మిత్రులందరికీ నమస్కారం, "మా అబ్బాయికి అస్సలు తెలుగు చదవడమే రాదు, మాట్లాడ్డం ఒచ్చు అంతే" అని చెప్పుకోవడం గొప్పగా భావిస్తున్న ఈ రోజుల్లో... "నాన్నా, లాంగ్వేజీలు మనకు అవసరం లేదు. గ్రూపు సబ్జెక్టులు ముఖ్యం. అయితే అమెరికా వెళ్లాలంటే ఇంగ్లీషు రావాలి కదా, అది మాత్రం చదువు, తెలుగు 35 మార్కులు వస్తే చాలు" అని కన్న తండ్రే ప్రోత్సహిస్తున్న ప్రస్థుత సమాజంలో... తెలుగులో మాట్లాడటం, ఒక తెగులు అని భావిస్తూ, హేయ్ డ్యూడ్, హాయ్ బ్రో అని సంబోధిస్తూ, తప్పు తను చేసినా, పక్కవాడు చేసినా, షిట్ అనే చెత్తని ఊతపదం అయితే గొప్పగా ఉంటుందని యువత నిర్ణయించుకున్న దౌర్భాగ్యపు రోజుల్లో... ఇంకా తెలుగుమీద మక్కువ చావని నాలాంటి చాదస్తులు, చాందసులకి (ఒక్క ముక్కలో చెప్పాలంటే పిచ్చోళ్లకి) నమస్కారం. ఆనందం,బాధ,ఆశ్చర్యం,దుఖః... ఇలా ఎన్నో అనుభూతుల సమాహారం మనిషి జీవితం. మనసారా నవ్వి చాలా కాలమయ్యింది అంటుంటారు చాలామంది, అక్కడికి ఏడవడం ఏదో బాగా తెలిసినట్టు. మనం మనసారా ఏడ్చికూడా చాలా రోజులయ్యింది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా పని మనసారా చెయ్యాలంటే, అది సహజ సిద్ధమైనది అయ్యుండాలి. కృత్రిమానికి, మనసారా అనేపదం వర్తించదు. అమెరికాలో స్థిరపడనవాడైనా, ఆఫ్రికాలో చదివినవాడైనా తెలుగోడైతే... కాలికి దెబ్బతగిలితే అమ్మా అని అరుస్తాడు. అదే సహజత్వం. ప్లాస్టిక్ పూలతో సువాసన సాధ్యమా? కాలంతో మార్పు అతి సహజం... ధూమ శకట వాహనం గైకొని రమ్ము అంటే అది ఏమిటో అర్ధం కాదు, కారు తీసుకొని రా అంటేనే అర్ధం అవుతుంది. టీ తాగుతావా? అని అంటే అర్ధం అయినంత బాగా, తేనీరు పుచ్చుకుంటావా? అంటే అర్ధం కాదు. భాష అనేది భావాన్ని వివరించేది అని నేనూ పూర్తిగా నమ్ముతాను. కాని పరభాషలో మాట్లాడీతేనే గౌరవం పెరుగుతుంది అనే భ్రమలో అందరం బ్రతికేస్తున్నాం అనే బాధ రోజు,రోజుకి పెరిగిపోతోంది. అలాంటి బాధనుంచి, నా కవిత్వం జనించింది. నేను రాసేది కవిత్వమో, కాదో నాకు తెలీదు. చందస్సు, యతి ప్రాసలు సరిగా తెలియవు. కాని మనిషి జీవితాన్ని, అందులోని ప్రశ్నలని అర్ధం చేసుకోగల సామర్ధ్యం ఉన్నదనే నా భావన. వాటినే అక్షర రూపంలో రాయడానికి ప్రయత్నించాను. కవిత్వానికి ఎవరెన్ని నిర్వచనాలు చెప్పినా, నా నిర్వచనం మాత్రం " సంఘహితం కోరేదే కవిత్వం". మొదట దీర్ఘ కవితలు రాసే ప్రయత్నం చేసాను, కానీ కవులన్నవారే చదువుతున్నారని అర్ధం అయ్యింది. అదికూడా రంధ్రాన్వేషణ కోసమే అని బాగా అర్ధం అయ్యింది. అప్పుడు మొదలయ్యిన ఒక ఆలోచనే నేను రాసే "గుప్పెడు మల్లెలు". గుప్పెడు చొప్పున చల్లుతున్నా, చూస్తుండగానే అవి గంపెడు తయారయ్యాయి. ఆదరిస్తున్న అందరికీ నమస్సుమాంజలి. ఈ నా గుప్పెడు మల్లెలు ముఖ్య ఉద్దేశ్యం... "ప్రతీ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది మనసుతో ఆలోచిస్తే" అని. ఆ అలోచన మాతృ మూర్తి, మాతృదేశం, మాతృభాష మీద ప్రేమతోనే సాధ్యం అని చెప్పాలని... ఈ ప్రక్రియకి సహకరించిన ఎన్నో అంతర్జాల సమూహాలు వేదికగా నిలబడినందుకు, వారికి ధన్యవాదాలు తెలియ జేసుకుంటున్నాను. ముఖ్యంగా కవి సంగమం, అచ్చంగా తెలుగు, కృష్ణ తరంగాలు, ప్రేమ.. ఇంకా ఎన్నో గ్రూపులు. వారందరికీ ధన్యవాదాలు. జై హింద్..... మీ "గుప్పెడు మల్లెలు" కె.కె.
by Kodanda Raofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m7dnMv
Posted by
Katta