తెలుగు సాహిత్యంలో కొత్త కెరటాలు 14:09 - June 8, 2014 05:45 సాహితీ వేదికలు, సాహిత్య కార్యక్రమాలు పెద్దలకు, పెద్దలుగా ముద్రపడ్డ సాహితీవేత్తలకు, మరికొందరు స్వయంప్రకటిత మేధావులకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా సాధారణంగా మారింది. కానీ, అక్షరం కార్యక్రమానికి కిరీటాల మీద, బిరుదుల మీదా అదనపు గౌరవం ఎప్పుడూ లేదు. గుండెలోతుల్లోంచి వెల్లువలా పొంగుకొచ్చే భావాన్ని, నిజాయితీగా, బాధ్యతతో అక్షరీకరించే కలంకారులకు పట్టంగడుతూ వచ్చింది. ఈ వారం నుంచి కొత్త కెరటాలు విభాగంలో ఈ మధ్య కాలంలో ఉధృతంగా రాస్తూ, తెలుగు సాహిత్యానికి కొత్త వెలుగులు అందిస్తున్న కవులు, కథకుల పరిచయాలు అందించబోతున్నాం. ఈ వారం జీరో డిగ్రీ కవితా సంకలనంతో గుర్తింపు తెచ్చుకున్న మోహన్ రుషి పరిచయాన్ని చూద్దాం.. నిత్యనూతనం.. మోహన్ రుషి కలం.. గత కొన్నేళ్లుగా ఎన్నో తాజా కలాలు తెలుగు సాహిత్యానికి కొత్త ఊపిరులందిస్తున్నాయి. అటు కవిత్వం, ఇటు కథల్లో తమ ప్రతిభను చాటుతూ తెలుగు సాహిత్యానికి నిత్య యవ్వనాన్ని ప్రసాదిస్తున్నారు. అలాంటి నిత్యనూతన కలాల్లో ఒకరు మోహన్ రుషి. కొన్నేళ్లుగా బలమైన కవిత్వాన్ని రాస్తున్న కవి. అంతర్ బహిర్ యుద్ధారావంలో అంతర్లోకాలకు ప్రాధాన్యత ఇచ్చి రాస్తున్న కవి. ఈ మధ్యే తన తొలి కవితా సంకలనం జీరో డిగ్రీ వెలువరించారు. ఇరవై ఏళ్ల క్రితమే రాయటం మెదలు పెట్టినా, ఈ మధ్య కాలంలో సీరియస్ గా రాస్తున్నారు.. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన మోహన్ రుషి, హైదరాబాద్ లో కంటెంట్ రైటర్ గా ఓ ఎడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేస్తున్నారు. నగర జీవితంలోని డొల్లతనాన్ని, బిజీలైఫ్ పరుగుల వెనుక ఉన్న నిశ్శబ్దపు దు:ఖాన్ని, మనిషిజీవితంలోని, సమాజపు విలువల్లోని, అనుబంధాల పైమెరుగుల్లోని డొల్లతనాన్ని తన కవితల్లో సూటిగా ప్రకటించారు, ప్రశ్నించారు... మోహన్ రుషి. ''వొదిలేసేవాళ్లు చేసిన మేలు మనతో ఉన్న వాళ్లూ చేయరు; ధన్యవాదాలు. దృష్టిని విశాలమూ, నిశితమూ చేసినందుకు. జీవనయానంలో మరో మార్గదర్శనానికి కారణమైనందుకు. ఇంకోసారి పుట్టించినందుకూ.. ఇక నగ్నంగా నడక మొదలు. మరొకరువొదిలేసేవాళ్లు మనల్ని వొదలకుండా పట్టుకునేంత వరకూ, లేదా మనల్ని మనమే వొదిలేసి కదిలిపోయేవరకూ!'' శూన్యం తప్ప... అంటూ నగర జీవితాన్ని నిక్కచ్చి వ్యాఖ్యానం.. ఇలాంటి మరెన్నో వ్యక్తీకరణలు మోహన్ రుషి జీరోడిగ్రీలో చూడొచ్చు. గుండెలోతుల్లోంచి తెరలు తెరలుగా పొంగుకొచ్చే దు:ఖాన్ని, సునామీలా ముంచెత్తే విషాద సంద్రాన్ని మోహన్ రుషి కవిత్వంలో చూడొచ్చు. జీరోడిగ్రీలో కవి దు:ఖం వ్యక్తిగతం కాదు. అది సామాజికం, సాంస్కృతికం కూడా. అయితే, పబ్లిక్, ప్రైవేట్ ప్రపంచాల మధ్య అడ్డుతెర చిరిగిపోయిన సందర్భాన్ని పసిగట్టగలగడమే ముందుతరం కవులకు, మోహన్ రుషి కవిత్వానికి ఉన్న తేడా. మోహన్ రుషి కలం నుంచి మరింత చిక్కటి కవిత్వం రావాలని ఆశిద్దాం... సాహితీ సృజనలో ఎంత ప్రతిభ చూపినా గుర్తింపు రాని వారెంతమందో ఉంటున్నారు. అనామకంగా మిగిలిపోతున్నారు. ఇప్పుడు కొత్తగా రాస్తున్న రచయితలెందరో ప్రోత్సాహం లేక, ఫేస్ బుక్ లాంటి సోషల్ సైట్స్ కో, లేక, బ్లాగ్ లకో పరిమితమవుతున్నారు. అలాంటి వారిలో ప్రతిభావంతంగా, ప్రభావాత్మకంగా రాస్తున్న వారిని టెన్ టివి పరిచయం చేయబోతోంది. ఈ వారం జీరో డిగ్రీ కవితా సంకలతనంతో గుర్తింపు తెచ్చుకున్న మోహన్ రుషి పరిచయాన్ని చూద్దాం. http://ift.tt/1oBQgIS
by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oBQgIS
Posted by
Katta