పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Karlapalem Hanumantha Rao లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Karlapalem Hanumantha Rao లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, నవంబర్ 2012, గురువారం

కర్లపాలెం హనుమంత రావు॥కావలిమనుషులు కావాలి॥


1
నాతిచరామి సంకల్పం చెప్పుకుని
అగ్నిసాక్షిగా సాప్తపదీనం చేసిన వాడు

కడదాకా తోడుంటాడని పుస్తెల నమ్మకం
వెన్నులో ఎన్ని పోట్లు దిగినా
ఆ మొదటి వెన్నెలరాత్రి కుసుమపరిమళశోభే
సంసారాశ్వాస విశ్వాసజ్యోతి కొండెక్కకుండా ఆపే అఖండశక్తి
దింపుడుకళ్ళెం దగ్గరా కన్నపేగు
ఆఖరి పిలుపు ఆసరానాసించే
ఆఖరినిశ్వాసం అసలు స్వభావస్వరూపం విశ్వాసం
వరదలో పడి మునకలేస్తున్నా
గడ్డిపోచకోసం గుడ్డి ప్రార్థనలు చేసేది ఆ విశ్వాసమే
చెట్టూ పుట్టా రాయీ రప్పలోనైనా సరే
కంటిపాపను చంటిపాపలా కాపాడే రెప్పల్నే మనిషి కలగంటాడు
చుట్టూ పెరిగే లోకం తనకేనని ఓ గట్టి నమ్మ్కకం
అమృతసాధనే ఆఖరి లక్ష్యమైనప్పుడు
హాలాహలం రేగినా మింగే శంభుడొకడుంటాడన్న భరోసా
శీలవతి మానరక్షణకు పరీక్షసందర్భం ఏర్పడప్పుడల్లా
అపద్భాంధవుడిలా అడ్డొచ్చి ఒడ్డునేసిన ఆ విశ్వాసం
కనిపించుట లేదు

2
కంచెపైని నమ్మకమే లోకంచేను నిశ్చింతనిద్ర రహస్యం
కంచెలే చేలని ఇంచక్కా భోంచేస్తున్నకాలం ఇది
కడబంతి దాకా ఆగే ఓపిక ఎవడికీ లేదు
అయినవాళ్ళకన్ని వడ్డనలూ ప్ర్థథమ విడతలోనే పరిసమాప్తం
గజాననులకు గణాధిపత్యం ముందే ఖాయమైపోయుంటోంది
అమాయక కుమారుల తీర్థస్నానాలన్నీ వట్టి ప్రహసనాలే
ఆషాఢభూతులకివాళ వేషాలు కూడా ఎందుకూ దండగ!
ప్రజాపాండవులనలా అజ్ఞాతంలో ఉంచే నయానయా వంచనల
పంచదార గుళికలనిలా పంచుకుంటూ పోతే చాలదా!
దేవుడి మీదో రాజ్యం మీదో
ప్రమాణాలు చేయడం పాలకులకదో వినోద విధాయకం
న్యాయరక్షకులే నేరగాళ్లతో సరిసమానంగా బోనుల్లో నిలబడుతున్న
విశ్వాసఘాతుక పతాకసన్నివేశమాలికే ప్రస్తుతం నడుస్తున్నది

3
నమ్మకానికి అపనమ్మకానికి మధ్యున్న సన్నగీతను
ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎందుకు చెదరగొట్టారో నిగ్గు తేలాలి
ప్రజావిశ్వాసమెంత కంటకప్రాయమైనా
కీరీటమల్లే మోసే జనంకావలిదళం మళ్ళీ కావాలి
కేజ్రీవాలులో మాజీ జయప్రకాషులో
నమ్మి వదిలిన విశ్వాస కపోతాన్ని తిరిగితెచ్చే నేతలు
మళ్ళీ పుట్టుకు రావాలి!

24, అక్టోబర్ 2012, బుధవారం

కర్లపాలెం హనుమంత రావు॥ప్రపంచీకరణ పంచ నుంచీ…॥

1
వర్తమానం జ్ఞానంగా ఘనీభవించక ముందే
కాలం చరిత్రలోకి జారుకుంటుంది

నాటకమని తెలిసీ
పాత్రల్లో లీనమైపోయే రసబలహీనత మనసుది
చప్పట్ల సంబరంలో మూతివిరుపుల సందేశం
పట్టించుకోటం వెంగళాయితనం!
విజయవంతమైన ప్రతి ప్రదర్శన వెనకా
హృదయశల్యమైన కథలనేకం కద్దు
జీవితం నాటకమని తెలిసీ
నటన్నే జీవితంలా ప్రేమిస్తే
ఆఖరి సీనులో అమాయకత్వానికి
పట్టే గతేమిటో
చరిత్ర చర్విత చరణంగా చెపుతూనే ఉంది

2
రావణసంహరణ కైకమ్మకోర్కెల మధ్య కార్యకారణ సంబధమేంటి?
కృష్ణ రాయబారసారం సత్యప్రమాణకంగా ధర్మసంస్థాపనార్ధమేనా!
శకుని పాచికలఎత్తులసలు లోతులెంతెంత?
కళింగయుద్ధంనాటి ఎన్ని యోధకుటుంబాల కన్నీళ్ళు
బాటలకిరువైపులా నాటిన అశొకుడి చెట్లనీడలయినట్లు?
విజాయానికి జేజేలు పలికే లోకానికి
జీవితంమ్యాచి వెనక జరిగే ఫిక్సింగు తతంగం
తోలు వలిచి తినిపించినా గొంతుదిగని అరటిపండు !
చెప్పటం వరకే చరిత్ర పాత్ర
చెవి మెలిపెట్టేంత ప్రేమ ఎందుకుంటుంది!

3
శృంఖలాలే కంకణాలాయ
గాటక్కట్టిన మోకు వ్యాసార్థపరిధికే
సర్వపురుషార్థసారమూ సమర్పితమాయ
ముక్కవాసనకే కుక్కముక్కు తోకూగిపోతుందాయ
వేగుచుక్కలు పైనెంత ప్రజ్వలిస్తేనేమి
మనిషి మోరెత్తి చూడలేని మకురు వరాహమైనాక!
నిప్పును కనిపెట్టిన అనాది నిశితత్వం
అంగారకందాకా మానవపాదాన్నెగరేస్తుండచ్చు
మరో వంక నీరోల ఫిడేలు రాగాలకి
మనిషిక్కడ చంకలెగరేస్తున్నాడే!
రోములా తగలబడతావురా మొర్రో అనెంత మొత్తుకున్నా
హత్తుకొనే మెదళ్లేవీ!

4
క్లోజుకొచ్చిందాకా సీజరుకి
బ్రూటస్ బాకు కంటపడనేలేదు
ఏకలవ్యుడి మూఢగురుదక్షిణ విలువ కుడిబొటనవేలు
దుష్టసాన్నిధ్యం దానకర్ణుడికి తెచ్చిపెట్టింది హీనకీర్తినే
తవ్వినకొద్దీ గతమంతా
ఎవరో ఎవరెవరివెనకో తవ్విపోసిన గోతులూ గుంతలే!
కళ్ళగంతలతోనే కుప్పిగంతులేస్తున్న మనిషీ
మెరిసేదంతా బంగారమేనని మురస్తే
మరి మెరుపుల షాకు?

5
ఏమి పండాలో
ఎలా వండాలో
ఎంత మింగాలో
ఎవరు మిగిలుండాలో
ఎజెండా ఎవడిదో
ఆ జెండాను మోసే భుజం మాత్రం నీదా!

6
సంస్కరణలంటే
సంస్కృతిని పరాయీకరణల పాలుచేయడమా!
అభివృద్దికర్థం
రూపాయి డాలరుబాబుగోరికి చేసే ఊడిగమా!
ఆర్థికస్వావలంబనం
ఆహాహా...ఎంతదమైన సంస్కృతమోసమో
మెడమీద ఎవడిదో కాడి
మన కాళ్ళమీద మనమే గాడిదై పరుగెత్తాలి!
సరళీకరణసారం
వాడి గరళాన్ని వేళకింత కొని
రసగుళికల్లా గుట్టుగా మింగేయటనమనే బేరమేగా!

కర్లపాలెం హనుమంత రావు॥వెలుగు బొట్లు॥



1
నీలాకాశాన్నలా దులుపుతావెందుకు?

నాలుగు వెలుగు బొట్లు నేల రాల్తాయేమో తాగి పోవాలని.
ఆడి ఆడి అలసిపోయాను
గాయాలకు మందు కావాలి

2
నది దాటాలంటే వంతెనే ఉండాలా
మడుగు అడుగున కాల్దారీ ఉంటుంది
వేగుచుక్కలు పైన వెలుగుతూనే ఉంటాయి
బాటసారికి మోరెత్తి చూడాలనే మనసు కలగాలి
క్షణం పాటు పీల్చి వదిలే ప్రాణవాయువును
ఎన్ని పైరుపచ్చల నుంచీ మూటకట్టుకుని
పడుతూ లేస్తూ వస్తుందో పిచ్చి గాలి!
కంటికి నిద్ర ఊహ రాకముందే
రెప్పలు కలల పొత్తిళ్ళు సిద్దంచేస్తాయి
గోపురాలు కందకాలు రహదారులు రహస్యస్థావరాలు
ఇలాతలాన్ని నువ్వివాళిలా యుద్ధరంగ చేసావు గానీ
ఓంప్రథమంగా పునాది రాయి పడింది ఆటలమైదానానికే
ఏడుస్తూ వచ్చిన వాడివి…
ఎలాగూ ఏడుస్తూనే పోతావని తెలుసు
ఇక్కడున్నఈ నాలుగు రోజులూ
నిన్ను నవ్వుల పూలతోటల వెంట తిప్పాలని కదూ
ఈ ఆటలూ పాటలు ప్రేమ మాటలు
కలల మీదా పెత్తనం కావాలి
అందుకే నీకీ అలసట

3
రేపటి సంగతి మరచి
నేటి గెలుపుకి పరుగు…అలుపు!

4
ఆటంటూ ముగిసాక
గెలుపోటములు ఆటల్లో అరటిపండు
చీకటి ముసిరితే ఎవరైనా ఇంటిదారే పట్టాలి
ఎక్కణ్నుంచొచ్చామో ఎక్కడెక్కడికి పోవాలో
ఇక్కడున్నన్ని రోజులూ ఎంచక్కా ఆడుకో
చక్కని మైదానం
ఆటవస్తువులు
తోటిదోస్తులు
అలుపు మరుపుకే కదా ఈ ఆటా పాట
గెలుపు కోసం అలుపు వృథా అవునా కాదా!

5
నీలాకాశాన్నలా దులపడమెందుకు
ధారగా రాలుతునే ఉన్నాయిగా వెలుగు బొట్లు
హాయిగా తాగేయ్ రేపటికి మాగబెట్టక!
మనిషి బుద్ధి చూపెట్టక!










23-10-2012

22, అక్టోబర్ 2012, సోమవారం

కర్లపాలెం హనుమంత రావు॥అలోచనా శకలాలు॥


1
కోకిల పాట
ఎంత కమ్మన

కాకెంగిలి కదా!

2
ముసురు మేలిముసుగు నుంచీ
ఆకాశం మిసిమిసి నవ్వు
-మెరుపు

3
అడుక్కుంటూ గ్యాపులో
ఆడుకునే వీధిబాలలు
-ఆర్టాఫ్ లివింగ్

4
మెలికలు తిరగడంలేదే పాపం
ఆరొగ్యంగా ఉందా
పాము!

5
ఈ గొంగళి పురుగేనా
రేపటి రంగుల సీతాకోకచిలుక!
కాలం గొప్ప కాస్త్యూమ్ డిజైనర్

6
నరపురుగు లేదు
అడవికెంతానందమో!

7
మనసుతో నడివకే
బతుక్కు
అలసట

8
ఎంత ప్రశాంతంగా ఉందీ!
గుండె
శవాసనమేసినట్లుంది

9
స్నేహం
మనిషి
-మనిషివ్యసనం

10
పొగడ్త అగడ్త
దూకడం తేలిక
తేలేది లేదిక

11
ఎప్పుడు వెలిగించిందో
వెలుగులు విరజిమ్ముతోంది
-గీత

12
రెండో తరగతి రైలు బోగీ
చదివేవాడికి అదే
కదిలే తరగతి గది









20-10-2012

29, సెప్టెంబర్ 2012, శనివారం

కర్లపాలెం హనుమంత రావు॥ఆలోచనా శకలాలు


1
పువ్వుతో పాటు
పొద్దూ తిరుగుతోంది
బిడ్డ చుట్టూ తల్లిలా

2
నాన్న రాయని
వీలునామా
అమ్మ

3
కొన్ని దృశ్యాలు అతుక్కుపోతాయి
కొన్ని దృశ్యాలు అలుక్కుపొతాయి
కొన్ని దృశ్యాలు అడుక్కుపోతాయి
మనసు సరోవరం

4
సముద్రం
కన్నీరు ముందు
పిల్లకాల్వ

5
రూపాయి-నోటు
పాపాయి
-ప్రేమ ప్రాంసరీనోటు

6
వేదానికైనా
వేదనే మూలం
రామాయణమే వేదం

7
గింజ
గాదెలో ధాన్యం
భూమిలో జీవం

8
స్వర్గం టూ నరకం
వయా భూలోకం బస్
ఫుల్

8a
నరకం టూ స్వర్గం
వయా భూలోకం బస్
నిల్

9
రెడ్డొచ్చె
మొదలాడు
-జీవితం కదా!

10
రాత్రి ఎప్పుడు పెట్టిందో!
మందారం పండింది నాన్నరచేతిలో
అమ్మప్రేమ గోరింటాకు మహిమ

11
సందు ఇరుకైనా
ఇళ్ళు విశాలం అప్ప్టట్లో
ఇళ్ళు విశాలమే
గుండె లిప్పుడు గుప్పెట్లో

కర్లపాలెం హనుమంత రావు ॥ కొన్ని చురకలు


1
ప్రతి ఏడాదీ పోలింగ్ చుక్కలే
ఐనా పోలియో
మన ప్రజాసామ్యానికి!

2
బెల్టుబాంబుకు కొందరే
బెల్టుషాపుకు
ఎందరో!

3
క్విడ్ ప్రో కో
పెద్దల
నగదు బదిలీ

4
గద్దె మీది
'గోవింద'రాజులకు
స్విస్ బ్యాంక్ లాకర్లే
ఆరో గది

5
యూరియా మెతుకు లేదు
యురేనియం సంపెంగ నూనె
దేశం మీసాలకి!

6
చిన్న చినుక్కి ఎంత శక్తో!
చిటికెలో నగరం
హిందూమహాసాగరం

7
ముళ్ళెక్కువా
పూలు తక్కువ
మన్మోహను సర్కారు
బ్రహ్మజెముడు సంస్కరణలకు

8
మీడియా మేధావులు
మరీ ఎక్కువై పోయారు
తెనాలి రామలింగులూ
తెలారంగానే
జుట్టుకు తెల్లరంగుతో తయారు!

9
రాజులు డొక్కు బస్సుల్లో
బంట్లు బుగ్గ కార్లల్లో
భలే ప్రజాస్వామ్యం!

10
వేలు పట్టుకు నడిపించిన అమ్మా నాన్న
వేలు విడిచిన చుట్టాలయారా కన్నా!
వేలు సంపాదిస్తునావనా..హన్నన్నా!

11
పిడుగు ముందూ
మెరుపు తరువాతా
ప్రియురాలి చెంప దెబ్బ

కొసరుగాః
12
ఆక్రో శాక్రోశ ఘోషంబై
వికట కఠోరాట్టహా సోద్భటం బై
వక్రభూవల్లరీ సంవలన భయదంబై
స్ఫార నిశ్వాస ధారా చక్రంబై
కంగారొద్దు
మా అటక మీది తాళ పత్రాల
వట్టి తాటాకు చప్పుళ్ళ గోల

24, సెప్టెంబర్ 2012, సోమవారం

కర్లపాలెం హనుమంత రావు ॥ చురకలు ॥


1
పాండవులు కనిపించరు
పాత 'మాయాబజారు'
కౌరవులూ కనిపించరు
కొత్త మాయ'బజారు'
తస్మాత్ జాగ్రత్త!

2
నరికితే చావడానికి
చెట్టు
మనిషి కాదు
-చివురు

3
ఆలూ మగలు
పాలూ నీరు
ఎవరి పాలు ఏదో
తేలకే పోరు

4
గెస్ట్ రోల్సే
బిగ్ హీరోస్
విచిత్రం
-యూపీయే-2 చిత్రం

5
గడియారం ఎందుకంట
దండగ
కరెంటు ఠంచనుగా
కోస్తుండగా

6
వయసుకు
మనసు
సమకాలీనం కాదు
కదా ఎన్డీ తివారీ!

7
తెలుగుగంగ సరే
తెలుగూ గంగలో
కలుస్తున్నదనే బెంగ

8
అగ్ని సాక్షిగా అయింది పెళ్ళి
అగ్గే బుగ్గి చేసింది మళ్ళీ
అగ్గీ
నువ్వ్వూ అత్తారికి అంత దగ్గరి చుట్టమా!

9
అశోకవనంలో అందరి మధ్యున్నా
సీతకు అగ్నిపరీక్ష
అడవిలో ఒంటరిగా ఉన్నా
రాముడికేదీ శిక్ష!
ఏం కలికాలం... త్రేతాయుగం!

10
మన చట్టసభల మెడలో
వేలాడేయాలనుంది
'ఇంగిలిపింగీసు ఐ నెవ్వర్ పలక'
పలక

22, సెప్టెంబర్ 2012, శనివారం

కర్లపాలెం హనుమంత రావు॥కొన్ని ఆలోచనా శకలాలు॥


1
ఈ చినుకు
ఏ సముద్ర
ఆనందబాష్పమో!

2
ఎవరన్నారు
కాలం గుప్పిట్లో చిక్కదని?
నాన్న ఫొటో!

3
కుట్టకుండా వదిలేసింది
గండు చీమ
ఎంత విశాల హృదయమో!

4
కంటికీ చేతులుంటే
ఎంత బాగుణ్ణో
కదా ఊహాప్రేయసీ!

5
ఎక్కినా
దిగినా
అవే మెట్లు

6
నలుపు తెలుపుల్లో
ఎన్ని రంగులో
పాత మిత్రుల గ్రూప్ ఫోటో!

7
మాయాలోక విహారం
పుస్తకం
కీలుగుర్రం

8
కోయిల కూస్తోంది
మావి చిగురు
మిగిలుందని!

9
మింటి మీదా
వంటి మీదా అర్థచంద్రులు
రాత్రి సార్థకం

10
తట్టి
తడిపింది
హైకూ

11
ఫొటోలోని బాబుకి తెలుసా
తనలాంటితనే తనను చూస్తాడని
నా పాతఫోటొ మాబాబు చేతుల్లో!

కర్లపాలెం హనుమంత రావు॥థింక్ ట్వైస్ బిఫోర్ యూ సింక్॥


1
రోమియోకి రోడ్ మ్యాపు లేదు
జ్యూలియట్ హృదయాన్ని చేరడానికి
కొట్టినపిండనుకున్న పారూ మనసుకి
దారెటో తెలీక దేవదాసు తడబడ్డాడు
ప్రేమయనగా రొండు హృదయములు ఒకే పన్ థాన నడుచుట
ము.వెం.ర కథలో హిందీ చిత్ర దుబాసీ అనువాదం
ఆ పన్ థా ఏమిటొ అంతుబట్టకే కదా ఇంత కథా!
2
ఈ రాణీ ప్రేమ పురాణం ఇది కాదోయ్ చరిత్ర సారం
ఓకేనండీ మహాకవి శ్రీ శ్రీ గారూ
మరి క్లియోపాట్రా కొటేరుముక్కు నెక్కడ పాతేస్తారూ!
సమాధికైనా బెదరని అమరప్రేమ కదరా అనార్కలిది
సమాసాలు తింటూ తాగే మొగలయీ చాయా అది!
తాజ్ మహల్ తాజాదనం రహస్యమంతా
ముంతాజ్ మేలిముసుగు అనురాగంలోనే ఉంది
భాగ్యమో అభాగ్యమో
భాగమతీమోహంలో పడి మతంటూ పోయాక
కులీ బాదుషా కానీ కూలీ పుల్లయ్యే కానీ
అందరిదీ ఒకే మాదిరి హమ్ దర్ద్ లేరా జానీ
జయదేవుడి వనమాలి జానకి స్వయంవర మాలిక
కలువుల కొలువులు, కడలుల అలజడులు
సమయం దొరికిన కవులల్లిన సుందర కవిసమయాలు


ఆరు పదులు ఈదిన అనుభవంతో చెబుతున్నా
వలపంటే వడ్డూ లోతూ తెలియని ఓ గడ్డు అగాథంరా తండ్రీ!
యథాతథానికి అదొక ఆతిశయాలంకారం
పరమపథ సోపానపటంలో పాము పక్క నిచ్చెన మీదారోహణం
అందితే చింత
అందనంత కాలమే గుప్పెట్లో వింత
బైటపడే దారి లేని పద్మవ్యూహంరా అభిమన్యూ
మయసభామధ్యంలో అభిమాన సుయోధనుని
అయోమయం అంతకన్న సుఖం
దేహాత్మల మొత్తాన్ని
ఒక సందేహాల డోలికగా మార్చే మంత్రగత్తె కదారా కాదల్!
ఆదిలోనే పడిందా హంసపాదు
అదృష్టవంతుడివి
హింస తప్పిందని వెంకయ్యకు ఓ టెంకాయ కొట్టూరుకో!

4
ఇంత చెప్పినా
కాదు..పిల్ల గాలి తగిలిందంటావా
హతోస్మి…
గాండ్రించే పులివి
ఇహ తలపుల తలుపుల దగ్గరే తచ్చాడే కాలుగాలిన పిల్లివి
పాస్ వర్డ్ మర్చిన సాఫ్ట్ వేర్ ఎనలిస్టువి
ఏక్సెస్ డినైడ్-విండో కనపడ్డా సాండోలానే ఉండాలి మరి!
సిస్టం క్రాషయినా నో ప్రాబ్లం అనుకుంటే ఓకే ..నీ ఇష్టం
'లౌ'ప్రోగ్రామ్ లోకి లాగిన్ ఐపో మరి
నీ ఆఠీన్ రాణీని ఎలౌ చేసేయి..hurry
కాఠిన్యమో..కారుణ్యమో రన్ చేస్తేనే గదా ఫేట్ తెలిసేది!
ఆఖరుగా ఒక మాట
అపరిచితం టు సుపరిచితం రూటు పూలదారి కాదు
రోదసీ వ్యోమగామి కొత్త గ్రహం కక్ష్య కుదుపు అదుపు
ఇంతకన్నా కొన్ని కోట్లలక్షల రెట్లు సులువు
కిక్ కోసమే ఈ బొకే ఎఫైర్ అంటావా
థింక్ ట్వైస్..బిఫోర్ యు సింక్ ఇన్ ది లవ్ బకెట్ !
గుడ్ లక్!

కర్లపాలెం హనుమంత రావు॥గాడ్ ప్రామిస్॥


1
మాటల పెట్టుబడితో కట్టిన మైత్రీకోటలన్నీ చీమల చిటుక్కుకే కుప్పకూల్తున్నాయి
సునామీ భయంతో స్వర్గం లోనూ క్షణం ఓ యుగం
బీమా ఏజెంటులా స్నేహంపాలసీలకోసం
ఎన్ని గుండె గడపలు ఎక్కి దిగానూ!
ప్రీమియం దండగే గానీ
జీవితకాలం నిలబడుంటుందన్న ధీమా లేదు
నాకో డైరీ లాంటి మిత్రుడు కావాలి

2
కొట్టుకొచ్చిన జాంకాయలో కాకెంగిలి చేసి పెట్టిన కాలీషా కహాఁ హైఁ రే తూ!
నెమ్ము చేస్తుందని తెలిసీ నా కొసం
వానావానా వల్లప్పలయిన శేషూ శ్రీలక్ష్ములిప్పుడు ఎక్కడున్నారో!
నా నిద్ర తాను కాసి తెల్లార్లూ బుల్లి స్లిప్పులు రాసిచ్చిన జాను పీనుగ్గాడు
దొంగ లెక్కన నా కోసం గోడలెగబాకి చావు దెబ్బలు తిన్న సుబ్బారాయుడు
ఏ ఏట్లో చచ్చార్రా మీరంతా ఇప్పుడూ!

3
నీతులు సూక్తులు నియమాలు నిబంధనలు
మంచితనం మర్యాదా మంటిగడ్డలు …బాబోయ్
బతుకు ఫుల్లుగా గాలి కొట్టిన కాలిబంతయిపోయిందిరా తండ్రీ!
సేఫ్టీ వాల్వులా సీమన్నారాయణా
మళ్ళా నువ్వొచ్హి కాస్త గాలి తీస్తేగాని
ఊపిరాడేటట్టు లేదురా!

4
అమ్మ నిచ్చావ్ నాన్న నిచ్చావ్ అన్నదమ్ములు అక్కచెల్లెళ్లందర్నిఇచ్చావ్
అడక్కుండానే అన్నీ అమర్చే పెట్టే అతిమంచి ఆలినీ,
కడిగి ఆరబోసిన ముత్యాల్లాంటి పిడుగుల్నీ అచ్చంగాఇచ్చావ్..థేంక్స్!
అడుగులకు మడుగులొత్తే వందిమాగధుల్ని సరే
అస్తమానం పీక్కుతినే యములాడినీ దయచేసావ్
అన్నీ ఇచ్చి ఒక్క మా కేడీ దుర్గాగాడిలాంటి మంచి మిత్రుణ్ని
ఇవ్వడం మాత్రం మర్చిపొయావా!
నువ్వు దేవుడివా …మా చెండామార్కు చెన్నకేశవ సారు మాష్టారువా!
కన్నీరు లేక పోతే మానె
కాసింత నెత్తిమీది కడవబరువును మోసే మా మోసెస్ చేతులు మళ్లా కావాలి
చక్కిలిగింతలు దొంగలెత్తుకు పోనీ
చుక్కల్లో చక్కర్లు కొట్టేవేళ
పడకుండా పట్టుకునే మా పిచ్చయ్య పక్క భరోసా కావాలి
నాగేశం గాడిలాగా 'నాకేంటీ' అనాలోచించకుండా నవ్వులు వెదజల్లి పెట్టేవాణ్ని
దుర్గాగాడిలా సునామీనైనా ధైర్యంగా ఢీకొట్టే మొనగాణ్ని
ఒక్క మిత్రుణ్ని
బదులుగా ప్రసాదిస్తావా దయచేసి...నీ వరాలన్నీ నీకు తిరిగిచ్చేస్తా
వచ్చే జన్మంటూ..అహ.. ఉంటే…గింటే
మా మనోహరుగాడిలాగా పుట్టి నీ మైత్రీరుణం తీర్చుకుంటా!
గాడ్ ప్రామిస్!

కర్లపాలెం హనుమంత రావు॥ఇంకొన్ని చురకలు॥


1
ఎన్నెన్ని పంచవర్ష ప్రణాళికలూ!
వర్షం పడితే పంచ కురవడం మానదు
-నా దేశం
***

2
మంత్రిగారొస్తేనే షోకు
మహా కంతిరిది
మా మురికూరు.
***


కూటి కోసం జనం
పట్నంబాట
ఓటు కోసం సియం
పల్లెబాట!
***

4
మూడు 'పూవులు'
ఆరు 'కాయలు'
శివారు పబ్బులు

5
గజకరువు
గజం జాగా కరువు
శ్మశానంలో

6
లేడిపిల్లలకేనా
అభయారణ్యం
ఆడపిల్లలకో!

7
పాడుబడ్డ గుడిసెలో
పాత బడని సాలెగూడు
కరువుకింకా
కరువు తీరలేదు!

8
అలారం వింటే గానీ
కోడీ కూయడం లేదు
మరీ విడ్డూరం
యంత్ర యుగం!

9
నిద్ర
మనసు మేలుకుని కనే
కల

10
కుడి ఎడమయితే పొరపాటు లేదా
గ్యాసుపొయ్యి నాబ్
తిప్పి చూడు దేవదా!

11
పురుగుమందు డబ్బా మీది
పుర్రెమార్కుగుర్తు
రైతుకు జాగ్రత్తా!
భవిష్యత్తా!

12
ఉప్పు తింటే మర్చిపోరుట
డబ్బు
ఎంత ఉప్పనో!

13
క్విడ్ ప్రో కో
గడించారా లక్షలకోట్లు-సార్లు
శిక్షగా రాయించు
క్విడ్ ప్రో కో
కోటీ లక్షల సార్లు

14
ఆనకట్టలు
ఆధునిక దేవాలయాలు
డబ్బుకట్టలు
అందులో ధూప దీప నైవేద్యాలు

12, సెప్టెంబర్ 2012, బుధవారం

కర్లపాలెం హనుమంత రావు ॥ అగ్గిపుల్లలు ॥


1
లేటెస్ట్ వంటకం
____________
ఓ లీటరు ప్రేమకు
రెండు లోటాలు అనురాగం, అనుమానం కలగలిపి
చెంచాడు శృంగారంతో
సెంటిమెంట్ల సెగన సన్నగ్గా ఉడకనిచ్చి
ఆనక అపార్థాల పోపు పెట్టి
చల్లారకముందే
కాసిన్ని త్యాగాలు
కడివెడు కన్నీళ్ళు కలిపి
గ్రైండర్లో రుబ్బేస్తే
టీవీ సీరియల్..అంతే!



2
కేపిటలిష్ట్
--------------------
సంపాదించిందంతా
స్టీలేజి సేఫుల్లో కుక్కి
ఎవరికీ అందకుండా
ఎత్తుగా దాచుకుందామనుకుంటే
తలకాయలు తెగ్గొట్టి
మరీ పట్టుకుపోతారని
తెలీని
కేపిటలిస్టు
కొబ్బరిచెట్టు



3
కవిగారి సేవ
---------------
బహుకాలం శ్రమకోర్చి
బహుగ్రంథ పఠనమొనర్చి
పాపం
రాశారుట కవిగారు
పురాణాలసారాన్ని
బృహత్తర గ్రంథంగా
ప్రయోజనం లేదనకండు
పనికొచ్చును అది భలే తలదిండు




4
నాదేశం
---------
ఆకాశం నిండా తారలే
ఐనా వెలుగు లేదు
నా దేశం నిండా మేథావులే
ఐనా భావి చేదు



5
ఆపేక్ష సిద్ధాంతం
-------------------
బోయవాడికి పావురాయి
మీద ఎంత ఆపేక్షో!
నూకలు చల్లుతున్నాడు
నాయకుడికి
ప్రజల మీదా
అంత ఆపేక్ష
రూకలు చల్లుతున్నాడు



6
భలే బడి
-----------
ఈ దేశంబళ్ళో
చదువేందిలా ఉంది సారూ!
ఎన్నేళ్ళు గడిచినా
ఎవళ్ళ తరగతుల్లో
వాళ్ళే వున్నారు!



7
చాయిస్
---------
న్యాయం
ధర్మం
చట్టం అంటూ
లేని వాడి వైపున్నావా
సెంట్రల్ జైల్లో
అరదండాలే
అన్యాయం
అధర్మం
దౌర్జన్యం
ఐనా
ఉన్నవాడివైపున్నావా
సెంట్రల్ పార్లమెంటులో
పూలదండలే!

(నా 'అగ్గిపుల్లలు' మినీకవితల సంకలనం నుంచి కొన్ని.మొదటిది మినహాయింపు.
-రచనా కాలం/1980-అప్పటి ఆంధ్రజ్యొతిలో ప్రచురితం)

11, సెప్టెంబర్ 2012, మంగళవారం

కర్లపాలెం హనుమంత రావు॥చురకలు॥


1
అగ్రరాజ్యమా అమెరికా!
అక్కడ తెల్లారేది
మనకు పదిగంటల వెనక!

2
విండోస్ కిటకిట
మైన్ డోర్ మూతట
-యువత

3
ఉమ్మేయడానికున్న స్వేచ్చ
విమర్శించడానికుండదుట
అభిమానులున్నారు హాల్లో
తస్మాత్ జాగ్రత్త!

4
ప్రేయసితొ ప్రైవసీనా
పార్కులు పార్కింగులు డేంజరు
వర్కింగ్ డే సర్కారు ఆఫీసే సేఫ్
లంచవరు దాకా ఎవరూ ఉండరు

5
తాతల నాటివి నోటి లెక్కలు
మనవలనాటికి నోట్ల లెక్కలు
తరంలో ఎంత అంతరం!

6
టీవీక్షణం
సింగిల్ విండో
సిండ్రోం లక్షణం

7
అమెరికా వీసాల్లోనూ తెలుగు
ఆంధ్రా కాన్వెంట్లకు
జ్ఞానోదయం ఎప్పుడు కలుగు!

8
'సత్యానందం' చిత్రం
పెద్దలకు మాత్రమే
విచిత్రం!

9
సోనియా ఫోనుకి రిసీవరుండదు
సింగు గారి ఫోనుకి స్పీకరుండదు

కర్లపాలెం హనుమంత రావు॥రీఫిల్ ప్యాక్ గామారాలి!॥


జీడీపీని రెండకెల్లోకి పీక్కురావడమే నాముందున్న లక్ష్యమంటాడు పిఎమ్
జీడి పిక్కలక్కూడా రెక్కలు మొలిచి ఎంత కాలమయిందో తెలుసా సర్కార్!
బంగారంధర ఇదిగిదిగొ దిగిరాబోతోంది
కొంగుపట్టుకుని రడీగా ఉండండుండండంటాడు ఢమఢమల ఎఫ్ఫెమ్ సారు
బంగళా దుంపలు సైతం…దాం దుంపతెగా
అంగారానికెగిరి సతాయిస్తున్నాయ్ తెలుసా దొరవారూ!
గ్యాస్ బండ మోసుకొచ్చే కుర్రాడి నసుగులొకూడా
రిలయన్స్ వాడి బుసే వినిపిస్తోంది..పాడు
పెట్రో కన్నా మెట్రో ముఖ్యమంట్రా సర్కారోడా నీకిప్పుడు!
మార్కెట్లో మన్నుతప్ప ప్రతి స్టాకూ నిల్లు
స్టాక్ మార్కెట్ క్రాషవుతుందని దిగులా నీకు!
నీ చట్టసభలు చట్టుబండలు కానూ
చట్టాలు చెయ్యడానికెప్పుడో సున్నా చుట్టేసావ్ గా!
చుట్టపు చానెళ్ళ కళ్ళకూ
డోళ్ళను, ఆడోళ్ళ వళ్ళనూ తప్ప
బక్కోళ్ళ కడగళ్ళను తడమడం దండగిప్పుడు
కామన్ మ్యాన్... కనబడుట లేదు
ఏ ఊర్లో వెతికినా మనిషి చడీచప్పుడు లేదు
ఏ మాయదారి మ్యాన్ హోల్లో కాల్జారి పడ్డాడో పాపం
దేవుడా! ఒకసారి సెల్ ఓపెన్ చేసి చూడు
కనిపించేవన్నీఖాళీ మనిషి మిస్ డ్ కాల్సే!
ప్రభువులు ఫెయిలయిన చోట దేవుడే దిక్కంటారు
దేవుడూ సెల్లు ఆఫ్ లో పెట్టుంటే ఏం చేయాలీ!
ఖాళీని మళ్ళీ ఒకసారి మనిషి తనతనంతో రీఫిల్ చేయాలి
యూజ్ అండ్ త్రో యూజ్లెస్ ఫెల్లోస్ ని పర్మినెంట్ గా సీల్ చేసెయ్యాలి!
09-09-2012

8, సెప్టెంబర్ 2012, శనివారం

కర్లపాలెం హనుమంత రావు॥లెక్కలు అప్పుడు…ఇప్పుడు॥


+1/-1
చిన్నప్పుడు
లెక్కలంటే భలే సరదా నాకు
కూడికలంటే చేగోడీలు తిన్నంత ఇష్టం
తీసివేతలు పచ్చిబాదం కాయల్లా వగరు
ఇప్పుడో
తినే ముందు తీసేయక తప్పని బెడ్డలు తీసివేతలు
కూడికలంటే తేలికే కానీ తెలీని అదో చిన్నచూపు
అంకెలు అప్పచ్చుల్లా నొరూరించేవప్పట్లో
సంఖ్యల్లా వాటిని పెంచమంటే
ఖాళీఅగ్గిపెట్టల్ని రైలు బండిగా మార్చడమంత హుషారు
ఇప్పుడో
ఏ చుట్టం కంటపడ్డా పక్కిట్లో నుంచి అప్పుతెచ్చుకోడానికొచ్చిన చిన్నంకెను చూసినంత చిరాకు

2x1=2
2x2=4
ఎక్కాలు పైకీ కిందకీ…కిందకీ పైకీ గుక్క తిప్పుకోకుండా వప్పచెప్పక పోతే పడేది వీపుమీద మాసారు పిడిగుద్దు
మా ఐదో అంతస్తు ఫ్లాటుకు ఇప్పుడెన్నివందల సార్లు ఎక్కిదిగుతున్నానో చెప్పద్దు

3x3=9
హెచ్చవేతలంటే చెయ్యి వెచ్చబడేదే గానీ
చేస్తున్నకొద్దీ ఉత్సాహం రెట్టింపయ్యేది
మొక్క చెట్టవడానికి పాదుల్లో నీళ్ళు పోస్తున్నంత ఉల్లాసం ఆ పిచ్చి వయసది
ఇప్పుడో
బ్యాంకుడబ్బు వడ్డీలెక్కలప్పుడు తప్ప గుణకారమంటేనే వళ్ళుమంట

1033/7
భాగహారం చెయ్యాలన్నా భలే భయం బాబూ ఆ రోజుల్లో!
పదొందలముప్పైమూడులో ఏడు ఎన్ని సార్లు పోతుందో తెలీక ఏడుపు
సున్నా శేషంగా వచ్చిందా పరుగుపందెంలో కప్పుగెల్చినంత ఆనందం
పదహారు నుంచి అరవైఆరునైనా సరే
ఎన్ని సార్లైనా పంపించగల గడుసుదనం ఇప్పటిది

0
సున్నా అంటే ఏమీలేదనుకునే ఆమాయకత్వం ఆ చిన్నతనానిది.
సున్నాలోనే అన్నీ వున్నాయని అర్థమయిన పెద్దమనిషిత్వం ఇప్పటిది.
లెక్కలంటే మేథకు తొడిగిన రెక్కలు ఒకప్పుడు
లెక్కలంటే కాకులైనా చేయగల ట్రిక్కులు నాకిప్పుడు.


07-09-2012

7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

కర్లపాలెం హనుమంత రావు॥రహస్యకవాటం॥

మాటల మీద నుంచి మాటల మీదకు దూకటం కాదు
మంత్రకవాటాలను ఒక్కక్కొక్కటే తెరుచుకుంటూ పోవటం కవిత్వం
లోపలి చీకటికి వెలుగుల రంగులద్దే అద్దకం పని కవిత్వమంటే
నాడులు నీవే కావచ్చు ధమనుల బాధను అర్థం చేసుకోవడమే పచ్చిదనాన్ని పచ్చదనంగా అనువదించే కళే కదా కవిత్వమంటే!
ఎడారిలో నడుస్తూ కూడా ఒయాసిస్సులను మోసుకుతిరిగే కూలీపనికి సిద్ధమా!
బోరుబావిలో పడ్డ బిడ్డ మాదిరి
ఊహలు ఊపిరికొసం విలవిలలాడితేనే కవిత్వ జ్వరం తగులుకున్నట్లు
ఉపమాల కోసం జపమాల తిప్పుతూ కూర్చొకు
ఊర్వసి మరో పురూరవుడితొ లేచిపోవచ్చు
కవిత్వం సాక్షాత్కరించడానికి ఎన్ని మన్వంతరాలు శోధించాలోతెలుసా!
పసిబిడ్డ పకపకల పక్కలకి పోయి నిలబడాలి…కాస్త కాకెంగిలి కవిత్వం దొరకుతుంది
పడుచుపిల్ల వాల్చూపుల్లో తడిసి ముద్దవాలి…ప్రబంధాల చలిగాలి వణికిస్తుంది
అమ్మలాలింపు నాన్న గద్దింపు అన్న అల్లరివేధింపు చెల్లి బుంగమూతి సాధింపు
కవివే అయుంటే నీఇల్లే ఒక భువనవిజయంకదరా బాబూ!
ఇరుగింటి పంచాంగంవారి బహుళ శుద్ధపూర్ణిమ పర్వంలోనే కాదు
పొరుగింటి క్యేలండరు ముప్పయ్యో తారీఖు అడుగునా అణిగుంటుంది కవిత్వం... కాస్త తడిమి చూడు
తాగొచ్చిన మొగుడు తన్నినా తను కంచం ఖాళీ చేసిందాక పచ్చిగంగ ముట్టని తడికవతలి తల్లి తడికళ్ళలోకి తొంగి చూడు
'మానిషాద'కన్న మహావిషాదమైన కవిత్వం వరదలై పారుతుంటుందక్కడ
ఎక్కడ లేదు కవిత్వం!
గుడిబైట గుడ్డి బిచ్చగాడి పర్చుకు పడుకున్న చింకిపాతలో లేదా!
బడికెళ్ళే బుడ్డడి స్కూలుబ్యాగు బుక్కుల బరువు కింద నలగడంలేదా !
పొలంగట్టు మీద మట్టికుప్పలా పడున్న అన్నదాత గుండెల్లో కదుంకట్టుంది తట్టల తట్టల కవిత్వం
అడవి చీకటి దారుల్లో జనం వెలుగుల కోసం అహోరాత్రాలు తుపాకీ మడమల మీదే కునికిపాట్లు పడే అన్నల కంటిరెప్పల మరుగుతుంటుంది కవిత్వం
పట్టించుకోవాలే గాని బడ్జెట్ ప్రసంగాల్లొ సన్మానపత్రాల్లోనూ అధికప్రసంగిలా అప్పుడప్పుడూచప్పుడు చేస్తూనే ఉంటుంది కవిత్వం
తాతలకాలం నాటి తాళపత్రాలగ్రంథాలనుంచి పక్కింటి సీతకు రాంబాబు రాసిన ప్రేమలేఖల దాకా...వెదుక్కుంటూ పోతే అంతా కవిత్వమేలే!
మేలైన కవిత్వమే ఏదీ?..ఎక్కడా ఆ రహస్య కవాటం?
ఖాళీ పదాల అర్థాలను పీకి పాకాన పెట్టి... పద్యాల ప్రతిపదార్థాలను తవ్విపోసి…
వెర్రి గీతాల చరణాల వెంట పిచ్చిగా పరుగెత్తితే వినిపించేది
సిల్కుస్మితలు చీరకుచ్చెళ్ళ చప్పుళ్ళు
సీతాకోక చిలుక రెక్కల సవ్వళ్ళ రహస్యం కావాలా!
పగలంతా వళ్ళు పుళ్ళు చేసుకుని రాత్రి హోటల్ బల్లల సందులమధ్య కలతనిద్రలో ఉలికులికిపడే బుడ్డోడి గుండెలు తట్టి చూడు
అక్కడ తెరుచుకుంటుంది అసలు కవిత్వరహస్యకవాటం
05-09-2012

4, సెప్టెంబర్ 2012, మంగళవారం

కర్లపాలెం హనుమంత రావు॥ఆలోచనా శకలాలు-౩॥

  0
కళ
కళ కోసం కాదు
జనంమొహంలో కళ కోసం

1
నిద్ర
గొంగళిపురుగు
బ్యూటీ థెరపీ

2
పాప అప్పటి
ఉయ్యాల అనుభవం
పనికొచ్చిందిప్పటికి ఉరికొయ్యలా

3
కింద పడితేనేనా
మనిషి
పైకి చూసేది!

4
ఎగిరే ముత్యాల దండ
ఏ తరువువరుడి మెడకో
-కొంగల బారు

5
పాలిచ్చే ఆవు పెరట్లో
తాగి మొరిగే కుక్క ఒళ్ళో-
-దేశం

6
తడబడే కడవనీరు
అమ్మాయి కాలిఅడుగుల పాలు
ఆ వెనకజాడలు ఎవరివో!

7
రేకులు కర్కశం
ముల్లు సున్నితం
ప్రేమలో పడిందా- కుసుమం!

8
కడలిది అలజడి
ఎడారిది
నిర్ జలజడి

9
రెండు చావులతో
ఒకేసారి పోరే యోధి
తల్లి

10
ఒడ్డుకు
అటు సంద్రం
ఇటు నత్త
హోరు ఎటునుంచో!
03-09-2012
 

2, సెప్టెంబర్ 2012, ఆదివారం

కర్లపాలెం హనుమంత రావు ॥ దిగులేస్తోంది! ॥


1
కాలం గాయం చేసినప్పుడు
ముల్లు విరిగిన కాలు నిప్పుకొండలా సలుపుతుంది
కాలం ఊహల ఉయ్యాలలూపుతున్నప్పుడు
నక్షత్రమండలాన్నైనా సబ్బుబుడగల్లా ఊదిపారేయచ్చనిపిసుంది
సమయం గడుసుది సుమా!
మంటలు చుట్టూ మండుతున్నా
మనసుకి మిణుగురుపురుగుల రెక్కలు తొడిగి
మల్లెపందిరి కింద బబ్బోపెడుతుంది
కాగితంపూలవాసనకే మత్తెక్కిపోయి మనీప్లాంట్ కి పర్యాయపదమే లేదని పలవరింతలు మొదలయ్యాయి నీకప్పుడు
కంటిముందరి స్వర్గమంతా తెరముందాడే నాటకంరా నాయనా!
పేరుతో ప్రేమగా పిలిచినట్లే ఉంటుంది
కాలం మెదడులో సర్వనామంగానైనా నువ్వు మిగిలి ఉన్నావా?

2
మనిషి గోరటి ఎంకన్నగొంతులో జీరయి కరిగిపోతున్నాడురా తండ్రీ!
అంతరించిపోతున్న లోకంలో మిగిలున్నఆ ఒక్క వ్యవహర్తా కూలిపోతున్నఆర్తనాదమవుతున్నా ఆ చప్పుడు నీకు వినిపించడం లేదా!
మూతబడే కంటిరెప్పల్లో కరిగిపోయే విశ్వం నీదేరా కొడకా!
ఒక నమ్మకం చెరిగిపోతే ఒక లోకం చిరిగినట్లే!
ప్రశ్నల్ని అడవులకి తరిమేసి చెప్పుల్ని చేత్తో మోసుకుంటో గమ్మత్తైన పోటీలో నువ్ బిజీ బిజీ ఉన్నావ్
చర్మం వల్చుకుపోతున్నా చమ్మగానే అనిపిస్తుందొరేయ్ నీకీ మత్తులో!


వాక్యంలా ప్రవహించడం మానేసి ఎంత కాలమయింది?
సుందరయ్యా!..సుందరాకాండా!
జెపీనా!…జైరామ్ రమేషా!
కనీసం ప్రశ్నల్నన్నా కనాలనిపిస్తున్నదా నీకు!
పోరు ఊరేగింపులో ఊగటం మానేసి పోలేరమ్మ జాతరలో తూలటం మొదలెట్టావు
నల్లమందు నినాదాలు మింగి రాజీజెండా భుజాన మోసుకుంటో
ఒక్క పూటైనా గట్టిగా నిలబడని ఏ వెలుక్కురా నువ్ దివిటీ పట్టుకుని చిందులేసేది!

4
రేపటి మీద ఆశతో పరుగులు పెట్టే నీ పసిపిల్లలకేం చెపుతావ్ ఇప్పుడు?
ఏ వీధి చివర చెట్టు మిగిలుంటుందని పచ్చనాకు కోసుకురమ్మంటావ్ రేపు?
ఆఖరి మెతుక్కూడా అయిపోయిందాకా చేతిలో ఉన్నది అక్షయ పాత్రేనని నమ్మిస్తావా నాయనా!
నువ్వు చదివిన మాట నువ్వు పాడిన పాట
నువ్వు నిప్పు రవ్వలు చల్లుకుంటూ నడిచి వచ్చిన బాట
అంతా వెండిమబ్బుల చందమేనా!
అధర్మ రథయాత్రలో ఆఖరికిలా ఆర్భాట భటుడుగా మిగిలిపోవడం ఎంత విషాదం!
కూలిపోయే మహావృక్షం చివరి చిగురువునువ్వే అవుతావని ఎన్ని కలలు కన్నాను!
రేపటి విషపుమొక్కకు మొదటి వేరుగా మొలిచే నిన్నిలా చూడటం…!


01-09-2012

31, ఆగస్టు 2012, శుక్రవారం

కర్లపాలెం హనుమంత రావు॥ (ఇం)ప్యూర్లీ పాలిటిక్స్!॥


1
బొగ్గు మంటతో
కాగ్ తోంది
దేశం
2
బొగ్గు ఇనుము బాక్షైట్
రత్న గర్భ నాదేశం
గర్భాదానమే అక్రమంగా జరిగిపొయింది
3
2-జీ ఒక 'వేలం' వెర్రి
'బొగ్గు' ఆ వేలం కూడా లేని వెర్రి
4
గోద్రా
నరేంద్రుడి
'మోడీ'
5
బొమ్మ న్యాయం
బొరుసు అన్యాయం
రెండూ బొరుసులే ఉన్న నాణెం-రాజకీయం
6
అన్నా రాజకీయ పార్టీ
హస్తానికి రిపార్టీ
9
నల్లధనం-
ఏ కనిపించని నాలుగో సింహం
నోట్లో!
10
మంత్రివర్యా... తిన్నంగుండు
తప్పుతుంది
తిరుపతి గుండు!
11
రైతు దేశానికి వెన్నెముక…
సరే!
వెన్నెముక లేని పాలనా మనది!
12
నెలలు నిండకమునుపే
బడికడుపు నుండి బయటకొచ్చేస్తున్నారు
ప్రీమెచ్యూర్ డ్ బేబీస్!
13
ఓబులాపురం గనుల కేసు-
గాలితో చేసే యుద్ధం కాదు గదా
చివరికి!
14
జెడి కాల్ లిస్ట్ కేసులో
తత్కాల్ బుక్ చేసుకున్నాడు
వెంకట రెడ్డి!
16
వాన కావాలా!
వరుణయాగం ఎందుకు
ఉప్పల్ గ్రౌండ్లో క్రికెట్ ఆడించు!
17
విద్యుత్
రిలయన్స్ గాలికి పెట్టిన దీపం!
18
కరువు వలన భక్తుల రాక తగ్గింది
వర్షాల కోసం దేవుడూ
ప్రార్థిస్తున్నాడు!
19
తివిరి
ఇసుమునా
'తైలంబు' తీయవచ్చు!


30-08-2012

29, ఆగస్టు 2012, బుధవారం

కర్లపాలెం హనుమంత రావు॥భావ శకలాలు-౩॥




1

వాత కోత మూత

మూడు ముక్కల్లో

కరెంటు కత

2

మృగం

మనిషి గతమే నా..!

అంతరంగం కూడా

3

అసాంజే

అందరిలో ఉంటాడు

అతగాడి పేరు

అంతరాత్మ

4

అంగారకమూ ధరకు అందింది

బంగారం ధరే

అందకుండా ఉంది

5

స్వర్గానికి సగం దారి

వరదగుడి

మిగతా సగం

గుండెగుడి

6

There is not an object

which do not have some purpose

నెల న్యూస్ పేపర్స్

నెలాఖరు కాపర్స్

7

లోకం ఒక త్రివేణీసంగమం

కొందరు గంగ యమున వాహినులు

కొందరు కనిపించకుండా పారే సరస్వతులు

8

మంచి చేసి పోతే

నీ తలవెంట్రుక్కూ విలువుంటుంది

చెడ్డ చేసి పోతే

నీకు తలవెంట్రుకంత విలువుంటుంది

9

పనితనం-వెనక కళాయిది

పేరు షోకు-ముందు అద్దానికి

-లోకం

10

గీత

దాటి – సీత

దాటక -విజేత

11

ఆకాశం ఏడ్చి

భూమిగుండెబరువు దించింది

12

కలిస్తేనే అర్థం

అక్షరాలకైనా

హస్తాలకైనా

13

కోరి పుట్టలేదు మనిషి

ఐనా

కోరికల పుట్ట.




ఆగష్టు 28, 2012