పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, సెప్టెంబర్ 2012, మంగళవారం

మూర్తిరాజు అడ్లూరి //అక్షర విన్యాసం//


పుస్తకం లోని అక్షరాలు
ఏదో ఒక భంగిమలో
నర్తిస్తూనే వుంటాయి

పుస్తకానికి నారెండు కళ్ళు
అతికించినప్పుడు అక్షరాలన్ని
వింత వింత ఆసనాలతో
యోగాచేసినట్టు,
నాజూకు కొమ్మలు జిమ్నాస్టిక్
చేసినట్టు వుంటుంది

పరమాణువులు
అణువులై,పదార్థమై నట్లు
అక్షరాలు పదాలై, వాక్యాలై
రసభావ పదార్థాలైతాయి

పరమాణువు విస్పోటనం
అక్షరం మహావిస్పోటనం
అక్షరాలన్ని అద్భుతాలె
ఒక్కటెదో అత్యద్భుతంగ
నాకు అంతర్నేత్రాన్నిస్తుంది
తాను మాత్రం రూపాంతరం
చెందకుండ అన్నింటికి
రూపాన్నిస్తూ విలాసంగ
విన్యాసం చెస్తుంది

03/09/2012

రేణుక అయోల// దహనంలో ఒళ్ళు//


ఒళ్ళు దాచుకో
పైట జారనీయకు
జీన్స వేసుకోకు
దాని మీద టాప్ అంత చిన్నదేమిటి
మినీస్ ఎందుకు?

ఒద్దికగా వున్న ఒళ్ళు కావాలి
నాజూకుగా వుండాలి
తెల్లగా వుండాలి
ఒళ్ళు వంచి పని చెయ్యాలి

ఒళ్ళు దాచుకోకు
సహకరించు
నాజుకుగా వుంటేనే ఇష్టం
అలంకారాలెందుకు
నాకోసం అందంగా వుండు చాలు

ఒళ్ళు దాచుకోకు
మాంగల్యం లేనప్పుడు
నీకు ఇష్టాలా?
నీ జీవితం మాది
ఒళ్ళు గట్టిగా వుంచుకో
చాకీరి కోసం

ఒళ్ళు దాచుకో
ఆనారోగ్యం మాకు పడదు
శిధిలమైన ఒళ్ళు కాటికేగా!
ఒళ్ళు దాచేయ్యి
తెల్లటి వస్త్రంతో

దహనంలో ఒళ్ళుతగలపడ్డకా చల్లారింది
ఒళ్ళు అమ్ముడుబోదని...

గద్దెపాటి శ్రీనివాస్ || అనుభవం ||


జ్ఞాపకం ఒంటరిదైనప్పుడు
ఆలోచనల గుర్రానికి
అనుభవం ఒక రౌతై కళ్ళెం వేస్తుంది
జీవితం...
అదేంటో గాని
చిత్రంగా పరుగులుతీస్తుంది
అక్కడక్కడా కొన్నిమజిలీలు
అర్దాన్నివెతుక్కునే ప్రయత్నంలో
మళ్ళీ వెనక్కుపిలుస్తాయ్
తీరా అక్కడకు వెళ్ళేసరికి
గతం నన్నుచూసివెక్కిరిస్తుంది
మళ్ళీ అదే అనుభవం
ఒకమాస్టారై
ఆప్యాయంగా పలుకరిస్తుంది
జీవితంతో రాజీపడలేక
కాలంతో పోటీపడలేక
అలసిపోయిన ఈ దేహాన్ని
అనుభవం అమ్మై ఆదరిస్తుంది
ఒంటరిగా కూర్చొని
నన్ను నీనే ప్రశ్నించుకుంటున్నప్పుడు
జవాబులేని ప్రశ్నలెన్నో
నాముందు ప్రత్యక్షమౌతాయి
చిత్రమేమంటే
ఇక్కడ ప్రశ్న నేనే....
జవాబూ నేనే.....

కన్నా రాజేష్ || ప్రియమైన స్నేహితునికి ||



నాపై ప్రేమతో ముడుచుకు పోవడంకన్నా
వెలుగు రేకల్ని విప్పుతూ వికసించడమే మంచిది
విరక్తితొ లోలోపలికి అనిగిపోవడంకన్నా
మొండిగా మొలకెత్తడమే మంచిది
స్ప్రుహకోల్పోయి చల్లబడడంకన్నా
నాపై ద్వేషంతోనైనాసరే జ్వలిండమే మంచిది
కోపంతో రాత్రిలోకి జారిపోవడంకన్నా
కసితో వుదయించడమె మంచిది
తిరిగీ తిరిగీ మొదలైన చోటికే రావడానికి
భూమిలా గుండ్రంకాదు, కాలం బల్లపరుపు
నడుస్తూ నడుస్తూ నచిన ప్రదేశందగ్గరే నువ్వాగిపోవచు
ఉద్యమం నిత్య ప్రవాహం
ఎవరైన మనం కాకముందు నువ్వూ నేనే కదా
నువ్వో నేనో ఎవరో ఒకరో
మొదలూకాదు చివరాకాదు
ఒకరినుండి అందుకోవడం కొనసాగించడమే తప్ప
కొత్తగా ఏదీ వుండదు..

ప్రవీణ // పై పై బతుకు //


ఇప్పుడంతా
పై పై బతికేయ్యటం అలవాటు చేసేసుకున్నాం
ఏ క్షణానన్నా పొరపాటున అంతరాలలోకి జారిపడితే
ఆత్మవిమర్శలు చుట్టుముడితే
అస్తిత్వం ప్రశ్నిస్తే
మిగిలేదంతా అంధకారమే!

ఇప్పుడంతా
పై పై బతుకులకు సౌఖర్యాల మేకప్పులేసేసాం
మస్కారా కరిగితే, ఐలైనర్ చెదిరితే
కాంతి క్షిణించిన కళ్ళలో జీవాన్ని భూతద్దంలో వెతుక్కోవాల్సిందే!
లిప్ గ్లాస్ అద్దిన నవ్వులు లిప్ స్టిక్ చెదరనంత వరకే!
ఆ సింగారం కరిగి వికారం బయటపడే దాకా అంతా సౌందర్యమే!

ఇప్పుడంతా
పై పై బతుకున పైపై పొరలలో అల్లుకున్న బంధాలే
లోతుల్లోకి తొంగి చూసే తిరికేది?
పలకరింపు సమాధానాలన్నీ కుశలాలే!
ఆత్మను తాకే స్పర్శ
మనసును హత్తుకునే కౌగిలి
కష్టం పంచుకునే హృదయం మృగ్యమే!

ఇప్పుడంతా
పై పై బతుకు నడకల్లో భూమిని తాకని పాదాలే
గాలిని మించిన వేగంతో
భావనాలెక్కి, అంతస్తులు పెంచి
రోధసిలో తిరిగి తిరిగి అలిసాక
వాకిలిలో చేరి రోదిస్తూ విశ్రమించటమే!

ఇప్పుడంతా
పై పై బతుకు చేతల్లో మీటలు నొక్కే యాంత్రికతే
తినే తిండి, పిల్చే గాలీ లెక్కే
జీతాన్ని, జీవితాన్ని కంప్యూటర్ పెట్టెలో లాక్ చేసేసి
జీవాన్ని, ప్రాణాన్ని క్లికుల్లో లెక్కించేస్తున్నాం !
స్నేహం, బంధం, బంధుత్వాలన్ని కొనలకు వేలాడుతున్న ఆర్ధికతత్వాలే!

ఇప్పుడూ కూడా అప్పుడప్పుడూ
గుండెలోకి జారే అశ్రువు గర్భంలోకి చేరి
ఇలా..రహస్యాలను విప్పుతూనే ఉంటుంది!
అయినా...ఈ అశ్రువు జీవితకాలమెంతని?
ఎగిసే నిప్పుల సెగలో అవిరయ్యేంత వరకే కదూ?

9.3.2012

అన్వేషి.//మది గా(గే)యం //


తన జ్ఞాపకాలు సైతం
గాయం చేస్తుంటే..
కన్నీరు కూడా ఇంకిపోయింది.
మదిని ఎడారిగా మార్చేస్తూ..

కలలు సైతం తనని
చూపలేవని తెలిసి
నన్ను గతంలోకి తీసుకెళ్ళమంటున్నా
కాలాన్ని జాలిగా అర్దిస్తూ..

తలపుల వాకిలిలో
తనకోసం ఎదురుచుస్తూ ఉన్నా..
తొలికిరణాల స్పర్శతో రాత్రి కలలన్ని
రంగులు కొల్పోవడం చుస్తున్నా..

తానొస్తుందని ఎదురుచూసే
ఆశకి సైతం నిరాశకలిగి
నను విడిచిన క్షణాన
రాజీపడిపోయా వాస్తవంతో నిర్లిప్తంగా..

03-09-12.

సురేష్ వంగూరీ || మరో ముల్లు ||


ముల్లును ముల్లుతోనే తీయాలి
తీసే విధానం సరిగా తెలియాలి

ఒక ముల్లు కసుక్కున దిగబడింది దోపిడీదారుడిలా
మరో ముల్లు జాగ్రత్తగా దానిని తొలగించాలి ఉద్యమకారుడిలా

వాదాలూ, విశ్లేషణలూ తర్వాత
ముందు ముల్లెలా తీయాలో తెలుసుకో
ఎగబడి ఆగ్రహించటం ఉద్యమమైతే కాదు

ముల్లును మెత్తగా గీరటం తెలుసా
లేతగా స్పృశించటం తెలుసా
కొంచెం కొంచెంగా చర్మాన్ని చల్లగా చీలుస్తూ
లోపలికి పోవటం తెలుసా
ఒక్కొక్క పొరనే ఓర్పుగా కదుపుకుంటూ
మృదువుగా ముల్లును బైటకి నెట్టడం తెలుసా

ఈ ప్రయత్నంలో
నొప్పి అనివార్యమే కానీ
అధికారికం కాదు సుమా

ఆగ్రహ ప్రకటన అంటావ్
ఎవరి మీద?
ముల్లు మీదా? దేహం మీదా?
కలుపు మొక్క మొలిచిందని పొలం తగలబెడతావా?
ముల్లు బాధ పెడుతోందని కాలు నరుక్కుంటావా?

మానవీయ విలువల్ని తుంగలో తొక్కి
ఉద్యమించటం అంటే మరో ముల్లుగా దిగబడటమే

అన్నా...
ఇప్పుడు చెబుతున్నా
ఇదే ఉద్యమమంటూ
ఇష్టమొచ్చినట్టు నువ్వు గుచ్చుకుపోతుంటే,
సమాజం కదా, నా దేహం కదా
చూస్తూ వూరుకోలేను
కష్టంలో కష్టం
నొప్పిలో నొప్పి
రెండు ముళ్ళు దిగాయంటూ
నిన్ను కూడా వదిలించుకుంటా

9.3.2012

కెక్యూబ్ వర్మ ॥డర్టీ పిక్చర్॥


కాళ్ళకు కలల చక్రాలు తగిలించుకొని
మోహపు దుప్పటి కప్పుకొని
నింగిలో తారలా మెరవాలని
మెరీనా వైపు ఎఱంచు నల్ల పరికిణీతో పరుగులిడి
నీటిని వీడిన చేపలా
కంగారుగా వచ్చి
వెండి తెరపై దేహపు కళ్ళను పరిచి
ఎందరికో నిద్ర లేని రాత్రుళ్ళు పంచి
నీ నవ్వు నడుము వంపు వయాగ్రాలా మింగిన
ఈ లోకం నిన్ను దహిస్తూ శాపగ్రస్తురాలైంది...

నిద్రకు వెలియై మనసు మంచు గడ్డ కట్టి
అసూయపు కత్తులతో వెన్నంతా గాట్లుపడి
ఒక్కదానివే కుప్పలా పడి
నేలలో ఇరిగిపోయిన నీ ఉచ్వాశ నిశ్వాశల వేడికి
వీడ్కోలు కనీటి వీడ్కోలు ఓ అప్రియ నేస్తమా...

(నిన్న డర్టీ పిక్చర్ చూసి కళ్ళు చెమర్చి యిలా....జయహో విద్యాబాలన్)
(03-09-2012)

జిలుకర శ్రీనివాస్ కవిత


మబ్బులు అలిసిపోయి భూమ్మీదికి వొంగాయి ముత్యాలు కాలువలో పారుతున్నాయి మెరుపుల్ని చూస్తె చాలు కంటికి చీకటి తప్ప మరేదీ కనిపించని ఆ వాన రాత్రి మా బాపుని చేతిలోకి తీసుకొని కన్నా తండ్రిలా నడిపించిన నా లేత పాదాలే బురదలో మెరుస్తాయి ఒక్కసారి ఆకాశం బద్దలైన పెద్ద శబ్దం విని ఎప్పుడూ భయపడని బాపు నా చేయి పట్టుకొని వోనికిపోతూ గావుకేక పెట్టినప్పుడు నా గుండె మీద తొలిసారిగా పిడిగు రాలింది మొగులు ఉరిమిన ప్రతిసారి మా బాపు బెదురు కళ్ళే గుర్తొస్తాయి ఏం కాదు బాపు భయపడకని చెప్పిన నా మాటలే చెవుల్లో ప్రతిధ్వనిస్తాయి గోరీలో నిద్దరోతున్న మహా జ్ఞానిని ఒక్కసారిగా నిద్రలేపి మాట్లాడాలనిపిస్తాది

మా తాతలు నడిచిన ముద్రలిక్కడే ఇంకా చెరిగిపోకుండా ఉన్నాయి వాటిని మా నాయిన కల్లకద్దుకొని కాపాడుకున్నాడు మా గుండెల మీద వాటిని చెరగని గుర్తులుగా చెక్కిపోయాడు తవ్వండి సమాధులను రాక్షస గుళ్లని మీరు హేళన చేసినవి మా పూర్వీకుల ఆనవాళ్ళు పురాతత్వ శాఖ మూగతనం వెనక ఎన్ని కుట్రలున్నాయో మాకు తెలుసులే. మా చరిత్ర మట్టిపోరాల కిందే మగ్గి పోవాలని కదా మీ కుతంత్రం చెరిపేస్తే చెరిగి పోవడానికి అదేమన్నా మీరు రాసిన అబద్దపు కారు కూతలనుకున్నారా? వేల ఏళ్ళ తర్వాత కూడా రంగు వెలువని మట్టి కుండలు తయారు చేసిన జాతి మాది తవ్వుకుంటాం పూర్వీకుల నెత్తురు పారిన చోట వెలిసిన మీ సింహసానాల ఒక్క తన్నుతో పడదోస్తాం! రాలుతున్నవి చినుకులు కావి తమ్ముడా మనల్ని చూసి మన తాతలు నవ్వితే తొణికిన కన్నీళ్లు

మబ్బులు తొలిగిపోక తప్పదు నల్లని బండల మీద నక్షత్ర పుంతలు చెక్కిన మూలవాసుల ఆశలు ఈ దేశ శిరస్సు మీద తలతలా మెరవక తప్పదు ఈ నేల మీద నాగరికతను నాటిన జాతి గర్వంతో పాలకులవ్వక తప్పదు మా అయ్యా కాన్షీరాం మనువు తల మీద కాలు మోపి తొక్కి చంపక తప్పదు శవాలు మాత్రమే నడుస్తున్న ఈ మనుభూమిలో మనిషి తిరిగి పుట్టక తప్పదు బుద్దుని శిగలోని చాందిని నవ్వక తప్పదు

రావి రంగారావు // “సు”దర్శనం //


ఒకణ్ణి చూస్తే
లేడిని తినాలనుకుంటున్న
పెద్ద పులి గుర్తొస్తుంది...

ఇంకొకణ్ణి చూస్తే
గోతికాడ కాచుక్కూచున్న
గుంటనక్క గుర్తొస్తుంది...

మరొకణ్ణి చూస్తే
బల్లమీదనే గడ్డి తింటున్న
జంతు వొకటి గుర్తొస్తుంది...

కలం పట్టుకున్న
నిన్ను చూస్తే మాత్రం
మన ఊరి వాళ్లకు
సూటిగా విల్లెక్కుపెట్టిన
సూర్య వీరుడు గుర్తొస్తాడు.

నరేష్ కుమార్//ఓ పుండువి//


ఇంకెం జెత్తవ్
కొడుకా...!
పత్థర్ కేశి కొట్టి
పగల గొట్టుకో
నీ గళాన్ని

ఎలుగెత్తి ఎం ఒర్రుతానవ్రా....!?
పగిలిపోయిన ఆవాజ్ అతికించాలని....

నీ స్వర పేటిక
నిండా
అమెరికోని
అక్రమ సంతానం గాడు
క్విక్ ఫిక్స్
నింపినంక,
నీ కొండనాలుక
కబ్జా జేసిండెవడో.....

అరవై ఏండ్లు
నిన్ను నలిపినోడెవడో.....
నిన్నే
నీ బందూకు
గొట్టపు గొంతుకడ్డం నూకిండు.....

నీ అమ్మ పాలిప్పుడు
నీవికాదు....
తమ్ముని మాస్కేస్కొని
ఎవడో పిండుకొని
అంతర్జాతీయ
దుకాన్ల
అమ్మేస్తుండు
ఆపుకొలేని
నీ మంచితనం
అనే
చేతగాని తనాన్ని
పెదవుల్లో
నవ్వు లా
నమిలి
నీ మీదే
ఉమ్మేస్తుండు......

నీ ఉద్యమం
టీ.ఆర్.పీ.రేటింగ్ కి
కొలమానమిప్పుడు..

నీ ఫాల్తూ మాటలాపి
జర్ర
ఒకసారి
చెయ్యి.లేపు
చేతగాదా.....!?

ఆని కాళ్ళు మొక్కు
నీభాషని
హాస్యం చేసి,
నీ సంస్కృతిని
అపహాస్యం చేసి,
నీ ఆత్మ గౌరవానికి
బట్టలిప్పి
ఆడు నవ్వుతుంటే
ఎనకా ముందట
మూస్కో
ఎందుకంటే.....!
రక్తం మరగని
చీము
నిండిన
పుండువి నువ్వుభా
సంకెళ్ళు తెంపుకోని
నీకు.....
ఇంతకంటే
మంచి పోలిక
ఇంకెవడిస్తడు........

పి.రామకృష్ణ __ // వేయిపూలు వికసించనీ //


కత్తులకంటిన
నెత్తుటి గాయాల్ని
కన్నీళ్ళతో కడుక్కోవాలి.
యుద్దానికి, యుద్దానికి మధ్య, కాసేపు
కాఫీ బ్రేక్ ఇవ్వండి మిత్రులారా.

వున్న మూడడుగులూ కాస్తా-
కబ్జా చేసేస్తే ఎట్లా?
పదాల్ని ప్రసవించే ప్రయత్నంలో,
నిండు చూలాలు నా కలం.
కాలు మోపేంత కాలమైనా-
కనికరించండి కామ్రేడ్స్.

ఆయుధాల సంతలో ఓ మూల
పంజరాల్లో పావురాళ్ళు.
వాదోపవాదాల పాదాల క్రింద-
తలెత్తుకోలేని లేత చిగుర్లు.

పచ్చని చెట్టొకటి దొరికిందనే కదా-
పుల్లా పుడకలతో గూళ్ళు కట్టుకునేది?.
పిట్టల స్వప్నాల్ని తూటాల సవ్వడితో
వెళ్లగొట్టేస్తే ఎలా?

సమరానికి సమరానికి మధ్య-
శాంతిక్కూడా చోటిస్తేనే కదా
మూణ్ణిమిషాల మౌనం పాటించేది?.
శవాల్ని గుర్తుపట్టనివ్వండి సోదరులారా.

వివాదాల నదుల్లో
అట్లా ముంచేస్తే ఎలా..?
పిల్లకాల్వల్లో కాగితప్పడవల్ని
కొద్ది దూరమైనా కదలనివ్వండి.

నినాదాల వర్ణాల్ని
పులిమేసిన గోడలపై
ఏదో ఓ మూల
చిన్నారి సాలెపురుగులుంటాయి
కవిత్వాన్ని అల్లుకోడానికి-
వాటికి
అనుమతినివ్వండి.

అరె మిత్రులారా...

కవిత్వం అల్లుకోవడానికి
ఎవరికీ
అడ్డుకాకండి.

__03/09/2012

సాయి పద్మ ||కష్టమే నా ఇష్టం...||

 
నా దగ్గర ఉన్నదిదే..నేను అమ్మేదిదే..
ఎవరేమైనా అననీ..
గోప్పననీ..తప్పననీ..పతిత అననీ...పరాన్న భోక్తం అవనీ..
నా పిల్లల ఫీజులు కట్టేందుకు...మేం మనుష్యుల్లా బ్రతికేందుకు..
తప్పదీ తొమ్మిది నెలల బరువు..
తోసేసా తలకెత్తుకున్న పరువు...
నా గర్భం అమ్మక తప్పదు.. నా దగ్గర ఉన్నదిదే..

పొగిడారు కొంతమంది.. తెగిడారు మరింతమంది..
అసూయ పడ్డారు మా వాడ వాళ్ళు..
ఆశగా చూసారు అవకాశం రాని వాళ్ళు..
ఛీ..దీనికన్నా ఒళ్లమ్ముకుంటే నయం...అన్నాయి కొన్ని నోళ్ళు..
నా కడుపు కూడా నా వోళ్ళే కదా..
వచ్చిందో సందేహం
వోళ్ళే కదా అమ్ముకుంటున్నది..??
నీరు పట్టిన నిండు నెలలే కదా నా వరకు మిగిలేది..?
వ్యభిచారం కంటే.. వంశాలు నిలపటం
ఖచ్చితంగా లాభసాటి బేరం..

నిజమే.. ఈ పని ఘోరమే..
రక్త బంధాన్ని.. ప్రేమ పాశాన్ని అమ్ముకుంటున్న నేను..
మీ ఊహా ప్రపంచపు బ్రహ్మ రాక్షసినే..
బ్రహ్మ రాయలేని నా విధి నేను విధిగా నిర్వర్తిస్తున్న దానినే
అందుకే మీ సహానుభూతి పై ఆశా లేదు..
సహకారం పై ఆసక్తీ రాదు..

అవునూ.. మళ్ళా సందేహం..
నా కడుపు..క్షమించాలి నా వొళ్ళు నేనమ్ముకుంటే..
మీకేంటి బాధ..??
పుట్టిందగ్గర్నుంచీ అద్దె కిస్తూనే ఉన్నా కదా
పాచి పనుల్లో.. అమ్మకి చేతులిచ్చా..
తాగోచ్చిన నాన్న దెబ్బలకి.. వీపు..
పెళ్ళయ్యాక మావోడికి.. వొళ్ళంతా ఇస్తూనే ఉన్నా..
అమ్మనయ్యాక నా పిల్లల కోసం రక్తం..
ఇలా వీళ్ళందరికీ అడక్కపోయినా మనసు నైవేద్యం ఇస్తూనే ఉన్నా..
ముక్కలుగా కోసి .. శరీర పళ్ళెం లో పెట్టి మరీ..

ఇవాళ ఏదో నా గర్భం అద్దె కిస్తే..
భూగర్భం చీలినంత గోల చేస్తారెందుకు..
ప్రతీ ఆడదీ చేస్తున్నదేగా..
ఇప్పుడు దానికో వెల నిర్ణయమైనందుకు..
మనం సంతోషించాల్సిన విషయం కదూ..

సరే గానీ..
నిరంతరం తాము నమ్మిన విలువలు అమ్ముకుంటున్న వారి మీద
లేని జాలి, జుగుప్స..
నా మీద కుమ్మరించకండి దయ చేసి..
వర్ణాల కతీతంగా వంశాల బరువు మోయగలం గానీ..
మీ సానుభూతి నెత్తి కేత్తుకోలేను..
అసలే ఒట్టి మనిషిని కాను నేను..!!

--

కర్లపాలెం హనుమంత రావు॥ఆలోచనా శకలాలు-౩॥

  0
కళ
కళ కోసం కాదు
జనంమొహంలో కళ కోసం

1
నిద్ర
గొంగళిపురుగు
బ్యూటీ థెరపీ

2
పాప అప్పటి
ఉయ్యాల అనుభవం
పనికొచ్చిందిప్పటికి ఉరికొయ్యలా

3
కింద పడితేనేనా
మనిషి
పైకి చూసేది!

4
ఎగిరే ముత్యాల దండ
ఏ తరువువరుడి మెడకో
-కొంగల బారు

5
పాలిచ్చే ఆవు పెరట్లో
తాగి మొరిగే కుక్క ఒళ్ళో-
-దేశం

6
తడబడే కడవనీరు
అమ్మాయి కాలిఅడుగుల పాలు
ఆ వెనకజాడలు ఎవరివో!

7
రేకులు కర్కశం
ముల్లు సున్నితం
ప్రేమలో పడిందా- కుసుమం!

8
కడలిది అలజడి
ఎడారిది
నిర్ జలజడి

9
రెండు చావులతో
ఒకేసారి పోరే యోధి
తల్లి

10
ఒడ్డుకు
అటు సంద్రం
ఇటు నత్త
హోరు ఎటునుంచో!
03-09-2012
 

నారాయణస్వామి వెంకటయోగి॥ యెవరైనా ఉన్నారా – ఎక్కడ? ॥

యెవరినైనా తెలిసిన వాళ్ళని అర్జెంటు గా కలవాలి – అన్నీ కూలిపోయిన మైలు రాళ్ళే! ఎక్కడని పత్తా చెప్పను – ఎవరైనా వస్తారేమో నని ఎదిరిచూపు – మాటలు లేక నోరెండుక పోతోంది – నోటి నిండా గాజుపెంకులు – వేచి చూసే క్షణాలు – యెవరినైనా హఠాత్తుగ పలకరించాలని దేవులాట – చౌరస్తాలన్నీ సర్కారు తుమ్మల పరిక్కంపలే – గీరుకుపోయిన పెదవులతో చిరునవ్వుతారెవరో – గడ్దకట్టిన ఎలక్ట్రానిక్ భాష పరిచిత శీతలత్వమై కోసుకుపోతోంది – యెటూ పోలేము – ఇక్కడ క్షణం వుండలేం – బుజాల మీద చేతులెవరివి – బిగుసుకుపోతున్నాయి – నిశ్చలచైతన్యం లోకి నూకేస్తున్నాయి – యెవరినైనా గట్టిగా అలుముకోవాలి – యెన్ని శతాబ్దాలైంది – మనిషిని కౌగలించుకోక – శరీర వేడిని తాపించక – చుట్టూ ఇనుపకవచాల శరీరాలు – ఇంటర్నెట్ ని కప్పుకున్న శరీరాలు – అంతా ఒక్క తీరుగనే –– గుర్తు పట్టలేను – కాంక్షించలేను – అక్షరాలే పదాలే మాటలే వాక్యాలే పొంతన లేదు అర్థంకావు వినబడవు స్పష్టంగా – అంతా ఒకే అరుపు – అంతా ఒకే చెవులు చిల్లులుపడే నిశ్శబ్దం – తిరిగి తిరిగీ అదే చౌరస్తాకు – అవే ముళ్ళకంపలకు చినిగిపోయిన మురికి అంగీలా వేళ్ళాడుతూ – ఎండా, వానా, వెన్నెల లేని రాత్రో, వెల్తురు లేని పగలో తెలియని – ఏ చోట? ఏ పూట ? ఎవరైనా ఇటువైపు వస్తున్నరా, పోతున్నరా - చేయందిస్తున్నరా, మాట విసురుతున్నరా, పలుకులు గుచ్చుతున్నరా – ఏదో ఒక దీర్ఘ నిద్ర, పొడుగాటి కల – రాళ్ళు విసిరే మౌనం - ఏమీ తెలియని నిర్విచారం –బూడిదలా పరుచుకున్న నిరామయం – యెవరైనా ఉన్నారా – ఎక్కడ?
3.9.2012

యాకూబ్ ॥ కొన్ని దారులు ॥

అన్ని దారులూ
జననం నుండి మరణంవరకూ కదులుతుంటాయి

తప్పుకుపోవడానికి
వేరే దొంగదారులేవీ లేవు

క్రిక్కిరిసిన రైలుడబ్బాలో కూచునేచోటు కోసం
వె తు క్కు న్న ట్టు
జీవించాల్సిన జీవితం కోసం
ఓపిగ్గా వె తు క్కో వా లి.

తాళంచెవి లేని తాళాల్లా
కొందరు ఎంతకీ తెరుచుకోరు

శ్రమించి తెరిచినా

నిశ్హబ్దంలా

ప్రశ్నలా

నల్లటి ఆకాశంలా

ఎంతకీ అర్థం కారు!

అసలు జీవించడమనే తాళంచెవినే వెతుక్కోరు!?

* పాతవాచకం=2.9.2012