పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, సెప్టెంబర్ 2012, గురువారం

కిరణ్ గాలి ||ఏడడుగులు||

నేను ప్రొద్దునె నిద్దుర లేస్తానా
నీ కన్నుల కాంతి నా నిర్జీవ దేహాన్ని ప్రేమగ తడిమి లేపుతుంది

నేను తొలిమంచులో నడుస్తుంటానా

నీ మృదువైన మాటొకటి బొటనవేలుకు తగిలి గాయమైచిట్లుతుంది

నేను మొక్కలకు నీళ్ళు పొస్తుంటానా

నీ చిరునవ్వొకటి చిగురుటాకులా రాలిపడి కనిపిస్తుంది

నేను ఆలొచనగా అద్దం ముందుంటానా

నీ మెత్తటి స్పర్శొకటి నాజుకుగా చెంపను చీరుస్తుంది

నేను ఏదో బాధను తింటుంటానా

నీ మునివేళ్ళు గొంతుకడ్డంపడి పొలమారుతుంది

నేను ఎడతెరగక ప్రయాణిస్తుంటానా

నీతొ గడిపిన జ్ఞాపకాలన్ని కిటికివారగా దూరమవుతుంటాయి

నేను అలుపెరగక పనిచేస్తుంటానా

నీతో నాప్రతికలయిక కలతనిద్రై మెళకువంతా నన్ను కలవరపెడుతుంది

నేను నిశ్చల తమస్సులో వుంటానా

నీ ఊహ నా నీరవ తపొవనాన్ని ఉద్దీపనం చేస్తుంది


నేను ప్రతిరోజు జీవిస్తుంటానా

నీ అకాల నిష్క్రమణ నన్ను అనుక్షణం అంధకారమై వ్యాపిస్తుంది


నేను ప్రతిరాత్రి మరణిస్తుంటానా

నిన్ను మృత్యువు మరపిస్తుందెమోనన్న భయం నన్నుమళ్ళీ బ్రతికిస్తునే వుంటుంది


ప్రియా,

నువ్వు విడిచి వెళ్ళిన లోకంలో నేను నడిచే ప్రతి అడుగు
ఆరడుగులైన మన బంధాన్ని ఏడడుగులుగా ఒంటరిగా నడిపిస్తునే వుంది

Date:06.09.2012

భాస్స్కర్ II బాబ్ II

పాటంటే గుండె నాదం
గడ్డకట్టుకు పోయిన
మట్టితనపు హృదయపు మంచు మీద
కురిసే సిరి వెన్నెల
ఆ గానం ..విరిసే పూల గుబాళింపు సౌరభం
కోట్లాది ప్రజల గొంతుకకు ప్రాణపదం
తరతరాలనుండి కొనసాగుతున్న
బరితెగించిన దొపీడీని..దౌర్జన్యాలపై
ఎక్కుపెట్టిన బాణం ..సంధించిన అస్త్రం
జీవితపు రక్కసిని ..తన గానంతో
నిలదీసిన మహోన్నతహమైన ప్రజా
వాగ్గేయకారుడు ..బాబ్ మార్లే
చీకట్లో తచ్చట్లాడుతున్న చోట
వెలుగై వాలిపోతాడు ..మనతో పాటే
గాత్రమై అల్లుకు పోతాడు
లోకాన్ని చుట్టుముడతాడు
05 . 09 .2012

"నీ" ||సెప్టెంబర్-5,జీవితం"||

"ఒక మాట
పదే పదే అదే పనిగా
వెంటాడుతోంది

కొంతసేపటికి

వంతెనను దాటే లోపే..
నేనొక మౌన మహా సముద్రమయి
మీరు నేర్పిన భాషలోని
ఏ "ఒక్క మాటనూ" నా గొంతు
పెకిలించనంటోంది..!!

మీ ఊహాల్ని నా మౌనం ధ్వంసం చేస్తూ

కన్న కలల్ని సమూలంగా కూలుస్తుంది..!!

ఏమైందన్న ..ప్రశ్నను

నా తాడిగొంతు
సమాధాన పరచలేని క్షణంలో..
మీరిక వాస్తవాన్ని అంచనావేసి....

"విఫలమైన ప్రయోగం ముందు నిలబడ్డ

శాస్త్రజ్ఞుడి లా నా బాధను మీ గొంతులోకొంపుకుని
అక్షరాల్ని దిద్దించినమీకు జీవితాన్ని దిద్దే శక్తి లేదన్న
ఆలోచనలో పడిపోవచ్చు..!!

నేనిక్కడే


శిధిలమైన రాత్రిలో ఫిడేలు వాయిస్తూ

వొంటరి ప్రవాహంలో గల్లంతావ్వొచ్చు!

నా మరణం ఒక వార్తయి మీ ముంగిట్లో ఎక్కిళ్ళు పెట్టొచ్చు......!

 
05-09-2012

కవిత్వం కావాలి కవిత్వం || కట్టా శ్రీనివాస్ ||

1
ఒక్కక్షణం కంటికి జిగేల్మనేలా
అలంకరించుకుంది తను.
తనకింత శోభనిస్తోంది శబ్దమా,
అలంకారప్రాయమైనది అర్దమా,
ఏదేమైనా కానివ్వండి
తనకెదో అలంకారముండవచ్చుగాక
తనే అలంకారమైతే కాదు.

2

తనోసారి అనుభూతికి పరవశించి గాలిలో తేలియాడింది.
తనలోనే మరోసారి ఆవేశం ప్రవహించి పిడికిలై ఉప్పోంగింది.
అయినా తనే అనుభూతో, ఆవేశమో
కానే కాదు.
కాదు కాదు.

3

తనతో కలిసి తనగుండా పదాలూ, వాక్యాలూ
నిరంతరంగా పరుగులిడుతూనే వున్నాయి.
ప్రవహింపజేసుకునే తను మాత్రం
కేవలం పదమో, వాక్యమో కాదంటే కాదు.

4

తనకున్న రూపమే తనుకాదు.
తను చెప్పేసందేశమే తనుకాదు.
నాకోచ్చిన సందేహమూ తనుకాదు.
పేరైతే తెలుసు కవిత్వమని,

5

తన సాంగత్యం ఎలావుంటుందో చవిచూసాను,
నిర్వచనమైతే వుంటుందో లేదో కూడా తెలియదు
నిర్వచించాలనుకునే మూర్ఖత్వమూ నాకు లేదు
కాని నాకు
తను కావాలి తనే కావాలి.

* 06-09-2012

శోభారాజు||ప్రేమ మేఘం వర్షించిందిలా.||

బాగా చిన్నప్పుడనుకుంటా
ఏదో కావాలని మారాం చేసేస్తుంటే
ఎన్నో విధాలుగా నచ్చజెప్పాడాయన
అయినా వింటేగా..
అంతే.. లాగి చెంపపై ఒకటిచ్చుకున్నాడు

ఎప్పుడూ భుజంపై ఎక్కించుకుని
ఊరంతా తిప్పుతుండే ఆ వ్యక్తికి
ఆ రోజునుంచీ మనసు మనసులో లేదు
రాత్రీ పగలూ ఒకటే ఏడుపు
ఆ పసిదానిపైనా నా ప్రతాపం
తనలో తాను తిట్టుకోని, గొణుక్కోని రోజులేదు
ముద్ద ముడితే ఒట్టు

తనను ఎత్తుకుని ఆడించే ఆ మనిషి
ఇలా కొడతాడని ఊహించని ఆ పసిమనసు
చెంపమీద వేళ్లగుర్తులు అచ్చుగుద్దినట్టు
ఆ రోజునుంచీ అతడి దగ్గరికెళితే ఒట్టు
మామూలుగా అయితే...
చూడగానే మీదికెక్కే ఆ పసిది
ఆ మనిషిని చూస్తేనే జడుసుకునేది

వారిద్దరి సయోధ్యకు చాన్నాళ్లే పట్టింది
ఓ రోజున జాగ్రత్తగా దగ్గరికి తీసుకుని
తినేందుకు ఒడినిండా కొనిచ్చి
ముద్దులాడుతూ క్షమించమన్నాడు
ఏమనుకుందో ఏమో
క్షమించేసింది, ఇకపై ఇలా చేయకని
ముద్దుతో మరీ వార్నింగ్ ఇచ్చేసింది...

తాత మనవరాళ్ల ఫైటింగ్ ఇలా సమాప్తం.....

మళ్లీ చాన్నాళ్ల తరువాత
ఎందుకోగానీ అదే చెంపపై
మళ్లీ వేళ్ల గుర్తులు అచ్చుగుద్దినట్లు
అయితే ఈసారి తాతవి కావు, నాన్నవి...
ఆ పసిది ఇప్పుడు యుక్తవయసు అమ్మాయి

చిన్నప్పుడు తాతపై ప్రకటించిన యుద్దమే
ఇప్పుడు నాన్నపై....
నాన్న పరిస్థితీ తాత పరిస్థితికంటే దారుణం
అయ్యో నా తల్లిని ఇలా కొట్టేశానేంటి
ఏడ్వని రోజు లేదు...
ముద్ద ముడితే ఒట్టు...
అర్థం చేసుకుందో ఏమో
తాతలాగే నాన్ననీ ముద్దుతో క్షమించలేదు
మౌనంగా, కళ్లతో క్షమించేసింది

అదే పెళ్లై అత్తారింటికెళ్లాక...
రోజూ చెంపపై
మొగుడి ప్రేమ ముద్రలు 
కాదు కాదు
చేతి వేళ్ల ముద్రలను
మౌనంగా భరించటం నేర్చుకుంది
అయినా ఎంతకాలం అలా...?

చిన్న దెబ్బకే అల్లాడిపోయిన
తాత, తండ్రుల్లాగా
ఇక్కడ ప్రేమ పంచడానికి
బుజ్జగించడానికి ఎవరూ
లేరన్న సత్యం మెల్లిగా బోధపడిందే ఏమో
మానసిక, శారీరక గాయాలకు
మందు ఇక్కడ లేదనుకుందో ఏమో
ఓ రోజు పుట్టిల్లు చేరుకుంది

బ్రతికినంతకాలం నీ కూతురుగా
ఇక్కడే ఉంటా...
ఇంత తిండి పెట్టండి చాలని
బ్రతిమాలింది ఆ తండ్రిని
కన్నీటి వరదై కరిగిపోయాడా తండ్రి
కానీ... లోకం నోటికి భయపడి
చావైనా, బ్రతుకైనా కట్టుకున్నోడితోనే
ఇక్కడొద్దని బయల్దేరదీశాడు

మెట్టినింట్లో కూతురిని అప్పజెపుతూ
అల్లుడి మాటలు నమ్మి
ఆమెకు బుద్ధిమాటలు చెప్పాడు
బంగారు తల్లిని బలి ఇస్తున్నాడని
ఆయనకు తెలియదాయె..
చావైనా, బ్రతుకైనా ఇక్కడేనా
మరి బ్రతుకుతూ చావటమెందుకైతే
అందుకే ఓరోజున ఆమె నావ తీరం చేరింది
తాత, తండ్రులపై గర్జించిన ప్రేమ మేఘం
చివరికలా వర్షించింది....
 
06-09-2012

బాలు ||అక్షర||

అక్షర,
నేను నా ప్రాణంకన్నా ఎక్కువుగా ప్రేమించిన అమ్మాయి

అక్షర,

నేను నా ప్రాణంకన్నా ఎక్కువుగా ప్రేమించిన అమ్మాయి

తన మునివేళ్ళు నా అరచేతిలో లయబద్దంగా నాట్యం చేస్తుంటె

నా హృదయ స్పందనలు అలలవోలే తనివి తీరాలకు చేరుకునేది

నా శిరస్సు తన వడిలో శయనిస్సుంటే....

తన పలుకులు స్వరాల్లా వినిపించేవి

తన పెదవుల మీద మందహాసం చూస్తుంటే...

నా మదిలోని భావాలు మూగబోయి చూస్తుంటాయి

తన మీనకళ్ళ సోయగంతో ఒక్కసారి చుసిదంటే...

నా కనురెప్పలు, రేపవేయటం మర్చిపోతాయి

తను నా ముంగిట ఉంటే...

స్వర్గం నా ముందర ఉన్నట్లు ఉంటంది

*01-07-2012

సైదులు ఐనాల // పాల బుగ్గల పాప//

పెన్నులో ఇంకు వడిసేదాకా...
రాస్తూ.
రాస్తూ..
రాస్తూ...
అలా..
అలా...
అలా....
'ఏంచెక్కుతున్నావే'
వంటింట్లోంచి అమ్మ గావు కేక
వత్తి పలికుతున్న ఆ మాటలు
బూరబుగ్గలసందుల్లో చిక్కుకొనిమెలితిరుగుతున్నయ్

నవ్వులు

నవ్వులు
నవ్వులు

ఇంకు కోసం

పాప అణ్వేషణ
హ్హమ్మయ్య సిరాబుడ్డి దొరికింది

మలుగుతున్న కాగితాలు

విచ్చుకుంటున్న బొమ్మల ప్రపంచం

స్కూలుకి టైం ఐఇందే

ముడుచుకున్న పాప చేతులు


గల గలా

గల గలా
'తొందరగా స్నానం చేసి హోంవర్క్ చేసుకో'
బెడ్ రూం లో బట్టలు సర్దుతా అమ్మ ఇంకో గావు కేక

బరువుల్ని

భారం గా...
ముందేసుకొని
తలదూర్చింది
ఊహూ..
నాకేంపని ఈ ప్రపంచంతో...?
ఎడం కాలుతో గట్టిగా తన్నింది పాప
గిల గిలా కొట్టుకొని ఓ మూలన నక్కింది భూగోళం
సరే
ఈ ఒక్కసారికి

రాస్తుంది

రాస్తుంది
ఇంకా
ఇంకా
ఇంకా

తనరాతను తాను రాసుకోలేని

మనుషుల గురించి

పుట్టుకల అర్దం తెల్పే

మహా కావ్యం

అహ అహా హా


06-09-2012 

క్రాంతి శ్రీనివాసరావు ||జతలేని జంట ||




పొట్ట పగిలిన

జిల్లేడు కాయ వెదజల్లిన
ధవళ వస్త్ర దేవతల్లా

మనసు పుట్ట పగిలిన

కోరికలు మళ్ళీ కోరికలనే కంటున్నాయు

మనసు సందేహాలతో

దేహం తీరని దాహం తో
సమాంతర రేఖలుగా
సాగిపోతున్నాయు

ఇప్పుడెందుకో

దేహానికి సందేహం
మనసుకు దాహం వేస్తోంది

బాల్యం లోనే విడిపోయున రెండూ

వృద్దాప్యం వచ్చాక
తప్పక ఒకటి ముందుకు
తప్పించుకోవాలని మరొకటి వెనక్కి
వేగంగా పరుగులు తీస్తున్నాయు

చివరికి పోరాటమే మిగిలింది

ఆరాటమే అనుభవ మయ్యుంది

ఎప్పుడో

నశించిన నక్షత్రం కాంతి
నిన్ననే భూమిని చేరినట్లు

ఎప్పటి ఆకాంక్షలో

కాలం కరగిపోయాక
కాయం గాయం అయ్యాక
ఇప్పుడు ఎదురవుతున్నాయు

మనసూ దేహం

వెలుగూ చీకట్ల లా
ఎప్పుడూ విరహాన్నే అనుభవిస్తున్నాయు

ఉన్న రెండు సంధ్యలూ

ఒకటి పుట్టటానికీ
మరొకటి గిట్టటానికీ ఖర్చయుపోతున్నాయు

06-09-2012

జాన్ హైడ్ కనుమూరి ||ఏ నీడలో కలిసామో||

ఎక్కడో కురిసిన చినుకు
వాగై వంకై ప్రవహించి
నదై ఉరుకలేస్తున్నట్టు
సంగమ ప్రావహం

మార్కులు, డిగ్రీలు కొలమానాలేమీ కావు
ప్రవహించడం ముఖ్యం
చాలాకాలపు నిశ్చలనీరు
త్రాగటానికి పకిరానట్టు
నదయ్యాక ప్రవహించకపోతే ఎలా!

నిలకడగా నడుస్తుంటే ఫలితం ఏమీ లేదనుకుంటే ఎలా!
ఒరుకుకుంటున్న ఒడ్డులో 
ఏ వేరో వేచిచూస్తుంటుంది
ఫలమిచ్చేందుకు సారాన్ని వెదకుతుంది
ఫలాల పని కొమ్మదనివేరు అనుకుంటుందా!

దాని రుచేదో నీకందలేదని, అందదని
ప్రవహించననడం సమంజసమేనా!

పండుకొరికిన నోరు నిన్ను తలచకపోయినా
నీవిచ్చిన సారం నరాల్లోకి ఇంకుతుంది

ప్రవాహ తీరుతెన్నులకు
ప్రవాహవేగ లెక్కల్తో నదికేం పని

ప్రవహిస్తూ ప్రవహిస్తూ
లోలోనో పైపైనో ఆవిరైతే

మళ్ళీకురిసేమేఘం
మరెక్కడో కురవడాంకి సిద్ధమౌతుంది


2.9.2012

మనోజ్ఞ || ముళ్ళు ||

ఎటెళ్ళాలో తెలియడం లేదు
ఆలోచిస్తూ నడుస్తున్నాను.. ఆగిపోలేక.

దారులన్నీ ముళ్ళతో

నిండిపోయున్నాయి..

ఇదిప్పటి కధా చెప్పు?

జన్మ జన్మల నుంచీ
తెగిపోయిన స్నేహాలు...
తేలిపోయిన మోసాలు....
రాలిపోయిన నమ్మకాల ముళ్లివి!!

ఎట్నించి నడిచినా

రుధిరం కడిగేస్తోంది అరికాళ్ళని..

గాయాల గోరింట

బాగా పండింది !!!!

మౌనంగా కాళ్ళు కడుక్కుని

ముక్కలైన గుండెను తిరిగి పేర్చుకున్నాను..
సిద్ధం !!!!!!

దమ్ముందా నీకు ??!!!

అయితే రా !!!
దారుల్లో
మళ్ళీ ముళ్ళు పరవడానికి,
పేర్చుకున్న నా గుండెను
మళ్ళీ ముక్కలు చెయ్యడానికి !!!!

06.09.2012

పీచు శ్రీనివాస్ రెడ్డి || రాయినే, పరాయిని కాను

రాయినని పరాయిగా చూడకు
నువ్వు కొలిచే దైవానికి రూపమిచ్చింది నేనే

ఉలి దెబ్బల పురిటి నొప్పుల్లో

సౌందర్యమై పుట్టాను నేను
కనువిందు చేసాను నీకు

నువ్వు కట్టిన ఇంటికి

నువ్వు వేసిన దారికి
ఇసుక రేణువునై మారింది నేనే
నీడనిచ్చింది నేనే
నీకు దారి చూపింది నేనే

నేను పుట్టినప్పుడు లేని నువ్వు

నాకు రాగాలు నేర్పకు
నేనెప్పుడో కరిగి పోయాను
నీ గతానికి
నేను బొమ్మనై నిలిచాను

పెను గాలికి జారి నాపై నేనే పడ్డప్పుడు

తగిలిన గాయాన్ని మరిచి
నీకు ' నిప్పు'నిచ్చాను
నీ బ్రతుక్కి వెలుగునిచ్చాను

ఒంటరిని చేసి వేధించినప్పుడు

అందరూ నిన్ను అనిచివేసినప్పుడు
నీ తొలి పోరాటానికి ఆయుధాన్ని నేనే
నీ తొలి ఉద్యమానికి బలగాన్ని నేనే

రాయినని పరాయిగా చూడకు

రాజ్యానికి సరిహద్దు గురుతును నేను
నీకు రక్షణగా నిలబడ్డ
నిలువెత్తు గోడను నేను

06-09-2012

శ్రీ వెంకటేశ్ || తెగిన గాలిపటం||

ఆసరా లేక,
ఎగిరి ఎగిరి అలసి,
పడేందుకు సిద్ధంగా,
వెలివేయబడేందుకు ముందుగా,
తెగిపడక ముందు వరకు కూడ
అందరికి సంతోషానిస్తూ,
అందరితో ఆకర్షింపబడుతూ,
దారపు బంధం వీడాక
అదే అందరితో ఉపేక్షింపబడుతూ...

పీడగాలులకు పక్కకెల్లకుండా,

వడగాలులకు వంగి బెదరకుండ,
తన శక్తి మేరకు తట్టుకుంటూ,
ఉపయుక్తమైన ఊతంతో గాలిలో ఊగుతూ,
తన అభిలాష తన మీద ఆశలు పెట్టుకున్న
వారిని పోటిలో గెలిపించడమే,
తన ఆకాంక్ష
ఏ విధ్యుత్ తీగలకో
ఏ చెట్టు కొనలకో
ఏ పక్షుల పక్షములకో
తగిలి తన ప్రయాణం ఆగకుండ ఉండడమే,
తలకు మించిన భారంతోనైన ఎగిరి
దూరాలకు వెళ్ళి ఏదో ఒక దిక్కున
దారుణమైన రీతిలో తనువు చాలించి
తన తనువును చూసే తోడు లేక
కన్నీరు విడిచే కావలి లేక,
అప్పటి వరకు పడిన కష్టానికి
ప్రతిఫలం శూన్యమని తెలిసి
ఆఖరు నిమిషంలో కూడ గాలిలోకే చూస్తూ
ఈ తెగిన గాలిపటం......


06-09-2012

Sai Padma // మాకు...మేమే..!!

మారీ మారని శరీరం,
మారుతున్న మనసు.
నేనేమిటో నా ఒక్కడికే తెలుసు..
మీకు నచ్చినట్లే బ్రతికా..
తెచ్చిన బట్టలు కట్టుకున్నా..
ఏదీ నచ్చని స్థితి..
నా వాళ్ళు నచ్చే పరిస్థితి..
నా వాళ్ళంటే నా సహచరులు..
మిత్రులు..మగవాళ్ళు..
ప్రేమంటే.. ఆడా..మగా మాత్రమేనా?
మరి మీరు చూపించే ప్రేమ ధర్మమా..నాన్నా..
మీరు తప్పంటారు..
నా మనసు ఒప్పనంటోంది..
మీకు సిగ్గంటారు..
నాకు సహజం అనిపిస్తోంది..
అడగందే అన్నీ ఇస్తారు..
మనసులో కావలసింది తప్ప..
స్వలింగం తప్పంటే..
మన కులం..మతం..ధర్మం..అంటూ..
మీరు చేసే సంకుచిత స్వధర్మాన్ని ఏమంటారు..?
స్వలింగ సంపర్కం..
కోర్ట్లూ.. చట్టాలూ.. ఒప్పుకున్నాయిగా..
కానీ అవి నా హక్కులు మాత్రమే..
మీ మనస్సులో.. తోమబడ్డ ప్రేమ భావజాలానికి
సమాజపు సంకేళ్ళకి..
ఎంతటి వారైనా ..బద్దులు కావలసిందే..
సంఘానికి కావలసింది.. మన మనశ్శాంతి
కాదని తెలిసినా.. మీకేదో అశాంతి..
ఏదైనా.. సరైనది కాదని ఎవరైనా ఎలా చెప్పగలరు..
మీ గాయాలు మీకుంటే..
మా భయాలు మాకున్నాయి..
మమ్మల్ని మేం అర్ధం చేసుకోవాలంటే..
మా ప్రేమ ఆలంబన అని మీకెందుకు అర్ధం కాదు..
అయినా..ఛీ కొట్టే ఆడవాళ్ళ కన్నా..
మాతో సహజీవనం చేసే మగవాళ్ళే మిన్న..
ఎవరో తెలియని సంఘ లింగాల కోసం..
మా లైంగిక హక్కులు కాలరాస్తే ఎలా..?
కొత్తదే కావచ్చు.. మీకు చేత్తదే కావచ్చు..
మా స్వరం మాకుంది..
ఈ తరం మాదైంది..
మీ చీత్కారాలు మీదగ్గరే ఉంచుకోండి..
మా ధిక్కార సంగీతం ..మేం పాడుతూనే ఉంటాం..
ఈ లోగా.. "మగాడివి నువ్వు" అనే వంకతో,
ఒక వెన్నెలమ్మ లాంటి ఆడపిల్ల జీవితం..
మా వల్ల నాశనం కానీకండి..
ఇది తప్పనిసరి.. అర్ధం చేసుకోండి..


00-09-2012

లుగేంద్ర పిళ్ళై ||ముసుగు ముఖాలు||

విషాదాన్ని పంటిబిగువున ఉంచి
నవ్వుతూ పలకరించే వాడొకడు..
కసిని కత్తిలా కళ్ళ వెనుకనే దాచుకొని
హాయ్ అంటూ కరచాలనం చేసేవాడొకడు
ముందు ప్రేమ ఒలకబోసి అభిమానంగా మాట్లాడి
వెనుకన వెన్నుపోటుకు సిధ్దమయ్యేవాడొకడు
ఇంకానా ఈ ముసుగులు ఎనెన్నో....
ఇస్ర్తీ బట్టల క్రింద పేదరికపు చాయల్ని
కళ్ల నలుపుల క్రింద కారిన కన్నీటి చుక్కల్ని
దాచుకొని సంతోషం పౌడర్ పూసుకొని తిరుగుతుంటారు..
ముసుగులు లేని మనిషి కనబడటం లేదు.
ఓట్లకోసం వారసత్వం ముసుగేసుకొని ఒకడు
సీటుకోసం తానే సేవకుడినని ఇంకొకడు
పగటి వేషాలు వేసుకొని పర్యటనలు చేస్తున్నారు..
గుడ్డిగా నమ్మడం తప్ప
ముసుగులు తొలిగించి చూసే వాడే లేడు ..
ముసుగులు లేని వ్యక్తిని చూడాలంటే
మనం ముసుగులు తీసేది మొదలు కావలసిందే ..

06-09-

మోహన్ రుషి // డోరు తెరువు! //

మాట్లాడుకోము; అదీ సమస్య-
సహజంగా, స్వచ్చంగా
సాధ్యమైనంత నిదానంగా!

రెండు మాటలు కలిస్తే
ముసురుకున్న దిగులు మేఘం ఆవిరైపోతుంది
రెండు మాటలు కలిపితే
అలిసిన హృదయమూ అనురాగాన్ని వర్షిస్తుంది!

ఘనీభవించిన నిశ్శబ్దం మాటతోనే కరిగేది
ముడుచుకున్న మనసు పుష్పం
మాటతోనే విప్పారేదీ, అద్భుతంగా పరిమళించేదీ!

మాట ఒక మంత్రదండం
పలుకు ఒక పరుసవేది
సంభాషణే సమస్త ప్రపంచాన్నీ ఒక్కటి చేసేదీ,
ప్రపంచంలోకి నిన్ను ప్రవేశపెట్టేదీ!

వెయ్యి మాటలెందుకు?!
ఉన్నచోటు ప్రేమావరణం కావాలన్నా
జీవితంలో ఉత్సవ సమ్రంభం నిండాలన్నా
మాట తప్ప ఇంకో మాట లేదు!

06-09-2012

యజ్ఞపాల్ రాజు**నింపుతూ నిండుతూ**

తను నింపుతూ ఉంటుంది
నా నిదురను
నిజం కాని కలలతో
నా మనో ఫలకాన్ని
నిజమైతే బాగుండుననిపించే
తన ఊహల రాతలతో
తను నిండుతూ ఉంటుంది
తడి ఆరిపోయిన
నా కనుల కొలకుల కొలనుల్లో
కన్నీటి కడగళ్లై
నేను రాసే రాతలో
తనకోసం బతికున్న
ఆశల పరవళ్ళై

05-09-2012

ఎ.నాగరాజు ||చేసిన పాపం||


ఉంటామా
పొరలు తొలుచుకొని
దినాల కాంతీ లేని చీకటి పోనీ
యుగాల నగ్నతలపోతగా

ఎవరికీ పట్టని
మూలల శుద్ధ వచనాలకావల

ఉంటామా
మనలో మనం ఉమ్మనీటిలో
స్మృతుల పురామడతలలో తెలియని మూర్చనలలో
ముడుచుక పడుకొని

అకవిత్వపు
అంచుల రాలిన పూవుల శైధిల్యపు ముద్రా ధ్వానం లోపల

ఉంటామా
ఒకటంటూ కాలేక ఒదగలేక తొడుగుల తగిలించుకోక
వేలెత్తి చూపినప్రతిసారీ శాపగ్రస్తులుగా వొదిగి వొకింత తప్పుక తిరుగుతూ

ఖండితాల
నడుమ ఖండితమై మన చుట్టూ మనం అకవులమై
ప్రదక్షణం చేస్తూ మోస్తూ ఈ రక్త కంకాళ జరా మరణ దేహంలో ఈదులాడుతూ

4-9-12

డా.పులిపాటి గురుస్వామి॥కాలకూటరసం॥



ఎప్పటికీ ఓ రహస్యం తెగని గోళాకార నివృత్తి లోంచి
బయటకు పోలేక

ఎప్పటికీ కాసిని దోసిలి నిండని ప్రేమ గింజల్ని
చప్పరించే యోగ్యతని మెప్పించలేక

ఎప్పటికీ జ్వలించే అంతర దీపాలకు
చేతుల దాపు సరిపడా చూపించలేని
నిర్వీర్యాన్ని తిరస్కరించలేక

ఎప్పటికీ లోలోపలి నరాలకి
వెలుతురు వెంట తీసుకుపోలేని
కుంటితనాన్ని భరించలేక

ఎప్పటికీ మిణుకు మిణుకు సౌందర్యపు ముఖ భాగాలను
స్పష్టంగా క్రీడించలేని వేదనని ఒప్పించలేక

ఎప్పటికీ కిటికీ కింద వేలాడుతున్న
దుఃఖపు పీలికలను
ధైర్యంగా గదిలోకి చేర్చుకోలేని
నిస్సహాయ జ్ఞానాన్ని క్షమించుకోలేక

ఎప్పటికీ శూన్యాల చుట్టూ పెనవేసుకుంటున్న
మిక్కిలి మోహ కాంతులను ఆర్పేయలేని
భార జడభావనకి ఊపిరి నింపలేక

ఎప్పటికీ పరుగెడుతున్న రధచక్రాల ప్రేమను
తిరస్కరించలేని నిమిత్త వాన్చాకి భజనచేయలేక

ఎప్పటికీ
ఎప్పటికీ
నన్ను నేను చేరుకోలేని
బాహ్యాంతర మైనపు దారుల్ని
శుద్ధి చేయలేని ఆవేశ శకలాల నశ్చలింపలేని
ప్రయత్నాల తట్టుకోలేక .

.....

4-9-2012

శ్రీనివాసు గద్దపాటి॥సక్సెస్॥


ఒకప్పుడు మావూర్లో కూడా అమ్మలుండేది
ఇప్పుడందరూ మమ్మీలే

ఎల్.పి.జి.లీకయ్యింది
ప్రపంచమంతా కంపువాసనే
తొందరపడి ముక్కుమూసుకునేరు
డాల్ర్లవేటలో వునుకబడతారు
వన్స్ దేర్వాజ్ ఏ కింగ్...
అనగనగా ఒక రాజు
చందమామకథల్ని బొందబెట్టేసి
టాం అండ్ జెర్రి
వెర్రిగా చూద్దాం

ఇప్పుడు స్మశానంలొని బేతాళుడు
ఎంచక్కా బైకుమీద
షికారుచేస్తూ
ఐమాక్స్ లో సినిమాచూస్తాడు
కౌరవులూ..పాండవులా...
హూ ఆర్ దే....?
ఏ సినిమా హీరోలు....
మాటెల్గు టల్లికి మల్లెపూదండ
అబ్బో.. ఎంత కష్టమో...
ఇంగ్లిష్ లో ట్రాన్స్లేట్ చెయ్యొచుగా....?
సక్సెస్...
సక్సెస్...
ఆపరేషన్ సక్సెస్...

బత్...
బత్....అవర్ కల్చర్ ఈజ్
అవర్ కల్చరీజ్...........?

చైతన్య ||డైరీలో చిరిగిపోని పేజీలు!||


నాన్నిచ్చే డైరీకి...
ఏడాది ఎదురుచూపు?

నీపై నా ప్రేమను..
తొలిసారి చెప్పింది డైరీకే!

చేజిక్కిన నీ తలవెంట్రుక...
నా డైరీలో మెరుస్తూనేవుంది!

డైరీలో పరిమళాలు!!!
వాడిపోని జ్ఞాపకాలవి...

కానరాని నిన్ను!
డైరీలో చూస్తున్నా..

డైరీ తడిచింది! సిరా కన్నీరు..

డైరీ నాదే,కానీ
ప్రతిపేజీ నీదే!

యవ్వనం పదిలం!
డైరీ పేజీలలో...

డైరీని కాల్చేసా!
దాన్లోంచి నువ్వు మరీ అమాయకంగా చూస్తుంటే...

రాత మారిందేంటి!
ఎవరిదీ డైరీ?

డైరీ పోతేనేం?
జ్ఞాపకాలు హృదయంలో..

అరుణాంక్.ఎలుకటూరి | | స్వదేశంలో పరదేశిని||


నేను ఈ మట్టిలోనే పుట్టాను
ఈ మట్టిలోనే పెరుగుతున్నాను
చివరకు ఈ మట్టిలోనే కలసిపోతానూ
నేను ఈ దేశ పౌరున్ని
అయినా...
నన్ను పరదేశిగానే చూస్తుంది ఈ హైందవం
ఎక్కడ అల్లర్లు,అల్లకల్లోలాలు జరిగిన అందరి కళ్ళు నా పైనే
ఎక్కడ బాంబులు పేలిన అందరి వెళ్ళు నా వైపే
మతోన్మాదం మదమెక్కిన ప్రతిసారి
ఆ మంటల్లో నేను మాడిపోతున్నాను
"కమలం" వికసించిన చోటల్లా
నా మృతదేహంపై కప్పనీకి కొత్త కఫన్ తయారవుతుంది
జిన్నా చేసిన కుట్రకు
నా జిందగీ బర్బాద్ కావట్టె
గజినీ గుళ్ళు దోసినందుకు
నా గళ పిసికి సంపవట్టే
భారత్,పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే
నీ మద్దతేటు అని అడిగాడు మిత్రుడొకడు
చాల దినాల తర్వాత కలసిన దోస్తు గదా అని
గాలే మిలయించబోతే గుండెల్లో త్రిశూలం గుచ్చుకుంది
ఈ నేలంతా వేదభూమి అని చెప్పేటోల్లంత
వేదాలు రాసిన ఆర్యులు పరదేశియులని గుర్తెరగట్లెదు
నా కళ్ళ ముందే తల్లిని,చెల్లిని
పాడుచేస్తున్న ఏమి చెయ్యలేని నిస్సహాయుణ్ణి
కడుపులోంచి పిండాన్ని బయటకు తీసి
త్రిశూలానికి కుచ్చి మంటల్లో మాడుస్తున్నా
అడ్డుకోలేని అసహయున్ని
మనువాదపు అంటారని మంటల్లో కాలుతున్న
మూలవాసులకు గుండెకు హత్తుకున్నవాన్ని
గలే మిళాయించిన సూఫినీ
భారత స్వాతంత్ర సంగ్రామంలో
మౌలానా అబుల్ కలం ఆజాద్ ని
సరిహద్దు గాంధీ గఫార్ ఖాన్ ని
సరే జహాసే అచ్చా మహ్మద్ ఇక్బాల్ ని
నిజాంపై కలం దూసిన షోయబుల్ల ఖాన్ వారసున్ని
బందగికి తమ్మున్ని
అరవై తొమ్మిది తెలంగాణా ఉద్యమంలో తోలి అమరున్ని
రాజకీయ నాయకుల ఓట్ల రాజకీయాలకు బలౌతున్నవాన్ని
జనాబా లెక్కల ప్రకారం నేనీదేశ పౌరున్ని
అయిన నా దేశంలో నేను పరదేశిని
నేల నేలంతా నెత్తురుతో తడిపిన వాణ్ని
ఈ త్రివర్ణ పతాకం నా నెత్తురుతో తడిసి ఎన్నడో ఎరుపెక్కింది
అందరి ముందు అరచి చెప్తున్నా
జరా చెవులు పెద్దగ చేసి ఇనుండ్రి
నేను ముసల్మాన్ నే
దానికి ముందు స్వచ్చమైన భారతీయున్ని

(మతోన్మాద మంటల్లో మాడిపోయిన,అస్సాంలో అసువులు బాసిన ముస్లిం సోదరులకు)
*04-09-2012

పద్మా శ్రీరాం॥||మెలుకువ రా(లే)దు...........||



దీపావళి పండుగ ఊరంతా లేచింది బారెడు పొద్దెక్కింది.

పక్కింటి పిల్లలు తుపాకీ తో బిళ్ళలు కాలుస్తూ
నోటితో డిష్యుం డిష్యుం అని సందడి చేస్తున్నారు.
ఉలిక్కిపడి లేచింది పుట్టింటికొచ్చిన ఆడపిల్ల
ఇంత మొద్దు నిద్దర పోయానేంటా అనుకొంటూ...

నిజమే మరి...... పదివేలిచ్చి
పాలేరు కుటుంబాన్ని పెట్టుకొన్నా
కళ్ళాపి తానే చల్లుకొనే అమ్మ
గాజుల చేయి వాలిపోయిందిగా
పండగంతటినీ ముంగిట ముగ్గుగా తీర్చే
అచ్చ తెలుగు అల్లిక ఆపట్నే ఆగిపోయిందిగా...

సూర్యునికంటే ముందే లేచి చేదబావి దగ్గర
ఓ బిందెడు నీళ్ళు కుమ్మరించుకొని
"శ్రీ సూర్య నారాయణా వేదపారాయణా
లోక రక్షామణీ దైవ చూడామణీ..." అంటూ
ఆదిదేవుణ్ణి నిద్రలేపుతూ తడిపొడి అడుగులతో
ఇల్లంతా మెట్టెల సందడించే పచ్చని పాదాలు
సుదూర తీరాలకు చేరిపోయాయిగా...

ముసుగెట్టిన మేం నిదుర లేవాలని రేడియో ఆన్ చేసి
భక్తి రంజని పెట్టే తలపులారిపోయాయిగా
"అత్తింటినుంచి అలిసి వచ్చింది నా కూతురు
ఆదమరచి నిదురపోనీ లేపకు " అంటూ నాన్నగారు
అమ్మని మందలించే అవసరం కూడా లేదు
"పండుగ పూట ముస్తాబయిన మహలక్ష్మిలా
నట్టింట తిరగాలి ఆడపిల్లలు... పద్మా ఇక లేమ్మా"
అనే అమ్మ మేలుకొలుపు ఆగిపోయిందిగా...

సిటీ కల్చరంటూ సంప్రదాయాలు వదిలేస్తే ఎలా
అంటూ గోరింటాకు కోసి రుబ్బి చేతులు పండించే
అమ్మ వన్నెలు వెలిసిపోయాయిగా...

అందుకే నాకిక పొద్దున్నే మెలుకువ రా(లే)దు...........

ఆదమరపు లేని అమ్మకై కలల్లో నా వెతుకులాటా పోదు.....

04september2012

జగద్ధాత్రి || పతంగ్ ||


రంగు రంగుల కాగితాలతో
నన్ను ప్రియంగా అందంగా చేసావు
నాకో అస్తిత్వాన్నిచ్చ్చావు
నీ ఆశల తోక తగిలించి గాలిలోనికి వదిలావు
ఆకాశాన్ని చేరమన్నావు
నీ ఆశలు వమ్ము చేస్తూ
మొదటిసారి తిరిగి పడ్డాను కింద
నన్ను ఏమీ అనకుండా
మళ్ళీ ప్రయత్నం తో నన్ను ప్రేమ గా ఎగరేసావు
ఈ సారి నీవనుకున్న దాని కంటే ఎత్తు ఎదిగాను
నీ కళ్ళలో ఆనంద భాష్పాలు చూసి పొంగి పోయాను

ఇంతలో తూఫాను గాలి వీచింది
నేను కిందకి రాలేకా ఎగరలేక
జీవితపు చెట్టు మీద చిక్కుకున్నాను
నా కష్టానికి నువ్వే కారణమని దుఖం తో నువ్వు
కుంగి కుమిలిపోయావు .....

కారణం నీవు కాదని నేనెంత ఓదార్చినా
నీ బాధతో చివరికి ప్రాణం అర్పించావు
నీ ప్రేమ దారం తెగి నేను మాత్రం
ఆకడే చిక్కుకుని ఆ జీవన వృక్షం పై
అప్పుడప్పుడు పచ్చని ఆకుల సందిలిలో
సేద తీరుతూ .... అదాటున వచ్చి పడే వర్షం లో
తడిసి పోతూ, కొద్ది కొద్దిగా రంగు వెలుస్తూ
సాగే కాలం తో బాటు నీ ప్రేమ చిహ్నంగా
మిగిలి ఉన్నాను ...

ఎప్పుడో చివికి జీర్ణించు కు పోయి రాలి పోతాను
కానీ ఊపిరున్నంతవరకూ నీ కన్న ప్రేమ కు
గురుతుగా మనిక సాగిస్తూ
నా తర్వాతి వారికి కూడా
ఒక్కింత స్ఫూర్తినిద్దామని
ప్రతి క్షణం నన్ను నేనే ప్రేరణ చేసుకుని
ఆఖరి శ్వాస వరకూ ....జీవిస్తాను

అప్పుడు విజయ గర్వంతో నీ దరి జేరుతాను
మళ్ళీ నీ కళ్ళల్లో ఆనందపు పువ్వులు పూయిస్తాను
ఇది నా వాగ్దానం కాదు
జీవిత ధ్యానం !!!

పీచు శ్రీనివాస్ రెడ్డి || ఇద్దరూ.. ఇద్దరే ||



ఒకడు
బాధను చెప్పుకుంటున్నాడు.
ఒకడు
ఆ బాధనే వెక్కిరిస్తున్నాడు .
ఒకడు
కడుపు కాలిందంటున్నాడు.
ఒకడు
ఒళ్ళు బలిసింద౦టున్నాడు.
రోడ్డు మీద రాయిని చేతపట్టి
ఇది నా ఆయుధం అంటాడొకడు .
పేపరు మీద పెన్నును పెట్టి
ఇది నా పైత్యం అంటాడొకడు .
ఆ ఒకడికి తెలియదు
రాయితో పగిలిన తల ఎవడిదోనని .
ఆ ఒకడికి తెలియదు
అక్షరంతో విరిగిన మనసు ఎవడిదోనని .
ఒకడు ధర్మాగ్రహం అంటాడు .
ఒకడు సత్యాగ్రహం అంటాడు .
జననంలోనూ ఇద్దరూ
కానీ స్థలాలే వేరు .
రంగంలోనూ ఇద్దరూ
కానీ అంతరంగాలు వేరు .
ఆరాటంలోనూ ఇద్దరూ
కానీ పోరాటమే వేరు .
మరణంలోనూ ఇద్దరూ
కానీ సమాధులే వేరు .
ఒక్కడే విడిపోయిన ఆ ఇద్దరు
కాకపోతే ' ఒకడు ' జనంలోనో .
' మరొకడు ' గద్దె పైనో .
అప్పుడప్పుడు ' ఒకడి ' స్థానంలో ' మరొకడు '
కొత్త గొంతును సవరించుకుంటారు .

04-09-2012

రాఖీ||ప్రేమసమరంలో అవసరమా ఖడ్గమూ డాలు ||



తూర్పున నేను
పశ్చిమాన నీవు

భూగోళానికి ఇరువురం చెరోవైపు
అందుకే అందదు మనకు మనవీపు
అయినా తీపులకై చేతులు చాపు

ధృవాలు వేరు ఉత్తర దక్షిణాలు
అందుకేనేమో ఈ ఆకర్శణాలు

దృక్పథాలు వేరు ఎడ్డెమంటె తెడ్డెమనడాలు
ప్రేమసమరంలో అవసరమా ఖడ్గమూ డాలు
వాయింపుకు భిన్నంగా రెండురకాలుగా మ్రోగే డోలు

ఎప్పుడైనా పయనంలో మనచేతులు చెట్టపట్టాలు
కలిసిసాగుతున్నా కలుసుకోలేని రైలు పట్టాలు

భేషజాల భావజాలం –ఒకరులేక ఒకరం మనజాలం!
బ్రతుకే ఇంద్రజాలం-అంతర్జాలంలా మయాజాలం!!

04-09-2012

నారాయణస్వామి వెంకటయోగి॥ చిన్నతనం ॥



చిన్నప్పుడు
నేనెప్పుడు పాలు తాగిన్నో తెలియదు!
పోతున్న ప్రాణం నిలిపెటందుకు
ఏ చల్లని తల్లో అందించిన మొదటి అమృతధార -
చెంప మీద గరుకు మరక.

ఏ బొమ్మల్తో ఆడుకున్ననో,
ఏ ఏ ఆటల్ని లోకమెరుకలేని మురిపెంతో
నేర్చుకున్ననో గుర్తుకు లేదు.

పగిలిన బొమ్మల ముక్కల్ని
కూలిన గోడలకు దారాల్తో కట్టి మాట్లాడుకున్న
ఎడతెరిపిలేని సంభాషణలు -
బయటకు రాని ఏడ్పు ముసురులో
ఆరబెట్టుకున్న చినిగిన బట్ట పేలికలు.

ఎవరెవరిని ముద్దు పెట్టుకున్ననో,
ఎవరెవరితో తన్నులాడుకున్ననో,
మూసుకున్న పాత అర్ర తలుపుల వెనుక
అనేక ఒంటరితనాలు, నా దోస్తులు -
చిమ్మచీకటి అలవాటు పడ్డకళ్ళకు
ఎప్పటికీ కాని పరిచయాలు.

నాలో నేనే, అందరికీ వినబడెటట్టు,
వాడచివర తల్లి లేని కుక్కపిల్ల ఏడుపుతో
రాగం కలిపి పాడిన పాటలు -
చిన్నతనమంతా అలుముకున్న
చెవులు చిట్లిపొయ్యె నిశ్శబ్దం.

ఈత నేర్చుకున్న పాతబావి
పచ్చటి నీళ్ళలో జరజర పాకిన
నల్లటి నీరు కట్టెలు -
చుట్టలు చుట్టుకుంటూ
బుజాలమీద నుండి జారిపోయే
పసితనపు భయాలు.

కలలో,
లోలోపలి కలల్లో
రోజూ కనబడే పగిలిన బొమ్మలు,
సుడులు తిరిగే గొంతు విరిగిన పాటలు -
వెంటాడుతుంది కందిరీగలా కుట్టే
కనికరం లేని ఒంటరి చిన్నతనం!

వాసుదేవ్ II అంతర్ముఖం II


జ్ఞాతం నుంచి అజ్ఞాతంలోకో
ఇట్నుంచి అటో
ఓ వలస.....
కళ్ళంతా గుచ్చుకుంటున్న
వెలుగు నుండి నిశీధిలోకో
అట్నుంచి ఇటో
ఓ నత్తనడక....
దిగులుకొండపై మౌనముద్ర....
వెనక్కి తిరుగుతున్న గడియారపు ముల్లు!

ఏ నగిషీ వెలుగుల మారుముఖాలూ పొసగవు,
మైనపురంగులూ అంటవు
మనసు చీకటి గదుల్లో తచ్చాడే
అస్పష్ట భావనల్లో
నిజాన్ని కప్పే నివురేదీ సృష్టించుకోలేను!
నిజంచెప్పే నాలుకెండిపోయింది.

రక్తమోడుతున్న ఓ అక్షరమో
వానకారుతున్న ఓ మేఘమో
తట్టిలేపుతుంటాయి
కళ్ళనుతవ్వి కలలను పట్టుకుంటూండగా.....

ఖాళీ గుండెకీ, నిండుకున్న మెదడుకీ
మధ్య అస్తవ్యస్త ఆలోచనలు
మరణించిన పేషేంట్ చుట్టూ
పరుగెడుతున్న నర్సుల్లా....

కాలానికి చేసిన రంధ్రంలో పరుగెడుతుంటాను
ముందుకీ వెనక్కీ....పెండ్యులంలా!
కొత్త ప్రేమికుడిలా!
హవర్ గ్లాసులో ఇసుకరేణువుల్లా
ఒత్తిడిపరుగు
కోట్లకొద్దీ నిరర్ధక పరుగులు

గంటస్తంభం గడియారం
గంటా కొట్టదు, అలారం వినిపించదు
చుట్టూ చూస్తున్న దారుణాలన్నింటినీ
కడుపులోకి లాగేసుకుని
అంతర్ముఖంలోకి జారిపోతూనే ఉంటుంది
నాలా!

ప్రసవించే వాక్యమో, స్రవించే పదమో
తోడుంటాయి....ఓదార్పుతో
ఓ పద్యంకింద నలిగిపోతుంటాను....

గుండె తెరిచిన ఏ జలపాతమూ
అంతర్ముఖంగా ఉండలేదన్నప్పుడు
ఓ పొలికేక....గుండె బద్దలుకొట్టుకుంటూ!

మనిషి మనిషిని మనిషిగా
కౌగలించుకునే రోజు
ఈ కుబుసం విడుస్తానేమొ!
ఓ మనిషీ తిరిగి రా!
మనిషిగా రా!!

జయశ్రీ నాయుడు||మనిషి పేజీ||



మనిషి తనను తానుగ ఎప్పుడూ చదువుకునే పేజీ. అర్థమయ్యిందా సరే లేకపోతే అశాంతే.. లోపలా బయటా కూడా.

తన చుట్టూ పోగేసుకున్న పేజిల్లోంచి తలా కాసిన్ని అక్షరాలు కలుపుకుంటాడు

తన ఆలోచనలతో కలిసిన అక్షరాల్లో కి తొంగి చూసి ఆప్తులంటాడు
ఆ మురిపెము కాస్సేపే

అవే అక్షరాలు అకస్మాత్తుగా యే ఉత్తర ధృవం మీదనో ప్రత్యక్షం అవుతాయి
నీ మీదే తిరుగుబాటు బావుటా ఎగుర వేస్తాయి
అప్పుడేం చేస్తావొయ్ మనిషీ

పేజీ శుభ్రం చేద్దామని
కొత్త అక్షరాలు పోగేస్తావు
ఉదయాన్నే కరచాలనం చేస్తావు
గర్వంగా మరో పేజీ తిప్పుతావు

నిజలెప్పుడూ ముందు పేజీల్లోనే వుండవు
మూలల్లో దాక్కుని నీ నిజాయితీ సిరా కోసం చూస్తుంటాయి

వంచన స్కెచ్చి వేసి మూలల్ని మూసినా
మనసు వాస్తు దాగదు
ఆకాశం లాంటి ఆత్మ ని
యే తాటాకు పందిరితోటి కప్పుతావు
కుందేళ్ళలంటి అబద్ధాల చప్పుళ్ళ హోరు
నిజాయితీ సముద్రపు ఘొష ముందు బలాదూర్

04-09-2012

సత్య శ్రీనివాస్॥గువ్వ గూడు॥



గూళ్ళూ
ఖాళీగానే
మిగులుతాయి
జీరెండిన
స్వర పేటికలా
మళ్ళీ
మధుమాసంలో
అదే కొమ్మకు
పూసిన
మరో
గూడు
కలలను
కనే
తీగ
పూల గువ్వ
నీడలా..

మెర్సి మార్గరెట్ ll చావగొట్టాలనుంది ll


ఏంటది?
చావు
అంత బలమెక్కడిది
దానికి ?

ఒక్కసారే
వెలుతురునంతా
చీకటి చాపలో
చుట్టేస్తూ

అటూ ఇటూ
వెళ్ళే గాలి దారుల్ని
గొంతునొక్కి
శూన్యపు సీసాలో
బంధిస్తూ

గుండె నుంచి
గుండెనీ లాగి
రక్తపు బంధాల్ని
ఆవిరి చేస్తూ

అడుగు అడుగుని
పాదం నుంచి నరికి
తెలియని గమ్యం ఇంకెదో
ఉందని
వేరు చేస్తూ
ఒంటిగ నడిపిస్తూ

కంటినంతా
ఖాళీ చేసి
జ్ఞాపకాల్ని
చివరి కన్నీటి చుక్కతో
రాల్చేలా చేసి

గుండెనంతా నింపుకున్న
ప్రేమ శ్వాసని
ముక్కు పుటాలని ముద్దాడి
వీడ్కోలు పలికిస్తూ

అవయవయవాలన్నీ
ఆటలాడే సమయం
తీరిపోయిందని
బ్రతుకు గంటని చివరి సారి
మ్రోగించి
జీవ నాడుల కర్నభేరి
పగులగొడుతూ

ఎక్కడిదీ మరణం
ఎవరు పుట్టిచ్చింది ?
ఏ శాపపు ఫలితం
ఈ చావు రూపమెత్తింది
కనిపిస్తే కసిగా
చావునే
చావగొట్టాలనుంది ...

4-09-2012
( ఒక వార్త విన్నాక ఏమి తోచని స్థితి.. చావు చేసె దూరాన్ని ఏ కొలతలు కొలవలెవేమో)

కొనకంచి లక్ష్మీనరసింహారావు॥గుప్పిట్లొ నయాగరా॥


నేస్తం ...
ఒద్దు ----
నాగుండె గదిలోకి తొంగి చూడకు .
అక్కడ -- ఓ ఆశ
గబ్బిలమై చూర్లో
వేలాడుతూంటుంది

అలంకరించుకున్న ఓ ఊహ
నిలువునా
అస్తిపంజరమై దగ్దమౌతుంది
సితలేని అశోక వ్రుక్షం
కాలలేని ఖాండవ వనం
నా మదిలో వున్నా
ఇది నాగది ----
ఒద్దనడానికి నువ్వెవరు ?

నీ మెజిక్ పెదవులమీద
విచ్చిన నందివర్ధనాల్లా
చిరునవ్వులు పూసినప్పుడు
నాలో మిగిలిన ఒక్కప్రాణం
శ్రుతితప్పి --గతితప్పి
లయమై -- విలయమై
కసిగా --- మసిగా
నేలమీద మిగులుతుంది

అయినా

అడ్డగించటానికి నువ్వెవరు ?
ఖేదానికి --మోదానికి మధ్య
గుప్పిట్లొ నయాగరాలా
నీవు జారిపొతుంటే
జీవితం మొత్తం
బోయీలు లేని పల్లకీ అయినా
నీ
ముందే
మోకరిల్లిన నక్షత్రరాశిలా నేను