"కవి సంగమం " చదివిన కవిత్వ సఫుటి :- 25 కవిత్వ సంపుటి పేరు :- " జీరో డిగ్రీ " సంపుటి రాసిన కవి పేరు :- " మోహన్ రుషీ " సంపుటిని పరిచయం చేస్తున్నది :- " రాజారామ్.టి " "మానవ జీవిత సజీవ స్పందనల సంఘర్షణల సమాహారం "జీరో డిగ్రీ ' అతనే వొక మోహనం.అతడొక కవి.అప్పుడప్పుడు అతనొక ఋషి.ఋషైన వాడే కవి అవుతాడని అప్పకవి లాంటి వాళ్ల నమ్మకం.కవైన వాడు సజీవ స్పందనలు కల మనిషవుతాడని నా నమ్మకం .ఆ మనిషి మాత్రం ఏదో ఒక సందర్భంలో రుషీ అవుతాడు.ఆ రుషీ జీవితపు జీరో డిగ్రీ కీ సజీవ స్పందనలనద్ది ఆ జీరో డిగ్రీ స్థాయిని కొలిచే కొలమానంగా తన కవిత్వాన్ని మార్చాడు.జీవించడం గొప్ప కాదు.జీవిస్తున్నామన్న స్పృహ కలిగి వుండటమే వొక గొప్ప లక్షణం.ఇట్లాంటి గొప్ప లక్షణాన్ని "జీరో డిగ్రీ 'లో వొంపి నింపి జీవిత స్పర్శను దాని కద్ది నిరుత్తర అద్భుత వాక్యాల భావాలను మ్రోయించిన మోహన వంశి ఈ కవి. నిలువెల్లా గాయాలైన ఆ వెదురు వేణువును 'నిన్నెందుకు ఆ మోహనుడు నిరంతరం ధరించి వుంటానికి యిష్టపడతాడని" అడిగినప్పుడు ఆవేణువు అడిగినవారితో "తనలోని ఏమీ లేని తనమే ఆ మోహనుడు యిష్టపడ్డానికి కారణమని అంటుంది.ఈమోహన్లో కూడావేణువులోనిశూన్యం,బోలుతనం,నిర్మలత్వం కనిపిస్తాయి.అ.సు.రా గారన్నట్లూ దేన్నీ ప్రతిపాదించని,దేన్ని సిధ్దాంతీకరించని ఒకానొక సున్నితత్వంతో మోహన్ రుషీ కవిత్వం వుండటమే పాఠకులకు పెదాలు వూదే వాయువుతో మధురంగా మ్రోగే వంశీ గానంగా వినిపించడానికీ కారణం. జీవన కాంక్షను తెలిపే అరుపే ఈ కవిత్వం. "ఎంతో మంచి శూన్యం, జీవితం"అన్నా,"రంగు,రుచి,వాసన లేని స్నేహం...ఇరువయ్యొకటవ జీవిత సత్యం"అన్నా అందుక్కారణం నగరజీవిత సంక్లిష్టాన్ని,మధ్యతరగతి జీవిత విషాదాన్నిమోహన్ రుషీ వొకే వేణువు పై ఒకేమారు పలికించటమే."ఇదొక ఆట.మనిషి కోసం మనిషి వెతుకులాట.వేదనే మనపాట"అనే మోహన్ రుషి కీ కవిత్వాన్ని తాత్వికం చేయటం,జీవితం ఏమైనా చేసినట్టు ఈకవిఆతాత్వికమైనజీవితానికి నిర్ధుష్టమైనఒకసత్యంలేదని,అదిమనమీదవుమ్మేసుకొనేందుకేననిచెప్పితేలికచేయటంకూడాతెలుసు."శ్రుతిని,లయను ఒకటి చేసి ..."అంటే కవిత్వాన్ని,జీవితాన్ని,జీవితాన్ని తాత్వికతను ఒకటి చేసి చెప్పటం ఈ కావ్య రహస్యం. "బాధ ఉండదని కాదు కానీ కన్నీళ్ళలోకి ట్రాన్స్ ఫర్ కాదు వేదన కమ్ముకుంటున్నది నిజమే వెక్కి వెక్కి ఏడవటం కుదరదు" బాధ,దుఃఖం,వేదన,విషాదం ఇవన్నీ వొక్కటే కావొచ్చు.కానీ మోహన్ రుషీ బాధనీ కన్నీళ్ళల్లో బదిలీ చేయలేనని అన్నా,వెక్కి వెక్కి ఏడవటం కుదరదని అన్నా,అతను మాత్రం వొక నిశ్శబ్ద దుఃఖాన్ని తన కవిత్వమంతా పరిచాడు.పట్నం జీవితం మీద జుగుప్స,ఎంత జుగుప్స అంటే పట్నం ముఖమ్మీద కాండ్రించ్చి ఊంచేంత జుగుప్స.దారం తెగిన గాలి పటం లా ,గాల్లోకి ఇడిసిన బెలూన్ లా నడుస్తా, ఉరుక్త మిర్యాలగూడెం లో పడిన కవిమోహన్ రుషి.జీవితం గొప్ప దనం కూడా ఈ కవికి తెలుసు.అడుగు పెట్టొద్దన్న చోటునే అల్లుకునేటట్లు చేసే జీవితానికీ లొంగిపోయిన వాడే ఈ కవి కూడాను.అది జీవితపు గొప్పదనం.మాట్లాడ వీల్లేకుండా,వ్యాపకాల వ్యాపారంలో ఇల్లు ఇరుకైన మానవ సంబంధాల మధ్య దగ్గరితనం దూరమై అగాధంలా అలుముకొనే నగర జీవితంలోకి తిరిగి తిరిగి అక్కడికే జారుకొనే అథితిలా ఆగడం,ముసాఫిర్ లా సాగడం చేస్తొన్న ఈ కవికీ వూరికెల్లి పట్నమొచ్చిన కాన్నుంచి దేనిమీద నెనరు లేకుండా అయ్యిందంటున్నా, ఫుట్ పాత్ మీది పుస్తకాలకోసం ఆరాటపడటం, అరుదైన సాహిత్యం కోసం ఆబగా అన్వేషించడమే ఆయన్నొక మంచి కవిని చేసింది. "బండ్లన్నీ ఆగినపుడు అతని జీవితపు బండి వేగం పుంజుకొంటుంది. సర్వ కిటికీ సమానత్వం పాటిస్తూ మూసివున్న,తెరచిన బండి అద్దాల్లోకి దీనంగా చూస్తుంటాడు ఏ మూలో దాక్కున్న జీవత్వాన్ని అంతే కూడదీసుకొని అరచేతిలోకి తెచ్చుకొంటాడు చేతిలో "టప్" మన్న చప్పుడు వినగానే ఆశగా తడుముకుంటాడు" ఇవి మోహన్ రుషీ రాసిన "జీరో డిగ్రీ"లోని "సిగ్నల్ లైట్ సాక్షిగా"-అనే కవితలోని పాదాలు కొన్ని. నగరపు నాలుగు రోడ్ల కూడలిలో సిగ్నల్ లైట్ పడినప్పుడు చేయిసాచి అడుక్కుండే వొక అంధభిక్షువు గురించి రాసినది."చేతిలో "టప్" మన్న చప్పుడు వినగానే ఆశగా తడుము కుంటాడు"అనే వాక్యం ఆ చేయిసాచి యాచించేవాడు అంధభిక్షకుడు-అని ధృవికరిస్తుంది."వాహనాల సందుల్లో అతను ప్రవహించినంత సులభంగా అతని జీవితం ప్రవహించదు"అనే పంక్తుల్ల వల్లా అతడి జీవితం పేదరికపు ఇరుకులో ఇరుక్కున్నదనే స్పృహను కవి మనకు ఇస్తాడు. "అతని నోరెప్పుడూ మళ్ళీ మళ్ళీ పాడిన పాటవుతుంది...జీవితం మాత్రం ముళ్ళతో కూడిన తోటవుతుంది'-అనే మాటల్లోని "మళ్ళీ మళ్ళీ అతడు పాడిన పాట"వొక సైగల్ పాటలానో,లత గాత్రంలానో ఎక్కడో దూర తీరాల్నుంచి వచ్చి సరాసరి గుండె తలుపుల్నీ మృదువుగా పదునుగా ఎవరి హృదుల్నీ స్పృశించలేదు.అందుక్కారణాన్ని "శబ్ద కాలుష్యం ఎక్కువ కదా!ఎవరికీ ఏదీ వినిపించదు! కళ్ళు నోట్ల కట్టలతో కప్పివేయబడ్డాయి కదా!"అని కవి చెప్పి పరోక్షంగా లోకపు గుడ్డిదనం,చెవిటిదనాల్నీ దర్శింపచేస్తాడు."రోడ్లు విశాలం పేరిట అతని పరుపు ఇరుకై పోయింది"అన్న ఈ వాక్యాల్లో కవి నగరంలో అభివృద్ది పేరిట జరిగిన విషాద భీభత్సాన్ని,కనీసం వసతి చూపలేకపోయారు సరే కనీసం రాత్రిపూట ఫుట్ పాత్ లపై కూడా నిద్ర పోనివ్వని దుర్మార్గం ఏ రూపు దాల్చిందో స్పురింపచేస్తాడు మోహన్ రుషీ. "నిద్రలో కూడా శబ్దంఐనపుడల్లా ఆ చేతికి ఒక్కసారి మెలుకువస్తుంది ప్రాణమంతా చేతిలోకి ప్రవేశించి అలా అలా వూగుతూ గాలిలో వదిలిన దీపమవుతుంది" కవి ఈ పాదాల్లో ఆ యాచక వ్యక్తిలో నిత్యం వున్న అలవాటు నిద్రలో కూడా అతనిలో కలసి మమేకమైపోయిన అంశాన్ని చెప్పడమే కాక,"గాలిలో దీపం" అనే మాటతో జరుగబోయే సంఘటననను పఠిత ఊహలొకి ప్రవేశపెడతాడు.అతని చేతికీ గాలిలో దీపానికీ పోలిక చేయడం వల్లా మోహన్ రుషీ కవితకు ఊహించే ముగింపు ఇచ్చినా ఆ ముగింపు ఎంతో గొప్పగా అనిపిస్తుంది. "నా కన్నీటి చుక్క పడి ఆ దీపం ఆరిపోయినట్లు వచ్చిన కల నన్ను ఉలిక్కిపడేటట్లు చేసింది- చౌరాస్తా వద్దకు పరిగెత్తాను... అప్పుడే కదుల్తున్న మున్సిపాలిటీ ట్రక్కు లోంచి ఒక చెయ్యి మాత్రం కనిపించింది అతనంటే అతని చెయ్యే కదా? చేతికి గాక అతనికంటూ ఒక అస్తిత్వమెక్కడిది?" ఈ కవితా శకలాలలో కవి చేసే కొత్త పోలికలు, వాటి కొత్త దనం మనల్ని దుఃఖ సముద్రంలోకీ నావలై తీసుకపోతాయి.రూపంలేనిభావాలకు,రూపంవున్నాసాదృశ్యాలనుపట్టుకొనిముడిపెడతాడు.అనుభవించాల్సిన దుఃఖాన్ని రూపు కట్టించడానికి పోలికల్ని ఎన్నుకోవడంలోనే ఇతని నేర్పు కనిపిస్తుంది."అప్పుడే కదుల్తున్న మున్సిపాలిటీ ట్రక్కు లోంచి ఒక చేయి మాత్రం కనిపించింది"-ఈ పంక్తుల్లో "చేయి" రూపం వున్నట్టున్నా పూర్తి రూపం లేనిదే.కంటికి ఒక రూపాన్ని ఇవ్వలేనిదే."అతనంటే అతని చెయ్యే కదా?చేతికీ గాక అతని కంటూ వొక అస్తిత్వమెక్కడిది"-ఈ ఒక్క మాటల్లో మొత్తం యాచకున్ని రూపు కట్టించాడు రుషీ.ఆ యాచకుని జీవితంలో జరిగిన విషాదాన్ని మన చేత గుర్తింప చేస్తాడు.ఆ వ్యక్తి ఆత్మ ఘోష వినిపింప చేస్తాడు మనతో.రూపం లేని భావాలకురూపంవున్నసాదృశ్యాలను వాడి కవిత్వాన్ని నిర్మించడంలో రుషి నేర్పుని మెచ్చుకోకుండావుండలేను. ఆ దుఃఖపు జీరను గుర్తించకుండా వుండలేము. "అతని నోరెప్పూడు మళ్ళీ మళ్ళీ పాడిన పాట"అనే వాక్యం మనసుకు గాఢంగా పట్టి వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి వొక పద్యాన్ని గుర్తుకుతెచ్చింది.ఆ పద్యం ఇది.రుషి వాక్యగాఢత చెప్పడానికే ఈ పద్యం ఉదాహరించడం. అంధ భిక్షుకుడొకడు దయంబునుండి సందె దాక యాతాయాత జన సమూహ సంకులంబైన వీధీ విటంకమందు కంఠమేక తారకు శృతి గలిపి పాడు చుండు,గొంతెత్తి చెమ్మట లూడ్చుకొనుచు" "వాళ్ళుబంగారంమనంఇనుము"అనిమోహన్రుషీఒకసందర్భంలోఅన్నా,అమ్మ,అక్కా,చెల్లెలు,భార్య,కూతురు,పనిమనిషి,కూరగాయలమ్మే ఆవిడ ఒకరేమిటీ,స్త్రీ అయిన ప్రతి వ్యక్తీ,శక్తి ఈయన అభిప్రాయంలోబంగారమే.ఇకఇనుముఎవరోప్రత్యేకించిచెప్పాల్సినాఅవసరంలేదేమో?.ఇన్నేళ్లుగా,ఇన్నాళ్లుగా కవిత్వం జీవితంలో ఓ భాగమనుకొంటూ,దొరికిన,అందిన,కొనుక్కున్న ఎన్నో కవితా సంపుటాలు చదివిననాకు,స్త్రీలపట్లఇంతఅనురాగాన్ని,ఇంతఆప్యాయతని,ఇంతఅపేక్షని,ఇంతఅనుబంధాన్నీ,ఇంతటి కృతఙ్ఞతనీ తన స్వరంలో రాసిన కవి,సహానుభూతినిప్రదర్శించినమగకవినినేనుఎరుగను.సహానుభూతే కాదు తన అభిజాత్యాన్ని,అహంకారాన్ని తనలోంచితరిమికొట్టాలనే స్థితిని కల్పించుకొని,తన లోని చెత్తనంతా బయట పారవేసుకొన్న వైనాన్ని పేర్కొంటూ,వారికై శ్రమణుల దుఃఖమై సంచలించి హృదయం పగిలేలా ఏడ్వగలిగిన కవిగా మోహన్ రుషీ ఈ సంపుటిలో అగుపిస్తాడు. జీవితంలో సూర్యోదయ,సూర్యాస్తమయాలు చూసే అవకాశం లేకుండా,ఇంట్లోనే నిరంతరం తామొక పని ముట్టై ఇంట్లోనే పనై వొక యంత్రం మాదిరి శ్రమించే అమ్మ అంట్లూ తోముతూ,బట్టలు ఉతుకుతూ,తానొక యంత్రంలా పరుగులూ తీస్తూ,జీవిత వేగాన్ని తమకు అందించిన అమ్మ ఋణం తీర్చుకోవడానికీ ఏం చేసిన తక్కువేనని ఈ కవి భావించి "పాత యంత్రం"-అనే కవిత రాశాడు.అమ్మ ఋణం తీర్చుకోవడానికీ బట్టలన్నీ తమ వీపుల మీద వుతికిన ఆశిక్ష చాలదని,ఆమే తోమే గిన్నెలన్ని తమ చర్మం పెట్టి తోమిన పటిన అహంకారపు చీడ వదలదని పై కవితలో కవి చెబుతాడు."నీ పాద ధూళి సోకైన మా పుట్టుకకో సార్థకత లభిస్తుంది"అని అనటంలో మోహన్ రుషీ అభిప్రాయం వ్యక్తమవుతుంది.తంగేడు పూల గోపి చిత్రదీపాల గోపి"భ్రష్టుడా!అమ్మ ఋణం తీరదు/అమ్మకు అమ్మవై పుడితే తప్ప'అని అంటాడు.మోహన్ రుషీ ఇంకా గాఢంగా 'కళ్ళు మూసుకునయిన కసిగా మమ్మల్ని భూమిలోకి తొక్కేయరాదూ?/నీ పాద ధూళి సోకి మా పుట్టుకకో సార్థకత లభిస్తుంది"-అని అనగలిగాడు.ఈ కవికీ అమ్మల పట్ల గల గౌరవం ఎలాంటిదో ఈ ఒక్క కవిత వల్లే తెలుసుకోవచ్చు. క్షణం క్షణం చస్తూ బతుకుతూ వుండే వాళ్ళు భర్తల సేవల్లో అంతరిస్తున్న భార్యలు అనే సత్యాన్ని గ్రహించిన కవి ఈ మోహన్ రుషీ.భర్తల అహం,సేవలందించిన భార్య పట్ల కృతఙ్ణత లేనితనం,కనీసం సానుభూతి కూడా ప్రకటించలేని కృతఘ్నత భావం,కరగని ఉడకని హృదయ కాఠిన్యం, వీటన్నిటనీ "భరత వాక్యం'అనే కవితలో పేగులు చుట్టుకపోయే బాధతో గుండెలవిసేలా ముగింపు వొక్కటే మిగిలిన వాక్యాలతో గునపాలై లేవాలి అని ఈ కవి వేదనతో ప్రభోధిస్తాడు."ఏ అమ్మైతేంది?/పండ్గకీ పట్నంకెల్లి కొడ్కులకీ బిడ్డలకీ/అట్ల సంబూరంగా అవుపడ్తది గానీ../బత్కుపటార్లబడిపచ్చెల్ పచ్చలై/ఆమే శాన్నాల్ల కిందనే సచ్చిపోయిన దుఃఖాన్ని "లెక్కలేదు పత్రం లేదు"-అనే కవితలో ఏ సెన్సస్ లెక్కల్లో పత్తాలేని కొడూలున్నా లేని తల్లి జీవితాన్ని ఈ కవి స్పృశించాడు.కచ్చతోటి కావాలని వదిలేసిన జీవితాన్ని తెచ్చి యిచ్చిన కరుత్తమ్మ చెమ్మిన్ నవల లోని పాత్రే కాదు.ఆమే నిజమైన పాత్రే.లేకుంటే కవి "ఆమే వస్తదనే ఇప్పటి దాంక ఆగిన.../లేకపోతే ఈడ నాకేం పని "అని అనలేడు.ఒక కరుత్తమ్మ కోసం!ఇయ్యాల గాకపోతే రేపైనా రాకపోద్దా అని ఆశ!'పడే నిరీక్షణ ఈ కవిది.అమ్మల తరువాత అమ్మలై మనల్నీ పిల్లల్లా కాచుకోడానికీ అవతరించిన అక్కలు చెల్లేల్లు గురించి "వాళ్ళు బంగారం,మనం ఇనుము!"-అనే కవిత ఈ కవిరాశాడు."వాళ్ళ పిల్లల అల్లర్లతో మనల్నీ సంబర పర్చేందుకూ/మనని వెనకేసుకరావటానికి మొగుళ్లతోనూ గొడవపడేందుకూ/నిజమైన ప్రేమతో సిగ్గు పడేలా చేసేందుకూ/అసలైన నవ్వుల్తో ఆందోళనల్నీ తరిమి కొట్టెందుకూ"-అక్కా చేల్లెల్లు వున్నారన్న ఒక అనుబంధతాత్మక పాదాలను ఈ కవి రాసి ఏదో తెలియనీ అక్కాచెల్లెల్ల ఉనికినిలోని మాధుర్యాన్ని సార్థకమయ్యేలా రాశాడు. అమ్మతో ఒక ఆదివారం మధ్యాహ్నం ఈ కవి అమ్మ కళ్లు చెప్పే నిజం ఎవరూ ఎక్కడా శాశ్వతంగా వుండబోరన్న నిజం గ్రహించీ తనలోని చెత్తనంతా బయట పారబోసే యత్నమంటే స్త్రీల పట్ల ఇంకా ఏదైనా చెత్త అభిప్రాయం వుంటే దాన్ని తొలగించుకొనే యత్నం చేశాననే భావనను "ఒక ఆదివారం మధ్యాహ్నం"-అనే కవితలో చూచాయగా చెబుతాడు.అల్కాపురి వీధుల్లో ఆకు కూరలు అమ్మే ఆవిడ కవిని గెలిపిస్తూ,తన ఉదారత్వంతో ఓడిస్తూ,మాట్లాడిన వైనం కవి అలాంటి వాళ్ళ పట్ల గల ఉన్నతాభిప్రాయాలను "విజేతలు వాళ్ళు!'అనే కవిత పేర్కొటుంది.కరివేపాకు విలువ చేయని జీవితం తల్లీ అనటంలో కవికీ స్త్రీల పట్లగల గౌరవం కొండలా ఒకమూల అతనిలో ఒదిగి కూర్చున్నదని తెలుస్తుంది.నువ్వే ప్రపంచంగా ,నీ కడుపులో ఇంత సల్ల నింపడమే లక్ష్యంగా అవిశ్రాంతంగా వుమ్డేది అమ్మే.అట్లాంటి అమ్మను ఈ కవి "లేని వాళ్ల కోసం ఉండేవాళ్లు"-అని సంభావిస్తాడు.దుఃఖపు వానలో మన కోసం నిరంతరం తడిసేది అమ్మేనన్న ఒక గొప్ప భావాన్ని ఈ కవి మనకు అందిస్తాడు.తనని సరిగా చూడని తాగుబోతు భర్త దవఖానలో పడ్డప్పుడు "ఎవని పాపాన వాడె పోతాడక్కా దవాఖానల పడ్డప్పుడు మనమైతే మందులిచ్చ్రావాలే గదా!అని అనుకుండే గొప్ప మానవతావాదులైన స్త్రీలు గుంతల్లో ఆటో కిందా మీదా అయినప్పుడు కూడా కోపంలోను నోరు జారకుండా "రోడ్డు సల్ల గుండా"-అని అనుకుండే పాటలను మించిన వాళ్లు అయిన స్త్రీ మూర్తుల గురించి ఎంత గుండె తడితో ఈ కవి రాశాడో ఈ సంపుటి చదివితే అర్థం అవుతుంది. "అమ్మల కన్నీళ్లు అబద్దం కాదు!"-అని అంటున్న మోహన్ రుషీ "వాళ్ళ గురించి వాల్ళ్ళు అడిగే పాపాన వాల్లేన్నడు పోరు వాళ్ళు అనుభవిస్తున్న దుఃఖం అందుకు ఆనవాలు"-అని తన "జీరో డిగ్రీ"ని ఆడవాళ్ళ కన్నీళ్లకు ఆనవాలు చేశాడు.వర్షిస్తున్న అశ్రుధారలైన అమ్మలనంతా ఒకవైపు నిలబెట్టి వారికీ అండగా కవిత్వాన్ని నిర్మించాడు.ఇలా ఈ కవి స్త్రీల పట్ల గల తన నిశ్చితాభిప్రాయాల్నీ నిష్కర్షగా వెల్లడించాడు. "అనాదీ నుంచీ ఆడదానికి ముదనష్టపు మగవాడు వేస్తున్న శిలువను తప్ప ఇస్తున్న శిలుం పట్టిన్న జీవితం తప్ప - ఏమైనా ఇచ్చానా నేను నిజంగా" శతాబ్దాలుగా ఏడ్చినా తరిగిపోని దుఃఖం తప్ప,మాటల మంటలు,వ్యధ పెంచే వ్యంగ్యాస్త్రాలు తప్ప ఎమీ ఇవ్వలేదనే ఈ కవి మాటలు నిజాయితీగా అంటున్నవి.అమ్మ,అక్క,చెల్లి,భార్య,ఇలా స్త్రీల దుఃఖాన్నీ తన దుఃఖంగా మార్చి కవిత్వం చేసి మన చూపు కొక్కేనీకీ స్త్రీ నిజ చిత్తరువుని తగిలిస్తాడు. మానవశరీరంలో ఈ రోజుల్లో అది ఓ భాగం,అది వాడని మనిషి నేడు లేడన్నది పచ్చినిజం.అదొక వాణిజ్య ప్రపంచ చిద్విలాసం.మాటల్నీ అంగట్లో పెట్టి అమ్మే వొక వ్యాపారం అదే మొబైల్ ఫోన్ వ్యవహారం. "మోగాలన్న మోజు లేదు/మోగనందుకు కోపం లేదు మొబైల్ ఫోన్ మీద నాకు మోహమెన్నడు లేదు/కానీ మరీ నాలుగు రోజులా?" అని అంటున్న ఈ కవి మిస్డ్ కాల్స్ లేకపోడం తో గాభర నంది ,అవుట్ గోయింగ్ కాల్స్ పోకపోవడంతో కుదుటపడ్డానని అంటాడు.వ్యాపార సూత్రం అర్థమయ్యిందని అని చెప్పే ఈ కవి మొబైల్ చేతుల్లో మనిషి వున్నాడు కానీ మనిషి చేతుల్లో మొబైల్ లేదు అనే వాస్తవికతను గుర్తించితెప్పరిల్లుతాడు. ప్రేమలేదనికాదు/తేప కొక సారి తేమను నిరుపించడం నా వల్ల కాదు"అని ఈ కవి అన్నా కూడా అనేక సందర్భాల్లో తన ప్రేమ తడిని,దుఃఖ తీవ్రతను తీన్ మార్ వేసీ చూపుతాడు."ఇప్పుడొక నొస్టాల్జియా మిగిలింది కేవలం రావణ కాష్టపు రాత్రులు"అని "జానే కహఁ గయే వో దిన్'-అని నిట్టూర్పు విడుస్తాడు.'పరుచుకున్న వెన్నెలలు,ప్రాణవాయువులా"అ రాత్రీ నీ పాట ఎందుకు వచ్చింది?అని ప్రశ్నిస్తున్న మోహన్ రుషీ సుతి మెత్తగా,సున్నితంగా ఆమె అరచేతులతో తన హృదయాన్ని నిమిరిన ఆమె పాట తీయదనాన్ని,మాటలతోచెప్పలేనిదేదో,సంభాషణలో సాధ్యం కాని దేదో ప్రసారం ఆపాటలో అవుతున్నదని చెబుతూ ఆమెతో కవి నువ్వు కాక నాకెవరున్నారని నేను మళ్ళి మళ్ళి గుర్తు చేసుకోవడానికీ-అని అంటాడు-ఇట్లాంటి ఎంతో అందమైన భావనలు కూడా నగరజీవన సంక్లిష్టతలోని జీవనంలో జీరో డిగ్రీ పైన ఈ కవి చిత్రించాడు.లేచి లేవగానే రాత్రి బతికిన దారుల్లో వెతుక్కుంటూ వెళ్ళే శతాబ్దాలుగా మోస్తున్న దీనపు మొహాల్నీ సైతం ఈ కవి జీరోడిగ్రీ కింద చిత్రిస్తాడు. వొక నిర్లిప్త తాత్వికతను మనకంతకు మనమేఅల్లుకొనిచెప్పుకోడానికీఏమీలేనితనాన్నీ,మాట్లాడుకోవడానికీ కూడా ఏమీ లేని శూన్యాన్నీ,అస్పష్ట మైన అలజడిని అనువదించుకోలేని భాషలో జీవించడాన్ని ఈ కవి పేర్కొంటూ.మనిషి ఈ పరిస్థితులకు తక్షణ సమాధానంగా జీవితానికీ పెద్దగా అర్థం లేదని చెప్పుకోవడాన్ని "లోపలి బాల్కని"లో నైశిత్యంతో విమర్శకు పెడతాడు ఈ కవి.కొంత మంది గుర్తొచ్చి వొణికిన ఈ కవి బయలుదేరుటకుసిధ్దంగావున్నరైలునుపోలికచేసి"జీవితంకదిలిపోతుంది"అనిఅంటూదీపస్తంభంలాంటిసత్యాన్నినిలుపుతాడు."నిజమై,నిప్పై,ఉరుమై,చెలిమై,పిలుపై,వలపై,గెలుపై,మలుపై ఎదురైన కొంద్రు వ్యక్తుల్నీ చిటికెన వేలితో శిలువను ఎత్తే వాళ్ళుగా,చిరునవ్వుల్తో చీకట్లను తరిమి తరిమి కొట్టే వాళ్ళుగా,సమయాలకు సౌరాభాన్ని అద్దే వాళ్ళుగా,సంభాషణను సమ్మోహితం చేసేవాళ్లుగా,పరిచయాన్ని ప్రపంచం చేసే వాళ్ళుగా,సామీప్యాన్నీ సందర్భంగా మలిచే వాళ్ళుగా,జీవితాన్ని ఉత్సవం చేసే వాళ్ళుగా ఎంతో గొప్పగా దర్శించి ,వెళ్ళరు వాళ్ళు తిరుగు టపాలో"-అని అట్లాంటి వాళ్లనీ శాశ్వతుల్నీ చేస్తాడు మోహన్ రుషి. "నీకు ఓకేనా?ఒక మొల నీ నడి నెత్తిన పెట్టి సుత్తితో ఫట్ మని ఒకటే దెబ్బ వేస్తాను"-అంటూ ప్రారంభమయ్యే "మరణ జన్మ సంయోగ క్రియ"అనే కవిత అధివాస్తవిక కనిపిస్తుంది.లోకంలోని సంక్లిష్టతల్ని సుత్తి దెబ్బ,హ్యాక్సా బ్లేడ్ కోత లాంటి పదప్రయోగాలతో స్పురింప చేస్తూ,"ఈ మాత్రం ఓర్చుకోలేని వాడివి నువ్వు ఈ లోకం మనిషివేనా?అని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తాడు."చచ్చే లోపు చాల సార్లూ నిశ్శబ్దపు చావులకు గురవుతుండటమే జీవితం"లాంటి అధ్భుత నిరుత్తర వాక్యాలు జీ రో డిగ్రీ లో పుష్కలంగా కనిపిస్తాయి."బస్...ఇత్నాసా ఖ్వాబ్ హై","దిల్సుఖ్ నగర్ చౌరస్తా"లాంటి చైతన్య స్రవంతి కవితలు కవి వ్యక్తిత్వాన్ని ,అంటే ఉదాసీనత్వాన్ని , సమాజ దుఃఖం కవి వ్యైక్తిక దుఃఖంగా మారడాన్ని, జీ రో డిగ్ర్రీ వద్ద వుండే శీతలస్పర్శ లాంటి నగరజీవితం ఆదుఃఖాన్ని గడ్డకట్టించిన వైనాన్ని పరిచయం చేస్తాయి.పరిణితి చెందిన రూప శిల్పాల మిళితం ఈ సంపుటిలో పఠితలు చూడొచ్చు. ఈ కవిత్వాన్ని చదివితే 'జీవించడం ఎప్పుడో మానేసిన మనిషి కనీసం బతకనైనా బతుకుతాడు"అనిపించింది నాకు.బంధం గంధం పూసుకతిరుగలేనని అని అనే ఈ కవిని మరిన్ని కవితలు రాయమని కోరుతున్నాను. చేతిలో చెయ్యి వేసి తన ప్రాణానికీ నా ప్రాణం అడ్డువేస్తానని జీవితంతో చెప్పాన్నేను" అంటూ జీవితానికీ భరోసా యిస్తున్న మోహన్ రుషీ ఒక్క నిట్టూర్పు లాగా,ఒక మాట్లడని కన్నీటి చుక్కలా,ఒక తీవ్రమైన కోరికలా దిక్కుల సందుల్లో కలసి ప్రతిధ్వనించే కవి అని చెబుతూ ఒక ఉత్తమ కవిత సంపుటి అందించినందుకు అభినందిస్తున్నాను.కవి సంగమ మిత్రులు ఇట్లాంటి కవిత్వాన్ని చదివి వాళ్ళ కవిత్వనిర్మాణ నైపుణ్యాన్ని మరింత ఇనుమడించుకోవాలని కోరుతున్నా.అ.సు.రా గారు, పున్నా గారు,శివాజీ గారు రాసిన అంశాలతో మరిగి మరిగి మౌనమే ఇక మంచిదని తెలుసుకున్నాను.మళ్ళీ మంగళవారం మరో కవితా సంపుటి పరిచయంతో కలుద్దాం.
by Rajaram Thumucharlafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i9y3B6
Posted by
Katta