గాలిబ్ కవితలపై వివరణలను చదివి ఆనందిస్తూ, చక్కని కామెంట్లతో నన్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ రోజు గాలిబ్ కవితల్లో మొదటిది గాలిబ్ సంకలనం లోని 10వ గజల్ మొదటి షేర్. సతాయిష్ గర్ హై జాహిద్ ఇస్ ఖద్ర్, జిస్ బాగ్ రిజ్వాం కా ఓ ఇక్ గుల్దస్తా హై, హమ్ బేఖుదోం కే తాఖె నిస్యాం కా సాధుపుంగవులు స్వర్గఉద్యానవనాన్ని చాలా ప్రశంసిస్తున్నారు కాని, అది మా లాంటి ధ్యాసలేని వారు మరపుగూటిలో వదిలేసిన పూలగుచ్ఛం ఉర్దూ పదాల అర్ధాలు చూద్దాం. సతాయిష్ అంటే ప్రశంస, మెచ్చుకోలు. జాహిద్ అంటే సాధువు, ధర్మపరాయణుడు. బాగ్ అంటే ఉద్యనవనం. రిజ్వాన్ అనేది స్వర్గానికి అధిపతి అయిన దేవదూత పేరు. బాగె రిజ్వాం అంటే రిజ్వాంకు చెందిన ఉద్యనవనం, అంటే స్వర్గం. గుల్ అంటే పువ్వు. దస్తా అంటే పట్టుకునేది, లేదా హ్యాండిల్. గుల్దస్తా అంటే పూలగుచ్ఛం, లేదా బోకెట్. ఖుద్ అంటే స్వయం. బే అంటే వ్యతిరేకార్థాన్ని సూచించే పదం, బే ఖుదీ అంటే తనలో తాను లేకపోవడం. స్వయం గురించిన ధ్యాస లేకపోవడం, తన్మయత్వంలో ఉండడం, ఆబ్సెంట్ మైండెడ్. తాఖ్ అంటు గోడలో కట్టిన చిన్న గూడు లేదా షెల్ఫు. నిస్యాం అంటే మతిమరుపు. తాఖె నిస్యాం అంటే మతిమరుపు గూడు. ఇది గాలిబ్ 10వ గజల్ లో మొదటి షేర్. ఇందులో మొత్తం 12 షేర్లున్నాయి. అన్ని షేర్లు అద్భుతమైన భావాలే. ఈ కవితలో తాఖె నిస్యాం అంటే మతిమరపు గూడు అన్న పదప్రయోగం హైలేట్. సాధారణంగా మనం వస్తువులను అల్మారాలో, షెల్ఫుల్లో ఉంచుతాం, దాచుకుంటాం. ఒకప్పుడు గోడలో గూడులా కట్టి ఉండేది. అందులో ఉంచేవారు. అలా ఉంచిన వస్తువులను మరిచిపోవడం కూడా జరుగుతుంటుంది. గాలిబ్ తన మతిమరుపునే అలాంటి గూడుగా వర్ణిస్తున్నాడు. ఈ కవితలో కూడా వ్యంగ్యం ఉంది. స్వర్గం కావాలని కోరుకునే వారు, స్వర్గం లభించాలని తీవ్రంగా అభిలషించేవారు, స్వర్గ లోక ఉద్యనవనాల సౌందర్యాన్ని ప్రశంసిస్తూ ఉంటారు. ధర్మపరాయణులుగా జీవించి స్వర్గానికి అర్హత పొందాలనుకుంటారు. ఎలాగైన స్వర్గం తమకు దక్కాలన్నదే వారి కోరిక. కాని అలాంటి స్వర్గం తనకు పెద్దగా ముఖ్యమైనది కాదంటున్నాడు గాలిబ్. తమను తాము మరిచిపోయి, తన్మయత్వంలో జీవిస్తున్న వారికి (బేఖుదోంకో) ఈ ధర్మపరాయణులు కోరుకునే స్వర్గంపై ఆసక్తి ఉండదని చెబుతూ. అలాంటి వారు మతిమరపు గూటిలో పెట్టి మరిచిపోయిన పూలగుచ్ఛం వంటిదే స్వర్గం అంటాడు. ఈ కవిత పైకి కనబడుతున్నంత సరళమైనది కాదు. ధర్మపరాయణులు స్వర్గం కోసం పరితపిస్తూ ఉంటే, దానికి ఎంతగానో విలువ ఇస్తూ ఉంటే తాను మాత్రం తన ప్రేయసి ధ్యాసలోనే ఉన్నాడు. ఆ తన్మయత్వంలో మునిగిపోయాడు. గూటిలో పెట్టి మరిచిపోయిన పూలగుచ్ఛంలా స్వర్గాన్ని మరిచిపోయాడు. ఇందులో సూఫీ కోణమేమంటే, ఇక్కడ ప్రేయసి ఆలోచనలు కాదు, నిజానికి దేవుని పై ప్రేమలో సమస్తాన్ని మరిచిపోయాడు. దేవుడిస్తానని చెప్పిన స్వర్గాన్ని కూడా మరిచిపోయాడు. ఇదే విషయాన్ని చెబుతూ ధర్మపరాయణులు స్వర్గం కోసం అంతగా పరితపించడం ఆయనకు ఆశ్చర్యంగా ఉంది. ఒక వస్తువును గూటిలో పెట్టేయడమంటే అర్ధం దానితో పనిలేదు కాబట్టి అక్కడ వదలడం. స్వర్గాన్ని పూలగుచ్ఛంగా గూటిలో వదిలేసాననడమే కాదు, మరపు గూటిలో అంటూ ఇక దాన్ని పూర్తిగా మరిచిపోయానంటున్నాడు. ఇందులో ఉన్న వ్యంగ్యం చాలా సున్నితమైనది. స్వర్గాన్ని గాలిబ్ పూలగుచ్ఛంతో పోల్చాడు. అంటే దాని విలువను, శోభను తగ్గించలేదు. దాన్ని మరపుగూటిలో వదిలేసానని చెప్పడం ద్వరా తన దృష్టిలో స్వర్గం కన్నా తన తన్మయత్వమే ముఖ్యమని చెబుతున్నాడు. దేవుని ధ్యాసలో సర్వం మరిచిపోయి తన్మయత్వంలో ఉన్నవాడికి మరేదీ ముఖ్యమైనది కాదన్న భావం ఇందులో ఉంది. రెండవ కవిత గాలిబ్ సంకలనం 10వ గజల్ మూడవ షేర్. నా ఆయీ సత్వతె ఖాతిల్ భీ మానే, మేరే నాలోం కో లియా దాంతోం మేం జో తిన్కా, హువా రేషా నయస్తాం కా హంతకుడి ఉగ్రరూపం నా ఆర్తనాదాన్ని ఆపలేదు పంటిమధ్య గడ్డిపరక వేణునాదాల స్ధానమైంది ఉర్దూ పదాలను చూద్దాం. సత్వత్ అంటే ఉగ్రత్వం, ఆగ్రహోదగ్ర స్వభావం. మానె అంటే నిరోధించడం. నాలా అంటే పిలుపు, ఆర్తనాదం. దాంత్ అంటే దంతాలు, తిన్కా అంటే గడ్డిపరక, కాని దాంతో మేం తిన్కా లేనా అన్నది ఉర్దూ పలుకుబడి. దీనికి అర్ధం చేష్టలుడిగిపోవడం, మాట్లాడలేకపోవడం, గొంతునొక్కబడడం వగైరా. రేషా అన్నా కూడా గడ్డిపరకే లేదా పీలిక, దారప్పోగును కూడా రేషా అంటారు. నై అంటే వేణువు. నయస్తాన్ అంటే వేణువుల ప్రదేశం, అంటే వెదురు పొదలున్న చోటని చెప్పవచ్చు. ఈ కవితను అర్ధం చేసుకునే ముందు నయ్ స్థాన్ అన్న పదాన్ని కాస్త చూద్దాం. నయ్ అంటే వేణువు. ఉర్దూలో ఆబాద్, ఖానా, బార్, జార్, స్థాన్ వగైరా పదాలను ఒక నామవాచకం తర్వాత చేర్చితే అది ఒక ప్రదేశాన్ని సూచించే పదమవుతుంది. తెలుగులో కూడా గుట్ట, పాడు, పేట వగైరా పదాలను చేర్చితే ప్రదేశాన్ని సూచించడం జరుగుతుంది కదా. సంతపేట, పావురాల గుట్ట వగైరా పేర్లు ప్రదేశాన్ని సూచిస్తాయి. అలాగే హైదర్ అన్న పదానికి ఆబాద్ చేర్చితే హైదరాబాద్ అవుతుంది. షరాబ్ అంటే మద్యం దానికి ఖానా పదం చేర్చితే షరాబ్ ఖాన్, మద్యం దొరికే చోటు. గుల అంటే పువ్వు, గుల్జార్ అంటే పూలతోట. గాలిబ్ ఇక్కడ నయ్ అన్న పదానికి స్థాన్ అన్న పదాన్ని కలిపి వేణువులు స్ధానం లేదా వేణువుల ప్రదేశం అన్న అర్ధం వచ్చేలా చేశాడు. అంటే ఇది వెదురుపొదల ప్రదేశం అని చెప్పవచ్చు. వెదురుపొదల్లో గాలి వీస్తే ఒళ్ళు గగుర్పొడిచే శబ్ధాలు వస్తాయన్నది కూడా మనం గమనించాలి. ప్రతి వెదురు ఒక వేణువులా మారిందా అనిపిస్తుంది. అలాగే కవితలో ఉపయోగించిన దాంతో మేం తిన్కా లేనా అన్న పదబంధానికి అర్ధం, మనిషి పంటిమధ్య గడ్డిపరకను కరిచిపట్టుకుంటే మాట్లాడలేడు. మరోవైపు అతడి ముక్కునుంచి వదిలే ఊపిరివల్ల ఆ గడ్డిపరక కొట్టుకుంటూ శబ్ధం వస్తుంది. మనిషి మాట్లాడలేడు, కాని అతడి నోటిలో మాటలు రాకుండా కరచుకుని ఉన్న గడ్డిపరక మాట్లాడుతుంది. ఇప్పుడు గాలిబ్ ఏం చెప్పాడో అర్ధం చేసుకోవడం తేలిక. అతనిపై దాడికి వచ్చిన ప్రత్యర్థి ఉగ్రరూపం చూసి గాలిబ్ నోరువిప్పలేకపోయాడు. ఇక్కడ దంతాల మధ్య గడ్డిపరక కరచిపెట్టుకున్నాడు. కాని ఆ గడ్డిపరక ప్రతిఘటిస్తూ, వేణువులా ఆర్తనాదాలు చేస్తోంది. ప్రత్యర్ధి గాలిబ్ మాట్లాడకుండా గొంతునొక్కగలిగాడు, కాని గాలిబ్ నోట ఉన్న గడ్డిపరక గొంతునొక్కలేకపోయాడు. ఈ కవిత చాలా లోతైన భావం ఉన్న కవిత. దౌర్జన్యపరుడు ఎంత బలశాలి అయినా గాని అణిచివేతలకు పాల్పడి బలహీనులను ఎంతగా పీడించినా గాని ప్రతిఘటనను వాళ్ళు ఆపలేరు. హంతకుల ఆయుధాలు, హతుల గొంతులు మూగబోయినా, హతుల రక్తం బిగ్గరగా అన్యాయాన్ని ప్రతిఘటిస్తూనే ఉంటుంది. ఈ కవితలో గాలిబ్ ఊహాశక్తి గమనించదగ్గది. ఉర్దూలో ఒక పలుకుబడిని, పండ్లమధ్య గడ్డిపరక కరచుకోవడం... అంటే నోరుమూతపడడం అన్న పలుకుబడిని ఉపయోగించి, తన నోరుమూతపడినా, పండ్లమధ్య ఉన్న గడ్డిపరక గొంతు నులమలేరన్నాడు. మరో మాటలో చెప్పాలంటే, బలహీనులు, పీడితుల మౌనం కూడా ఆర్తనాదాలతో ప్రతిఘటిస్తుందని చెప్పాడు. ఈ కవితలో రెండవ పంక్తిలో చెప్పిన వేణువుల ప్రదేశం అన్న పదప్రయోగం కూడా గమనించదగ్గది. ఇలాంటి ఆర్తనాదాలు చేసే గడ్డిపరకలన్నీ గుమిగూడే ప్రదేశం అవుతుందన్న హెచ్చరిక ఇందులో ఉంది. అంటే దౌర్జన్యానికి గురైన ఆ ఒక్క గడ్డిపరక అనేక వేణువుల్లా మారి దౌర్జన్యపరులను ప్రతిఘటిస్తుంది. కేవలం రెండు పంక్తుల్లో చాలా లోతయిన సామాజిక స్పృహను పలికించడం గాలిబ్ కు మాత్రమే సాధ్యం. ఫక్తుగా గజల్ భావంతో అర్ధం చేసుకున్నప్పుడు కూడా ఇందులో చమత్కారం ఆకట్టుకుంటుంది. ఇక్కడ ఖాతిల్ అన్న పదాన్ని గాలిబ్ తన ప్రేయసిని ఉద్దేశించి వాడినట్లు భావిస్తే. గాలిబ్ తన ప్రేయసితో ’’ఓ హంతకీ, నువ్వు ఎంత కోపంగా నా మీదికి వస్తున్నా, నా నోట మాటరానంతగా నేను లొంగిపోయినా, నా మౌనం కూడా నిన్ను ప్రతిఘటిస్తుంది, (నా పండ్లమధ్య ఉన్న గడ్డిపరక కూడా నీ దౌర్జన్యాన్ని సహించడం లేదు) అని చెప్పడంలో చక్కని చమత్కారం ఉంది. ఒక ప్రేమకవితలో ఇలాంటి సామాజిక స్పృహను పలికించడం చాలా కష్టం. తర్వాతి కవిత గాలిబ్ సంకలనం 10వ గజల్ లో 5వ షేర్ కియా ఆయినే ఖానే కా వో నక్షా తేరే జల్వే నే కరే జో పర్తూ ఏ ఖుర్షీదే ఆలమ్ షబ్నమిస్తాం కా నీ సౌందర్య శోభతో అలంకరించబడింది అద్దాల గది మంచుబిందువుకు ఉషోదయ తొలికిరణం చేసిన అలంకరణే అది ఉర్దూ పదాల అర్ధాలు చూద్దాం. ఆయినా అంటే అద్దం. ఆయినా ఖానా అంటే అద్దాల గది. నక్షా అంటే చిత్రం, మ్యాప్. జల్వా అంటే శోభ అని అర్ధం చెప్పుకోవచ్చు. పర్తూ అంటే నీడ. ఖుర్షీద్ అంటే సూర్యుడు. పర్తూ యే ఖుర్షీద్ అంటే సూర్యుడి నీడ, ఇక్కడ భావం సూర్యకిరణాలని. ఆలమ్ అంటే ప్రపంచం, పరిస్థితి అన్న భావం కూడా ఉంది. షబ్నమిస్తాన్ అంటే ప్రాతఃకాలపు మంచుబిందువులు వాలిన చోటు. అంటే పువ్వులు, చెట్ల ఆకులు, పచ్చిక వగైరా అని చెప్పాలి. లైట్ అండ్ సౌండ్ షో లా ఈ కవిత ఒక హీట్ అండ్ లైట్ షో లాంటిది. తన ప్రేయసి అద్దాల గదిలోకి రాగానే చోటుచేసుకునే అద్భుతాన్ని గాలిబ్ ఇందులో వర్ణించాడు. ఆమె ప్రవేశించడమన్నది సూర్యోదయంలా ఉంది. ఉషోదయపు తొలికిరణం పడకముందు మంచుబిందువులు పూలపై, ఆకులపై, పచ్చికపై వాలి గర్విస్తూ ఉంటాయి. కాని సూర్యకిరణాలు వాటి గర్వాన్ని పటాపంచలు చేస్తూ వాటిని మాయం చేస్తాయి. మంచుబిందువులు గాల్లో కలిసిపోతాయి. అదేవిధంగా తన ప్రేయసి రాకముందు అద్దాల గది తన మెరుపులు చూసి చాలా మురిసిపోయిందంట. అద్దాల గది తన శోభ చూసి చాలా గర్వించేదట. కాని గాలిబ్ ప్రేయసి ఆ అద్దాల గదిలో అడుగుపెట్టిన వెంటనే ఆమె సౌందర్యశోభ ముందు అద్దాలగది మసకబారింది. వెలవెలబోయింది. అద్దాల గది గర్వం కూడా మంచుబిందువుల గర్వంలా గాల్లో కలిసిపోయింది. ఇది ఫక్తు ప్రేమకవిత. ఇందులో నక్షా అన్న పదం గమనించదగ్గది. ఉర్దూ తెలిసిన వారికి నక్షా బిగాడ్ దూంగా అన్న పదప్రయోగం తెలిసే ఉంటుంది. ఎవరైనా ఇద్దరు కోట్లాడుకుంటున్నప్పుడు, కోపంగా నీ ఎముకలిరగ్గొడతాను వగైరా పదాలు ఉపయోగిస్తారు. నక్షా బిగాడ్ దూంగా అన్న పదాలు కూడా అలాంటివే. అంటే నీ రూపం చెడగొడతాను, అంటే కొట్టి అసలు రూపం పోయి ముఖం వాచేలా చేస్తాను అన్నది భావం. ఇక్కడ వాడిన నక్షా అన్న పదం కూడా అలాంటిదే. అద్దాల గది నక్షా అంటే అద్దాల గది రూపాన్ని ప్రేయసి ఎలా మార్చిందంటే, దాని గర్వం అణిచిపోయి చతికిలబడింది. ఈ కవిత ప్రేయసిని మెప్పించడానికి అతిశయోక్తులతో రాసిన కవిత. ఇది ఈ వారం గాలిబాన. మళ్ళీ శుక్రవారం కలుద్దాం. అస్సలాము అలైకుమ్.
by Abd Wahedfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lCvlFj
Posted by
Katta