పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Rajaram Thumucharla లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Rajaram Thumucharla లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, జూన్ 2014, మంగళవారం

Rajaram Thumucharla కవిత

కవి సంగమం -గ్రూప్ కోసం చదివిన కవిత్వ సంపుటి : - "34" సంపుటి పేరు :- "దుఆ"- (ప్రగతిశీల ముస్లిమ్ కవిత్వం) కవిత్వ సంపుటి రాసినది : - "పఠాన్ రసూల్ ఖాన్ " పరిచయం చేస్తున్నది :- "రాజారామ్.టి " మీనార్ నుండి ఎగిరి దొంగ దెబ్బకు క్షతగాత్రమై విలపించే పావురాయి చేసే "దుఆ" నే ఈ రసూల్ ఖాన్ కవిత్వం" "బాబ్రీలో నీవు చేసిన గాయం ఇంకా మాననే లేదు గుజరాత్ లో నీవు నరికిన శరీరం అతకనే లేదు వీలైనప్పుడల్లా నా గాయాలను చిదిమి రాచపుండు చేశావు నా అస్తిత్వానికీ నీ అహంకారంతో దేశ ద్రోహం పులిమావు" (దుఆ) ఎక్కడా విన్నానా స్వరం? ఎవరివా వాక్యాలు?-అని ఆలోచిస్తూ ఈ వాక్యాలు "మీనార్" నుంచి నాకు వినబడ్డాయా లేక ఎక్కడైనా చదివానా అని అనుకుంటూ అక్కడ అడుగుపెట్టాను. ఆ బంగారు ముఖద్వారం ప్రాంగణంలో గాజులుఅమ్మే వాడి (bangle seller) సవ్వడులు స్వాగతం చెప్పిననట్లు అనిపించింది.నిరంతరం కవిత్వమై ప్రవహించే యాకూబ్ దంపతులు,పాత ఙ్ఞాపకాల పరిమళం వెదజల్లగానే గుర్తు పట్టిన కవి దిలావర్, వహ్వ అనిపించేలా ఉర్దూ కవిత్వ నజరానానందిస్తున్న వాహేద్,తన వాదాన్ని ఎవ్వరేమనుకున్నా ధైర్యంగా వినిపించే స్కైబాబ, కవిత్వ నిర్మాణ శిల్పాన్ని కొత్తగా వింగడించి చెప్పే నారాయణ శర్మ యువ కవులు తిలక్,విజయ కుమార్,కృష్ణమణి,అందర్నీ జీరో డిగ్రీ లోకి తీసుకెళ్ళే మోహన్ రుషి ఇలా అందరి మధ్యన వున్నప్పుడు ఒక యువకుడు తన కవిత్వ పుస్తకాలు పంచుతూ నాకు కూడా ఇచ్చాడు.ఎందుకో తెలీదు కాని ఎవర్ని అడగని ప్రశ్న అతన్ని అడిగాను. ఆవ్యక్తి నా ప్రశ్నకు బదులుగా ‘ఆటో మెకానిక్’ ని అన్నాడు.అంతే మనసంతా అతన్ని గురించే ఆలోచించడం మొదలెట్టింది .ఏం చదివాడో తెలీదు కానీ కవిత్వం అతని ఆరో ప్రాణం అని మాత్రం అర్థమయ్యింది నాకు. అసురా,సిధ్దార్థ,సంగిశెట్టి,సుంకిరెడ్డి నారాయణరెడ్డి, నాళేశ్వరం శంకరం ,జగన్ రెడ్డి, మోహన్ రుషి, యాకూబ్, స్కై బాబ ఇందరి మధ్యలో వున్నా నాలో ఆ వ్యక్తి ఆలోచనే నన్ను ఒంటరి ద్వీపం లోకి నెట్టేసింది.యంత్రాలను మరమ్మత్తు చేసే అతను జీవితాన్ని మరమ్మత్తు చేసే కవిత్వం వైపు మొగ్గడం కొంచెం విస్మయానికి గురిచేసే సందర్భమే అయినా అలాంటి సందర్భాలు అనేకం గుర్తుకొచ్చి ఆ వ్యక్తి కవిత్వంలోకి వెళ్ళిపోయాను. మాటల్ని నిప్పు కణికెల్లా విసిరే శక్తి కల ఈ కవి పేరు పఠాన్ రసూల్ ఖాన్. అతని కవితా సంపుటే "దుఆ" “నేనేం చేయాలో నీ అధికారం చెబుతుంది నేనెలా వుండాలో నీ అజమాయిషి చూపుతుంది స్వతంత్ర దేశంలో వున్నా బానిస బ్రతుకు నాది” ముస్లిమ్ ల అస్తిత్వానికీ పై వాక్యాలు వారిపై ఈ కవి రాసిన శ్వేత పత్రానికీ కవిత్వరూపమేమో అని అనిపించకమానదు. "శత్రువు ఎంత బలమైన వాడైనా సహనంతో ఎదుర్కోవాలని,పగతో రగిలే వాడికి ప్రేమను పంచాలని,దౌర్జన్యం చేసిన వాడికై ‘దుఆ’ చేయమన్న "-ప్రవక్త వాక్యాలను ఈ కవి అక్షరాలనమ్మాడు."ప్రపంచం బాగుండాలి అందులో నా దేశం బాగుండాలి"-అని ఈ కవి అనుకుంటున్నాడు కాబట్టే 'నా లక్ష్యం ప్రేమైక భారతం "-అని అనగలిగాడు.ఈ రసూల్ ఖాన్ గొప్ప కవిత్వం రాశాడని కాదు, రాసిన దాన్ని చిత్తశుధ్దితో రాశాడని,తన వృత్తిని మించిన ప్రవృత్తిని కలిగివున్నాడని ఈ శీర్షికలో పరిచయం చేయాలనిపించింది. ఈ కవికీ ఆశావాద దృక్పథం అధికమేమో?.అందుకే భారతీయ చరిత్రను వక్రీకరించిన వైనాన్ని గుర్తించి "ఇంద్రధనుస్సులో లేని వర్ణంలా చరిత్ర పుటల్లో నన్ను వర్ణించాలనుకున్నావు"-అని అంటూ "నా తనువుకు ఎన్ని గాయాలైనా తలవంచక నిలుస్తాను కొత్త చిగురునై జనిస్తాను"-అని అనగలిగాడు "కొత్తచిగురు"-అనే కవితలో.ఖాదర్ మొహిద్దిన్ 'పుట్టు మచ్చ'లో ఆటలక్కూడా మతం అంటగడుతున్న దేశం దుస్థితిని గురించి కలత చెందితే ఈ కవి "నాకు అంటని వర్ణమేదో ఒంటినిండా పులుముతున్న భావన ప్రతి రాత్రి పీడకలై వేధిస్తుంది నాది కానిదేదో నాలో చూపిస్తూ నీ నీడ కూడా భయపెడుతుంది"-అని వాపోతాడు.భారత దేశ స్వాతంత్ర పోరాటంలో ముస్లిమ్ ల పాత్ర కూడా గణనీయమైనదే.ఆ విషయాన్ని "నీ స్వేఛ్చా గీతిక వెనుక ప్రవహించిన నెత్తురు నాదే "-అన్న వాక్యాల్లో వ్యక్తం చేసి, అయినా తనను పరాయివాడిగా చూసే నైజాన్ని నిరసిస్తాడు "కొత్త చిగురు"-అనే కవితలో ఆలోచనాత్మకంగా . మతసామరస్యానికీ మంట పెట్టాలని చూసే వాళ్ళని "మౌనంగా చూస్తున్నానని చులకనగా చూడకు మౌనం ముక్కలయితే చరిత్రే లేకుండా పోతావ్"-అని హెచ్చరిస్తాడు."చార్మినార్"-ని భాగ్యనగ కీర్తికిరీటంలో వన్నె తగ్గని కలికి తురాయిగా పోల్చడమే కాదు గతానికీ వర్తమానానికి మధ్య చరిత్ర చెక్కిన శిల్పంగా ఊహా చేస్తాడు.తాము వున్నచోటనే తమను పరాయి వారిగా చిత్రించే చరిత్ర రచన ,విధ్వంస కుట్ర తెలుసుకున్నామని ,తమ మౌనం బద్దలయితే చరిత్ర సాక్ష్యంగా కాటికి పోయిన మతోన్మాద శక్తుల ఉనికిలేని తనాన్ని తెలుసుకోమని మరోమారు గతించిన చరిత్రను గుర్తుచేస్తాడు. తమ సాంస్కృతిక చారిత్రక ఆనవాళ్ళను తుడిచిపెట్టే ప్రయత్నాన్ని కవిత్వం తో ప్రతిఘటిస్తాడు. సామ్రాజ్యవాదం,అగ్రరాజ్య దురహాంకారం,అవసరమనుకున్నప్పుడు ఒకదేశంలో రెండు మతాల మధ్య,రెండు పొరుగు దేశాల మద్య చిచ్చుపెట్టడం ఇవన్నీ ప్రపంచీకరణ దుర్లక్షణ పర్యావసానాలే.ఈ ప్రపంచీకరణ ప్రభావాన్ని కూడా ఈ కవి పసిగట్టినట్టున్నాడు.అమెరికా సామ్రాజ్యవాద కాంక్ష వేయి తలల నాగుపాము.ఆ పాము పడగలో వర్ధిల్లిన జియోనిజమ్ వారసులు ఇజ్రాయీలు పాలస్తీనా ప్రజలపై జరిపిన దురాగతాలను ఈ కవి వినో చూసో తన అక్షరాయుధాల్ని ఎక్కుపెట్టాడు.పాలస్తీనా లోని గాజా పై ఇజ్రాయిల్ దాడిని ఖండిస్తూ "గాయాల గాజా"-అనే కవిత రాశాడు. "అవును అక్కడ వెన్నెల హాయిని మంటలు కాజేశాయి లాలి పాడే చోట పాడె మీద ఏడ్చే తల్లుల రోదనలే ఎటు చూసినా ఉన్న చెట్టుకే చీడలు పడుతుంటే కొత్త చిగురులెక్కడ! విరిసే మొగ్గలకు చోటెక్కడ నీ దురాక్రమణ మంటలకు అమాయక ప్రజలను చిరు మొగ్గలను ఆహుతి చేస్తావా! చిరు హృదయాలను చిదిమి చిద్విలాసమా నీచుడా! ఏం... జాతిరా నీది" (గాయాల గాజా) ఇలా రసూల్ ఖాన్ యుధ్దనీతిని కావాలనే వదిలేసి చిన్నపిల్లల్ని,ఆడవాళ్ళని సైతం ఇజ్రాయిల్ మారణకాండలోవాళ్ళను భాగం చేస్తుంటే సహించలేక "ఉగ్రవాది ఇజ్రాయిల్ కు కర్రు కాల్చి వాత పెట్ట"మని కోరడమే కాదు "గాయపడ్డ గాజా కు మందు నివ్వు"-అని సిగ్గుని కోల్పోయి చూస్తున్న మిగిలిన ప్రపంచాన్ని కోరడమే కాదు అలాంటి ప్రపంచంలో తాను ఉన్నందుకు సిగ్గుపడతాడు. బాబ్రీ తప్పటడుగుల్ని తప్పని సర్దుకున్నాగుజరాత్ మారణకాండను అడ్డుకోలేని అప్పటి కేంద్ర అధికార పార్టినీ పరోక్షంగా "'నా గుండెలోని బాధలను నీ"హస్తం" స్పర్శతో మరిచాను"-అని ప్రస్తా విస్తాడు.మాములుగా ఆ పార్టీకే ముస్లిమ్ ఓటు బ్యాంక్ మొగ్గు చూపుతుందనే అభిప్రాయాన్ని కూడా ఈ కవి బలపరుస్తున్నట్టుగా " నీకై ఓటునవ్వడం తప్ప సంతోషం ఎరుగని నాకు"-అనే వాక్యాలు ధృవపరుస్తాయి. "నా రక్త మాంసాలను కూర్చి అన్ని సమకూర్చిన రిక్తహస్తాలు" చూపిన వార్ని కనికరం లేని ప్రశ్నలుగా ఈ కవి గుర్తిస్తాడు. "ఐస్ బాబు ఐస్ బాదం ఐస్ ఆరెంజ్ ఐస్ చల్ల చల్లని ఐస్ రండి బాబు రండి" ఈ మాటలు సైకిల్ వెనుక స్టాండ్ మీద ఒక డబ్బాని ట్యూబ్ లతో జారిపోకుండా కట్టుకొని ఒక చిన్న డబ్బాని తాడుతో తిరిగే చక్రానికి అనుసంధానించి అందర్ని ఆకర్షించే ఒక రకపు శభ్దాన్ని సృష్టిస్తూ పుల్ల ఐస్ అమ్మే ముస్లిమ్ ల ఆకలి తాపం చిత్రించిన కవిత లోనివి. "మంచులా కరిగే కాలం మాపై కక్ష కడితే తల్లిలా ఆదరించిన గ్రీష్మం జీలిగా నా తల నిమిరింది" అని మండే ఎండా కాలం కూడా తమని తనవారిగా తలపోస్తే తోటివారు తమను పరాయి వారుగానే ఆలోచించారనే భావనని ఈ కవి స్ఫురింప చేస్తాడు. ఏదయినా ప్రాణం వున్నదైనా,లేని దయినా అవసరాన్ని బట్టో ఆలోచనను బట్టో చూసే చూపును బట్టో తన రూపాన్ని ఎలా మార్చుకోగలదు?.కానీ పావురం ఆలయంలో వుంటే సామరస్యపు రూపం,చర్చిలో అది శాంతి కపోతం కానీ మసీదు పై వాలగానే మత పావురం.ఇది ఎట్లా సాధ్యం?.వస్తువు వొకటే.కానీ అది చేరిన ప్రదేశం వేరే.అందువల్లే దాని రూపం మసీదు మీద వాల గానే మతంగా మారిందనే ఒక వర్గ ఆలోచనని ఈ కవి ఎత్తిచూపిస్తూ ముస్లిమ్ లపై వున్న వివక్షను అద్దంలోని బింబంగా పావురంతో ప్రతిక్షేపిస్తూ దృశ్యమానం చేస్తాడు. ముస్లిమ్ పావురాళ్ళను బౌద్ద రాబందులు తరిమే దృశ్యం ఎక్కడ చూశామా?-అని మనకు అనుమా నం రావచ్చు.అహింసా పరమోధర్మః అని విశ్వసించే బౌద్ద మతంలో కూడా పరమత సహనం లేని కొందరు మయన్మార్ లో ముస్లిమ్ లపై దాడి చేసిన సన్నివేశం ఇంకా ఎవరు మరచిపోలేదు.ఆ సం ఘటనను రసూల్ ఖాన్ "యా అల్లాహ్"-అనే కవితలో గుర్తుచేస్తాడు. "దీపపు కాంతి లేనిమా ఇళ్ళు నీవు పెట్టిన నిప్పుతో ఊరికే దివిటీలుగా మారాయి చెయ్యేత్తి ప్రార్థిద్దామంటే మా వైపు జాలిగా చూశాయి" ఇలా ఈ కవి మయన్మార్ లో జరిగిన దాడిని ,అక్కడ ముస్లిమ్ ల నిస్సహాయతను ఒక గొప ఊహతో తెలియచేస్తాడు. ముస్లిమ్ పావురాళ్ళను బౌద్ద రాబందులు తరిమే దృశ్యం ఎక్కడ చూశామా?-అని మనకు అనుమా నం రావచ్చు.అహింసా పరమోధర్మః అని విశ్వసించే బౌద్ద మతంలో కూడా పరమత సహనం లేని కొందరు మయన్మార్ లో ముస్లిమ్ లపై దాడి చేసిన సన్నివేశం ఇంకా ఎవరు మరచిపోలేదు.ఆ సం ఘటనను రసూల్ ఖాన్ "యా అల్లాహ్"-అనే కవితలో గుర్తుచేస్తాడు. "దీపపు కాంతి లేనిమా ఇళ్ళు నీవు పెట్టిన నిప్పుతో ఊరికే దివిటీలుగా మారాయి చెయ్యేత్తి ప్రార్థిద్దామంటే మా వైపు జాలిగా చూశాయి" ఇలా ఈ కవి మయన్మార్ లో జరిగిన దాడిని ,అక్కడ ముస్లిమ్ ల నిస్సహాయతను ఒక గొప ఊహతో తెలియచేస్తాడు. "మా సహనమే నీ బలం మా మౌనమే నీ ఆయుధం స్వార్థం అంటని సత్య ప్రియులం కాలుతూ వెలుగు నిచ్చే ప్రమిదలం వెలుగు పూలను వేటాడాలని చూస్తే" కపట నీతి కడిగివేయబడుతుందని,దౌర్జన్యం దహించి వేయబడుతుందని "వెలుగు పూలు "-అనే కవితలో ఒక వేదనతో కూడిన సత్యాన్ని చూపుతాడు. ఈ కవి ఇస్లామ్ లోని కొన్ని ప్రగతిశీలం కానీ అంశాలను సైతం నిర్మొహమాటంగా ఖండిస్తాడు. పూజారి వ్యవస్థ లేని ఇస్లాం లో పూజారుల్లా చెలామణి అవుతున్న అగ్రవర్ణ బీజ మూర్ఖుల్లారా వెలుగును దాచే వారల్లారా దీపం క్రింది నీడల్లారా వెన్నెలను పంచాలి పట్టి ఆప కూడదు శాంతి సందేశం ఇవ్వాలి" అని అనడమే కాదు ఇస్లామ్ అంటే ఇలా చెబుతాడు. ఇస్లామ్ అంటే? మతం కాదు మానవ జీవన విధానం ధార్మిక విఙ్ఞానం బానిస సంకెళ్ళను తెంచిన సమానత్వపు ఆయుధం కాఠిన్యాన్ని కడిగిన కరుణామృత సాగరం హృదయాలను కలిపిన ఆత్మీయ నేస్తం" ఇలా ఇస్లామ్ మౌళిక ధర్మాలను కవిత్వం చేశాడు ఈ కవి రసూల్ ఖాన్. ప్రగశీలం అని అనని బురఖా సాంప్రదాయాన్ని సమర్థించే అంశాలు కూడా ఈ కవి చేతిలో కవిత్వం అవ్వడం అతని ప్రగతి శీలత్వానికీ అడ్డంకేమో? కొన్ని పేలవమైన పంక్తులు ,కవిత్వంగా మారని వాక్యాలు ఈ కవి కవిత్వం రాయాలన్న చిత్త శుధ్ది ముందు ఓడిపోతాయి.ఈ కవి మంచి చదువరి కాగలితే మంచి కవిత్వ సృజన చేయగడు.అతని ముందటి అఫ్సర్,యాకూబ్,దిలావర్,ఖాదర్ మొహిద్దీన్,మహజబీన్,స్కైబాబా,షమీఉల్లా మున్నగు కవులను చదివి అర్థం చేసుకొని కవిత్వం నిర్మిస్తే , కవిత్వ శిల్ప రహస్య నిర్మాణం తెలుసుకోగలిగితే మైనారిటీ ముస్లిమ్ వాద సాహిత్యానికీ మరో ఆణిముత్యం దొరికినట్టే. "తురకోళ్ళకు తెలుగు కవిత్వమా? అని నవ్వే విషపు ముళ్ళ మధ్య విరబూసిన వెలుగు గులాబీ " అయిన పఠాన్ రసూల్ ఖాన్ ని అభినందిస్తూ..వచ్చే మంగళవారం మరో సంపుటితో కలుద్దాం.

by Rajaram Thumucharla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/T3YLQy

Posted by Katta

17, జూన్ 2014, మంగళవారం

Rajaram Thumucharla కవిత

చదివిన కవిత్వ సంపుటి - 33 (కవి సంగమం ) కవిత్వ సంపుటి పేరు :- " ప్రవహించే పాదాలు " (కవిత్వం ) సంపుటిని రాసిన కవి పేరు :- " మంత్రి కృష్ణమోహన్ " సంపుటిని పరిచయం చేస్తున్నది : - " రాజారామ్.టి ” " అంతంరాంతర సీమల్లో ఆర్తి భ్రమర భ్రమణ ఝుంకార సంగీతం కృష్ణమోహన్ కవిత్వం “ 'ఇద్దరి మధ్య' 'మనసైన పుస్తకం' ' ప్రేమ '. జీవితపు 'డైరిలో ఒక పేజి ' అది అని ఆలోచిస్తూ, 'ఓ లో తట్టు దృశ్యం 'చూసినప్పుడు 'పోయమే రాయనక్కర్లేదు అని అనుకొంటూ, '. 'తడి ఆరని రాగాన్ని 'ఆలపిస్తూ ఓ' రాత్రి ' 'దుఃఖగీతం' పాడుతూ 'తిరిగిరాని వెన్నెల 'కోసం 'ముకురం ముందు ' 'ఒక నిట్టూర్పు' విడుస్తూ "చెట్టు పోయిన తరువాత 'కూడా 'జరిగింది చాలు 'అని అనుకొని 'దయావర్షం 'లో 'ప్రవహించే పాదాలు 'నడిస్తే కానీ 'వాళ్ళు చల్లబడరు "-అని 'ఏక వాక్యం 'తో చెప్పలేక ఏకంగా 'శిలా గీతం ' తో 'మైదానం 'లోకి వచ్చి 'ఆత్మని చూడు ' అని 'మట్టి మనసుకు నీరాజనం' ఇచ్చిన కవి మంత్రి కృష్ణమోహన్. నిజంగా ఆయనెవరో తెలీదు. తలగడ పక్కనే ఎన్నో రోజులుగా నా కంటి స్పర్శ కోసం నిరీక్షించిన సంపుటిలోని కవిత్వ పాదాలు నా మీద నుంచి నడచి ప్రవహించాయి ఈ రోజు.'కవిత్వం మీద వున్నంత ప్రేమ ' దేని పైన లేదేమో? అని ఇంట్లో అందరూ అనుకునేంత నన్ను ముంచేశాయి. "నిజానికిది ప్రేమ కవితా? లేక నిస్సహాయుడి గుండెకోత” ఈ సంపుటి అని నన్ను ఆలోచనా యాతనకు గురిచేసిన కవితా సంపుటి ఇది. 'ప్రేమేతరమైంది ప్రతిదీ దుర్భరమే దుస్సహమే'- అంటాడు కిరణ్ క్రాంత్ 'రాగధూళి'లో. ప్రేమ మినహా జీవితంలో మరేమీ లేదా?-అని అనుమానమొచ్చినప్పుడు వొక కవయిత్రి అది కూడా జీవితంలో ఒక ప్రధాన భాగమే కదా!-అని వాదనకు దిగింది.అంతటితో ఆ చర్చ ఆపేస్తే బాగుంటుందని నిలిపేశా.నా కున్న వ్యసనాల్లో ఒకటి నా కన్నా తక్కువ వయసున్న వాళ్ళతో ఇష్టంగా మాట్లాడటం. వాళ్ళు చెప్పేవి వినడం.ఓ రోజు LOVE అంటే ఏంటి అని నాకు బాగా సాన్నిహిత్యమున్న కుటుంబం లోని వార్నిఅడిగితే ఓ అబ్బాయి లేచి "LOSS OF VALUABLE EDUCATION "-అని అన్నాడు.ఎంత గొప్ప ఊహతో చెప్పాడా పిల్లాడు అని అనుకున్నాను..నిజానికీ ఈ మంత్రి కృష్ణమోహన్ ఈ సంపుటిలో అక్కడక్కడ చేర్చిన ప్రేమ కవిత్వం నన్ను మంత్రముగ్ధున్ని చేసి మోహనం కలిగించింది నాకు చదివిన తరువాత. ప్రణయ భావనలతో రాయగూడదని కాదు నేనంటున్నది అదే ఒక్కటే కవిత్వం అన్న భావన ఉండగూడదని. కృష్ణమోహన్ కి అలాంటి భావన అసల్లేదు అందుకే "శిలా గీతం "-లాంటి నిరుత్తురులనే చేసే పద్యాలు రాయగలిగాడు. "మట్టి పలకలు"-అనే నానీలు రాసిన కృష్ణమోహన్ మార్కాపురం నివాసి.ఆ ఊరు రాతి పలకలకు పెట్టింది పేరు.ఒకప్పుడు ఇసుకలో అక్షరాభ్యాసం చేసిన దృశ్యం రానురాను రాతి పలకలోకి మారింది.తరచు ఆరాతి పలకలు పగిలి పోవడం,పారిశ్రామిక వ్యాపారీ కారణంగా పగిలిపోని , తక్కువ ధరలో లభ్యమయే రేకు,ప్లాస్టిక్ పలకల సృష్టి జిరిగింది.కాల క్రమేణా రాతిపలకలు మాయమయి పోయాయి మనిషన్నవాడు మాయమైపోనట్లు. కంఫ్యూటర్ కీ బోర్డ్ మీద అక్షరాలు నేర్చుకుంటున్న ఇప్పటి పిల్లలకు అసలు పలకా బలపాలు ఎట్లా తెలుస్తాయి అందుకే ఈ కవి ఆ రాతి పలకల ఆంతరంగిక దుఃఖాన్ని "శిలా గీతం" చేశాడు.ఒకప్పుడు దేశమంతా ఈ రాతి మీదే ఓనమాలు దిద్దింది.ఈ కవి తొలిపద్యం కూడా ఈ రాయి మీదే మొలకెత్తింది.అందుకే ఈ కవికీ "కవిత్వం మీద వున్నంత ప్రేమ"వుంది ఆ రాయి మీద. ఈ రాయి మీదే నేనక్షరాలు దిద్దున్నానంటే యీ పిల్లలు నమ్మటం లేదు ఈ రాయి పలకా బలపాల అర్థనారీస్వర రూపమంటే యీ పిల్లలు నమ్మడం లేదు" ఎలా నమ్ముతారు వారు అక్షరాలకు ఆసనమవ్వడానికీ ఈ రాయి ఎన్ని రాతి దెబ్బలు తిన్నదంటే.ఈ రాయే తన వూరి జనం పాటకు గ్రామ్ ఫోన్ రికార్డ్ అయ్యిందని,తన వూరి చరిత్రకు ఈ రాయే శిలాశాసనం అయ్యిందని కవి మనల్నీ ఒక మధురిమ ఙ్ఞాపకాలలోకి నడిపిస్తాడు. అతి చిన్న వూరిగా వున్న మార్కాపురం ఒక పట్టణంగా మారె దృశ్యాన్ని "కొలనులో నీటి అలల్లా పట్నమై విస్తరించింది"-అనే ఒక చిన్న భావ చిత్రాన్ని కల్పించి ఆ వూరి ఆర్థిక పురోగతికీ ఆ రాయి ఎట్లా కారణమయ్యిందో గొప్పగా చెప్పాడు.ఇట్లా గతవైభవ పునఃస్మరణ అనే ఒక లక్షణాన్ని ఒక కవి నుంచి మరొక కవి అందుకొని తెలుగు వచన కవిత్వాన్ని అనుభూతి అంచుల మీద నడిపించారు.కృష్ణ మోహన్ తన బాల్యపు స్మృతుల్నీ ఈ శిలా గీతంలో మనకు పంచి ఆ అనుభూతిని మన అనుభూతిగా చేశాడు.ఇదీ ఒక మంచి కవిత్వ లక్షణం. ఆది వారం చాల మంది కవులు’ ఫాదర్స్ డే ‘సందర్భాన్ని కవిత్వం చేశారు.అట్లాగే ‘మదర్స్ డే’ ని కవిత్వం చేశారు.నిజానికీ ఆ వొక్క రోజేనా తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తున్నది అని నాకు చాల రోజుల నుంచి ఒక అసహనపు ఏవగింపు ఆ రోజుల పైన.నిరంతరం తల్లి దండ్రులను ప్రేమతో ఆప్యాయతతో చూసుకోవాల్సిన బిడ్డలు వారి తల్లిదండ్రులను అనాథాశ్రమాల పాల్జేస్తున్నారు.డబ్బు సంపాదనా మత్తులో కొందరు,వృద్ధులైన వారికీ సేవ చేయడానికీ ఇఛ్చగించని మనసుతో కొందరు ఏదో ఒక ముసుగుతో మాట్లాడుతూ కన్న వారిని వృధ్దాశ్రమాలలోకి నెడుతున్నారు.ఇంతకన్నా విషాదం మరోటి లేదు.ఈ కవి ఆ విషాదాన్ని "ఎ విజిట్ టు వృధ్దాశ్రమం"-అనే శీర్షిక తో కన్నిటి కవిత్వం నిర్మించాడు. వృద్ధులు అలా వృద్ధాశ్రమాలలో వుండాటాన్ని ఈ కవి సమర్థించడు కానీ అవే లేకపోతే ఆ వృద్ధులకు ఊరట ఎట్లా?-అనే ప్రశ్న వేసుకొని తనే ఇట్లా సమాధానం చెబుతాడు. "మూడోతరంతో ముద్దులాడే ఋతువులో ఇలా సాటి వయసుల్తో సమయాల్ని సాగదీయడం ఒక బాధ ఒక ఊరట" ఆ వృద్ధాశ్రమాల వాతావరణాన్ని ఈ కవి ఇట్లా చిత్రించి మనలో ఒక వ్యథను సృష్టిస్తాడు. కడుపు కోతలు గుండె వాతలు కలసి మెలసి తిరుగుతున్నాయి అనారోగ్యాలు అసహాయతలు సహజీవనం చేస్తున్నాయి ముసలి గువ్వల మనోవ్యధల్ని అక్కడి చెట్టు చేమలు విచ్చుకున్న చెవుల్తో ఆలకిస్తున్నాయి" ఆ ముసలి గుండెల వ్య్థల్నీ సాటి మనుషులు పట్టించుకోకపోయిన చెట్టు చేమలు వింటున్నాయనే చిత్రణతో వాటికి మానుషత్వారోపణ చేసి గుండె కరగి నీరయి పోయే మాటల్ని కవిత్వంలో వొంపుతాడు. ఇలా వాళ్ళు వృద్ధాశ్రమాల పాలు కావడం వాన ప్రస్థం కాదు కర్మఫలమూ కాదు అదొకగెంటివేత మాత్రమే. ఆచీకటి కోణాలు దాచెస్తే దాగని సత్యాలుగా వున్న ఆ మలిసంధ్యలు(అంత్య దశలో వున్న వృద్ధులు) తమ మౌనాల్ని ఛేధిస్తాయని కవి ప్రస్ఫుటీకరిస్తాడు."ఈ యాతన ఎవరికీ అర్థం కానిది,ఈ క్షోభ ఎవరికీ స్పృశించనిది"-ఎవరికీ వారే అలా ఆ వృద్ధాశ్రమాలలోకి నెట్టివేయబడినప్పుడు మాత్రమే అర్థమయ్యేది-అని కవి ఒక సత్యాన్ని కవిత్వం చేశాడు. "వాళ్ళ పాదాల్లో వాళ్ళ పాదాల నీలి మేఘఛాయల్లో నాకో పల్లె కనిపిస్తుంది, వో పొలం కనిపిస్తుంది ఆ పాదాల చుట్టూ పచ్చని పైరగాలులు రెక్కలు విప్పుకొని కదుల్తూ కనిపిస్తాయి ఆ మెల్లని దయాపవనాలు శ్రమగీతాలకు ఆలాపనగా వినిపిస్తాయి ఆ పాదాల మెట్టెల్లో సూర్యచంద్రులు వొదిగి,తల దాచుకొంటారు కాబోలు ఆ పాదాలు,తారకలకు కాంతి భిక్ష పెడతాయి కాబోలు ఒక్కో పాదంవొక్కో ఆకాశ శకలం ఒక్కో పాదం ఒక్కో నదీ ప్రవాహం ఒక్కో పాదం వొక్కో మేఘసందేశం" ఇలా ఆకాశంలో అర్థ భాగమైన వారి పాదాల సౌందార్యాన్ని,సుకుమారత్వాన్ని,గొప్పదనాన్ని,ఆ పాదల అజేయ విజయాన్ని కవిత్వంగా మార్చిన కవి ఎవరంటే మంత్రి కృష్ణమోహనే. ఉన్నచోటనే వుంటూ అనేక కిలోమీటర్ల దూరం నడుస్తూ,ఇంట్లో బయట అనేక కార్యాలను చక్కబెడుతూ,బరువైన కాడితో బాధ్యతలను మోస్తూ,లలితంగా మృదు ధృఢంగా పాదాలు కల వారెవరు?-స్త్రీలవే కదా!.శ్రమ నినాదల్ని నిరంతరం లిఖిస్తున్న పాదాలు కావవి కారుణ్య శరీరాలు అవి అని ఒక అద్భుత పోలికను ప్రవేశపెట్టి ఇంకా ఆ పాదాల పట్ల ఎవరికైనానిర్లక్ష్య అభిప్రాయమ్ వుంటే తొలగించే ప్రయత్నం చేస్తాడు.శ్రమతో స్వేదాన్ని రాలుస్తున్న ఈ పాదాల గుర్తులు ఈ భూతలం మీద మూడొంతులు అని వారి పాదాల విశాలత్వాన్ని గ్రహించలేని కళ్లకు చూపిస్తాడు. బంగారు కంకణం కనపడకపోతే గాభరా పడి గదంతా వెతికినట్టు "మనసైన పుస్తకం"కనపడకపోతే అంతే దిగాలుతో గాలింపు చేస్తాడట ఈ కవి.మనసైన పుస్తం కనపడక పోతే పరాయి దేశంలో మనిషి తప్పిపోయినంత బాధ-అని ఒక భావాన్ని కవిత్వం చేసి తన పుస్తక ప్రియత్వం ఎంతదో తెలియ పరుస్తాడు ఈ సంపుటిలో ఓ కవితలో.ఆ పుస్తకం దొరక్కపోతే నుదుటి మీద చెమట ధారలు,భూన భోంతారాలు బద్దలయ్యిన భయం కలుగతాయని అతిశయోక్తిగా అన్న అందులో ఆ కవి పుస్తకాల పట్ల కనపరిచే ఆసక్తి ద్యోతకమవుతుంది. మనల్ని నిశ్చేష్టితుల్ని చేసి తన దగ్గర నిలబెట్టుకొని చదువించే కవిత "చెట్టు పోయిన తరువాత ". ఏదయినా కోల్పోయినప్పుడు మాత్రమే దాని విలువ తెలిసేది అన్న అంశాన్ని హత్తుకొనెటట్లు చెప్పిన కవిత ఇది.మనం రాళ్లేస్తే తాను పళ్ళు ఇచ్చేది చెట్టే.మనం నరికేస్తే మళ్ళీ మొలిచి మనకు నీడ నిచ్చేది చెట్టే.తన ఇంటి ముంగిట్లో తన కురులను తాకందే ఎవరినీ బయటకు వెళ్ళనివ్వని చెట్టును మొత్తంగా నరికేసినప్పుడు కవి నిర్మించిన కవిత ఇది.రోడ్డు వేసేవాడు తనకు ఆ చెట్టు అడ్డమయిందని,కాలువలు ఊడ్చేవాడు అది రాల్చే ఆకులు తీయడాని కష్టమైందని ఎన్నేన్ని మాటలన్న ఆ చెట్టు మాత్రం సూర్యుడు చురుక్కుమన్నప్పుడు వారందర్ని తన నీడ కౌగిలిలోకి తీసుకొని సేద తీరుస్తుందని కృష్ణమోహన్ భావన చేస్తూ గోడ పక్కన నాటిన ఆ రెండు మొక్కలు చెట్లయితే గోడని కూల్చేస్తానని వృక్ష పరిరక్షణావశ్యకతను ధ్వనిస్తాడు. ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోని చాలా దేశాల్లో చిన్నాపెద్దా తేడా లేకుండా అందర్ని అట్లానే నిలబెట్టే ఆట క్రికెట్.అదొక సర్వస్వంగా భావించే వాళ్ళు ఇప్పటికీ వున్నారు.ఆ అట జరిగేటప్పుడు,అయిపోయిన తరువాత కూడా దాన్ని గురించే స్థితి ఈనాటికీ వుంది.కార్యాయాలకు,స్కూళ్లకు డుమ్మా కొట్టి ,ఆఖరుకు పనులన్ని ఎగరగొట్టి ఆ ఆటను టి.వి ల్లో చూస్తున్నారన్న విషయం ఎవరు కాదనలేరు.అనంతపురం జిల్లాలో చాల కాలమే కీర్తిశేషులైన కవి కాకి (కోగిర జై సీతారామ్) పుట్టిన బిడ్డ క్యార్ క్యార్ మని ఏడవకుండా స్కోర్ స్కోర్ అని ఏడుస్తారని ఈ క్రికెట్ గురించి రాసినట్టు ఙ్ఞాపకం.ఎంతగా ఈ ఆట ప్రభావితం చేసిందంటే ఒక ఆటగాడికీ భారతరత్న ఇచ్చేటంతగా.ఈ ఆటని కవి మంత్రి కృష్ణమోహన్ "డైరీ లో ఒక పేజి" అనే కవితలో మనల్ని ఆలోచనలోకి నెట్టెసెటట్లుగా కవిత్వం చేశాడు. " ఆరోజు టి.వి తెర ముందు శిలా స్తంభాన్నవుతాను కళ్ళను వికెట్లకు కాపలా వుంచి గంటల కాలాన్ని కుప్ప పోసి తగలేస్తాను చలి మంట కాచుకోడానికి మరో నలుగురు చేరిపోతారు" కవి ఈ కవితలో ఈ ఆట కాలాన్ని ఎంతగా వృథా చేస్తున్నదో చెప్పడమే కాదు,ఈ ఆట ఎట్లా దేశ ఆర్థిక స్థితి సంక్షోభంలో పడటానికీ కూడ కారణమవుతున్నదో ఒక దృశ్యాన్ని చూపిస్తూ,ఆ రోజటి ఆకలి దప్పుల్ని సైతం మరిపించి మురిపించగల శక్తి ఈ ఆటకున్నదని "కడుపాకలి కళ్ళు తీరుస్తాయి దేహం దాహాన్ని మరచి పోతుందని"- వ్యక్త పరచని దుఃఖంతో చెబుతాడు. ఆటకు సంబంధించిన పారిభాషిక పదాలను కవిత్వం చేయటం అంత సులభం కాదు.అందులోను ఆ పదాలు ఆ కవితలో ఒదిగిపోయేటట్లుగా రాయడం అనుకున్నంతతేలిక కాదు.క్రికెట్ ఆటకు సంబంధించిన పదజాలాన్ని ఈ కవి ఎంత నేర్పుగా ఈ కవితలో వొంపాడో సొగసుగా చేశాడో చూడండి. ఆట బంతి చుట్టూ పరిభ్రమిస్తుంది చూపు పిచ్ మీద పరచుకొంటుంది బౌలర్ వేసే ప్రతి బంతికీ సాగిలపడ్డ వెన్నుపూస వికెట్ లా నిలబడిపోతుంది బౌండరి దాటే బంతి కోసం భారి సిక్సర్ కోసం కళ్ళు బైనాక్యుర్లయి కూర్చుంటాయి" ఇలా కవి క్రికెట్ ఆటను కవిత్వంలోకి తీసుకొచ్చి నిద్రలేక 'ఎర్రబడ్డ కళ్ళు నులుముకుంటున్న ' వాళ్లు ఎప్పటికైనా కళ్ళు తెరుస్తారు కదా!-అని నిట్టూర్పు విడుస్తాడు. 'కోపగిస్తాం గానీ/మనం నవ్వితే ఏడ్చే/ఏడిస్తే నవ్వే మనుషుల కంటే/అద్దం చాలా నయం కదూ!'-అని అంటున్న ఈ కవి తనే 'అద్దాన్ని బద్దలు చేయాలనిపిస్తుంది/ఒక్కరోజైనా/ఆప్యాయంగా పలకరించనందుకు'-అని విరుధ్ద భావాలతో చెబుతాడు.అద్దం ఎప్పుడూ వున్నది వున్నట్లే మాట్లాడుతుంది.హిపొక్రటిక్ గా వుండదు మనుషుల్లా.ఒక అద్భుత భావ సంచయాన్ని ఈ కవితలో కవి నిక్షిప్తం చేశాడు. 'ఒకప్పుడీ యవ్వనానికీ /అందాన్ని ఆరాధించటం / దినచర్యలో భాగమై వుండేది"-అనటం అప్పటి యువకుల మనస్తత్వాన్ని చిత్రిస్తాడు.'అందంగా తీర్చిదిద్దిన / తైల వర్ణ చిత్రం మీద / ఆకస్మికంగా యాసిడ్ పోస్తే "-అని అనటంలో ఈనాటి యువకులు ప్రేమ పేరుతో స్త్రీల మీద యాసిడ్ దాడులు చేసే సంఘటనను గుర్తుకు తెస్తాడు.'అల్లారు ముద్దుగానో ,అపురూపంగానో /చూసుకుంటున్నవన్నీ/ వొక్కొటొక్కటిగా కనుమరుగైపోవడమూ'-అని అనడంలో తల్లి దండ్రులు పోగొట్టుకున్న పిల్లల్ని ఙ్ఞప్తి చేస్తాడు. 'కానీ పచ్చగా ఎదిగిన పైరు మీద / వికృత కీటకాలన్నీ /మూకుమ్మడిగా దాడి చేస్తే '-అని అనటంలో అడకూతుర్లపైన లైంగిక దాడికి పాల్పడుతున్న వికృతత్వాన్ని స్ఫురణకు తెస్తాడు. ఇవన్నీ "ముకురం ముందు "అన్న కవితలో కవి వ్యక్తపరిచినవి.ఈ కవితలో ప్రతి పాదం కవిత్వమై పారాడింది."మంచు శిల్పంన్నించి /సౌందర్యంన్బొట్టు బొట్టుగా నేల రాలడం అసహజమేం కాదు"అని అంటున్న ఈ కవి "అంతా మన వేదనాజ్వలిత నిస్పృహే కాని అసలు పతనమయ్యేది సౌందర్యం కాదంటాడు.అద్దంలో ఎవరైనా కనీసం వారికి వారైన సమ్మోహనంగా కనిపించకపోరనే మనస్తత్వ శాస్త్ర అంశంతో ఈ కవిత చిత్రంగా ముగుస్తుంది.ఈ కవి శిల్పనిర్మాణ నేర్పుకు ముకురమే ఈ కవిత. "స్పీక్ ఇన్ ఇంగ్లీష్" "స్పీక్ ఇన్ ఇంగ్లీష్"-అనే ఏక వాక్యం ఒకే వాక్యం ఒకే వాక్యం కిటికీ కిటికీ కీ వేలాడుతున్న వాక్యం ఇవాళ చాలమందికి ముచ్చటైన వాక్యం తన గుండెలో బల్లెంలా ఎలా గుచ్చుకుందో ఆ చిన్న వాక్యం పాములా తన ఒంటిపై ఎలా పాకిందో చెబుతూ, మనల్నీ వాస్తవానికీ కల్పనకీ మధ్య నిలబెట్టి నిలదీస్తున్నట్టుగా అనిపించేటట్లు ఈ కవి రాసిన కవిత "ఏక వాక్యం".మాతృభాష పట్ల మమకారాన్ని పెంచే వాక్యం . చేతిలో చిల్లిగవ్వ వుంచుకోకుండా,ముఖంలో దిగులు వర్ణాల్ని చూపించకుండా త వారసత్వంపై విశ్వాసం వున్న నాయనమ్మను "అంతరం"-అనే కవితలోనూ,ఎన్నో మార్లు రూపం మారి మారి ఇవాళిలా మిగిలిపోయిన నాయనమ్మను "నానమ్మ కళ్ళ్ద్దాలు "అనే కవితలోను ఇంతవరకు మనం చూడని వైవిధ్యంతో చిత్రించాడు. బెలూన్ లతో అందమైన బొమ్మలు తయారు చేసే వారి జీవితాలు వారు తయారు చేసే గాలి బొమ్మల వలే ఆకలి చూపుల కిరణప్రసారాల ముందు పేలిపోతాయనే వేదనను "బొమ్మా-బొరుసు" లో చూపిస్తాడు.ఓ తడి ఆరని రాగాన్ని మనతో ఆలపింప చేస్తాడు. "నువ్వు వదిలివెళ్లిన లోకంలో నేనో ఒంటరిని,మూగ బాధని. ఈ రాత్రి ఈ నిముషం ఇప్పటికీ కాలిపోతున్న వాణ్ణి కరగి నీరౌతున్న మనిషిని " ఈ మాటలు తన దేవి స్మృతుల్లో ఈ కవి తడి ఆరని దుఃఖంతో మాట్లాడినవి.ఇపుడీ అక్షరాలనిండా ఆవిడా చిహ్నాలే.ఓ ఙ్ఞాపకాల పూలతోటే.ఒంటరిగా వెళ్ళటం అలవాటు లేని ఆవిడ "ఎవరికీ మాట మాత్రం చెప్పకుండా అర్థరాత్రి చీకటిలో అర్థాంతరంగా..వెళ్ళిపోతే కన్నీరు మున్నీరై తల్లడిల్లిపోయి రాసిన రాసిన వాక్యాలివి.రాసిన ప్రతి వాక్యంలో ఆమెనెంత అపూర్వంగా ప్రేమించాడో హృదయపు గూడులు కదిలేటట్లుగా ప్రతి కదలికలో ఓ పొందిక ప్రతి చర్యలో ప్రేమ ప్రబింబేచించేటట్లుగా చెప్పిన కవిత. "ఓ పాట నవుతాను,ఆగిపోతాను ఓ శిలనౌతాను,నడుస్తాను కఠిన సత్యంతో పోరాడుతాను,శాంతపడతాను జీవితాన్ని అర్ఠం చేసుకుంటానికి యత్నిస్తాను అయినా ,అశాంతి ద్వారం దగ్గర ఆగిపోతాను" ఎంతటి ఆవేదనాత్మక వాక్యాలో ఇవి అంత ఆలోచనాత్మక వాక్యాలు కూడా ఇవి. ఎంత దూరం నడిచినా,ఎంత కాలం గడిచినా ఆవిడా ఙ్ఞాపకాల పూదోటలో తానెప్పటికి తడి ఆరని రాగాన్నేఅంటున్న కృష్ణమోహన్ నిజంగా గొప్ప దేవీ ప్రేమికుడు.ఒక హృదయ దగ్ధ గీతం ఈ "తడి ఆరని రాగాన్ని "-అనే పద్యం. "నిత్యం దుఃఖపు కోణాలు స్పృశిస్తావు /నిరంతరం జీవన వేదాంతాలు జపిస్తావు '-అని అంటున్న కవి, ఇవాళ రాసే వస్తువు మారాలా? రూపం మారాలా? సారం మారాలా?-అని ప్రశ్నలు వేస్తున్నకవి , "కవిత్వ సింధువులో నేనొక బిందువు"-అని వినయంగా అంటున్న కవి ,"చుట్టూ వున్న చీకటి ఇంతగా వెక్కిరిస్తుంటే నేనొక మిణుగురునై చిన్న పద్యానికైనా శ్రీకారం చుట్టకుంటే ఎలా?"-అని తడి వాక్యాలు రాస్తున్న కవి మంత్రి కృష్ణ మోహన్. ఒక మంచి కవితా సంపుటిని అందించినందుకూ ఆ కవిని అభినంస్తున్నాను.ఉత్తమ కవిత్వం రాయాలనుకునే యువ కవి మిత్రులకు ఇలాంటి కవిత్వం విరివిగా చదవమని చెబుతూ...వచ్చే మంగళ వారం మళ్లీ కలుద్దాం.

by Rajaram Thumucharla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i2JivZ

Posted by Katta

10, జూన్ 2014, మంగళవారం

Rajaram Thumucharla కవిత

కవి సంగమం ------------ చదివిన కవిత్వ సంపుటి - 32 ^^^^^^^^^^^^^^^^^^^^^^ పరిచయం చేస్తున్న కవిత్వ సంపుటి :- " ఒక కత్తుల వంతెన " కవిత్వ సంపుటి నిర్మించిన(రాసిన) కవి :- "చం." అని పిలువబడే చంద్రశేఖర శాస్త్రి సంపుటిని పరిచయం చేస్తున్నది :- "రాజారామ్ .టి "దృశ్యమాన ప్రతిభకు నిలువుటద్దం చం. కవిత్వం బాలాంజనేయులు ఎంత సుందరుడు! ఆపిన కారు అద్దంలోనో అమ్మ కంటి పాపల్లోనో తన అందానికి తాను మురిసిపోతుంటాడు. సూర్యుడే వ్వ్డికి తొలి అనియత గురువు ఉదయాన్నే నిద్రలేపి మూతికి ఎరుపు రంగు పులుముతాడు ప్రకృతిలోని పచ్చదనమంతా వాని ముఖంలో ప్రతిఫలిస్తుంది మొలలో దోపుకున్న తోక ప్రశ్న గుర్తులా తొంగి చూస్తుంది అట్ట కిరీటం,ఊలు దారాలతో ఎంత అందంగా ముస్తాబవుతాడు" ఈ కవితా పాదాలు నావి కావు.నేనన్నవి కావు.’చం.’-అని పిలువబడే చంద్రశేఖర శాస్త్రివి."ఒక కత్తు ల వంతెన"-అనే కవితా సంపుటిలోనివి."బాలాంజనేయులు"-అనే కవిత లోని ప్రారంభ వాక్యాలివి. పగటిపూట వేషంతో రోడ్డు మీద ఎవరికీ ఎవరూ ఏమి కానట్టు నడుస్తున్న మనుషుల మధ్య ఏవో కొన్ని కళ్ళయిన తమ మీద పడి ఎంతో కొంత ఇవ్వకపోతాయా పొట్ట నిండక పోతుందా అని ఎదురు చూసే పిల్లల్లో ఒక బాలుని విషాదరేఖా చిత్రం ఈ కవిత. డార్విన్ మనిషి పుట్టుక కోతి నుంచే అన్నాడు.ఆడుతూ పాడుతు గడపాల్సిన బాల్యంలో బతుకు బండిని లాగుతూ రామాయణంలో ఆ ఆంజనేయుడు సంజీవిని మోస్తే కుటుంబ భారాన్ని మోయడా నికీ ఆ ఆంజనేయరూపాన్ని ఆ బాలుడు ఆలంబన చేసుకోవడం కేవలం యాధృఛ్చికం కాదేమో? రామాయణ పాత్రలతో,అందులోని సంఘటనలతో అనుసంధానిస్తూ వొక గడ్డకట్టిన దుఃఖసాంద్రత ను కరగించే తీక్షణతని చం. ఈ కవితలో నిక్షేపించాడు. "బాలాంజనేయులు ఎంత సుందరుడు!"-అనే వాక్యంతో ప్రారంభమైన ఈ కవిత "కనిపించిన ప్రతి వాడి ముందు చేయి చాచి దీనంగా యాచిస్తుంటాడు నా కళ్ళ ముందు జవాబు లేని ప్రశ్నలా మిగి లిపోతాడు"-అనేమాటలతో ముగుస్తుంది. ఆ బాలాంజనేయ వేషం వేసుకున్న ఆ బాలుడు అక్షర ఙ్ఞానం లేకున్న అణువంత చైతన్యంతో జీవన వ్యాకరణం వంటబట్టిన తనంతో, బాల కాండను ఆనందంగా గడుపుతూ…..అనుభవిస్తూ….. అమ్మ కంటి పాపల్లో తన అందం చూసి మురిసిపోయాడనటం ఒక అద్భుత భావచిత్రం. ఆపిన కారు అద్దంలో తన అందం చూసుకొని మురిసిపోయాడని రాయడంలో ఈ కవి ఆ బాలుడు ఏ వేషం వేసుకొన్నాడో ఆ వేషపు జాతి లక్షణాన్ని స్ఫురింపచేస్తున్నాడు.కోతులు అద్దం కనిపించగానే ఏంచే స్తాయో మనకు తెలుసు.ఇట్లాంటి పరిశీలన చేయడం,ఆ పరిశీలనను తన కవిత్వంలో అవసరమైన చోట్ల ధ్వనింపచేయడం చం. చేస్తుంటాడు. "బాల కాండ ముగిశాక బడికెళ్తే సుందర కాండ/లేకుంటే కిష్కింధకాండ/వాడిని కోతిని చేసిన ఘనత మనదంత"-ఈ మాటల్లో ఆ బాలుని దుస్థితికి కారణం ఈ వ్యవస్థేనన్న స్ఫృహని కలుగజేస్తాడు. ఈ కవితలో చాల వరకు ప్రతిపాదంలో సందర్భోచితంగా రామాయణ మహకావ్యా న్ని స్పృశిస్తూ మనం ప్రగతిని గురించి మాట్లాడుకోవాలంటే ముందు అలాంటి బాలాంజనేయుల్ని వీరాంజనేయుళ్ళుగా ఎదగనివ్వాలన్న పరిష్కార సూచనని చేస్తాడు చం.రోడ్ల కూడళ్ళలో ఈ బాలాంజనేయుల్నీ చూసిన ప్రతి సారి ఈ కవిత నా వెంట నడిచినట్లుగానే వుంటుంది. అనంతపురంలో ఎక్కడ సాహిత్య కార్యక్రమం జరిగినా అక్కడ తనదైన ప్రత్యకతతో ప్రత్యక్షమయ్యే చం. అంటే కవులందరికీ ఎంతో యిష్టం.ఇంగ్లీషులో CHUM అంటే సన్నిహిత మిత్రుడని (CLOSE FRIEND).నిజంగా ఇతను చం. ఎంత సుధీర్ఘ వచన కవితే అయినా ఏ పేపర్ లేకుండా గొప్ప ధారణతో పాదరసంలా జారిపోయే గొంతుతో చదివే ఇతని పద్దతి బహుశా ఇష్టపడని కవి ఇక్కడ లేడేమో? "సామాజికంగా రాసిన కవితలు ఆలోచింపచేసేవే కాదు ఆవేశింప చేసేవి"-అని సి.నా.రె చం. కవితల్ని గురించి అంటే,"చం. కీ దృశ్యమానం చేసే ఒక గొప్ప నైపుణ్యం వుందని" కె.శివారెడ్డి చెబుతాడు."పదాలకు రూపాన్నివ్వటంలో మంచి శిల్పి"-అని దర్భశయనం అంటాడు చం.గురించి. "రెండో సహస్రాబ్ది తుది సంధ్యలో"-చం. ఒక దృశ్యం చూశాడు. ఎప్పుడూ నిండుగా తృప్తిగా వుండే చం. అసంతృప్తి కలిగించే సన్నివేశాన్ని ఎలా చూశాడో ఇలా చెబుతాడు. "గుంజ మీద ప్రకాశిస్తున్న సత్తు గ్లాసును నేను చూశాను/వంగి వంగి దండాలు పెడుతున్న నల్ల సూర్యున్ని నేను చూశాను"అంటూ తాను చూసిన యథార్థ వ్యథార్థ దృశ్యాన్ని చూపిస్తూ.."కాంతి పరావర్తనం చెందకపోతే ప్రకాశముండదు"-అనే శాస్త్ర సంబంధ అంశాన్ని జోడిస్తాడు. ఇంకా ఈ కవి తానేం చూడాలనుకుంటున్నాడంటే మూడో సహస్రాబ్దిలో ఇలా చెబుతాడు. "సత్తుగ్లాసు విస్ఫోటనం నేను చూడాలి. నవ భారతం తెల్ల తామరై వికసించాలి వెలుగు రెక్కలు చాపి వేకువ పిట్టలెగరాలి రెండు గ్లాసులు ఒకటవ్వాలి" దళిత ఉద్యమాల పట్ల చం.కు సానుభూతే కాదు సహానుభూతి కూడా వుంది.అయితే ఈ ఉద్యమాల వైఫల్యాలకు వెనకున్న కారణాల మూలాల అన్వేషణ గురించి చేయకుండా కేవలం ఉపరితల కారణాలను మాత్రమే ఇలా ప్రస్తావించాడు. "ఔను సూర్యునికి స్వార్థపు తేలు కుట్టింది సహ పంక్తి భోజనం జరిగింది ఆర్భాటంగా ర్యాకీ ముగిసింది ఫోటోలకు,మీడియా ప్రచారానికి కొదవేంలేదు అంటూ కేవలం ప్రచార పటాటోపాలకు పరిమితమయి ఆ ఉద్యమ అలలపై గుర్తింపు కోసం ఎగెరెగిరిపడే వాళ్ళను విమర్శ చేస్తాడు. నల్లచెరువులో ప్రశ్న గుర్తులా వికసించిన నల్ల కలువ తెల్లారకముందే చతికలబడుతోంది సత్తుగ్లాసు మాత్రం పగలబడి నవ్వూతూనే ఉంది" రెండుగ్లాసుల సంస్కృతిపై తన నిరసనని కవిత్వం చేసి తెలిపే కవిగా చం. ఎదుగగలిగాడు. మదర్ థెరీసా మానవి మాత్రమే కాదు మానవత్వ్వానికీ ప్రతీరూపం.ఆమెను "మనిషి మనిషిని మింగాక/మానవత్వం మసిబారాక/నాడు నేడు మరునాడు తోడుగా/నిలిచింది నీలంచు నూలు చీర" అనే చిన్న మాటలతో మన ముందు నిలబెట్టడమే కాదు ఆమె లేని తనం భారత దేశానికీ ఉత్పాతం అని ఒక మౌననరాగం ఆలపిస్తాడు. అనంతపురం ప్రాంతంలో వో మారు కరువు కరాళ నృత్యం చేసింది.ఈ నేల మీదే కాదు ఏ నేల మీద అయిన మట్టిని మాణిక్యపు బంగారుగా మార్చగలిగే రైతు జీవితం విషాదం అయ్యేది అన్నం మెతుకుల్ని రాలుస్తాయనుకునే వాన చినుకులు కత్తులు దూసినప్పుడూ,సేద్యపు విసుర్రాయిలో రైతు జీవితం నూక నూకయినప్పుడు,కల్తీ విత్తనాల,ఎరువుల మోసాలకు దోమ పోట్లకు పంటలన్ని పూల రేకులయి రాలిపోయినప్పుడు..ఆ రైతు జీవితం చావు నే ఆశ్రయించింది. ఆ సందర్భంలో అనంతపురం కవులు కళాకారులు రైతు ఆత్మ విశ్వాస యాత్ర చేశారు.ఆ సమయంలో చం."నీ వొ క్కడివి బ్రతికుంటే చాలు "-అనే కవిత రాసి జిల్లా అంతటా చదివాడు. "వీరుడా! నాగలి యోధుడా! నిస్సహాయంగా నీవు కూలిపోతుంటే మేమెలా బతుకగలం ఏ ఆశతో నిబ్బరంగా ఉండగలం" అంటూ వొక దైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని కలుగజేసే ప్రయత్నం చేశాడు."నీవెప్పుడూ ఒకరికి పెట్టిన వాడివే /ఎవరిముందు చేయిసాచి వాడివి కాదు"అంటూ రైతు గొప్పదనాన్ని గుర్తు చేసి చచ్చిపోవాలనుకున్న కోరికను తగ్గించే ప్రయత్నం చేస్తాడు."నీ దుక్కిలో విత్తనమవుతాం /నీ చేలో సత్తువవుతాం /మా కన్నీళ్ళను వాన చినుకులు చేస్తాం"-అని అంటూ రైతులో ఆత్మ విశ్వాసాన్ని ప్రోది చేయాడానికీ యత్నిస్తాడు."వస్తున్నాం నిన్ను రక్షించుకోవటానికి /మా ప్రతిఙ్ఞ వృథా కాదు" అన్న ధృఢ నమ్మకం కలిగించే మాటల్నీ గొప్ప సంకల్పంతో అంటాడు.ఈ కవిత ఆనాడు కరువు పాటకు చావు దరువేసినప్పుడుజ్ నిరోధించే పోరు గీతంగా గానం చేయబడింది. సంఘటనలు అనేకం సంభవిస్తూ వుంటాయి.కవులు వాటికి అనుకూలంగానో ప్రతికూలంగానో వారి ఆలోచనల బట్టి స్పందించి కవిత్వం రాస్తూవుంటారు.ఈ కవి కూడా తాను చూసిన,విన్న సంఘటన లకు తనదైన ఆలోచనతో కవిత్వం రాశాడు. బుద్దుడు నవ్వినప్పుడు అంటే భారత్ అణుపాటవ పరీక్ష చేసినప్పుడు,రెండు భేదాలతో దళితులు ఘర్షణ పడ్డప్పుడూ,కాశ్మీర్ లో ఉగ్రవాదం శాంతి గీతాలాపనకు శతఘ్ని నాదాలను తోడు చేసినప్పుడు ఇంకా అనేకానేక హృదయ విచలిత దృశ్యాలకు తన కవితల్ని తోడు చేసి మనల్ని వాటి వెంట ఆలోచిస్తూ నడిచేటట్లు చేస్తాడు. "ఎర్ర పుప్పొపిడి నింపుకున్న మంచు పూలతో నిలువెల్లా ఎర్రబడ్డ ఆపిల్ తోట"-అనే పోలికతో కాశ్మీర్ ని ఊహించి విధం హృదయాన్ని హత్తుకొంటుంది.ఇట్లాంటివెన్నో పోలికలు చం. కవితలో ఎన్నో అలవోకగా నడుస్తుంటాయి."ఒకని బాధ , మరొకనికి నవ్వు /ఎద్దు పుండు కాకికీ ముద్దు సదూ!"-లాంటి సామెతలు నుడికారాలు మరి ఏరి ప్రయోగించి తన శిల్పాన్ని సంపన్నం, చేసుకొంటాడు."నల్ల కలువ వికసిస్తేనే వెన్నెలకు నిండుదనం"- "చద రంగంలో నల్ల కలువలు గెలవాలి"-అని ఈ కవి దళితుళ్లో తానెవరివైపో చెప్పకుండా ఇరువురి విజయాన్ని కాంక్షించే దృక్ప థాన్ని కన బరుస్తాడు. స్త్ర్రి వాదాన్ని బలపరుస్తూనే అకారణంగా విడిపోతున్న స్త్రీపురుష సంబందాల విఛ్చిన్నతను ఈ కవి ఎంతో సుకుమారంగా వ్యాఖ్యానిస్తూ కవిత్వం చేశాడు. "కుసుమ మనస్విని నేను నిను చేరి వికసించలేను వీడి వాడి రాలిపోలేను రెండికీ చెడిన రేవడినైనా పురుషాహంకారానికి దాసిని మాత్రం కాను" అంటూ "ప్రణయ కలహాలు పండుటాకులై వసంతంకై ఎదురు చూసే మోడును కొమ్మలు నరికి, పేళ్ళు ఏరుకొనే మంద భాగ్యులు మహిలో కలరు"-అనే వ్యంగ్య నీతి బోధని కూడా చేస్తాడు ఈ చం. మీ కందరికీ గుర్తు వుండే వుంటుంది బషీర్ భాగ్ లో పోలీసు కాల్పుల్లో ఓ ముగ్గురు పోరాట మరణం చేశారని.ఆ దృశ్యాన్ని కవి స్వయంగా చూడలేదు.కానీ విన్నాడు మీడియాలో దర్శించాడు.ఎంత కోపం కలిగిందో తెలీదు కానీ కవి ఆగ్రహం ఆ సంఘటనకు కారణమైన ప్రభుత్వ పతనం కోరుకుంది.ఆ తరువాత అదే జరగడం ఒక యాధృఛ్చికమే. "రక్షించు నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ భ్రాంతి నుంచి విజన్ ట్వంటీ ట్వంటి కలలనుంచి ఆంద్ర ప్రదేశ్ సైబరాబాదన్న విభ్రాంతి నుంచి నేతి బీరకాయల పథకాల నుంచి చెంబు పెట్టి తపేలా ఎత్తుకపోయే సామ్రాజ్యవాద తత్వం నుండి" ఈ మాటల్లో తిలక్ " ప్రార్థన" వాసనలు కనిపిస్తున్నాయి కదా!.తన ధోరణిలో కవితను ఈ కవి చెప్పొచ్చు.కానీ తీవ్ర వ్యంగ్యతను తెలపాడానికీ ఆ కవితకు పేరడి రూపంగా రాశాడేమో నని నా అనుమానం.అంతే కాని తిలక్ ని అనుసరించడం కానీ సంగ్రహించడం కానీ చేసేంత భావ దారిద్ర్యం చర్య గుణం చం.లో లేదు.చం.కవిత్వ నిర్మాణ శిల్పంలో ఆరితేరిన వాడు అని చెప్పడానికీ అతని "అవ్వ "-అనే కవిత వొకటే చాలు. "ఇటు అమ్మ-అటు అవ్వ దుప్పటిలా ఆక్రమిస్తారు నా బాల్యంలో,నా జీవనంలో సగపాలు వారిదే." ఇలా ఈ కవి తన ఉఛ్చ్వాస నిశ్వాసాల్తో నిరంతరం భ్రమణించే వాళ్ళను గురించి ఒక నోస్టాల్జియా తో గొప్పగా కవిత్వం చేసి ఒక సాంస్కృతిక శోభను ప్రకాశింప చేస్తాడు.కవితలకీ శీర్షికలను ఎన్నిక చేయడం వొక కళే.ఈ కళ చం.లో ఎక్కువ."సుజాత"-అనే కవిత ఈ సంపుటికీ కిరీటంలా నిలుస్తుంది. సుజాత ఒక ఙ్ఞాపకం మరపు రాని మధురానుభూతి సుజాత అప్పుడు........ ఎంత అందంగా వుండేది" అంటూ ఈ కవితను మొదలేట్టి సుజాత ఒక మనిషి కాదని సాయంత్రమయ్యేసరికీ అందర్నీ సాదరంగా ఆహ్వానించే వొక సాధరణ కాఫికేఫ్ అని తనే చెబుతాడు.ఆ చెప్పటంలో అనంతపురంలో వుండే కవులను,రచయితలను,విమర్శకులను పేర్లు చెప్పకుండానే వారి రచనల ప్రస్తావనతో గుర్తుకుతెస్తాడు.సుజాత ఒడిలో సేద దీరింది శివరామ్,శేషశాస్త్రి, అంజిబాబు,సైదాచారి ఇమ్కా ఆశావాది ప్రకాశరావు,శేషేంద్ర,రమణజీవి,మల్లెల,బండి నారాయణస్వామి ,రాయుడు,రాచపాలెం,యక్కలూరి శ్రీరాములు ఇలా ఎంతో మందిని మరో సారి ఆ "ప్రియురాలి రహస్య చర్మంలాంటి మీగడ తరకల ఙ్ఞాపకాలలోకి ఈ కవిత తీసుకెళుతుంది.అప్పటి సుజాతకు ఇప్పటి ఈ హోటల్ కు ఎలాంటి సారూప్యం ఇప్పుడు లేకపోవడాని కారణం "గ్లోబల్ గాలానికీ అది చేపగా దొరకటమే అనే ఆలోచనను కవి ఇస్తాడు.నిజానికీ అప్పుడు ఆ సుజాతకు ఈ కవులు కళాకారులే గొప్ప అతిథులు.కాని వ్యాపారికరణ మొదలయ్యింతరువాత ,వ్యాపార తత్వం ముదిరింతరువాతా ఎర్పడే పరిణామాలు ఇలానే వుంటాయని చెప్పడానికీ ఈ కవిత మంచి ఉదాహరణ. ఇలాంటి సుజాతలు ఎక్కడైనా వుంటారు అందరి అనుభవంలో పాతబడి చిరిగిపోతున్న వర్ణచిత్రంలా వెలిసిపోతుంటారు. కరువు ,పేదరికం ఒక్కటే కాదు ఈ సీమ వెనుకబాటుకూ సాయుధ ముఠాల హింస కూడ ఒక ప్రధాన కారణం.దాన్ని ఈ చం. గుర్తించాడు. సీమాంతర నేపథ్యమైన ఫ్యాక్షనిజం పైన కూడా మంచి కవిత్వం రాసి తన కవిత్వం అసమగ్రం కాదు అని నిరూపించుకున్నాడు. ప్రియురాల్ని 'చినుకు రాల్చని మేఘం'గా,గుప్త నది గా పోలిక చేసిన ఇతనిలో ఉన్న ప్రణయ భావనలు కూడా మంచి కవిత్వంగా నిలుస్తాయి. " వాడే సృష్టి,వాడె స్థితి వాడే లయ కారుడు వాడిదే ప్రపంచం ప్రపపంచానికి పర్యాయ పదమ్ వాడే"-అని కర్త,కర్మ.క్రియ అయిన మానవున్ని కీర్తించిన ఈ కవి "ఎంత తాగినా /దాహం తీరటం లేదు /ఇదో సముద్రం" వంటి హైకూలూ కూడా రాశాడు ఈ సంపుటిలో. కవిత్వం "ఒక సంభార సందోహలం /సమూహ సమరోత్సోహా సంరంభం /క్రాంతి మయ జ్వాల /సముడ్ర ఘోష,నిరసన గీతిక /ప్రాతినిధ్య గొంతుక,/పోరాట నినాదం /అంతరంగ ఉద్వేగం /అంతర్ముఖీనత...ఇలా పోల్చిన ఈ కవి నిజంగా కవిత్వ,కవుల ప్రియుడు.ఈ చం కవిత్వాన్నీ ఆఘ్రాణించమని కవి సంగమ కవులను కోరుతూ.. .మంగళ వారం మళ్ళి మరో సంపుటి పరిచయంతో కలుద్దాం.

by Rajaram Thumucharla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qjjQ56

Posted by Katta

3, జూన్ 2014, మంగళవారం

Rajaram Thumucharla కవిత

చదివిన కవిత్వ సంపుటి :- 31 ( కవిసంగమం ) చదివిన కవిత్వ సంపుటి పేరు :- " ఆకుపాట " ( కవిత్వం ) కవిత్వ సంపుటి రాసిన కవి :- " శ్రీనివాస్ వాసుదేవ్ " సంపుటిని పరిచయం చేస్తున్నది :- " రాజారామ్.టి “ “మనసు కాగితంపై తడి ఆరని ఓ వర్షపు సంతకం శ్రీనివాస్ వాసుదేవ్ కవిత్వం” " నువ్వేమో వెన్నెలా నేనేమో వాన "-అని అనుకొంటూ 'వర్షం లాంటి అసూయ పడే ప్రేమ " కోసం మనసంతా వర్షం లో తడపటానికీ "ఆ నాలుగు వర్షపు చుక్కలూ గుండెని తడిపి మరీపలకరింపు"చేయడానికి,"ఓఅక్షరమో వానకారుమేఘమో తట్టిలేపడానికీ ,"కాగితంపై వచ్చి పడుతుంటాయి వడగళ్ళ వానలా" "నిన్న వర్షంలో పట్టుకున్న వో బిందువులా " ఓ షెహనాయీ వేదనతో శ్రీనివాస్ వాసుదేవ్ కలం నుండి కాగితంపై తడి ఆరని సంతకంతో దివ్యానుభూతితో కొత్త భావనతో కవిత్వాక్షరాలు రాలి "ఆకుపాట "ని ఆలపించాయి. వర్షం అంటే ఎవరికైనా హర్షం కలుగక మానదు.శ్రీనివాస్ వాసుదేవ్ తన "వర్షం"-అనే కవితలో "వర్షం నా బలమైన బలహీనత" అన్నాడు. అందువల్లనేమో రాయాల్సిన సందర్భమొస్తే చాలు వర్షం గురించి కనీసం ఒక వాక్యమైనా రాస్తాడు ఈ సంపుటిలో చాల కవితల్లో.ఆ వాక్యాలే పైన నేను అన్నవి ఆయన గురించి. ఏకంగా "వర్షం"._(నా బయో గ్రాఫర్) అనే కవితను వర్షం పైన రాసేశాడు. "వర్షించినప్పుడల్లా ఓ కన్నీటి కథ ఓ షహనాయీ వేదన... వర్షవాకిళ్ళ వేదం,వాన చిగురు వేదాంతం కాగితప్పడవల సయ్యాట,చూరుపై నుంచి వానపాట మనసుపై తడి ఆరని ఓ సంతకం వర్షమెప్పుడూ ఓ అద్భుతం" ఓ అపురూప దృశ్యమే.కురుస్తున్న ప్రతి వాన చినుకు నేలను చేరే సమయంలో ఒక గోళం ఆకృతిలో వుంటుంది.చేయి చాచి అడిగినప్పుడల్లా అవి అనునయిస్తూ అరచేతిని తడిపినాయట.శ్రీనివాస్ ఊహా ఒక చాంపేయమాలల కవితంతా అల్లుకపోయింది ఈ కవితలో.షహనాయి స్వరపు దుఃఖపు జీరలా వాన చినుకు సవ్వడి ఓ కన్నిటి కథను చెబుతుందన్న భావమే వాసుదేవ్ ని విభిన్నమైన కవిగా నిరూపిస్తోంది. "వర్షంలో తడిసి తడవకుండా చేతిని బయటకు చాచినప్పుడల్లా చూరునుండి భారమైన చుక్కలు ఙ్ఞాపకపు నీడల్లా... ప్రతి గోళం ఓ కథ చెప్తూనే ఉంది ఓ ఙ్ఞాపకాన్ని వొదుల్తూ తమకంగా!" ఇందులోని భావ చిత్రం మన మనసులో ఒక గాఢముద్రనే వేస్తుంది.ఙ్ఞాపకాలతో బరువెక్కిన వాన చుక్క చెప్పే కథని విని చేయి దాన్ని వదిలేస్తుంటే ..ఆ వర్షపు నడుము చుట్టూ తన చేతులు వేసి కౌగలించుకున్నట్లు కవి ఊహచేసి కొత్త భావాన్ని,కొత్త దివ్యానుభూతిని ఇచ్చినట్లు అనిపిస్తుంది. నిశ్శబ్దంగా కురిసే వాన చినుకుల సడిని ఈ కవి ఆకాశపు నిట్టూర్పులుగా ,మనసు బావురమని అన్నప్పుడు అది కురిసిన కన్నీటి బొట్లుగా పోలిక చేయడం, ప్రతి వర్షాన్ని ఒక సంగీత విభావరిగాగా సంభావించడం కవి ఎంతగా ఊహల ఊయల్లోకీ వెళ్ళిపోయాడో "వర్షం" కవిత మనకు చూపిస్తుంది. కవి ఎంతగా వర్షాన్ని తమకంతో ఇష్టపడ్డాంటే వర్షం తన కథని రాసే బయోగ్రాఫర్ అని అనేంత. స్వర్గం నుంచి భూమ్మీదకు పరిగెత్తుకొంటూ వచ్చి ఆ భూమిలోకి వెళ్ళి మాయమయ్యే వర్షం ముక్తిని చెప్పే ఓ పాఠంగా కవి తాత్వికంగా చెబుతాడు.ఈ "వర్షం"-కవితలో ప్రతి పంక్తిలో కవి మెస్మరైజ్ చేసే పోలికల్ని ప్రతిభావంతంగా ప్రయోగించాడనటానికి ఎంతమాత్రం సందేహపడను. "వర్షం " కవితని చదివి రాసేటప్పుడు ఈ కరువు నేల మీద ఓ నాలుగు చినుకులు రాలటం కేవలం యాధృఛ్చికమేనేమో? ముప్పైరెండు బొమ్మలు చెపిన కథలు కొరవి గోపరాజు సింహాసనద్వాత్రింశిక లో పద్యంలో చెబితే ఆకులు చెప్పిన అరవైనాలుగు కథలు మైనంపాటి మైనంపాటి సుబ్రహ్మణ్యం శర్మ వచనంలో చెబితే డెభ్బైఏడు గుడి మెట్లు చెప్పిన కథల్ని శ్రీనివాస్ వాసుదేవ్ వచనకవిత్వం చేశాడు.అయితే శ్రీనివాస్ చెప్పిన తీరు వేరు.వాళ్ళంతా అనేక పద్యాల్లో, అనేకవందల పుటల్లో చెబితే ఈ కవి ఓక్కొక్క గుడిమెట్టు చెప్పే కథని ఆ మెట్ల చేతనే పాఠకుడే ఊహించుకునేటట్లు ఒకటి రెండు వాక్యాల్లోనే చెప్పిస్తాడు.ఆ యిద్దర్ని తక్కువ చేయడానికీ కాదు ఈ పోలిక నేను చెప్పింది.అసలు ఆ ఇద్దరికీ ఈ కవికీ సాదృశ్యమేలేదు. బొమ్మలు,ఆకులు కథలు చెప్పినట్లే గుడిమెట్లు కూడా చెబుతాయి కథల్ని అని చెప్పడానికే పోలికలు చెప్పాను. "గుడిమెట్లు-ఓ శిథిల కథల సంచిక"-అనే ఈ కవిత తనకి ఈ ప్రపంచాన్ని ఇచ్చిన అమ్మని, చేతుల్లోంచి జారిపోయిన తీర్థంలా వెళ్ళిపోయిన అమ్మని తలుచుకుంటూ,ఆమె ఙ్ఞాపకాలను తిరిగి గుర్తుకుతెచ్చే గుడిమెట్లను వొక అంతర్లీన దుఃఖంతో శిథిలకథల్నిచెప్పినట్లుగా శ్రీనివాస్ రాసిన కవిత ఇది. "గుడికన్నా ముందే పలకరించే /ఆ డెభ్బైఏడు మెట్లూ డెభ్బైఏడు కథలు"-అని ఈ కవితని కవి ఆరంభిస్తాడు. ఒక్కో గుడిమెట్టును ఎక్కుతూ వెనక్కినెట్టేస్తున్న అనుభవానికీ తను లోనైతే అతని అమ్మ మాత్రం గతాన్ని ఎక్కడో కలిపేసే ఆలొచనలో వున్నదని చెబుతూ,మెట్టు చివర మొలకెత్తుతున్న గడ్డి మొక్క,కాలానికి లొంగిపోయిన శంఖం పువ్వు,దేన్నుంచో విడివడిన సంపెంగ రెమ్మా ఇవన్నీ పలకరించి ఒక్కోక్కటీ జీవితానికి సరిపడ తమ కథలు చెప్పాయని కవి అంటాడు.ఆ అనడంలోనే గడ్డిమొక్క,శంఖం పువ్వు,సంపెంగ రెమ్మలకు మానుషత్వాన్ని ఆరోపించి వాటి వెనుక దాచేస్తే దాగని కథల్ని పాఠకుడు వూహించుకుండేటట్లు చాస్తాడు. "అమ్మ అంటూనే ఉండేది నీతో గుడికిరావడం 'ఓ అనుభూతిరా' అని అదేంటో అర్థంకాని వయసు! ఎన్ని అనుభవాల్ని అక్కడ కథలుగా వదిలిందో అమ్మ మెట్లపొడుగునా ఇపుడు ఙ్ఞాపకాల శిలాజాలే" భూమిపొరల్నిఎంతో లోతుగా తవ్వుకొంటూపోతే ఆ లోపలిపొరల్లో పూర్వజీవుల జాతుల అసలు రూపాలు కప్పబడి వాటి వునికిగా నిలిచిన రూపాలనే శిలాజాలు అంటారు.'శిలాజం అనే పదాన్ని ప్రయోగించి కవి ఎంత లోతైన భావాన్ని ఈ కవితలో పొదిగాడో అర్థం చేసుకోవచ్చు."చీర కొంగుతో చెయ్యి తుడుస్తున్న ఆమెలో తెల్లరంగు అద్దుకున్న నవ్వు"ని కవి చూశాడట.ఆ నవ్వుకి అర్థం అపుడు తెలీకపోయినా,ఇపుడు గతాన్ని ఇలానే చూడాలని అవగతమయ్యిందట. అంటే తెల్లరంగు అద్దుకున్న నవ్వుతో చూడాలని.తెల్ల రంగు స్వఛ్చతకీ ప్రతీక.గతాన్ని అట్లా చూసే తత్వం అలవరుచుకోవడం అంత సులభమా?-చాలా లోతైన భావ పరంపరల్ని ఈకవి మనకొదిలేసే విద్యలో కడు నేర్పరిలా అగుపిస్తాడు ఇలాంటి వాక్యాలను రాసి. ఇదే కవితలో ఇంకో చోట " జీవితపుటల్లో అందమైన బుక్ మార్క్ ఈ గుడి మెట్లు"-అని అంటాడు.బుక్ మార్క్ అనే పదం కంఫ్యూటర్ కు సంబంధిన పారిభాషిక సాంకేతిక పదమే కావచ్చు.కానీ ఈ కవి ఆ పదాన్ని ఆ ఆలోచనలో వాడినట్లు లేదు.పుస్తకం చదువుతూ మధ్యలో ఆపేసినప్పుడు గుర్తుగా కొందరు అందమైన నెమలీకలు వాడేవారు.ఇప్పుడు పుస్తకానికి అనుబంధంగా ఒక రిబ్బన్ లాంటి దారాన్ని ఏర్పాటు చేస్తున్నారు.చదివి ఆపేసిన తరువాత పుటల దగ్గర ఆ రంగుల రిబ్బన్ దారాన్ని వుంచడం వల్ల తిరిగి అక్కడనుంచే చదువుకుండే అవకాశం కలుగుతుంది.జీవితపుస్తకంలో ఆ గుడిమెట్లు ఓ బుక్ మార్క్ లా వుండి మళ్ళీ ఆ పుస్తకాన్ని తిరిగి చదువుకోవడానికీ,అంటే ఙ్ఞాపకం చేసుకోవడానికీ.ఇంతటి విస్తృతార్థాన్ని ఒక మాట బిగింపులో కవి శ్రీనివాస్ వాసుదేవ్ సాధించే ప్రయత్నం చేస్తాడు చాలా కవితల్లో. విశాఖ బీచ్ చేత కానీ సముద్రం చేతకానీ ఆకర్షంపబడనికవి వుంటాడనుకోను.మహాకవి శ్రీ శ్రీ సైతం విశాఖ మీద 15 ఆశ్వాసాల ప్రబంధం రాస్తానని రాయలేదు.విప్లవ కవయిత్రి విమల విశాఖ సముద్రాన్ని సౌందర్యదృష్టితో "ఉదయం నీరెండలో..అలలు బద్దకంగా వొళ్ళు విరుచుకొంటాయని ,అలలు తీరానికేసి తలలు బాదుకొంటాయని,సముద్రం గుండెలో చీకటి బాకులా రాత్రి గుచ్చుకుం టుందని,అప్పుడు అలలు నల్లగా పైకి లేస్తాయని అంటుంది వొక కవితలో."కిటికీ రెక్కల మల్లే కొట్టు కొంటూ జీరాడే అలల కుచ్చుల కర్టెన్లు తేలిపోతూ కిటికీలా విశాఖ సముద్రం"-అని రవూఫ్ అనే కవి ఆ సముద్రాన్ని అద్భుతంగా వర్ణించారు.శ్రీనివాస్ వాసుదేవ్ కూడా విశాఖ బీచ్ ని ఒక నోస్టాల్జియా గా చెబుతు ఆ సముద్రపు అలలపాటలను తన సొలిలాక్విలో వొక భాగంగా పోలుస్తాడు.సముద్రం ఏ కచేరిలో చూడని వాయిద్యపరికరాల ద్వనిని తన అలల శబ్దంతో మోసుకొచ్చిందనే ఒక భీతవహ ఊహని ప్రవేశపెడతాడు "నేనూ, నా సముద్రం"అనే కవిత ఆరంభంలో. "కంటి బిగువున అదిమిపట్టలేని దుఃఖంలా ఫెళ్ళుమన్న గుండె రోదించినట్టు ఉవ్వెత్తున లేచిపడే నిలువెత్తు కెరటం! వేయి మృదంగాలాఘోషగా ఆరంభమై శృతి చేసుకొంటున్న సితారలా ఒడ్డుపై వాలిపోతు" ఎంత ఊహాతీతంగా ఈ కవి సముద్రపు అలల సంగీతాన్ని ఊహ చేశాడో ఊహించండి ఒకసారి ఈ కవి సంభావన శక్తి ఏమిటో ద్యోతకమవుతుంది . తనతోనే,తనలోనే వుండే సముద్రాన్ని " ఎవరో స్త్రీ అని అరచారని చెప్పిన ఆ అరచింది కవే అని ఆ స్వరంలో మనం గుర్తించవచ్చు.కవి హృదయం పొందిన ఏ అనుభూతైనా అక్షరరూపం దాల్చి కవిత్వం కావాలి.కానీ కొన్ని అనుభూతులంతే కలాన్ని కలవరపెట్టితుఫాను మేఘంలా కురవకుండా కమ్మేసి పోయినట్లు కొన్ని మధురానుభూతులు కూడా కవిత్వమవ్వవని కవి ఎంతో వెతల వెక్కిళ్ళ మధ్య చెబుతూ అవి వెన్నెలని పట్ట్కొని జేబులో పెట్టుకోనివ్వవని,వర్షాన్ని తాగనివ్వవని అనుభవపూర్వక ఙ్ఞానంతో చెబుతాడు. "మట్టి ముద్దల్లోను,రాళ్ళ రాసుల్లోనూ అర్థంకానివన్నీ వుంటాయి దేవున్నో,దేవతనో చూడమన్నారు ఇక్కడే.. కళ్ళు మూసుకున్న చీకట్లో దండం పెడుతూనే ఉంటాను చిరునామా అవసరం లేని దేవుడికీ" ఈ దేవుడికన్నా మూరెడు మల్లెలు,మూడక్షరాలూ, చెప్పే కథలు-వీటన్నిటిని కవిత్వీకరించుకోవడమే తనకి ముఖ్యమని అక్షరాలే దేవుళ్ళని కవి తీర్మానించుకొంటాడు. ఈ కవి తన సంపుటిలో ఒక ఎలిజీ రాశాడు.ఎలిజీ అంటే ఆత్మీయులైనవారు కానీఉ,ప్రసిద్దులైన వారు కాని మరణిస్తే వారి స్మృతికి అంకితంగా రాసే రచన.సాధారణంగా ఎలిజీలు కరుణరసాత్మకంగా వుంటాయి.కొన్ని ప్రబోధాకాలుగా కూడ వుండొచ్చు.ఈ కవి కూడా వేగుంట మోహన ప్రసాద్(మో) చనిపోతే ఆయన చితి ని చూసి చింత చేశాడు ఒక ఎలిజీ రాసి."అక్షరమో...అనుభవమో"-అని దానికి శీర్షిక వుంచాడు.కవిత్వపు జిలుగులు తెలియనివాడు,కవితా హృదయం లేని వాడు కాదు వేగుంట మోహన ప్రసాద్.అత్యంత ప్రతిభావంతుడైనా ఈ అదునిక కవికొరకు శ్రీనివాస్ రాసిన ఇందులో "ఓ దిగులు కర్ర వేలాడుతోంది మెడపై పదానికీ పద్యానికీ ఇరుక్కున్నాననీ కొన్ని 'మో' లు ఎక్కువయ్యాయనీ.."-అని మో కవిత్వ వ్యక్తిత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు. పుట్టినప్పుడు పురిటి వాసన ఆడపిల్లేనా అని మూతి విరిచిన ముదితల ఆడిపోసుకొనే మాటల్లో "అమ్మా! నా డిబ్బి పగలకొట్టనే"-అని రోదిస్తున్న జోగిని స్వగతం గురించి చెప్పినా,"ఖబడ్దార్! మా గొంతు నొక్కాలంటే"-మళ్ళీ మా పాటలపై మాట్లడావంటే మా ప్రతి పాటా మీ మరణశాసనమవుతుందని ఛాందసుల దాడికీ గురైన కాశ్మీరీ యువతుల మ్యూజిక్ బ్యాండ్ నిర్వహనని గురించి రాసినా,స్వేచ్చ కోసం ఏడు చువ్వల్ని పట్టుకున్న ఖైదీల గురించి రాసినా,ఖ్మేర్ రోజ్ దురాగతాన్ని చెప్పినా,"ఎంత అందమైన పువ్వైనా వాడిపోక తప్పదన్నట్లు"-జీవితాన్ని ప్రశ్నించి నిర్వచించిన మరణాల్నీ వర్ణించినా,"ఈ గ్రాఫిటి గీతలు,గోడమీదికి దిగివొచ్చిన హరివిల్లులని"అనుకుండే వారిపైన నిషేధం విధిస్తూ చట్టం చేయాడాన్ని నిరసించినా,"ఇక్కడ చెట్లూ,దేహాలూ కాలుతుంటాయి కొన్ని కాలడం కోసం పుడితే కొన్ని పుట్టడం కోసం కాల్తాయి"-అని మలేసియా అడవుల్లో రబ్బరు తీసే ఉద్యోగంలో జాడల్ని కోల్పోయిన వారిని అభివర్ణించినా,"పలకరించలేని నిస్సహయత.."తో "అర్థం కాని దేహ సంశయం"తో-"జీవన మర్మంలో అర్థంకానీ దేహ మర్మమంతో ఊగిసలాడే ట్రాన్స్ జెండర్,దేహంలోపై భాగం స్త్రీగా,దిగువభాగంపురుషుడిగావున్న వార్ని చింత్రించినా శ్రీనివాస్ ప్రతిభా మన కళ్లను తప్పించుకోలేక ఇట్టే దొరికిపోయి ఆలోచనా సముద్రంలోకీ మనల్ని లాక్కెళుతుంది. అఫ్సర్ "ఆధునిక జీవన శకలాలుగా జీవిత విశ్వరూపం చూపించిన కవిగా ఈ కవిని గుర్తిస్తే,"తనదయిన ఒక ఆకాశాన్ని కోసుకొంటూ రాలిన కన్నిటీ చుక్కలను లోకంతో పంచుకుంటున్న కవి అని హెచ్చార్కే అంటే "బతుకు రంగుల కోరస్ ఈ కవి కవిత్వమని యాకుబ్ చెబితే నౌడురి మూర్తి గారు మాత్రం "కొందరి కవిత్వానికీ అనుభూతి,కొందరికీ ఆవేశం,కొందరికీ ప్రతీకలు,కొందరికీ పదబంధాలు,కొందరికీ గమకం లేదా తూగు,ఇలా ఒక్కోక్కరికీ ఒక్కొక్క ప్రత్యేకత వుంటుంది.ఈ ఆకు పాట వీటన్నిటి సమ్మేళనం"-అని అన్నారు. వీళ్ళ అభిప్రాయాలతో ఏకీభవించని వారు ఎవరూ వుండరు ఈ కవిత్వ సంపుటి చదివితే.నిజంగా ఈ సంపుటి "కవిత్వ కిర్మీరం".అంటే అనేక వర్ణాల కలయిక. బహుత్వ తత్వానికి(pluralistic philosophy ) ఈ కవి కవిత్వం ఒక ఉదాహరణం అని నేనంటాను. Smorgasbord అనేది అన్ని రుచులు వుండే విడివిడిగా వుండే పదార్థాలతో వడ్డించే స్కాండినేవియన్ బఫెట్ .దాన్ని విడివిడిగానైనా తినొచ్చట.లేదా కలుపుకొనైనా తినొచ్చట.ఈ పోలిక ఎందుకు తెస్తున్నానంటే ఈ సంపుటిలోని కవితల్నీ కలిపి చదువుకోవచ్చు.విడివిడిగానైనా చదువుకోవచ్చు.ఎలా చదువుకొన్నా కవిత్వపు గాఢత గాని,సాంద్రతలో చిక్కదనం గానీ ఎంత మాత్రం తగ్గినట్టు అనిపించని మంచి కవితల్నీ ఈ శ్రీనివాస్ వాసుదేవ్ ఈ సంపుటిలో వడ్డించాడు కవిత్వ ప్రియుల కోసం. ఓ చెట్టు కిందో,ఓ మేఘం కిందో మనసు పరచి మాట్లాడాలని వుందని కాంక్షించే ఈ కవి ఇంకా ఎన్నొ అద్భుత కవితల్ని వేలార్చినా స్థల.కాలాభావాల కారణంగా తాత్కాలికంగా విరమిస్తున్నా. Being,becoming,belonging ఈ ట్రినిటిలో నువ్వేమిటి కవీ?-అని ప్రశ్నించే ఈ కవి "మనసు మాట విననప్పుడల్లా ఓ కవితా వాక్యం పుడుతుందే నీ నుంచి-"అని కవికీ భరోసా ఇస్తాడు శ్రీనివాస్ వాసుదేవ్. "మనసుందని ప్రేమించలేను...మనసే ప్రేమయినప్పుడు నువ్వు లేవనీ అనుకోలేను. ప్రేమ నువ్వైనప్పుడు "-అని అనే ఈ కవి ప్రేమను గూర్చి కూడా తనదైన తాత్వికతతో పుష్కలంగా రాశాడు."ప్రేమ అడుగుల చప్పుడు గుండెలపై సున్నిత మోత/చీర కుచ్చెళ్ళకీ సంగీతముంటేనా"-ఇలాంటి అందమైన సుకుమార ప్రణయ మృదు భావనలేమీ కొదువలేదు ఈ కవిత్వంలో. కవి మిత్రులను శ్రీనివాస్ వాసుదేవ్ వినిపించే "ఆకుపాట" వినండని కోరుకుంటూ వచ్చే మంగళ వారం మరో సంపుటి పరిచయంతో కలుద్దాం.

by Rajaram Thumucharla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1wW4pnX

Posted by Katta

27, మే 2014, మంగళవారం

Rajaram Thumucharla కవిత

కవి సంగమం చదివిన కవిత్వ సంపుటి – 30 కవిత్వ సంపుటి పేరు : " రాతి చిగుళ్ళు " రాసిన కవయిత్రి పేరు : " శైలజామిత్ర" పరిచయం చేస్తున్నది : "రాజారామ్.టి " "సౌందర్యాత్మకతకు అద్దం శైలజా మిత్ర కవిత్వం " ఎప్పుడో సరిగ్గా గుర్తు లేదు కానీ వొక పుస్తకావిష్కరణ సభలో అనంతపురంలో వొక కొత్త స్వరం జ్వలించే జీరతో భాస్వరమై ఆవేశంతో మండటం విన్నాను.ఎవరా అని వాకబు చేస్తే ఆ స్వరం శైలజామిత్రాదని ఇపుడిపుడే చిగురిస్తున్న కవిత్వపు "రాతిచిగుళ్ళు" అని చెప్పారు.ఆ రోజు కనిపించి వినిపించిన శైలజా మిత్ర కవితా స్వరం వేరు. ఈ రోజు పదునెక్కి, వగరెక్కిన ఆ స్వరం కఠిన రాతి చిగుళ్ళు సైతం సౌందర్యాత్మకతతో చిగురించి వికసించునట్లు కవిత్వం చేసింది. "నిజం చెబుతున్నాను” అంటూ. కవిత్వంతో " ఏ బొమ్మ గీసినా" "నన్ను నన్నుగా"గుర్తించమనే శైలజా "నేను నేను గానే" వుంటానని చెబుతూ "మహానగరపు నీడలలో" జీవించినా "స్త్రీ ఏకాక్షరం కాదు"-అనే "ఒకానొక స్వప్నం " నిజం చేసుకొన్న కవయిత్రి. "తప్పదు...! మనం మళ్ళీ జన్మించాలి...! కష్టాలను కనికరించి,దుఃఖాన్ని దూరం చేసి పతనంతో పోరాడి,మరణంతో మారాం చేసి తప్పదు... మనం మళ్ళీ జన్మించాలి"-అని అందర్నీ కోరుతున్న కవయిత్రి శైలజా మిత్రా. "అదే భూమి...అదే ఆకాశం అదే గాలి,అదే నీరు, అదే వెలుగు,చీకటి"- అయినా మనం మళ్ళీ ఎందుకు జన్మించాలి అనే ప్రశ్నకు సమాధానంగా "చెట్టు కొమ్మపై ఒదిగి కూర్చున్న పిచ్చుక కోసం అప్పుడే పుట్టి గంతులేసే లేగదూడ కోసం... రా రమ్మని పిలిచే సముద్రపు అలల కోసం ఒంటరైన చందమామ కోసం వసంత ఋతువు కోసం ... మళ్ళీ మళ్ళీ జన్మించాలనే కోరికను గాఢంగా వ్యక్తపరుస్తున్న కవయిత్రి శైలజా మిత్ర. "మృత్యువంటే శరీరానికి సంబంధించిది కాదు మనసు ముక్కలయినపుడే మృత్యువు మనల్ని చేరినట్లే శ్మశానమంటే నిశ్శభ్డాన్ని అలుముకున్నది కాదు ఎవరూ లేరని తెలిసినపుడే శ్మశానంలో మనం వున్నట్లే"- ఇలా మరణం శరీరానికి కాదు మనసుకు అది ముక్కలయినప్పుడు , మనం అనుకున్న వారు లేకపోవడమే శ్మశానంలో వున్నట్టు వుంటుందనే ఒక చింతనను కల్గిస్తున్న కవయిత్రి శైలజామిత్ర గారే. గువ్వ ఎగరకుండా వుండదని, కొమ్మ ఎదగకుండ వుండదని, సూర్య బింబం బయటకు రాకుండా వుండదని జరిగేవి ఏదో జరుగుతుందన్న భయంతో ఆగవని కాల స్వభావాన్ని,ప్రకృతి ధర్మాన్ని ఈ మాటల్లో ఇలా తెలియబరుస్తున్న కవయిత్రి శైలజా మిత్ర గారే. "వేటగాడు పొంచి వుంటాడని గూటిలో గువ్వ దాక్కోదు ఎప్పుడో ఒకప్పుడు గొడ్డలివేటు పడుతుందని కొమ్మ ఎదగటం ఆపదు రహస్యాలన్నీ బయటపడుతాయని సూర్యబింబం సముద్రంలో దాక్కోదు" వ్యవస్థలో కవి తాను అనుభవిస్తున్న వొంటరితనం, యంత్ర నాగరికతా విషపు కోరల మధ్య ఇరుక్కొని పడుతున్న వేదన, పొందుతున్న దుఃఖం, నలుగురిలో తన గుర్తింపు కోసం పడే తపన,చివరికీ తనను తాను కోల్పోతున్న బాధ ఇవ్వన్నీ చివరికి అతన్ని లేదా ఆమెను అస్థిత్వపు వెదుకులాలోకి నెట్టివేస్తాయి.అట్లాంటి సందర్భంలో వీటన్నిటిని కవిత్వం చేయాల్సివచ్చినప్పుడు ఎంతో మథనానికీ గురవుతుంటారు.ఇట్లాంటి మథనం కవయిత్రి శైలజామిత్ర లో కూడా గుర్తించవచ్చు.ఇందులో ఈవిడ అనేక కవితల్లో సామాజిక అస్థిత్వాన్ని , వైయుక్తిక అస్థిత్వాన్ని సాంద్రతరంగా చిక్కదనంతో ఆవిష్కరించారు. "నేను నా హృదయ పాత్రను విస్మరించలేను నన్ను భరిస్తున్న భరతమాత పరిష్వంగాన్ని పరిత్యజించలేను హిమశిలా శ్రేణులపై చరిస్తున్న నేను వేరెవరికోసమో బతుకలేను మాసిన మనసులు తిరిగే ప్రపంచంలో నా నీడను కూడా భరించలేను మెడపై పడుతున్న కత్తి వేటుకు భయపడి తల వంచుకొని మౌనంగా నడువలేను ప్రేమ చినుకులకు చేతులు అడ్డుపెట్టగలనేమో కానీ పూర్వ స్మృతుల్ని మర చిపోలేను" గుండెతో పాటు శరీరం కూడా ఈ ప్రపంచం కోసమేనని తప్పించుకోలేనంటూ కవయిత్రి తన అస్థిత్వం ఎందుకోసమో చెబుతారు. అద్దంలో ముఖం మసకబారుతుందని అయిన తన ముఖాన్ని మార్చుకోలేనని కవయిత్రి తన అస్థిత్వాన్ని చాటి చెప్పుకొంటుంది. "విస్మరిస్తున్న హృదయ పాత్ర "-అనే ఈ కవిత ఎత్తుగడ తిలక్ "ఆర్తగీతం" ఎత్తుగడలా మనకు అనిపిస్తుంది. తిలక్ "నా దేశాన్ని గూర్చి పాడలేను, నీ అదేశాన్ని మన్నించలేను ఈ విపంచికకు శృతి కలుపులేను "-అని ఆరంభిస్తే శైలజామిత్ర " నేను నా హృదయ పాత్రను విస్మరించలేను నన్ను భరిస్తున్న భరతమాత పరిష్వంగాన్ని పరిత్యజించలేను "-అని ఆరంభించింది. అంత మాత్రాన తిలక్ ని శైలజామిత్ర అనుసరించదని చెప్పను. తిలక్ తన గుండె గూడు పట్లు కదిలిన సన్నివేశాలని కనులు వరదలై పారునట్లు చిత్రిస్తే ఈ కవయిత్రి జీవితంలోని కరువు , అవేదనని కాచివడబోసి ఏదో కావాలన్న తపనను బాధ్యతను మరచిపోలేనంటూ చిత్రించింది.తిలక్ లోని అనుభూతి ఛాయల్ని శైలజామిత్ర తన కవిత్వంలో ప్రతిబింబించిందని చెప్పడానికే ఈ పోలికను చెప్పాను. "ఒక్క రోజయినా నా ఉనికి ఊహాచిత్రాన్ని"చిత్రించు కొంటూ బతుకంతా బతనిస్తున్న ఈ కొద్ది కాలాన్ని తనవి దీరా కళ్ళకద్దు కోవాలనుకొనే ఈ కవయిత్రి వొకింత విరామ చిహ్నంతో తనను తాను తరచి చూసుకుంటానని చెబుతుంది. .వైయుక్తిక అస్తిత్వపు వెతుకులాట ఈ కవయిత్రిలో ఒంటరితనపు రూపంలో ధ్వనిస్తుంది."ఒంటరి తనం మరింత ఒంటరిగా భరించలేనంత బరువెక్కినప్పుడు "తన భావాలు పరుగులు తీస్తాయని"-అంటున్న పాదాల్లో ఏకాకితనపు దిగులు,ఆత్మీయ సాహచర్యం కోసం పడే తపన "విరామ చిహ్నం"-కవితలో చిక్కనిదనం మేళవించి అనుభూతి సాంద్రతతో చిత్రిస్తుంది. ప్రపంచ ప్రభావం కవయిత్రి మీద పడిందో లేక కవయిత్రి ప్రభావం ప్రపంచం మీద పడిందో తెలీదని శైలజమిత్ర చెబుతూ "ప్రపంచం నా కళ్ళల్లో కొలను అయ్యింది / నేను ఆకొలనులో కలువగా మారాను /ఎవర్ని ఎవరు అల్లుకపోయారో"-అని సంశయం వ్యక్తం చేస్తుంది. తనదైన ప్రపంచాన్ని,తాను ఆ ప్రపంచాన్ని తాను ఎట్లా అర్థం చేసుకుందో 'నేను నా ప్రపంచం"-అనే కవితలో కవయిత్రి ఇలా అంటుంది. "ప్రపంచం పసిపిల్లలాంటిది దరికి చేర్చుకుంటే ఒదిగి పోతుంది తరిమి కొడితే అందకుండా పారిపోతుంది ప్రాణాన్ని ప్రాణంలా ప్రేమను అచ్చమైన ప్రేమలా చూపే ప్రపంచం ఒక వస్తువు కాదు కనిపించకుండా పోవడానికి ద్రవపదార్థం కాదు ఒలికిపోవడానికి ప్రపంచం ఒక గ్రంధం అందులో ప్రతి ఒక్కరూ ఒక గీతా సారాంశం" తన అవగాహనలో ప్రపంచం లోని ప్రతిఒక్కరూ ఒక గీతా సారాంశం అని అనటంలో తాత్వికతను అద్ద్తారు కవిత్వానికి ఈ కవయిత్రి. ఏదయిన వొక ఙ్ఞాపకం మన మనసుల్ని గాయపరుస్తే ఆ ఙ్ఞాపకాన్ని మరువలేకపోయినా అలాంటి దాన్ని ముందుగా గుర్తుకు తెచ్చుకుండే దానిగా ఎప్పుడూ భావించం. కానీ ఈ కవయిత్రి చాల చిత్రంగా ఎంతో గాఢంగా గాయపరిచిన ఙ్ఞాపకాన్ని గూర్చి ఇలా అంటుంది. "ఎప్పుడో గాయపరిచి సరాసరి గుండెలోకి దూసుక పోయిన బాణం ఇప్పటికీ ఙ్ఞాపకాల ముందు వరుసలో ఉంది మానవీయ ప్రదర్శన అక్కడే! నా గుర్తుగా ఉండనీయండి! శరీరం వెదురు బద్దై ఆయుధంగా రూపొందడానికీ కారణం "ఙ్ఞానం మనిషిని శిలగానో,చీకటిగానో మార్చటం”- అని శైలజా మిత్ర చెబుతూ గాజు చెట్లతో నిండిన మానవారణ్యం లోని ఒక చరిత్రని గుర్తుకుతెస్తుంది. ఒంటరి తనం తమ చుట్టు పరుచుకున్న కవులు,అస్తిత్వపు వెతుకులాటలో నిమగ్నమయిన కవులు సాధారణంగా తమ కవితల్లో తాత్విక భావాల్ని వొంపుతుంటారు.మరణం గురించో, జననం గురించో ఆ కవులు తమదైన తాత్విక వ్యాఖ్యానాన్ని కవిత్వం చేస్తుంటారు.ఈ కవయిత్రి జీవితం అనే బండను మోస్తున్న మట్టి నుండి వచ్చిన మనిషిని ఇలా వ్యాఖ్యానించింది. "ఏళ్ళ తరం మోస్తున్న బండను మట్టి మనిషి ఇంత వరకు దించనే లేదు ఇదేదో శిక్ష అనుకొని కొందరు సర్కస్ అనుకొని కొందరు బతికేస్తున్నారు కాళ్ళు చక్రాలై, చేతు భిక్షాపాత్రలై ఏ గమ్యానికి చేరుతారో కానీ అదో వలయం అంతే" మనిషి జీవితానికీ గమ్యం తెలీదంటూ ఆ వలయం ఎక్కడ ప్రారంభం అవుతుందో చివరికీ మళ్ళి అక్కడికే చేరుకుంటుందనే తాత్విక భావాన్ని వ్యక్తీకరిస్తుంది ఈ కవయిత్రి. ఎవరికైనా పక్షపాతం చూపించే తత్వం వుండవచ్చునేమో కానీ మట్టికి వుండదని ఇలా అంటుంది. "మట్టి మమకారంతో కూడిన తల్లి లాంటిది! అందుకే అందర్ని సమానంగా తనలో దాచుకుంటుంది..! జీవిత సత్యాలను బోధ చేస్తుంది..!" బతుకు అతుకుల బొంతయినపుడు నిసించే ఇల్లు ఒక శ్మశానం నిద్ర రాక కనురెప్పలు బరువయినప్పుడు పవళించే పరుపు ఒక సమాధి! అని, నిజం చెబుతున్నానని తగిలిచోటే దెబ్బ తగులుతుందనే వాస్తవాన్ని పేర్కొంటూ,ఒకసారి పగిలిన గుండె చిట్లిపోతూనే ఉంటుంది అతకడం అతికించడం ఒక బూటకమనే యథార్థాన్ని చెబుతూ..చిరాఖరికీ అస్తిత్వానికీ మిగిలేది బూడిదేననే నిరాశను "నిజం చెబుతున్నాను..!"-అనే కవితలో భారంతో పలుకుతుంది. అనేకులు అనేక విధాలుగా అమ్మను తమ కవిత్వంలో ఆవిష్కరిస్తుంటారు.ఈ కవయిత్రి కూడా "మాతృత్వం మృగ్యమౌతుందా"-అనే కవితలో అమ్మలో దాగివున్న ఆవేదనను ,వాత్సల్యం కోసం అలమటించే అమ్మను రూపు కట్టించింది. "ఎక్కడైనా అమ్మ జన్మ గాయాల గేయమే ఎపుడైనా పలకలేని ప్రశ్నల ప్రతిబింబమే వివేకానికందని చక్రగతిలో ఎంత తీవ్రత వున్నా అమ్మ అవతారమే తప్ప ఆయుధం కాదు ఆదర్శం తప్ప అఙ్ఞానం కాదు బిడ్డ వేళ్ళు తాకితే మౌనంగా రేకులు రాల్చే గులాబి" లాంటి అమ్మ సంతానం వీధిలోకి విసిరేస్తున్న రాఇలా నిశ్చలంగా వుండటమే కాదు మాత్ర్త్వాన్ని బతికిస్తుందని ఒక చక్కని భావాన్ని కవిత్వం చేసింది శైలజామిత్ర. కవిత్వానుభూతిని కలిగించే మంచి కవితల్లో "ఇపుడిపుడే నాకు అర్థం అవుతున్నావు !"-అనే కవిత ఈ కవయిత్రి ప్రతిభా సామర్థ్యాన్ని మనకు అద్దం చేసి చూపెడుతుంది.రోజు అంటే,మనిషి అంటే ఏమిటో ,ఎవరో ఒకనిర్వచనమిచ్చి తన నాన్న చెప్పిన అంశాలుగా పేర్కొంటూ,ఆయన నిత్యం చెప్పినవి ఒక్కొక్కటి గుర్తుకొచ్చి ఆయన ఇపుడిపుడే అర్థం అవుతున్నాడని కవయిత్రి మంచి శిల్పంతో ఇలా చిత్రించింది. "నాన్నా! సగానికి పైగా జీవితం గడిచాక ఇపుడిపుడే నాకు అర్థం అవుతున్నావు ఉదయం,మధ్యాహ్నం,రాత్రి కలిస్తేనే ఒక రోజు అవుతుందని స్వార్ఠం,అసూయ,కపటం,అబద్ధం కలగలిపితేనే నేడొక మనిషని నిత్యం నువ్వు చెప్పినవి ఒక్కోక్కటి గుర్తొచ్చి ఇపుడిపుడే నాకు అర్థం అవుతున్నావు" అమ్మకి కొడుకు పైనా,తండ్రికీ కూతురి పైన ఎక్కువ ప్రేమ వుంటుందని మనస్తత్వ శాస్త్రవేత్తలు అంటూవుంటారు.అందుకు గల కారణాలను యూంగ్,అడ్లర్ లాంటి వాళ్ళు విశ్లేషించి చెప్పారు.ఈ కవయిత్రి కూడా అట్లాంటి భావాన్నే ఈ కవితలో పొదిగినట్టుంది. "ఈ జీవితానికీ ఎందుకో సరి కొత్త పేజిలా ఉందీ పూట తరచి చూస్తే నా పుటలన్నింటిలో నీ ఆఛ్చాదనలే ఉన్నాయి. నిజం! నాన్నా! నువ్వు ఏనాడైతే నన్ను వదిలి సుదూర తీరం పయనించి నా కన్నిటి బిందువుగా మారావో ఆ రోజు నుంచే ఎవరికీ ఎవరూ కానట్లు సాగిపోతోంది మన ఇంటి నావ" ఇలా తండ్రి మరణం ఎంత ప్రభావితం చేసిందో చెబుతూ దుంఖపు నదిలోకి మనల్నీ తీసుకెళుతుంది.. ఆస్తులైనా,రోగాలైనా,లక్షణాలైనా సంతానానికి తల్లితండ్రులనుంచే సంక్రమిస్తుంటాయి.ముఖ్యంగా పిల్లలు వారి తల్లి తండ్రుల జీవితాల్లోనికి తరచి చూసినప్పుడు వారి అనుభవాలు అనుభూతులు ఆ పిల్లలకీ స్ఫూర్థినిచ్చేవిగా వుండవచ్చు.సగం జీవితం గడచిపోయాక కవయిత్రి జీవితపు దీపం వెలిగి వెలిగి చివరకు కొడిగట్టేదశలో ఆ అనుభవపు నుసిని ఆదీపం తాలూకునేనని గుర్తించానని ఇలా చెబుతుంది. "నా గుండెలో నిన్నటి వరకు నా కోసమే నేనున్నానని అనుకున్నాను బతుకు సాయంత్రపు గూటిలో కొడిగట్టే దీపం తాలూకు నుసిని గుర్తించి ఆ నుసి గతంలో వెలిగిన దీపం తాలుకేనని ఇపుడిపుడే నాకు అర్థం అవుతున్నావు" నిరాశతో నిస్పృహతో నలిపోయిన జీవితానికీ తండ్రీ తాలూకు ప్రేరణే మళ్ళి వెలుగులు నింపుకోడాని కారణం కావాలని ఆ తండ్రి మార్గమే ఆచణీయమనే భావనను కవయిత్రి స్ఫురింపచేస్తోంది. శైలజామిత్రకీ ఊహాశక్తి బలంగానేవుంది.తాను ఊహించిన భావనను గుండెలో నిలిచిపోయేలా గీయగలిగే నేర్పు ఈ కవయిత్రికి వుంది.తాను చెప్పదలుచుకున్న దాన్ని కవిత్వం ఎట్లా చేయాలో ఈవిడక బాగా తెలుసు.బాల్యంలో పిల్లలు పుస్తకాల్లొ నెమలీ ఈకలు పెట్టుకొని అవి పిల్లలు పెడతాయనే ఊహలో వుండటం అందరికి తెలుసు.మనం అలా చేసేవుంటాము.దాన్ని ఈ కవయిత్రి జీవితానికి అన్వయించి అద్భుతంగా ఇలా చెబుతోంది. "చిన్నప్పుడు నా పుస్తకాలలో నెమలీకలు పిల్లలు ప్ర్ట్టాయంటే నువ్వు నమ్మలేదు ఇప్పుడు చూడు నా బతుకు పుస్తకం మీద రంగు రంగుల రెక్కలు రోజుకో అవతారంలో నాకు ఏమాత్రం సంబంధం లేని పిల్లల్ని తెచ్చి ఎలా పెడుతున్నాయో!" ఈ కవయిత్రే చెప్పుకున్నట్లు "నన్ను ఎవరూ వినడం లేదే అనే ఆవేదన నుండి వచ్చిన భావాలివి.నన్ను నన్నుగా ఎవరూ చూడటంలేదనే నిరాశలోంచి వచ్చిన శైలి ఇది." రాయి కఠినంగా వుంటుంది. చిగుళ్లు సుకుమారంగా వుంటాయి.ఈ కవిత సంపుటిలో అన్ని కవితలు సుకుమార పదాలచేతనే రాయబడ్డాయి.రాతి చిగుళ్ళు అనేది ఒక విరోధభాసం.అందుకే ఈ కవయిత్రి "రాతిచిగుళ్ళ లాంటి మనుషుల మధ్య అంతా మాయ అనే నిజం వుంది"-అని అంటునే అయినా ఎదో పొందాలనే తాపత్రయం వుందని చెబుతుంది.శైలజామిత్ర గారికీ వున్న మరో నేర్పు ఏమంటే తన కవితలకీ అందమయిన శీర్షికలనుంచడం."విస్మరిస్తున్న హృదయ పాత్ర",ఒకానొక బతికిన క్షణం","రాతిచిగుళ్ళు"-ఇలాంటి సార్థక్యపు శీర్షికలు ఆవిడ కవితానికీ మరింత సౌందర్యాత్మకతను చేకూర్చాయి. "గాజు కెరటాల వెన్నెల సముద్రాలు"-అనే ఒక అద్భుత వాక్యమ్ తిలక్ ప్రయోగించాడు.ఈ కవయిత్రి గాజు అనే పదాని చాల చోట్ల ప్రయోగించింది.ఒక్కొక్క కవికీ ఒక్కోక్క పదమ్ మీద యిష్టం అలా పేరుకపోతుందేమో? వచనమయి తేలిపోయే పాదాలను రాయడాన్ని, ప్రశ్నల పరంపరతో కవిత్వంనిర్మించే పద్డతిని,వస్తువును దర్శించే క్రమంలో విస్తృతమైన కాన్వాస్ ని స్వీకరించే పద్దతిని,అన్వయ క్రమంలేని పద సంయోజనం కూర్చే లక్షణాన్ని ఈ కవయిత్రి వదులుకో గలిగితే ఈవిడకున్న ఊహాశక్తికీ భవిష్యత్తులో వొక మంచి కవయిత్రిగా పాఠకుల ఎదలో నిలిచిపోగలదని వొక ప్రామిసింగ్ కవయిత్రిగా నేను నమ్ముతున్నాను. "ఎవర్నువ్వు అని అడగగానే "తెలుగు వాడిని" అనే సమాధానంలో జీవితముంది..!మనిషిగా మనకు మనుగడ వుంది"-అని నమ్మి భాషాభిమానాన్ని ప్రకటించే కవయిత్రి, "ఎన్నో సార్లు మరణించాక ఇక కోలుకోడానికేం మిగిలింది?ఇంకెన్నో సార్లు తిరస్కరించాక ఇక ప్రేమనే పదాని పుట్టుకేముంది"-అని ప్రశ్నించే శైలజామిత్ర ఉమ్మడిశెట్టి సాహిత్య అవార్డ్ పొందిన సందర్భంగా మరో సారి అభినందనలు తెలియచేస్తూ...ఆవిడ పూయించిన "రాతిచిగుళ్ళు" రుచిని ఆస్వాదించమని మిత్రుల్ని కోరుతున్నాను. వచ్చె మంగళవారం మరో కవితా సంపుటి పరిచయంతో కలుద్దాం.

by Rajaram Thumucharla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nqMUb3

Posted by Katta

26, మే 2014, సోమవారం

Rajaram Thumucharla కవిత

తిలక్ లభ్య రచనల సంకలనం పై చంద్రశేఖ్ర శాస్త్రి (చం.) సింగమనేని ,రాధేయ, ప్రేంచంద్,రాజారామ్ అనంతపురం లో ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతున్న దృశ్యం

by Rajaram Thumucharla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mfbDMF

Posted by Katta

Rajaram Thumucharla కవిత

తిలక్ లభ్య రచనల సంకలనం పై సింగమనేని ,రాధేయ, ప్రేంచంద్,రాజారామ్ అనంతపురం లో ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతున్న దృశ్యం

by Rajaram Thumucharla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SEQByx

Posted by Katta

20, మే 2014, మంగళవారం

Rajaram Thumucharla కవిత

కవి సంగమం చదివిన కవిత్వ సంపుటి :- 29 కవిత్వ సంపుటి పేరు " సూర్యోదయానంతరం "(కవిత్వం ) సంపుటి రాసిన కవి "డాక్టర్: ఎస్.షమీ ఉల్లా " పరిచయం చేస్తున్నాది " రాజారామ్.టి "సముద్రపు గొంతులో జల తంత్రుల ధ్వని ష మీఉల్లా కవిత్వం "గుర్తుకు రావట్లేదా నే నెవరో నీకు?"- గట్టిగా దబాయించి …………………………… ప్రశ్నించిన మరుక్షణం ( వెంటాడనిదే ) గుర్తుకు......వచ్చే కవి నాకు షమీఉల్లానే. తమ ఇంట్లో మాట్లాడే భాష ఉర్దూ అయినా తాము నిలబడ్డ నేల భాషలో సజీవ కవిత్వం రాస్తున్న అఫ్సర్, యాకూబ్ ల తరువాత స్కైబాబ ,అన్వర్ ,బా రహంతుల్లా , మహజబీన్ , షాజహానా మున్నగు కవుల వరుసలో నిలువదగ్గ మంచి కవి ష మీఉల్లా. అణగారిన గొంతుకల పట్ల ఆర్తిని ,ముక్కలవుతున్న మానవ సంబంధాల పట్ల నిరసనని, జీవితాన్ని శాసిస్తున్న వ్యాపారధోరణుల పట్ల తిరుగుబాటుని షమీఉల్లా తన కవిత్వంలో పలికిస్తాడు కాబట్టే నేను ఇష్టపడతాను.అంతేకాదు ఏ కవి సమ్మేళనంలోనయిన తనదయిన గొంతుతో ఎలాంటి పేపర్ లేకుండా ఏ మాత్రం తడబడకుండా కవితను చదువుతూ శ్రోతల హృదిలోపలి గోడల్ని తాకుతాడు. "రెండు సంధ్యల మధ్య" గుండెలోని "ఆరని తడి"తో పసి "పాప" "మనసుతనం"తో "నిర్భయంగా" "రహస్తంత్రి " ని మీటుతూ "సూర్యోదయానంతరం " "అంతంతోనే మొదలవుతుంది " అనే "ఒక వెంటాడే విశ్వాసం " తో "తంగేడు పూల చెట్టు " లాంటి " పచ్చని "అతడి పాట" లోని "అత్తరు వాసన "వంటి కవిత్వాన్ని "తుమ్మముళ్ళు" లాంటి "ఒకానొక సందర్భం "వెంటాడనిదే " హృది "గది లోపల" నుండి కవిత్వం విరజిమ్మని అద్భుత కవి ష మీఉల్లా. పాట తూటలాంటిది. తూటా శరీరాన్ని చిధ్రం చేస్తే పాట హృదయపులోతుల్లోకి దూసుకపోయి బ్రతుకు చిత్రన్ని గీయడమో,ఘనీభవించిన దుఃఖాన్ని కలిగించడమో,సంతోషపు దీపకళికను వెలిగించడమో చేస్తుంది.పాట పాదానికీ గజ్జెకట్టిన గద్దర్ పాట షమీఉల్లా హృదయాన్ని జ్వాలా వలయంగా చుట్టుముట్టి మంటయి ప్రజ్వరిల్లి అతన్నొక సంక్షుభిత సాగరం చేసింది.ఆ వయసులో అతడి పాటకు పూర్తిగా లీనం కాని వాళ్ళు ఎవరైనా వుంటారా?.ఈ కవి గుండెతీగలను గద్దర్ పాట లాగి లాగి వదిలింది.ఆ గుండె తీగల ప్రకంపనమే ఈ సంపుటిలో " అతడి పాట "-అనే కవిత. ఒక పాట విన్నప్పుడు కలిగిన అనుభూతులను పట్టుకొని కవిత్వంలో నిలిపిన కవుల వరుసలో షమీఉల్లా కూడా చేరుతాడు. సైగల్ పాట కెరలించిన అనుభూతిని భావ గాఢతతో అఫ్సర్ కవిత్వం చేస్తే షమీఉల్లా గద్దర్ పాట తాకిడి తనలో రేపిన ప్రభంజనాన్ని చైతన్య సాంద్రతతో దుఃఖపు తడిని అద్ది కవిత్వం చేశాడు. "చెబితే నమ్మవు. కానీ!లీలగా మొదలయిన పాట జ్వాలా వలయాలుగా రగుల్కోవడం ప్రారంభమైంది. (అతడి పాట ) ఇలా ప్రారంభమయ్యే ఈకవితలో "అతడి పాట " మునుపెన్నప్పుడూ లేనంతగా కవిలో ఒక అలజడిని లేవనెత్తి "పాట నిండా ఘనీభవించిన దుఃఖమే" పొర్లిపోయే సన్నివేశాలని,"కొడిగట్టిన దుఃఖాల దైన్యాలు గుండెలో మేకులై దిగబడే" సందర్భాలని దర్శింప చేసి కవి ఆనందాన్ని కొల్ల గొట్టిందట. "మంటయి ప్రజ్వరిల్లిన పాటనిండా బ్రతుకును కాటేసిన గాట్లు కన్పించాయి. పాటలో వీరుల్ని సంకెళ్ళు కరచిన వైనం చూశాను. తెగ్గోయబడ్డ తలలు విరగొట్టబడ్డ మోకాళ్ళు దీప కలికలై పాటలో లయిస్తుంటే కొడిగట్టిన దుఃఖాల దైన్యాలు గుండెలో మేకులై దిగబడుతున్నాయి" అంటూ షమీఉల్లా అతడి పాట గీసిన దుఃఖ దృశ్యాన్ని అక్షరాలుగా మార్చాడు. "ఈదురు గాలి తాకిడికీ కిటికి రెక్కలు కొట్టుకున్నట్లు"-అని అనటంలో కవిలో రేగిన అలజడిని స్ఫురింపచేస్తాడు ఈ కవి.అతడి పాటలో కవి తనను తాను వడబోసుకొని తనవీతీరా జీవితాన్ని దర్శించినక్షణం మనకు ద్యోతకమవుతుంది కవితని పరిపూర్ణంగా అర్థంచేసుకుంటే. గద్దర్ పాట కవిలో రేపిన విషాదభరిత విప్లవచైతన్యాన్ని వ్యక్తీకరించిన కవిత ఇది. ఏ కార్యనికైనా ఒక కారణం వుంటుందనిచాలమందినమ్మకం.ఈకవికూడాఒకపాపపక్షిలాగిరికీలుకొట్టడానికీ,ఏటినురగస్వఛ్చంగావుండటానికీ,నవ్వుల రూపంలో పువ్వులు పూచే లక్షణమేదో వుండటానికీ,ఆకులా గలా గల నవ్వటానికీ ఏదో కారణం వుంటుందని వెదుకాలాటను "పాప "అనే కవితలో చేశాడు.ఈ వెదుకులాట ఈ సంపుటిలో చాల చోట్ల మనం గుర్తించవచ్చు మరో రూపంలో. 'బార్లా తెరిచేందుకు కిటికీలున్నట్లు తలుపులు వున్నాయ్ ఏం ప్రయోజనం?! పోల్చుకోలేనంత అస్తవ్యస్తంగా దుమ్మురేగి ధూళి పట్టిన సొఫాలు,కుర్చీలు గోడల మీద వచ్చీ రాని అక్షరాలు కన్పించీ కన్పించని సుద్దముక్కల గీతలు దండెంమ్మీద అడ్డ దిడ్డంగా వేసిన పాత గుడ్డలు సంచరించేందుకు వీలు కానంత చిందర వందరగా చించి పడేసిన కాగితం ముక్కలు పరదాల అంచుల మీద టి.వి స్టాండ్ మీద వేలాడుతున్న బూజు తెరలు చీపురు కట్టతో విదిల్చేందుకు వీల్లేనంతా దట్టంగా బాత్రూమ్ మూలల్లో పేరుకుపోయిన మట్టి దిబ్బలు నిండా చీకటి ముక్కు పుటాలదిరిపోయేలా కమురు కంపు"( గది లోపల ) ఇదంతా గదిలోపల కానే కాదు. కవే” గదికీ.. నాకూ పెద్ద తేడా లేదు”- అని చెబుతున్నాడు. ఇలా అని కవి తన నిజాయితికీ అద్దంలా ఈ కవితని నిలుపగలిగాడు.హిపొక్రసీ పేరుకొన్న లోకంలో కనీసం కవుల్లోనైన నిజాయితినీ కోరుకోవటంలో తప్పు లేదనుకొంటాను. గది లోపల అపరిశుభ్రతకు, అంతరంగంలోని అపరిశుభ్రతకు తేడా లేదని చెప్పడానికీ గదిని అంతరంగానికీ ప్రతీక చేశాడు షమీఉల్లా.తనలోకి తాను తొంగిచూసుకొనే ధైర్యం,నిజాయితీ ఈ కవికీ ఉంది కాబట్టే అలా తొంగిచూసుకున్నప్పుడు అంతరంగం గదిలా వీలుకానంత చిందర వందరగా వుందని ,అనవసరమైన వస్తువుల్లా అనవసర ఆలోచనలూ,తొలగించాల్సిన బూజులా మదిలోని భావనలు వున్నాయని షమీఉల్లా చెబుతాడు." లోనికెల్దామంటే గదియెప్పుడు శుభ్రపడ్తుందో నా కయితే తెలియదు"-అనే సందేహాన్ని వెలిబుచ్చుతూ "ఒక ఎదురుచూపు ఒక ఆశ "-అనే ఆశాభావాన్ని సైతం వ్యక్తం చేశాడు." గాలి,వెల్తురు సోకకపోతే ఏ గదియైనా ఇలాగే వుంటుందేమో?"-అని అనటంలో గాలి కున్న వీచే లక్షణం వుండటం వల్లా చింతన వీయబడాలని, వెల్తురుకు ప్రసరించే గుణం వుండటం కారణంగా ఙ్ఞానం విస్తరించాలని అలా జరిగినప్పుడే గదిలా అమ్తరంగం శుభ్రపడుతుందని కవి ఆలోచన.ఇట్లా ఎవరికీ వారు తమ అంతరంగంలోని అపరిశుభ్రతను తొలగించుకోగలిగితే లోకమంతా ప్రశాంతంగా వుండదా? అని అనిపిస్తుంది నాకు. "సమావేశం పూర్తయ్యేసరికి ఆ ప్రాంతమంతా కోలాహలమౌతుంది. ఒకర్నొకరు కాగడగా మండించుకుని విడిపోతారు ఎవరికీ వారు... విశ్వాసాల గుర్రాలెక్కి" ఎవర్ని గురించి రాశాడో ఈ వాక్యాలు సులభంగా పాఠకులు పట్టేయగలరు."సమావేశం"-అనే కవితలోని వాక్యాలివి.పీడిత,తాడిత జనాల విముక్తి కోసం పోరాడే యోధుల సమావేశాలు ఎలా వుంటాయో వారి సమావేశంలో పాల్గొన్న ఈ కవి తన అనుభూతిని ఇలా అభివ్యక్తంచేస్తాడు. "చుట్టూరా చూపుల ఫిరంగుల్ని సిధ్దం చేసి ఒక్కొక్కరే లేచి మాట్లాడుతుంటారు. ఆ మాటలకి ఉవ్వెత్తున ఎగిసిపడ్తూ.. తక్కినవారు పాశుపతాస్త్రాలు ధరించిన యోధులవుతుంటారు" "డేగ చూపుల్ని సారించి /తుపాకులు, లాఠీలు,ఇనుప టోపీలు.../గూఢాచారుల్లా వెంటాడటం వారికి తెలుసు"-అని అంటూనే వారు ఎంత అప్రమత్తతో వుంటారో కూడా ఈ కవితలో నిక్షిప్తం చేస్తాడు. "వారి నరనరాల్లో కలకలం రణతూర్యమై ప్రతిధ్వనిస్తుంటుంది వారి మాటల డెక్కల కింద మానసికోల్లాసం ముక్కలయినప్పుడల్లా నేను విస్మయానికి లోనవుతుంటాను." అనే షమీఉల్లా అట్లాంటి సమావేశాల్లో తన నిజానుభూతిని చాలా కళాత్మకంగా కవిత్వం చేశాడు ఎలాంటి భయోద్విగ్నతకు గురికాకుండా. "మృణ్మయ పాత్రల్లా ఎన్నిమార్లు ముక్కలయ్యానో ఫెళ్ళున! అనుభవాలకేం కొరత లేదు"-అని అంటున్న ఈ కవి"ఒకానొక సందర్భం"లో "పల్లవించిన ప్రతి ఆకూ ఆగమనానికీ ఆహ్వానమని భ్రమపడి" "మాటలు చాలు మనిషిని చంపడానికి ఈటెలా" అనే సత్యాన్ని కలలకు నిప్పంటుకున్నాక గుర్తిస్తాడు.తడిసి ముద్దయి పోవడానికీ ఒక స్వప్నాన్ని కొంచెం సత్యాన్ని మిగుల్చుకోలేకపోయానని తల్లడిల్లి పోతాడు.ఒక మార్మికతను ఈ కవితలో నింపి షమీఉల్లా రాశాడేమోననిపించింది నాకు. "వాళ్ళలో ఏ ఒక్కరైనా నా భుజమ్మీద చెయ్యి వేసి వీపు నిమరకపోతే నాలో అన్ని వైపులూ మూసుకపోయేవి ఒక పరివ్రాజకుణ్నై అంధకారంలో కల్సిపోయేవాణ్ని తలా ఒక చెయ్యి వేసి చేర్చక పోతే కదన కుతుహలమై కవాతు చేయకపోయే వాన్ని." ఇలా ఈ కవి తనని క్షిపణిగా మలిచిన వాళ్ళని,తనని శత్రుదుర్భేద్యమయిన కత్తుల కవచంగా తీర్చిదిద్దిన వార్ని,తనని ఓ మంటగా పోగేసిన వాళ్ళనీ తలచుకొని కృతఙ్ఞతని వారి పట్ల ప్రకటిస్తాడు.వారెవరో కాదు తాను ఎవరి సమావేశం పాల్గొన్నాడో వారే. మనుషులు చాల రకాలు.వాళ్ళల్లో మాటలతో బ్రతికే వారు ఎన్ని రకాలుగా ప్రవర్తిస్తారో "కొందరు అంతే "-అనే కవితలో వైవిధ్యంగా చెబుతాడు ఈ కవి.మూడు క్షణాలని అరువు తెచ్చుకొని ఆరు క్షణాలు చేసి బ్రతికే వారు,రకరకాల రంగులద్ది సిధ్దాంతలను రాధ్దాంతాలు చేసి బ్రతికే వాళ్ళు,ఏ రోజైనా,ఏవేళయిన మినహాయింపులు లేకుండా కేవలం కాసిన్ని మాటలతో బ్రతికే వాళ్లు ఇలా ఎందరో మనకు తెలిసినా మనం గుర్తించలేని వాళ్ళని తాను గుర్తించి మన ముందు నిలబెడతాడు. "అబద్దమనుకుంటావేమో! అద్దమ్ముందు నిలబడి ప్రయత్నించి చూడు ఎవరు ఎవరో తేలిపోతుంది."-అని అనే షమీఉల్లా "ఎదురుగా నిలబడి అద్దంలో చూసుకోడానికి సంశయిస్తుంటాను ప్రతి రోజూ నన్ను నేను"-అని నిక్కచ్చిగా "అద్దం "అనే కవితలో మనిషిలోని ద్వైధి భావాన్ని చిత్రించడమే కాకుండా "అచ్చు నన్ను పోలిన రూపాల్లో నాగులు,మిన్నాగులు గుమ్పులు గుంపులుగా కనిపించి నాకేసి చూస్తూ నాలుక చాస్తూ బుసలు కొడతాయంటా"డు.అలా అనడంలో మనిషి మానసిక వికృత తత్వాన్నీ ఒక ప్రతీకాత్మకతో స్ఫురించేశాడు. ముఖ్యంగా రాయలసీమలో అందులోను అనంతపురంలోని కవికీ నిత్య దృశ్యాలే సాయుధ ముఠాల చెసే దాడులు ప్రత్యర్థులపైన."మా ఊరి రహదారి "-అనే కవితలో ఈకవి "పగో,కోపమో, మచ్చుకత్తితోనో,వేటకొడవలి తోనో,ముఖాన్ని చెక్కి జనం గుర్తించకుండా పొదల్లో పారవేసిన దేహం"దుర్వాసనతో ఊరి రహదారి పక్కన ఎదురుకావడాన్ని,చెరచబడ్డ శీలం అవమానంతో తలెత్తుకోలేక ఆకుచాటున కన్నీళ్ళు రాల్చే దృశ్యాన్ని ఒకటేమిటి సర్వ ప్రలోభాలకు పరీవాహక ప్రాంతమైన ఊరి రహదారిని మర్చిపోలేక విషాద సమవాకార ప్రతీకగా చేసినా,"రాగాలు కూర్చిన గంటల శబ్దాలు/రహదారికీ సన్నాయి సరాగాలయ్యేవి."-లాంటి వాక్యాలతో మోహనంగా కూడా మారుస్తాడు.ఇది షమీ శిల్ప కూర్పులో ప్రడర్శించే నేర్పే.అందుకే షమీ నాకిష్టమైన కవి మా అనంతపురంలో. "పరారీ"-అనే కవిత కూడా ఫ్యాక్షన్ నేపథ్యంలో రాసిందే. అత్తరు వాసన ముస్లిమ్ ల జీవితాల్తో ఎంత ముడిపడివుందో ,అది వారసత్వపు ఆస్తిలా చావులోనూ,పుట్టుకలోనూ పరిమళమై వారిలో భాగంగా ఎట్లా అంటిపెట్టుకుందో, అలుముకపోయిందో మైనారిటి కవి షమీఉల్లా "అత్తరు వాసన "లో ఒక లాంతరు పట్టి చూపిస్తాడు. "నా వొంటి మీది అత్తరు వాసనంటేనే కుళ్ళిన దుర్గంధం కమ్ముకొస్తుందని కదా..నువ్వంటావు. డోకొచ్చినట్లుగా తల్లడిల్లిపోతావు. తిండానికి లేకపోయినా "అత్తరుకేం తక్కువలేదు నవాబు గారికి" అనే కదా! నా గుమ్మానికి కట్టిన నీ పరిహాసపు పరదాలు" అంటూ తమ సంస్కృతిని ఈసడించుకొని గేళి చేసేవారితో "మా గుండెల్లో గూడు కట్టుకున్న చీకటి విషాదాన్ని చూశావా ఎన్నడైనా"-అని ప్రశ్నిస్తాడు చిరు కత్తిలాంటి మాటలతో.మైనారిటీల జీవితాల్లోని దుర్భరత్వాన్ని "జీవన్మరణ సందిగ్ధరేఖల మధ్య బందీయై ఎప్పటికప్పుడు ఆఖరి క్షణంగా బతుకీడుస్తున్న వాళ్ళలో కుళ్ళిన వాసన కాకుండా మంచి వాసన ఎలా వస్తంది" అనే బాకు లాంటి సమాధానం చెప్పి ఆలోచింపచేస్తాడు. "అత్తరు.. అంతుదొరకని కూడలి దాని వెనకున్న నీలిరాగం చిమ్మ చీకట్లాంటి కన్నిటీ తెర నింగికెగిసి అది నేల కొరిగిన కెరటాల కలవరింత" ఒక నిర్వేదనతో గుండే నిఘంటువు మాత్రమే చెప్పగలిగిన అర్థాన్ని ఇచ్చాడు అత్తరుకీ షమీఉల్లా. ఏ మాత్రం కవిత్వపు అలికిడైనా ఉలిక్కిపడ్తున్నారు. ద్రవంగా మారినట్లు కంటికొలకుల్లో నీరైనిలబడుతున్నారు నవ్వించినా మాటల్లో దించినా..క్షణమే! చూస్తుండగనే కన్నీళ్ళ పర్యంతమవుతున్నారు"- షమీఉల్లా కవిత్వపు పలకరింపుతో ఇక్కడ శ్రోతలు,పాఠకులు."చావుతో కొంతమంది చస్తున్నారు చావుతో కొంతమంది బ్రతుకుతున్నారు" అనే ఒక సార్వకాలిక సత్యాన్ని చెబుతున్న ఓ షమీ "నువ్వేం మాట్లడక పోయిన ఏకాంతంలో నిన్ను నేను పలకరిస్తాను"-అని చెబుతూ ముగిస్తున్నాను. భద్రమైన జీవితం ఏర్పడితే కొందరు కవులు నాలాగా కవిత్వం రాయడం మానేస్తువుంటారు.అట్లా మారకుండా ఎప్పట్లానే కవిత్వంలో ప్రవహించమని షమీకీ అడిగాడు కాబట్టి సలహా యిస్తున్నా. వచ్చే వారం మరో సంపుటి పరిచయంతో కలుద్దాం.

by Rajaram Thumucharla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qPZxQQ

Posted by Katta

13, మే 2014, మంగళవారం

Rajaram Thumucharla కవిత

"కవి సంగమం " చదివిన కవిత్వ సంపుటి :- 28 పరిచయం చేస్తున్న కవిత్వ సంపుటి " సమాంతర ఛాయలు " (కవిత్వం) కవిత్వ సంపుటి రాసిన కవి "మువ్వ శ్రీనివాస రావు " (క్రాంతి శ్రీనివాస్ ) పరిచయం చేస్తున్నది :- రాజారామ్.టి "కవిత్వమంటే సూర్యుడూ చంద్రుడూ కాదు నేలతల్లి చూపుడు వేలి కదలిక కవిత్వమంటే భావనల సౌరభంలో తడిసిన అక్షరచలనాలు మాటల భ్రమణాలు కవిత్వమంటే నిరంతరం పారేది అనుక్షణం మారేది - (భ్రమణ చలనం) “ఇదే కవిత్వమన్నోళ్ళుఇలానే ఉంటుందన్నోళ్ళు" కవులు అనేకులు విమర్శకులు ఎందరో మనకు తారసపడే వుంటారు.కానీ ఖమ్మం కవి మువ్వా శ్రీనివాసరావు మాత్రం భావాలు కురిపించి తనకు తోచినట్టు రాసే కవినని " భ్రమణచలనం" అనే కవితలో చెప్పుకొన్న అతను ఎంత మంచి కవో అఫ్సర్, అరుణ్ సాగర్,యాకుబ్,ఖాదర్ మొహిద్దిన్, ప్రసేన్ ,కె.ఆనందాచారి,బి.వి.వి.ప్రసాద్, సీతారామ్ గార్లు రాసిన మాటలే చెబుతాయి.ఖమ్మం గుర్తు రాగానే పైనపేర్కొన్నవారేకాదు గాలికట్ట విద్యసాగర్,ఈ క్రాంతి శ్రేనివాస్ కూడా ఙ్ఞాపకానికొస్తాడు నాకు. ఎందుకంటే శ్రీశ్రీ ని నాకన్న ఎక్కువ ఇష్టపడతాడు కాబట్టి. "చరిత్ర అయినా,కొందరు మనుషులయినా,కొన్ని సంఘటనలయినా రూపం మార్చుకుంటాయి" కవిత్వంగా మారి బాహ్య స్వగతం అవుతాయంటాడు అఫ్సర్ క్రాంతి కవిత్వ రహస్యాన్ని విప్పుతూ. "ఈ కవిత్వాన్ని ఎవో కొన్ని రెఫరెన్స్ లతో తూచి కొలచి ఒక చట్రంలో ఒదిగించి విశ్లేషించలేనంటూ సాటి కవి అరుణ్ సాగార్ క్రాంతి శ్రీనివాస్ గారి వాక్యాలు "మంచి మాగాణిలో చేసిన అక్షర సేద్యంలో పుట్టాయి"అని వ్యాఖ్యానించాడు."మరణానికీ జీవితానికీ నడుమ తెరల కదలికలోంచి తొంగి చూచే దృశ్యాదృశ్యాల శ్వాస తెలిసిన సమాంతర ఛాయా గ్రాహకుడని" యాకూబ్ కితబునిచ్చాడు. అంతర్ముఖ వ్యాకూల కవిత్వంగా ప్రసేన్ భావిస్తే కె.ఆనందాచారి గారు "ఎంతో వస్తు విస్తృతితో,కవిత్వం కావాలన్న దాహంతో,కలలు కనే మనసుతో అధర్మంపై,అన్యాయలపై అసమ సమాజ దుష్టత్వంపై కవితా యుధ్ధ సైనికునిలా"రాశాడని క్రాంతి శ్రీనివాస్ ని గురించి అన్నాడు."జీవితంలో కవిత్వాన్ని పసిగట్టడంలోనూ,కవితలో సునాయసంగా జీవితాన్ని నింపడంలోనూ కవి నేర్పు కనిపిస్తుందని"బి.వి.వి ప్రసాద్ గారంటే ఖాదర్ మొహియుద్దిన్ "ఖండఖండాలుగా విభజితమయిన జీవన మహాసమరం తాలూకు ఒక మహవృత్తాంతం "-క్రాతి శ్రీనివాస్ కవిత్వం అని అన్నారు.చివరగా సీతారామ్ "ఇతను ముట్టించిన కవిత్వ దీపం ముందు కూర్చోండి " . అని " సమాంతర ఛాయలు" కవైన శ్రీనివాస్ కవిత్వాన్ని గూర్చి అంటాడు. ఈ ఒక్క మాటతో శ్రీనివాస్ కవిత్వం దీపంలా ఎన్నెన్ని అర్థకిరణాలని వెదజల్లుతుందో సీతారామ్ స్ఫురింపచేస్తాడు. ఇందరు ఈ సంపుటిని విశ్లేషించాక మళ్ళి నేనెందుకు రాయడమా? అన్న ఆలోచన ఇన్ని రోజులు ఈ సంపుటిపైన రాయనీయలేదు. కానీ...ఆతరువాత అనిపించింది కవిత్వమనేది అందరు చదువరులకు వొకే రకం అనుభవాన్నివ్వదు అని.ఆ చదువరుల జీవితానుభవం కానీ, కావ్య పఠానుభవం కానీ కవిత్వాన్ని అర్థం చేసుకుండే తీరును ప్రభావితం చేస్తాయనిపించింది.పైగా స్వానుభూతుల నేపథ్యంలో వొక్కో పాఠకుడు వొక్కో కవితను వొక్కో రకంగా అర్థం చేసుకుంటాడేమో?. అందువల్లా నాకు అర్థమయ్యే పరిమితిలో రాయోచ్చు కదా అని అనుకున్నా. " సమాంతర ఛాయలు" చదవడం మొదలెట్టగానే అది "మానవ జీవితానుభవాల పొరలను కెరలించిన కవిత్వంగా అనిపించింది. ఈ కవిత్వ కాంత కాలి 'మువ్వ'ల శబ్దం చిత్రంగా వినిపించి చదివించి మైమరిపించింది. "ఖమ్మం" ఎందుకంత ఎర్రగయ్యిందో,మందార పూలమయ్యిందో క్రాంతి శ్రీనివాస్ భావన నిజమో వూహనో ఊహించలేను కానీ ఈ ఆలోచన మాత్రం గొప్పగా అనిపించింది "1975...పోరాటగాథ " కవిత చదివితే.ఈ 1975 కాలాన్ని చీకటి రోజులు గా చరిత్ర గుర్తించింది." ఏందిరా?"-అని అన్న వ్యక్తిని "ఇందిర"అని అన్నాడని ఖాకీలు నిర్భంధించిన రోజులవి. బియాబానీ -అనే సామాన్య ముస్లిమ్ కుటుంబానికీ చెందిన యువకుని చుట్టూ తిరుగుతూ, ఆ చీకటి రోజుల్లో కాలువలా ప్రవహించిన రాజ్యహింసను,కరకు ఖాకీల దుర్మార్గపు దౌష్ట్యాలను ఈ కవిత గుర్తుకు తెస్తుంది. "మా వూరి మర్రి చెట్టు మీద అర్థరాత్రి మందారం పూసిందని ఖాకీలు కాలువల్లా ప్రవహించాయి తుపాకీ గొట్టాలు తూరుపు మొక్కలను పసిగట్టాయి తెల్లవార్లూ లాఠీలు ఎముకలూ మాట్లాడుకొంటూనే వున్నాయి" తూర్పున ఉదయించేది సూర్యుడే.ఉదయించే సూర్యుడు ఎర్రగా వుండి తిరుగుబాటు సంకేతమవుతాడని కవి మన ఊహకు వదిలేస్తూ ,తూర్పు మొక్కలు అని అనటంలో ఇంకా యవ్వనంలో అడుగుపెట్టని వాళ్ళనే స్పృహని అందిస్తాడు ఈ వాక్యాలా ద్వారా."లాఠీలు ఎముకలు మాట్లాడుకుంటునే వున్నాయి"-అని అనటం వలన ఆరోజుల్లో పోలీసులు ఎంతటి ఘాతుకాలకు పూనుకున్నారో కవి సూచిస్తాడు."మర్రిచెట్టు మీద మందారం పూసిందనే" ప్రతీకాత్మక వాక్యంతో ఊర్లోని పిల్లలో కూడా ఆ పరిస్థితులకు ఎదురుతిరిగే తత్వం ఏర్పడిందనే భావనను ఈ కవి అందిస్తాడు వూరిని ప్రతీకగా చేసి. సగం వూరు నిద్రపోకుండా ఆ పైశాచిక భాషని అనువదిస్తూనే వుంది తల్లి పేగును మాత్రం తప్పుడు తర్జుమాలతో వోదారుస్తూనే వుంది' ఊర్లోని ప్రజలు ఎమర్జన్సీ కారణంగా ప్రజలు నిద్రని కూడ కోల్పోయారని చెప్పడమే కాదు కొందరు ముఖ్యంగా పాలకవర్గాలు ఆ అత్యవసరస్థితిని బలపరుస్తు తప్పుడు సంకేతాలను ప్రజలకీ అందించారనే అంశాన్ని ఈ కవి పై మాటల్లో పేర్కొంటాడు.బియ్యాబానీని క్రాంతి శ్రీనివాస్ సకల జీవులను ప్రేమతో తాకి పలకరించే శిర్డి సాయితో, కాలం దింపిన మేకులతో వున్న ఏసుక్రీస్తుతో ఉపమిస్తాడు.అప్పటి కాలంలో సామాన్యుడైన బియ్యాబానీ వొక అసామాన్యుడిగా చిత్రీకరించబడిన చారిత్రికతను అర్థం చేసుకోవచ్చు."మా వూరికిచ్చిన బహుమతి/బియ్యాబానీ సాక్షిగా/ఇప్పుడు మా వూరినిండా/మందారాలు విరబూస్తున్నాయి'-అని ఈ కవి పోలీసు పాలనలో నలుదిక్కుల పారిన నెత్తుటి కాలువల" ప్రవాహపు ఘాతుకాల వల్లా పెరిగిన ఎరుపును దాని వ్యాప్తి కారణాలను సహేతుకంగా పేర్కొని ఆ ప్రాంత చరిత్రను పరోక్షంగా నమోదు చేశాడు ఈ కవి. చరిత్రతో పాటూ,అప్పటి సామాజిక స్థితిని, రాజ్యహింసను ఒక చారిత్రక అవగాహనతో రికార్డ్ చేసే గొప్ప శిల్పంతో ఆ చీకటి రోజుల భీభత్స సమవాకార దృశ్యాన్ని దృశ్యమానం చేస్తూ ఈ కవి "1975...ఓ పోరాట గాథ" అనే ఈ కవితను రాశాడు. "మహా నగరమంటే బజార్లని ముట్టుకోకుండా లోతయిన లోయలుగా తవ్వుకోవడమేనట" అని చెప్పే ఈ కవి ఇతరకవుల వలె మహానగర జీవితలాలలోని ఛిధ్రతని ,భీభత్స విధ్వంసతని,రొదల్ని మాత్రమే చెప్పకుండా ఈ "మహానగరం" అనే కవితలో మహానగరాల రూపంలోని డొల్లతనాన్ని,"జన సముద్రంలో మంచితనం కోసం వెతుకులాటే"నని ఆ మంచితనం ఏమాత్రం కన్పించదని ,మహానగరం మానవ బతుకుల్ని బహు చౌకగా అమ్ముకొనే తిర్ణాలా అని పేర్కొంటాడు.మహానగరం మనని మనం కొనుక్కుంటే తప్ప మిగలకుండా చేసే ఆర్థిక సూత్రాన్ని కూడా ఈ కవి ధ్వనింపచేస్తాడు.నగరం మహానగరంగా రూపొందే క్రమంలో ఆ నగరం చుట్టు వుండే ఊర్లు నగరంలో కలసిపోతాయి.ఆ అంశాన్ని ఈ కవి "ఉసిళ్ళలా ఊళ్ళన్నీ అక్కడే వాలిపోతున్నాయి"-అనిచెబుతూ నగరాల వెలుగుల భ్రమలో గ్రామాలు ఎలా మాయమవుతున్నాయో స్పష్టం చేస్తాడు."ఉసుళ్ళు" అనేవి వర్షం పడి వెలిసిన తరువాతా పుట్టుకొచ్చే చిన్న కీటకాలు.దీపపు కాంతులకు భ్రమసి ఆ దీపపు చుట్టు తిరుగుతూ జీవితాన్ని చాలిస్తాయి.వీటిని కవితలో పోలిక చేసి ఒక గొప్ప ఊహను పాఠకులకు అందించి వారి అవగాహనను విస్తృతం చేస్తాడు. "ఆరుబయట నులక మంచం మీద ఆరబోసుకున్న నేను బిగదీసిన కాళ్ళ కట్టపై గాలి కెరటాలలో తేలియాడుతూ విశాల విశ్వం నే వీక్షిస్తున్నపుడు శాంతి దీపమేదో లోపల వెలిగి ఆలోచనలన్నీ ఆవిరై ఒకప్పుడు పల్లె ఒడిలో నేను వెన్నెల నీడల్లో మైమరచి విశ్రాంతి పొదేవాన్ని" అంటున్న ఈ కవి " ఇన్ సోమ్నియా"(నిద్ర లేమి)కి కారణమేమిటి?.అందుకు కారణం కూడా కవి క్రాంతి శ్రీనివాస్ "రేపటి జీవిత పరుగు కోసం/మూసిన రెప్పల వెనక రిహార్సల్ వేసుకొంటూ కరువైపోయిన నిద్ర కోసం నిద్రలో కలల కోసం మందులతో కలబడుతున్నాను."అని చెబుతాడు.నిద్రలేమికీ అదొక్కటే కారణంగా చెప్పడు."ఆత్రపు ఆదుర్దా తరంగాలను అదే పనిగా వినిపిస్తున్న కరెంట్ విసనకర్ర","మధ్య మద్యలో కరెంట్ కోతలు కరివటం" కారణాలుగా చెబుతాడు.నిద్ర లేని రాని తనాన్ని ఎంత అద్భుతమైన పోలికతో సాదృశ్యం చేస్తాడంటే "అమ్మ కోళ్ళను గంప కింద కప్పెట్టినట్టు రాత్రి ఒక్కొ శబ్దాన్నీ పట్టుకొని దాచేస్తు పోతుందని".ఒక సాంద్రమైన అనుభూతిని భావ చిత్రాల పదచిత్రాలతో కలిగిస్తాడు. ఫ్యాన్ ను కరెంట్ విసన కర్ర అని అనటం వైచిత్రిగా తోస్తుంది. "24 ఇంటు 7 చిరుత పులి కళ్ళతో చెలరేగుతునే ఇంటింటికీ నిజాన్ని చెప్పాల్సిన" ఫోర్త్ ఎస్టేట్ గా నిలబడాల్సిన పాత్రికేయుడు "లేపాక్షి ఆలయంలో వ్రేలాడేస్తంభమై ఊరేగుతున్నాడు"అని ఈ కవి వ్యాఖ్యానిస్తూ.."గ్రద్ద కళ్ళెట్టుకొని" అతడు చేయాల్సింది చేయక చూడాల్సింది చూడక తెలియజేయాల్సింది తెలియజేయక వున్నాడనే భావాన్ని "దారితప్పిన కన్ను"-అనే కవితలో నిర్మొహమాటంగా చెబుతాడు.జీవితం "అంతా లెక్కే"అని కవి "లెక్కలు రాని మనిషి రెక్కలు తెగిన పక్షి ఒక్కటే"అంటూ ఒక జీవన సత్యాన్ని ఇలా కవిత్వం చేస్తాడు క్రాంతి శ్రీనివాస్. "సంక్లిష్ట జీవిత గణిత శాస్త్రంలో సమాధానాలు దొరికే దాకా ఎవరి సిద్ధాంతం వారు ప్రకటిస్తూ పోతూనే వున్నారు వేల కొట్టివేతల మధ్య నుండి సమాధానం కనుగొనే ప్రయత్నం చేస్తూనే వున్నారు" ఇలా కొన్ని కవితల్లో ఈ కవి తాత్విక భావనల చర్చను లేవదీస్తాడు. "దేహ మాళిగలు"అనే కవిత ఇందుకు ఉదాహరణ. మధ్య తరగతి ప్రజల జీవితాల్లోని కుహన ఆడంబర డాంభికత్వాన్ని,పరువును ప్రాణం కన్నా మిన్నగా చూసుకుండే తత్వాన్ని, రెండు విసురాళ్ల మధ్య పెసర గింజల్లా పగిలి నలిగే వనాన్ని"మధ్య తరగతి ఇప్పుడు మిధ్యా తరగతి మధ్య తరగతిగా మార్పు చెందుతోది "అంటూ ఎప్పుడూ/ఒక సంఘర్షణ ఒక సంక్షోభం" ఆ ప్రజల జీవితంలో ఒక భాగంగా నిలిచివుంటుందనే భావనను ఈ కవి వ్యక్తం చేస్తాడు.ఈ సంపుటిలో వున్న అనేక మంచి కవితల్లో "నేల దీపం "కూడా ఒకటి.కుల వృత్తుల పతనం గ్రామాల్లో జరిగిన వైనం,ఆ వృత్తుల్ని కాపాడుకోవడం కోసం ఏంచేస్తే సమంజసమో ఈ కవి తన తండ్రి చేసిన పనితో కవితను ముగిస్తాడు.మంగలి నారాయణ,చాకలి లక్ష్మయ్య,కుమ్మరి వెంకయ్య లేకుండా పెళ్లెట్లా చెయ్యాలని? సంశయపడే నాన వార్ని పిలిచి చుట్టాలని పక్కన పెట్టి చుట్టలు వాళ్ళ్తో కలసి కాల్చుకొంటూ పల్లెను మళ్ళి పెండ్లి పందిట్లో బతికించాడని-ఈ కవి మనసు తడి అయ్యేలా రాశాడు."పొదిలో పదిలంగా వుండాల్సిన బతుకు"ఛిద్రం కావడాని కారణం మంగల నారాయణ అన్నట్టు రాసిన వాక్యాలు ఇవి.వోడిపోయిన కోడి పుంజుల పాపం ఉత్తినే పోద్దా బాబు"-అని.ఈ మాటల్లో కర్మ సిద్దాంతపు వాసనలు కనిపించినా కవి అలా వారి బ్రతుకులు మారటానికీ గల కారణాలను సరిగ్గానే అంచనా వేశాడు.కుమ్మరి వెంకయ్య నవ్వుని "ఘట వాయిద్యం"తో ఉపమించడం లాంటి శిల్ప రహస్యాల్ని ఎంతో నేర్పుతో ఈ కవి పట్టుకొన్నట్టు గుర్తించవచ్చు. జీవితం జారిపోకుండా,జావగారిపోకుండా వుండేందుకు మహ నటుడిగా మారిపోయే మానవ బలహీనతల్నీ కూడా ఈ కవి నిజాయితితో చిత్రించాడు. "క్షమించకు తల్లీ కనీస అర్హతలేని కుహనా ప్రజాస్వామ్యాన్ని క్షమించకు తల్లీ పేట్రేగిన మూర్ఖపు మగ స్వామ్యాన్ని" అంటున్న ఈ కవి స్త్రీవాదం పట్ల సహానుభూతిని అనేక కవితల్లో బలపరుస్తాడు."హక్కుల్లో సగభాగం వస్తుందో రాదో/ఆకాశంలో సగం కాస్తా పాతికయ్యింది" అంటూ గర్భస్థ పరీక్షలతో పుట్టక ముందే మరణం పాలవుతున్న ఫిమేల్ ఫీటస్ ల దుస్థితిని కన్నీటితో "ఉమ్మ నీటి కన్నీరు'-అనే కవితను ఈ కవి చిత్రించాడు. మానవజీవితం నేడు "కరప్టెడ్ సాఫ్ట్ వేర్ "అయ్యిందని అందుకే హార్డ్ వేర్ లోకి కొత్త సాఫ్ట్ వేర్ అయిన ఎక్కించాలి లేదా సిస్టమ్ ను ఫార్మట్ చేయాలి అని ఈ కవి కంఫూటర్ పారి భాషిక పదజాలంతో ఒక కవిత రాసి తన సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించాడు.ఇట్లా ఇంకా కొందరు కవులు కూడా రాసినట్టు ఙ్ఞాపకం. ఇంతకు ముందే చెప్పాను ఈ కవి స్త్రీ స్వామ్యాన్ని ఆహ్వానించేవాడని,నిజాయితిగా దేన్నయినా ఒప్పుకోగలడని."నేను నేను గానే వున్నప్పుడు/ఆమె నాలా మారి/ఆమె ఆమెగానే వుండాలనుకొన్నప్పుడు నన్నామెగా మార్చుతుంది"-అని తన జీవిత భాగ స్వామి గొప్ప తన్నాన్ని అంగీకరిస్తూ..'ప్రేమాన్నం పళ్ళెంలో పెట్టడమే గాక తనను "అప్ డేట్"కూడా చేస్తుందని చెప్పి ఆవిడపై తనకు గల ప్రేమను ,కృతఙ్ఞతను కవితా బద్దం చేశాడు.ఇలా పిల్లల పెంపకం ,వారి చదువులు ఎన్నేన్నొ అంశాలను వివిద కోణాల్లో ఈ క్రాంతి కాంతివంతం చేశాడు.మాములుగా పరువు ఆట్మహత్యలు జరుగుతాయి.కానీ దొర సానమ్మ పోరగాన్ని తగులుకొంటే దొర పరువు కోసం పోరగాన్ని హత్య చేసిన దృష్టాంతాన్ని "పరువు హత్య"అనే కవితగా చేసి "తుపుక్కున ఉమ్మే" ఛీత్కారాన్ని దొరల పట్ల కలిగిస్తాడు శ్రీనివాస్. "బిల్లులో పదో పాతికో రావాల్సివస్తే/వదిలేసి యాభై రూపాయలు ఖరీదు చేసే కృతఙ్ఞత కోసం/బేరర్ మొహం వెదుకులాడే పగిలిన పోయిన మన మొహాల గురించి చెబుతూ"విజయం వెనుకాల/పరుగెత్తడం మానుకోలేం/విజయమ్పై స్వారీ చేయడానికీ సాహసం చేయలేం" -అని జంకు లేకుండా చెప్పగలిగాడు ఈ కవి. ఈ సంపుటిలో ఒక లాంతర్ వెలుతురులా మెరిసిపోయే కవిత "దయ్యాల మాణిక్యమ్మ"."ఎదుళ్ళ చెరువు వాయలో కొరివి దయ్యమొకటి/లాంతర్లు పట్టుకు తిరుతోందట"-అని ప్రారంభమయ్యే ఈ కవిత "ఎవరో లాంతరుతో నడిచిపోయిన చప్పుడు/ధ్యైర్యాన్ని వంపిపోయిన చప్పుడు"-అనే వాక్యంతొ ముగుస్తుంది.లాంతరుతోనే ఆరంభం,ముగింపు ఈ కవిత ప్రత్యేకత. మాణిక్యమ్మ ధైర్యం,కుటుంబం పట్ల గల బాధ్యత,కష్టించి పనిచేసే తత్వం అన్ని ఈ కవితలో కవి రూపు కట్టించటమే కాదు అట్లాంటి స్త్రీల పట్ల సమాజంలో వున్న భావనను కవితలో నేర్పునంతా ప్రయోగించి చిత్రించినట్లు అనిపిస్తుంది.మహిళా సాధికారిక చిహ్నం ఆమె. "చేతిలో పసిది చంకలో చంటోడు కడుపులో ఇంకో కాయ" పై పాదాలు చదువుతుంటే శ్రీశ్రీ" భిక్షువర్షీయసీ" గుర్తుకు రావట్లేదా? ఈ మాటను ఎందుకు అంటున్నానంటే శ్రీ శ్రీ ని ఈ శ్రీనివాస్ అనుకరించాడని కాదు శ్రీ శ్రీ ని ఎంతగా యిష్టపడ్డాడో చెప్పడానికి.వయసు ముడతల మీద భయాన్ని వాలనీయనీ దైర్యపు నీడలా" ప్రతి స్త్రీకీ ఒక ఆదర్శంలా మాణిక్యమ్మ ఆవిష్కరించబడింది. అక్షర కుసుమాలను,మాట మాలలు చేసీ,అప్పుడప్పుడు కవితా పంక్తులు పేర్చుకొంటూ,కవిత్వ దాహం తీర్చుకొంటూ,భావాల్ని భాస్వరంలా మండిస్తూ,అవసరమైనప్పుడు అక్షర ఫిరంగులను మ్రోగిస్తూ..మువ్వ (మువ్వా శ్రీనివాసరావు) తన మ్రోతలో క్షతగాత్రలోకాన్ని ప్రతిధ్వనించిందని చెబుతున్నా.అప్పుడెప్పుడో పుస్తక ప్రకటనలో 'అందమైన క్యాలికో బైండ్"లాంటి మాటల్ని చేర్చేవారు.కానీ ఇప్పుడు ఆ ప్రస్తావనే కనిపించదు.మువ్వా శ్రీనివాస్ తన కవిత్వ సంపుటిని ఎంతో అందంగా చూడగానే చదవాలనే ఒక కాంక్ష కలిగే విధంగా తీర్చిదిద్దాడు.ఈ సంపుటి నాలుగు కాలాల పాటు చెదిరిపోకుండా వుండటమే కాదు ఇందులోని కవిత్వం కూడా చిరకాలం చెదరని ఙ్ఞాపకమై నిలుస్తుందని మిత్రులకీ చెబుతూ..".సమాంతర ఛాయలు"-చదివి మీ కవిత్వ నిర్మాణ నేర్పుని మరింత పెంచుకోగరని ఆశిస్తాను.వచ్చే మంగళ వారం మరో సంపుటితో కలుద్దాం.

by Rajaram Thumucharla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QBV6Iy

Posted by Katta

6, మే 2014, మంగళవారం

Rajaram Thumucharla కవిత

చదివిన కవిత్వ సంపుటి -27 (కవి సంగమం) పరిచయమవుతున్న కవిత్వ సంపుటి :- " లోపలి స్వరం " కవిత్వ సంపుటి రాసిన కవయిత్రి :- "రేణుక అయోల " సంపుటిని పరిచయం చేస్తున్నది :- "రాజారామ్.టి " "చూసిన దాన్నో,చదివినదాన్నో,విన్నదాన్నో 'లోపలిస్వరం"తోకవిత్వం చేసింది రేణుక అయోల నే" "The day I burn" ఆరోజు పదే పదే వెంటాడుతోంది " ఆనందమో,సందేహమో మెదడుని మొద్దుబారుస్తుంది విన్నదే విని,వినీ వినీ పక్షవాతం వచ్చినవాళ్ళలా సొఫాలకి అతుక్కుపోయాక- ఆ కరెంట్ వాడికే మనమీద దయ కలుగుతుంది ఆగిపోయిన టి.వి ముందు నుంచి లేచిన మనం చెర నుంచి విడిపించుకున్న ఖైదీలం.. మన కోసమే మనం కొంత మిగుల్చుకున్న జీవితాలం" ఆ రోజు నిజంగా విన్నదే విని వినీ,చూసిందే చూసి చూసీ సోఫాలో పక్షవాతం వచ్చినవాడిలా అతుక్కూపోయి,ఇది తప్ప మరేదీలేదా? నాకోసం నేను కేటాయించుకొనే జీవితకాలం లేదా?-అని కాలి కాలీ,మరగి మరగి కరగిపోయిన రోజు కరెంట్ పోయి ఆగిపోయిన టి.వి ముందు నుంచి లేచి చెర నుండి బయటికొచ్చి స్వేఛ్చ పొందిన ఖైదీలా హాయిని పొందిన నాకు వినబడిన "లోపలి స్వరం"లోంచి వినబడిన మాటలు ఇవి. రేణుక అయోల గారి వాక్యాలివి. ఆవిడది విద్వత్కవి కుటుంబం.ఆమె ముత్తాత శ్రీ కావ్యకంఠ గణపతిమహాముని. కవిత్వపు జిలుగులు తెలిసిన కవితా హృదయం గల కవయిత్రి.ఒఠ్ఠి హృదయం గలిగిన కవయిత్రే కాదు గట్టి కవిత్వం రాయగలిగిన నేర్పరి ఈమె.ఆమె ఏ చూసిందో,ఏం వినిందో, ఏం చదివిందో వాటిని తన హృదయం ఎట్లా కంపిస్తే అట్లా, జీవితంలోని అతి సాధారణ అనుభవాల్ని సైతం అతి చిన్న వాక్యాలతో,అత్యంత ప్రతిభావంతంగా కవిత్వం చేసిన కవయిత్రి ఎవరంటే రేణుక అయోల గారు. "కాటుక లాంటి అడవి నన్నెవరు చూడరనుకుంది కారు మబ్బులు కమ్ముకొని గాలి అందించిన చినుకు వరదలో అడవి సేద తీరుతోంది"- అడవి తీసుకొనే విశ్రాంతిని ఇంత అందంగా ఎవరు చిత్రించగలరు? "చిన్న విత్తు తనకు తానే భూమిలో ఒదిగి కాలాని నమస్కరిస్తూ లేత చిగుళ్ళతో గున గున ఎదిగి పలరిస్తుంది" విత్తనం అంకురించడం కాలానికీ నమస్కరించడంగా ఎవరూ ఊహించగలరు? "నాగలి పట్టిన చేతులు ఎడ్ల బండిని అదలించిన చేతులు ధాన్యం,కొట్లో నింపిన చేతులు పట్టె మంచం,తెల్లటి బొంత కాళ్ళ దగ్గర రాగి చెంబు తాతయ్య వెంటాడే ఙ్ఞాపకంలా ఉండేవారు" ఇలా తాతయ్య రూపాన్ని మనస్సులో ముద్రించుకపోయేటట్లు రూపవర్ణన చేసిందెవరు? "జనం మధ్యలో మనం,జనంలో ఒకరైన మనం మనకే మనమే అపరిచుతులం పరిచయాల్లేని ముఖాల మధ్య మన ముఖమే మనకి అపరిచితం" సమూహంలో ఒంటరైన మనిషి, తనను తానే గుర్తుపట్టలేని,తన అస్తిత్వాన్ని తానే తెలుసుకోలేని మనిషిని గూర్చి ఇంత తాత్వికంగా చెప్పిందెవరు? అడవి విశ్రాంతిని అందంగా చిత్రించింది,విత్తనం మొలకెత్తే దృశ్యాన్ని కాలానికీ నమస్కరించడంగా ఊహించింది,తాతయ్య ఙ్ఞాపకాలతో ఆయన రూప చిత్రణను కళ్లముందు నిలబెట్టింది,ప్రజా సమూహంలో ఒంటరి అయిన మానవుని అస్తిత్వం ఆ మానవుడే గుర్తు పట్టలేనంత మారిన వైనాన్ని తన "లోపలి స్వరం"తో చెప్పింది రేణుక అయోల గారే. చిన్నప్పటి నేస్తం ఇంట్లోంచి గుర్తు తెలీకుండా వెళ్ళిపోవడమో,సహాధ్యాయి అకస్మాత్తుగా తిరిగిరాని లోకాలకీ చేరుకోవడమో, ఏదో ఒక వ్యసనపు మత్తులో అయినవార్ని,వున్న వూర్ని వీడి వెళ్ళిన వ్యక్తి ఙ్ఞప్తికి రావడమో,శిథిలమైన వూరి ఆనవాళ్ళు కళ్ళ ముందు నిలబడటమో,ఇంట్లోని పాత ఫోటొ గతించిన గుర్తులను తిరిగి తీసుక వచ్చి వొక దుఃఖపు వ్యధను కలిగించడమో,జీవితంలో ఎన్ని మాధుర్యపు అనుభూతులున్నా ఏదో తెలియని ఒంటరితనపు స్పర్శని అనుభవించడమో,చిన్ని పాపల ముద్దు మాటల మోహాంలో మునిగిపోవడమో,వూర్లోని చెరువు అద్దంలో ముఖాన్ని సరిదిద్దుకోవడమో ఎపుడైనా ఎవరికి వారు తమలోకి తొంగిచూసుకోవడమో,ఏదో ఒక రోజు వేసవి సాయంకాలం వర్షానికి తడవడమో,మన మతం కాని వారితో వున్న స్నేహాన్ని బేరీజు వేసుకోడమో,అభివృద్ది పేరిట జరిగే రోడ్డు మార్పుల్లో రూపు కోల్పోయిన చెట్లను చూసి వేదన పొందడమో,ఇంట్లో వున్న పాత సామానును చూచిపారేద్దామా?వుంచుకుందామా?అనేసంశయానికిగురికావడములాంటిఅనుభవాలు,అనుభూతులు అందరి జీవితాల్లోను వుంటాయి.అయితే వీటన్నిటిని కొందరు ఙ్ఞాపకాల బీరువాలో భంద్రంగా దాచుకొంటారు.కొందరు విస్మృతపథంలో వదిలేస్తారు.ఒకరో ఇద్దరో వాటిని మెరిసే అక్షరాలు చేసి నెమలీకలా బతుకు పుస్తకంలో దాచి పదే పదే చూసుకొంటుంటారు. నేటి కాలంలో జీవితం నదిలా సంక్లిష్టాల,సంక్షోభాల,సుఖదుఃఖాల దరులను ఒరుసుకొంటు ప్రవహిస్తున్నది.అట్లా ప్రవహించే మానవ జీవితపు నదిని ప్రభావితం చేసే పైన చెప్పిన అత్యంత సూక్ష్మాతిసూక్ష్మ అనుభూతులు,రోజువారి అనుభవాలు కొందర్ని తీవ్రంగా స్పందింపచేసి అడ్భుత కవిత్వాన్ని రాయిస్తాయి.తన జీవిత నది యానంలో ఎదురైన అనేకానేక అనుభవాల అనుభూతుల స్పందనల్ని, రేణుకసాగేయేరులా,ఊగే సెలయేరులా,నడిచే నదిలా అందంగా,సాంద్రంగా,గంభీరంగా చిక్కటి అక్షరాలు చేసి వాటిని కవిత్వపు దారాలతోఅల్లింది.ఆగిపోని కవిత్వం చేసి తేమ లేని జీవితాల్లో కవిత్వంగా నాటింది. అందుకే "జీవితాన్ని కవితగా మార్చడంలో నేర్పరి రేణుక అయోల"-అని ప్రముఖ కవి, విమర్శకుడు వాడ్రేవు చిన వీరభద్రుడు గారు అనగలిగారు. మనుషుల్లో కవులు విభిన్నంగా వుంటారేమోనని కొందరు భావిస్తుంటారు.అయితే కవులు కూడా మానవులే.ఈ కవయిత్రి తన తాతయ్య మాటల్లో కవుల గూర్చి"లోకం చుట్టూ దారాలల్లుకుంటూ సాలెగూడులో ఈగల్లా చిక్కుకుంటారు"-అంటూ వారి కవిత్వ దాహం పుస్తకాల దొంతరల్లో తీరు తుందని చెబుతారు.కవిత్వం మనిషిని మనిషిలా నిలబెడుతుంది,బ్రతికిస్తుంది అనే ఒక భావనను ఈ కవయిత్రి తన "కవిలోకం" అనే కవితలో బలంగా వ్యక్తంచేస్తుంది.అందుకే"ఎండిపోయిన పూల గింజలను ఏరుకొని కవిత్వాన్ని పూయిస్తారు"-అని అనగలిగింది.పాతిన గింజ అంకురించి కొత్త మొక్కనెట్లా యిస్తుందో అట్లాగే కవులు వారు రాసిన కవిత్వంఏ కాలందైనా చరిత్రను చెబుతూ జీవితంపై మనకు నమ్మకం కల్గిస్తారని ఈవిడ విశ్వాసం.దీన్ని కవిత్వమంతా ఒక అంతర్లీన అంతస్సూత్రంగా నిర్మిస్తూ జీవన సారాంశాన్ని కవిత్వం చేసింది. కవయిత్రి రేణుక గారు తనతో పాటు చదివిన ఉష లేదని తెలిశాక రాసిన 'గాయం"అనే స్మృతి కవిత నిజంగా ఆవిడ మదిలో రేగిన గాయపు బాధంతా ఏకీకృత అక్షరంగా మారితే ఎలావుంటుందో అలా పాఠకుల్ని దుఃఖప్రవాహంలోకి లాక్కెలుతుంది.అందుకే రేణుక తన జీవిత అనుభవాన్ని మన అనుభవంగా మార్చి తన దిశగా ఆలోచింపచేస్తుంది. "గాయం మానిపోతూ పొరలు కట్టుకుంటూ ఆనవాళ్ళను మిగులిస్తుంది ఏ గాలి ఙ్ఞాపకానికో మళ్ళీ చెలరేగుతుంది నిప్పు రవ్వ వచ్చిపడ్డట్లు గాయం రేగుతుంది పొరలు విప్పుకొని నిద్ర జడలు విదుల్చుకొని నాట్యం చేస్తుంది" ఈ వాక్యాల్లోని భావ చిత్రం రేగిన గాయపు తీవ్రతని గుర్తుకు తెస్తుంది. పాత గాయం అయినచోటే మళ్లీ గాయం కావడం సహజాతి సహజంగా జరుగుతుంటుంది.ఆ గాయాన్ని మాననీయవు.ఇదే అంశాన్నీ ఈ కవితలో "పాతవి కొత్తవి కలసి కలకలం రేపుతాయి/ గాయాన్ని మాననీయకుండా ఎక్కడెక్కడివో గుర్తుకొస్తుంటాయి"అని అంటూ ఈ గాయం నెత్తురు చిమ్మకుండా లావాలా ఉడుకుతూ కాల్చేస్తుందనే ఊహను చేసి..ఆ మరణపు గాయం మనసులేని శరీరం మీద మాయని మచ్చలా మిగిలిపోతుంది అనిచెప్పడం అంటే చెదిరిపోని గుర్తు అని కవయిత్రి గొప్ప పోలికలతో ఒక స్మృతిని మనముందు నిలుపుతుంది. మాములుగా ఎవరైన కీర్తిని గడించాలని విపరీతంగా ప్రయత్నం చేస్తంటారు.ఆ కీర్తిని పొందడానికీ ప్రాణాల్నిసైతం ధారపోసిన వాళ్ళని చరిత్రలో చూడొచ్చు. చాల చిత్రంగా రేణుక గారు ఆ కీర్తి అనేది పతనానికీ సంకేతం అని తీర్మానిస్తుంది.ఈ మాట కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు.కానీ ఈవిడ తన భావనని ఎంతో సమర్థవంతంగా తార్కింగా నిరుపిస్తుంది ఈ కింది పంక్తుల్లో. "కొందరిని కీర్తి బంగారు కీరిటమై అందరిలోంచి ఒక్కడిగా నిలబెట్టి అందరినుండి అపరిచితుడిగా లాక్కెళుతుంది అసూయ డేగలా వెన్నాడితే కీర్తి రాయిలా బరువై శత్రువులా మారుతుంది మళ్ళీ నీలో నువ్వు నీ కోసం వెదుక్కునే దాక కీర్తి వెంటాడుతూనే నిన్ను సంహరిస్తుంది" కీర్తి దాహం ఆత్మ విశ్వాసపు సంకేతంగా నిలిచే బదులు అది పతనానికి ఎట్లా గుర్తయ్యిందో ఈ కవయిత్రి స్పష్టంగా చెబుతుతుంది. ఎవర్నైనా చూసినప్పుడు ఏదోఒక భావం కలగడం అందరి అనుభవం.తాను చూసిన దాని వల్ల తాను పొందినానుభవాన్ని కవిత్వం చేయడం అందరు కవులు చేస్తారు.కానీ ఈ కవయిత్రి తన అన్నయ్య తన తాతగారి పాత ఫోటొ చూసినప్పుడు అతనిలో కలిగిన భావాల్ని కవిత్వం చేసిన విధం మాత్రం స్వంయంగా అనుభవించిన అబ్బురంగా అనిపిస్తుంది.ఇట్లాంటి పరమనోభావ గ్రహణ విద్య ఈ కవయిత్రికేట్లా తెలిసిందా అనుకున్నా. "తాత పోలిక నాదంటారు నాగలి పట్టి సరదాగా దున్ని అరచేతులు చాచి చూపించాను "భడవా"నాలాగే దున్నావురా-అనే తాతయ్య గొంతు ఎప్పుడు ఈ ఇంటి గడపలో కాలుపెట్టినా ఎడ్లబండి చప్పుడు వినిపిస్తుంది "వీడిదంతా నా పోలికే"గుండెలకి హత్తుకున్న చిత్రం కళ్ళముందుంటుంది పాత గడియారం కింద తాత ఫోటొ ఒకరోజు ఖాళీగా కనిపించింది నా చేతిలో నా బుజ్జిగాడి నవ్వులో "భడవ" ఇక్కడున్నానురా అంటూ-" ముగింపు కూడా మనలోని ఒక నమ్మకాన్ని బలపరుస్తూ ఊహించని విధంగా చేసింది. పాత్రలో,సీసాలో ఖాళీగా వుంటాయి.మాటలు ఎట్లా ఖాళీ గా వుంటాయి."నుదుటి మీదకి జరుగుతున్న తెల్ల వెంట్రుకలు,వణుకుతున్న చేతులు ,పట్టుకోసం చేతి కర్ర ఇంకా మిగిలివున్న ఊపిరితో వున్న రంగసాని ఖాళీ ముఖం చూశాక రాసిన"ఖాళీ మాటలు" " తెగిన మువ్వలొ కూడా నాట్యపు తిరస్కారం ఉంది"-అనే వాక్యం ఈ కవితకీ ప్రాణాధార వాక్యం.ఇట్లా కొన్ని మాటల్లోనే ఒక గొప్ప ఊహని చేసే ఆలోచనని పాఠకులకీ కలిగిస్తుంది. "తేట నీటి చెరువులా అంతరంగం ఆలోచనల చేప పిల్లలు లేవు మనసు తొలిచే వింత జంతువులు లేవు వృక్షాలై పెరిగిన అసూయలు లేవు పేరు రూపం లేని ఉత్త బొమ్మలా తేలియాడుతున్నాను మాయమైన రూపం కోసం వెదుకుతూ" ఎవరికి వారు తమ అంతరంగంలోకి తొంగిచూసుకుంటే ఎట్లా వుంటుందో పై పంక్తులు చెబుతాయి.ప్రతి పంక్తిలో ఒక పోలికను చెబుతూ చెరువును అద్దంగా చేసి రాసిన కవిత "నీటి బొమ్మ"-అనేది. వొక అందమైన భావాన్ని అక్షరాల్లోకి మార్చే మంత్రజాలం కూడా రేణుక గారికి తెలుసు. "వాన వెలిసిన రాత్రి ఆకాశంలో తారలు ఒక్కోక్కటి నడుచుకొంటూ నీలి తెర మీద చమ్కీల్లా వేలాడుతుంటాయి సందడి చేసి వెళ్ళిపోయిన వానకి గుర్తులు ఇంటి చూరుల్లో రాలుతున్న నీటి బుడగలు" వాన వెలిసిన తరువాతటి దృశ్యాన్ని ఇట్లా ఊహ చేయటం ఈమెకే చేతనయ్యిందేమో! "వెళ్ళిపోయిన వ్యక్తి ఙ్ఞాపకాలు/కళ్ళల్లో మిగిలిపోతాయి/మాటిమాటికి రెప్పలను ఒరుసుకొని/పారే కన్నీటి తడితో/వర్షం వెలిసిన ఆకాశంలా వాళ్ళంతా మిగిలిపోతారు"-ఇట్లాంటి దుఃఖపు తడి నిండిన వాక్యాలు ఈ కవయిత్రి చేతిలో పడి మనకీ మరింత విషాదాన్ని పంచుతాయి. అదేమి చిత్రమో గానీ ఎందరు కవులు అమ్మను గురించి రాసినా ఇంకా రాయాల్సిందేదోవుంది అని అనిపిస్తుంది నాకు.అందర్ని వదిలివెళ్ళిపోయిన అమ్మ జీవిత ఙ్ఞాపకాలలోని విషాదాన్ని "పల్లకీలో పెళ్ళికూతురు"అనే కవితలో చిత్రిస్తే,చౌరాస్తాలో సిగ్నల్ లైట్ల దగ్గర ఒకచిన్న పిల్లాడిని ఎత్తుకొని అడుక్కొంటున్న అమ్మాయిలో అమ్మ తనాన్ని"వాడితో నా ప్రయాణం"అనే కవితలో చిత్రించింది ఈ కవయిత్రి రేణుక గారు. అమ్మను ఖననమో,దహనమో చేయాడానికీ ముందు ఆమె చేతులకున్న గాజులు,కాళ్ళకున్న కడియాలను పంచుకొన్న తరువాత 'పాత సామానుల కొట్టులోకి వెళ్ళిపోయిన సందూకపెట్టె గురించి,అందులో అమ్మ దాచుకొన్న అపురూప గుర్తులను నెమరేసుకొంటూ,ఏనాడు పేరు పెట్టి పిలువని నాన్న కారణంగా తన పేరేమిటో మరచిపోయిన అమ్మను మనసులోకి తెచ్చుకొంటూ,కూరలో ఉప్పు ఎక్కువైతే పళ్ళెం ముఖాన విసిరికొట్టిన అభిమానాలు ఆప్యాయతలు పంచి ఇవ్వడమే తెలిసిన అమ్మలో తనను చూసుకున్న స్త్రీ మనో భావాల్ని గొప్పగా ఈ కవయిత్రీ ఆవిష్కరించింది. "భుజం మీద ముడితో జోలెలా అనిపించే మెత్తటి చీర ముక్క ఊయలని ఆమె జోలె అంటుంది నేను వాడిని మోస్తూ నాలోకి ఒదగనిస్తూ వాడి అనుభవాలకీ మూగపల్లకీనవుతాను" ఇలా ఆరంభమయ్యే ఈ కవితలో నాలుగు రోడ్ల కూడలిలో తన చంకనో వీపునో పిల్లాడిని మోస్తూ అడుక్కొంటున్న అమ్మాయిలో అమ్మ తనాన్ని ఈ కవయిత్రి రూపు కట్టించింది. "ఊయలగా నేను జోరుగా ఊగి- వాడి దుఃఖాన్ని చెరిపే కొమ్మ మీద పిట్ట కోసం ఎదురుచూస్తాను వాడికి కావలసింది అమ్మ అమ్మకి కావలి ఆకలి తీర్చే ఆదాయం జీవితం ట్రాఫిక్ సిగ్న్ల్ దగ్గర ఆగిపోయింది" ఈ మాటలు మనలి కూడా అక్కడే ఆపేస్తాయి.వొక అద్భుతశిల్పంతో ఈ రెండు కవితలే ఇంకా చాల కవితలు రేణుక అయోల గారిని ఒక మంచి కవయిత్రిగా నిలబెడతాయి పాఠకుల ఎదుట. "నన్ను నువ్వు తెలుసుకోవాలంటే యుగాలతో సంభాషణ జరపాలి"-అని అనటంలో కాలాన్ని స్ఫురింపచేస్తూ,నీటి జల్లులస్పర్శ,తడిపూల వర్షం,పిట్టల సయ్యాట లాంటివాక్యాలతో గుండె గుడిలో గిలిగింతలు పెడుతూ, "నది నా ఆత్మ,నది నా బాల్యం "అంటూనదిని అమ్మలా పలకరిస్తూ,ప్రతి కవితలో ఒక అనుభవ ధూళిని పంచుతూ,కెమెరాకందని జీవితం,కాగితాల కందనిఅనుభవన్నీ కవిత్వమంతా పరచిన కవయిత్రి రేణుక అయోల అంటున్నా నేను.రాయవల్సిన వాక్యాలు ఇంకా ఎన్నో వున్నా" రాత్రి ఆకాశంలో అప్పుడే పుట్టిన నెలవంక దాని పక్కనే మినుమినుకుమంటున్న నక్షత్రం"ఇక చాలని అంటున్నాయి కాబట్టి...ఒక మంచి కవితా సంపుటిని అందించిన కవయిత్రికి మనఃస్పూర్తిగా అభినందనలు అందజేస్తు..వచ్చే మంగళవారం మరొక కవితా సంపుటితో కలుద్దాం.అంతవరకు మిత్రులు ఈ కవిత సంపుటి పఠనంలో వుంటారని ఆశిస్తాను.

by Rajaram Thumucharla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mwhIVD

Posted by Katta

29, ఏప్రిల్ 2014, మంగళవారం

Rajaram Thumucharla కవిత

కవి సంగమం - చదివిన కవిత్వ సంపుటి - 26 కవిత్వ సంపుటి పేరు :- " నీ లాగే ఒకడుండే వాడు " కవిత్వాన్ని రాసి సంపుటి చేసింది :- "నంద కిశోర్ " కవిత్వ సంపుటిని పరిచయం చేస్తున్నది :- " రాజారామ్.టి " "వెన్నెలా స్నేహితా ఎవరోకాదు దేవీనే-ఆమె కన్నుల నీలి నీడల్లో నిలిచివున్న నవ భావనల నగిషీ కవిత్వం” "మన కంటే హాయిగా ప్రేమించుకొనెదెవరు?'-అని వెన్నెలా,స్నేహితలైన దేవినీ ప్రశ్నించి ఆమెను కవిత్వంతో ప్రేమిస్తున్నవాడు,'రెండు పేలవమైన దేహాల మధ్య ప్రేమ నిక్కచ్చిగా నలిగిపోతుందని'నిర్మొహమాటంగా అంటున్నవాడు,"కార్తీకంలో చందమామ పువ్వులై రాలడం దర్శించినవాడు,వాళ్ళ దేహం"మూడొంతుల కన్నీళ్ళు ఒక వంతు దేహం"-అని ఒక నిర్వచనం చేసినవాడు,"వానెందుకొస్తుందో నన్నొక్కన్నే అడుగు"-అని అనంత ఆత్మవిశ్వాసంతో అంటున్నవాడు,అడిగే ప్రశ్నలకీ "పూలు రాలేటి చప్పుడు చేస్తూ కొన్ని కరుకైన సమాధానాలు చెప్పగలిగినవాడు,కళ్ళకి తెలీని కాంతి భాషతో,కాళ్ళకి తెలీని స్పర్శ భాషతో నిశ్శబ్దంగా మాట్లాడి మాట్లాడీ కరగిపోయిన ప్రేమను కవిత్వం చేసినవాడు,ఎంత రాసిన నిన్ను చేరాకే నా అక్షరాలు ఆనందంగా "అమృతమవుతాయని నిజాయితీగా పల్కుతున్నవాడు,'దుఃఖం నీ సహచరి దుఃఖం నీ ఆత్మ" అనే ఒక సత్యాన్ని గుండె పగిలేలా చప్పుడు చేస్తూ,గుక్కపట్టేలా గానం చేస్తున్నవాడు ఎవరంటే ఇంకెవరు "నీలాగే ఒక్కడుండే వాడు"-అని అంటున్న నందకిశోరే. "బయట వేసిన ఒక్కోఅడుక్కీ ఒక్కో మిత్రుడు దర్శనమిస్తాడు"-అంటూ స్నేహ దర్శన వాంఛను అభివ్యక్తం చేయగల స్నేహతత్వం,"ప్రియురాండ్ల చేతుల్లో పిల్లలు నవ్వుతారు,నెలవంక నెత్తి మీద నక్షత్రం వెలుగుతుంది"-అనగలిగే భావుకత్వం,"వలల్లో ఈదేంత వెర్రివున్నా ఉచ్చుల్లో చిక్కేంత పిచ్చిదనం లేదని" వెర్రికీ పిచ్చికీ తేడా చెప్పగలిగే సూటిదనం,ఎవరి లాలనకీ తనలో కవిత్వం చిప్పిల్లిందో చెప్పగలిగిన తెగువ,పువ్వుల భాషలా మాటల్లో మార్ధవత్వం,గువ్వల భాషలో మాట్లాడే మాధుర్యం,పిల్లల భాషలో పదాలల్లే అమాయకత్వం,"ఒంటరి మేఘం ఒకటి దఃఖమై వర్షించినట్లుగా వుండే వొక దుంఖ తేజస్సుతో వుండే కవి ఎవరంటే ఇంకెవరు "నీ లాగే ఒకడుండే వాడు"-అని అంటున్న నందకిశోరే. ఈ విశ్వంలో నా లాగా,నీ లాగా,ఎవరోఒకరిలాగా ఎవరో ఒకరు వుండే వుంటారు.అది ఎంత మాత్రం ఆశ్చర్యం కానే కాదు. ఒకానొక "సందర్భంలో శ్రీ.శ్రీ కన్నా బాగా రాసేవాడు వుండొచ్చు.శ్రీ.శ్రీ కన్నా తక్కువగా రాసే వాడు వుండొచ్చు.కానీ శ్రీ.శ్రీ లా రాసేవాడు మాత్రం వుండడు "అని ఒక విమర్శకు డన్నాడు.ఈ మాట ఇప్పుడెందుకంటున్నానంటే " నీ లాగా ఒకడుండేవాడు" నందకిశోర్ అని అతనితో అనడానికీ కాదు.నందకిశోర్ లా ఎవరైనా వుండొచ్చు కానీ,అతని కన్నా గొప్పగా రాసే వాళ్ళుండొచ్చు,అతని కన్నా తక్కువగా రాసే వాళ్లుండొచ్చు,కానీ నందకిశోర్ లా ఇంత 'ప్రేమ"తో కవిత్వం రాసే వాళ్ళు వుండరని చెప్పడానికీ పై మాట అంటున్నాను నేను. ఏ దేశంలో అయినా సామాజిక రాజకీయ విప్లవాలను కవులు తమ కవిత్వంతో ప్రభావితం చేయడమే కాదు తమ ముందున్న సాహిత్యధోరణుల మీద తిరుగుబాటు జెండా ఎగురవేశారు.ఆ కవులు ఏ పేరు పెట్టుకొన్నా,వారిని ఏ పేరుతో పిలిచినా వాళ్లు మాత్రం తాము నివసించిన సమాజంలోని ఆర్థికవ్యవస్థ మీద ఆధారపడి రచనల నిర్మాణం చేస్తూ మనుగడ సాగించడం అనివార్యంగా సాగింది.ధనిక పేద తేడా లేని సమసమాజ వ్యవస్థను స్థాపించాలని,అందుకు అనుగుణంగానే తమ రచనల్ని కవులు నిర్మించాలని కూడా వారు విశ్వసించారు.కవులు కూడా సమాజంలో ఒక భాగమేకాబట్టి,వీరికీసమాజంపట్లఒకబాధ్యతవుంటుందని,ఆబాధ్యతనేసామాజికస్పృహఅంటారనివారుఅంటూవుంటారు.అయితేవీరికిఏవ్యవస్థఏర్పడినాకూడాజీవితమనేదిఒకటివుంటుందనిఆజీవితానికీఒకచలనముంటుందనిసమస్యలుంటాయని వొక ప్రకృతి వుంటుందని ఆ ప్రకృతికీ స్పందించే కవులుంటారని గ్రహింపు వుండాలి..ఈ సమాజంలోని అనంతమైన వస్తువుల్లోఆదికాలంనుంచివున్నవస్తువు ప్రేమ.స్త్రీ,పురుషులున్నంతకాలం వాళ్ళ సంబంధాల గురించిన కవిత్వం వుంటుందని అయితే దాని స్వరూపం వారు జీవించే సమాజానికనుగుణంగా మారుతూవుంటుందని గమనించుకోవాలి. ఈ అంతర్జాల యుగంలో ఆ స్త్రీ,పురుష సంబంధ దర్శనం ను నందకిశోర్ తనకవిత్వంలోమనతో చేయిస్తాడు. ప్రేమ లోని అన్ని కోణాల్నీ నందకిశోర్ పాఠకులకు తన కవిత్వంలో చూపిస్తాడు. ప్రేమ అనేది ప్రేమించుకొనే వారి అనుభవం.కానీ నందకిశోర్ ఆ అనుభవాన్ని ఎవరూ ఊహించని విధంగా కవిత్వం చేస్తాడు.అమ్మ పాడే పాట బిడ్డ శ్రద్దగా వింటుంది.కానీ ప్రియుడు పాడే పాటని ప్రియురాలు శ్రద్దగా ఒక పసి పిల్లలా వింటుందట.అలా వినేటప్పుడు ప్రేమ ఎందుకుండదు?అని కవి ప్రశ్నిస్తాడు.ప్రేయసీ ప్రియుల మధ్య ప్రేమ తల్లీ బిడ్డల మద్య ప్రేమలాగ వుంటుందని వొక గొప్ప ఊహని చేసి "మన కంటే హాయిగా ప్రేమించుకుండేది ఎవరు?"అని అడగడం ఎంత బాగుందో కదా! గోర్వెచ్చటి గాలి/కొంచెం తేమ,కొంచెం వేడి/వెన్నెల నిండా పరిచిన అందం/చీకటి నిండా వెలిగే దీపం "ఇంత కన్న ప్రేమించుకోడానికీ ఏంకావాలి?.ఇట్లాంటి వాతావరణంలో కవి "కనిపించని మంచు,కొంచెం సిగ్గు,కొచెం భయం,రాత్రినిండా పరిచిన దేహం,మనసునిండా కురిసే ప్రేమ" వున్నప్పుడు కోనేట్ల్లో కలసిపోక ఏంచేస్తాడు?-ఒక కాల్పనిక వాతవరణ చిత్రణ ఈ కవి కలం చేయగల మంత్రజాలం. ప్రేమలో పడ్డ వారికి అవతలి వారే ప్రపంచం.మరో ప్రపంచం వుండదు కనిపించదు.అందుకే ఈ కవి "నువ్వు" అనే కవితలో "నువ్వు ప్రపంచంకాదనేదెవరు"-అని అంటాడు.ప్రేమలో పడ్డవాళ్ళ జీవితం "మూడొంతుల కన్నీళ్ళుఒకవంతుదేహం."అనిపేర్కొనిప్రేమానేదిమనసులో,హృదయంలో గడ్డకట్టిన రెండు ధృవాలు"అని తీర్మానిస్తాడు.ప్రేమ అనేది"అనంతాల క్షితిజరేఖల్లో అంతులేనిది దుఃఖ మధ్య రేఖ" వ్యాఖ్యానిస్తాడు."పూల భాష"లో పోనీ..అయిందేదో అయ్యింది.వీసే యవ్వనాన్ని ఇకపై రోజు మన్నిద్దాం'అని ప్రియురాలితో సర్దుకుంటాడు ఈ కవి."నువ్వలా మోహంతో ముద్దు పెట్టుకుంటావో లేదో కొండవాలొక దారిలా" కనిపించడం తేలిపోయే ఆకాశాలు పూల నవ్వుల్నీ విసిరేయడం ఈలాంటి మాటలు కవిని ప్రియురాలి ముద్దు అతనిలోంచి ఆమెకు వొక వంతెన వేసి అతనిపైన అతనే నడిచి పోయేటట్లు చేసె ప్రభావాన్ని చూపుతుందని అర్థమవుతుంది. ఇంతగా ప్రేమలో లీనమైన కవిని మనమెప్పుడైనా చూశామా? "నిరామయ శోకం నీలో ప్రవహించే సమయం మోహిని స్పర్శలో మోసపోయింది/నిర్లిప్త ప్రపంచాన్ని పరిచయం చేసి కాలం చీకట్లో కలసిపోయింది"-అని దుఃఖితుడై భగాభగా మండిన ఒక ప్రేమికున్ని ప్రేమ "నీ దేహాక్షరంలో కాలిపోనిదై లిఖించబడిఉంది'-అని ఓదారుస్తాడు.'పిల్లలు దోసిళ్ళతో నక్షత్రాలు చల్లుతారు/నూరేళ్ళు బతకమంటూ నిండుగా దీవిస్తారు"-అనే నమ్మకాన్ని ప్రేమ పట్ల కలుగ చేస్తాడు."పసిపాపలా,పసిచూపుతో/అమ్మకన్నుల్లోని అనురాగం వర్షిస్తూ/కాంతిపూల సరాగాలకి లయబద్దంగా అడుగులు వేస్తూ/ఏ జన్మలోనో నన్ను కన్న అమ్మలా"అనే ఈ కవి ప్రేమలో అంటే ప్రియురాలిలో అమ్మను దర్శించడం అనే ఒక ఉదాత్త భావనను నందకిశోర్ కలుగచేయడం మనల్నీ ఒక వూహించని ప్రపంచంలోకి తీసుకెళుతుంది. "ఒకానొక అకాలంలో ఒంటరిగా కలిశాం మనం గుర్తున్నానా?"అని ప్రేయసిని అడిగే ప్రియుడికీ వారి బంధం ఇప్పటిది కాదని ఎప్పటిదో అని చెప్పడానికీ కవి ప్రియుడితో చెప్పించిన అనుభావాలు,వాటి అనుభూతుల లోతులు మనసు హృదయం తెలియని మార్మిక ఊహల్లోకి పాఠకుల్నీ తీసుకపోతాయి.ప్రేమతో,ప్రేమలోపడ్డ వాళ్ళకీ ఎంతకీ తీరని దాహం ప్రేయసి పంచిన పెదవుల వల్లో,ప్రేమవల్లో తెలియదని చెబుతూనే ఒక అమృతని మనకీ పరిచయం చేస్తాడు.ఎడబాటుకోర్చీ ఎదురేగుకుంటూ పోయేటప్పుడు ప్రేయసి,ప్రియులమధ్య ఎలాంటి అనుభూతి వుంటుందో ఈ కవికీ తెలిసినట్లూ ఇంకెవరికీ తెలియదేమోనన్నట్లు రాశాడు."పగటికీ రాత్రికీ తేడా వుండదు/చీకటి గట్టిగా విసిరివేయబడుతుంది/ఉక్కపోత ఎక్కువై ఉక్కిరిబిక్కిరి చేస్తుంది/వెన్నెలకసలే దయ వుండదు./సరిగా నిజాయితిగా చెప్పాలంటే/కావాల్సినదేది మిగిలుండదు."ఇలా చాల తేలికైన మాటల్తో బరువైన విరహ దుఃఖాన్ని మనలోకి కూడా ఎక్కిస్తాడు దుఃఖగీతితో. "ఫేక్ ఐడెంటిటి"అనే కవిత ప్రేమ,పగిలిపోయిన ప్రేమల్లోని కొత్త కోణాల్నీ చూపించి ప్రేమ "ఐ యామ్ నాట్ ఫేక్"-అని అంటున్నట్టుగా అనుభూతినిస్తుంది.ఇద్దరి మధ్య అంటే ప్రేయసి ప్రియుల మధ్య వుండే వ్యత్యాసం ప్రేమ వున్నప్పుడు తేలీకుండావుంటుంది .ఏ ఒక్కరిలో ప్రేమ సన్నగిల్లినా అప్పుడు వారు "అలల్ని విసురుతూ కవ్వించే నీకు/ సొగసుగా కదులుతూ ఆహ్వానించే నాకు నిజమే బహుశా పోలికే లేదు"-అని అనుకుంటారని ఈ కవి"జస్ట్ లైక్ దట్"అనే కవితలో చాల అనుభవైకవేద్యంగా చెబుతాడు. నందకిశోర్ "మూడు సందిగ్ధాలు"-అనే ఒక కవితలో "వక్రబుద్ది తన కుటిలస్వభావాన్ని కనపడకుం డా వుండటానికీ ఎంతైనా నిజాయితిని కనబరుస్తాడని,నిజాయితీలో వక్రబుద్ది,వక్రబుద్దిలో నిజాయితి వున్నట్టు కనిపిస్తారని,నిజాయితి లేదా వక్రబుద్ది ఏదో ఒక్కటే సంతృప్తినిస్తుందని ప్రేమను ప్రశ్నిస్తూ,"తీవ్రమైన దేహాకర్షణ చేత/భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నప్పుడు"అంటే ప్రియుడి చుట్టు ప్రేయసి లేదా ప్రేయసి చుట్టు ప్రియుడు తిరుతున్నప్పుడు ఎవరో ఒకరు మిగిలిపోయిన సందర్భంలో ఏర్పడిన సందిగ్ధాల ఖాళీల పూరణను చాల గొప్పగా చిత్రించాడు."మళ్లీ మళ్ళీ మళ్ళీ మళ్లీమళ్లీ ఆమె..నేను నేను ఆమె ఛ!"కవి ప్రేమ పట్ల ఎంత ప్రేమను కలిగివున్నాడో అంత చిరాకు పడినట్లు కూడా కొనీ భావనలు కలిగే అవకాశం ఈ మాటలు ధ్వనింపచేస్తాయి.వదిలి వేసే ధర్మాన్ని నిరసించాడానికీ కొన్ని భావనలు ఈఇ సంపుటిలో కవి చిత్రించాడేమోననిపిస్తుంది. నందకిశోర్ ఈ సంపుటిలో వొక ప్రేమను గురించే కాదు ప్రకృతిని,ఓపెన్ కాస్ట్ లో బర్వే అయిన ఊరుని,ముసుర్లు పట్టినప్పుడు ఇంటి వాతావరణాన్ని,తన నేల భాషలో గొప్ప కవిత్వం చేశాడు.గుండెల్ని కరగించేది,మనసును కన్నిటితో కడిగేది"రాఖీ"-అనే కవిత."అక్కా!నీ బాంచెన్.యేడున్న సల్లగుండు.."అని ప్రతి యేడు రాఖీ కట్టే అక్కను మనాది చేసుకొంటూ "సాగతోల్తాంటే/అమ్మ నా చేతిల/నీ చెయ్యి పెట్టినప్పుడో/నల్లపూసలు గుచ్చినంక/కార్ల నిన్ను తీస్కపోయేటప్పుడో/నిమిషమన్నా/దుక్కించక పోతిని"అని అన్నా,"అందర్ని సూడ బుద్దయితుందిరా అని /మొన్న మాట్లాడినప్పు డన్నా/ఏడ్వకపోతిని"అని అంటున్నా కవి మనల్ని నిజంగా ఏడిపిస్తాడు తన కవిత్వ విషాదాన్ని నింపి రాఖీలో. రాఖీలో పూసల్లా అక్క ఙ్ఞాపకాల్నీ నెమరేసుకొంటూ జరిగి పోయిన విషాదాన్ని” నెరేట్ “చేసిన పద్దతి కట్టిపడేసింది ఆ కవిత దగ్గరే నన్ను. "పెమింఅక్షిలా పాడ గలిగినందుకు/పాడుతూ అరవగలిగినందుకు/పువ్వుల్ని ఊహినందుకు/వెన్నెల్ని మోహించినందుకు"ప్రేమించబడతారని కొత్తగా చెప్పడం ఈ కవికే చాతనవును. 'ఎమో! నువ్వడగలేదు గాని చిట్టి తల్లీ! ప్రశ్నలు గుచ్చుకొంటున్నాయ్ ఎందుకైనా మంచిది. ఓ కథ చెప్తా విను" ఇలా మొదలయ్యే కవితలో పాఠకుల్నీ"నీలాగేఒకడుండేవాడు"అనుకుండేటట్లుగా చేసి ఒక ఊహాలోకంలోకి చిగురంతైన భయం లేకుండా చేతిలో చిన్న లాంతరొకటి పట్టుకొని మెల్లగా చీమలా కదిలేటట్లు" విహరింపచేసే చివర్లో "నువ్వొక ప్రాణం నిండిన ఆత్మవి/నీలా వుండటమే నాకు చాల యిష్టం"అనుకుండేటట్లు చేసె ఇంద్రజాలం చేస్తాడు తన కవిత్వ నిర్మాణ నిపుణనతో. "నేను సరోవరాల ధ్యాసలో ఒక్క ఎడారినీ తడపలేక అడవి మధ్యలో ఒక్క ఆకునీ మొలకెత్తించలేక మనుషుల మధ్యలో కాస్తైనా దుఃఖాన్ని రగల్చలేక నవ్వుని చల్లార్చలేక"-ఇలాంటీ అద్భుత వాక్యాలతో పరిఢవిల్లే దీర్ఘ వచన పద్యాలు ఈ కావ్యమంతా నిండి ప్రేమ లోయలోకి దాని సోయగాల సౌందర్యాన్ని చూపించడానికీ పరుగులు తీయిస్తాయి. ఈ సంపుటిలో నందకిశోర్ ముప్పైఆరు కవితల్నీ దేనికదే భిన్నంగా నిర్మించడమే కాదు "పునర్విమర్శ", "ఊవెల పిల్ల","ఒక సంధ్యావస్థ కాలంలోంచి","అనుకోకుండా..."మున్నగు దీర్ఘ వాక్యాల కవితల్ని చేర్చాడు.ఒకప్పుడు శేషేంద్ర శర్మ గారు వచన కవితను,కొంత పాదవిభజనతోను మరికొంత పాద విభజన లేకుండాను ఋతుఘోష లాంటి కావ్యాలు రాసినట్టు గుర్తు.నందకిశోర్ కూడా "దేవీ", "పువ్వుల సంద్రమా", "దుఃఖిత సహచరి" , "వెన్నెల స్నేహిత" లాంటి సంబోధనలతో ఎన్నటికి విసుగుచెందనివ్వని,ఏ ఒక్క క్షణం అసంతృప్తినివ్వని కవితాత్మకతో ప్రేమనీ విరహపు బాధనీ ఒక లయ తప్పని వేగంతో చిత్రించి మనల్నీ ఊపిరి వృత్తంలోనే నిలిచివుండేటట్లుచేసి"నీలాగేఒకడుండేవాడు"అనిపిస్తాడు మన చేత. ప్రేమ తత్వమే కాదు సమాజ తాత్విక అంశాల ప్రస్తావన ఈ కవితా సంపుటిలో అంతర్లీనంగా కనిపిస్తాయి.జీవన సత్యాల పరోక్ష నిక్షిప్తత ఈ కవితల్లో కనిపిస్తుంది. "పగిలినా పగలకున్నా ప్రతిబింబించడం మాత్రమే నీ గుణమైనప్పుడు ఎవరో విసిరిన రాయిని చూసి ఎందుకంత కోపం నీకు? నీ గురించి నీకే తెలియంది ఇంకేదన్నా మిగిలే వుందా?-(అద్దం) అద్దానికీ,మనిషి మనసుకి పెద్ద తేడా లేదని వ్యవహారంలో అనుకొంటూవుంటాం.అద్దం రాయి తగిలి ముక్కలయి పోతుంది.రాయి లాంటి మాటలకి మనిషి మనసు ముక్కలవుతుంది.ఆ తరువాత అతుక్కోవంటారు.కానీ నందకిశోర్ ఎవరైనా రాయిలాంటి మాటలతో ముక్కలు చేసే యత్నం చేసిన కోపం తెచ్చుకోకూడదనే భావనను సూచిస్తూ,అద్దం గురించి అద్దానికీ,మనషి మనసు గురించి మనిషి మనసుకూ అంతా తెలుసు కదా మరి ఎందుకు కోపం తెచ్చుకోవడం అని ప్రశ్నిస్తాడు.ఆ ప్రశ్నలోనే తన సమర్థనను ఎంతో ఆలోచనాత్మకంగా "నీ గురించి నీకే తెలియందేది"ఏదీ మిగిలి లేదనే లోతైన భావాన్ని అందజేస్తాడు.కవిత్వం కూడా అద్దం లాంటిదే.ఆ కవిత్వం పై ఎవరైన విమర్శల రాళ్ళు వేయొచ్చు.నీ కవిత్వం గురించి నీకు తెలియనిదేమి వుండదని అందుకోసం కోపం తెచ్చుకోడం కూడదన్న అంశాన్నీ కూడా పరోక్షంగా ద్వనింపచేస్తాడు.తక్కువ మాటల్తో ఎక్కువ అర్థాన్ని స్ఫురింపచేయడం మంచి లక్షణం. నందకిశోర్ కవిత్వం ఇట్లా వుంటుంది కాబట్టే ఎక్కువ కవులూ,పాఠకులు యిష్టాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిలోపలి లోతుల్లోకీ ఎట్లా ఇంకి పోతాడు? అనే ప్రశ్న మనల్నితొలిచే ప్రశ్న.ఈ ప్రశ్నకి జవాబు నందకిశోర్ కవితవంలో జవాబు దొరుకుతుంది.వాన కురిసేటప్పుడు స్వఛ్చంగా ఏ రంగు లేకుండా వుంటుంది.నేలకు దిగింతర్వాత ఆ నేల రంగునే పులుముకొని అందులోకి ఇంకి పోతుంది.అట్లాగే మనిషి కూడా ఇంకో మనిషి లోతుల్లోకి ప్రవహించడం వల్లా అతన్లో ఇంకి పోతాడని ఒక జీవన సత్యాన్ని చెబుతాడు ప్రకృతిని పోలిక చేస్తూ.కొన్ని లోతైన తాత్విక భావనల్ని చెప్పడానికీ సాధారణ పోలికల్నే తీసుకొని గాఢంగా సాంద్రంగా చెప్పగలిగే శక్తి నందకిశోర్ లో వుంది. ఏ భవబంధాలను పట్టించుకోని వాడిని అలా తిరిగేవాడిని తెగిన గాలి పటంతో పోలుస్తుంటారు.కానీ వొక ఉన్న్నత లక్ష్యాన్ని చేరుకోవడానికీ ఆధారం లేకపోయిన పడుతూ లేస్తోన్న వాడిని తెగిన గాలి పటంతో పోలుస్తూ,అతడు ఆ లక్ష్యం చేరుకొంటాడో,లేదో నీకు అనవసరం.అటుపోయి అతని లక్ష్యానికి నీవు అడ్డు కావొద్దని చెబుతాడు ఈ కవి.ఒక సమున్నత చింతన ఇతని కవితల్లో ప్రతిఫలిస్తుంది. జీవిత ప్రయాణంలో ప్రేమ కూడ ఒక మజిలి.అనుభూతుల అలల మీద ప్రణయ సముద్రం తీరం చేరడానికీ నందకిశోర్ కవిత్వం నావ మీద సేద తీరుతూ పయనించండి 'నీ లాగే ఒకడుండేవాడు"సంపుటాన్ని చదువుతూ...అని మిత్రులకు చెబుతూ మరో కవితా సంపుటి పరిచయంతో వచ్చే మంగళవారం కలుద్దాం.

by Rajaram Thumucharla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m3qluI

Posted by Katta