సుకుంటే ఇంతే!
*
ఇవాళ గడిచిందని ఆనందమేస్తుంది.
కానీ..
ఓ అడుగు - సమాధికి దగ్గరయ్యిందని తెలిస్తే
దుఖమేస్తుంది.
***

3. దృష్టి లోపం!
*

ఇతరులలో అన్నీ దోషాలే క ని పిస్తాయి.
ఎందుకో కానీ,
ఎంత తరచి చూసినా..
తనలో.. తనకొక్క దోషమూ కనిపించదు.
**
4. ఇది నిజం.!
*
ఆడవాళ్ళు మారితే తప్ప
ఆడవాళ్ళకి
సుఖం వుండదు.

- ఆర్.దమయంతి.

Date: 2.09.2012.

9, ఆగస్టు 2012, గురువారం

ఆర్.దమయంతి. || అతడొక గాయం ||

నీమీద రమ్మంటే వచ్చిందనా, వలపు
పొమ్మంటే తప్పుకు పోయేందుకు!


నీ సొగసొక సూదంటు రాయి
నా గుండెను గుట్టుగా చుట్టుకెళ్ళిపోయింది.

నువ్వెళ్ళిన వైపే నా చూపు పరుగందుకుంది
నిలవని దేహమూ ఆ వెనకే అడుగేయమంది.

నువ్ దూరమైన కొలదీ వేగమైన నడకలతో
దరి చేరాను సుమా, నీ వూరు!
గాలి అలల వీచు మేని పరిమళాలు
నీ పేరుని దాచాయి.
ఇక చాలు. వెనుదిరిగి - పొమ్మన్నాయి.

అయినా, చెలీ! ఆశ!
నిజం చెప్పు!
ఏ చీకటి రాత్రో ..
ఓ వెన్నెల వోలే
నా విషాద వీధిలోకి నాకై నడిచొస్తావ్. కదూ?!
గాయమైన గజలై, గుండె నిండుతావ్ కాదూ?

సఖీ!
నన్నా - నిమిషం కోసం ఆశ పడనీ..

యేరు వంపు తిరిగిన ఆ వంక
వసి పోని వెలుగు పూలు పెట్టుకుని
రాకుండునా నా నెలవంక?!

ఇచటనే..నన్నెదురుచూడనీ
నువ్వొస్తే అలనై
రాకుంటే శిలనై!

*08-08-2012

26, జులై 2012, గురువారం

ఆర్.దమయంతి. || గుండె కరగిన రాత్రి ||

రంగైన స్వప్నాలెందుకు నిదుర రాని కనులకు
రేయి లేని పవలెందుకు?
నా కనుల ముందుకు నువ్ రానపుడు!

యవ్వనాల పూలవాంఛ లెందుకు
విరులెత్తని నీ నవ్వులు కురవనప్పుడు?

పున్నమి వెన్నెల వీచికలెందుకు
నా గుట్టుపట్టు న చీకట్లు చుట్టిముట్టినపుడు

గొంతెత్తి పాడే కోయిల లెందుకు
గుండె దారులు ఎడారులై పోయినపుడు

అయినా,
'నువ్ లేని నేనెందుకు'?' - అని మాత్రం అను కోనులే..
నీ జ్ఞాపాకాలే నా ఊపిర్లయి నందుకు!

చెలీ!
నీ తలపుల నిట్టూర్పులలో నన్ను నిలువునా విలపించనీ ..
నీ కొరకు ఉలుకు కన్నీటిని నిరతమూ పానించనీ..

సఖీ!
విఫలమైన ప్రేమ కన్నా విందేముందనీ - వగపు హృదికి!?
మరపు రాని ప్రేయసి కన్నా భాగ్యమేదనీ- భగ్న ప్రేమికునికి?!
- నీకై నినదించనీ... .
ఈ తీపి గరళాన్నిక సేవించనీ!
నన్నిలా సదా నిషా విషాదాల మునిగి తేలనీ..

*26-07-2012