కప్పుకున్న నిద్ర, చిరిగి
శూన్య బిలాలగుండా
కనిపిస్తూ చీకటి రూపాలు
కనుమరుగైతూ రేపటి కలలు....
సుషుప్తి శిథిలాల్లోంచి నిర్మితమైతూ జాగృతి
అంతశ్చేతనుణ్ణి చేస్తూ, అంతరంగమావిష్కరిస్తూ,
నిన్ననింకా జ్ఞా పకంగా మారనీయని నీ నవ్వు
తెలి మంచులా, తొలి మహిమలా,
వన్నెలింకా గుర్తుగా మిగిల్చిన నా నువ్వు
పిల్ల తెమ్మెరలా, పూల తాకిడిలా,
నా ఆలోచనలకాలంబనౌతూ
నా లోచనాలకాలింగనమౌతూ...
ఎవరూ చూడలేని
నా అంతఃప్రపంచపు భవన ప్రహేళికా దారుల్లో
మైకం వీడని
నా బహిర్లోకపు ప్రవేశికా ద్వారాల్లో
పాశవిక లిప్స,
అసంపూర్ణ సంపూర్ణమై, అసాధ్య సాధ్యమై,
మన రెండు ఆత్మలు, ఒక్కటిగా నశించి
పునరుధ్భవించి
పునస్సంధానించుకుని...
గది గోడల బీటలు చేసిన శబ్దం, విన్పించని చెవులతో,
మది తలపుల భారం కార్చిన రక్తం, కనిపించని చెలిమితో,
ఎంతకీ దొరకని చెదిరిన మనసు ముక్కలేరుకుంటూ
కాలంలో ప్రయాణిస్తూ,
నాగరికత పొరల్లో నక్కి నవ్వుతున్న,
అనుభూతుల ఆనవాళ్ళు
నావేనా,,, నువ్వేనా,,,
మరి దరికి రావూ?
దారికి రానివ్వవూ?
పురా ఙ్నాపకాల్లారా, చేరండి,
ఆవిరౌతున్నా, ఏ అనుభూతుల్లేక
స్థాణువౌతున్నా, నాకే నేన్లేక
ఏమిటా పరిహాసం,
నేనే లేకుంటే మీకునికేది
నేనే రాకుంటే, మీకీ అలుసేది
ఒంటరినై ఇన్నాళ్ళు బ్రతకలేదా,
ఇకపై బ్రతుకే లేదా,
సరే, సెలవిక, ఎప్పటికీ,
అస్పష్ట స్పష్టంగా అశరీరవాణి దూరాన,
"మిత్రమా, ఒక్క క్షణం,
మరిచావా,
సృష్ట్యాదినుండిప్పటికెన్ని కోట్లసార్లొచ్చావో,
ఇంకేం మిగిలిందిక్కడ, నీదని మన్నించడానికి,
మరేం మునిగిందిప్పుడు, నీవుగా మనలేకపోవడానికి,
చూసుకో ఎవరికరువిచ్చావో,
చేరుకో ఎవరికొరకొచ్చావో,
దిగంతం దగ్గరే, అనంతమూ చేరువే,
మేలుకో ఉదయం చూపని యామినుల్లోంచి,
మారిపో హృదయం చూపిన మాయలనొదిలి"
*14-07-2012