పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Yagnapal Raju లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Yagnapal Raju లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, సెప్టెంబర్ 2012, శనివారం

YagnapalRaju **పట్టెమంచం**

కిర్రుకిర్రుమంటుంటే
వయసైపోయిందేమిటే
అని అడిగాను
నాకు వయసైపోలేదురా
మీ వయసుజోరే పెరిగిందంటూ
నాతో సరసాలాడింది

ఎన్ని జంటలను మోసావో
నీకు ఓపికెక్కువే అని అంటే
మొదట్లో ఇబ్బందిగానే ఉండేది
తర్వాత అలవాటైపోయిందిరా అబ్బాయ్
అంటూ వేదాంతం మాట్లాడింది

పరుపులు, దిండ్లు, దుప్పట్లు మారాయి కానీ
నేను మారలేదంటూ
పైపై సొబగులెన్నున్నా
అంతఃసౌందర్యమే ముఖ్యమంటూ
ఆత్మ తత్వాన్ని
అవలీలగా బోధించేసింది
అనుభవం రంగరించిన
పండు ముత్తైదువ లాంటి
మా పట్టెమంచం

18/09/2012

Yagnapal Raju II సంచలన II


నేనొక రేణువును
అణువులు కలిసిన
అతి చిన్న రేణువును
సంచలన రేణువును

ఉదయకాంత
విశాల ఫాలంపై విరిసే
ఎరుపు రేణువును

కిందకురికే చినుకులోని
వేగాన్ని పుణికి పుచ్చుకున్న
చన్నీటి రేణువును

చిరు మొగ్గలోనుంచీ
కొత్త పుట్టుక పరిమళించే
బతుకు రేణువును

స్వేచ్చను నింపుకున్న
విహంగాల కువకువల్లో
అవిశ్రాంత విహార రేణువును

లేతాకుపచ్చ చిగురుటధరాల
ముద్దు పొదిగిన రేణువును

బారులు తీరిన
అమ్మ చెట్ల వేర్ల తడిలోని
ప్రేమ రేణువును

గిరగిరా తెరిగే గాలిలోని
ప్రాణవాయువు హృదయ
స్పందనా రేణువును

నివురుగప్పిన అగ్నిపర్వతాల
అంతరాళ నరాల్లో ప్రవహించే
శిలాద్రవ రేణువును

ఉవ్వెత్తున ఎగసే
ఉత్తుంగ తరంగాన
ఉరకలు వేసే ఉత్సాహ రేణువును

అంతుచిక్కని కడలి
అంతర్గర్భాన
అలసి నిద్రించే
పసి రేణువును

భరించే పుడమితల్లి
శిరసున భాసించే
సహన రేణువును

పరవళ్ళ పరుగులెత్తే
నదీ నాదాలలోనూ
జలపాతాల ఇంద్రజాలంలోనూ
జోరుతగ్గని వేగ రేణువును

జీవితాలను వికసింపజేసే
దినకరుని కిరణా రసాల
సరస్సులో స్నానమాడే
వెలుగు రేణువును

అంతర్మధనపు దుఃఖాన్ని
అంతూపొంతూ లేని సుఖాల్ని, విశ్రాంతిని
తనలో దాచుకున్న రాత్రి
వెదజల్లే చీకటి రేణువును

సమస్త జీవజాలాన
ప్రకటితమవుతున్న
ప్రాణ రేణువును

అడవి అతివ విరబోసిన
అనంత వర్ణ విన్యాసాల
కురుల ఛాయా రేణువును

వనకన్యక కలికి కులుకులో
కలగలిసిన
వలపు రేణువును

తన గొంతు గానాల
గమకాల హారాన
శబ్ద రేణువును

తన కంటి మిసిమి చూపులో
కురిసే కరుణా రేణువును

కోటానుకోట్ల రేణువుల్లో
నేనొక రేణువును

ప్రకృతి రేణువును
సంచలన రేణువును

http://www.facebook.com/groups/kavisangamam/permalink/446299985422759/
17.09.2012

7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

యజ్ఞపాల్ రాజు||ఇద్దరం||

పున్నమి చంద్రుడినడిగి
పండు వెన్నెలలు
బానలనిండా నింపుకొచ్చాను
స్నానం చేద్దువుగాని
బాల భానుని
బుగ్గలు పుణికి
ఎర్రదనం తీసుకొచ్చాను
బొట్టు పెట్టుకుందువు గాని
నీకై దాచిన
ప్రేమను కొంచెం
పట్టుపురుగులకు ఇచ్చి
అవి ఇచ్చిన పోగులతో
చీరనేసి
లేత చిగుర్లనడిగి
పచ్చరంగేసి
తంగెడుపూలు నవ్వితే
రాలిన
పసుపు పుప్పొడిని
అంచుల్లో చల్లి తీసుకొచ్చాను
కట్టుకుందువు గాని
దారిలో ఎదురుపడ్డ
అడవిపూల సౌరభాలను
గాజు బుడ్డీలో పోసుకొచ్చాను
నిండా పూసుకుందువు గాని
తుమ్మెదల్ని కదిపితే
తియ్యటి తేనెలిచ్చాయి
ఆ మధురాల్ని
కడుపునిండా తాగుదువు గాని
పొందికగా
పొదరిల్లు కట్టాను
ఇద్దరం ఒద్దికగా
ఒదిగిపోదాం గాని
ఓయ్ పిల్లా
నాతో వస్తావేమిటే

07-09-2012

6, సెప్టెంబర్ 2012, గురువారం

యజ్ఞపాల్ రాజు**నింపుతూ నిండుతూ**

తను నింపుతూ ఉంటుంది
నా నిదురను
నిజం కాని కలలతో
నా మనో ఫలకాన్ని
నిజమైతే బాగుండుననిపించే
తన ఊహల రాతలతో
తను నిండుతూ ఉంటుంది
తడి ఆరిపోయిన
నా కనుల కొలకుల కొలనుల్లో
కన్నీటి కడగళ్లై
నేను రాసే రాతలో
తనకోసం బతికున్న
ఆశల పరవళ్ళై

05-09-2012

31, ఆగస్టు 2012, శుక్రవారం

యజ్ఞపాల్ రాజు II సంయుక్తాక్షరం II


అదొక సంయుక్తాక్షరం
ముగురమ్మల మూలపుటమ్మలా
మూడింటి సంగమం
మూర్తీభవించిన
మాతృత్వం
పోతపోసిన
సౌందర్యం
అలవిగాని
మార్దవం
ఇదీ అని చెప్పలేని
అద్భుతతత్వం
ప్రకృతి మొత్తాన్నీ
తనలో నింపుకున్న
అర్థం
ప్రేమకు మరో రూపం
శక్తిని పోలిన అస్థిత్వం
చిరు అక్షరం
భావం అద్భుతం
రాసేముందు
రచయిత సందేహిస్తాడు
ఊహించేముందు
కవి ఆలోచిస్తాడు
గీసేముందు
చిత్రకారుడు
ఒక్క క్షణం ఆగుతాడు
మలచేముందు
శిల్పి తనను తాను
తరచి చూసుకుంటాడు
ఆ అక్షరంలోని ఆంతర్యాన్ని,
అంతరార్థాన్ని
సంపూర్ణంగా అందుకోగలమా అని
ఆ అక్షరం
"స్త్రీ"

30/8/2012

27, ఆగస్టు 2012, సోమవారం

యజ్ఞపాల్ రాజు IIఎంత కష్టపడతాడోII

ఎంత కష్టపడతాడో కవి
భావాల గర్భాల్ని మోస్తూ
పండంటి కవితలను కనడానికి
మనసును మెలిపెడతాడు
హృదయాన్ని రాయి చేసుకుంటాడు
ఒక్కోసారి చెప్పలేనంత
మృదువుగా మార్చేసుకుంటాడు
ఆవేదనలను ఆనందాల్ని
కష్టాల్ని సుఖాల్ని
ఆకలిని ఆహారాన్ని
దిగంబరత్వాన్ని అంబర శ్రేణిని
మంచిని చెడుని
నవ్వును ఏడుపును
ఆత్మను దేహాన్ని
పంచభూతాలను
అరిషడ్వర్గాలను
శృంగార హాస్య కరుణ
వీర రౌద్ర భీభత్స
భయానక అద్భుత శాంతములనే
నవ రసాలను
అష్టవిధ శృంగార నాయికల
హావభావాలను
తన కలంలో నింపేసుకుంటాడు
ఆ కాలాన్ని కాగితం పై
గురి పెట్టి
సిరా శరాలను వెల్లువెత్తిస్తాడు
అన్నీ తనలోకి లాగేసుకునే
బ్లాక్ హోల్ లా
కనిపించే ప్రపంచంతో పాటు
కళ్ళకు కనిపించని
ఊహాలోకాల సమస్త అనుభూతులనూ
తనలోకి ఇముడ్చుకుంటాడు
అంతు చిక్కని డార్క్ మాటర్ లా ఉంటాడు
సూపర్ నోవాలా
ఒక్కసారిగా వెలుగులను
వెలువరిస్తాడు
ఎంత కష్టపడతాడో కవి
భావాల గర్భాల్ని మోస్తూ
పండంటి కవితలను కనడానికి

*24-08-2012

22, ఆగస్టు 2012, బుధవారం

యజ్ఞపాల్ రాజు II అలుసుగా చూడకు II


అలుసుగా చూడకు ఆడదాన్ని
నమ్మి నీవెంట వచ్చే నీ దాన్ని
అలక్ష్యం చేశావో
అంతవరకు నిను పరిమళాలతో
అలరించిన పూవుల అంచుల్లో
నిప్పురవ్వలు పూస్తాయి
అంతవరకు నీపై
ప్రేమను వర్షించిన ఆ కళ్ళు
భుగభుగలాడే లావా కురుస్తాయి
అంతవరకు నీ చేతికి
పట్టులా తగిలిన స్పర్శ
ముళ్ళపట్టీగా మారి
నిను గుచ్చేస్తుంది
అంతవరకు నిను కవ్వించిన
వలపు గాలి
వడగాడ్పై నిను ఆర్చేస్తుంది
అంతవరకు నీకు
తోడుగా నీపక్కన నడిచిన
సుతిమెత్తని అడుగులు
ప్రళయకాల పదఘట్టనలై
నిను నేలమట్టం చేస్తాయి
అంతవరకు నిను
ఆరాధించిన చల్లని మనసు
ప్రణయాగ్నికి ఆజ్యమై
దహించివేస్తుంది
అంతవరకు నువు
నిర్మించుకున్న ఆశల సౌధాలు
నీ మీదే విరుచుకుపడతాయి
అంతవరకు నీలో
విరిసిన వసంతం మాయమై
మోడు మ్రాకుల ఎడారి
నీముందు సాక్షాత్కరిస్తుంది
అబల కాదది సబల
ఆడది కాదది ఆదిశక్తి
నీకు అన్నీ తానే అయ్యే ఆత్మశక్తి
అందుకే
అలుసుగా చూడకు ఆడదాన్ని
నమ్మి నీవెంట వచ్చే నీదాన్ని
*21.8.2012

17, ఆగస్టు 2012, శుక్రవారం

జీవితంలో ఒక పరిపూర్ణమైన రోజు - Yagnapal Raju


నిన్న నా జీవితంలో ఒక పరిపూర్ణమైన రోజు.... ఎంతో మంది సహచరులను కలిశాను.... ఎన్నో అనుభవాలు మూట కట్టుకున్నాను.... ఎనలేని ఆనందంతో.... ఎల్లలు దాటే పారవశ్యంతో గడిపాను.... ఇవన్నీ పంచి ఇచ్చిన కవి సంగమానికి ఎంత ఋణపడి ఉన్నానో....

4, ఆగస్టు 2012, శనివారం

యజ్ఞపాల్ రాజు || నేను ||

నిశ్శబ్దం అలలు అలలుగా పొంగే ఏకాంతంలో
ఒక్కోసారి హఠాత్తుగా నువు నా పక్కన లేవని గుర్తొస్తుంది
అంతవరకు నను మరిపించిన రంగుల కలలు అంతర్థానమై

అంతులేని నైరాశ్యపు చీకటి నా మనసును కమ్మేస్తుంది
నాలోని అనంత వర్ణాల ఆశలు నల్లదనం పులుముకుంటాయి
అంతదాకా నన్ను కవ్వించిన చిలిపి చల్లదనం
నేనంటే అస్సలు ఇష్టం లేదన్నట్టు ఒళ్ళంతా కరుస్తుంది
అంతలోనే నాకు “నేను” గుర్తొస్తాను
నువ్వు నిలువెల్లా నిడిపోయిన “నేను”
నేనున్నంత కాలం నాలో నాతో నువ్వూ ఉంటావుగా
నువ్వు నాలోనే ఉన్నావనే భావన కలగగానే
నిబ్బరాల మబ్బులు నీ కౌగిలిలాంటి వెచ్చని వానను నాపై కురిపిస్తాయి
ఎండిపోయిన నా పెదాల పొలంలో చిరునవ్వుల పూలు పూస్తాయి
ఇంతకన్నా నాకింకేం కావాలి.

*04-08-2012

3, ఆగస్టు 2012, శుక్రవారం

యజ్ఞపాల్ రాజు || అనగనగా ఒకదేశం ||

అనగనగా ఒకదేశం
ఆ దేశం పేరు అనంగ దేశం
రాజు ప్రియుడు, రాణి ప్రేయసి

ప్రజలు కూడా ప్రేమికులేనట
ఆ దేశం లో సంవత్సరమంతా ప్రేమ ఋతువేనట
ఎప్పుడు కావాలంటే అప్పుడు
వానలు కురుస్తాయట
ఎండ కాస్తుందట
మంచు కురుస్తుందట
పూలు పూస్తాయట
వెన్నెల కురుస్తుందట
చుక్కలు మెరుస్తాయట
జీవితమనే పంట అక్కడ బాగా పండుతుందట
ఏం కావాలన్నా ఎంత కావాలన్నా దొరుకుతాయట
అంతా సుందరమూ, సుగంధమయమూనట
ఆ దేశానికి వెళ్లాలంటే ఒకటే అర్హతట
అది స్వచ్ఛంగా అరమరికలు లేకుండా ప్రేమించడమేనట
అక్కడికి వెళ్ళినవారే కానీ తిరిగి వచ్చినవారు లేరట
నేను దారిలో ఉన్నాను
మరి మీరో....!

*03-08-2012

1, ఆగస్టు 2012, బుధవారం

యజ్ణపాల్ రాజు॥నీవు॥

నీ ఎదురుగా కూర్చుని నీ కళ్లలోకి చూస్తుంటే
ఏవో తెలియని అందమైన అగాధాలు నన్ను లోపలికి లాగేసుకుంటాయి

నీలోంచి పొంగే ప్రణయ గంగ నా జన్మాంతర పాపాల్ని కడిగేస్తుంటుంది
సడి చేసీ చెయ్యనట్టు ఉండే నీ చిరునవ్వు కోసం ఎన్ని యుగాలైనా వేచి ఉండాలనిపిస్తుంది. 

తళుక్కున మెరిసే నీ ముక్కుపుడక విరిసే వెలుగు పూవుల జడిలో
ఎన్నిసార్లు తడిసినా తనివి తీరదెందుకో!
*1.8.2012

27, జులై 2012, శుక్రవారం

యజ్ఞపాల్ రాజు కవిత

సాయంకాలాలు ఎంత బాగుంటాయో....
ఒకే అమ్మాయి ప్రతి రోజూ కొత్తగా కనిపించినట్టుగా....
దీన్నే ప్రేమ అంటారేమో....
*26-07-2012

26, జులై 2012, గురువారం

యజ్ఞపాల్ రాజు కవిత

పసుపు నారింజ రంగులు కలిసిన చీర కట్టుకుని....
ఎర్రటి పెద్ద బొట్టు పెట్టుకుని....
ఇంతింత కళ్లేసుకుని....
నెత్తిమీద అందరికీ కావలసిన ఆనందాల బుట్టనెత్తుకుని....
కాళ్ళ గజ్జెలు ఘల్లు ఘల్లుమంటుంటే....
వడివడిగా మెత్తటి అడుగులేసుకుంటూ....
వయ్యారంగా వచ్చేస్తోంది....
ఎవరనుకున్నారు....
మీకు తెలీదా..... ????
ఆమెను ప్రభాత సుందరి అంటారు....
ఒక్క చిరునవ్వు ఇచ్చేస్తే చాలు....
నెత్తిమీది బుట్ట దించి మీక్కావలసిన సంతోషం, ఉత్సాహం, ప్రశాంతత....
ఇంకా ఏం కావాలన్నా ఇచ్చేస్తుంది....
ఇచ్చేసి ఒక్క క్షణం కూడా నిలవదు....
చక్కా వెళ్లిపోతుంది..... అదేంటో మరి....
*26-07-2012