పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Praveen Poet లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Praveen Poet లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, సెప్టెంబర్ 2012, శనివారం

చింతం ప్రవీణ్ || వాడు...


నేను నడుస్తున్నానన్నా మాటే గాని
నా అడుగులు హైజాక్ చేయబడ్డాయ్

నేను బిగించిన పిడికిలిలో
నా ఆవేశం హైజాక్ చేయబడ్డది

నేను నినదిస్తున్న గొంతులో
నా నినాదం హైజాక్ చేయబడ్డది

చివరికి
నా అన్నదమ్ముల బలిదానాల్లో
త్యాగం హైజాక్ చేయబడ్డది

కాంగ్రేసోల్లు...
పచ్చంగోల్లు...
ఒక్కన్ని మించిన దొంగలు ఒకలని
వాన్ని నమ్మినం
వాని జెండాలు మోసినం...

ఆ జెండా వెనకాలే
నడిచినం...
పరిగెత్తినం...
నినదించినం...

ఇప్పుడు
ఆ రంగులమారి జెండా వెనక దాగున్న
నెత్తుటి అజెండా తేటతెల్లమైంది...

నాకేం ఎరుక వాడు

చేతులు కట్టేసి
పిడికిలి బిగించమన్నడని
గొంతు నొక్కేస్తూ
నినాదమివ్వమన్నడని
నడుస్తున్న దారిని తవ్వేసి
పరిగెత్తమన్నడని

నాకేం ఎరుక వాడు
ఆకాంక్షను అంగడి చేసి
ఉద్యమించమంటున్నడని
వేదికలన్నీ కూల్చేసి
ప్రసంగించమంటున్నడని
నిలువెల్లా గాయం చేసి
మందు పూస్తున్నడని...

నిజానికి
వాడెప్పుడూ అంతే...
జనాలు నెత్తురోడుతుంటే
మౌనమే వ్యూహమంటడు
ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుంటే
వూరౌతల వుంటడు
పోరాటానికంతటికి
పేటెంట్ దారున్నంటడు...

26.09.2012

చింతం ప్రవీణ్ || ప్రియమైన వ్యక్తికి...


మీలోని ద్వేషాన్నంత భరిస్తూ
మీలోని ప్రేమ కోసం
రంధ్రాన్వేషణ చేయలేను_

ఇంకా చిన్నవాణ్ణే
మీరు ప్రదర్శించేదంతా
ప్రేమే అనుకోలేని వెర్రివాణ్ణి

ఎవరి హృదయంలోకి
బలవంతంగా చొరబడలేని
అసమర్దున్ని
నన్నిలా వొదిలేయండి

మీరు ప్రేమిస్తారో ద్వేషిస్తారో
అది మీ ఇష్టం...
ప్రేమించాలని మనమెప్పుడు
అంగీకారపత్రం రాసుకోలేదు కదా!

కానీ చివరగా ఒక్క మాట
ఒక్కసారి ప్రేమించైతే చూడండి_

ప్రేమ సర్వ అవస్థల మూలమే కావచ్చు
సర్వదుఃఖాల చికిత్సాలయం కూడా
ఎవ్వరిని ద్వేషించాలన్నా
ప్రేమించటమే ప్రాధమిక సూత్రం_

ప్రేమిస్తున్నోడిని కాదు
ద్వేషిస్తున్నోడిని ప్రేమించగలగాలి
సుఖాన్ని కాదు దుఃఖాన్ని ప్రేమించగలగాలి

బహుశా
మీరనుకుంటున్నారేమో!
ఏ హృదయమైనా వెతుక్కుంటూ
మీ దగ్గరికే వస్తుందనీ
కావచ్చు గాక
మీరు గుర్తించకపోతే
ఏకాకి గుండెచప్పుడే

ఎవ్వరు మిగలరూ
ఒంటరిగా జీవితాంతం_

ఒక్కసారి చెదిరిన హృదయానికి
ఎన్ని వేల ప్రేమ పూతలు పూసినా
ప్రయోజనం ఉండదు

నా ప్రేమకు గుర్తుల్లేవేమో
మీ ద్వేషపు గుర్తులు
శాశ్వతంగా మిగిలిపోతాయ్...

చివరిసారిగా
ఒక్కసారి సముద్రాన్ని చూడండి...
నదులు ఆటుపోట్లు సృస్టిస్తున్నాయని
నదులను వెలివేయడం లేదు కదా
సముద్రమెప్పుడూ మీలాగే?...

25.09.2012

27, సెప్టెంబర్ 2012, గురువారం

చింతం ప్రవీణ్ || నేను-నువ్వూ


ఎన్నివేల ఏండ్ల అనుబందమో
మనిద్దరిది_

నాలా నువ్వు
నీలా నేను
ఎన్ని వేలసార్లు రూపాంతరం చెందామో!

నాకు నువ్వు లేకపోతే
నింగి నీరు నిప్పు గాలి అన్నీ
శూన్యమే కదా_

ఎన్ని వేల సముద్రాలను
ఎన్ని లక్షల నదులను నీలో దాచుకున్నా
ఎన్ని అగ్నిపర్వతాలను గుండెల్లో మోస్తున్నా
ఎప్పుడు నిర్మలవదనంతో ఉంటావ్
చూడగానే చేతులెత్తి మొక్కేలా_

నేను లేనప్పుడు నీలో
ఎన్ని విస్ఫొటనాలు సంభవించలేదు
ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలవ్వలేదు
నువ్వెన్ని గ్రహాల చుట్టూ తిరగలేదు
నా తోడు కావాలని_

ఎప్పుడైతే నేను వచ్చానో
ఎంతగా మురిసిపోయావో
ఇంకెంతగా ముద్దాడావో
తోడు లేక గడిపిన క్షణాలు గుర్తొచ్చి_

నన్ను నువ్వు గాఢంగా ప్రేమిస్తావ్
నాకోసమే కొన్ని యుగాలు ఒంటరి జీవితం గడిపావ్ కదా

నువ్వు కార్చిన కన్నీళ్ళు సముద్రాలై
నువ్వు చిందించిన ఆనందబాష్పాలు నదులై ప్రవహించాయ్
నీ ప్రేమకు గుర్తులుగా
కొండలు కోనలు చెట్టు చేమా అవతరించాయ్
ఒక్కటేమిటి నీ అణువణువు ప్రేమమయం...

నీ తనువులో
ఏ అణువును తాకినా
పులకించిపోయాను
తన్మయత్వం చెందాను_
నన్నింత వెర్రిగా ప్రేమిస్తున్న నిన్ను
కౌగిలించాలనీ
ముద్దులాడాలనీ
నా చేతుల్లోకి నిన్ను తీసుకోని మురిసిపోవాలని
నాకనిపించని క్షణం లేదు

ఐతే నేనేమి చేస్తున్నాను?
నిన్ను అనుభవించే వరకే నటిస్తున్నాను

నీతో సహజీవనం చేస్తూనే
నీలో అణువణువు చరిస్తూనే
నీనుండి దూరంగా జరిగిపోతున్నాను
ఓ పక్కన ఒరిగిపొతున్నాను
నీ కోపానికి గురౌతున్నాను

నీ ప్రేమే కాదు
నీ కోపం నాకు తెలుసు...

ఒక్కసారి నువ్వు శివాలెత్తితే
కంపించిపోతాను
భయంతో పరుగులు తీస్తాను
బిక్కుబిక్కుమంటు నిన్ను వేడుకుంటాను
నువ్వు వెంటనే శాంతిస్తావ్

మళ్ళీ షరా మామూలే!
నిన్ను గాలికొదిలేస్తాను

నా పెంపుడు జంతువులే నాకన్నా
నయమనిపిస్తున్నాయ్
చివరి శ్వాస వరకు నీకు విశ్వాసంగా ఉంటున్నాయ్

ఓ భూకామాంధు నిన్ను రంపపుకోత కోస్తున్నా
ఇంకో దుర్మార్గుడు నీ అణువణువూ కబలిస్తూ
నిన్ను మరు భూమిలా మారుస్తున్నా
నాకు స్పందనుండదు

ఛీ! వెదవ జన్మ
దేన్ని పొందుతున్నామో
దేన్ని పంచుకుంటున్నామో
దాన్ని కాపాడలేకపోతున్నాం_

నీకు దూరంగా
ఎన్ని వేలమైళ్ళు నడిచినా
ఒక్క అడుగైనా
నీకు తెలియకుండ వేయగలిగానా?

(భూమిని రక్షించండి)

20.09.2012

22, సెప్టెంబర్ 2012, శనివారం

చింతం ప్రవీణ్ | | మొఖం లేనోడు||


వాడికీ
హృదయముంటుంది
దానికి స్పందన ఉండదు
అది స్పర్శించదు_

వాడెప్పుడూ
అవసరాల అక్కసుల నడుమ
అనుబందాల సాలెగూడు అల్లుతుంటడు

అప్పుడప్పుడు_
వాడి మాట వినపడుతుంది
వాని చేతలు కనపడుతాయ్
కనిపించనిదల్లా
వాని మొఖమే

నిజానికి
వాడెప్పుడో కాటకల్సిండు
మంచితనం నుండి
మనిషితనం నుండి

వాడెప్పుడూ
కారణాలు వెతుకుతుంటడు
ద్వేషించటానికి_
ఊరు వాణ్ణి ప్రేమించటానికి లాగా_

గడిచిన ప్రతీ నిమిషం
పలికిన ప్రతీ మాట
ఎదురుతిరిగి ప్రశ్నిస్తున్నా_

నడిచిన ప్రతీ దారి
విడిచిన ప్రతీ అడుగు
రెప్పపాటు దూరంలో వెంబడిస్తున్నా_

కాంక్రీట్ పై చరిస్తున్నవాడు
హృదయాన్ని కాంక్రీట్ లాగా మార్చుకుంటడు
నాగరికత నీళ్ళు తాగి బండబారిపోతాడు

ఊరిడ్సిన వాడు
ఊరును విడిచేస్తడు

(ఊరుతొ పాటు ఊరుపై మమకారాన్ని వదిలేసినోళ్ళ కోసం)

18.09.2012