పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Hecchar Ke లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Hecchar Ke లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, ఆగస్టు 2012, ఆదివారం

హెచ్చర్కే || భగవంతుడు ||

పాపా‍యి బొమ్మేసే సరికి ఆకాశం తెల్లబోయింది
నక్షత్రాలు ఎర్రబడ్డాయి
కొన్ని పోల్కా డాట్స్ బాగా కలిసిపోయి చందమామ‍ నవ్వేసింది
నీలి కాంతుల నీరు, పసుపు పొలుసుల చేపలు, సీతాకోక చిలుకలు,
ఏవేవో లోకాలు, ఇంకా... ... ఏం కావాలనుకుంటే అవి అయిపోయాయి


పాపాయి ఏం చేసినా నక్షత్రాలకు, చందమామకు
ఎందుకంత ఇష్టం, ఆకాశానికి ఎందుకంత ఆశ్చర్యం,
వేణువు విన్న గోవుల్లా దిగి వస్తాయెందుకు లోకాలు


కన్నీటి వంటి నీటి రంగులతో తడిసిన కాగితాలను తొక్కుకుంటూ
పాపాయి వేలు పట్టుకుని బయటికి వెళిపోయి, ఆకాశాన్నిఅడిగాను
ఎవరో అలవోకగా విసిరేస్తే రక రకాల రూపాలు ధరించిన మేఘాలు
గాలికి కొంచెం నవ్వి చెప్పాయి
‘ఇంకా పైన ఉన్నాడో లేడో మాక్కూడా తెలియదు గాని, ఉంటే గింటే,
భగవంతుడు పాపాయిగానే ఉంటాడు’: ఆ తరువాత


నాకెవరితో ఎలాంటి పేచీ లేదు, భగవంతుడితో కూడా
పేచీ గీచీ వుంటే పాపాయిగా ఉండని అధికారి తోనే
పాప పుణ్యాల నిర్వచనాలతోనే, పుక్కిటి పురాణాలతోనే

25-8-2012

11, ఆగస్టు 2012, శనివారం

హెచ్చర్కే || అవసరం ||

తలుపులు మూయడం, గడియ పెట్టడం,


పని అయిపోయిన వెంటనే దీపాలార్పడం,
అన్నీ జాగర్తగా గుర్తు పెట్టుకుని వెళ్లి
అంగట్లో సామాన్లు కొనడం, ఇంటికొచ్చాక
పావు కిలో వంకాయల ధరలు గుర్తుంచుకోవడం,
ఎప్పటికప్పుడు లెక్కలు రాసుకోవడం
నిద్ర లేచాక, నిద్ర పోయే ముందు, నిద్దట్లో
శ్రద్ధగా పద్దులు చూసుకోవడం


చాల చాల చాల అవసరం


అనుమతి అడక్కుండా లోనికి రాబోయి
మూసిన తలుపులకు, బిగిసిన గడియలకు,
వెలగని దీపాలకు తలలు బాదుకుని
ఎన్ని కలలు భళ్లున పగిలితేనేమి,
పెంకులు గుచ్చుకుని, సెఫ్టిక్‍ అయి
ఒక్కొక్క అవయవం ఊడిపోతేనేమి,
బతకడమంటే ఇది కాదు కాదు కాదని
రెప్పల కింది తడి ఇసుక గోల పెడితేనేమి


బతకడం చాల చాల అవసరం


దినకరుని వీడ్కోలు సంబరంగా సాగాల్సిన
సాయంత్రాన్నంతా పర్సులోంచి పోసి తెచ్చిన
వాటిలోని రెండు పుచ్చు వంకాయల మీద
చిరు మంటగా కదిలిన ఒక పేచీ సాగి సాగి,
నాని నాని, చివికి చివికి, చిత్తడికి చేరిన క్రిములు
బిగిసిన గడియల, మూసిన తలుపుల, ఆరిన దీపాల
ఇంటిని తమ సొంతం చేసుకుని; నువ్వూ నేనూ
లెక్కల, పద్దుల, పేచీల్లోనికి బహిష్కృతులమై

బతకడం ...
* 9-8-2012

8, ఆగస్టు 2012, బుధవారం

హెచ్చర్కే || చూశా(వా)!? ||

పద పద
పద పదమున ఒక పయనమే కదా

వెళదాం సరే, ఎక్కడికి
కొంచెం సుఖంగా ఉన్న ఈ శిబిరం వదిలి

వెనుదీయకు, లే, నడు
ఎక్కడికెళ్తున్నామో తెలుసుకోడానికి

ఎప్పుడైనా ట్రాట్స్కీని చూశావా
నడుస్తున్న ట్రాట్స్కీని

నేను చూశాను
నడుస్తున్న, పరిగెడుతున్న, ఎగురుతున్న ట్రాట్స్కీని

అదొక సీతాకోక చిలుక పేరు

ఆకాశమంత సీతాకోక చిలుక
ఆకాశమంతా ఒకే ఒక్క సీతాకోక చిలుక

భూగోళం ఒక పువ్వు
వేనవేల క్షణిక రూపాల ఒకే ఒక్క పువ్వు

లక్షల నిర్లక్ష్యపు కత్తుల కోలాటం
కొన్ని కోట్ల పదును వత్తుల కొవ్వొత్తి

పద పద
పద పదమున ఒక కదనమే కదా

ఎక్కడికక్కడ
శిబిరాలు కట్టు, పక్కకు నెట్టు

కలుసుకుంటాం కలిసి తింటాం
నువ్వూ నేనూ ట్రాట్స్కీ వ్లాదిమీర్ ఇల్యీచ్ లెనినూ
(నోట్‍: పేర్ల దగ్గర పేచీలొద్దు. అవి తీసేసి నీ కిష్టమైనవి పెట్టుకో)
* 07-08-2012

హెచ్హార్కే॥ స్థలానికి సలాం॥

దూరం నుంచి, చాల దూరం నుంచి చూస్తున్నాను
సిల్కు ఉదయాలను, వెండి సాయంత్రాలను, ఇంకా
కూలక మిగిలిన మెత్తని నీడల ఆకుపచ్చ మధ్యాన్నాలను,

మత్తుగా మత్తుగా మంద్ర మంద్రంగా వెలిగే రాత్రులను,
ఫోన్ చేయకుండా వెళ్లినా ఎదురొచ్చి కావిలించుకునే,
బాధను పంచుకునే ఊరిని

పరాయి పగటిలో నా రాత్రి, పరాయి రాత్రిలో నా పగలు
నా గడియారం దూరాన్ని కొలుస్తోంది, క్షణ క్షణాలుగా
నా ఆకాశం నేలను పిలుస్తోంది, అటు వైపు దాన్ని

ఎక్కడైనా ఉంటుంది చీకటి పెట్టుబడిగా వాణిజ్య రాజకీయం
ఎక్కడైనా ఉంటాయి మెత్తని నాల్కల వెనుక విషం కోరలు
పుట్టలను ముట్టడించి సవాలు చేస్తుంటుందొక సౌందర్యం

ఎంత అందం నా ఊరు
దాని అందం నా ప్రాణం

ఎప్పుడో ఎవరో ఏవో కట్టించినందుకు కాదు, వాటి
పునాదుల్లో బడుగు బతుకులను పూడ్చినందుక్కాదు
కత్తుల పహరాలలో కొన్ని పాటలు పండినందుకు కాదు
ఉలుల కింద శరీరాలు రాలి తయారైన శిల్పాల కోసం కాదు
అందుకోసం కూలగొట్టినవి, పూడ్చి పెట్టినవి, రాలగొట్టినవి
కూలిపోగా, పూడిపోగా, రాలిపోగా‍ మిగిలిన కొండలు, చెట్ల
నీడలు, పువ్వుల వంటి నీడల్లో తారాడే ఊపిరులు చాలు, ఇంకా
మిగిలిన ఒకట్రెండు చోట్ల తేనీటి చెమట మాటల తేటదనం చాలు

రగులుతూ ఉంటుంది, నన్నొక జ్వాలగా‍ బతికించుకుంటుంది
కుంపటి అట్టడుగున దాగిన నిప్పు కణిక... నా హైదరాబాదు

* 6-8-2012

4, ఆగస్టు 2012, శనివారం

హెచ్హార్కె॥ఏముంది విశాఖలో॥


ఎప్పుడైనా తను జ్ఙాపకం వస్తుంది
జీడిమామిడి చెట్ల మెత్తని నీడల్లో
మొదటి సూర్య స్పర్శ కోసం, తన కోసం
పొంచి వున్న నేను జ్ఙాపకం వస్తాను

ఏముంటాయి క్లాసురూంలో
అదే నన్నయ లేదా భట్టుమూర్తి
తువ్వాలు దుశ్శాలువా సవరించి
మహాప్రస్థానం పద్యాల్లో గర్జించే పదాలకు
నింపాదిగా‍ అర్థాలు చెప్పే మాష్టార్లు, బయట
నల్లగా మెలికలు తిరిగి, పాం పడగల్లా లేచి,
నిట్టనిలువుగా పడిపోయే రోడ్లు... అంతే,
ఏమీ ఉండవు:

చిరాగ్గా తల తిప్పి, అటు వైపు చూస్తే
నునుపు రాతి మీద కదిలే అద్దపు సెల పాటలా
... పగలు కదా, వెన్నెలకు బదులుగా...
ఒక చెంప మీదుగా జారే సూర్యుడు,  
పగటి కాంతిని మెత్త బరిచే మత్తు మగత,
వస్తువులు ఉండీ లేకుండే అంతర్మధ్యం

రామకృష్ణా బీచ్‍లో కూడా ఏమీ ఉండదు
జిగురు సాయంత్రపు బొటన వేళ్లతో
ఇసుకను దున్నుతున్న కొన్ని దిగుళ్లు
ఎప్పుడు ఏ తప్పు చేసిందో, రాతి ఒంటిని వంచి,
ముక్కు నీటికి రాస్తున్న ఆకుపచ్చ డాల్ఫిన్,
దూరంగా, ఘీంకార స్వరంతో మూలుగుతూ
కదిలే కొండలా ఇంకొక ఓడ... అంతే,
ఏమీ వుండవు:

ఇసుకలో ఈ చివరి నుంచి ఆ చివరికి నడిచేలోగా ఒక చోట
నీరెండ జలతారు పరుచుకుని కూర్చున్న సముద్ర దేవత
ఆ తరువాత చీకటి ముసిరినా, అప్పుడు చీకటి ముసిరిందని
కొన్ని యుగాల తరువాత గాని రెండు బుర్రలకు తట్టనివ్వని
ఒక దినకర చంద్రుడు

ఎంత పని వడినా విశాఖ వెళ్లాలని అనిపించదు

ఏముంది? ఏమీ ఉండదు ఇప్పుడు, విశాఖలో ... 
                               
*3-8-2012

22, జులై 2012, ఆదివారం

హెచ్హార్కె॥పేర్లూ నువ్వూ॥


పేరు పెట్టి పిలవకపోయినా వస్తువులు పలుకుతాయి
పేర్లు వస్తువులు పెట్టుకున్నవి కాదు

నువ్వు వాటిలోనికి వెళ్లిపో, అరవకు
తలుపులు బాదకు, విరిగిపోతాయి
తమకు తాము తెరుచుకునే దాకా
కళ్లు మూసుకుని గడప ముందు కూర్చో

ప్రయాణం ఎప్పుడు ఎక్కడి నుంచైనా మొదలెట్టొచ్చు
ఒంటరిగా వెళ్లాలి,
కోట్లిచ్చినా తనకు తెలియనిది చెప్పని గైడు దొరకడు
పది మంది తారసపడినప్పుడు కూడా
ఒంటరితనం వదులుకున్నావా, అంతే ఇక,
మంది ఉంటారు, నువ్వుండవు
మంది పెట్టిన పేర్లుంటాయి, నీకూ వస్తువులకు

కావాలంటే నీదే మరో పేజీలోంచి ఒక పదం తీసుకో

ఓహ్, అలా కూడా కాదు, 
అడుగు ఎక్కడుందో అక్కడి నుంచే ఒక పాదం పైకెత్తి కదలాలి

నడుస్తూ పోతే ఊరొస్తుంది, ఏదో ఒక ఊరు, అన్ని ఊళ్లూ ఒకటే
పేరు భలే మోసకారి,
అదొక పదం అనుకుంటావు నువ్వు, దానికి అంటుకుని
చాల చీము, చాల నెత్తురు; అదంతా
ఊరు ఒక పేరు తెచ్చుకోడానికీ, నిలబెట్టుకోడానికే ...  

ఇక్కడ, ఈ కొండ వారన ఒప్పుడు ఒక ఊరుండేది,
దానికొక పేరుండేది
అందరూ వెళి పోయారు, వాగు ఒక్కటే ఉండిపోయింది, ఉండీ ఉండక
ఏ కొండల్లోంచి రహస్యంగా పారిపోయి వచ్చిందో
ఈ ఇసుకలో కూరుకుపోయింది
క్షణం క్రితం మరణించిన యోధుడి గాయం నుంచి రక్తంలా
ఇసుక నుంచి వాగు స్రవిస్తుంటుంది, అది భూమి గాయం,
బహుశా, భూమి ఉన్నంత వరకు ఉండే గాయం
అమ్మమ్మ వాళ్లూరికి వెళ్తూ నువ్వు కూడా చూసి ఉంటావు
ఎండాకాలం మట్టి వెనుక మాటు వేసిన చిరుత చారను,
వానాకాలం గగన ధారను, ఊట వాగును

పేరా?
ఊరిదా? వాగుదా??
నామకరణం చేస్తే గాని, నువ్వు నీళ్లు తాగవా!!

*21.7.2012