పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
P.RAMAKRISHNA RAO లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
P.RAMAKRISHNA RAO లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, అక్టోబర్ 2012, గురువారం

పి.రామకృష్ణ //పులిగారి స్వర్ణకంకణం


పండగొస్తేనే నాకు
వాక్యూంక్లీనర్ గుర్తుకొస్తుంది.


నవరంధ్రాల్లో పూడుకుపోయిన
చెత్తాచెదారం వూడ్చుకోడానికి,
చీపురొకటి
దశమిరోజే అక్కరకొస్తుంది.

నిన్నరాత్రే
పడుకున్న పక్కమీదికీ,
పాత చాయాచిత్రాల వెనుక-
అల్లుకున్న సాలెగూళ్ళ మీదికీ,
ఎయిర్ బ్లోయర్ తన మిస్సైల్
ఎక్కుపెడ్తుంది.

ఇప్పుడు
పులుముకున్న రంగుల్తో-
ముఖం దాచుకోవడం
కొత్తగా వుంటుంది.

జమ్మిచెట్టుపై దాచుకున్న
క్షమాబిక్ష కరవాలం
కసబ్ కసాయితనంపై
కనికరం చూపిస్తుంది.

నైవేధ్యం పెట్టిన పిండివంటకం-
ఉపవాసంతో ఎండబెట్టిన,
ఊబకాయాన్ని ఊస్సురుమనిపిస్తుంది.

పాతబడ్డ పెళ్ళాం-
ఒంటిమీది చీర
కొంగొత్త వర్ణాల్తో పళ్ళికిలిస్తుంది.

ప్రతి తలతోనూ పైశాచికత్వం
ప్రతిధ్వనించే రావణభక్తి-
రణరంగం మధ్య నిలబడి,
గీతాభోద చేస్తుంది.

చేస్తూన్న పాపాన్ని
చూసీ చూడనట్టు వదిలెయ్యమంటూ-
చేతులు జోడించిన పిల్లి
భక్తిగా కళ్ళు మూసుకుంటుంది.

పండగ పదిరోజులూ
పల్లకిపై వూరేగే మహాతాయి
పదకొండోనాటికి
ఒట్టిరాయి గా మిగిలివుంటుంది.

12, ఆగస్టు 2012, ఆదివారం

పి.రామకృష్ణ || క్యూట్ రెసిపి ||


ముందుగా కాలాన్ని సెకన్లుగా
ముక్కలు చేసి పెట్టుకోండి.
చిలకపచ్చ రంగు ఆకుల్ని-
మెత్తగా రుబ్బుకుని,
చీరగా సిద్దం చేసుకున్నాం కదా?

మెమోరికార్డ్ లోని
మోహనం
మెరిసేదాకా డెవలపర్లో
ముంచి వుంచాలి.

ముఖం పైకి వెన్నెల వెనిగర్,
పెదాలపైకి చిర్నవ్వు షుగర్.

వుడుకుతున్న వయసుమీద
రుచి కోసం
కొద్దిగా
వసంతాన్ని చల్లుకోండి.

సోయగాల సూప్ కి
కాస్తంత సోయాసాస్.
కుందనాల బొమ్మకు
కుంకుమ పూలతో గార్నిష్.

కుక్కర్ కోయిల్లా
పిలిచేదాకా ఆగండి.

బ్యాక్ టు ఫ్యూచర్.
గడియారం పదేళ్ళు
వెనక్కు తిరిగేదాకా వేచి చూడండి.

పరువపు పళ్ళెంలోకి
వడ్డించుకున్న వేడి వేడి
క్యూట్ రెసిపి
రెడీ ఐంది.
కళ్ళారా ఆరగించండి.



*12-08-2012

17, జులై 2012, మంగళవారం

పి.రామకృష్ణ || కొత్తా దేవుడండీ.. ||

1.

2012 జూలై మూడు

చలికాలపు సాయంత్రం
షాంపైన్ నింపిన గాజు గ్లాసును
గాల్లోకి లేపాడు పీటర్ హిగ్స్.,
చీర్స్ చెప్పడానికి, ఎదురుగా-
సత్యేంధ్రనాధ్ బోస్ లేడు.!

2.

ముప్పైయేళ్ళ
పుడమి పురిటి నొప్పులకు
పుట్టిన
ప్రోటాన్ పసికందువు కదా..??

ఇంతకూ నువ్వు
ఆడా? మగా..?

3.

అమ్మా నాన్నా అవసరం లేకుండా
అవధరించావు కదా..?
దైవకణమని పేరెట్టుకున్నారు
మురిపెంగా.

సువార్తలేవైనా
మోసుకొచ్చావా మిత్రమా?
నిన్ను కూడా శిలువెక్కించేస్తారు
జాగ్రత్త సుమా. !

4.

2012 జూలై మూడు

చలికాలపు సాయంత్రం.
కన్నీరెండిన గాజు కళ్ళకి
మెరుస్తూ ఆదిమూలమేదో
అందినట్లైంది.
సాక్ష్యం చెప్పడానికి
సత్యేంద్రనాధ్ బొస్ లేడు.
*16-07-2012
( 'కొత్తా దేవుడండీ' కవితకు సుజాతగోపాల్ గారి అనువాదం. ) 


  Sujatha Gopal  || New God ||


On a wintry evening,
A champagne filled glass lifted high in the air,
For a toast by Peter Higgs,
To click the glass and say cheers,
There is no Satyendranath Bose …

For thirty long years,
To the mother earth in labour,
A proton child is delivered,
Are you a male or a female?

Without a mother or a father…
You are conceived,
Christened God Particle with pride…
Have you come with a gospel message, my friend?
Beware….
They may crucify you too!

2012 July 3rd
On a wintry evening,
In the tear dried glass eyes,
Shines the truth of origin perhaps,
To stand witness,
Satyendranath Bose is not alive…

__Sujatha Gopal


16, జులై 2012, సోమవారం

పి.రామకృష్ణ || విషాదం అను నాటిక..||

ముసుగేసిన రంగుని
తుడిచేసుకున్నా..
మారని ముఖభావం.

** ** **

గ్లిజరిన్ అవసరం లేని
కళ్ళు-
తెర దించేవరకూ
శోకిస్తూనే చివరి దాకా.

** ** **

అనుభవం అక్కర్లేని
అభినయం.

అనుకరిస్తే చాలు
ప్రతి జీవితమూ-
ప్రాంప్టేషన్.

*16-07-2012

12, జులై 2012, గురువారం

పి.రామకృష్ణ॥ఎదురింటి బాల్కెని॥


ఎప్పుడైనా ఓసారి
ఆ గోడల మీద
కాకులొచ్చి వాలేవి.

ఆవిడొచ్చి
రంగురంగు పావురాళ్ళను
మొక్కలకు పూయించింది.

చిట్టి చేతుల్తో తీగ పాదుల్ని
తట్టి లేపింది.

అంతా గుప్పెడు మట్టే.

పువ్వుగా ఎదిగే
విత్తనాన్ని
సుతిమెత్తగా
తడిమి చూసింది.

అభిమానం ఎరువుగా
చల్లుకుంటూ
వెళ్ళేదా..?

తిరిగొచ్చేసరికి,
తీగెలు పరిమళాణ్ణి
ప్రతిధ్వనించేవి.

ఎండిన ఆకు,
ఆమె కంట్లో
నీటి చుక్క
ఒకేసారి రాలి పడేవి.

ఆ కాస్త చోటే
అరోరా బొరియాలిస్
రెక్కలార్చుకునే
ఆకాశమైంది.

ఏమైందో ఏమో..?

మొన్నొచ్చిన
గాలి విసురుకు-
కూలిన మొక్కల సాక్ష్యంగా

తను కనిపించనే లేదు.
ఎప్పటికీ.

( ఇది నిజంగా నిజం )

*11.7.2012

7, జులై 2012, శనివారం

పి.రామకృష్ణ - కవిత

ఎంతెంత దూరం


దారంతా నీ పాదాలు
గుచ్చుకున్న
గాయాల గుర్తులు.

బహుశా
ఈ తోటంతా
పరిమళం కోసం
వెతుకుంటావు.

వేలి చివర-
ఆశల తూనీగల్ని
పట్టుకోవాలనే
ప్రయత్నించి వుంటావు.

ఇదికాదు..ఇదికాదు అనుకుంటూ..
నీది కాని కన్నీటి జడిని-
అటో, ఇటో
చల్లుకుంటూ వెళ్ళి వుంటావు.

దారంతా
నీ గుబుల్ని దాచుకున్న
గులాబి జ్ఞాపకాలు.



( ఒక మిత్రురాలి టైంలైన్ లోని పిక్చర్ చూసిన ప్రతిస్పందనతో )
*4.7.2012

4, జులై 2012, బుధవారం

పి.రామకృష్ణ కవిత

పెద్దలకు మాత్రమే
____________

వేడి, వేడి సీన్లుంటాయని
నరాలుగ్గబెట్టి చూస్తుంటే,
ఒరే అన్నా..
థార్ ఎడార్లో మొదలెట్టిన డ్యూయెట్-
సహారా ఎడార్లో ముగిసింది.

పెదాలు ముద్దుపెట్టుకునే ప్రతిసారి-
సన్ ఫ్లవరొకటి అడ్డమొస్తోంది.

పండ్లతో కథానాయకి ఒళ్ళంతా
కుళ్ళ బొడుస్తున్నారే గానీ-
ఒక్కసారైనా కథానాయకుడ్ని-
తాకనిచ్చారా అసలు?

సన్నని తన లేత నడుం చూడాలని,
తెగ వెతికా గురూ..
ఈగనైనా వాలనీడం లేదు హీరో గారు.

మొదటి రాత్రి!
ఆమె, అతడు.
పాలు, పండ్లూ..
వుఫ్ మని దీపాన్ని ఆర్పేసినారు.
ఇక తెల్లారేదాకా-
పువ్వు మీద వాలిన తూనీగ-
తేనె జుర్రుకుంటున్న ఫోటో-
చూడ్లేక చచ్చామనుకో.

జింకను తరిమే పులి బొమ్మొకటి
సింబాలిగ్గా చూపెడితే-
ఆ వెనుక రేప్ జరుగుతోంది బావా..
పక్క సీట్లోంచి అన్నాడొకడు చొంగ కార్చుతూ
తనేదో విశ్వరహస్యాన్ని కనుక్కున్నట్టు.

ఐటం సాంగొకటి మొదలైంది.
ఇక చూస్కో-
హాలంతా చీకటి.
అంధకారంలో తప్ప కనిపించని వాంపైర్ లా
వాంప్ కారెక్టరొకటి.

వాన పాటకు తడిసి ముద్దవ్వాలని
తెగ వుబలాట పడ్డాం కదా..?
ట్యాంకుల కొద్దీ నీళ్ళైతే కుమ్మరించారు గానీ
అంతేసి గొడుగుల క్రింద
వాళ్ళిద్దర్నీ దాచిపెట్టేసారు.!!

అరె నాయనా..
తెరెత్తేదాకా ఈలలేస్తూ
అల్లరి చేసామా??

తెర దించాక
నోటిమీద వేలేసుకుని,
ఎవరి దారిన వాళ్ళం
వచ్చేసాం
ఇక వెనుతిరిగి చూడకుండా!!

***

ఆదివారం,2,7.2012