ఒక్కొక్కపుటా మనసు ముని వేలితో తిరగేసే కొద్దీ
నిలువెల్లా ముంచెత్తె పడగ విప్పిన అలలు
చూపానని మసక గుప్పిస్తూ ఉప్పునీటి తెరలు
పుక్కిలించి ఉక్కిరి బిక్కిరి చేసే నురగల ప్రవాహాలు
ఎన్ని సముద్రాలను శ్రుతి చేసిన అనుభవాలు
అలసి సొలసిన అగరుపొగల ధూపాలూ
మల్లెలు విరజిమ్మిన పరిమళాల ఊపిరిలూ
గాలి తిత్తులనిండా నింపుకున్న గతం మధుర శ్వాసలు
మళ్ళీ మరోసారి ఆ మసక వెలుగుల గతం ఛాయల్లో కలసిపోయే ఓ నీడనై
గుండె మూలమూలలా కిచకిచలాడే
చిన్ని పిట్టల తోక్లపై తాళమేసే గాలి వీవనగా
తచ్చాడటం కలకాదుగా..
నీడలు పరచుకున్న అసురసంధ్య ఆవలి తీరాన
ఒకరి కంటి అద్దాల్లో మరొకరు కన్న పగటి కలల సుదీర్ఘ సంభాషణలు
నీకూ నాకూ మధ్య ఎల్లలు పుట్టవనుకున్నాం
నీకూ నాకూ మధ్య మౌనం రాయభారిగా మారి ఇలా...
.....
*27.7.2012