వాసన్ ఫోన్,
సరుకొచ్చిందట, పదివేలు,
జేబులో పదివేళ్ళుంచి వొళ్ళువిరుస్తూ,
అనాఘ్రాణ పుష్పలావికా కేసర సంపర్క సంవర్తుడనై,
సంసృతం బూతుకి బట్టలేస్తూ,
"ఏంరా, అడ్వాన్స్ జనమ్ దిన్ ముబారక్.
మరేంలేదా రాత్రికి"
చేత్తో అత్యద్భుతంగా ఛండాలపు సంఙ్న సృష్టిస్తూ,
ఇరవైఏళ్ళుగా నా స్నేహితుడైన సన్నీ..
వాడి అర్ధవంతమైన అమాయకపు
ఆవేశపు ఆక్రోశం నన్నుకదిల్చి,
పైసలకు ఎవడిగొలుసమ్మాలో అని లెక్కలేస్తూ మేము,
వ్యర్ధాల్లోంచి వందలుపుట్టించే
వీర్యనిధులుండాల్సింది ప్రతూర్లో,
ఎంతదృష్టమో మగవ్యభిచారులది
సంపాదనా సంతోషమూ సమ్మిళితమై,
గొప్పోళ్ళ సమాజంలో వివాహేతరబంధాలూ ఖరీదే ,
లక్షాదికారినైదునీపాటికే,
దరిద్రుడా. దేవనాగరి మళ్ళీ వాడాల్సొస్తూ,
"పాణీ దా" విక్కీడోనర్ పాట ఫోన్ రింగ్ టోనై..
వాసన్గాడే, ధూల్ పేటకి రమ్మని,
అత్యంత అసహజపు నవ్వొకటి నా మీద విదిల్చి
మెళ్ళో గొలుసు తెంచుకుని
యమహా ని కిరాతకంగా హింసించి
ధూలి లేపి పేటకెళుతూ, మై బిలవ్డ్ ఫ్రెండ్
సన్నీ ఉరఫ్ సంధ్యావందనం సూర్యనారాయణ
చీకటితో పాటే చేరిన నా అసురసంధ్య,
మై వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్,
ఒక చేత్తో చిరపరిచితమైన గాజుసీసాడు రంగుద్రావకమూ
పపావరమ్ సోమ్నిఫెరమ్ వృక్షపు ఎండిన ఆకులు
ఏదో పక్షిజాతికి చెందిన వేయించిన కండరాలు,
మరో చేత్తో మేలిముసుగు ధరించిన పదివేలని
ఆబగా లెక్కిస్తూ అపరిచిత పరిచితుడు, అప్పటికే తూగుతూ,
ద్రావకపుసీసా శూన్యానిక్కారణం అర్ధమై..
అటకమీది శ్రీ శ్రీ కి మత్తుని పరిషేచించి స్వీకరించి
చాపకింది ఫ్రాయిడ్కి పత్రహరితపు దిష్టితీసి ధూపమేసి
ట్రాన్స్ సంగీతం కర్ణభేరి భేధించేట్టు పుట్టిన క్షణాన
తొలిగిన మేలిముసుగుకి విస్ఫోటించిన భూనభోంతరాళాలు..
జా..న..కి,
రెండేళ్లక్రితం నేనుప్రేమించిన ఓ అందం
అపుడు నన్ను దౌర్భాగ్యుణ్ణి చేసి,
ఇపుడు సంధ్యావందనానికి అర్ఘ్యమౌతూ,
సన్నగా కంపిస్తూ కాళ్ళు, వేళ్ళు నేలనాసరా అడుగుతూ,
సర్వనాడులూ ఒక్కసారిగా పన్జేయడం మాని కళ్ళు మసకలై,
ఎపుడో పారేసుకున్న నాతో, వాడు రమిస్తున్నట్టు..
ఆపరా, ర్, ర్ర్, ర్రేయ్, స్టాప్ దట్,
యూ సన్ ఆఫ్ ఎ %# ...
అయోమయంగా వాడు,
ఆశ్చర్యంగా జా..న..కి..
అనాఛ్చాదిత మూలాల్ని సహస్రబాహువుల్తో కప్పేసి
నన్ను గుర్తించే ప్రయత్నం చేస్తూ..
"రేయ్, ఎందుకాపమన్నవ్ బే,
పన్నెండు కానీకింకా పావుగంటుంది,
నువ్వింకా పుట్టలేరా నా కొడకా, పో, పో,"
తిరిగి తనకి నగ్నత్వాన్నాపాదిస్తూ
తీరని దాహం తీర్చుకోడానికి ద్రావకాన్నొంపుకుంటూ.. సూరిగాడు,
దిండుకింద నిద్రిస్తున్న భగవద్గీత
అకస్మాత్తుగా మేలుకుని నా చేతులతో వాడి మెడ విరిచి
పారవశ్యోద్రేకాల నడుమ సందిగ్ధావస్థలో అచేతనంగా తెగిన జంఝం
కళ్ళు తెరిచి నన్నలాగే చూస్తూ,
ఎవరికోసం ఏం చేసావో తెలుస్తుందా అనడుగుతూ
కాలాన్నిచుట్టిన నిశ్శబ్దంలోంచి
జానకి నన్నొదిలి పోయిందా,
నా ఉన్మాదానికి పారి పోయిందా,
రేయ్, సూరిగా, లేరా, పన్నెండైంద్రా..
నటించింది చాలు,
రేయ్, సంధ్యావందనం, నేన్రా, నీ..
కళ్ళు పగిలి రక్తం గడ్డం మీదుగా గొంతులో దిగుతూ,
గదిగోడలు కూలి శబ్ధించి అతిభయంకరమౌనాన్ని కూల్చి
నా పుట్టుక నాకే వినిపిస్తూ,
పైకప్పుకంటించిన డావిన్సీ లాస్ట్ సప్పర్
ఇవే నా ఆఖరి నూకలని సంకేతమందిస్తూ..
18.9.12