పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Ravinder Verelly లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Ravinder Verelly లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, సెప్టెంబర్ 2012, ఆదివారం

రవి వీరెల్లి // కొసమెరుపు //

అంతుచిక్కని చిక్కు ప్రశ్నేదో
ఆకాశమంతా పరుచుకుంది.
పేనుకుంటున్న దారాన్ని అక్కడే వదిలేసి
చీకటి కంట్లోకి బయల్దేరా.

వెలుగులోకి నడిచినంత ధైర్యంగా
చీకట్లోకి చొచ్చుకు పోలేం కదా!
అయితేనేం
కంటికేదీ కనిపించదని తేలిపోయాక
మనసు కొత్త రెక్కలు తొడుక్కుంటుంది
వొళ్ళు వాయులీనమై
కనపడని దారుల్ని శృతిచేసుకుంటుంది.

గుప్పిట
పిగిలిపోయేన్ని ఆలోచనలను పట్టి
అలా కళ్ళకద్దుకున్నానో లేదో
కడతేరని నడకకి కొత్త కాళ్ళు పుట్టాయి.
ఇక
ఎదురుచూపంతా
ఎప్పుడో రాలే ఆ ఒక్క చుక్క కోసం.

ఎక్కడున్నానో తెలీదు

కలల గాయాలు కార్చిన కన్నీళ్లు తుడుస్తూ
ఎరుపెక్కిన దూదిపింజలా
జీవితాంతం తిరగరాసినా పురిపడని పద్యం
వింతవెలుగై పురివిప్పినట్టు
వదిలేసిన కవిత్వపు దారం కొసన
కొసమెరుపై
అదిగో
ఆ రాలిపడ్డ రక్తపు చుక్క నేనేనా?

*

అనుకుంటాం గానీ
చీకట్లోకి నడిచినంత స్వేచ్ఛగా వెలుగులోకి వెళ్ళలేం
...నగ్నంగా!

09.01.2012

24, ఆగస్టు 2012, శుక్రవారం

రవి వీరెల్లి // వెలితి కుండ //

1
కంటి పాత్రలోకి
ఎన్ని దృశ్యాలు వొంపినా
ఎదురుచూపు తప్ప
ఏమీ మిగుల్చుకోదు.

2
బికిని వేసుకుని వోరగా చూస్తూ
వేడివేడి పగళ్ళ ఇసుకతిన్నెల మీంచి
తెప్పున అలా శీతాకాలం అలల్లోకి మాయమయ్యే
వేసవిలా
ఋతువులు ఊరిస్తూ ఊరిస్తూ కరిగి
శూన్యం వెలితి పూరిస్తూనే ఉంటాయి.
చెయిజారిపోయిన అందమైన క్షణాల్ని
ఎప్పటికీ పూర్తికాని కాలం కాన్వాస్ మీద
కవిత్వీకరించడానికి
రంగుల్ని రుబ్బుతూనే ఉంటాయి
అమాయకపు ఆకురాల్చుకాలాలు.

3
కన్నూ
కాలమూ
ఎప్పుడూ వెలితి కుండలే.

కవిత్వంలా.

*23-08-2012

9, ఆగస్టు 2012, గురువారం

రవి వీరెల్లి || రాత్రికి లోకువై... ||

కలిసినట్టే కలిసి విడిపోయే
రాత్రీపగళ్ళ పగుల్లనుంచి

ఒంటరి రోజులన్నీ
ఒక్కొక్కటే
విడివిడిగా దొర్లిపోతుంటే
కలిసి పంచుకున్న
ఆ కొన్ని క్షణాలు కూడా
కన్రెప్పల సందుల్లోంచి
ఎప్పుడో ద్రవించి పోయాయిలే.

చీకటి కేం
అంచులను చురకత్తుల్లా చేసి
రంపపుకోత కొస్తుంది
ఎంతైనా
ఒంటరితనాన్ని మోస్తున్నవాళ్ళంటే
రాత్రికి తెగ లోకువ.

ఇదిగో
చీకటి గోడలకు చూపులనతికించి
నడిరాత్రి నడుంమీద
సమయాన్ని చేదిపోస్తూ
ఒక్కొక్క జ్ఞాపకం పూసని
మునివేళ్ళతో మీటుతూ
అరతెరిచిన కళ్ళతో
తపస్సు చేస్తూ…

పొగమంచును మోస్తూ
పొడిచే పొద్దు కోసం
ఎదురుచూసే వెదురు పొదలా
ఇలా…

నా రాత్రులు నావి.

నీ పగళ్ళు నీవి.

రెండు ముక్కలైన
రోజును
అతికిస్తే బావుణ్ణు!
*09-08-2012

8, ఆగస్టు 2012, బుధవారం

రవీందర్ వీరెల్లి || అంతం ||

జ్ఞానం పెరిగీ పెరిగీ విరిగి
తిరిగి అస్తిత్వపు మూలాలలోకి ప్రయాణమైనట్టు

మనిషి ఎదిగీ ఎదిగీ విసిగి
తిరిగి బాల్యంలోకి జారగిలపడ్డట్టు

ఆలోచనల విస్పోటంలో పుట్టి పెరిగి
అందరి గుండెల్లో అణువంత విత్తయి
ఆత్మ మూలాలు ప్రశ్నించే
వో పద్యం లా...

అంతంలో పుట్టిన కాలం
తిరిగి ఎప్పటికైనా ఆదికి ప్రవహించాల్సిందే!

*07-08-2012

15, జులై 2012, ఆదివారం

రవీందర్ వీరెల్లి || ఆశ ||

నా ముందు
పెన్నుంది
తెల్లని పేపరుంది
నిద్రను కరిగించే వెచ్చని రాత్రీ వుంది.

ఇక
వో పొద్దుపొడుపు పోత పొయ్యాలి.

*14-07-2012

12, జులై 2012, గురువారం

రవి వీరెల్లి || పిల్లతెమ్మెరలా నువ్వొచ్చి పువ్వు తుంచుకెళ్ళవా?! ||



సుదీర్ఘమైన చర్చ వొక కొలిక్కి వచ్చేలోపే ముగిసినట్టు
చీకటి వెలుగుల్ని వొడుకుతున్న కాలం చేతుల్లో రంగు మారిన దారం.


వెన్నెలతో కచేరీ కోసం కాబోలు
వెలుగుతూ ఆరుతూ
చుక్కలు ఏదో రాగాన్ని ట్యూన్ చేసుకుంటున్నాయ్.


అలా వాకిట్లో మంచం వాల్చానో లేదో-
ఒక్కొక్కటిగా
నా జ్ఞాపకాలన్నీ పులుముకుంది
ఆకాశం.


ఎప్పట్లాగే
గతాన్ని వెలిగించి గట్టిగా పీల్చా.
వర్తమానం చురుక్కుమంది.


ఇక
ఈ రాత్రి కొమ్మకు పూసిన
దిగులు పువ్వు
ఇప్పుడప్పుడే రాలిపోయేట్టు లేదు.


*12-07-2012