పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
ఎం. నారాయణ శర్మ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఎం. నారాయణ శర్మ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, అక్టోబర్ 2013, మంగళవారం

కవిత్వ విశ్లేషణ

సంధ్య యెల్లాప్రగడ-తీరని ఒంటరితనం
 



 

కవిత్వానికి సమాజం,వ్యక్తిగతమైన ఉద్వేగాలు కారణాలు.సౌందర్యం లోనూ ఇలాంటి ఉద్వేగాలు వాటికి కారణలుంటాయని పూర్వుల వాదన.వర్ణిస్తున్నప్పుడు స్థితి వర్ణన(status discription)ఒకటి కనిపిస్తుంది.అనుభోక్త(Expeerienser)గా కవిత్వం చెబుతున్న వాళ్లలో ఈతరహా కవిత్వీకరణ కనిపిస్తుంది."నేను"అనేది ఒకటి ఇందులో కనిపిస్తుంది.ఇందులోనూ సమాజం అంతర్గతంగా ప్రవహిస్తుంది.

సంధ్య యెల్లాప్రగడ కవితలో ఈ నేను ఉంది.ఇందులోని స్వరం ఓ ఒంటరితనాన్ని తిరస్కరిస్తూ వినిపిస్తుంది.తాననుభవిస్తున్న ఒంటరితనాన్ని,బాధని కవిత్వీకరించారు.

"తీరని వంటరి తనం
నాకు మాయని గాయాని చేసింది"-
"ఒక్కొక్క కదలిక ఒక్కొక్క పామై..
నా కాలిని మెలి వేశాయి !"
"కన్ను రెప్పల క్రింద దాచిన కన్నీరు
రక్తం లా వెచ్చగా మసులుతోంది!!"
"ఇది సమరమని తెలుసు...
ఇది నా ఒంటరి సమరమని తెలుసు."..
"జయాపజయములు ఏమైనా
వేసే ప్రతి అడుగు లక్ష ప్రశ్నల సమాధానం! "

ఈ కవితని పూర్వ ,పర భాగలుగా చూడవచ్చు.తాననుభవిస్తున్న సంఘర్షణని చెప్పి.రెండవభాగంలో తనకు కావలసింది చెబుతారు.పైది మొదటి భాగం.ఒకతోడులేక తననుభవించే మానసిక సంఘర్షణ ఎదుటివారిలో కలిగించడానికి ఐదు కళాత్మక వాక్యాలుగా అందించారు."గాయం/పాము/మెలివేయటం/కన్నీరు/రక్తం"ఇవన్నీ బాధని తరువాత వాక్యాలు తన నిర్ణయాన్ని,తెగువని చెబుతాయి.


"ఏకాంతంతో సహవాసం
జీవిత గమ్యాలు, దిశా నిర్దేశాలు లేని గమనం
సాగి వేగి కడతేరేది ఎప్పుడో!
స్వచ్చమైన నీ తోడూ దొరికేది ఎప్పుడో!"

ఇది రెండవభాగం.నిజానికి "గమ్యం,దిశానిర్దేశం"లాంటి పదాలు లేకపోతే ఈ కవిత ఎవరిగురించనేది అర్థం కాదు.చెప్పదలచుకున్న అంశాన్ని గాఢంగా చెప్పడం.అందుకోసం నిర్మాణ వ్యూహాలను ఏర్పర్చుకోడం ఇందులో కనిపిస్తాయి.

కవిత్వం రాస్తున్న వాళ్లలో కొన్ని దశలుంటాయి.ఒక గొంతు బలాన్ని వీటినుంచే అంచనా వేయవచ్చు.వస్తువును పట్టుకోవడం దగ్గరినించి,కవిత్వీకరించడం,హృదయాన్ని తట్టే వాక్యాల్ని చెప్పడం వీటివెనుక పదిలమైన సాధన,అధ్యయనం అవసరం.ఇలాంటి సమయాలలో కొంతమంది కొన్ని గుర్తుల్ని అనుసరిస్తుంటారు.తొలి దశని గమనిస్తే పదాలలో బలవంతపు ప్రాసని అనుభవించడం.ఒకటి రెండువాక్యాలు యూనిట్లతో పూర్తిచేయటం లాంటివి.

సంధ్య గారిలో వీటన్నిటినించి తప్పించుకున్న పరిఙ్ఞానం ఉంది.ఇంకా కొంత స్పష్టమైన నిర్మాణ ధార ఈకవితకి కావాలి.మరిన్ని మంచి కవితలు సంధ్య గారినుంచి ఆశిద్దాం.


                                                                                                                  
                                                                                                              __________ఎం. నారాయణ శర్మ    

కవిత్వ విశ్లేషణ

తిలక్ బొమ్మరాజు-చెట్టు





 


చెట్టు అనాదికాలంగా గొప్ప కవితా వస్తువు.చెట్టుని ఆదర్శమయంగా,త్యాగ శీలిగా నీతిశాస్త్రం అనేక కోణాలలో అభివర్ణించింది.సత్పురుషుడుగా చెప్పింది.

"ఛాయామన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయమాతపే
ఫలాన్యపి పరార్థాయ వృక్షాః సత్పురుషా ఇవ"

(చెట్టు తను ఎండలో వుంటు ఆశ్రయించిన వారికి నీడనిస్తుంది.ఇతరుల కోసం ఫలాలను కూడా ఇస్తుంది.సత్పురుషుడిలా)

తెలుగులో మనకి"చెట్టుకవి"(ఇస్మాయిల్)ఉన్నారు.ఏ కాలానికైనా చెట్టు గొప్ప వస్తువు.అలాంటి చెట్టు వస్తువుగా రాసిన కవిత తిలక్ "చెట్టు".ఇందులో తిలక్ లో ఒక ఉద్వేగం కనిపిస్తుంది.చెట్లను నరకడం పట్ల స్పందించి,భవిష్యత్తుని ఊహిస్తున్నారు.అనేక అవసరాలకోసం చెట్లపై జరుగుతున్న పనులని తిరస్కరిస్తున్నారు.

"నా తనువునంతా/తొలిచేస్తూ/తడియారని కొమ్మలపై
మానవ త్రాచుల/గొడ్డలి వేట్లు ",

"నవ్వుతున్న/వెన్నెల పూలు
నా ఒళ్ళంతా/తుంచేసేవారే ... కాని తుమ్మేదవాలనిచేవారేవ­­రు ?"

చెట్టు తానుగా మట్లాడుతున్నట్టుగా ఉత్తమ పురుష కథనం.త్రిపురనేని గోపిచెంద్ "మాకూ ఉన్నాయి స్వగతాలు"లో ఇలాంటి శైలి కనిపిస్తుంది.అందులోనూ ఓ తుమ్మ చెట్టు కథ ఉంది.మంచి భారమైన వాక్యాలున్నాయి.గొంతుకని సమర్థవంతంగా అవి ప్రసారం చేస్తాయి.

"నా మనసంత దిగులే/రాలిపోయిన ఆకులను
చూస్తే/హృదయమే బరువవుతుంది/నా జాడే కరువైతే"

"ఒడిలిన ఆకులకన్న/రాలిన పువ్వులకన్న బాదిస్తోంది నేను లేని
నా భూమిని పరికిస్తే/కూకటి వేళ్ళతో పెకలించేసారు/నా నేస్తాలెందరినో"
రెండు స్థితుల సంఘర్షణని చూపారిక్కడ.రాలిన ఆకులు,తనులేని భూమి ఈరెంటినించి తిలక్ వచనం సాగింది.సాధరణంగా కవిత్వంపై ప్రతిఫలనాలుంటాయి.తిలక్ కవితపై సామాజిక ,వైఙ్ఞానిక ప్రతిఫలనాలున్నాయి.చెట్టులేని వాతావరణాన్ని ,ఆయా క్రమాలని ఊహించి జాగృతులని చేస్తున్నారు.


"పొదిగిన గూళ్ళు అన్ని చెదిరిపోయాయి ఇక నాలో ఒదగలేక ఆకసం సైతం అలిగింది/నా నిష్క్రమణతో"

"మేఘం ఉరమనంటుంది
నేను లేని ఈ ధాత్రిలో చినుకు కురవనంది చెంతకురానివసంతాన్ని/చూసి "

ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు "శ్రీ రామచంద్ర లఘు కావ్య సంగ్రహః"అనే గ్రంథంలో ఓ కథలో వృక్షంలేని నగరాన్ని చిత్రించారు.అందులో "రావణ నగరి లంకాయాం షడపి రుతవః "అంటూ రావణ నగరంలోని వృక్ష రక్షణ గూర్చి చెబుతారు.ఈ క్రమంలో పరోక్షంగా తిలక్ ప్రపంచీకరణని తిరస్కరిస్తున్నట్టు కనిపిస్తాడు.కాని వాక్య రూపంలో ఇది కనిపించదు.

"మానవ త్రాచులు/వెన్నెల పూలు/వొదగలేని ఆకసం"లాంటి పదబంధాలతో పాటూ "చినుకు కురవనంది చెంతకు రానివసంతాన్ని చూసి"వంటి కళాత్మక,అనుభూతి వాక్యాలున్నాయి.

కొత్తగా రాస్తున్న ప్పుడు కవిత్వాన్ని ఒక రూపంలోకి తెచ్చుకోవటం కూడా అవసరం.వాక్యాలని యూనిట్లుగా రాస్తున్నప్పుడు.ఆవాక్యాల రూపం అవగాహనని అడ్డుకోగూడదు.వాక్యాల సమగ్ర రూపమే కవిత సమగ్రతని నిలబెడుతుంది.పద బందాన్ని "వరుస"లో రాయగూడదని కాదు కానీ దానివల్ల అర్థ సంబంధంగానో,వస్తు సంబంధంగానో ఒక అవసరమో,ప్రత్యేకతో ఉండాలి.

వేరువేరుగా వరుసలు,వాక్యాలు,యూనిట్లు రాస్తున్నప్పుడు కూడా అర్థం, వ్యక్తీ కరణ ప్రధానం.ఈ విభాగాలని ,వరుసలని రాస్తున్నప్పుడు శ్రద్ధ అవసరం.

మంచికవిత అందించినందుకు తిలక్ బొమ్మరాజు గారికి అభినందనలు.ఇంకా సాధన,అధ్యయనంతో మరిన్ని మంచి కవితలకోసం తిలక్ తనను నిలబెట్టుకోడానికి దగ్గరలో ఉన్నారు.

"వృక్షోరక్షతి రక్షితః"అనే కాదు"నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను" అని మనమంతా నమ్మితే చాలు.




                                                                                                              __________ఎం. నారాయణ శర్మ