పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Jugash Vili లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Jugash Vili లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, ఆగస్టు 2012, శనివారం

జుగాష్ విలి || మాకు మా ఊరే కావాలి ||

ఎక్కడ మా శిరస్సులు నేలరాలాయో
అక్కడే మా తలలు తలలెగరేయాలి

ఎక్కడ మా నెత్తురు ఏ మట్టిలో యింకిందో
అక్కడే మా జీవితాలు పుష్పించి పరిమళిoచాలి

ఎక్కడ మా కనుగుడ్లు పెకిలించబడ్డాయో
అక్కడే మా క్రొన్నెత్తుటి క్రోధం పొటెత్తాలి

మా ఆత్మగౌరవాన్ని పరిహసించేవి ఏవీ
మాకు సుఖాలనూ ఆనందాలనూ యివ్వలేవు

మేం ఓడిపోయి మా ఊరు విడిచి
ఎక్కడికో వలసవాసులుగా పోలేం
కాలనీ కంచెల మధ్య పరాయి కాలేం

మా భూములకు మా బతుకులకు సోకిన
కులాధీనా వర్గ పురుగుల్ని హతమార్చే
క్రిమి సంహారక మందు ఏదో యిప్పుడు అన్వేషించాలి

క్రూర మృగాలు లేని చోటులేదు
వాటిని వేటాడే పరికరాలు ఏవో మాకు కావాలి
మాకు మా ఊరే కావాలి

* * *

ప్రభుత్వామోదిత పరిధి దాటని ఉద్యమాలొకవైపు
పెకిలించి పెనుకంపన పుట్టించాలానే ఉద్యమాలొకవైపు

ఇప్పుడు
నేను
ఈ సందిగ్ధ ఉద్రిక్త చౌరస్తాలో నిలబడి
ఈ మాటలు మాట్లాడుతున్నాను
నిన్నటి క్రూర విషాద వాంగ్మూలాన్ని
నేటి ఆచరణాత్మక సాదృశ్యాన్ని
నేను
లక్షింపేటను మాట్లాడుతున్నాను.


*11-08-2012

9, ఆగస్టు 2012, గురువారం

జుగాష్ విలి || పాతబడని కధ ||

ఆకాశం మట్టి నుంచి
తొలి కిరణం మొలకెత్తింది
కుట్ర మొదలైందన్నాడు

మిట్ట మధ్యాహ్నమైంది
నిప్పుల వర్షం కురుస్తోంది
ఆకాశం సాయుధమైందన్నాడు

సూర్యుని మీద ఉమ్మేసాడు
ముఖాన పిడుగై కురిసింది
శాంతి భద్రతల సమస్యన్నాడు

చిగురు టాకుల నెలవంక
గాయమై నేలకూలింది
ఆత్మరక్షణ ప్రయత్నమన్నాడు

"విన్నావా! బిడ్డా!
నలభై ఏళ్ళుగా యిదే కధ
జనం విసుగులేకుండా 'ఊ' కొడుతున్నారు
వేలెడంత లేవు నువ్వు
నీకేమో రోజుకో కొత్త కధకావాలి" అన్నది
తల్లిపిట్ట పిల్ల పిట్టతో
నల్లమల అడవిలో
నల్లమద్ది చెట్టుమీద.
-
-*07-08-2012

8, ఆగస్టు 2012, బుధవారం

జుగాష్ విలి || ఎవరి నిర్వచనాలు వారివి ||

ప్రేమే జీవితంగా బతికే వారెప్పటికీ ఓడిపోరు
మహా అయితే తరచుగా గాయపడుతుంటారు
బహు తక్కువగా సుఖపడుతుంటారు

వారికి జయాప జయాలు అనిమిత్తం
వారి లాభనష్టాల నిర్వచనంవేరు

ప్రేమను తప్ప
మిగతా అన్నిటినీ ప్రేమించేవాళ్ళు
మహా అయితే ఎక్కువగా సుఖపడుతుంటారు
బహు తక్కువగా ఆనందపడుతుంటారు
ఎప్పటికప్పుడు లాభనష్టాల పట్టిక తయారు చేస్తుంటారు
వీళ్ళ జయాపజయాల నిర్వచనం వేరు

ప్రేమను కొలవడానికి ప్రేమతప్ప
ఏవేవో కొలబద్దలన్నీ అనేకం వుంటాయి వీళ్ళదగ్గర
ప్రేమ లేదనీ, దొరకలేదనీ, అంతామోసమనీ
అన్నీ వేళలా నిందిస్తుంటారు...చింతిస్తుంటారు
కొందరిపట్ల, కొన్నిటిపట్ల
హృదయాలను
వాటర్ ప్రూఫ్ వాచీలల్లే చేసుకుంటారు వీళ్ళకి వీళ్ళే

ఆనందంలో కంటే
సౌకర్యంలోనే హాయిని పొందుతారు
ఓటమిని గెలుపుగా బతికేస్తుంటారు
వీళ్ళ సుఖసంతోషాల నిర్వచనమే వేరు ...వేరు...
*07-08-2012

జుగాష్ విలీ || పాతబడని కధ ||

ఆకాశం మట్టి నుంచి
తొలి కిరణం మొలకెత్తింది
కుట్ర మొదలైందన్నాడు

మిట్ట మధ్యాహ్నమైంది
నిప్పుల వర్షం కురుస్తోంది
ఆకాశం సాయుధమైందన్నాడు

సూర్యుని మీద ఉమ్మేసాడు
ముఖాన పిడుగై కురిసింది
శాంతి భద్రతల సమస్యన్నాడు

చిగురు టాకుల నెలవంక
గాయమై నేలకూలింది
ఆత్మరక్షణ ప్రయత్నమన్నాడు

"విన్నావా! బిడ్డా!
నలభై ఏళ్ళుగా యిదే కధ
జనం విసుగులేకుండా 'ఊ' కొడుతున్నారు
వేలెడంత లేవు నువ్వు
నీకేమో రోజుకో కొత్త కధకావాలి" అన్నది
తల్లిపిట్ట పిల్ల పిట్టతో
నల్లమల అడవిలో
నల్లమద్ది చెట్టుమీద.

*07-08-2012

27, జులై 2012, శుక్రవారం

జుగాష్ విలి || అద్వైతం ||

అనేకానేక దుఖాలకు
అలవాటుపడినవాడిని
ఒకే ప్రేమతో సరిపుచ్చుకోలేను

బహుప్రేమల్ని స్పృశించాను
దుఖాన్ని ఇవ్వని ప్రేమను
అసంపూర్ణంగా భావించాను

దుఖమంటే మరేమీ కాదని
ఎడతెగని సుఖమని తెలుసుకున్నాను.
*26-07-2012

జుగాష్ విలి || ఆమె కనిపించింది ||


ఆమె కనిపించింది
ఒకానొక పురాతన సమయంలో
నేను మోహించిన ఆమె
నన్ను ఇష్టపడిన ఆమె

నాలుగు దశాబ్దాల కిందట
యవ్వన ప్రాంగణం తలుపుతట్టిన నన్ను
తలుపుతీసి స్వాగతించిన ఆమె
మళ్ళీ ఇన్నాళ్ళకు
ఇక్కడ ఇప్పుడు కనిపించింది

కాలం సానపెట్టిన
సౌందర్యపు మెరుపుతో
సుడిగాలిలా గట్టిగా చుట్టేసుకున్నది ఆమె
నన్ను ఇప్పుడు ఇక్కడ

జుట్టు వెనక్కిజారి విశాలమైన
నా ముడుతల నుదిటికి
ఒక సుదీర్ఘ చుంబనాన్ని కానుకగా ఇచ్చినది ఆమె

కాలం కనుమరుగు చేయలేని కరుణ
కళ్ళనిండా నింపుకొని ఆమె
నా కళ్ళలో తన చూపును నిలిపినప్పుడు
ఇక్కడ ఇప్పుడు కూడా
అపరాధ భావన ఆవరించి... అవధరించి...
నాకళ్ళు తడబాటుతో తలదించుకున్నాయి

ఇన్నాళ్ళ విరామం తరువాత
కాదు
ఎడబాటు తరువాత
నాలుగు పదుల కాలాంతరమున కూడా
నను గుర్తుపెట్టుకున్నది ఆమె
తన ఆత్మతోను... దేహంతోను...
*26-07-2012