పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, ఆగస్టు 2012, గురువారం

కాశి రాజు॥మగాళ్ళ సంత॥



నల్లగా నిగనిగలాడే
మట్టగిడస,
నాజూకైన నడుమున్న
షీలావతి,

కుర్రమేను కలిగిన
కొర్రమేను,
బొత్తిగా సేతికి సిక్కని
బొమ్మిడాయి,
పిచ్చపట్టించేటట్టున్న
బొచ్చుపిల్ల,

కుదురంటూ ఉండని
కానాగంత,
నిండుమనసున్న
పండుగప్ప,
వలసతీసుకుపోయే
పులస్సేప,
అన్నీ ఆడసేపలే దొరుకుతాయ్

అదేంటోమరి
మన మొగోళ్ళసంత
 
*2.8.2012

పులిపాటి గురుస్వామి॥నిస్తంత్రీ ప్రేమ॥


1

మన మధ్య
పరిచయమైన దూరం ఉండగా

పరామర్శించే వ్యత్యాసం కూడా
కేవలం పలకరిస్తుంది

నువు నాకు
తెలుసనుకునే లోపునే
ఒక ఖాళీ పేజీ ,పుస్తకం మధ్యలో
అవతలి ఇవతలి విషయాల మధ్య
ఎట్లా పూరించాలో తెలియక

మనం నిజానికి చాలా దగ్గర
ఎంతగా అంటే
రూపాయి తూకాల్లో జారిపోయేటంత

2

మన ఇద్దరి లోకాలు
ఒకటి కాకపోవచ్చు
కొన్ని స్వర చాలనాలు
కొన్ని ఆత్మాలింగానాలు
రహదారిలో తటస్థ పడవచ్చు
అవి నీ జ్ఞాపకాల మీద పుట్టుమచ్చలవచ్చు

తెలియక చేసిన తప్పు కూడా
గొంతు పెకిలించు కోవచ్చు
ఒంటరిగా వున్నప్పుడు కొన్ని ప్రశ్నలు
ఊపిరికి చుట్టుకోవచ్చు

మనం నిజానికి చాలా దగ్గర
ఎంతగా అంటే
వాతావరణం విడదీయ గలిగినంత
 
*2.8.2012

వంశీధర్ రెడ్డి॥ఏ నిమిషానికి ఏమి జరుగునో॥


" ఓ పిల్లా. మీ అయ్యేడి"
ఇంత రాత్రి మా ఇంటికెవరొచ్చారన్న ప్రశ్న,
తెల్సుకోవాలన్న కుతూహలం,
వాళ్ళ సారా వాసన ఇంటి వెనకాల, వెన్నెల కింద
పడుకున్న నాదాకా తాకుతుంటే,,

"అన్నా, ఎమి, గీ పొద్దు.
బాపింకా రాలే, కైకిలి కాడ్నుంచి"అక్క,
భయాన్ని కనపడనీయకుండా,
దీపం వొత్తిని చిన్నగా చేస్తూ

"తెలిసే వొచ్చినం,
మీ తాగుబోతోడే పంపిండు,
మా బాకీకి నిన్ను జమచేసుకోమన్నడు" గ్రామపంచాయతిలో అటెండర్,
పగలు నాతో చెరువులో ఈత కొట్టేవాడేనా ఇలా...
దీపం మరింత చిన్నదై..

వంటింటి దాకా వొచ్చారు,
కాళ్ళకడ్డంగా ఉన్న కొత్త కుండ పగిలిన శబ్దం
వాడితో మరో ఇద్దరు,
పోల్చుకున్నా వెన్నెల వెలుగులో

అక్క అరిచింది, నేను వాళ్ళ కాళ్ళ మీద..,
బెదిరిస్తే కాళ్ళు మొక్కడమొక్కటే నేర్చుకున్న ఊరది,
వాళ్ళ వయసులో సగం లేని నేను,
ఎలా ఆపాలో తెలీక, అరిచా.
ముగ్గురూ పారిపోయిన అలికిడి, గొడదూకి,

అక్క అలా ఏడవడం, అమ్మ పోయిన తర్వాతే,
ఆ రాత్రి చంద్రుడూ మాతోపాటు మేలుకుని
నాన్న మీద కోపంకన్నా. పగ పెరిగి..

తెల్లారుతుండగా నాన్న, ఆ ముగ్గురితో
అక్కని లాక్కెళుతూ
అమ్మలా కన్పించింది అక్క,
నన్నింకోసారి పోగొట్టుకుంటావా అని అడిగినట్టై
అక్కను దూరంగా నెట్టి, దీపం బుడ్డి విసిరిన
మంటల్లో నాన్న,
దసరాకి ఊరిబైట కాల్చే రావణుడిలా,
ఆ ముగ్గురూ మాయం

పోలీసుల్ని తీసుకొస్తారని తెలిసేంత చదువుంటే,
వాళ్ళని కూడా..
ఇంకా ఎందరో అక్కలు సుఖంగా ఉండేవారే..

చాలా ఏళ్ళు బోస్టన్ స్కూల్లో.
అక్క మొదట్లో చూడ్డానికొచ్చేది,
తర్వాత ఉత్తరాలొచ్చేవి,
చివరగా నేను పంపిన ఉత్తరాలు నాకే..
ఇల్లు మారిందనుకున్నా

విడుదలై ఇంటికెళ్తే,
అక్క, ఇద్దరు పిల్లల్తో,
గ్రామపంచాయితీ అటెండర్ గాడు కూడా,
చెయ్యి లేచింది గాల్లో, వాడి మెడ విరవడానికి

"తమ్ముడు,
మీ బావరా, నమస్తే పెట్టు" అక్క,
మనిషి కూడా మారినట్టుంది
నా మెడ విరిచేసి,
మనసును కూడా...
*2.8.2012

నందకిషోర్॥రాఖీ॥


హసన్‌పర్తి హాస్టల్లోంచి
పండక్కని పర్మిషనడిగి,
జీపుల్లల్ల ఆటోల్లల్లబడి
ఇంటిముందుదాక వచ్చి,

నేనొచ్చి లోపలికి తీస్కపోవాలని
కడపకాన్నే కూలబడ్డట్టు..
నీ కండ్లపొంట నీళ్ళు
బొటబొటా రాలుతున్నట్టు..

బట్టలుతుక్కొని ఎర్రగైన
లేత చేతుల్లల్ల కట్టెల్లసంచితో
నువ్వింకా అక్కన్నే
నిలుసున్నట్టు..

గనపడంగనే
ఉరుక్కుంట వచ్చి
కావలించుకుని
కండ్లు తుడుసుకున్నట్టు..

తెచ్చిన దారప్పోసల రాఖీకి
నీలెక్క నాలెక్క గుచ్చిపెట్టిన
రెండుపూసలూ..
మాయమయినట్టు,
మళ్ళీ తేలినట్టు..

ఏందోనే అక్కా!
రాత్రంతా ఒకటే మనాది!

***

రెండేండ్లు నువు రాలేనప్పుడు
చెల్లెనే రెండ్రెండు కట్టింది.
నువ్వు చెయ్యిపట్టుకునే తీరు
గదెప్పుడు నేర్శిందో తెల్వలే..

నాలుగేండ్లు నేను రానప్పుడైన
ఎట్లబడి నీ రాఖీ నాకుజేరేది.
పోస్టుల్నైనా పంపించి
కట్టుకొమ్మని పోన్‌జేసేదానివి..

***
సాగతోల్తాంటే
అమ్మ నా చేతిల
నీ చెయ్యిపెట్టినప్పుడో
నల్ల పూసలు గుచ్చినంక
కార్ల నిన్ను తీస్కపోయేటప్పుడో
నిమిషమన్నా
దుక్కించకపోతిని!

అందర్ని సూడబుద్దైతుందిరా అని
మొన్న మాట్లాడినప్పుడన్న
ఏడ్వకపోతిని!

నువ్వు మళ్ళా
పర్మిషనడిగి
కట్టెలసంచితో
ఇంటికాడ నాకోసం
ఎదురుసూస్తున్నట్టు

వెండి రాఖీ
రెండు దారప్పోసల మధ్య
ఇరుక్కున్నట్టు

ఏందోనే అక్కా!
పొద్దున్నే పిచ్చి కల!

***

ఏదేమైనా
నీకోటిజెప్పాల్నే..

గీ దినమన్నా
నీ యాదిల గడపకుంటే
యాడాదంత
గడ్వనట్టే ఉంటది.

అక్కా..నీ బాంచన్..
యేడున్న సల్లంగుండు.
 
*2.8.2012

మెర్సీ మార్గరెట్॥సంతోషం ఎలా ఉంటుందో తెలుసా ?॥


చేప నవ్వుతో
నీటిలో వచ్చిన బుడగల్లా

తంగేడు పువ్వు రంగులా

చీలిన వేణువు శరీరం లోంచి
వచ్చిన మోహన రాగంలా
వర్షపు చినుకులో
నిండుకున్న
హరివిల్లులోని రంగుల్లా

గులాభి మొగ్గను ప్రేమతో
కుడుతున్న చీమలా
నా చేతుల్లొ ముద్ధలా మారి
ఎరుపు రంగు నింపుతున్న గోరింటాకులా

పాపయిలా నేను తిన్న బలపపు
రుచిలా
తప్పుగా రాసిన అక్షరాలను తుడిచిన
ఎగిలి తడిలా

నాన్న కొట్టిన తర్వాత
కర్రను కొపంతో విరిచేసి
హమ్మయా అనుకున్న నవ్వులా
మొదటి తరగతిలో టీచర్కి
దొంగతనంగా కోసుకెల్లి ఇచ్చిన
పువ్వులా

నీకు దగ్గరై హత్తుకున్నప్పుడు
కళ్ళకి ఆనందం కలిగి
ఉబికి వచ్చి
చెంపలని ముద్దాడిన
కన్నీరులా

నీ కౌగిలిలో చిగురిస్తూ
పచ్చదనం పూసుకుంటున్న
లేత చిగురు ఆకులా
ఆ ఆకుపై నువు త్రాగుతున్నప్పుడు
నీ పెదాలపై నుంచి జారిపడ్ద
ప్రేమ రసంలా

సంతోషం ఎలా ఉంటుందో
తెలుసా ?
అచ్చం నీలాగే
హర్షాతి రేకలతో
తెల్లని నవ్వువైపుకు
నన్ను త్రిప్పుకుంటున్న
నంది వర్ధనంలా
నా నుదుటిపై నీ తొలి ముద్దులా ♥
* 2.8.2012

బాబీ నీ॥గీతలు॥


నీకోసం
నాకోసం
ఎన్ని గీతలు

అక్షరాలకు అక్షరాలుగా..

సరాసరి
నెత్తుటిగీత
నీ హ్రుదయాన్నుంచి
నాహ్రుదయంలోకి..!!

మనిద్దరిమధ్య ఎన్నెన్ని గీతలు

సొంగలు సొంగలుగా గీతలు
నీపెదాల్ని
నాపెదాలు
పలకరించినప్పుడు,
ఒకళ్ళకొకళ్ళం గాట్లుగా మిగిలినప్పుడు.

దుర్మార్గపు దారం గీతలు
మౌనంలో
ఆరోజు..
అదే పెదాల్నికుట్టి
నా పాదాల్ని కట్టి పడేసిన గీతలు!

నిన్ను-నన్ను
మనమనే ఇద్దరిని
బతుకంతా దూరం చేసిన
ఒకేఒక
పసుపురంగు దారంగీత!

చిక్కు ముళ్ళళ్ళో చిక్కుకుపోయిన గీతలు
ఆక్షణం..
ఆ జీవనదీజన్మస్థలంలో
మన ముఖాలమీద
ఆగని
ప్రవాహ గీతలు!!

నీకోసం నాలోపల ఎన్ని గీతలు

గీతలు
ఆగిపోవు
గీతలు
చెరిగిపోవు
నేననే ఆరడుగులగీత
నేలకింద రాసుకునేదాకా!!

హ్రుదయాన్ని
కత్తిరించి
చివరకు
పులిస్టాప్ పెట్టుకునేదాకా..!!
 
*2.8.2012

పెరుగు రామకృష్ణ||మృత్యు ఘంటికలు...||


మట్టితో,
ప్రకృతితో

మమేకమై
మహిమాన్విత మైంది
మనిషి బ్రతుకు..
పైరుపంటల,పాడియావుల
పురాతన బందం గుండెల్లో
పదిలపరుచుకుని
ఆత్మ సాంగత్యంతో నడుస్తున్నాడు
పచ్చని ప్రపంచాన్ని చూసినప్పుడు
చెట్టు మొదల్లో నిల్చునప్పుడు
అమ్మ పొట్టలో తలదాల్చుకున్నట్లు వుంటుంది..
నిర్మలమో
ప్రశాంతమో
ఏదయితేనేం..
ఈ నేలను సుజలాం,సుఫలాం,
సస్య శ్యామలాం చేసిన
సృష్టి కర్తకు వందనం..
ఎన్ని రంగులు,
ఎన్నిపువ్వులు
ఎన్ని అందాలు అద్దిన
సృజనకారునికి అభినందనం..
దురదృష్టం..
కాలుష్యం కల చెరుపుతుంది
ఏవీ ..
తుమ్మెదనై పూల మొక్కల మధ్య
పరుగెత్తిన కలల ప్రపంచపు కొసలు
ఇప్పుడు
ఎవరో రహస్య శిబిరం నిర్మించుకున్నట్లు
పొలం మధ్యన పొగ గొట్టాలు లేస్తున్నాయి
గెణాల పాదులు తీసిన పొలం
రాత్రికి రాత్రి రొయ్యలగుంట లై
రసాయన స్నానం చేస్తుంది..
రక్తం రంగు నింపుకున్న దేహాలు
పచ్చదనాన్ని మార్చురీకి తరలిస్తున్నాయి
భూమి శిధిలమై మనిషికి
బూడిద బహుకరిస్తుంది..
దీప ద్రవాలన్నీ ఆవిరై
ఆమ్ల వర్షాలు కురిపిస్తున్నాయి
మనిషికీ మనిషికీ
మనిషికీ మట్టికీ మధ్య
పరిచయ నిర్మాణం భారమై పోతుంది
రెప్పమూసినప్పటి నల్లని దృశ్యాలన్నీ
మనిషి బతుకును మసక బారుస్తున్నాయి
అంతా వ్యాపార వ్యాపకమే ..
తరాల నాటి మది గోడలనిండా
నింపుకున్న ఆకు పచ్చటి అడవి
ఇప్పుడొక శిధిల జ్ఞాపకమే..
వేడెక్కిన భూమి మీద
మృత్యు ఘంటికలు మోగుతూ
బ్రతుకు వస్త్ర పోగుల్ని నిలువునా జ్వలిస్తూ..
అతి తీవ్ర గ్రీష్మాల్ని
స్వాగతించాల్సి వస్తోంది..
వెన్నెలని ఏరుకున్న చోటనే
కంకాళాల వికార వంతెన మీద నడవాల్సి వస్తుంది..
నిషిద్ద ప్రపంచపు గది ముందు
శరీర తొడుగుల్ని విడిచి
ఏమీ లేని తనం తో మిగలాల్సి వస్తుంది
ఇప్పుడు
మనిషి స్వార్ధంతో మట్టిని మింగేస్తుంటే..
భద్రకాళిలా రుద్ర రూపం దాల్చి
ప్రళయంలా మట్టి విరుచుకు పడి
మనిషిని మింగేస్తుంది..!!
*2.8.2012