పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Riyaaz లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Riyaaz లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, సెప్టెంబర్ 2012, శనివారం

రియాజ్||సరదాగా...(సముద్రంతో సంభాషణ)||


సరదాగా ఈతాడటమొచ్చా నీకు?
తమాషా కాదు!
తీవ్రంగా అలొచించేంత సులువుకాదు!!
ఈ క్షణంలో అందంగా జీవించగలవా?
భయంకర నిరాశావాదమంత సులువుకాదు
ఈ ప్రక్రియ?!

సముద్రం గొప్పదా?
నేను గొప్పవాడినా?
ఈ అలల్లోని ఉత్సాహం
చురుకైన కదలికలూ
ప్రవాహ వేగమును నేనెప్పుడు పొందగలను?
భీతిగొలిపే ఘోష
దీనిలోతూ నా మనసు లోతూ
దీని గాఢతా నా ప్రేమలో కూడా ఉంటుందా? అమ్మో?!
ఏవేవో అలోచనలూ.. ప్రశ్నలూ...ఇక్కడకూడా నాలో?!

సరదాగా ఈతకొచ్చావ్
సరే! బాగుంది!!
అంతర్గత బహిర్గత క్లాక్ లను సరిచేసి
గతాన్ని ఓ మూల వేసేసి ఈతాడేసి
ఆ ప్రక్రియకు న్యాయం చేసెయ్! చాలు!!

మరి ఈ సోది ఆలోచనలు
సుత్తి విశ్లేషణలూ ఎందుకో!!
ఈ అల ఎలా దాటాలి?
దీనిని ఎలా తప్పించుకోవాలి?
అలా ఉన్నా పర్వాలేదు నీ అలోచనలు

నువ్వేంట్రా!
సముద్రంలో కూడా
సగం ఆలోచనా ప్రపంచాన్ని మోస్తూ
నీకూ సముద్రానికి భారంగా తోస్తావ్!!

అలోచించే పిచ్చి ఏమైనా పట్టిందా?
నువ్వు చించి చించి ఎవరిని ఉధ్ధరిద్దామనో??

ఈ క్షణం
ముందుకు వెళుతుంటే..
నువ్వేంటి వెనుకటి వెనుకబాటు
భంగపాటూ వెతుక్కుంటుంటావ్?

మరీ బలహీనంగా కనిపిస్తున్నావ్ రా?
ఈ అలలకంటే!!

ఈతాడాలంటే లోతు తెలియనక్కర్లేదు
లోతు తెలిసినా తెలియకపోయినా నష్టమేమీ లేదు
ఒక్కో క్షణం ఒక్కో అనుభవమూ బలహీనతను తొడుక్కుంటూ
సగం నీ గతమే! అంతర్గతమే!! అడ్డుపడుతోంది
కొత్తగా అందంగా సృజనక్షణాలను గుర్తిచడంలో
సరికొత్త అనుభూతించడంలో..నువ్వెప్పుడూ వెనుకబాటే!!!!
వర్తమానాన్ని ఆస్వాదించడంలో..
ప్రస్తుత క్షణంలో జీవించడంలో...!!

ఈ సముద్రం కంటే లోతైనవి
దీనికంటే విశాలమైనది
దీని అలలకంటే ఉత్సాహమైనవి
దీని అంతర్గతంకంటే గంభీరమైనవి నీలోనూ ఉన్నాయ్!
నువ్వెక్కువో సముద్రమెక్కువో ..అనవసరం
ప్రస్తుతం నువ్వూ ఆ సముద్రతీరమూ ఐక్యమై
అలల విన్యాసాలూ వాటితో నీ విన్యాసాలూ
చూస్తూ ఆ అద్భుత కలయికా దృశ్యాన్ని ప్రకృతి చూస్తూ
పరవశంతో నిశ్చేష్టగా ఉండిపోవాలి!!

ఇక్కడ నువ్వూ ప్రేక్షకుడవు కావు
ఇద్దరు ఆటగాళ్ళ మధ్య సౌందర్య ఆస్వాదనా క్రీడలో
ఒకడివి
నీ అంతర్గత వికృతిని కాసేపు బంద్ చెయ్
నీ ఆట అత్యంత సహజంగా
వర్తమానంలో వర్తమాన ఆత్మలో
వర్తమాన మనసుతో
ప్రస్తుత కదలికపై నీ అవగాహన
చైతన్యానికే అవాక్కనిపించేలా
అలలవేగాన్ని ఎదుర్కోవడంలో నీ శైలిని చూసి
సముద్రుడే ఆశ్చర్యపోయేలా ఉండాలి నీ క్రీడా నైపుణ్యం
నీ సరదా పూర్థిగా తీరాలి ఆ కాసేపు
ఆ కొన్ని క్షణాలే అద్భుత జీవన సౌందర్య సూచికలు
బాహ్య సౌందర్యంలోని ఆత్మానంద అనుభూతి చిహ్నాలు
అందుకే..
సరదాగా ఈతాడు.. తీవ్రంగా కాదు...!!

01.09.12

18, ఆగస్టు 2012, శనివారం

రియాజ్||వీక్షణలు||


1.
కొలనూ నేనూ ఒకటేనేమో?
ప్రవహిస్తూ తీరం తాకేలోపు
ఎన్ని జనన మరణవీక్షణలో
భావప్రవాహంలో కొట్టుకుపోతూ
మృత్యువాతపడ్డ
స్పష్ట అస్పష్ట ఆలోచనల్లా!!
నిత్యంచస్తూ బ్రతికినట్లుండే దేహంలా!!!

2.
మావూరి
మెలికలు తిరిగిన పిల్లకాలువా
దానిగట్టున వయ్యారి
ఒంపుసొంపుల
తుమ్మచెట్టూ
అచ్చు ఇలియానాలా
గుచ్చుకుంటూ...

3.
ఆ కాలువ
నన్నేమీ పట్టించుకోవట్లేదు కాలంలా
వాటిపనేదో అవి చూసుకొంటూ
వెళ్ళిపోతూ అలలు..
నా కళ్ళలో కలల్లా...
ముగింపెక్కడొ తెలియని
తీరంవరకు సాగని అంతర్ధాన దృశ్యాలు
వీక్షిస్తూ గట్టుపై నేను

4.
మా ఊరి ఆనకట్ట బావి మౌనందాల్చివుంది
చాన్నాళ్లయింది దానిబుగ్గల్లో సిగ్గులుచూసి
ఎగిరి గంతువేశా!
పరవశం ఆమెలో..నాలో...!!!

5.
పట్టపగలు మిట్టమధ్యాహ్నమైనా..
మా వూరి చెరువు
కళ్ళనిండా ఒంటినిండా
పళ్ళనిండా మిరుమెట్లుగొలుపుతూ నక్షత్రాలు
కాంతులు విరజిమ్ముతూ కాంతిపుంజాలు
నాలో ఏదో వీక్షణా సృజనావేశం మేల్కొంది!
బహుశా భావుకత అంటే ఇదేనేమో?!
6.
సూర్యుడికి కోపమొచ్చింది
తన వేడిహస్తాలను చాస్తూ...
తలను నిమురుతున్నాడో
శపిస్తున్నాడో
ముఖంపై కాసింత చెమటచల్లి
చిరాకుతో వెళ్ళిపోతున్నాడో?
7.
దేహం మేల్కొంది
పురిటిబిడ్డలా
కానీ మనసే బూడుకొనిపోయి ఉంది తవ్వలేని సమాధిలా
బూజుపట్టిన గుహలా
బహుశా మనసుకు లోతైన వెలుగులు కావాలేమో?
చీకటిని లోతుగ త్రవ్వే చైతన్యపు గునపాలు కావాలేమో ?
గడ్డకట్టిపోయిన ఉద్వేగాలను ద్వంసం చేసే
సరికొత్త సృజన లావాగ్ని కావాలేమో?
 
*18.8.2012

14, ఆగస్టు 2012, మంగళవారం

రియాజ్ || దృశ్యాలు ||

చినుకుల చుంబనం ఆగలేదు
సిగ్గూ ఆగలేదు
మెలికలు తిరుగుతూ చెట్టు

ఎదురుగ పెరిగిన పెట్రొల్ ధర బోర్డు
నిశ్చేష్టగా ఆటోవాలా
నవ్వందుకున్న ఆటో!

శక్తిమేర చేతులు చాపుతోంది
వెళ్ళిపోతున్నాయ్ అందనంత దూరంలో
రాలిపోయిన జ్ఞాపకాలు
తిరిగిరావని తెలియదు ఆ చెట్టుకు

కిటికీలోంచి తొంగిచూస్తోంది
టీవీలో నయా హేడ్ అండ్ షౌల్డర్ హెయిర్ కంట్రోల్ యాడ్
మొక్కకు తెలియదు
ఎందుకు జుట్టు రాలుతోందో!!!!

నగర దేహం ఆగిపోయింది
అంతర్జాలం అంతర్గతంగా ఉండిపోయింది
ఇళయరాజ ఇలియానా డబ్బా బయటకు రాలేదు
రైతు కంటి మోటార్ తడి ఆరిపోయింది
కట్ కట్ బట్ నాట్ ఇన్ పంజాబ్ మహారాష్ట్రా
ఓన్లీ ఇన్ ఆంధ్రా...!!!
This is Great achievement of Andhraa power PoliTricks !!

*13-08-2012

11, ఆగస్టు 2012, శనివారం

రియాజ్......|| Missing ||


అద్దం బాగానె ఉంది
అందులోని ముఖమే నాలా లేదు..
ఏం కోల్పోయాను?
......
ఆమె ఆమెలా లేదు
ఓ సంక్లిష్ట దృశ్యం
అస్పష్ట భావం
ముఖం దేహం నిండా
అరువు తెచ్చుకున్న బుల్లితెర reflections
కమర్షియల్ ఎమోషన్స్
ఆమె ఏం కోల్పోయిందో???

వాడు మనిషిలాగే ఉన్నాడు
నలుగురిని ఏమాత్రం వదలలేదు
ఇక కనిపించలేదు వాడు
అందరి గుండెల్లో అభద్రతై కూర్చున్నాడు
ఇంకెంతమంది ప్రాణాలు కావాలో !!
ఇంతకీ వాడు కోల్పోయిందేమిటో????

*****

పచ్చని దేహం చుట్టూ ఫెన్సింగ్ ముళ్ళు
రైతు గుండెలో పవర్ కట్
మూటసర్దుకున్న
కూలిమనసు
ఆ పల్లె
ఏం కోల్పోయింది???

నగరవీధులలో లక్షల యువ కిరణాలు
కడుపు భగ్గు భగ్గుమంటూ వెలుగుతూ..

గృహప్రవేశంలోపే
నెర్రులుబారి
నేలకొరిగే
ఇందిరమ్మ ఇళ్ళు

అడవిచీకట్లో మిణుగురుల్లా
ఏనాటికో కురిసిన వానచినుకుల్లా విచ్చేసిన
సినీతారల ఆగమనం ఎగబడే దేశభవితా డొక్కునరాలు
తళుకుబెళుకులను తమ కన్నుల పెన్నులతో బంధించేందుకు
పోటీపడుతున్న నాలుగో స్తంభంగాళ్ళు !!!

రోడ్లెక్కిన మురికికాలువల ఖాళీబిందెల
ఆసుపత్రుల బెడ్డులలలో మూలుగుల నినాదాలతో
ఏం కోల్పోయాయి ఈ మునిసిపాలిటీ కార్పొరేషన్ పట్టణాలు????

అక్కడ నాలుగు స్తంభాలను పాతివెళ్ళారు
కంచె అనుకున్నారు పాపం వారు..అప్పుడు!
పంచభూతాల్లా రక్షించేవని అనుకున్నారు
అవే తమపాలిట పాడి అంటున్నారు
ఆ నాలుగు తమను భక్షించేందుకే అంటున్నారు..ఇప్పుడు !!
ఏం కోల్పోయారు వారు?????


*10-08-2012

6, ఆగస్టు 2012, సోమవారం

రియాజ్ || స్పందించకున్నా! ||

నీలో స్పందనలకు
సరైన ప్రతిస్పందన ఇవ్వనంత మాత్రాన
నీవు నొచ్చుకొని

నన్ను నొప్పించకు నేస్తం!

నిన్ను నొప్పించివుంటానేమో
ఏదో ఒక సందర్భంలో..
కావాలని చేసివుండను
తప్పు ఎత్తిచూపినా
నువ్వు కసురుకున్నా
నీకిష్టంలేకున్నా నువు మాట్లాడకున్నా
పరవాలేదు...!

నేను నీకు గొప్ప స్నేహితుడిని కాకపోవచ్చు
కానీ...కానీ..!
నువ్వు మాత్రం ఎప్పటికీ నా నేస్తమే!!

అలకలు అహాలు తాత్కాలికమే!
నాకోసం నువ్వు పోగొట్టుకున్న క్షణాలు
నన్ను వెంటాడుతుంటాయ్ !!

క్షమించెయ్ నన్ను !!
నువ్వు స్పందించకున్నా!
నేను స్పందిస్తుంటా....నీలో స్పందనలకు జీవమొచ్చేంత వరకు!!
గుండె కాఠిన్యం వదిలేంత వరకు!!

మాట్లాడేందుకు ప్రయత్నిస్తా
ఆవేశం చల్లారి మౌనం కరిగి మాటలయ్యేంతవరకు
అలకలు మొలకెత్తి నవ్వు అందుకునే వరకు
నే కోల్పోతా నా అహాన్ని!! ఎన్నిసార్లయినా.. నీ స్నేహం కోసం!!!

*05-08-2012

31, జులై 2012, మంగళవారం

రియాజ్ || Small Feel... ||


1.
గుండెలో పెన్ను కదిలింది
అది కవిత కాదు
***
2.
అక్కడ మౌనం మాట్లాడుతోంది
అదో రకం కవిత

3.
కెమెరా కన్నుకొట్టింది
అక్కడ అమ్మాయి లేదు
కన్నీటి దృశ్యం

4.
కంటి లెన్స్ ముడుచుకున్నాయ్
బొడ బొడ కన్నీరు
నా వల్ల ఆమె నొచ్చుకుంది
5.
ఆమె మాట్లాడలేదు
నా కలం వాగుడందుకుంది
6.
ఆమె నొప్పించింది
పదాలు భోరుమన్నాయ్
7.
ఆమె నవ్వందుకుంది
గుండె కెమెర స్నాప్ తీసుకుంది
8.
వాస్తవం వెలగపండు తింది
తాగేందుకు కాస్త కవిత్వం కావాలి
9.
నే జోక్ వెయ్యలేదు
ఆమె నవ్వింది
అర్ధం కాల?!
10.
నవ్వు రాకున్నా అవ్వ నవ్వుతోంది
నా ముఖం విచ్చుకోవాలని
11.
తాతకు కోపమొచ్చింది
అందుకే పంచెకట్టా!

*30-07-2012

26, జులై 2012, గురువారం

రియాజ్||‎**** ‎**** There 'is'||


There is no critical thoughts
no quest .. no cofliction
no rush design of sounds
no logic .. no analasys
Because there is 'Ilayaraja's music'

There is no romance
no dilemma absurdity no fancy impression
no weak corrupted emotion
Because that is Sri Sri's poem

There is no inferiority complex
no fear of stage
Every particle showed his super consciousness
There is Jackson Dancing

There is no will no Humanism
Only..
Filled with racism fasism factionism tribalism sadism......ism?! ...Riya

                  .....
*25.7.2012

25, జులై 2012, బుధవారం

రియాజ్ రియాజ్ || ???????? ప్రశ్నలు ?????? ||

ఓ ప్రశ్న మనిషిని జంతువునుంచి విడదీసేందుకు పుట్టింది
మరో ప్రశ్న ఖగోళ రహస్యాలపై దాడిచేస్తోంది..
మరెన్నో ప్రశ్నలు రహస్యాలను..ఛేదించేందుకు వేచిచూస్తున్నాయి

వ్యాసునిలో రేగిన ప్రశ్నలు మహాభారతమయ్యాయి
వివిధ దేశాలలో..వివిధ రూపాలలో..
వివిధ వ్యక్తులను సతాయించి..
వివిధ శాస్త్రాలుగా..గ్రంధస్తమైనాయి

సోక్రటీసునుంచి..అరిష్టాటిల్..ప్లేటో..ఫ్రాయిడ్...
గాంధి..జిడ్డుకృష్ణమూర్తి...లను..
సామాన్యుని మొదలు ఎవరినీ వదలవు!!

అంతరంగములో..సమాజంలో..ఎక్కడ చూసినా...
కుప్పలు కుప్పలుగా..గజిబిజిగా మనోమేధస్సులను ...గందరగోళం చేస్తూ...
భయపడుతూ..భయపెడుతూ...సందిగ్ధ అసంబధ్ధ శూన్య క్షేత్రాలలో వేలాడుతూ ..
బ్రద్దలు...కొడుతూ...సత్య శోధనవైపు..పరిష్కారం వైపు..
పుడుతూ గిడుతూ..
కొన్ని సూటిగా...దూసుకువస్తూ.. ఉద్యమాలను మేల్కొల్పుతూ..
మస్తిష్కాలలో ఎన్నో మరెన్నో ప్రశ్నలు..!!!

అంతరంగాన్ని శోధిస్తూ..
బాహ్య ప్రపంచాన్ని..పరిశోధిస్తూ..
ఆవేశాలకు ఊతమిస్తూ..
అస్పష్టతలను భగ్నంచేస్తూ..

ప్రశ్నలు అనంతమే.. ...కానీ..కానీ?...
సమాధానాలే? పరిష్కారాలే....???????


*25.7.2012

22, జులై 2012, ఆదివారం

రియాజ్॥ఒట్టు వేయను..!॥

 మాట ఇచ్చి తప్పడం
మళ్ళీ కప్పిపుచ్చడం
తప్పించుకు తిరగడం
తప్పుచేశానన్న ఆత్మ వంచనా
సంఘర్షణ ఇవన్నీ ఎందుకు చెప్పు?

అనుకున్నది అనుకున్నట్లు జరగక పోవడం
చెప్పినట్లుగానే చేయగలేకపోవడం
అనే వాస్తవికత ఒకటుంది?
ఎంత విశ్లేషించుకున్నా
తర్కించుకున్నా లెక్కలు వేసుకున్నా
మాట ద్వార నీకు నే చూపిన దృశ్యం
అలాగే చూపిస్తాననే భ్రమపై నమ్మకంలేదు
అందుకే ఒట్టువేయను!!
******** *******

పద శబ్దాల గారడీ నీకిష్టమైనా
శబ్దారాధనలేని చేతలలోని సౌందర్యం గుర్తించకున్నా పర్లేదు !
రుచికరమైన సమాధానం నీకిచ్చి నే గరళం మింగలేను
నీకన్నా నాకన్నా వాస్తవాన్ని నమ్మించే ప్రయత్నంలో
నా మనసుపై నేను ఒట్టువేసుకుని ఒకటిమాత్రం చెప్పగలను
చేసి చూపిస్తా!! సాద్యమైనంత!
*21.7.2012

17, జులై 2012, మంగళవారం

రియాజ్ || తెలియట్లేదు? ||

కొన్ని దృశ్యాలు
వేళ్ళలో బలంగా పాతుకున్నాయ్!
కలుపులా తీసివెయడం తెలియట్లేదు?

పీకిపారేయడమంటావా..బలవన్మరణమే?

కొన్ని జ్ఞాపకాలు
అంతరంగంలో నిరంతర ప్రవాహమై పారుతున్నయ్!
నిశ్చలితం చేయడమెలానో తెలియదు?

ఆ గాలి సోకకుంటే..శ్వాస ఆగినట్లే!!

కొన్ని కలలు
పదే పదే వస్తున్నాయ్!
అల్లుకున్న గుబులు గుహల చీకట్లో ఊగుతూ విఫలరెక్కల నడుమ
గాఢ పరిమళాల దోచుకుంటున్నట్లు
ఆపేయమంటావా?
మనో విద్వంసమే? కాంక్షా మరణమే?

కొన్ని పదాలు గుండెను దున్నుతున్నయ్!
అలా గాలికొదిలెయ్యడం తెలియట్లేదు?
వ్యక్తీకరించకంటావా అస్థిత్వ రాహిత్య సంఘర్షణమే?
*16-07-2012

16, జులై 2012, సోమవారం

రియాజ్ || విజయోద్వేగం ||

పిడికెడు గుండె పట్టలేని అనందం
అనియంత్రితం ఈ ఉద్విగ్న క్షణం!!

ఇన్నాళ్ళ శ్రమ ఇన్నేళ్ళ సహనం
గెలిచానన్న వాస్తవాన్ని కళ్ళార్పక చూస్తుండగా..

గతం అంతర్గతం నిర్ఘాంతం
కండల నరాలలో బిగువందుకున్న క్షణం
సుధీర్ఘ సాధనకు తలవంచిన మనోక్షేత్రం
అనియంత్రిత వేగంతో వచ్చిన
అస్థిత్వం కెరటమొకటి అంతులేని ఉత్సాహమున
కనులువిడిచి స్వేచ్చగా వెడలె కన్నీటి ధార
కనులుమూసినా శూన్య దర్శనం
స్వేదసువాసన గాఢంగా శ్వాసించిన క్షణం
మరిగిన రక్తపు ఆవిరులు చుట్టుముట్టగ
సుదీర్ఘ నిట్టూర్పు విడుదల

కష్టమే దాచడం ఆపుకోవడం !

ఎందుకంటే..
అది విజయోద్వేగం !!
అది విజయోత్సాహం.
*16-07-2012

14, జులై 2012, శనివారం

రియాజ్॥మార్పు ఆస్వాదించు..॥

 మార్పు అంటుంటారు కానీ
అదేదొ యోగం నాకు పట్టేట్టు లేదు!!

చీటికిమాటికి వెనుకడుగే
జ్ఞాపకాలను చీదుకోవడం అలవాటై పోయింది!!

ఒకదాన్నే పట్టుకొని వేలాడుతూ
అంతరంగం నుండి బయల్పడిన శిధిలానికి
పెయింట్ కొట్టి మళ్ళీ పూడ్చి
మళ్ళీ తవ్వుకోవడం ఇదే తంతు!!
కాలం మారుతోంది రుతువులూ కనిపిస్తున్నాయ్ కొత్తగా
అద్దంలో నేను మాత్రం
పాడుబడ్డ దేవాలయంలో గబ్బిలంలా
పాత గోడలపై వేలాడుతూ కనిపిస్తున్నా !!

ఎప్పుడూ అదే జ్ఞాపకాన్ని తవ్వుకోవడందేనికి?
మాటికి మాటికి ఒకే ఆలోచనా ఒకే ధ్యాసా
ఒక భాషలో ఏకాగ్రతలా!
మరో భాషలో మూసలా !!
ఇంకో భాషలో పిచ్చిలా?

సంకుచిత హృదయం ప్రవహించదు
స్రుజన ప్రవాహంలో పాతనీరు నిలిచిపోయే చాన్సేలేదు!!

ఊటబావిలో కొత్తనీరు వస్తున్నట్లు
నీ బుర్రలో కొత్త ఆలోచనల్ నింపవోయ్
పాత అనుభూతులను తోడివేసేయ్!!

హృదయానికి కొత్త అనుభూతి
కనుపాపకు నూతన దృశ్యం అందించు
ఎప్పుడూ ఇళయరాజానే వెంటాడకు
కాసేపు ఆతిఫ్ అస్లాం గాత్రం సంగీతాన్ని ఆస్వాదించిచూడవోయ్ తెలుస్తుంది!

సృజనాత్మకతతో పాతను జయించవచ్చునోయ్
మూర్ఖ నైరాస్యంపై యుధ్ధం ప్రకటించవోయ్ కవి
కొత్తదానిని కొత్తగా చూడవోయ్
పాత కాన్వాస్ చింపి డస్ట్ బిన్ లో పడవేసెయ్ !!

ఓ నూతన మార్గం ఏర్పడుతుందేమో మనసుకు
గాయాలు మానిపోతాయేమో
ఓసారి ట్రై చెయ్!!
మార్పును ఆహ్వానించవోయ్ ఆస్వాదించవోయ్!!
*13.7.2012

13, జులై 2012, శుక్రవారం

రియాజ్ || పల్లెవిస్తుపొయింది?! ||

అల్లా చూసొద్దామని
పల్లె పట్నం వెళ్ళింది
ఏదేదో ఊహించుకుంటోంది
తీర చూశాక విస్తుపోయింది!


స్వేచ్చా విహంగాలు
అక్కడక్కడ గోడలమీద కాగితాలపై ముద్రితమై ఉన్నయ్
మరికొన్ని పంజరల వెనుక దర్శనమిస్తున్నాయ్!
పచ్చదనం ఊరికి దూరంగా పారిపోయిఉంది


అంతా కార్బన్-డై-ఆక్సైడ్ కంపు
ఎటుచూసిన పరుగులుతీసే చక్రాలు
లోహాల ఘోష
నిశ్శబ్దాన్ని ఊరికి దూరంగా వెలివేసినట్లు!!
***


మరింత ముందుకెళ్ళింది
ఆకలి భాషలు నడిరోడ్డులో నగ్నంగా గొంతుచించుకు అరుస్తున్నాయ్
కడుపు ఎండిన డొక్కలు స్పష్టంగా దీనంగా అడుక్కుంటున్నాయ్
డొక్కనిండిన పొట్టలు ఆర్ధిక ప్రవాహంలో కొట్టుకుపోయెందుకు సంసిధ్ధంగా ఉన్నాయ్!


తప్పించుకొని మరింత ముందుకెళ్ళింది
యేమైనా అమ్ముకునేందుకు దేనినైనా వ్యాపారంగా చూసే
మార్కెట్ అందులోని జిత్తులమారి ఆకర్షణలను
వింత ఆర్ధిక ధోరణులను చూసి అవ్వాక్కయ్యింది !!


భుజాన బ్యాగులతో వెళుతున్న చిన్న చిన్న యంత్రాలను 
తలపించేలా ఉన్న పిల్లలను చూసి ఆశ్చర్యపోయింది !!


ఎక్కడినించో అరువు తెచ్చుకున్న వింత అలవాట్లతో
వికృత ధోరణులతో దేశనిర్మాతలు యువకెరటాలు నిర్వీర్యంగా !!


ఊరికి పెద్దలు శాంతికపోతాలు వృధ్ధాశ్రమాలలో తోసివేయబడ్డారు


మానవత్వం అక్కడక్కడా మూలుగుతూ కనిపిస్తోంది
వ్యాపార దేహాలు నైతికజీవాన్నికోల్పోయిన చిద్రమైన మనసులు
అత్యాధునికత పెరుతో వింత వింత చేష్టలు చేసే మనుషులనూ చూసి పల్లె కాసేపు ఆగిపోయింది?


చివరిగా..
నగర నడిబొడ్డులో నవ్వుతూ ఉన్న మహాత్ముని విగ్రహాన్ని చూసి
నవ్వుకుంటూ పచ్చబస్సు ఎక్కి పారిపోయింది ఆ పల్లె.

* 12-07-2012

11, జులై 2012, బుధవారం

రియాజ్॥నవ్వు వెనుక..॥


అందరూ గమనిస్తున్నారు
కొందరు అడుగుతున్నారు
నువ్వు నువ్వులా లేవే??
ఆ నవ్వు కొత్తగా ఉందే???

అవును..
ఈ నవ్వు వెనుక
సుధీర్ఘ మౌనం వెనుక రహస్యమేమిటో
వారికేం ఎరుక!!

ఒకప్పుడు
ఓటమి అంచుల్లో మా అమ్మ గుర్తుకొచ్చేది
ఆమె నవ్వు గుర్తుకొచ్చేది

కానీ..ఇప్పుడు మాత్రం
అదనంగా నీ నవ్వు గుర్తుకొస్తుంది!!

ఇంత అందంగా నవ్వడం ఎవరు నేర్పారో కానీ!!

నా నవ్వు వెనుక మౌనంగా దాగిఉంటావ్!!!

కోపంలో నువ్వు పెట్టే ముచ్చంగిముఖం ఇంకా గుర్తే!
నాలో విస్మయం సృష్టించే!
నీ నవ్వు తాలూకు జ్ఞాపకం
ఇప్పటికీ నా మోముపై ప్రదర్శితమవుతూనే ఉంటుంది!!

అచ్చు నాలా నేను నవ్వడం బహు అరుదు !!


నువ్వెక్కడికీ వెళ్ళలేదు !
విషాదంలోనూ..మౌనంలోనూ..గెలుపులోనూ..ఆనందంలోనూ
నా వెనుకే దాగివుంటావ్!!
నా మోముపై ప్రత్యక్షమవుతుంటావ్ 
*11.7.2012

10, జులై 2012, మంగళవారం

రియాజ్ || కవితా సంగమం ||

అదో..నిత్య స్పందనా మౌనచ్చేదనా ఉద్విగ్న క్షేత్రం
ఆవేశాల గుట్ట
విభిన్న ఆలోచనల గంప
... వైరుధ్య భావాల సమూహం
భావుకతా ప్రదర్శనం
సాహితీ సంగమం ! (అది మరో ప్రపంచం)

కోడికూయక ముందే వెలసిన ముగ్గులా
నవ్వకముందే పడిన అమ్మాయి బుగ్గసొట్టల
అందమైన ముఖచిత్ర దర్శనం వారం వారం !!

కొద్దిసేపు విరామం
అనంతరం మరల మరల వస్తూపోయే వానలా కవుల ఆగమనం

తన పదాల పంట పండాలని ఎప్పుడెప్పుడా అని
ఎదురుచూసే సాహితీ రైతు

వాన పడ్డాక
చేను తడిసినట్లు అది చూసి రైతు గుండె తడిసినట్లు
నెర్రులుబారిన చెరువుగుండె నిండినట్లు
స్పందనల చినుకులు
ఎడతెగని వర్షంలా ప్రశంసల హర్షం
అప్పుడప్పుడూ ఓ ఖండన
అదో నిరంతర సాహితీ ప్రవాహం !!

భిన్నకవుల కవితా సంగమం !!!! (అది మహా ప్రపంచం)

*09.07.12

7, జులై 2012, శనివారం

రియాజ్ - కవిత

ఓటమి

ఉండగలవా ఓటమేలేకుండా?
ప్రశ్నలే రాని చింతలే లేని మరో ప్రపంచం ఉందా??
ఓటమి.. తిరుగుబాటు... అనంతరం వచ్చేదే అసలు సిసలు విజయం !!!

అద్దం వెక్కిరిస్తుందా?
ఏం..నువ్వు ఎదురు వెక్కిరించలేవా?
నీపై నువ్వే తిరుగుబాటు చేయలేవా?
అయ్యో పాపం..

ఓటమీ గెలుపూ ..తాత్కాలికమే!!
కానీ ఏది కావాలో నిర్ణయించుకో?
***
కళ్ళుతెరచి పోరాడితే అపజయం కాస్తా జంకుతుంది
కాస్త వెనుకడుగు వేస్తుంది
కళ్ళు మూసుకుంటే ఓటమి నిన్ను నిర్దాక్షిణ్యంగా వరిస్తుంది
****
కళ్ళు మూసుకొని ఓటమిభరించేవు
కళ్ళు తెరిచి పోరాడలేక?

ఓటమి నిన్ను అద్దంలో స్పష్టంగా చూపుతుంది

పోరాటమో ఆరాటమో
గెలుపో మరేమిటో
ఓటమికి అది తెచ్చే ప్రశ్నలకు
శక్తిమేర సమాధానం ఇవ్వు
అదే నువ్వు !అంతే నీ సామర్ధ్యం !!

ఓటమే సమాధానం అయితే?
ప్రశ్నించడం మానుకో?
వెనుకంజకు నిర్ణయం తీసుకో? పో! వెనక్కు తిరిగి పారిపో!!

***
గెలుపు కావాలా?
నిజాయితీగా ప్రశ్నించుకో? తక్షణమే నిర్ణయించుకో!
నిర్ద్వంద్వంగా నిర్దాక్షిణ్యంగా ప్రతిఘటించు పోరాడు!!
తిరుగుబాటుకు సిధ్ధంగా ఉండు ఆఖరుకు నీపై కూడా..
సమాధానం దొరక్కుండా పోదు విజయం రాకుండా పోదు !!
***
ముందు తిరుగుబాటు పుట్టి తర్వాత విజయం పుట్టిందని తెలుసుకో! 
*6.7.2012

రియాజ్ - కవిత

వాగుడుకాయ్..

మెరిసే యవ్వనపు కాంతితో
తొణికిసలాడే ఉత్సాహంతో
గంతులేస్తూ వెక్కిరిస్తూ చిందరవందరగ
ఉత్సాహంగా ప్రవహించేది
విసుగుకే విసుగుపుట్టి పారిపొయేలా వాగుతుండేది ఆ వాగుడుకాయ్!!

ఊహించని పరిణామం-----
ఎందుకో అంతులేనిమౌనం దాల్చింది
గడగడవాగుతూ నిండిపోయినవాగులా
పరుగెత్తుతుండేది యేమయ్యింది దీనికి??

తీవ్ర నైరాస్యం ఆవహించినట్లు స్తబ్ధుగా
నెర్రులుబారిన చెరువులా
ఇంకిపొయిన కలలు చచ్చిన కన్నీటి గుంటలా
ప్రవాహంలేని మౌన సరస్సులా నిశ్చేష్టగా వుండిపోయింది యేమైంది దీనికి?

నిశ్శబ్ద నైరాశ్య వైరాగ్యరాగంలో..
బహుశా.. ఎవరో గాయపరిచారు?
*4.7.2012